ఆమె… అమ్మ…

విలపిస్తూంటాను…
విలవిల్లాడుతూంటాను…

మాంసం ముద్దలుగా తెగిపడుతూంటుంది శరీరం
కాళ్ల దగ్గర శకలాలు శకలాలుగా ఖండిత వాంఛ
పైకి ఏ గాయమూ కనిపించదు.

లోలోపల ఏ మందూ దొరకదు
సంపూర్ణంగా మరణించలేం..!?
పరిపూర్ణంగా జీవించనూ లేం..!?

నది దగ్గరో… చెరువు చెంతనో..కాలువ వొడ్డునో
కూర్చుంటాను అచేతనంగా..

నా రెండు కన్నీటి బొట్లు ఆ పవిత్ర జలాల్లో కలుస్తాయి
అంతే… ఆ నీరంతా కన్నీరవుతుంది

అదిగో.. ఆ నీళ్లలో సచేల స్నానం కోసం
శరీరం మీదున్న మరో శరీరాన్ని వదిలేస్తా
ఇక దూకడమే తరువాయి
ఇక అన్నీ వదులుకోవడమే మిగిలింది

ఓ గాలి…అలా నా శరీరం మీంచి
పాకుతూ.. తల నిమురుతుంది
తటాలున తలతిప్పి చూస్తే
నీలి మేఘాన్ని ధరించిన ఆమె
ప్రశాంతంగా నవ్వుతూంటుంది

పక్కనే కూర్చుని
“పిచ్చి మొద్దు” గోదారమ్మ పంపిందిరా
నిన్ను కళ్లలో పెట్టుకోమందిరా
నీకో కొత్త లోకాన్ని చూపించమందిరా..
నా వేలు పట్టుకో… నీకో బతుకునిస్తానంది
ఎందుకో… ఏమిటో..

ఆ కళ్లలో ఆమె… మా అమ్మ కనిపించింది.

*

ముక్కామల చక్రధర్

6 comments

Leave a Reply to చల్లా రామ ఫణి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “పక్కనే కూర్చుని
    “పిచ్చి మొద్దు” గోదారమ్మ పంపిందిరా
    నిన్ను కళ్లలో పెట్టుకోమందిరా
    నీకో కొత్త లోకాన్ని చూపించమందిరా..
    నా వేలు పట్టుకో… నీకో బతుకునిస్తానంది
    ఎందుకో… ఏమిటో..

    ఆ కళ్లలో ఆమె… మా అమ్మ కనిపించింది“
    జీవితేచ్ఛ. …👌👌👌👌

  • ఖండిత వాంఛ…
    ఆమె కరుణ ఒక్కటే మాన్పగలదు ఈ బాధను.
    చాలా బాగుంది చక్రధర్ గారూ….

  • బరువు గుండెకు బాసట అమ్మ
    బాధలనోదార్చు బోధ అమ్మ
    తనివి తీర మురిపెమిడు తావు అమ్మ
    సత్యశివసుందర రూపమే కద అమ్మ

  • సం పూర్ణంగా మరణించలేంం
    పరిపూర్ణంగా జీవించనూలేం

  • “పైకి ఏ గాయమూ కనిపించదు.

    లోలోపల ఏ మందూ దొరకదు
    సంపూర్ణంగా మరణించలేం..!?
    పరిపూర్ణంగా జీవించనూ లేం..!?

    నా రెండు కన్నీటి బొట్లు ఆ పవిత్ర జలాల్లో కలుస్తాయి
    అంతే… ఆ నీరంతా కన్నీరవుతుంది”

    చాలా బాగా రాశారు చక్రధర్ గారూ.గుండెల్లోంచి పలికిన కవిత

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు