ఆరంభం ఆలస్యమే అయినా…

ధునిక కథ ఎప్పుడు ఆరంభమైంది అనే విషయమై అనేక పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కోస్తా ప్రాంతంలో కథ పుట్టిన నాలుగు దశాబ్దాల అనంతరం రాయలసీమ ప్రాంతంలో కథ పురుడు పోసుకున్నదనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో మధురాంతకం రాజారాం, కె.సభా తదితరులు కొంత పరిశోధన చేశారు. గురజాడ దిద్దుబాటు తర్వాతనే రాయలసీమలో కథ ఆవిర్భవించిందని వర్తమాన పరిశోధకులు చెబుతున్నారు. దీనికి కారణం రాయలసీమ ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటు గురవడం వల్ల కథాపుట్టుక కాస్త ఆలస్యమే అయిందనవచ్చు.

అయితే చరిత్రను చూసుకుంటే ఏ ప్రాంతం అయితే వెనుకబాటుకు లోనవుతుందో ఆ ప్రాంతం నుంచి ఎక్కువగా సాహిత్యం ఉద్భవించే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో వస్తున్న కథలు రాయలసీమ ప్రాంతం నుండి అనేకం వస్తున్నాయి. రాయలసీమ ప్రాంతం పద్య సాహిత్యానికి పెట్టింది పేరు. అందుకే ఆధునిక కథ రావడానికి రెండు మూడు దశాబ్దాల కాలం పట్టింది. 1921లో చింతా దీక్షితులు సుగాలి కుటుంబం పేరుతో కథ రాశాడు. అతడు రాయలసీమవాసికాదని చూపుగా వచ్చి ఇక్కడ జీవితాన్ని గమనించి రాశాడని వల్లంపాటి వెంకటసుబ్బయ్య తేల్చేశాడు. అయితే రాయలసీమలో రాయలసీమ అస్తిత్వంతో కూడిన కథ మాత్రం ఇదే.

ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి కరువు కథ. అయితే రాయలసీమ ప్రాంతంలో మొదటి రాయలసీమ కథా రచయిత మాత్రం జి. రామకృష్ణ అని చరిత్రకారులు తేల్చేశారు. జి రామకృష్ణ అనంతరం వాసి. ఈయన తొలి తరం జర్నలిస్టు కూడా.. చిరంజీవి అనే తన మొదటి కథను విజయవాడ పత్రికలో ప్రచురించాడు. 16.03 1941 న ప్రచురితమైంది. అప్పటికే తను దాదాపు 10 కథలు రాసినట్లు పరిశోధకులు నిర్ధారించారు. చరిత్ర లోతుల్లోకి వెళ్లినప్పుడు కే.సభా 1944లో కడగండ్లు కథను రాశారు. ఇది చిత్రగుప్త పత్రికలో ప్రచురితమైంది. బహుశా రామకృష్ణ తర్వాతనే కే.సభా కథ రాశాడు.

కే.సభా దాదాపు 800 కథలు రాశారు.ఆనాటి సాంఘిక పరిస్థితులు ఫ్యూడల్ వ్యవస్థలను ఆయా కథలో చెప్పగలిగారు. రాయలసీమ ప్రాంతాన్ని 1948-52 మధ్యకాలంలో కరువు కుదిపేసింది. కమ్యూనిస్టు పార్టీ గంజి కేంద్రాలు నడిపి ప్రాణాలు రక్షించారు. ఈ క్రమంలోనే రామకృష్ణ అనేక కథలు రాశాడు. ప్రధానంగా ఆయన కథలు కరువును ఫ్యూడలిజాన్ని చెప్పగలిగాయి. ఈ కాలంలోనే కథ రాయలసీమ జీవిత ప్రత్యేకతలను చిత్రించే ప్రయత్నం చేసింది. కె.సభా రాయలసీమలో చితికిపోయిన రైతు జీవితాన్ని కథల్లో గొప్పగా రాయగలిగారు పాతాళగంగా అనే ప్రసిద్ధమైన కథ తెలుగు కథ సాహిత్యంలోనే వైవిధ్యమైన ప్రాంతీయ కథగా చెప్పవచ్చు. ఆ కథలోనే గొప్ప మాండలిక సంపద కూడా మనకు కనబడుతుంది. రాయలసీమ కున్న ప్రత్యేక భాష ఈ కథలో రూపుదిద్దుకొని ఉన్నది.

