ఆ మధ్య ఏదో సభలో అతిథిగా పాల్గొనడానికి మా కర్నూలుకు వెళ్లినప్పుడు కథకురాలు సుభాషిణి అడిగారు: మీ కథలను ఒక పుస్తకంగా వేశారా అని.
వేశాను గాని ఆ పుస్తకం ఒక ‘రహస్యం’. ‘రహస్యం’ సినిమా గురించి శ్రీశ్రీ చమక్కు ఒకటుంది. ఆ సినిమాయే ఒక రహస్యం, అది వచ్చి పోయినట్టు ఎవరికీ తెలీదు… అని శ్రీశ్రీ అన్నాట్ట. నా కథల బుక్కు కథ కూడా అంతే. అది వొచ్చిపోయినట్టు దాదాపు ఎవరికీ తెలీదు.
పెద్దగా వెలుగు చూడని ఆ కథా సంకలనం పేరు ‘కనిపించని చెయ్యి’. అది అచ్చయ్యీ కాకముందే ‘కనిపించని పుస్తక’మయ్యింది, టైటిల్ బలే కుదిరింది. 😊. రచయితలలోని ‘గెట్ పబ్లిష్డ్’ ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోడానికి పుస్తకాలు ‘ప్రచురించే’ ఒక ప్రచురణ కర్త చేతిలో పడి ఆ పుస్తకం ‘అదృశ్యమైంది’, నా చేతుల చమురు బాగానే వొదిలింది.
‘కనిపించని చెయ్యి’ సంపుటి లో 17 కథలున్నాయి. మహా భారతం మీద నాకున్న ఇష్టం వల్ల, భారతం లోని పద్దెనిమిది పర్వాల్లా ఈ పుస్తకంలో 18 కథలుండాలని, చైనా మహా కవి లూ సున్ గారి ‘పిచ్చివాడి డైరీ’ ని అనువదించి ఇందులో చేర్చాను. సరే, ఇప్పుడా పుస్తకమే కనిపించడం లేదు. తొందర్లోనే. ఆ కథలకు కొత్తగా రాసినవిఉ మరో 6 కలిపి, నేను అనువదించిన మరిన్ని కథలను కూడా కలిపి, ఈ సారి 30 కథలతో నా కథల పుస్తకం వొస్తుంది, ఆదరించెదరు గాక.
రానున్న కొతం పుస్తకంలో కథల లోంచి ఒక కథ ఇక్కడ. ఇప్పటికే అచ్చయిన కథే. కథ శీర్షిక ‘కొలిమి’. నిజానికి ఈ కథకు నేను పెట్టాలనుకున్న పేరు ‘ఫక్ ది వర్ ల్డ్’. ఆ పదంతోనే ఈ కథ ముగుస్తుంది. తెలుగు వాళ్ల అభిరుచికి ఆ పేరు పట్టదనిపించింది. కథకు ‘కొలిమి’ అని పేరు పెట్టాను.
కథ ఇతివృత్తం: వేశ్యావాటిక (బ్రోతల్ హౌస్) లో ఒక ‘సెక్స్ వర్కర్’ జీవితంలో ఒక సాయంత్రం.
మన కథానాయిక ఒకప్పుడు పల్లెటూరిలో చేతివృత్తులు ఆధారంగా చాల హుందాగా జీవించిన కుటుంబానికి చెందిన అమ్మాయి. బాల్యం ముగిసే నాటికి, కుటుంబం చితికిపోయి, చెట్టుకొకరు పుట్టకొకరైపోయారు. ఆమె వేశ్యావాటిక లో చేరుతుంది.
కథలో ‘కొలిమి’కి కీలక పాత్ర ఉంది. కొలిమి అంటే లోహాలను వేడి చేసే కొలిమి. కొలిమిలో పడిన వస్తువులు… వాటి లోహం ఎంత గట్టిదైనా… రూపాలు మారిపోతాయి. ఆ రూపాల మార్పు ప్రతిసారీ మంచికే జరగాలని లేదు. రూపు మారే లోగా అవి ఎంతగా కాలి కనలిపోతాయో!
అమ్మాయి కుటుంబానిది ఇనుప సామాన్లు బాగు చేసే చేతి వృత్తి. ఆ వృత్తికి గ్రామంలో చాల అదరణ ఉండేది. ఆమె బాల్యం గడిచే నాటికి ఆదరణ నశిస్తుంది. కుటుంబం చితికి పోతుంది. ఊళ్లో జనం వాళ్ల నాన్న దగ్గరికి రావడం క్రమంగా తగ్గిపోతుంది. ఇది చేతివృత్తుల కుటుంబాలన్నిటికీ ఎదురైన సంక్షోభమే. కొద్ది మంది మాత్రం వ్యవసాయంలో ప్రవేశించి నిలదొక్కుకున్నారు. కొందరు మాత్రమే చదువుకుని ఉద్యోగాలలో చేరి బతికిపోయారు.
అలా నిలదొక్కుకోలేకపోయిన కుటుంబాలే చాల ఎక్కువ. ఛిద్రమైన కుటుంబాలే ఎక్కువ. అందులో ఒకటి ఆ అమ్మాయి కుటుంబం.
ఒక సాయంత్రమంతా ఆమె మనసులో కదిలే గ్రామీణ పేదల ముఖచిత్రమే ఈ కథ.
సంసార స్త్రీలకు లేని స్వేచ్ఛ ఏదో వేశ్యలకు ఉంటుందని చాల మంది అనుకుంటారు. వసంతసేన, మధురవాణి అన్ని విధాలుగా కల్పిత పాత్రలే. వాళ్ల ‘స్వేచ్ఛ’ కూడా కల్పితమే. బాగా సంపన్న పురుషుల అండ దొరికిన చాల కొద్దిమందికి మాత్రమే వసంతసేన, మధురవాణి ప్రాతినిధ్యం వహీస్తారేమో. అత్యధికులది పరమ దయనీయ జీవితం.
మన కథానాయిక ఊళ్లో ఉండగా ఒక యువకుడామెను ప్రేమించాడు. లేదా కామించాడు. ముందుగా కోపం తెప్పించినా, వీడితోనైనా బతకొచ్చు అనిపించిన ప్రేమ అది. అతడిది వేరే కులం.
మొదటి ప్రేమ చూపుల వద్దనే ఆగిపోతుంది. రెండో ప్రేమ కాస్త ముందుకు నడిచి, ఆమెను వేశ్యా వాటికకు చేర్చుతుంది.
మొదటి ప్రేమ యువకుడు పట్నంలోని వేశ్యా వాటికకు వొచ్చి, తన కాసేపటి జోడీగా ఈ అమ్మాయిని ఎంచుకుంటాడు. అలనాటి ప్రేమ, అప్పటి తన ఉన్నతి గుర్తుకొచ్చి, అమ్మాయి నిరాకరిస్తుంది. వేశ్యావాటికను నడిపే మనిషి అమ్మాయిని తిట్టి, అతడితో గదిలోనికి పంపిస్తాడు. గదిలో అమ్మాయి వైముఖ్యం వల్ల ఆ యువకుడు సెక్సులో విఫలమవుతాడు. అందుకు ఈమె మళ్లీ తిట్లు తింటుంది. అమ్మాయి మదిలో ఆ ఆలోచన మెదిలి ఇప్పుడు విషాదంగా నవ్వుకుంటుంది. వేశ్యా వాటికకు వొచ్చి కింద రోడ్డు మీద కదిలే మగవాళ్లను చూస్తూ ఇలాంటి ఆలోచలెన్నో చేస్తుంది. ఇక్కడి నుంచి మరెక్కడికైనా వెళ్లి ఇంకేదైనా పని చూసుకుందామనుకుంటుంది. తెగించి బయటికి వెళ్తుంది, అక్కడి అనుభవాలతో ఇక ప్రపంచంలో ఎక్కడైనా బతెకొచ్చు అనుకుంటుంది.
1950, 60 వరకు గ్రామసీమల్లో చేతివృత్తుల కుటుంబాలు హుందాగా జీవించేవి. రైతులతో, ఇతర వ్యవసాయానుబంధ శ్రామికులతో కలిసిపోయి, అదే సమయంలో తమదైన ప్రత్యేకతను కాపాడుకుంటూ జీవించేవారు. చూస్తూ చూస్తుండగానే ఊళ్లలో చేతి వృత్తులు నాశనమయ్యాయి. (ఇప్పుడు వాటి ఆనవాళ్లు కూడా కనిపించవు). పరిశ్రమలు అందించే వస్తువులు వొచ్చి వాళ్లకు పనులు పోయాయి. కుటుంబాలకు కుటుంబాలు ఊరిడిచి పోయాయి.
ఊరిడిచి ఎక్కడికి పోయాయి? ఏమో. అర్థం కాదు. జస్ట్ అదృశ్యమయ్యాయి.
ఈ పరిణామాన్ని నా కథ చెప్పగలిగిందనే అనుకుంటాను. కథలో రొమాంటిక్ ఎలిమెంట్ ఏమీ ఉండదు. పచ్చి వాస్తవికతను, ఆ అమ్మాయి జీవితం మీద నాకు ఉన్న సానుభూతితో కథలో చెప్పడానికి ప్రయత్నించాను.
అప్పుడెప్పుడో ‘నవ్య’ వారపత్రికలో వొచ్చిన కథ ఇది. దీన్ని మొదట ప్రచురించిన జగన్నాథ శర్మ గారికి కృతజ్ఙతలు.
కథకుడిగా నా ప్రయత్నం ఎంత సఫలమయ్యిందో చెప్పండి.
*
కొలిమి
ఒక గది.
నాకు ఎంత పరిచితమో అంత పరాయిది.
ఎవరెవరో వచ్చి వెళతారు. వచ్చినప్పుడు నాకు నేను కాను.
ఎవరూ రానప్పుడు ఎవరో రావాలని ఎదురు చూస్తాను. ఎదురు చూడడం వ్యాపారం. ఎదురు చూపు ఫలించాక నాకు నేను కాకపోవడం కూడా వ్యాపారమే.
నాకు నేనే నా నేను కాకపోతే, ఇక ఈ గది నాదవుతుందా? ఇదెప్పుడూ పరాయిదే.
వచ్చినోళ్లకు కాసేపు నేనొక కొండ కొమ్మును. గిరి శిఖరాన్ని. వచ్చినోళ్లు నా శిఖరాలు, లోయల మీదుగా తమ నరాల తాళ్లు వేసి పాకుతారు. గోళ్ల పికాసులను కొండకు గుచ్చి వ్రేలాడుతూ పడి పోతామని భయ పడతారు. భయపడుతూ పైకి పాకుతారు. ఆయాసపడతారు. చెమట చెమట బురద బురద అవుతారు. తమ బురదలో తాము కాలేసి జారి పడతారు. కొందరు పైకెక్కి జెండాలు ఎగరేస్తారు. చిరిగిపోయిన జెండాలు.
వాళ్ళు జెండాలెగరేసిన చోట్లు, ఊపిరి ఎగపోసిన చోట్లు, అవి జీవితాలు కాదు, హత్యలు. ఆనవాళ్లు లేని హత్యలు. అవి హత్యలు అనే ఆనవాళ్ళు కూడా లేని హత్యలు. తమ మీద రక్తం మరకలు లేకుండా తుడుచుకుని వెళిపోతారు, చీకటి మూలల్లోనికి బొద్దింకల్లా.
చాల కాసేపయింది. ఎవడో వచ్చి వెళ్లాడు. వాడి ముఖం గుర్తు లేదు. నా ముఖం అటు తిప్పుకున్నాను. ఏదో చెడ్డ వాసన. వాసన ముక్కుకు సోకడమే కాదు. కళ్లకు కనిపించింది కూడా.
వాడెళ్లాడు.
మళ్లీ ముఖం కడుక్కున్నాను. మళ్లీ పౌడరేసుకున్నాను. వచ్చి వెళ్లిన వాడు వదిలి వెళ్లిన మసక వాసనలు తెలీకుండా ఘాటైన సెంటు చల్లుకున్నాను.
ఎప్పుడూ ఇంతే. ఏవో వాసనలను మోస్తుంటాను. ఎప్పుడూ ఎవరిదో ఒకరి వాసనను. ఎప్పుడో భవిష్యత్తులో నలుగురు మనుషులు నన్ను మోస్తున్నప్పటి వాసనను కూడా ఇప్పుడే మోస్తుంటాను. నేను జీవిస్తున్నాను అనడం తప్పు. నేను మరణిస్తున్నాను.
ఎప్పుడూ అనిపిస్తుంటుంది. ఇప్పుడైతేనేం మరి యాభై యేళ్లకైతేనేం. ఏమిటి తేడా. మోయడానికి నలుగురైతేనేం ఎందరైతేనేం.
ఎదురు చూస్తున్నాను.
మరణం కోసం కాదు.
బేరం కోసం.
వాటీజాల్దిస్ అంటారా? పోనీ, ఏంటిదంతా అంటారా?
ఆ మాత్రం ఇంగ్లీషు నాకు తెల్సు. దానికి ఏ టీవీ యాంకర్గానో ట్రైనింగ్ అక్కర్లేదు. భాషలు నా ప్రొఫెషనల్ హజార్డ్. ఈ ప్రమాదపు పని మొదలెట్టి చాన్నాళ్ళయింది.
నాకు సంస్స్కృతం కూడా రాదు. ఇతర్లు మాట్లాడేది విని అనుకరిస్తుంటానంతే. ఆ సంగతి యితర్లకు తెలీదు. నటనతో సహా సకల కళలు ఈ పరాయి గదుల్లోనే తయారయి వుంటాయని నా అనుమానం. కళలు ఇక్కడి వాళ్లకే ఎక్కువ అవసరం.
ఇంగ్లీషు బాగా వచ్చినా బాగుండు. మీకు తెలిసేలా చెప్పే దాన్ని.
మీరంటే ఇష్టం నాకు. నా మీద మీ ఇష్టం నాకు ఇష్టం. ఇక్కడ ఇష్టం ఒక సరుకు. అమ్మబడును కొనబడును.
కాసేపు నన్ను మీరు ఇష్టపడేట్టు చెయ్యడం నా పని. అదే నా వ్యాపారం. అందుకని నాకు ద్వేషం లేదు. అస్సలు ద్వేషమే లేదు. ద్వేషం మీద కూడా ద్వేషం లేదు. నేను పోరాడను. లోంగిపోతాను, డబ్బుల్తీసుకుని లొంగిపోతాను.
నేనొక సెక్స్ వర్కర్ని. ఇది కాకుండా నేను ఇంకే వర్కర్ అయినా అవగలిగితే బాగుండు. నేను ఈ సరకును కాకుండా ఇంకేదైనా అమ్మగలిగితే బాగుండు.
ఇదైనా ‘వర్క్’ చేస్తుందా అని చూస్తున్నా. ఎదురు చూస్తున్నా. చాన్నాళ్ళయింది. ఎదురు చూడడం అలవాటయిపోతోంది.
ఎందుకో తెలీదు, నా ఎదురు చూసే సమయం రాను రాను పెరుగుతోంది.
బాగా ముసలి వాడి పాలబడినట్టు అప్పుడప్పుడు నేను భాషల వలలో పడుతుంటాను. ఒకసారి తిట్లు, ఒకసారి పాటలు. నాట్యాలు. నాకు అన్నీ వొచ్చు. అవసరం అన్నిటినీ నేర్పింది.
నేను ప్రేమ భాషల మీద ఆధారపడుతుంటాను, పడిపోతూ పట్టుకోడానికి ఇంకే దారం లేక.
దారం అంటే ఏంటని ఆడుగుతారా?
ఒకసారి ఒకడొచ్చాడు. మా ఊరోడు. ఇక్కడికి వచ్చే వరకు నేను ఇక్కడుంటానని తెలీదు వాడికి. లేక తెలుసో.
వాడూ వాడి స్ఫోటకం మచ్చల మొగమూ.
వాడిది మా ఊరే. వాడి ఇల్లు కూడా అప్పుడు మా ఇంటికి దగ్గరే. చిత్త కార్తె కుక్క వాసన తగిలేది వాడి చూపు తగిలినప్పుడు. మొదట వాడికి ఒంటరిగా దొరుకుతానేమో అని భయమేసేది. తరువాత దొరుకుదామనిపించేది.
ఏదో పని మీద ఎవరిదో గడ్డి వామి వెనక్కి వెళ్తే వీడెందుకో అక్కడ వున్నాడు. ఏం మాట్లాడలేదు. ఉన్నట్టుండి వాడి చిరిగిన ఖాకీ నిక్కరు విప్పి నిలబడ్డాడు. అమ్మడానికి చీరె చూపించే అంగటోని మాదిరి. నాకు అసయ్యం వేసి పారిపోయానప్పుడు.
ఇక్కడికి వచ్చినప్పుడు వాడు బయట మా ఓనరుతో మాట్లాడుతుంటే, అది జ్ఞాపకం వచ్చింది. వొళ్ళు కంపరమయ్యింది. నన్ను చూసుండడులే అనుకున్నా.
ఓనరు పిలవనే పిలిచాడు. అప్పుడు ఖాళీగా వున్న ముగ్గురిలో నేనూ వున్నా. అక్కడ వాడు కాకుండా ఇంకా ఇద్దరున్నారు. మా ఊరోళ్లు కాదు. నాకు తెలియనోళ్లు. వాడు నేను కావాలన్నాడు. నేను వాడితో పోనన్నాను. వేరే ఇద్దరిలో ఎవరితోనైనా పోతానన్నాను. ఓనరు కోప్పడ్డాడు. ఏం ‘ఏమన్న దారం కట్టుకున్నవా’ అన్నాడు.
నేనేం దారం కట్టుకోలేదు.
వాడితో పోక తప్ప లేదు. వాడు ఎంతసేపటికి తయారు కాడు. వాడు తయారు కాకుండా చేయడమెలాగో నాకు తెలుసని వాడికి తెలియదు. తనకు చాతకాని సంగతి బయట చెప్పొద్దని ఓనరుకు తెలియకుండా పది రూపయలిచ్చాడు. వెళ్లిపోయాడు. పాపం వాడు మళ్లీ వస్తే అలా చెయ్యొద్దనుకున్నాను. వాడంటే నాకెందుకు కోపమో చెబుదామని కూడా అనుకున్నాను. వాడు మళ్లీ రాలేదు.
గడ్డి వామి కాడ కోపం వచ్చినా, తరువాత వాడితో మాట్లాడాలని ఉండింది నాకు. ఎవడో ఒకడు, గాజులకు అడ్డంగా ఉంటాడేమో అని. వాడు వాళ్లన్నతో కలిసి మా కొలిమి దగ్గరికి వచ్చే వాడు.
కొలిమి ఏంటి అంటారా? మా నాన్న ఇనుము పనులు చేసే వాడు. ఆ పని వల్ల మా కుటుంబానికి చాల గౌరవం వుండేది. మా నాన్నకు అది తప్ప ఇంకో పని రాదు. ఆ పనిలో ఆయన దిట్ట. ఒకసారి చూస్తే చాలు, ఏ ఇనుప వస్తువైనా చేసేస్తాడని అనేవాళ్లు అందరూ.
మొదట్లో మా ఇల్లు ఊరి మధ్యనే వుండేది. అక్కడే కొలిమి, గాలి తిత్తులు, బాడిస వంటి పనిముట్లు అన్నీ వుండేవి. నాకు కాస్త రెక్కలు ఆడే వయసు రాగానే తిత్తుల తాడు పట్టుకుని పైకి కిందికి ఎగురుతూ, కొలిమి మండించే దాన్ని.
