గేదె మీద పిట్ట చెప్పిన కథ!

మీకు నచ్చిన నవలల గురించి- తెలుగు అయినా, అనువాదాలైనా సరే- రాయండి. మీ రచనలు editor@saarangabooks.com కి పంపించండి.

తెలుగు సాహిత్యం లో మనకున్న అతి కొద్ది గొప్ప రచయితలలో తల్లావఝ్జుల పతంజలి శాస్త్రి  గారు ఒకరు .. ఇటీవల నేను చదివిన ఆయన నవలిక “ గేదె మీద పిట్ట”. ఈ  పేరు వినగానే ఈ నవల దేని గురించి అని ఆలోచించటం సహజం. అబ్బే, అలా తెలిసిపోయే శీర్షికలు పెట్టే సాధారణ రచయిత కాదు పతంజలి శాస్త్రి గారు. ఈ నవల శీర్షిక మాత్రమే కాదు, నవల ఇతివృత్తం కూడా అమ్మో అనిపించేదే. శాస్త్రి గారి పేరు, వయస్సు తెలిసిన వారు ఇలాంటి నవల ఆయన కలం నుంచి వచ్చిందంటే కొంత ఆశ్చర్యానికి గురవుతారు. ఆయన తన కాలానికంటే ఎప్పుడూ ముందుండి మరింత ఎత్తు గా, లోతు గా ఆలోచిస్తారు. అదే ఆయన లోని విశిష్టత.

ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ, ఆయన రచనలు చదివిన కొద్దీ, అవి అర్థం చేసుకునే ప్రయత్నం లో మనం ఆయనకు, ఆయన మనకు ప్రీతిపాత్రులవుతాము. పాఠకుల మీద గౌరవం, అభిమానం తో పాటు వాళ్ళకు సాహిత్యానుభవం  కలిగేందుకు ఆయన రచయిత గా తన వైపు నుంచి కృషి చేస్తారు . కాలక్షేపం కోసం బఠానీలు తింటూ చదివేది కాదు శాస్త్రి గారి సాహిత్యం. ఆయన ఏం చెప్తున్నారో ఆగి ఆలోచించి ఆయనతో పాటు ఆయన సృజించిన పాత్రల జీవితాల్లోకి వెళ్ళి మళ్ళీ బైట కు వచ్చి వాళ్ళ గురించి ఆలోచించి, ఆవేదన చెంది, వాళ్ళ బతుకుల గురించి మనం మరో కథను మన మనస్సుల్లో ఊహించుకుంటాము. ఇది శాస్త్రి గారిని ఇష్టపడి చదువుకునే పాఠకులందరికీ అనుభవైకవేద్యమే. ఆయన రచనలు చదువుతున్నప్పుడు మనం స్థల కాలాలు లేని మరో ప్రపంచం లోకి వెళ్లిపోతాము. రచన లక్ష్యం అదే. అందరూ రచయితలు సాధించలేని అసాధరణమైన విద్య అది. శాస్త్రి గారి లాంటి ఏ కొద్ది మందికో తెలిసిన మాజిక్ అది. ఆ మంత్రగాడి లోకం లోకి వెళ్దాము పదండి.

అద్దం ముందు ఆది !

కథ ఆది నారాయణ మూర్తి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇది ఆదినారాయణ మూర్తి కథ అనుకోవటానికి వీల్లేదు. ఈ కథ ఆది నారాయణ మూర్తి ది, ఆది ప్రకాష్ ది, పూర్ణ ది, నిర్మలది, బీర్ ది, నిరుద్యోగానిది, డబ్బు ది, సెక్స్ ది, సిగరెట్ ది, సెల్ ఫోన్ ది, హైదరాబాద్ నగరానిది.

ఆది ఓ మామూలు మధ్యతరగతి నిరుద్యోగ సివిల్ ఇంజనీరు. హైదరాబాద్ లో ఆదినారాయణ మూర్తి లాంటి జీవులు వేలల్లోనే ఉంటారు. ఉన్నారు. మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. అలాంటి ఆది ఆది ప్రకాష్ గా రూపాంతరం చెందుతాడు. అది లార్వా , ప్యూపా దశ లు దాటి సీతాకొక చిలుక గా మారటం కాదు. మరి? ఏమో? మనిషి మగవాడి గా మారటం, లేదా మనిషి డబ్బు గా మారటం, వ్యక్తి ఆస్తి గా మారటం, మొగుడు కారు గా, ఇంటి స్థలం గా మారటం. ఒక వ్యక్తి ఇలా మారటం వెనుక భార్య, కూతురు, తండ్రి, యజమాని, ఉద్యోగం, స్నేహితులు, పబ్ లు, విస్కీ లు, బీర్లు అన్నీ ఉంటాయి. భర్త మరో గది లో పడుకున్నా పరవాలేదు. చేతి లో జీతం డబ్బులు పడితే చాలు అనుకునే పూర్ణ లు ఉంటారు. కొడుకు మరో స్త్రీ తో కారు లో కనిపిస్తే, చెడు దోవ లో కొడుకు వెళ్తున్నాడని తెలిసినా, కోడలు కి తెలియకుండా, కుటుంబం విచ్చిన్నం కాకుండా ఉంటే చాలు అని లోపల్లోపల మథన పడిపోయే తండ్రి ఉంటాడు. వ్యక్తి కుటుంబం నుంచి విడివడి సమాజం లో ఒక భాగమై, ఒక పుండు గా, ఒక నేరం గా, ఒక వృత్తి గా మారటం వెనుక ఉండే కారణాల్ని ఈ నవల లో చూపించారు శాస్త్రి గారు. ఒళ్ళుఅమ్ముకునే వేశ్యల “ రెడ్ లైట్ “ జీవితాల గురించి సాహిత్యం లో మాట్లాడారు ఇప్పటి దాకా. ఆధునిక జీవితపు రెండో కోణం మగ వేశ్యల గురించి ఇంత ఓపెన్ గా , లోతు గా మాట్లాడిన రచన తెలుగు సాహిత్యం లో, ఆ మాట కొస్తే భారతీయ సాహిత్యం లో ( నా పరిమిత పఠనం లో ) ఇదొక్కటే అని చెప్పగలను.