మధ్యతరగతి రాయలసీమ రైతు బతుకు ముఖచిత్రంగా ఈకథ కనబడుతుంది. రాయలసీమ ప్రాంతంలో ఆకలి,కరువు, ఆత్మహత్యలు లాంటి కథలన్నీ తొలితరం కథకులు ఆరోజుల్లోనే రాయగలిగారు. ఈనేల.. ఈ భూమి.. ఈ గాలి ఎంతో మంది కథకులకు గొప్ప వస్తువులను ఇచ్చింది. అనేక వ్యంగకథలు కూడా ఈ కాలంలోనే వచ్చాయి. కరువు నివారణ పేరుతో ప్రభుత్వాలు చేసే మోసాలను కే.సభా రాశారు. ఈ కథ పరిణామ క్రమం చూసుకున్నట్లయితే రాయలసీమ కథను నడిపించిన ఘనత మధురాంతకం రాజారాంకు దక్కుతుంది. మధురాంతకం రాజారాం 1952లో కథా ప్రారంభించి దాదాపు తను ఆఖరిశ్వాస వదిలేవరకు అంటే 1999 వరకు కూడా కథా రచన చేశారు.

“మధురాంతకం రాజారాం కథలు”పేరుతో 1991 లోవచ్చాయి. అయితే రాజారాం కథలు గ్రామీణ జీవితానికి అద్దం పడతాయి. స్వతహాగా తను గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరగడం వల్ల గొప్ప వస్తువులతో గొప్ప కథలు రాయగలిగారు. గ్రామీణ రైతు జీవితాన్ని తన కథల్లో సజీవంగా చూపించగలిగారు. రాజారాం రాసిన ఉత్తమ కథలో ఒకటైన సర్కస్ డేరా 1958 లో రాశారు. రాజారాం కథల్లో వైవిధ్యమైన భాష వైవిధ్యమైన శిల్పం పాఠకులను చదివిస్తుంది. రాయలసీమ జీవనచిత్రానికి, భాషకు ప్రాధాన్యతను అద్భుతమైన కథలు రాజారాం రాశారు 1975లో “ఇక్కడ మేమంతా క్షేమం” అనే కథ బహుశా తెలుగు సాహిత్యంలో అరుదైనదిగా చెప్పవచ్చు. సమాజం ఆధునికంగా అడుగులు వేస్తున్న కొద్ది రాయలసీమ కథకుల శైలిలోనూ మార్పు వచ్చింది. ఆధునికంగా రాయగలిగారు. అది భాషలోనూ కనబడుతుంది.

1958-60 సంవత్సరాల మధ్య కాలంలో కూడా వల్లంపాటి వెంకటసుబ్బయ్య, కలువకొలను సదానంద, పులికంటి కృష్ణారెడ్డి, వేణు, ముంగర శంకర రాజు తదితరులు కథలు రాశారు. పులికంటి కృష్ణారెడ్డి అనేక దళిత కథలు రాశారు. బహుశా రాయలసీమ ప్రాంతం నుండి దళితేతర కథారచయిత అయిన ఈయన పదుల సంఖ్యలో దళిత కథలు రాశారు. ఈయన రాసిన దళిత కథలపై నాగప్ప గారి సుందరరాజు పరిశోధన చేశారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య రాయలసీమ జీవిత ప్రత్యేకతలను చిత్రీకరించే గాయపడిన దేవత, బండి కదిలింది, వంటి కథలు రాయలసీమ కథా సాహిత్యంలో నిలబడగలిగాయి.

వల్లంపాటి వెంకటసుబ్బయ్య ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన గాయపడిన దేవత కథ ఫ్యాక్షన్ కుటుంబాలు రాజకీయ స్వార్థాల కోసం బలయ్యే కథాంశం త అరుదైన కథగా రాశారు. ఫ్యాక్షన్ కథలు అనేకం వల్లంపాటి కూడా రాయగలిగారు. ఈ ప్రాంతం ఆర్థికంగా పతనమవడం, కుల వివక్ష,దుర్భరమైన దళితుల జీవితాలు గ్రామాల ఆధిపత్యం వంటి కథలన్నీ కథకులు గొప్పగా రాశారు. ఇదిలా ఉండగా 1958 బొగ్గరపు రఘునందన్ రాసిన సింగిల్ టీచర్ కథ ఆలోచింపచేస్తుంది. అయితే ఈ కథ ప్రాచుర్యంలోకి రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకాకి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఆ ప్రాంతానికి వెళ్లి తన ఉద్యోగ అనుభవాలను స్థానిక భాషలో రాసే కథాంశంతో కథ.

ఈ కథ రాయలసీమ ప్రాంతంలో వచ్చిన మాండలిక కథగా చెప్పవచ్చు. రఘునందన్ తర్వాత సి. వేణు రాసిన నవ్విన ధాన్యరాశి, ముంగర శంకరరాజు రాసిన కోడి కూసింది -కుక్క చచ్చింది అన్న కథలు 1960లో వచ్చి రాయలసీమ జీవన విధానాన్ని గొప్పగా చర్చించాయి. ఈ కాలంలోనే అలసిన గుండెలు పేరుతో రాచమల్లు రామచంద్రారెడ్డి కథ సంపుటి తీసుకొచ్చారు. అనంతర కాలంలో సోదుమ్ జయరాం, కేతు విశ్వనాథరెడ్డి రామకృష్ణారెడ్డి, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, వైసివి రెడ్డి మొదలైన కడప జిల్లా రచయితలు కథను అత్యున్నత స్థితికి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే రాయలసీమలో తొలి కథ ఏది అన్న చర్చకు వచ్చినప్పుడు కర్నూలు నుండి గాడిచర్ల హరిసర్వోత్తమరావు కూడా తొలి కథను రాశాడనే వాదన కూడా ఉంది. ఇది కథ సాహిత్యంలో తొలి దశగా పేర్కొనవచ్చు.

రాయలసీమ కథా సాహిత్యం అనేసరికి కేతువిశ్వనాథ రెడ్డి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈయన 1962 లోనే కథా రచన ప్రారంభించారు. రాయలసీమ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు కథల్లో తీసుకుని వచ్చాడు.మధ్యతరగతి మనస్తత్వం,ఉన్నత వర్గీయుల విలాస జీవితం, యూనివర్సిటీల కుల్లు రాజకీయాలు, పరిశోధనల డొల్ల, వర్గ, వర్ణ సమాజంలో ప్రేమ, పురుష దురహంకారంలాంటి ఇతివృత్తాలతో కేతు విశ్వనాథ రెడ్డి గొప్ప కథలు రాయగలిగారు.

ఈ కాలంలోనే తొలితరం కథకులు పీ. రామకృష్ణారెడ్డి తన కథల్లో క్రౌర్యాన్ని పిరికితనాన్ని ఏకకాలంలో చెప్పగలిగిన కర్రోడు చచ్చిపోయినాడు కథ అద్భుతమైనది.ఫ్యూడల్ వ్యవస్థ సమాజాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్పగలిగారు. రాయలసీమ ప్రాంతంలో కథను సుసంపన్నం చేసిన ఎంతోమంది కథకులు ఇంకా ఉన్నారు. వచ్చే శీర్షికల్లో మరింత లోతుగా పరిచయం చేస్తాను.

*

కెంగార మోహన్

1 comment

Leave a Reply to Chandrasekhar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Good initiative Mohanji

    రాయలసీమ కథాచరిత్ర తో పాటు రాయలసీమ కథాపరిణామాన్ని కూడా స్పర్శిస్తే ఇంకా బాగుంటుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు