తొలకరి చినుకులు పడగానే పులకరించిపోయే పుడమిలా ఆమె
చిరుగాలుల గుసగుసల గిలిగింతలతో పరవశిస్తున్నట్లుగా ఆమె.
నిన్నటివరకూ మోడువారిన చెట్టు కొత్త చిగురు తొడిగినట్లుగా ఆమె
చిరుగాలుల సవ్వడికి సంతోషంగా పొంగిపోయే కొమ్మలు రెమ్మల్లా ఆమె
నవయవ్వనపు పడుచుపిల్ల తుళ్ళి పడుతున్నట్లుగా ఉల్లాసంగా ఆమె.
ఉరకలేస్తున్న ఉత్సాహంతో, ఉద్వేగంతో ద్విగుణీకృత మయిన అందంతో ఆమె.
ఆ కళ్ళలో ఎన్నడూ చూడని వెలుగు, మొహంలో మెరుపు… కారణం ఏమై ఉంటుంది? దినపత్రిక చాటునుండి ఆమెనే గమనిస్తూ ఉన్నాను.
భర్త, పిల్లలు, కుటుంబం అంటూ ఇంటికి అంకితమైన మనిషేనా! నెమలిలా నాట్యమాడే నడకతో కోయిలలా పాట పాడుకుంటూ…
ప్రియుడి కోసం ఎదురుచూసే కన్నెపిల్లలా చక్కగా ముస్తాబైంది. ఎవరికోసం? ఇంకెవరి కోసం నా కోసమే కదా…కాదా?
ఆమె నడకలో నడతలో వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏదో ఉంది. ఏదో జరుగుతుంది. అదెలా… ఎలా తెలుసుకోవడం?
ఏవేవో ఆలోచనలు పుట్టుకొచ్చి ఒకచోటే ఆగిపోతున్నాయి. చెల్లాచెదురుగా ఎగిరిపడుతున్నాయి. ముక్కలై మనసుని అల్లకల్లోలం చేస్తున్నాయి.
ఆమె జీవితంలోకి మరో వ్యక్తి…ఇక ముందుకు పోలేక ఆలోచనల తుట్టను విదిలించుకుంటూ చూపు రోడ్డుకి సారించా.
దూరంగా వస్తున్న నడివయసు జంట వైపు దృష్టి నిలిచింది. ఆ జంటలో అతను ముందు నడుస్తుంటే అతని నీడలా ఆమె కదులుతూ… అచ్చం తమలాగే అనుకుంటుంటే గొంతులో ఏదో అడ్డం పడింది.
ఆమె తన నీడలా ఉందా… ప్రశ్న మొలకెత్తి తలెత్తి నా మొహంలోకి పరిశీలనగా చూస్తున్నది.
ఏం చెప్పాలో తెలియక నాలో ఆలోచనలు పొరలు పొరలుగా తెరలు తెరలుగా ఒకదానిపై ఒకటి రాలి పడుతున్నాయి
*** *** ***
తల్లితండ్రుల, ముగ్గురన్నదమ్ముల గారాల పట్టి పదహారో ఏట తన చేయి పట్టుకుని ఈ ఇంటికి చేరింది. పది పాసయ్యింది. కాలేజీ చదువుకు పోతానంటే వినకుండా పెళ్లి చేసి బరువు దించు కున్నారు తల్లిదండ్రులు.
కొత్తలో చలాకీగా, ఉత్సాహానికి మారుపేరులా ఉండేది. అందరినీ కలుపుకొని పోయేది. కానీ నేనంటే కాస్త భయంగా బెరుకుగా దూరం దూరంగా ఉండేది.
ఇద్దరికీ తొమ్మిదేళ్ల వ్యత్యాసం. ఆమెను చిన్న పిల్లగానే చూశా.
పెళ్ళైన ఏడాది లోపే బిడ్డను ఎత్తుకుంది. బిడ్డ ఆలనాపాలన తో పాటు ఇంటి పెద్ద కోడలు గా పెద్దరికం, బాధ్యతలు నెత్తి మీద పడ్డాయి. చదువుకోవాలన్న ఆమె ఉబలాటం అడుగంటింది.
పెళ్లప్పుడు అమ్మ, అమ్మమ్మ, మేనత్తలు, నాన్నమ్మ నూరిపోసిన సుద్దులు అనుసరిస్తూ అత్తమామల బాధ్యతలతో పాటు, అత్తగారి అత్తగారి బాధ్యత స్వీకరించింది. తన సుఖ సంతోషాల మాటే మర్చిపోయింది.
ఇంటి ఖర్చుల కోసం కొంత డబ్బు ఇవ్వడం మినహా నేనేం చేశాను.
ఇంటి పెద్ద కోడలుగా అత్తమామల కనుసన్నల్లో నడుస్తూ నాకు కావలసినవి సమయానికి అమర్చి పెట్టింది. ఇంటి బాధ్యతలు, ముసలి వాళ్ళ బాధ్యత ముగ్గురు పిల్లల కనిపెట్టుకోవడమే లోకంగా బతికింది. పెద్దవాళ్ళు కాలచక్రంలో కలిసిపోయారు. పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయారు.
ఓ రకంగా చెప్పాలంటే నాలుగైదేళ్లుగా ఆమె ఈ ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతున్నట్లు లెక్క.
*** ***
మట్టి పరిమళానికి నిద్రపోతున్న ప్రాణం గాలి నింపుకుని ఒళ్ళు విరుచుక ఉన్నట్లు సరి కొత్తగా అగుపిస్తున్నది.
ఆ నవ్వు మొహంలో నింగిలో మెరిసే నక్షత్రపు మెరుపు, వెలుగు కొత్తగా పరిచయం అవుతున్నాయి.
ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినప్పుడు, వివిధ సామాజిక కార్యక్రమాల్లో భాగమైనప్పుడు ఆడ మగ తేడా లేకుండా కలిసి పనిచేయడం అలవాటైంది.
అలా ఎంతో మంది అమ్మాయిలతో పరిచయం, స్నేహం. వారిలో కొంత మందికి దగ్గరవడం కోసం పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెదలా వాళ్ళ చుట్టూ గిరికీలు కొట్టేవాడిని. వారి అవసరాన్ని, అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడానికి శతవిధాలా యత్నించేవాడిని. అది తప్పని ఏనాడు అనుకోలేదు.
అలా… ఆమెకు కూడా… కొత్త స్నేహాలయ్యాయా?! అయితే, ఆ స్నేహం ఎంత దూరం పోయి ఉండవచ్చు.
అనుమానం పెనుభూతమై అనేకానేక సందేహాలు రేపుతూ మనసుని అల్లకల్లోలం చేస్తున్నది. ఆవేశంతో శరీరం ఊగుతుంటే వివేచన తట్టి మొట్టికాయ వేసింది.
ఆ మరుక్షణంలోనే తన అనుకున్న మనిషి మరొకరి… నో నో… ఉహు.., కాదు. అలా కాకూడదు. లోలోన పెడబొబ్బలు మొదలయ్యాయి. గుండె లోపలి అలజడి, కల్లోలం బయటికి అగుపించనీకుండా నాకు నేను నచ్చ చెప్పుకుంటూ గంభీరత ముసుగు వేసుకుని కూర్చున్నా.
కానీ, మనసు మహా చెడ్డది. నిలువనీయలేదు. కూర్చో నీయట్లేదు. అనుమానపు గాయం మరింత రేగుతున్నది. మంట పైపైకి ఎగుస్తున్నది.
అంతలోనే నిస్సహాయ దీనత్వం వచ్చి చేరుతున్నది. అవమానంగా తోస్తున్నది.
ఆమెను అడిగేస్తే, కడిగేస్తే… ఎలాంటి విషయం వినాల్సి వస్తుందోనన్న శంక, భయమూ ఓ వైపు వెంటాడుతున్నాయి.
వంట పూర్తి చేసిన ఆమె అన్నీ డైనింగ్ టేబుల్ పై నీటుగా సర్దింది.
గబగబా తయారై బయటికి అడుగేస్తుంటే “ఎక్కడికి? ఎందుకు?” అధికార యుతంగా ప్రశ్నించా.
వెనుదిరిగి సూటిగా నా కళ్ళలోకి చూసి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఆమె.
ఆ చూపు, ఇన్నాళ్లూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎందుకు వెళ్తున్నావో, ఏమి చేస్తున్నావో అంతా నాకు చెప్పే చేశావా… ఇప్పుడు నేను నీకు చెప్పడానికి అని నిలదీసినట్లు గా తోచింది. చూపుల కొరడాతో చెళ్ళున చరిచినట్లుగా ఉంది.
ఎక్కడికి పోతున్నట్లు? ఏం చేస్తున్నట్లు..? నిలువలేక గబగబా బట్టలు మార్చుకుని ఆమె వెనకే నడిచా.
ఆమె కనిపించలేదు. టింగు రంగ తయారై బయటికి పోయొస్తున్నదని మరోసారి పళ్ళు పటపటలాడించబోయి పెట్టుడు పళ్లు కట్టుడు పళ్ళు రాలి పోతాయేమోనని అనుమానంతో ఆ ప్రయత్నం మానుకున్నా.
లోపల్లోపల చెలరేగే నిప్పుకణిక వేడి భరించలేక బావురు మంటూనే మరుసటి రోజు, ఆ మరుసటి రోజు ఆమె వెనకే బయలు దేరా. ప్చ్.., ఏం లాభం? గుమ్మం బయట ఎవరైనా ఆమె కోసం కాచుకున్నారేమో… అతని బైక్ పైనో, కారులోనో పోతున్నదేమో… ఎటు వెళుతుందో తెలుసుకోలేక పోయా. పట్టుకోలేక పోయా.
పోతూ పోతూ ఆమె ఫ్లాస్క్ లో పోసిన టీ తాగుతూ ఆమె వెనుక డిటెక్టివ్ ని పెడితే.., ఆ ఆలోచన వెయ్యేనుగుల బలాన్నిచ్చింది.
అయినా, ఈ వయసులో ఇదేం పాడుబుద్ధి..?
ఆమె గురించిన ఆలోచనలు గట్టు తెగిన గోదావరి లా…కూర్చున్నచోట కూర్చోలేక, నిల్చున్న చోట నిల్చో లేక సుడిగుండంలో పడి కొట్టుకు పోతున్నట్టుంది. నరక యాతన అంటే ఇదేనేమో…
డిటెక్టీవ్ ని పెడితే ఎంత సమయం తీసుకుంటాడో… అంత సమయం ఈ యాతన పడుతూనే ఉండాలా?
ఉహు వద్దు వద్దు. వేచి చూసేంత ఓపిక నాకు లేదు. వెంటనే తాడో పేడో తేల్చుకోవాలి.
బోనులో నిలబెడితే ఏం చేస్తుంది? సమర్ధించుకుంటుందా? సంజాయిషీ ఇస్తుందా? సిగ్గుతో చచ్చిపోతుందా? దీనంగా హీనంగా వేడుకుంటుందా?
ఊహూ, అలా వద్దు. తొందరపడి గట్టిగా గొడవ చేస్తే అల్లరయేది నువ్వేనని వివేకం హెచ్చరించింది.
నా పరువు నేను…నో… నిదానంగానే విషయం రాబట్టాలి.
ఎంత చీకటిలో మగ్గిపోయాడు ఇన్నాళ్లు… నా మీద నాకే జాలి కలుగుతున్నది.
*** ***
ఆమె ఇంట్లో ఉన్నది. ఏదో పుస్తకం చదువుకుంటున్నది.
ఇదే మంచి సమయం అనుకున్నదే తడువు ఆమె చెంత చేరి “ఈ రోజు డిన్నర్ బయట చేసేద్దాం” ఏ ఉపోద్ఘాతం లేకుండా అన్నాను.
నిజమేనా.. ! అన్నట్లు నా కేసి వింతగా చూసి చేతిలో పుస్తకం మూస్తూ సరేనన్నట్టు తలూపింది.
“ఎక్కడికి వెళ్దాం” అడిగా.
మరింత ఆశ్చర్యపోయింది. కళ్ళు పెద్దవి చేసి వింతగా, విడ్డూరంగా చూసింది. నా కళ్ళలో కాదు నా ఎద లోతుల్లో దుర్భిణి వేసి చూస్తున్నట్లుగా చూసింది.
*** ***
జీవితంలో మొదటిసారి నా భార్యతో కలిసి రెస్టారెంట్ కి వచ్చా.
ఆమె హృదయపు లోతుల్లో ఉన్న విషయాన్ని రాబట్టాలని ఆత్రంగా ఉంది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ఆమెనే చూస్తూ కూర్చున్నా.
ఆ ఖరీదైన రెస్టారెంట్ లో కనిపిస్తున్న క్రిస్టల్ గ్లాసులు, వెండి స్పూన్ లు, అద్భుతమైన పెయింటింగ్ లు, ఫర్నిచర్, లాంప్ షేడ్స్ ప్రతిదాన్నీ అబ్బురంగా చూస్తూ మంద్రంగా వినిపించే సంగీతాన్ని, ఆ క్షణాన్ని ఆస్వాదిస్తోంది ఆమె.
నెమ్మదిగా ఆమె చెయ్యి నా చేతిలోకి తీసుకుని “కొన్నాళ్లుగా నువ్వు చాలా అద్భుతంగా కనిపిస్తున్నావు. రహస్యమేంటి?” గుసగుసగా అడిగా.
ఉలిక్కి పడిన ఆమె, మసక వెలుతురులో తలెత్తి నా కళ్ళలోకి సూటిగా చూసింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడు చూడని ఆ చూపు. నా కేసి విస్మయంగా చూసింది. సంభ్రమంగా చూసింది.
ఆమె జవాబు కోసం ఉద్విగ్నంగా చూస్తున్నా.
చిన్నగా నవ్వుతూ నోరు విప్పింది ఆమె. “నాకు కూడా ఇవాళ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆకాశం దిగి వచ్చినట్లుగా ఉంది.
అంతలోనే నువ్వు నువ్వేనా అని సందేహంగా కూడా ఉంది. ఇన్నేళ్ల జీవితంలో మొదటిసారి నా అభిప్రాయం అడిగావు. ఎప్పుడు నీదే నిర్ణయం. నన్ను అనుసరించటమే నేను చేసింది. ఆజ్ఞ జారీ చేయడం, పనులు పురమాయించడం మినహ పిడికెడు మాటలు లేని మనిషి నువ్వు.
అలాంటిది ఈ రోజు అందుకు భిన్నంగా…
నా ఛాయిస్ ప్రకారం ఇక్కడికి తీసుకొచ్చావు. నా పక్కన కూర్చున్నావు. నీ మొబైల్ లోకి చూసుకోవడమో, అటు ఇటు తిరిగే అమ్మాయిల్ని చూడడమో కాకుండా… నా చేతిలో చేయి వేసి నా కళ్ళలోకి చూస్తూ ఉన్నావు.
నన్ను… నన్నే చూస్తున్నావు. వింతగా లేదూ…విచిత్రంగా లేదూ…నాకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉంది” నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నదామె
ఆ తర్వాత సెల్ఫీ తీసింది. ఆ ఫోటో ఎవరికో పంపింది. అంతలో ఆమె ఫోన్ రింగ్ అవడం మొదలైంది. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చాలా చిన్నగా మాట్లాడుతున్నది.
నాకు జవాబివ్వకుండా చిద్విలాసంగా నవ్వుతూ మాట్లాడుతున్న ఆమె మొహం నియాన్ బల్బు లా వెలిగిపోతోంది. ఆమెను చూస్తుంటే నాకు చాలా అసౌకర్యంగా ఉంది. అసహనంగా ఉంది. అవమానంగా ఉంది. ఉక్రోషంతో ఉడికిపోతూ ఆమెను చూస్తున్నా. పూర్ణ బింబంలా మెరిసిపోతూ నవ్వుతూ మాట్లాడుతున్నది. అలా చూస్తుంటే ఆమెను పట్టించుకోకుండా ఉండలేని ఆకర్షణ అయస్కాంతంలా లాగేస్తున్నది.
ఇయర్ ఫోన్స్ తీసి హ్యాండ్ బ్యాగ్ లో పెడుతూ కొద్దిగా సాగిన పెదవుల వంపులతో పలకరింపుగా చూసింది.
అంతలో మళ్ళీ ఆమె ఫోన్. ఒక్క నిమిషం మాట్లాడి పెట్టేసింది. ఏమి మాట్లాడిందో తెలియదు కానీ థాంక్యూ అనడం మాత్రం తెలుస్తున్నది.
ఆమె జవాబు కోసం ఎదురుచూస్తున్న నా మొహం ముడుచుకుపోవడం గమనించిందో లేక కోపంతో కలగలిసిన ఆత్రం పసిగట్టిందో తెలియదు కానీ, నా కళ్ళలోకి లోతుగా చూస్తూ “నేను… ప్రేమలో పడ్డాను” స్థిరంగా అన్నది. ఆ గొంతులో ఎటువంటి తొణుకు బెణుకు లేదు.
సరిగ్గా అదే సమయంలో మంచి నీళ్లు పెట్టి మెనూ కార్డు ఇచ్చి వెళుతున్న సర్వర్ వెనక్కి తిరిగి ఇద్దరినీ మార్చి మార్చి చూశాడు.
పక్కన బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాను. భూకంపం వచ్చి భూమి బద్దలైనట్లున్నది. నరాలు తెగి పడినట్లుంది నాకు.
కళ్ళముందున్న వెలుతురును చీకటి మింగేసినట్టు, పచ్చదనం అకస్మాత్తుగా ఎండిపోయినట్లు, నదులు, చెరువులు మాయమై పోయినట్లు, నేల బీటలు వారి నట్లు. ఒక్కసారిగా జీవితం మోడువారినట్లు. నా ఆస్తి నెవరో దోచుకుపోతున్నట్లు. ఏక కాలంలో ఎన్నెన్నో భావనలు ముంచెత్తుతూ. నడి సముద్రంలో ఆసరా వెతుకుతూ నేను.
ఏది వినకూడనుకున్నాడో అదే వినబడింది. వళ్ళంతా చెమటలు పట్టాయి. లోపల డైనమెట్లు పేలుతున్నాయి. పురుషాహంకార ఆధిపత్యం పడగవిప్పి బుసలు కొడుతున్నది. అతలాకుతలమైన కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి.
తప్పు చేస్తున్న భావన ఏ కోశానా ఆమెలో లేదు. అదరక బెదరక నిటారు పర్వతంలా తలెత్తుకున్న ఆమెను చూస్తుంటే ఇప్పటి వరకు ఉన్న అతని బింకం సడలిపోతున్నది. నవనాడులు కుంగి పోతున్నాయి. కారణం ఎవరు నేనా? ఆమె నా? ఓ ప్రశ్న తలెత్తింది.
గంగిగోవు అనుకున్న భార్య నా కళ్ళకు గంతలు కట్టింది. ఆమెదే తప్పు అని నాకు నేను సర్ది చెప్పుకున్నా.
‘ఒరేయ్, నీలోకి నువ్వు ఒక్కసారి చూసుకో, తప్పెవరిదో తేలుతుంది’ గద్దించింది అంతరాత్మ.
నిజ్జంగా నా నిర్లక్ష్యమే కారణమైతే, నన్ను నేను క్షమించుకోగలడా… జీవితంలో ఇంతకు మించిన విషాదం ఏముంటుంది? ఏదో తప్పు చేసిన వాడిలా నా తల వంగిపోయింది.
కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. ఒక క్షణం, చాచి ఆమె చెంప పగలగొట్టాలన్నంత ఆవేశం తన్నుకొచ్చింది.
మరు క్షణంలో ఆమె తనకు దూరమై పోతుందేమోనన్న భయం వెన్నులోంచి జరజర పారింది. వణుకు పుట్టింది. అయ్యో…అయ్యో లోకం ఏమనుకుంటుంది? నవ్వి పోదూ…ఉరికొయ్యపై వేలాడుతున్నట్లుగా ఉంది
ఇక దాగుడు మూతలు లేవు. ప్రేమలో పడ్డానని స్పష్టంగా చెప్పేసింది. ఇప్పుడు బంతి నా కోర్టులో ఉంది. నిర్ణయం నేను తీసుకోవాలి. ఏం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఏమీ ఎరుగనట్టు ఫోన్ లో నవ్వుతూ మాట్లాడుతున్నది.
ఉదయం నుంచి చూస్తున్నా ఒకటే ఫోన్లు. ఫోన్లో అంత రాచకార్యాలు ఏమి వెలగబెడుతున్న ట్లో..? అక్కసు పొగలు సెగలు కక్కుతున్నా స్వచ్ఛంగా మెరిసే ఆమె కళ్ళలో కాంతి చూస్తుంటే కోపం పోయి ప్రేమ పుడుతున్నది. ఇదివరకు లేని ప్రేమ గుండెల్లోంచి ఉబికి వస్తున్నది.
ఇన్నేళ్ల దాంపత్యంలో ఎప్పుడూ లేని చలనం నాలో. తనది అనుకున్న ఆమె చేజారిపోతుందనా..! లేక నిజంగా ఆమె అంటే ప్రేమ పుట్టిందా!? సందిగ్ధంలో నాలో నేను చూసుకుంటూ…
వెనక్కి తిరిగి చూసా… దారిపొడుగునా ఉన్న జీవితాలను పచ్చగా ఉండటానికి ప్రయత్నించిందామె. తనలోని ప్రేమ తోడు కుంటూ ఇంటి ఫలాలు పండించింది ఆమె.
ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఆమెకు ఒక మనసు ఉంటుందని, ఒక జీవితం ఉంటుందని భావించలేదు. నా జీవితమే ఆమె జీవితం అనుకున్నా.
కానీ, నేనున్న చోటల్లా ఆమె ఉండదు. ఇంట్లో కుటుంబ అవసరాల్లో తప్ప. ఆ విషయం నాకెందుకు తెలియలేదు ఇన్నాళ్లు. నా కోసం, నా వాళ్ల కోసం నిరంతరం తపిస్తూ తనకేం కావాలో మరచిపోయిన ఆమెను ఏనాడైనా అభినందించాడా… లేదు.
ఆమె ప్రపంచాన్నంతా ఆక్రమించేసి ఛీత్కారాలు, అవమానాలు బహుమతిగా ఇచ్చాను. బాధ్యతల పేరుతో ఇంటి నాలుగ్గోడలనే ఖైదుగా మార్చేశాను.
ఉద్యోగం, స్నేహితులు, వ్యాపకాలు, కాలక్షేపాలు, సరదాలు షికార్లు అన్నీ నాకే.
గుడికో, పేరంటానికో, నోములు వ్రతాలతో ఇల్లు కదిలేది. కానీ, ఆమె చేసే పూజలు, నోములు,వ్రతాలు అన్నీ నా కోసం, నా కుటుంబం కోసమే.
ఆమె జీవితంలో తేమను ఆవిరి చేశానేమో… తన చుట్టూ బతకలేనంత వేడి మొదలయిందేమో… అందుకే దారి మళ్ళిందేమో..?
ప్రపంచంలో భూమి, నదులు, పర్వతాలు, అడవి మొదలైన వాటి విధ్వంసం గురించి వేదికలెక్కి గంటలకొద్దీ మాట్లాడే నేను, నా ఇంట్లో నా కోసం వచ్చిన ఆమెలో జరుగుతున్న విధ్వంసాన్ని గమనించానా.. లేదు. ఆమెలోని తేమ ఇంకిపోకుండా నేనెప్పుడయినా ప్రయత్నించానా. లేదు.
ప్రకృతి, పర్యావరణాన్ని మనిషి నాది అనే స్వార్ధంతో కొల్లగొడుతున్నాడని వేదికలెక్కి గగ్గోలుపెట్టే నేను చేసిందేమిటి?
ప్రకృతి- పడతి ఇద్దరూ ఒకే లాంటి వారని గుర్తించలేని అజ్ఞానిని.
ఆమె నాదనే అహం మరచిపోలేని గుణపాఠం నేర్పింది. మౌన వేదనలో నేను.
అమెనెంత నిర్లక్ష్యం చేసినా నాకు కావాల్సినవన్నీ తగిన విధంగా అమర్చి పెడుతూనే ఉంది. అచ్చం ప్రకృతి లాగే
అది గుర్తించలేని నేనే ఆమడ దూరంలో పెట్టా. పెను తుఫానులో చిక్కుకున్న నావికుడిలా ఇప్పుడు విలవిలలాడి లాభం ఏంటి?
అలవాటులేని ఆ కొత్త వాతావరణంలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ ఆమె. ఒడ్డున పడ్డ చేపలా గిలగిల కొట్టుకుంటున్న నేను
స్తంభించి పోయినట్టుంది కాలం. నెమ్మదిగా మాటలు కూడదీసుకుని “ఎవరతను?” ప్రశ్నించా. బావిలోంచి పీలగా వచ్చిన గొంతు వెక్కిరించింది.
ఆమె నవ్వింది. గలగలా నవ్వింది. పగలబడి నవ్వింది. అల్లరి చూపులతో నవ్వింది.
అంతలో ఆర్డర్ వచ్చింది. ఇద్దరినీ వింతగా చూస్తూ ప్లేటులో సర్వ్ చేసి అవతలికి వెళ్ళిపోయాడు సర్వర్.
వెయ్యి లంకణాలు చేసినట్లున్న నా మొహం చూసి వస్తున్న నవ్వును ఆపుకుంటూ “అతను కాదు ఆమె” అన్నది. అలా అంటున్నప్పుడు చొట్ట బుగ్గ మరింత ఆకర్షణీయంగా అగుపిస్తున్నది.
ఆమె జవాబు విని నివ్వెరపోయా. ఆమె.., ఆమెతో ప్రేమలో పడడం ఏంటి?
“అవును ఆమెనే, ఆమె అంటే ఎవరో కాదు నేనే…” ఆమె పెదవులపై చెదిరిపోని సన్నని దరహాసం
ఏమి చెబుతుందో నా బుర్రకి అందడం లేదు. కానీ అలా చప్పుడు లేకుండా నవ్వుతున్న ఆమె నవ్వుతో ప్రేమలో పడ్డా.
నా మొఖంలో కనిపించే ప్రశ్నను పసిగట్టిందో లేక అపనమ్మకాన్ని చూసిందో “అవును, నేనే. నాపై నేను ప్రేమలో పడ్డాను” అన్నదామె నా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ.
నోరెళ్ళబెట్టి చూస్తున్నా.
“నిజమే చెబుతున్నా, నన్ను నేను ప్రేమిస్తున్నాను. నా కోసం కొంత సమయం కేటాయించుకుంటున్నా. నన్ను ఇష్టపడే వారితో గడపటం, నాకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లడం, నేను నేనుగా బతకడం చేస్తున్నాను. నా కోసం నేను బతకడం తెలుసుకున్నాను” స్పష్టంగా చెప్పిందామె.
ఆమె చెబుతున్నది నిజమా…లేక తన కలా… తికమకగా ఉంది.
ఆమె తేట కళ్ళు నిజమేనని చెబుతుంటే నా గుండె మీద నుంచి పెద్ద బండరాయి తొలిగి పోయినట్లయింది. మనస్సుకు ఎంతో ప్రశాంతత వచ్చింది. ముఖంలో సన్నని వెలుతురు చేరింది.
ఆమెను నా గుండె దగ్గరికి హత్తుకొని అల్పమైన నా ఆలోచనకు, ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించినందుకు, నా మానసిక వైకల్యానికి, బాధ్యత లేని బంధానికి, ఆమెను అర్థం చేసుకోలేని అహంకారానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలని బలంగా అనిపించి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఆమె చేతిని నా చేతి లోకి తీసుకుంటున్నప్పుడు, నన్నే చూస్తున్న ఆమెకు ఏమర్ధమయిందో “నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు నువ్వు కూడా నన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తావని ఇక్కడికొచ్చాక తెలిసింది” చెప్పిందామె.
అటుగా వెళ్తున్న యువతి చెవిన పడ్డాయి ఆ మాటలు. ఎవరా అని వెనుతిరిగి చూసింది.
గబగబా వచ్చి “మేడం బాగున్నారా… కంగ్రాట్స్” అంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ పాతికేళ్ల యువతిని తేరిపార చూస్తున్నా.
“ఈ రోజు పేపర్లో మీ ఫోటో, ఇంటర్వ్యూ చదివాను. కంగ్రాట్స్” అని మరోసారి చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిందా యువతి
“మీరు చెప్పే కథలంటే మా అన్న పిల్లలకు చాలా ఇష్టం మేడం…తెలుగులో మీలా కథలు చెప్పేవాళ్ళు, చెప్పించేవాళ్ళు మరొకరు లేరంటుంది మా వదిన” ఏవేవో మాట్లాడుతున్నది ఆవిడ.
ఏంటీ…నా పక్కన ఉన్న నా మహిళ గురించి పేపర్ లో రాశారా ఆశ్చర్యం. ఆమె జీవితపు విలువ పెరిగితే నా జీవితపు విలువ తరిగినట్లుగా తోచింది.
గాలిని గుప్పెట బంధించాలనుకున్నాడు కానీ గుండెలో ఒంపుకోవాలనుకోలేదు. మనసుకు హత్తుకోలేదు. బక్క పలచటి మనిషి దేహం తప్ప మనసు చూడలేదు.
కొమ్మలు రెమ్మలు వేస్తూ విశాలమవుతున్న వృక్షాన్ని ఎంత నీచంగా అనుకున్నా… నా హృదయంలో ముసురుతున్న చిమ్మచీకట్లు.
వారి మాటలు చెబుతున్నాయి. ఆమె ఆడియో కథలు చెబుతుందని. బడుల్లో పిల్లలకు కథలు ఎలా చెప్పాలో నేర్పిస్తుందని.
అందుకే ఆమె బయటికి వెళ్ళేది.
జీవితం నుండి తనకు ఏమి కావాలో నిశ్చయించుకుని ఆ తోవలో నడుస్తున్న ఆమె.
ఆమెను ఆమె కనుగొన్నది. తనలోని దీపం తాను వెలిగించుకున్నది. ఆత్మవిశ్వాసంతో అడుగు వేస్తున్నది. ఆమె గౌరవం ఆమె పొందుతున్నది. ఆమె ప్రేమాభిమానాలను ఆమె పూర్తిగా ఆస్వాదిస్తోంది.
“ఏ విజయాన్నయినా సాధించేందుకు కావాల్సిన సామర్ధ్యం ప్రకృతి ప్రతి ఒక్కరిలోనూ నిక్షిప్తం చేస్తుందేమో. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం అందరికీ తెలియదు. అంతే.
ప్రోత్సాహం ఉంటే అసాధ్యాలు సాధ్యం కావూ…
నా విషయమే తీసుకోండి. నా జీవితంలోకి వచ్చిన అతన్నీ, అతని చుట్టూ ఉన్నవాళ్లను ప్రేమించే నాకు ఛాయిస్ లేకపోవడం, అభిప్రాయాలూ పంచకపోవడం, నా గురించి నేను ఆలోచించడానికి భయపడడం, అలా ఆలోచిస్తే స్వార్ధపరురాలు అనుకుంటారేమో.. అన్న భావనలో ఉండేదాన్ని. గడచిన జీవితమంతా నా ప్రియమైన వాళ్ళ కోసమే గడిపాను.
నన్ను నేను మరచి పోయా. నన్ను నేను నిర్లక్ష్యం చేసుకున్నా. అయితే, నన్ను నేను ఎంత కోల్పోయానో తెలిసిన తర్వాత గడిచిపోయిన జీవితంలో చీకటిని వదిలేసా.
ఇప్పుడు, నిజంగా నా ప్రియమైన నన్ను ఎంతో ప్రేమిస్తున్నా. నాతో నేను ప్రేమలో పడ్డాక జీవితం ఎంతో ఆసక్తికరంగా మారింది. జీవితాన్ని ప్రేమిస్తున్నాను. జీవితం తిరిగి నన్ను ప్రేమిస్తున్నది…” అంటున్న ఆమె కన్నుల్లో కురిసే వెన్నెల, జీవితం పట్ల ప్రేమ కొండంత ఆశ్చర్యంతో చూస్తున్నా.
“వావ్ ఎంత గొప్పగా చెప్పారు మేడం” అభినందించింది ఆ యువతి. ఆ పక్కనే ఉన్న యువకుడు ఆరాధనగా చూస్తున్నాడు.
గడచిన కాలాల్లో నడిచిన దూరాల్లో ఆమె నాతో ప్రయాణించింది. కానీ నేనామెతో ప్రయాణించానా..? సన్నని దారంలా మొదలైన ఆలోచనలు ఊడల్లా అల్లుకుపోతున్నాయి నాలో.
తన జీవితంలో తాను జీవించడాన్ని కనుగొన్న ఆమె నాకు అద్భుతంగా కనిపిస్తున్నది. భిన్న పార్శ్వాల్లో శక్తివంతంగా అనిపిస్తున్నది.
అవును
నీకు ఎవరు అవసరం లేదు.
నీ జీవితాన్ని అందంగా అద్భుతంగా దిద్దుకోవాలంటే ఎవరు అక్కరలేదు. నీకు నువ్వు ఉంటే చాలు.
నిన్ను నువ్వు ప్రేమించుకో
నిన్ను నువ్వు గౌరవించుకో
నీకు నువ్వు విలువ ఇచ్చుకో
నిన్ను నీవు కనుక్కో
నీ కోసం మార్గం వెలిగించుకో
ఆమెను తదేకంగా తన్మయత్వంతో చూస్తూ మనసులో అన్నాను
“నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. మనమీద మనకి నమ్మకం, గౌరవం లేనప్పుడు జీవితంలో ఏదీ దక్కదు.
నిన్ను నువ్వు ప్రేమించినప్పుడు, నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు ఇతరులు కూడా నిన్ను ప్రేమిస్తారు. గౌరవిస్తారు.
నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెట్టాక నీలో ఆత్మవిశ్వాసం వస్తుంది.
నిన్ను నీవు కనుక్కున్నావంటే నువ్వెన్నో అద్భుతాలు చేయగలవు. అందుకు నువ్వు అర్హురాలివి. అది తెల్సుకోవాలి ప్రతి ఆడపిల్ల.
ఇంతకాలానికి ఆ జ్ఞానోదయం అయింది నాకు” అంటూ నవ్వేసింది ఆమె.
ఆ యువజంట ఆమెతో ఫోటో తీసుకుంటూ నన్నూ పిలిచారు.
సారీ సార్, మీ సమయం తీసుకున్నందుకు అని చెప్పి వెళ్ళిపోయారు
అభినందనలు అంటూ ఆమె చేతిని సున్నితముగా నొక్కాను. నా స్పర్శలో పెల్లుబికిన ప్రేమ సందేశం ఆమెకు అందిందేమో ఆ నూతనత్వాన్ని ఆస్వాదిస్తూ తనలోకి తాను చూస్తూ ఆమె
ఇప్పుడు నాకు తెలుసు ఆమె ఏమిటో… ఆమె ప్రేమ ఏమిటో…
*
Add comment