కొంతమంది సౌందర్యం శరీరం మీదే కాదు, వాళ్ళ గొంతుల్లో కూడా ప్రతిధ్వనిస్తుంది. వాళ్ళ స్వర పేటికలు తేనెలద్దిన పల్చటి పూల రెక్కలు.
అదిగో అలాంటి అందాల మహారాణి శారదా శ్రీనివాసన్.
నాటకాలను చూడడంలోనే కాదు, వినడంలో కూడా ఎంత అనుభూతి ఉంటుందో ఆ తరం వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ రోజుల్లో రాత్రి 9.30 కి ఆకాశవాణి నుంచి లైవ్ నాటక ప్రసారాలు. ప్రి రికార్డింగ్ లేదు, ఎడిటింగులు లేవు, చిన్న అపశృతి పలికినా నాటకం సర్వ నాశనమై పోతుంది.
అలాంటి రోజుల్లో ఒక్క నండూరి విఠల్ గారితోనే వెయ్యికి పైగా నాటకాలు పలికారంటే ఆవిడ స్థాయిని మనం వూహించవచ్చు. ఎన్నెన్ని జ్ఞాపకాలు. చలం గారి “పురూరవ” విని పరవశించి పోయారని చెప్పాలా!? పింగళి లక్ష్మీకాంతంగారు, స్థానం నరసింహారావు గారు, బందా కనకలింగేశ్వరరావుగారు, బాలాంద్రపు రజనీకాంతరావుగారు, కృష్ణశాస్త్రిగారు, ముని మాణిక్యంగారు, బాలమురళీ, ఓలేటి, బుచ్చిబాబు, దాశరధి సోదరులు, గోపిచంద్, మరెంతమందో మహామహులు పట్టుబట్టి ఆవిడ చేతే తమ రచనలని పలికించేవారని చెబితే వోర్నాయనో అని అనిపించదూ!!
శ్రీకాంతశర్మగారు ఆవిడని దృష్టిలో పెట్టుకొని రాసిన “ఆమ్రపాలి” నాటకాన్ని, ఆవిడ 83వ యేట పలికారంటే, వూహించండి ఆవిడ స్వర మధుర విన్యాసాన్ని. ఆవిడకి అత్యంత ఇష్టమైన పాత్ర తిలక్ “సుప్త శిల”లోని అహల్య. ఆవిడకి అజరామరమైన ఖ్యాతిని తెచ్చిన పాత్ర చలం “పురూరవ”లోని ఊర్వశి. 1959 నుంచి 1995 వరకు ఆకాశవాణిలో ఆవిడ ప్రమేయం లేని కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు. ఆకాశవాణి కళాకారుడు, మిత్రుడు, ప్రియుడు, భర్త శ్రీనివాసన్ గారు, వేణుగాన విద్వాంసుడు టి.ఆర్. మహాలింగంగారి అత్యంత ప్రియ శిష్యుడు.
నవ్వుతుంటే జలపాతం జర జరా జారినట్టుందని కవులనగా చదివారు కదా! ఇప్పుడు ప్రత్యక్షంగా విని పరవశించడానికి రండి.
ఈ గొంతును విన్నవాళ్ళు ఎవ్వరైనా మర్చిపో
గలరా?
–
వెన్నెల ప్రవాహం! ఈ ముఖాముఖి, సారంగ పత్రిక చేసిన ఎప్పటికీ నిలిచిపోయే మహత్తరమైన సేవ!
అద్భుతమైన వాచకం. మా మేనమామ అమ్మమ్మలు ద్వారా వీరి గురించి చిన్నప్పుడు విన్న జ్ఞాపకం. మంచి పరిచయం.
అద్భుతమైన స్వర సౌందర్యాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు.
ఎలా స్పందించనూ ! ఆ వాచికాభినేత్రి గురించి ఎంత విన్నా, ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా తనివి తీరదు. యాభై ఏళ్ల క్రితం నుండే ఆ స్వరం వెంటాడుతోంది నన్ను. నాకు ఊహ తెలిసాక రేడియోలో “పాప పరిహారం ” నాటకం విన్నాను ( బహుశా 1973 అనుకుంటా ). అది మొదలు .. ఆమె నవ్వు తరగల్లా ..నురాగాల్లా .. నిలువెత్తు లహరిలా నన్ను తడుపుతూ , ముంచుతూనే ఉంది.
పురూరవ లో ఊర్వశి , సుప్తశిల లో అహల్య , భాగ్యనగరంలో భాగమతి , కంఠాభరణం లో సుబ్బలక్ష్మి , కాలాతీత వ్యక్తుల్లో ఇందిర , యామినీ పూర్ణ తిలక లో యామిని, బలిపీఠం లో అరుణ, చిల్లర దేవుళ్ళు లో వనజ, మట్టిమనిషిలో వరూధిని .. ఎన్ని వేల పాత్రలకో ఆమె జీవం పోశారో !
పివి నరసింహారావు రాసిన నాటకంలో ఆమె నటించారు. అక్కినేని , గుమ్మడి లాంటి ఉద్దండులతో నూ కలిసి నటించారు .. కాదు కాదు ఆ ఉద్దండులే ఆమెతో నటించాలని తహ తహ లాడారు.
పద్మశ్రీలూ , పద్మభూషణులూ ఆకాశవాణికి వర్తించక పోవడం శోచనీయం .. ఆమె చేసిన సేవకు ఎప్పుడో అలాంటి పురస్కారం రావలసింది.
మరోసారి శారద గారిని తెరపైకి తెచ్చినందుకు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు .
మీ లాంటి పెద్దల నుంచి ఇంత మంచి స్పందన నిజంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది . మరిన్ని మంచి ఇంతేటర్వ్యూలు మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాము .
గొరుసును పెద్దల్లో కలిపేశారా?
ఆయనకీ అదే కావాలిలా ఉంది. అందుకే ‘ ఇంక రాయలేను బాబూ! ఇదే ఎక్కువ ‘ అనేస్తున్నాడు.
దానికి మీ కామెంట్ బాగా ఉపయోగపడుతుంది.
Her portrayal in telugu version of waiting for mahatma(rknarayan) made me her fan. Thanq
సూపర్బ్ ! నాకు రేడియో అంటే హిందీ పాటలు మాత్రం తెలుసు. ఇది వింటుంటే చాలా మిస్సయ్యాననిపిస్తుంది. ఆ స్వరం, గానం, సంభాషణల ఉచ్చ్చారణ అద్భుతం. అలాగే మీరు చేయిస్తున్న ఇంటర్వ్యూ ల పని కూడా చాలా విలువైన సేవ, మోహన్ గారు.