ఆది ప్రకాష్ చేసినది నైతికత, అనైతికత త్రాసు లో వేసి చర్చించలేదు శాస్త్రి గారు. అలా అని ఇలా చేయటం కరెక్టు అని సమర్ధింపు కూడా చేయలేదు. ఒక రచయిత విద్యుక్త ధర్మం గా తనకు తెలిసిన ఒక విషయాన్ని అనేక ముఖాల వైపు నుంచి రచించారు.  నగర జీవితపు కొత్త మొహం ఈ మేల్ ప్రాస్టిట్యూషన్. నవల లో ఎక్కడా రచయిత కనపడడు. ఆయన అభిప్రాయం కూడా. మనుష్యుల పట్ల ఆయన అవగాహన అక్షరక్షరం కనిపిస్తుంది. ఒక్కో పాత్రను  లోపలి పొరలతో సహా భూతద్దం లో వేసి చూపించారు.

ఆది నారాయణ మూర్తి, పూర్ణా – ఇద్దరి మధ్యా చక్కటి బాంధవ్యం. ఉద్యోగం లేని మొగుడు. టీచరు ఉద్యోగం చేసే భార్య. మామ గారి పట్ల కోడలు కి అభిమానం, ప్రేమ, గౌరవం. మనవరాలికి, తాతయ్య కు మధ్య చక్కటి అనుబంధం. ఈమాత్రం కూడా సఖ్యత, నిలకడ లేని కుటుంబాలు నగరం లో ఎన్నో కదా.. కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఫామిలీ అనుకోవచ్చు. చదివిన సివిల్ ఇంజనీరింగ్ కి సరైన ఉద్యోగం లేక కన్స్స్ట్రక్షన్ కంపెనీలో ఒక చిన్నఉద్యోగం చేస్తుంటాడు ఆది నారాయణ మూర్తి. కథ మామూలుగా మొదలైంది. నెమ్మదిగా పరిస్థితులు మారాయి. ఆదినారాయణ మూర్తి  కాస్త ఆది ప్రకాష్ గా మారాడు. ఏ వాక్యం లో ఆది ఉంటాడో,ఏ వాక్యం లో ఆది ప్రకాష్ ఉంటాడో చదువుతున్నప్పుడు గుర్తిస్తాము. భార్య భర్తల పడక గదులు మారాయి. ఇద్దరి మధ్యా పోట్లాటలు ఏమీ లేవు. కానీ కొన్ని సార్లు కుటుంబాల్లో ఆ మార్పు చాలా సహజంగా జరిగిపోతుంది. కారణాలు వేర్వేరు అయినప్పటికీ. ఆది కి పూర్ణ మీద గౌరవం. ఆది కి తాను చేస్తోంది ఉద్యోగమే అన్నంత ధీమా. కథ లో అక్కడికి వచ్చేసరికి నాకు బ్రేక్ పడింది. ఇది రివర్స్ అయి ఉంటే అన్న ఆలోచన నన్ను ఆపేసింది. పూర్ణ ప్లేస్ లో ఆది. ఆది ప్లేస్ లో పూర్ణ ఉంటే.. సి. సుజాత రాసిన రాతి పూలు నవల గుర్తుకు వచ్చింది. నవలమొత్తం కళ్ల ముందు కదిలింది. మనసు ని అటు నుంచి లాక్కొచ్చి మళ్ళీ ఈ నవల మీద పెట్టాను. ఇదే పని పూర్ణ చేసి ఉంటే ఇంత నిబ్బరంగా , నిశ్చింత గా , ఎలాంటి అపరాధ భావన లేకుండా నిద్ర పో గలిగేదా? అనిపించింది. నవల పేరు అప్పుడు పిట్ట మీద గేదె అయి ఉండేదా?

వంద పేజీలు చదివే సరికి ఇక ముందుకెళ్ల బుద్ధి కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించలేదు . అంటే తెలుసుకోవటానికి భయమేసింది. వాళ్ళ జీవితాలు ఎటు వెళ్ళి ఎటు ఆగుతాయో అని భయం, దుఃఖం. మొదట ఆది మీద కోపం వచ్చింది. తన్నాలనిపించింది. చికాకు కలిగింది. దిగులేసింది. బాధ పడ్డాను. ఆది మీద కంటే ఆడవాళ్ళ జీవితాల మీద దుఃఖం కలిగింది. ఆది నారాయణ ఆది ప్రకాష్ గా మారాక ఇక మళ్ళీ వెనక్కెళ్ళటం లేదు. వెళ్ళ లేడు కూడా. రీడర్స్  కూడా పేరు మార్పు కి, జీవితం మార్పు కి సహజంగానే అలవాటు పడి పోతాం. ఒక్క సారి కూడా పూర్ణ కు ఆది మీద అనుమానం రాలేదు ఆశ్చర్యం గా. ఎందుకు అని ఎవరికి వారు ఆలోచించుకోవాలి? ఎవరికి తగ్గ సమాధానం వాళ్ళకు దొరుకుతుంది, ఖచ్చితం గా.  ఆది ఇంటికి డబ్బు తీసుకురాకపోతే వాళ్ళిద్దరి మధ్యా ఎలా ఉండేది?అని ఆలోచిస్తాము. అంటే భార్య లేదా భర్త తో బంధం చివరికి డబ్బు దగ్గర ఆగిపోతోంది కదా. “ అన్నీ సంబంధాలు ఆర్ధిక సంబంధాలు” అన్న స్టేట్మెంట్ గుర్తుకు వచ్చి మనసు ని మెలిపట్టి వదిలేస్తుంది. ఎవరికి వారు వాళ్ళ జీవితాల్ని, లేదా బంధాల్ని ఆలోచించుకుంటారు. ఆడవాళ్ళు తెలివైన వాళ్ళు, మగవాళ్ళు నిస్సందేహంగా అబద్ధాల కోరులు అని కొందరి ఆడవాళ్ళకైనా అనిపించకమానదు. చదివే వాళ్ళకు ప్రకాష్ మీద కోపం, పూర్ణ మీద జాలి లేదా కోపం కలుగుతాయి. కానీ రచయిత కు మాత్రం కాదు. ఆయనకు ఇద్దరూ ఒక్కటే.

మొదటి పేజీ నుంచి ఆది లో ఓ నిర్లిప్తత కనిపిస్తుంది. ఎవరికైనా జాబ్ లేకపోతే చికాకుగా, కోపం గా , ఆవేశం గా, ఆందోళన గా ఉంటుందనుకుంటాము. ఆది కొలీగ్ శర్మ గారు అంటూ ఉంటారు “ అంత ఫ్రస్టేషన్ ఉండకూడదప్పా” అని , కానీ రీడర్ కి ఆదిలో అది కనిపించదు.  భార్య తో కూడా చాలా ప్రేమ గా ఉన్నట్లు కనిపిస్తాడు. నిజంగా ప్రేమ గా ఉన్నదా? లేక అది నటనా? అని ప్రతి వాక్యం లో మనకు సందేహం వస్తూ ఉంటుంది. తండ్రి గురించి కూడా భార్య చెప్పాక మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే ఆది కి తన దగ్గర డబ్బు లేదన్న విషయం నిరంతరం గుర్తింపు లో ఉంది. కథ మొదలయ్యేటప్పటికి ఆది కి నాలుగేళ్ళు గా ఉద్యోగం లేదని తెలుస్తుంది. చిన్నపిల్లాడి కి చెప్పినట్లు పూర్ణ  తన స్పర్శ ద్వారా, మాటల ద్వారా అతనికి ధైర్యం చెపుతూ ఉంటుంది. సివిల్ ఇంజనీర్ ఉద్యోగం రాలేదని దిగాలు గా కనిపించే ఆది తన చిరుద్యోగానికి బయలుదేరుతుంటే రోజూ లాగానే కూరల బుట్టతో ఎదురయ్యే రెడ్డి గారి కోడలు గురించి ఆది ఆలోచనలు కొంత పట్టిస్తాయి అతని గురించి. అది రచయిత ఇచ్చే మొదటి క్లూ. మొదటి సారి బాస్ చెల్లెలు ని కలిసినప్పుడు ఆమె కు కావలసింది ఇవ్వడం తో పాటు ఆది కూడా ఓ సుఖం పొందాడు. ఎప్పుడైతే నిర్మల నుంచి ఆమె స్నేహితులరాళ్ళందరికీ ఆ సుఖం అందిందో, ఆది ప్యాంట్ జేబులోని కవర్ లో నోట్లు పెరుగుతూ వచ్చాయి. ఆది కి అది బిజినెస్ గా మారింది. రీడర్ కి ఆదిని చదివినప్పుడు ఎవరెవరో గుర్తుకు రావచ్చు. భర్త, అన్న, తమ్ముడు, కొలీగ్, స్నేహితుడు, నాన్న, బాబాయ్ ఎవరైనా ఓ ఆది కావచ్చు. తాను చేస్తున్న పని మీద ఆది కి ఎలాంటి భావాలు ఉండవు. ఏ క్లయింట్ తోనూ ఎలాంటి ఆటాచ్మెంట్ ఏర్పర్చుకోలేదు. రమ్మన్న చోటికి వెళ్ళటం, తన సర్వీసెస్ అందించటం, కవర్ తో ఇంటికి రావటం, అందులో కొంత మొత్తం తన లాకర్ లో పెట్టుకోవటం, మిగతాది భార్య కు అందివ్వటం. ఈ బిజినెస్ ఆది కావాలని మొదలు పెట్టలేదు. లేదా కావాలని పొడిగించలేదు. చేస్తున్న చిన్న ఉద్యోగం పోయినప్పుడు ఈ సైడ్ జాబ్ ప్రధాన ఉద్యోగంగా మారింది. ఇక తప్పొప్పులు, నీటి నియమాలు, మనసు కి ఇష్టం, కష్టం లాంటి ప్రస్తావన ఏదీ లేకుండా , రాకుండా జీవితం ముందుకు సాగిపోతోంది. అద్దం లో చూసుకున్నప్పుడు ఆది కి తాను ఆది నారాయణో, ఆది ప్రకాషో అర్థమైందో, కాలేదో?

తల్లి/టీచర్ /కోడలు /భార్య పూర్ణ !

“ఇద్దరివీ అడ్జస్ట్మెంట్స్”- మొత్తం ఆధునిక జీవితాన్ని ఒక వాక్యం లో చెప్పేశారు శాస్త్రి గారు.