కొలిమిలో మంట రేగితే అది నా వల్లనే జరిగిందని ఆశ్చర్యంగా చూసే దాన్ని.
అంత గట్టి ఇనుప వస్తువులు కొలిమిలో కాలి, మెత్తబడి, బంకమట్టిలా, మా నాన్న ఏ రూపం ధరించమంటే ఆ రూపం ధరించేవి. మా నాన్న సృష్టి కర్త, దేవుడు అనిపించేది నాకు.
నాన్న దగ్గరికి ఎవరెవరో వచ్చే వాళ్లు. కొడవళ్లు, నాగలి కర్రులు, బండి చక్రాల కమ్ములు, బండి ఇరుసులు బాగు చేయించుకునే వారు. కొత్తవి చేయించుకునే వారు.
నేను పెరిగి పెద్దయ్యే కొద్దీ నాన్నకు పనులు దొరకడం తగ్గిపోయింది. రాను రాను మా యింట్లో బువ్వకు గడవడం కష్టమై పోయింది.
ఇంట్లో నేనే పెద్దదాన్ని. దీని పెండ్లి ఎట్టా జేస్తామబ్బా అని అమ్మ నాన్న అనుకోడం వినే దాన్ని. వినగా వినగా, పెండ్లి కాకపోతే నాకు బతుకే లేదని అంత చిన్నప్పుడే అర్థమయిపోయింది నాకు.
చెప్పానా?…
నా పేరు రాజేశ్వరి. ఆ రాజేశ్వరి కాదు. ఆమెకేం, అమెకు వొదిలెయ్యడానికి ఒక బొర్ర కలిగిన బాపన మొగుడు ఉండినాడు. లేచిపోడానికి అక్కడికి వొచ్చే పోలీసోడు ఉండినాడు.
నాకు మొగుడని ఒకడుంటే, వాడికి ఎంత పెద్ద బొర్ర వున్నా వొదిలెయ్యను. ఎంత పెద్ద మైదానం కోసమైనా వెళ్లిపోను.
మా అమ్మ నాయన చెడ్డ వాళ్లు కాదు. జెనరల్ అమ్మ నాన్నల్లాగే మంచి వాళ్లు. వాళ్లు ఎవరు, ఏ ఊరు అని అడక్కండి. చెబుదామని వుంది. నాకూ కుంచెం వంశ వృక్షం వుందని చెబుదామని వుంది. కాని, ఇప్పుడు నేనున్న స్థితిలో చెప్పను
నాన్న బాడిసె పట్టుకుంటే అయన చెయ్యి ఎంత వొడుపుగా కదిలేదో! నేను నాన్న చెయ్యినే చూస్తూ వుండే దాన్ని.
గడ్డి కోసి గడ్డి కోసి కోసి, పంట కోతలకు ఉపయోగించీ ఉపయోగించి ప్రతి ఏటా కొడవల్లు మొద్దుబారేవి. వాటిని నాన్న దగ్గరికి తెచ్చే వాళ్లు జనం. నాన్న వాటిని కొలిమి నిప్పుల్లో పెట్టి నిప్పుల మీదికి తిత్తి వూదే వాడు.
తిత్తి వొక వైపు. నిప్పుల కొలిమి యింకో వైపు. గాలి తిత్తి చివర తాడు లాగుతూ నేను.
రాను రాను ఊరు మారిపోయింది. రైతులు నాన్న దగ్గరికి రావడం తగ్గించారు. కొత్త కొడవళ్లూ అవీ పట్నంలో కొని తెచ్చుకునే వారు. అమ్మ పొలం పనులకు వెళ్లడం కుదరదు. అది మా వంశాచారం కాదు. నాన్న అప్పుల పాలయ్యాడు. ఇల్లు అమ్ముకున్నాడు. కుటుంబాన్ని ఊరి చివర బిచ్చగాళ్ల సత్రానికి మార్చేశాడు. అక్కడే కొలిమి పెట్టి చిన్నా చితక పనులు చేసే వాడు. నేను అక్కడి నుంచే సర్కారు బడికి పోయే దాన్ని. ఊళ్లో వున్న ఆరేడు తరగతులయ్యే సరికి నాన్నకు ఏదో జబ్బు. మనిషి ఉన్నట్టుండి తారి పోయాడు. వైద్యం పాడూ యేమీ లేదు. దానికి డబ్బులేవీ? తనకేం జబ్బో తెలీకుండానే నాన్న పోయాడు.
అమ్మ, నేను కలిసి కొలిమి పని కొనసాగించాం. మాకు వచ్చిన పని తమ్ముడికి నేర్పించే వాళ్లం. వాడు పెద్దాడై, ఇంటికి మగదిక్కు అయితే, మా కష్టాలు గట్టెక్కుతాయని అమ్మ అనుకునేది. పిచ్చి తల్లి. పని చేసేటోడు లేక కాదు. చేతి పనులు అనేవే లేక ఒక పని వాడు వెళ్లిపోయాడు. నాన్న వెళ్లిపోయాడు. ఇంకొకడికి పనులు ఎక్కడ? పనులు లేకుంటే బతకడమెలా?
అవే పనులా? వేరేవి పనులు కావా? మనకు ఎవరో నిర్ణయించినవే పనులా? నాన్న గిరాకీ లేని ఆ పని మానేసి ఇంకో పని ఎందుకు చూసుకోలేదు? అనుకుంటే వారం రోజుల్లో నేర్చుకునే పనులేం లేవా లోకంలో? ఒక పనికి అతుక్కుపోయి ఎందుకు కునారిల్లడం నాన్నలా?
ఆ మచ్చల మొగం వాడు అప్పుడప్పుడు పని మీద మా ఇంటికి వచ్చే వాడు. గడ్డి వామి కాడ ఎక్స్పోజింగుకు కోపం వచ్చినా, నన్ను తనతో లేపుకుపోతానని వాడు నన్ను అడగాలని అనిపించేది. అడిగితే వాడితో లేచిపోవడం బాగుంటుందని అనిపించేది. అప్పుడు అడగక పోగా, ఇప్పుడు మళ్లీ అలాగే, కాసేపటి కోసం నన్ను కొనుక్కుంటాననే సరికి కోపం వచ్చి అలా చేశాను వాడికి.
కొన్ని సంగతులు అలా జ్ఞాపకం ఉంటాయి. గుర్తుకొచ్చినప్పుడంతా బాధ పెడతాయి.
రోకళ్ల మొరటు తాకిడికి రాతి రోలు కూడా సొట్టలు పడుతుంది. ఇలాంటి జ్ఞాపకాల తాకిడికి మనసు సొట్టలు పడకుండా వుంటుందా?
ఇంతే. ఇదింతే. ఇది ఆగదు.
ఏది? ఏది ఆగదు?
ఏదీ! ఏదీ ఆగదు!! ప్రతిదీ ఎగురుతుండాల్సిందే, ఎలా పడితే అలా. ఎలా ఎగిరినా ఫర్లేదు. ఎగరాలంతే.
కసి ఏమీ లేకపోయినా చాల కసి వున్నట్టు అరవాలి, ఊరేగింపులో.
ఎక్కడా ఏమీ కదలకపోయినా దేహమంతా కదిలిపోయినట్టు నిట్టూర్చాలి, రతిలో.
తడి లేకపోతే పెదాలు ఎంగిలి చేసుకోవాలి. రసాయనికంగా పండిన యాపిల్ పళ్ళ మాదిరి.
ప్రతిదీ మారకానికే.
మారకం అంటే? ఏది చంపుతుందో అదా? హహ్హహ్హ, ఏదీ మనల్ని చంపదు. మనల్ని మనం చంపుకుంటాం. ఒకర్ని ఒకరం, ఎవర్ని వాళ్లం.
ఏం చేయను.
పొద్దుట్నించీ ఒక్కతిని ఉండిపోయాను. రాత్రి కూడా ఒక్కతినే. ఇక్కడ చాల మంది ఒక్కతిలలో నేనూ ఒకతిని. ఎవరికి వాళ్లం ఒంటరులం..
పక్కన తను ఎందుకో ఏడుస్తోంది. తనకు ఏదైనా జబ్బేమో?! జాగర్తగా వింటున్నా. నా వంతూ వస్తుంది. ఏడుపును నేర్చుకుని ఉంచుకోవాలి. తన ఏడుపు అయిపోయాక నేను ఏడవాలి. అంతఃపురాల్లో కోప గృహాలు అనేవి ఉండేవట. ఇక్కడ అన్నీ ఏడుపు గదులే.
ఆ అమ్మాయి నాకు తెలుసు. ఇద్దరం ఒకడినే ప్రేమించాం ఒకప్పుడు. మేము లవ్ మేట్స్ అన్న మాట. తను నా కన్న పెద్దది. ఇద్దరం ఒక ఊరి వాళ్లమే. బజార్లు వేరు. ఇద్దరం ఫ్రెండ్సుమే. అయినా, ఒకరి ప్రేమ ఒకరికి అప్పుడు తెలీదు, మా ఇద్దరికి.
పరీక్షలో రాబోయే ప్రశ్న నా ఒక్క దానికే తెలిసుండాలని అప్పుడెప్పుడో ఒకసారి చీకట్లో సారు రమ్మంటే పోలేదూ. అలాగే.
ప్రేమ అనేది… పరీక్ష కన్నా పెద్దది కదా?! ఇంకా పెద్ద రహస్యం కదా?!
అంత పెద్దది కాకపోతే కథల్నిండా, నాటకాల్నిండా అదే ఎందుకుంటుంది? భూసురుడేగెనో లేదో అని ఒకామె రాగాలు ఎందుకు తీస్తుంది? సిన్మాల్లో వాళ్లు… ఎడారిలో ఇనుప గొలుసులు మోసుకుంటూ పాట పాడుతూ ఎందుకు నడిచి వుంటారు? తన మీద తన చుట్టూ సమాధి కడుతుంటే ఎందుకు అలా నుంచుని ఉంటారు… రోమియోలూ అనార్కలీలు?
అవును. ఒక్కడినే ప్రేమించాం ఇద్దరం. అది మా ఇద్దరికీ తెలీదు.
నాన్నకు ఇంకో పని తెలియదు. ప్రేమ ఉన్నా లేకున్నా పెండ్లి లేకపోతే బతకడమెలాగో నాకు తెలీదు. ఎవడేనా, ఎంత తలకు మాసినోడైనా దొరుకుతాడని ఎదురు చూసే దాన్ని.
మా కుటుంబం చితికిపోతున్నప్పుడే, ఆ మచ్చల మొగమోడికి బదులు కాస్త ఎర్రగ బుర్రగ ఉన్నోడొకడు, నా వైపు… కళ్లతోనే బట్టలు వొలిచి… చూడడం మొదలెట్టాడు. అది ప్రేమ అనుకున్నాను. పెండ్లి చేసుకుంటాడనుకున్నాను. వాడు ఏ గోడల వెనక్కి రమ్మంటే అక్కడికి వెళ్లాను..
లేచి పోదామన్నాడు వాడు. నాకూ బాగుంది, లేచిపోవడం. నాకేం తెలుసు అప్పటికి మరెందరో అట్టాగే వాడితో లేచి పోయారని.
లేచిపోయి ఇక్కడ ఈ గదిలో చేరాను.
వాడిని ప్రేమించింది, పెండ్లి చేసుకుంటాడని లేచిపోయింది మేమిద్దరమో లేక ముగ్గురమో? ఎందరమో, సంఖ్య అవసరమా?
ఒకరి తరువాత ఒకరిని ఇక్కడకి చేర్చాడు వాడు మమ్మల్ని. ఇదేం జైలు కాదు. కాని ఈ పని ఒక్కటే మాకు తెలుసు బతకడానికి. ఈ పనినే మా పనిగా మార్చుకున్నాం. ఒక సారి ఉచితంగా మోసపోయే బదులు రోజూ కొన్ని సార్లు డబ్బుకు మోసపోతున్నాం. మోసపోయినట్టు నటించి పెడుతున్నాం. ఆడదాన్ని మోసం చేశాననుకుంటే గాని సంతోషం కలగదు మగాళ్ళకి. అందుకే వాళ్లు చెప్పింది చెప్పినట్టు వింటాం. పదాల వెనుక ఏముందో చూడం. అందుకే, చివరికి ఇక్కడ ఇట్టా కలిశాం, ఎవరికి వాళ్లం, వాడి ప్రేమ అచ్చం నాదే అనుకున్న వాళ్లం ఇద్దరమో, ముగ్గురమో, ఎందరమో.
కింద ఎవడో రోడ్డు మీద నడుస్తూ ఆగాడు. వాడు ఆగడంలోనే తెలుస్తోంది. ఒకట్రెండు సార్లయినా కండోమ్ కొనడానికి షాపు దాక వెళ్లి వుంటాడు వీడు. కొని వుండడు.
వాడు ప్యాంటు జేబులో చెయ్యి పెట్టాడు. జేబులో ఏమిటో తడుముకుంటున్నాడు. ఇటేపు చూడగానే ఎడం కన్ను మూసి తెరిచాను. కొంచెం తల ఊపాను వాడి పాత ఫ్రెండులా.
మళ్లీ ఎందుకేనా మంచిదని, స్కర్టు కొంచెం పైకి లాగి మోకాలి మీద గోక్కున్నాను పరధ్యానంగా చూస్తో ప్రాక్టీస్చేసిన కళ్లతో.
వాడు కొంచెం మొహమాటపడ్డాడు. మొహమాటం కాకుండా ఇంకేదో వాడి జేబులోంచి పడిపోయినట్లు, అందుకు ఉలిక్కిపడినట్లు నటించాడు. జేబులోంచి చెయ్యి తీసి తల వంచి రోడ్డు మీద వెదుక్కుంటున్నట్టు అటు యిటు చూసి వెళ్లిపోయాడు.
ఫకిట్. అది కుదిరే బేరం కాదు. ఆయినా వాడు జేబులో చెయ్యి పెట్టి తడుముకున్నది మరేదేదో అనుకున్నాను, వాడు వెదుక్కున్నది జేబులో లేని పర్సునేమో.
నా సీనియర్ ఇప్పుడు ఏడవడం లేదు. ఎప్పుడు తయారయ్యిందో ఏమో నీటుగా తయారయి నాలాగే సొలిసిటింగ్ చేస్తోంది. నా వైపు చూసి విషాదంగా నవ్వింది. ‘ఇంట్లో ఎవరో పోయారు’ అంది. ఎవరో చెప్పలేదు. ఇల్లు అనే సరికి మా అమ్మ గుర్తొచ్చింది.
మొన్ననే తెలిసింది. మా అమ్మ చనిపోయిందట. తమ్ముడు ఊరొదిలి ఎటో వెళ్లాడట. బహుశా, ఎక్కడో ఏదో పని చేసుకుని బతుకుతున్నాడు. ఊళ్లో అయితే, అలా ఏదో ఒక పని చెయ్యలేడు. కుటుంబం పనిని వదలలేడు. అందుకే ఊరొదలడం. నేను ఇక్కడి నుంచి బయటపడినా, వెళ్లడానికి ఒక స్థలం అంటూ ఏదీ లేదు.
ఎదురుగా పేవ్మెంటు మీద మదార్సాబు బంకు. బంకు ముందు బాలెలో నూనె సల సల కాగుతోంది. పాపాలు చేస్తే చచ్చి పోయాక అలా బాలెలో నూనెలో వేయిస్తారట.
చచ్చిపోవడం అంటే ఏమిటి? చచ్చిపోయినాక ఉన్న ఒకే ఒక్క శరీరాన్ని తగలెట్టడమో పూడ్చిపెట్టాక పురుగులు తినెయ్యడమో అవుతుంది కదా? చచ్చిపోయినాక మనం ఉంటామా? మనం ఉండకపోతే బాలెలో నూనెలో మనల్ని ఎలా వేయిస్తారు ఎవరైనా? ఏంటో, అవన్నీ మనకెందుకిప్పుడు?
ఎవడో ఒకడు రావాలంటే, వచ్చి వెళ్లే ముందు డబ్బులివ్వాలంటే, అప్పటికి నేను చావకుండా ఉండాలి కదా?! ఇది కూడా దాదాపు అట్టాంటి… బాలెలో వేగడం లాంటి పనే కదా. నేను ప్రతి రోజూ.. కుదిరితే ప్రతి గంటా… చేసే పని అదే కదా, బాలె బదులు మంచం. వేగడం, కిందా పైనా మంటలతో?
చచ్చిపోయాక, ఈ శరీరం కూడా లేకుండా, ఎలారా బాబూ మీతో ‘వేగడం’?
వేగిన తరువాత మదార్సాబు కొట్టు కాడ తందూరి కోడిని మొత్తంగానో, ముక్కలుగానో, ఎవరెవరో కొనుక్కుపోతారు. ఎంచక్కా తినేస్తారు. అంతే. ఖేల్ ఖతం, దుకాణ్ బంద్.
ఈ మాట అనుకోగానే నాలో ఏదో మెరిసినట్టయింది. అది నా లోపల ఎప్పటి నుంచో తయారవుతోంది కాబోలు.
నేను కూడా తమ్ముడిలా ఎక్కడికో వెళ్లి ఏదో పని ఎందుకు చేయగూడదు? ఏం చేయాలన్నా కావాల్సిన మాటకారి తనం, నయతారంగా మోసం చేయడం నాకు తెలుసు. అది రోజూ చేస్తున్నదే. మోసం చేయగలిగితే ఏ పని అయినా చెయ్యొచ్చు. దానికి ఈ పని అని కాదు. ఈ స్థలం అని కాదు. ఏ ఊరయినా ఫరవాలేదు, ఏ పని అయినా ఫరవాలేదు. దానికి ఎంత మోసం అవసరమైనా ఫరవాలేదు. ఆ పని కోసం ఇప్పుడు నేర్చుకున్న కళలన్నీ వాడుకోవచ్చు నేను. ఎప్పుడేనా కావాలంటే కొంచెం ప్రేమను కూడా వాడుకోవచ్చు, కూరలో ఉప్పూ కారంలా, జాగర్తగా.
ఎందుకో ఇప్పుడు చాల ధైర్యం అనిపిస్తోంది.
కొలిమి లోంచి తీసి, వంపులు సరి చేసి, నీళ్లలో వేసి తీసిన కొడవలిలా కనిపిస్తున్నాను నాకు నేను.
లోపలికి వెళ్లి ఉన్న కొన్ని బట్టలు సంచిలో సర్దుకుని, సంపాదించిన నాలుగు డబ్బులు దానిలోనే దాచుకుని గది బయటికి బయల్దేరాను. కొలిమి బయటికి. బయటి బేరానికి వెళ్తున్నాననుకుని ఎవరూ ఏమీ అడగలేదు. ఓనరు పైన వుంటాడు. నమ్మకం మా మీద.
అతడిని మోసం చేస్తున్నానా? నవ్వొచ్చింది.
ఆ సెంటిమెంటే వొద్దు.
ఫక్ ది వరల్డ్.
(నవ్య వీక్లీ 15-11-2017)
కథలు చదివిస్తుంటాయ్ తరుచుగా. కానీ కొన్ని కథలు మాత్రం వెంటాడుతుంటాయ్ అరుదుగా. నే చదివిన కథల్లోని అరుదైన జాబితాలోకి చేరిందీ కథ.
పడింది అడుగు . మోసమే మొదటి అడుగు బతకటానికి .
Yes fuck the world