అత్యంత పదునైన ఆయుధమేదని నేనడిగినప్పుడు…
నువ్వు న్యూక్లియర్ బాంబుల గురించి మాట్లాడతావు
హైడ్రోజన్ మాయావి ఆర్డీఎస్-220 గురించి ప్రస్తావిస్తావు
మిస్సైళ్లు మోసుకుపోయే వార్‌హెడ్ల గురించి కలవరిస్తావు
బాలిస్టిక్ క్షిపణుల బలాన్ని కీర్తిస్తూ తన్మయంగా తలూపుతావు
డిజిటల్ డెవిల్స్ అంటూ
ఆధునిక మారణాయుధాల గురించి మురిపెంగా పులకరిస్తావు
ఇవేవీ కాకపోతే
కుంకుమసీమ కణతలపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పేలి
నుదుటిపై నెత్తుటి సూర్యోదయాల్ని నిలిపే తుపాకుల గురించి గర్విస్తావు
దేహాల్నీ వాహనాల్నీ ఛిద్రం చేసే ల్యాండ్‌మైన్ల గురించీ
రాగరంజిత సౌందర్యాన్ని రక్తధారల్లో ముంచే రాకెట్ లాంఛర్ల గురించీ…
చారిత్రక చావుమూలాల గురించి గావుకేకలు పెట్టి మరీ చాటింపు వేస్తావు
అత్యంత పదునైన ఆయుధమేదని నువ్వు అడిగినప్పుడు
నేను నిశ్శబ్ద సుందరంగా నీవైపు చూస్తాను
ప్రేమపూర్వకంగా ఓ పావురాన్ని పైకి ఎగరేస్తాను
కరుణపూరిత కరచాలన ఆహ్వానం విడుదల చేస్తాను
దయగా వర్ధిల్లిన చారిత్రక క్షణాల గురించి ప్రస్తావిస్తాను
దాక్షిణ్యగీతాల ధారణయోగాలో నిమగ్నమవుతాను
ద్వేషంపై ప్రేమ సాధించగల విజయాల్ని వివరిస్తాను
అహంపై అనురక్తి ఆవిష్కరించగల గీతాల్ని కీర్తిస్తాను
ఆయుధ లక్ష్యం మానవత్వానికి రక్షణ కదా- అని నిర్దేశిస్తాను
విహంగ వీధుల్లో రేగిన నీ విధ్వంసరచనను ద్వేషిస్తాను
మనసు పొరల్లో దాగిన మందుపాతర్ల గురించి గట్టిగానే దూషిస్తాను
శీలం లేని జ్ఞానంతో కురుస్తున్న నీ ఆయుధ సంపద వ్యర్థమంటాను
జ్ఞానం లేని తృష్ణతో మెరుస్తున్న నీ కిరీట కాంక్ష దుర్మార్గమంటాను
వాటిని భూతదయామూలికలతో నిర్వీర్యం చేయమని ఆజ్ఞాపిస్తాను
ఆత్మీయంగా చెబుతాను ఆరాధనగా చెబుతాను
నంగితనం ధ్వనించని గొంతుతో అరిచి మరీ చెబుతాను
ఆయుధమంటే రణం కాదు
ఆయుధమంటే మరణం కాదు
ఆయుధమంటే దురాక్రమణం అసలే కాదు
ఆయుధమంటే
అనంతశక్తితో అలరారే సజీవ శస్త్రం
సమస్త మానవాళికీ సాన్నిహిత్య సాధనం
*
effective poem
ఆయుధమంటే రణం కాదు
ఆయుధమంటే మరణం కాదు
ఆయుధమంటే దురాక్రమణం అసలే కాదు
ఆయుధమంటే
అనంతశక్తితో అలరారే సజీవ శస్త్రం
సమస్త మానవాళికీ సాన్నిహిత్య సాధనం
నిజమ్ గా అద్భుతం సార్ . ఆయుధానికి మీరు ఇచ్చిన నిర్వచనం.
*
ఆయుధానికి మరొక కొత్త నిర్వచనాన్ని చెప్పారు సార్ మంచి కవిత ధన్యవాదాలు అభినందనలు
ఆయుధం చేసే విధ్వంసాన్ని గురించి అన్ని కోణాల్లో విశ్లేషిస్తూ, మానవ ప్రగతికి దోహదపడే అసలైన ఆయుధమంటే ఏమిటో నిజమైన అర్థాన్ని సూచించే మంచి కవితను అందించిన రామిరెడ్డి గారికి అభినందనలు.
ఆయుధమంటే మరణం కాదు
మృదుమధుర భాషణం ద్వారా మనిషి మనిషిగా బ్రతికేందుకు ఇచ్చే భరణం అనే ఎంవీఆర్ గారి మాటే తీయని పదునైన ఆయుధం.
ఆయుధానికి నూతన నిర్వచనంతో మనసును తాకిన కవిత అపూర్వం…అద్భుతం.