ఆది ఉద్యోగం గురించి పూర్ణ ఎప్పుడూ అసంతృప్తి పడలేదు. అలా చెయ్యి , ఇలా చెయ్యి అని తగువులాడలేదు. ఏం కన్సల్టెన్సీ, ఏంటి పార్ట్ టైమ్ ఉద్యోగం అని ప్రశ్నలు వేయలేదు. ఎవరి పరిధుల్లో వాళ్ళు జాగ్రత్తగా అడ్జస్ట్ అయి బతికారు. రూల్స్ తెలుసుకొని ఉండే రూమ్ మేట్స్ లాంటి దంపతులు వాళ్ళిద్దరూ. పూర్ణ టీచరు అయినా ఆది కి పాఠాలు చెప్పలేదు. స్టూడెంట్ గా అతను చెప్పింది విని ఊరుకుంది. నమ్మింది లేదా నమ్మినట్లు నటించిందేమో. నమ్మకంతో ఉండు, రోజులు ఎప్పుడూఒకేలా ఉండవు, మంచి రోజులు వస్తాయని ఆది కి ధైర్యం చెప్పే పూర్ణ మనసులో ఏముందో ఆది కి తెలుసు. “పూర్ణ కి ఏందంటే తొరగా మంచి ఉద్యోగం రావాలి. కాస్త పైసలు ఎక్కువుంటే బావుటుంది కదా అని”. కుటుంబ భద్రత కోసం ఆడవాళ్ళ తాపత్రయం వేరు. ముఖ్యంగా చిన్న పాప ఉన్నప్పుడు. భార్య భర్తలకు ఒకళ్ళకు ఏం కావాలో మరొకళ్ళ కు తెలుసు. అందుకే ఇద్దరూ రాజీ పడ్డారు. భార్య కు కావలసింది ఉద్యోగం కంటే డబ్బు. కరెక్టు గా ఆమె చేతికి అందించాడు ఆది. ఎలా అన్నది పూర్ణకు చెప్పలేదు. పూర్ణ రెట్టించి అడగలేదు.పార్ట్ టైమ్ కన్సల్టెన్సీ అంటే సరే అని ఊరుకుంది. ఆది వేరే గది లోకి తన పడక మార్చినప్పుడు కూడా పెద్దగా రెట్టించలేదు. గొడవ పడలేదు. ఒకే చూరు కింద వేర్వేరు పడక గదులైనా పరవాలేదు. కానీ ఠంచన్ గా డబ్బులు వస్తుంటే చాలు అనుకుంది. ఆమెకు ఏం కావాలో సరిగ్గా అదే సాధించాడు. ఎలా? అన్న విషయం లో ఇద్దరికీ పెద్ద పట్టింపులు లేనట్లు కనిపిస్తారు. పూర్ణ ది రకరకాల పాత్రల జీవితం. మామగారి దగ్గర అభిమానం తో ఉంటూ, పెరుగు పులిసిపోయిందంటూ అపాలజిటిక్ గా చెప్పే పూర్ణ పూర్తిగా లెక్కల మనిషి. డబ్బు లెక్కలు మనసు లో వేసుకొని పైకి మృదువు గా మాట్లాడగలిగే ఆధునిక మహిళకు ప్రతి రూపం పూర్ణ. మామ గారు చనిపోయినప్పుడు వేసుకున్న లెక్కల్లోనూ, భర్త జీతం కవర్ను చేతికి ఇచ్చినప్పుడు, స్కూల్లో కొలీగ్ తో స్థలం గురించి మాట్లాడేటప్పుడు పూర్ణ అంటే ఎవరో, ఆమె కు ఏం కావాలో ఆది తో పాటు రీడర్ కి కూడా తెలుస్తుంది. పూర్ణ కు రిలేషనషిప్స్ మీద మంచి క్లారిటీ ఉంది. భర్త తో అడ్జస్టమెంట్ జాగ్రత్తగా, మనకి అనుకూలంగా బ్యాలెన్స్ చేసుకోవాలని కొలీగ్ రామలక్ష్మి తో అంటుంది. పూర్ణ పద్ధతి గా ఆలోచిస్తుంది. కాలిక్యులేటెడ్ గా పెళ్లి చేసుకుంది. ఆది కి ఉద్యోగం లేకపోయినా మంచివాడని తెలుసుకొని పెళ్లి చేసుకుంది.  భద్రత ముఖ్యం, పైసలు ముఖ్యం అనుకుంది. పెళ్ళయ్యాక ఆది, పూర్ణ మైసూరు వెళ్లారు. బయటకు వెళ్దామని బయలుదేరాక వర్షం మొదలుకావటం తో పూర్ణ ఆటో పిలవమంది. వర్షం లో ఆటోలో వెళ్ళినా తడుస్తాం కదా అన్నది ఆది మాట. ఇద్దరూ మళ్ళీ రూమ్ కొచ్చేస్తారు. చిన్న సంఘటన. ఆలోచిస్తే బహుశా పూర్ణ కి ఆది గురించి అర్థమైన సంఘటన కూడా. కొందరు మగవాళ్ళు అంతే. పెద్దగా కష్ట పడరు, ఇంటి విషయాలు పట్టించుకోరు. జీవితం లో ఎదగాలని అనుకోరు. అలాంటి వాళ్ళతో జీవితాన్ని పంచుకున్నప్పుడు ఆడాళ్ళు ఇంటి పెద్ద లాగా వ్యవహరించాల్సి వస్తుంది. మొగుడ్ని కూడా బిడ్డ లాగానో, కుక్క పిల్ల లాగానో సాకాల్సి వస్తుంది. అప్పుడు పూర్ణ లాంటి ఆడవాళ్లకు నీతి,శీలం లాంటివి పట్టించుకుంటే జీవితం గడవటం కష్టం. ఆది సెక్స్ వర్కర్ కాకపోయి ఉంటే, బహుశా పూర్ణ ఆ పని చేయాల్సి వచ్చేదేమో. ఎందుకంటే పూర్ణ కు స్థలం కావాలి, ఇల్లు కావాలి. పిల్లదాని కోసం కారు కావాలి. “ కొన్ని పొందాలంటే కొన్ని పోగొట్టుకోవాలి”. ఇవన్నీ వాచ్యంగా పతంజలి శాస్త్రి గారు ఎక్కడా చెప్పలేదు. చెప్పక్కరలేదు కూడా. నాకు పూర్ణ, ఆది ఇలా అర్థమయ్యారు. మీకు మరోలా అర్థమవ్వచ్చు. శాస్త్రి గారి రచనలు one author, multiple texts అని నా వ్యాఖ్యానం.

క్లెయింట్స్ గా ఆడవాళ్ళు !

నిర్మల, అంజలి, రేఖా, చిత్ర.. ఎన్నో పేర్లు. కోర్కెలు గా, నోట్లు గా తప్ప వాళ్ళకు పేర్లు కూడా అక్కరలేదు. సౌలభ్యం కోసం మాత్రమే రచయిత వాళ్ళకు పేర్లు పెట్టినట్లు ఉన్నారు. ఆధునిక జీవితం లోని అసంతృప్తి తో రగిలిపోతున్న స్త్రీలు వీళ్ళంతా. భర్తలు వ్యాపారం లో, డబ్బు సంపాదనలో మునిగిపోయి వీళ్ళను పట్టించుకొకపోవటం తో వాళ్ళకు ఆది లాంటి వాళ్ళ సర్వీసెస్ అవసరమయ్యాయి. ఇక్కడ మనకు నాణేనికి రెండో వైపు కనిపిస్తుంది. పూర్ణ డబ్బు కోసం ఆది ని వేధించలేదు కానీ ఆమె మనసు తెలుసుకొని ఆది అనుకోకుండా అంది వచ్చిన ఈ వ్యాపారం లో సులువు గా వొదిగి పోయాడు, ఎలాంటి మానసిక శారీరక ఘర్షణలు లేకుండా. ఆది క్లెయింట్ల భర్తలందరూ డబ్బు సంపాదన లో నిండా మునిగిపోయిన వాళ్ళే. ఒక వైపు ఆడవాళ్ళే డబ్బు కోసం ఎగబడుతున్నట్లు, మరో వైపు అదే జరిగితే మళ్ళీ తమ ను తాము తృప్తి పర్చుకోవటానికి మరో మగవాడిని వెతుక్కునే స్త్రీలు. వాళ్ళకు ఆది కాంప్లికేటిడ్ కాదని అర్థమైంది కాబట్టి అతనితో బిజినెస్ కి సిద్ధపడ్డారు. ఇక్కడ ఏ జెండర్ నీ  తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. డబ్బు అనే వల లో పడితే స్త్రీలైనా, పురుషులైనా ఎక్కడ తేలతారు?జీవించటానికి డబ్బు కాకుండా, డబ్బు కోసం జీవించటం ఆధునిక జీవితం అని రచయిత వ్యాఖ్యానం అనిపిస్తుంది.

ఆధునిక నగర జీవితం పై బహుముఖీన వ్యాఖ్యానం ఈ గేదె మీది పిట్ట నవల.

“ రోజూ వంట చేస్తుంటే బోర్ కొట్టదా నీకు?”

“ కొడితే ఏం చేయాలి?
“ అదీ నిజమే”

నవల మొత్తం ఆది -పూర్ణ ల రిలేషన్ షిప్ ను చాలా జాగ్రత్త గా, పకడ్బందీ గా , వాచ్యంగా ఏమీ చెప్పకుండా, కేవలం డైలాగులతో చూపించారు శాస్త్రి గారు. రచయిత ఉద్దేశ్యం కూడా మనం ఎక్కడా పట్టుకోలేము. తెలివైన రీడర్స్ పట్టుకుంటారు. లేనివాళ్ళు మామూలు డైలాగులు అనుకుంటారు.

ఇలాంటి డైలాగులు చదివినప్పుడు – ఆగి ఆలోచించాలనిపిస్తుంది. ఒక పక్క ముందుకెళ్లాలన్న తొందర. ఆగాలన్న ఆలోచన. ఇలా మనల్ని నానా హింస పెట్టి చదివిస్తారు శాస్త్రి గారు తన రచనల్ని. అవి కేవలం రచనలు కాదు ఆయన చేసే  మంత్రజాలం అనిపిస్తుంది.

భద్రత కోసం డబ్బు సంపాదన లో పడి ఏం పొందుతున్నామో, ఏం పోగొట్టుకుంటున్నామో, ఆధునిక బాంధవ్యాలు ఎటు వైపు సాగుతున్నాయో -రకరకాల విషయాల్ని ఈ నవలిక లో చూపించారు.

“ ఆది ప్రకాష్ సింకు మీది అద్దం ముందు నించున్నాడు” – ఆఖరి వాక్యం చదవగానే ఇంకేం చెప్పక్కరలేకుండానే ఆది ప్రకాష్ జీవితం ఎలా ఉండి ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. “సింకు మీది అద్దం లో కనిపించింది పూర్ణ”.

అప్పుడు గుర్తొస్తుంది. నవల లో మొదటి పేజీ లో చెప్పిన దృశ్యం. ఆది ప్రకాష్ సింకు మీది అద్దం ముందర నిల్చొని గడ్డం చేసుకుంటున్న దృశ్యం. అప్పుడు ఆ దృశ్యం ప్రాముఖ్యత తెలియదు. నవల పూర్తయ్యాక తెలుస్తుంది.

అప్పుడు రెండో పేజీ మళ్ళీ తిరగేస్తాం. గేదె మీద పిట్ట వాలటం చదువుతాం . గేదె ఎవరు? పిట్ట ఎవరు? అని ఆలోచించటం మొదలు పెడతాం . ప్రకాష్ – పూర్ణ? నువ్వూ- నేను? మీరు- వాళ్ళు? అతను -ఆమె? పాప-బాబు? నాన్న -అమ్మ? పెద్దవాళ్ళు -చిన్నవాళ్ళు? ఉద్యోగులు -నిరుద్యోగులు? డబ్బున్న వాళ్ళు- లేనివాళ్ళు?

ఏమో? తెలుసుకోవాలని ఉంటే రాజమండ్రి వెళ్ళి పతంజలి శాస్త్రి గారిని కలిసి రండి.

సాహిత్యానుభవం

“ గేదె మీది  పిట్ట” లోని మొదటి రెండు పేజీలు చదివితే హుమ్మ్ అనుకుంటాము. ఆ రెండు పేజీలు అయ్యాక 1 అని అంకె తో కథ మొదలవుతుంది. అంటే కథ అక్కడ నుంచి మొదలు అన్న మాట. మరి మొదటి రెండు పేజీలలో చెప్పింది ఏమిటి అంటే నవల పూర్తి చేశాక అప్పుడు మీకు మొదటి పేజీ లో ఉన్నది గుర్తుకు వస్తుంది. వెనక్కు వెళ్ళి మళ్ళీ ఆ రెండు పేజీలు చదువుతారు. అప్పుడు ఆ రెండు పేజీల్లో ఏం చెప్పారో అన్నది అర్థమవుతుంది. ఈ టెక్నిక్ ని మరో కథ “ రమ సంగతి?” లో కూడా వాడారు రచయిత.  అందరికీ ఇలాగే  కథ అర్థమవుతుందని చెప్పలేము. నాకు అలా అనిపించింది. అది కరెక్టా , కాదా అన్న ప్రశ్న లేదు. శాస్త్రి గారి రచనల్లోని గొప్పతనం ఏమిటంటే ఒక్కో పాఠకుడి కోసం ఒక్కో కథ రాస్తారు. అంటే వేర్వేరు కథలు కాదు. కథ ఒక్కో రీడర్ కి ఒక్కోలా అర్థమవుతుంది. కథ చదివాక ఒక్కో రీడర్  తనకు అర్థమైన కథను అక్కడ నుంచి మరో కథగా ఊహించుకుంటారు. పాఠకులు కథ చదువుతున్నప్పుడు,  కథ ముగిశాక మరో ప్రపంచం లోకి వెళ్ళి వస్తారు . నేను వెళ్ళి వచ్చిన ప్రపంచం, మీరు వెళ్ళి వచ్చిన ప్రపంచం ఒకటి కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి శాస్త్రి గారి రచనల్ని ఇలా ఉన్నాయంటూ త్రాసులో వేసి తూచే పని చేయకూడదు. అది వర్క్అవుట్ అవదు.

గేదె మీది పిట్ట నవల చదువుతున్నప్పుడు ఎన్ని సార్లు ఆగిపోయానో లెక్క లేదు. ఒక్కో వాక్యం నన్ను నిలిపేసేది. మళ్ళీ మళ్ళీ ఆ వాక్యం చదువుకొని పొంగి పోయాను. ఆ వాక్యాన్ని ఊహించుకొని తనివితీరా తృప్తి చెందాను. ఒక్కో చోట వాక్యం దాటి ముందుకు చదవటానికి భయమేసింది. అమ్మో, ఇప్పుడు ఆది ప్రకాష్ ఏం చేశాడో? పూర్ణ ఏమంటుందో? వాళ్ళ జీవితం ఏ మలుపు తిరుగుతుందో? అని నాకు నేను ఆలోచించుకునేదాన్ని. చదవలేను, చదవకుండా ఉండలేను. ఆ స్థితి చెప్పలేనిది. రాయలేనిది.అలాంటప్పుడు  శాస్త్రి గారి మీద ప్రేమ , కోపం రెండూ ఒకేసారి కలుగుతాయి. రచయిత ఓ విధంగా గురువు లాంటి వాడు. మనం రచన ను సరిగా అర్థం చేసుకోవాలని దూరంగా ఉండి ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కరైనా రచనను సరిగా చదివి ఆకళింపు చేసుకొని తనకు ఆ విషయం చెప్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే రచనకు, రచయిత కు, పాఠకులకు ఓ సార్ధకత. మూడు స్థాయిలు ఏక కాలం లో ఒకే సరళ రేఖ మీద కలుస్తాయి.

తెలుగు సాహిత్యం లో రీడర్ కు ఒక సాహిత్యానుభవం ఇవ్వటం కోసం ఇష్టం గా కష్టపడి మన కోసం ఒక మెట్టు కిందకు దిగి మనకు అర్థమయ్యేలా రచనలు చేసిన అతి కొద్ది కొద్ది మంది రచయితలలో పతంజలి శాస్త్రి గారు ముందు వరుస లో ఉంటారు. ఈ వరుస లో ఇంకెవరున్నారు అంటే మరొక్క పేరు నాకు తట్టలేదు.

