-
కంగ్రాట్స్ అపర్ణ ముందుగా మీ కథా సంకలనం తీసుకు రాబోతున్నందుకు.
థాంక్ యు అనిల్
-
మీ కథల్లో నేపథ్యం ఎక్కువగా అర్బన్ నేటివిటీ ఉంటుంది దాని వెనక ఏమైనా బలమైన కారణం ఉందా? అర్బన్ జీవితాలని మాత్రమే రాయాలని నియమం పెట్టుకున్నారా?
నియమం ఏం లేదు. పల్లెటూరి పాత్రలు ఎక్కువగా రాయలేక. అంతే. నా జీవితం మొత్తంలో ఒక్క మూడేళ్లు మాత్రమే చిన్న టౌన్ లో ఉన్నా. మిగిలినదంతా విజయవాడ , హైదరాబాద్ లోనే. బహుశా అర్బన్ లైఫ్ స్టైల్ కి అలవాటుపడడం వల్లనేమో. పైగా చిన్నప్పటినుంచి సిటీ ఆడవాళ్లంటే ఏదో ఫాసినేషన్ ఉండేది. సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్ లే నచ్చేవి. పైగా మాండలీకం చదవడం ఇష్టమైనా, రాయడానికి పెద్దగా పట్టుబడి చావవు. ఫేక్ గా రాసి నా దృష్టి లో నేనే చులకనైపోవడం ఇష్టం లేదు. ఐనా కథల్లో కొంచెంకొంచెం ప్రయత్నిస్తూనే ఉంటాను.
-
ఆధునిక స్త్రీ అంటే మీకొక ఊహా ఉన్నట్టుంది.ఆమె ఏమి కోరుకుంటుంది.ఆమెకు మీరు నిర్వచనం లాంటిది ఏమైనా ఇస్తారా?
నిర్వచనాల్లో ఒదిగే స్థాయినుంచి ఆధునిక స్త్రీ ఎప్పుడో ఎదిగిపోయింది.కాబట్టి నిర్వచించడం అవసరంలేదు. తనతో, తన చుట్టుపక్క వారితో, రాజీపడకుండా శాంతియుతమైన సంబంధాన్ని నెలకొల్పుకోవడమే నా దృష్టిలో ఆధునిక లేక ఆదర్శ స్త్రీ లక్షణం. ఆమెను ఆమెలా వదిలేయడమే ఆమె కోరుకునేది.
-
మీవన్నీ ప్రేమ కథలేనా?
మీరిప్పుడు అడిగే వరకూ నేను రాసింది ఒకటే ప్రేమకథ అనుకున్నాను. కానీ thanks to you! నేను రాసిన మరికొన్ని కథలు కూడా ఇంచుమించుగా ప్రేమకథలే అనిపిస్తోంది.
కానీ పై ప్రశ్న కి సమాధానం – లేదు. నేను అందరూ గొప్పగా ఊహించిన ప్రేమ, మాతృత్వం, చదువు , పెళ్లి – ఇలాంటివి ఎద్దేవా చేస్తూ రాసినవే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమను అనుభూతిగా కాక చాకిరి, త్యాగం, పెళ్ళి, లైంగికత లో బంధించి పడేశాం. పునీత, ప్రేమ కథ- రిఫైన్డ్, ఏడో ఋతువు, వాహిని ఇవన్నీ అలా రాసినవే. ఒకవేళ ఈ సమాధానం అంత ఘాటుగా ఆ కథలు లేకపోతే అది రచయిత్రిగా నాకున్న limitation మాత్రమే. కానీ అంతస్సూత్రం గా అన్ని ఎమోషన్స్ ను పట్టుకుందామని ప్రయత్నం చేస్తూనే ఉంటాను.
-
మీ కథా సంపుటి బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ కదా .మీరు బోల్డ్ కథలు రాసినప్పుడు సామాన్య పాఠకుల నుంచి కానీ, మిగతా వారినుంచి కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
తిట్లు తిన్నాను అంతే. అవే బెటర్. ముందు సహానుభూతి చూపించినట్లు మాట్లాడి, వెనకకు పోయి మాట్లాడినోళ్ల వల్ల కాస్త బాధపడ్డాను. కథ ఒక creative document మాత్రమే. నిలిచే కథలు నాణ్యత బట్టి ఎప్పటికీ ఉంటాయి. నా కథలని ఇంకా ఎలా బాగా రాయొచ్చో విమర్శిస్తే నేర్చుకుంటాను.
కానీ నా పాత్రలకు మోరల్ పోలీసింగ్ చేయడం హాస్యాస్పదం గా ఉంటుంది. కొంతమంది లో దాగున్న పెర్వర్షన్ విమర్శ రూపంలో బయటికి వస్తుంది. కొంతమందిలో hypocrisy కూడా. ఒకాయన లో ఐతే క్రూరత్వాన్ని చూసాను. కథలలో ఆడవాళ్ల పాత్రలు అయినా సరే, గీతలు దాటితే, గిల్ట్ లేకుండా ప్రవర్తిస్తే, భరించలేక ఆ కథ రాసిన రచయిత్రి పాత్రనే(నన్నే) పెట్టి కథ రాసి, ఆమె భర్త తోనే ఆమెని చంపించేసేంత క్రూరత్వం! అంత స్ట్రాంగ్ గా నియంత్రించబడ్డ వాళ్ళ మీద జాలివేస్తుంది. Infact నా కథల వల్ల కన్నా, వాళ్లు చేసిన ప్రచారం వల్లే నా పేరు ఎక్కువగా తెలిసిందేమో.
-
మీరు యువ రచయిత కాబట్టి, ఇప్పటి తరం ఇలానే ఉంటుంది కాబట్టి ఈ వేవ్ లెంగ్త్ ఇప్పటి తరానికి సెట్ అవుతుందని మీ శైలి ని మార్చుకుని మీ కథల్ని డిజైన్ చేసుకున్నారేమో అనిపిస్తుంది.దీన్ని ఎలా చూస్తారు?
యువరచయితగా నాకున్న ఎలిజిబిలిటీ మరో రెండు నెలల్లో తీరిపోతుంది. ఇప్పటి తరం అంటే ఏ తరం? ఇరవైల్లోని వారా, ముప్ఫైల్లోని వారా?
కాంటెంపరరీ సబ్జక్ట్స్ తీసుకుందాం అని కచ్చితంగా అనుకుంటాను. అలానే కథలలో వాడే వస్తువులు, చేసే పనులలో అవి రిఫ్లెక్ట్ ఎట్లు చూస్తాను. మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా మెట్రో, ఆన్లైన్ షాపింగ్, వైర్ మెష్ బ్రా, netflix వగైరా. కానీ దీనికోసం నేనేం నా శైలిని మార్చుకోలేదు. నా జీవితం లో రోజూవారీ గమనించిన సంఘటనలే కథకు ఉపయోగపడతాయి.
కానీ ఇది సరిపోదు. నాకన్నా చిన్నవాళ్లు ఇంకా ఎక్కువగా రాయాలి.
-
ఈ కథలన్నీ పూర్ణ జీవిత చరిత్ర రాయక ముందువి అనుకుంటాను. అది రాసిన తరవాత మీ భవిష్యత్ కథల్లో కొత్త వస్తువుని చూడొచ్చా?
తప్పకుండా. ఇకపై రాయబోయే కథలు రెక్కలు విడిపించుకుందాం అని విసుక్కుంటున్న ఆడవాళ్ళ గురించి తగ్గించి, రెక్కలు విప్పుకుని ఎగిరే ఆడవాళ్ళ గురించే ఎక్కువగా రాద్దామని నిర్ణయించుకున్నాను. నా కథలు ఇంకాస్త hopeful గా ఉంటే బావుండనిపిస్తుంది.
-
మగవాళ్ళ పాత్రల్ని చాలా తెలివిగా మలిచి ఎక్కడో ఒకచోట వాళ్ళని victim చేస్తారు.ఈ జనరేషన్ లో ఐడిల్ మ్యాన్ మీ కథల్లో ఉన్నారా?
(నవ్వు) విక్టిమ్ ని చేయడమే నా పని. అధికారం చెలాయించే మనుషులకి ఎంత అభద్రత ఉంటుందో ! నా కథల్లో ఐడియఎల్ మాన్ మాత్రమే కాదు, ఐడీఎల్ విమెన్ కూడా లేరు. అసలు నాకు ఐడియల్ అన్న మాటతోనే కదా పేచీ. నా పాత్రలన్నీ తప్పు చేస్తాయి. కానీ ఈ తప్పుల్లో ఆడవారి తప్పులకు చెల్లించే మూల్యం చాలా చాలా ఎక్కువ. మగవారి మీద నాకు సానుభూతి ఉన్నాసరే, ఆడవారి బాధ పరిమాణరీత్యా ఎక్కువ. నా ఫోకస్ అందుకే వారి మీదే ఎక్కువగా ఉంటుంది.
-
మీరు ఈ కథ నేను రాయకపోతే బాగుండేది అని ఎప్పుడైనా అనుకున్నారా…? ఇంకా రాయలేని థీమ్స్ ఏమైనా ఉన్నాయా?
లేదు. ఇంకా బాగా రాస్తే బావుండేది అని ప్రతి కథ గురించి అనుకుంటాను. కొన్నిసార్లు నా కారక్టర్ల మీద నాకే ఎగతాళి. (“ఏందీ వీడి గోల” అని ‘వాహిని’ చదివిన ప్రతిసారి అనుకుంటాను.)
రాయలేని థీమ్స్ అయితే కోకొల్లలు. మాండలీకం లో సౌందర్యాన్ని నేనెప్పటికీ నామినిలా చూపించలేను. గ్రానైట్ రాళ్ళ కార్మికుల గురించి, సింగరేణి కాలనీలో బ్రతుకుల గురించి, కౌమారదశలో ఉన్నగందరగోళం-అర్ధంలేనిచదువు గోల-పేదరికం-ప్రలోభాలు, దీనిని గురించి రాయాలనుంటుంది కానీ నిస్సహాయురాలినవుతాను. ఇలా ఎన్నో! ఆ జీవితాల్లో ఉన్న గాఢత భద్రమైన జీవితాల్లో ఎక్కడిది ?
*
చాలా బాగుంది అపర్ణా, మీ స్పష్టత చాలా నచ్చింది.
బావుంది ..అపర్ణా! ..నీ కలం తత్వాన్ని, చాలా సూటిగా చెప్పావు. గుడ్ ఒన్ అనిల్ డ్యానీ..
అపర్ణ, అనిల్ ఇద్దరికీ అభినందనలు
ఈమె కధల్లో అనుభూతి కన్నా జీర్ణించుకోలేనంత వాస్తవం ఉంటుంది. సాహిత్యంలో జీవన వాస్తవికతని చిత్రిస్తున్నప్పుడు అనుభూతుల పట్ల గౌరవం ఉన్న అపర్ణ కన్నా, కోపం ఉన్న అపర్ణ పాత్రలు కనిపిస్తాయి. విలక్షణ రచయత్రి. విలక్షణ వ్యక్తిత్వం కూడా. దేన్నీ దాచలేం కదా ! ఆమె సమాధానాల్నీ, నీ మంచి ప్రశ్నల్ని కూడా !
అభినందనలు
ఎంత బోల్ట్ గా సమాధానాలు చెప్పారో అపర్ణగారు..నాకు చాలా బాగా నచ్చింది తన శైలి.అలాగే ఉండాలి కూడా .
అనిల్ గారు మీరడిగిన ప్రశ్నలు కూడా బావున్నాయి..ఇరువురికీ అభినందనలు
“నా పాత్రలన్నీ తప్పు చేస్తాయి” ఇంతకన్నా స్పష్టత ఏం కావాలి. కొన్ని కథల్లో ఒకే పాత్రమీద కోపమూ, జాలీ రెండూ కలుగుతాయి.
ప్రశ్నలూ, వాటికి సమాధానాలూ…. బావున్నాయ్ 🙂 తాంక్ యు డాని అన్నా, కంగ్రాట్స్ అపర్ణా
చుట్టూ ఉన్నవారితో శాంతి సంబంధాలు నెలకొల్పడం ఆధునిక స్త్రీ👌👌👌అవును కాకుంటే తెగులు పట్టిన కొమ్మలు కొంత కఠినంగానే విరువాలి ముందు.ఇప్పటి వాళ్ళు ఎలా అయినా అర్ధం చేసుకొనివ్వండి. వాళ్ళ వాళ్ళ కొలత పాత్రలలో తూచి వాళ్ళు మాట్లాడుతున్నారు అని మనం అర్ధం చేసుకోవాలి.మన పిల్లలు ఎలా అర్థం చేసుకుంటున్నారో గమనించాలి.నా వరకు అయితే మా బాబు నా లక్ష్యాలు అర్ధం చేసుకుని ఎంకరేజ్ చేస్తాడు.పాత కథల వాళ్ళకి వాళ్ళ ముందు వ్రాసి హిట్ అయిన కథలే అడ్డంకి,వాళ్ళ శైలి మార్చుకోవడానికి.నా వరకు అయితే పెద్ద చిన్న లేదు ,అందరి దృష్టి కోణాలు యూనీక్ అనిపిస్తూ ఉంటుంది.కాకుంటే పాతవాళ్ళు కథ చక్కగా మలుస్తారు.కథకు పాత కొమ్మలు అవసరమే,ఇప్పటి మీలాంటి చిగుర్లు అవసరమే.ఎవరి శైలి తక్కువ కాదు,ఎక్కువ కాదు.శివా ట్రయాలజీ మా బాబు తరం వాళ్ళు అక్కున చేర్చుకోవడం నాకు ఆశ్ఛర్యమ్ అనిపించింది.ఇప్పటి తరాల ఆలోచనలు కొంత విశాలంగానే ఉన్నాయి,మనం వాళ్లపై మన భావాలు రుద్ధనంత వరకు.కీప్ రైటింగ్ అపర్ణ.మంచి ఇంటర్వ్యూ అనీల్ గారు 👌👌👌
“ఐడియల్ మెన్ లేనట్లే ఐడియల్ విమెన్ కూడా లేరు”. నిజం అపర్ణా! మంచి ప్రశ్నలు సంధించిన అనిల్ గారికీ, స్పష్టమైన జవాబులిచ్చిన అపర్ణకీ అభినందనలు!