‘ప్రతి కవి రాసిన పద్యానికి అందులోనే ఒక ఆంతరంగిక సాక్ష్యం ఉంటుంది’ అంటాడొక చోట ప్రముఖ విప్లవ కవి వరవర రావు గారు. చాలా ఆసక్తిగా అనిపించిందీ వాక్యం. ఏ కవి కూడా తాను చెప్పదలుచుకున్న కవిత్వ సారాంశానికి వేరొక వ్యాఖ్యానాన్ని సాక్ష్యం తేబోనవసరం లేదన్నమాట. కవితకు సంబంధించిన శీర్షిక మొదలు, కావ్య శరీరమంతా కవి పడ్డ తపన, తాపత్రయం వాటికవే సుస్పష్టంగా కనిపిస్తాయి. సుబోధకమవుతాయి. అది కవి వాచ్యంగా ప్రతిపాదించిన అర్థం కావచ్చు, లేదా మనల్ని భావుకతతో కట్టిపడేసిన రసప్రవృత్తి కావచ్చు. ఏది ఏమైనా గానీ, అమూల్య ఒంటి రొమ్ము తల్లి (2021) అని పేరు పెట్టినా భూమి నవ్వడం చూశాను (2025) అని ప్రకటించినా స్థూలంగా ఆ నామౌచిత్యంలోంచే లోపల్నుండి ఎవరో గుండెల మీద చేయి వేసుకుని సప్రమాణకంగా గవాయి పలుకుతున్నట్టు అనిపిస్తుంది.
వొంటి రొమ్ము తల్లి ఎంత శక్తివంతమైన శీర్షిక. ‘అలవాటు పడిన గుండె మీద గరుకుప్పులా మొలించిందొక కణితి’ అంటూ ఆమె రాసిన కవితలో అనేకానేక విశేషాంశాలేవీ కనబడవు. ‘నా బిడ్డకు తాపించిన మొదటి పాల మధుర జ్ఞాపకం బయాప్సీకి తరలిపోయింది’ అంటుంది మరొక వాక్యం. బ్రెష్ట్ కేన్సర్ బారినపడ్డ ఒక తల్లి జీవన మాధుర్యాలపై ఒక వ్యాధి చేస్తున్న దాడిపై తడి తడి భావ ప్రకటన ఈ కవిత. Great poets are judged by the frame of mind they induced in us అంటాడు ఎమర్సన్. అమూల్య కవిత్వం చదువరుల మానసిక స్థిరత్వాన్ని నేరుగా టార్గెట్ చేసే కవిత్వం. అందుకు ఆమె దృఢమైన వ్యక్తిత్వం కారణం కావచ్చు. అందులోని సూటిదనమే తన వాక్యం చుట్టూ ఒక ఆకర్షణీయతను సృష్టించి ఉండవచ్చు. అట్టి ఆకర్షణ వస్తువుదా శిల్పానిదా వివేచన పక్కనబెడితే కవి మనలోకి దూసుకువచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకోని తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి అమూల్య ఈ మధ్యే ‘భూమి నవ్వడం చూశాను’ కవిత్వ సంపుటిని ప్రచురించారు.
అమూల్య కవిత్వంలో ఉండే ప్రత్యేకతని పట్టుకోదలిచి ఆమె పుస్తకాలకి పెట్టిన పేర్లు పలికిన నిగూఢార్థాలను దాటి చూస్తే నన్ను ఆమె కవిత్వ స్వరూప స్వభావాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. అమూల్య కవిత్వంలో ఏదో ఒక ‘విముఖత’ ప్రముఖంగా కనిపించింది. సమాజాన్ని, అందులోని మనుషుల ప్రవృత్తుల్ని దగ్గరగా చూసిన ‘స్పష్టత’ ఉంది. ఆ స్పష్టత వల్ల రూపుదిద్దుకున్న ‘భావాభావాలు’ ఉన్నాయి. మూలంలో ఆ విముఖతకి మనుషుల ‘పరస్పరత’ చుట్టూ మొలుస్తున్న ఇనుప కంచెలు కారణంగా తెలుస్తుంది. ఇందులో ప్రపంచానికి తెలియని యుద్ధం చేసే ఒక స్త్రీని చూడగలుగుతాం. ఆ స్త్రీకి ‘నా చూపులంటే మీకెప్పుడూ కంటగింపే, తుపుక్కున పీకి పారేస్తార’నే కోపం ఉండటాన్ని గమనిస్తాం. కోపం కన్నా ‘మాది లేడీస్ స్పెషల్ బ్లడ్ గ్రూప్. చెరిపితే చెరిగిపోయే భయానికి మా రక్తంలో చోటే లేదు’ అనగల తెగువ ఉంది. అమూల్య బాహ్య ప్రపంచానికి ఆధారాలు దొరక్కుండా ‘తేలు కుట్టని దొంగ’ లా బ్రతికే మగవాణ్ణి ఏహ్యంగా చూస్తుంది. అమూల్యలో విప్లవాత్మక స్త్రీవాద లక్షణం ఉంది. లేకపోతే ‘మమ్మల్ని చూసి తడుపుకోని ప్యాంటుగాళ్ళెవరో ఒక్కసారి చేతులెత్తండి’ అనగలిగేది కాదు. ‘మగాళ్ళనబడే ఆంబోతుల వీర్యంలోనేగా నేను తడిసింది’ వంటి వాక్యాలు రాసి ఉండేది కాదు. చదివినంతనే సర్రుమని కాలే ఇటువంటి వాక్యాలు గతంలో ఎవరూ రాయలేదని కాదు. ఇప్పుడు కూడా వాటిని రాయడంలో ఉన్న ప్రాసంగికిత గమనించదగ్గ విషయం. అందుకే ఈ కవిత్వంలో ఉండే శరీర భాష గురించి నేనింకే వ్యాఖ్య చేయ దల్చుకోను. అందుకు దిగంబరుల కవిత్వాన్నో ఇంకొకర్నో ఉదాహరణలు తీసుకుని సమర్థనో వ్యతిరేకతో ప్రకటించను. మగదురహంకార ప్రపంచం పై తన వ్యతిరేకత తెలిపేందుకుకు వాడిన పదాల ఎంపిక, వాక్య నిర్మాణం చూస్తే ధైర్యం వహించి ఆమెది ముమ్మాటికీ ‘బరిని తెగదెంచిన పద్యమే’ అంటాను.
‘మా శానిటరీ ప్యాడ్స్ కే మాటలొస్తే రక్త సముద్రంలో మిమ్మల్ని ముంచి లేపేవి’ అన్న తర్వాత ‘మీక్కూడా తొడుక్కోవడానికి మా శానిటరీ ప్యాడ్స్ అప్పిస్తాం’ అన్న తర్వాత ప్రకటించేందుకు ఏమీ మిగల్లేదు. IA Richards (Philosophy of Rhetoric) లో వస్తువుకు Tenor అని, రూపానికి Vehicle అనే పేర్లు జోడించాడు. అవి ఒక Metaphor (రూపకం) లేదా Simili (ఉపమ) ని లేదా ఏ ఆలంకారికతనైనా ఎలా ప్రభావితం చేస్తాయో చెబుతూ వస్తురూపాల మధ్యగల అసమతుల్యత ఆ కవిత్వం ఆకర్షణ కోల్పోయేందుకు ఎలా కారణం అవుతుందో చెబుతాడు. దానికి మళ్ళీ Ground (భూమిక) Tension (తన్యత) ల ప్రస్తావన చేస్తాడు. అమూల్య కవిత్వ వస్తువును (?) మాత్రమే సమర్థవంతంగా నిర్వహించగలిగింది అనాలనిపిస్తుంది కానీ అనలేకపోతున్నాను. ఇది అయోమయం కాదు. తన కవిత్వ నిర్మాణంలో ఒక implicit లక్షణం ఉంది. గర్భిత, లేదా అణిగి లేదా నివురు గప్పిన నిప్పు లాంటి లేదా చాప కింది నీరులాంటిది ఒకటి ఉంది. అది వస్తుశిల్పాల్లో దేన్ని జేగీయమానం చేసిందో ఆలోచలో పడేస్తుంది. నగ్న కవాతు, అతనో మంచి బాబా, నగ్న దేహాలమై నడుద్దాం, రఫ్ నోట్ బుక్, నిత్య నూతన వంటి కవితలు చదివాక ఇతమిద్దంగా అది వస్తు ప్రతిభేనని తీర్మానం చేయవచ్చు. కనుక మొదటే నేను ‘సాక్ష్యం’ అన్న వివి మాటని ఉటంకించాను. ఇక్కడే శ్రీశ్రీ ‘విశ్వనాధ రామాయణ కల్పవృక్షమంతా నవల, ఛందస్సులో ఉంటుందన్న బడాయి తప్ప. చలంగారి వచనమంతా కవిత్వం. జేంస్ జాయ్స్ వచనమంతా కవిత్వమే’ నన్న ఉటంకింపులు జ్ఞాపకానికొస్తున్నాయి. వాన ఓ గొప్ప కవిత్వం అన్న కవితలో అమూల్య కనబరిచిన భావుకత చాలా ప్రశంసనీయంగా ఉంటుంది.
అమూల్య సరళ వచనలో నిరలంకారంగా ఎంతో శక్తివంతమైన కవితలు రాశారు. అది తన టీచర్ గురించి రాసినా, మూడో మనసు అని థర్డ్ జెండర్ గురించి కవిత రాసినా అమూల్య దాగుడు మూతల్లేకుండా రాశారు. మరి అంతర్లీనంగా ధ్వనించిందంతా ఏమిటి ? నల్లరంగును గొప్పగా కీర్తిస్తూ నల్ల తల్లి అన్న కవిత, నల్లోడైతేనేం కవిత, ఇంకా నిలువెత్తు అమావాస్య రంగు వాడు (లోపలి మనిషి), ‘మా నాన్న రంగు నాది చందమామను మెరిపించే చీకటి రంగు అని అరవాలనిపించేది (మెహెందీ బజార్) వంటి ప్రతీకలు ఆమె సమాజంలో గుర్తింపులేకపోవడానికి రంగును కారణం చేస్తున్న వివక్ష గురించి తెలియజేస్తాయి.
ఈ పుస్తకం టైటిల్ కవితలో కూడా ‘ఓడిపోయిన భూమి పొడి నవ్వును చూశాను’ అనడం రైతు పట్ల అతను నమ్ముకున్న భూమి పట్ల వర్తమాన వ్యవసాయం స్తితిగతుల పట్ల కవయిత్రి దృక్పధం తెలుస్తుంది. ఆకుపచ్చని పాదాలు, ఆకుపచ్చని కన్నీరు, వేరైన ఆత్మ వంటి కవితల్లో ప్రస్తుతం రైతు జీవన దృశ్యం కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తారు అమూల్య. స్థూలంగా చూడ్డానికి రైతు గురించి ప్రకృతి గురించి ఎక్కువ కవిత్వం రాసినట్టుగా అనిపిస్తుంది గానీ సూక్ష్మతలంలో స్త్రీ జీవితాన్ని అమూల్య తనదైన కోణంలోంచి కవితలుగా ఆవిష్కరించిందే ఎక్కువగా ఉంటుంది. implicit metaphors చేసిన అద్వితీయమైన మాయ ఈ కవితల్లో ఉండటం వలనే స్త్రీకేంద్రిత కవితలు చాలా బలంగా ఉండి వేరేవాటిని చాలా డామినేట్ చేస్తాయి. ఆ పని చాలా మంది చేశారు కదా ? ఇంకా అవసరమా ? మందరపు హైమావతి, పాటిబండ్ల రజని, విమల ఇలా ఎంతోమంది స్త్రీవాద కవుల వారసత్వం అమూల్య వంటి కవయిత్రులు పుణికిపుచ్చుకున్నారన్న సంతోషం ఎందుకు కలుగుతుంది ? ఎందుకంటే వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి అమూల్య వంటి వారు వెనుదీయరు కాబట్టి. సబ్జక్టివ్ అయినప్పటికీ ఆంధ్రా ప్రాంతంలో అమూల్య, వైష్ణవిశ్రీ, డి నాగజ్యోతి, గంగవరపు సునీత, సుధామురళి, వసుధా రాణి, కాళ్ళకూరి శైలజ (పొరబాటున మరచిపోయిన పేర్లతో సహా) ఇంకా ఎంతో మంది స్త్రీల కవిత్వ కృషి వేయి విధాల ప్రశంసించదగ్గది. వీళ్ళు మరిన్ని రచనలు చేయవలసి ఉంది. చేస్తారు కూడా. ఎందుకంటే వొంటిరొమ్ము తల్లి, లేడీస్ బ్లడ్ గ్రూప్, తలెత్తిన తల్వార్ వంటి కవితలు అమూల్యవంటి కవయిత్రులు మాత్రమే రాయగలరు. అందులో సందేహం అక్కర్లేదు.
భూమి నవ్వడం చూశాను (కవిత్వం) : అమూల్య చందు పేజీలు: 119, ప్రతులకు: 9059824800
Add comment