నేనింత గొప్ప రచయితను అని శాస్త్రి గారు ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన వృత్తి, ప్రవత్తులు, ఆయన ఆసక్తులు, ఆయన చదివిన చదువు, కుటుంబ వారసత్వం తెలిసిన వాళ్ళు –ఆయన అలా చెప్పుకున్నా తప్పు లేదనే అంటారు. పతంజలి శాస్త్రి గారు ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన కానీ ఆయన తన రచనలను రచయిత వైపు నుంచి కాకుండా పాఠకుల వైపు మాట్లాడారు. రచన అనేది ఎంత సీరియస్ గా చదవాలి, ఎంత కష్టపడి అర్థం చేసుకోవాలి, అలా జరిగినప్పుడే ఆయన రాసిన సమాంతర వాస్తవికత అనేది అర్థమవుతుందని చెప్పారు. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు రచన చేయటం ఆయన పద్ధతి కాదు. శాస్త్రి గారి రచన చదువుతున్నామంటే  ఒళ్లు దగ్గర పెట్టుకొని రీడర్ జాగ్రత్తగా చదవాలి. అర్థం చేసుకోవాలనే తపన తో చదవాలి. రచయిత సృజించిన కాల్పనిక లోకం వెళ్ళటానికి అవి కనీస అర్హతలు. తెలుగు సాహిత్యం లో రచన పట్ల ఇంత అవగాహన, నిబద్ధత, పాఠకులకు మంచి సాహిత్యనుభవం కలగాలనే తపన ఉన్న రచయితలు అసలు లేరనే చెప్పవచ్చు. “ నేను రాసింది అర్థమైతే చదవండి, లేదా మానేయండి” అన్న తెంపరితనం కాదు శాస్త్రి గారిది. లేదా “ నాకు చాలా తెలుసు కానీ మీకు అర్థం కావటం కోసం నేను మీ స్థాయి కి దిగి రాస్తున్నాను. కాబట్టి మీరంతా నన్ను గౌరవించండి” అనే వేడుకోలు కూడా లేదు. ఎన్నో గొప్ప రచనలు చేసినా ఆయన మౌనం గా, ఎక్కడో ఓ మూల ఉండిపోయారు తప్ప తన గురించి తాను మార్కెటింగ్ చేసుకోలేదు. అకాడమీ అవార్డుల కోసం అర్రులు చాచలేదు. 60 ఏళ్ల పాటు సుధీర్ఘమైన సాహిత్య ప్రయాణం చేసినా ఆయన అవార్డులు, రివార్డుల  కళ్ళల్లో పడాలని తాపత్రయపడలేదు. రాయాలనిపించినప్పుడు  రాశారు. కుదిరినప్పుడు  అచ్చేయించారు. అది మాత్రమే రచయిత బాధ్యత. మిగతవన్నీ ఎక్స్ట్రా  కరిక్యులర్ యాక్టివిటీఎస్ లాంటివి. శాస్త్రి గారికి ఆ విషయం లో స్పష్టత ఉంది.

నాకు తెలుసు. నేను శాస్త్రి గారి గురించి, నవల గురించి జమిలీ గా మాట్లాడుతున్నానని. రెంటినీ వేరు చూసి చూడటం కుదరటం లేదు. ఎందుకంటే గేదె మీది పిట్ట లాంటి నవల ఇంకెవరైనా రాసి ఉంటే కథ మరోలా ఉండేది అన్న విషయం నాకు బాగా తెలుసు. దాని మీద జరిగే చర్చ కానీ, రచయిత కు, రచన కు వచ్చే హైప్ కానీ. ఈ రెండూ ఈ నవల విషయం లో జరగలేదు కాబట్టి నవల తో పాటు శాస్త్రి గారి గురించి కూడా మాట్లాడాల్సి వస్తోంది.

నవల గురించి చెప్పేసాను. ఇక చెప్పాల్సింది ఎంత బాగా రాశారు అని మాత్రమే. శాస్త్రి గారి వాక్య నిర్మాణం చాలా విలక్షణంగా ఉంటుంది. ఆయన ఊహ, ఆయన ఎన్నుకునే ఉపమానాలు కూడా. ప్రతి వాక్యం ఎంతో భిన్నంగా చెప్తారు. అందువల్లనే అలవోక గా చదివేయలేం . ఒక్కో వాక్యాన్ని చదివి నెమరు వేసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ తీసి కొన్ని వాక్యాలు చదువుకొని ఊహాలోకం లో విహరించి రావాలనిపిస్తుంది.

నవల మొత్తం లో ఒక్కటంటే ఒక్క వాక్యం లో కూడా రచయిత కు ఏ పాత్ర పట్ల కానీ సానుభూతి లేదా కోపం లేదా జడ్జిమెంట్ టోన్ కనిపించలేదు.అదీ చాలా కష్టమైన విషయం. శాస్త్రి గారంటే చాలా అభిమానం పుట్టుకొచ్చింది. ఒక్కసారి కూడా ఆయనతో వివరంగా మాట్లాడలేదు కదా అని బాధ కూడా పుట్టుకొచ్చింది. శ్రీపాద, మల్లాది ని చూడలేదే, మాట్లాడలేదే అని బాధపడే నాలాంటి వాళ్ళందరూ శాస్త్రి గారితో పాటు జీవిస్తూ కూడా ఆయన రచన గురించి మాట్లాడకపోవటం, రాయకపోవటం ఎంత పెద్ద తప్పిదమో కదా అని తెలిసి వచ్చింది.

“ ఒకళ్ళు చిన్న ముల్లు, ఒకళ్ళు పెద్ద ముల్లు అయిపోయారు”- ఈ వాక్యం చదవగానే ఆగిపోయి ఊహిస్తాము. ఆ సీన్ ఎలా ఉంటుందో అని.

“ నిజానికి అబద్ధానికి మధ్య అతనికి నిద్ర పట్టలేదు”- నాకు గుర్తున్నంత  వరకు ఆది ప్రకాష్  లో ఎక్కడా అపరాధ భావన చూపించలేదు లేదా కలగలేదు. ఈ ఒక్క వాక్యం లో తప్ప. అది కూడా అతనికి నిద్ర పట్టక పోవటం గురించి. ఎక్కడ ఎంత చెప్పాలో, ఎక్కడ ఆపేయాలో తెలిసిన రచయిత శాస్త్రి గారు. మనకు ఏదైనా తెలిస్తే అది మొత్తం వాచ్యం గా చెప్పేస్తే తప్ప కొందరు రచయితలకు నిద్ర పట్టదు. శాస్త్రి గారు నుంచి నేర్చుకోవాలసిన విషయాల్లో మొదటిది ఎంత చెప్పాలో, ఎక్కడ ఆపాలో.

“ ఇద్దర్నీ కలిపి రెండు శాస్త్ర వైద్య పరికరాలలాగా “

“అందరూ ఇంచు మించు నిండు విస్కీ సీసాల్లా ఉన్నారు”

“ నిశ్శబ్దం విస్కీ తాగినట్లు ఉంది”

“ మధ్య లో దీపంలా కొత్త  విస్కీ సీసా మెరుస్తోంది”

అన్నింటి కంటే నాకు బాగా నచ్చిన ఉపమానం “ ఇద్దరూ గ్లాసు-బీరు లాగా కలిసిపోయారు”

కథ-కథనం లాగా రచయిత-నవల కలిసిపోయారు. ఆది తప్ప శాస్త్రి గారు ఒక్క చోట కూడా కనపడలేదు. రచన లో రచయిత ను వెతకటం  తెలుగు సాహిత్యపు దౌర్భాగ్యపు  లక్షణం. ముఖ్యంగా స్త్రీల రచనల్లో . అందుకనే ఒకటికి పది సార్లు ఆయన ఎక్కడా కనిపించలేదు నాకు అని ప్రత్యేకంగా చెప్తున్నాను. పుస్తకం చదవటం మొదలు పెట్టాక మన దృష్టి రచన మీద, పాత్రల మీద ఉండాలి కానీ రచయిత, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, దౌర్భాలాల మీదకు పోకూడదు. అది రీడర్ కి ఉండాల్సిన ముఖ్య లక్షణం. రీడర్స్ కి అది ఉండే ఉంటుంది కానీ సహ రచయితలకు మాత్రం ఆ లక్షణం దాదాపు శూన్యం. చదువుతున్నంత సేపు పాత్రల్ని కాకుండా రచయితల్ని గుర్తు పెట్టుకొని చదువుతూ ఉంటారు. అందుకనే శాస్త్రి గారు చెప్పే సాహిత్యానుభావం అనేది చాలా మందికి కలగదు కాబోలు.

ఇటీవల నేను నాలుగైదు పుస్తకాలు చదివాను. అవన్నీ అనువాదాలు. ఒక వైపు సముద్రం, ఘాచర్- ఘోచర్, తారాబాయ్ లేఖ, జయకాంతన్ పుస్తకం. అన్నీ మంచి రచనలు. అయితే తల్లావఝ్జుల పతంజలి శాస్త్రి గారి గేదె మీది పిట్ట, వీరనాయకుడు నవలలు, నలుపెరుపు కథల సంపుటి  చదివాక ఇంత గొప్ప తెలుగు రచయిత గురించి ఇంతవరకూ సరైన  సమగ్ర విశ్లేషణా వ్యాసం రాకపోవటం ఎంత దురదృష్టం అనిపించింది. పతంజలి శాస్త్రి గారి రచనలోని గొప్పతనం ఇతర భాషలలోకి అనువాదమై వెళ్ళి ఉంటే ఈ పాటికి ఆయన కు ఎంత గుర్తింపు వచ్చి ఉండేదే కదా? అవును. కన్నడ కారంత్ లాగా మనకు కూడా ఓ పతంజలి శాస్త్రి ఉన్నారు అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. వినేవాళ్ళు ఎవరైనాఉంటే..

పతంజలి శాస్త్రి గారి రచనలు విమర్శించే , విశ్లేషించే విద్వత్తు నాకు లేదని తెలుసు. ఒక పాఠకురాలిగా ఈనవల చదివినప్పుడు నాకు కలిగిన అనుభవాన్ని ధైర్యం చేసి రాశాను. గొప్పతనం పతంజలి శాస్త్రి గారిది, తప్పులు నావి.

*

కల్పనా రెంటాల

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గేదె మీద పిట్ట —నన్ను కూడా కుదిపి వదిలి పెట్టింది.
    ఇలాంటి నవల తెలుగులో ఇంతవరకూ యెవరూ రాయలేదనుకుంటున్నాను.

  • మనిషి మగవాడి గా మారటం, లేదా మనిషి డబ్బు గా మారటం, వ్యక్తి ఆస్తి గా మారటం, మొగుడు కారు గా, ఇంటి స్థలం గా మారటం. ఒక వ్యక్తి ఇలా మారటం వెనుక భార్య, కూతురు, తండ్రి, యజమాని, ఉద్యోగం, స్నేహితులు, పబ్ లు, విస్కీ లు, బీర్లు అన్నీ ఉంటాయి.

    ఈ వాక్యం నవల స్వరూపాన్ని తెలుపుతోంది.

    చాల వివాదాస్పద అంశం రచయిత తీసుకున్నా , ఈ నవల మీద ఎందుకనో జరగవలసిన చర్చ జరగలేదు, నవల ఒక్కసారి చదవలేక పోయాను, చదివి ఆగలేక రచయితకు ఫోన్ చేసాను, నవల మధ్యలో వొచ్చే పురాణ పఠనాల ప్రహసం కూడా బావుంటుంది.

  • చక్కని సమీక్ష చేశారు శుభాకాంక్షలు ఆధునిక జీవన దానంలోనూ వేసుకుని ఇబ్బందుల్ని రచయిత చక్కగా చిత్రీకరించారని అనిపించింది నవల తప్పనిసరిగా చదవాల్సిందే తప్పక చదువుతాను కూడా. మీరన్నట్టు రచనలను రచయితను వేరు వేరుగా చూడాల్సిందే

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు