ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమరాలు,మారణ హోమాలు,జాతి హననాలు, ప్రజా ఉద్యమకారులు, హేతువాదులపై తీవ్ర అణచివేత జరుగుతున్న రోజులు ఇవి.అభివృద్ధి పేరిట అల్పసంఖ్యాకులు ప్రజా బాహుళ్యంపై ఒక మార్కెట్ పిడివాద నమూనా రుద్దటం, ఎన్నికైన పార్టీలు ప్రజాస్వామ్యం అంటూ మైనారిటీలను అణగ దొక్కటం అటు ఐరోపా, అమెరికా దేశాల్లో, ఇటు ఆసియా దేశాల్లో పరిపాటిగా మారింది. మానవత్వం నిలువునా చీలిన దరిమిలా అనుభూతులు, సానుభూతులు సైతం సంకుచిత మార్గం పట్టాయి. ఇటువంటి సంక్షుభిత సందర్భంలో కవిత్వం కావాలి.
వాస్తవం, కవిత్వం పరస్పరం వెంబడించే యుగం ఇది. ముక్కలుగా వాస్తవాన్ని చూడటం కొందరు సమర్థిస్తున్నారు. అదే సమయంలో బుల్డోజర్ రాజ్యం తన పని తాను చేసుకుంటూ సాగుతోంది. అమెరికాలో వలస శ్రామికుల పైన, భారత్ లో మత మైనారిటీల పైన, ప్రత్యర్థి సిద్ధాంతాలపై, వాటి అనుయాయులపైన, ఇజ్రాయిల్, రష్యా, ఉక్రెయిన్ లలో సైతం “లెవియాధాన్”సామాన్య పౌరులపై విరుచుకుపడుతోంది.’వసుధైవ కుటుంబం’ కేవలం శుష్క నినాదంగా మిగిలింది.
నేటి యుగం చార్లెస్ డికెన్స్ తన ‘ ఏ టేల్ ఆఫ్ టు సిటీస్’నవల మొదట్లో ప్రస్తావించిన సందిగ్ధ కాలాన్ని తలపిస్తోంది. ఆశావాదం- నిరాశావాదం, రొమాంటిశిజం, రెవల్యూషన్, భూతల స్వర్గ – నరక భావాలు పరస్పరం ఘర్షిస్తున్నాయి. ఫ్రాయిడ్ చెప్పినట్లు Eros, Thanatos ల మధ్య సమరం ఎల్లకాలం కొనసాగక తప్పదా !?
ప్రతి రచయిత నెత్తి పైన ఓ కత్తి వేలాడుతోంది. నాటి సోవియట్ యూనియన్ లో అఖ్మతోవ్, మెండెల్ స్టామ్, పాస్టర్ నాక్, బ్రాడ్స్కీ, మయకోవ్స్కీ, తదితరులు అనుభవించిన ఉద్విగ్న క్షణాలు లాంటివి నేడు చూస్తున్నాం. ఆధునిక అనాగరిక యుగంలోకి వేగంగా పరిగెడుతున్న మనదేశంలో అధికారిక, అనధికారిక సెన్సార్ షిప్ కవి ఊహా జగత్తుపై వికృత నృత్యం చేస్తోంది.
నేడు కవిత్వం కేవలం సమాజానికి అద్దంలా లేదా దారి దీపంలా ఉండలేదు. అది మనిషిని స్పందింప చేసి తన వంతు కర్తవ్యం నెరవేర్చేలా ఉత్తేజ పరచాలి. ధైర్యం సమకూర్చాలి. కనుల ముందు కమ్ముకున్న మంచును దాటి చూడలేకపోవటం నాటి రష్యన్ అధికార సమర్థక రచయితల లోపం అన్నాడు మిలన్ కుందేరా తన ‘Testament Betrayed ‘అన్న పుస్తకంలో. నిరాశ పూరిత రోజుల్లో కూడా పాటలు ఉంటాయి అన్నాడు జర్మన్ కవి, నాటక రచయిత అయిన Bertolt Brecht . పద్మ వ్యూహం లాంటి బ్యూరోక్రసీని, అసంబద్ధ న్యాయవ్యవస్థను మది కదిలించేలా చూపించాడు కాఫ్కా తన నవలల్లో.
కరుడుగట్టిన మతవాదాన్ని, అవినీతి పంకిలమైన రాజ్య వ్యవస్థను, దొంగ వార్తలని, వలసవాదాన్ని, ప్రకృతి విధ్వంసాన్ని ప్రశ్నిస్తున్నారు సల్మాన్ రష్డి, అరుంధతి రాయ్, తస్లీమా నస్రీన్, చినువా అచెబీ, గుగీ, పెరుమాళ్ మురుగన్, అమితవ్ ఘోష్ లాంటి రచయితలు. ఇక్కడ కూడా పాణిగ్రాహి సుబ్బారావు , చెరబండ రాజు, శివ సాగర్, కలేకూరి ప్రసాద్, మద్దూరి నగేష్ బాబు,గద్దర్, వంగపండు లాంటి రచయితలు, కళాకారులు ఈ వ్యవస్థను ప్రశ్నించారు తమ జీవితాల్లో చివరిదాకా.నేడు ఏ కవికైనా నిరంకుశత్వాన్ని నిగ్గదీసే, ప్రశ్న వేసే ధైర్యం, సాహసం ఉండాలి.
కేశవ్ కుమార్ రచించిన “ఆదిమ పౌరుడు” కవితా సంపుటిలో కుల, మత, జాతి విచక్షణలు, కుటుంబ, విద్యావ్యవస్థలు, కుహనా దేశభక్తి, అవినీతిమయ బ్యూరోక్రసీ, ఓట్ల పండుగగా మారిన ప్రజాస్వామ్యం, యంత్రస్వామ్యం, నయా వలస వాదాలపై సునిశితమైన విమర్శ ఉంది. హృదయానికి హత్తుకునే వాక్యాలు, కొత్త పద ప్రయోగాలు, ఊపిరి సలపనివ్వని దృశ్యపరంపర, మెదడును కల్లోలపరచి ఆలోచింపజేస్తాయి.
వ్యవస్థీకృతమైన హింసను కేశవ కుమార్ కవితలు అడుగడుగునా నిలదీస్తాయి.ప్రేమ పేరిట వంచనకు గురైన దళిత యువతి , పనికి మాలిన చదువులను కాలదన్ని వెళ్ళిపోయిన హైదరాబాద్ యూనివర్సిటీ సునీత కవికీ ఒక వెంటాడే జ్ఞాపకం అయింది. దేనినీ పట్టించుకోనవసరం లేదని అడుగడుగునా ఉదాసీనతను బోధించే ఈ వ్యవస్థలో ముస్తఫా వాస్తవాన్ని వదిలిపెట్టీ కలల దుప్పటి కప్పుకోవాలా అని కవి విస్మయం ప్రకటిస్తాడు.ప్రశ్నించే ప్రతివాడు నేటి పాలకులకు బీభత్సుడే! అసలు సరైన నిర్వచనం లేని పదాన్ని వాడి, నల్ల చట్టాలు తెచ్చిన పాలక వర్గాలు, నిరాశామయ వ్యక్తుల దుస్సాహస చర్యలకు వాడాల్సిన పదాన్ని నిరసనకారులందరికీ వాడటం శోచనీయం.
ఒక కవిత ”నేను…” అధికారిక నిర్వచనాలను తిరిగి రాస్తుంది. కరుడుగట్టిన కుల వ్యవస్థ నెలకొన్న యూనివర్సిటీని నిరసిస్తూ, దళిత విద్యార్థుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే మాటలు, చేతలతో అగ్రవర్ణ అధ్యాపకులు, ఎలైట్ కాలేజీ ల లో చదివిన సహవిద్యార్థుల subtle అహంకారాన్ని ప్రశ్నిస్తూ, ప్రతిఘటిస్తూ రాసిన కవితా పంక్తులు ‘నేను హింసనే… మీరిక ఖాళీ చేయాల్సిందే’ కవితలో ఉన్నాయి. కరోనా కాలంలో ఆన్లైన్ చదువు అసమానతలకు గురైన డిజిటల్ పేదల ఆర్తనాదం,ఆవేదనలు ‘లాస్ట్ లెక్చర్’,’డిజిటల్ డిఫాల్టర్’కవితల్లో ఉన్నాయి. చివరి కవితలో
“యాప్ డౌన్లోడ్ తెలియక / డేటా ప్యాకేజీ కొనుక్కోలేక/జ్ఞానం ఇంగ్లీష్ ముక్కలయిన చోట/
నేను మట్టి అక్షరాల వెలివేయబడ్డాను/జ్ఞానం సాంకేతిక సంకేతాలయిన చోట/
డిజిటల్ డీఫాల్టరై ఆఫ్లైన్లో నుంచున్నాను” అనే పంక్తులు డిజిటల్ డివైడ్ పల్లెల్లో సిగ్నల్ రాని చిన్న పట్టణాల్లో కొండలెక్కి, చెట్లు ఎక్కి దళిత , బలహీన వర్గాల విద్యార్థులు అనుభవించిన హింసకు అక్షరరూపం ఇచ్చింది. ‘సత్యసంహారం’కవిత సత్యాన్ని బహువచనంగా దర్శిస్తుంది. తరాల ఆధిపత్య సంస్కృతి పెత్తనాన్ని ఎండగడుతుంది.
కుల దురహంకారాన్ని, పితృస్వామ్య కుటుంబ నిరంకుశత్వాన్ని ఎదిరించిన హైదరాబాద్ అమ్మాయి “ఆదిమ జంతువుపై బల్లెం విసురుతూ.. చరిత్ర చిగురించిన మెరుపు” కుటుంబ వ్యవస్థను పవిత్రంగా పొగుడుతూ,ప్రైవేటు ఆస్తి అంతస్తుల అహంకార హస్తాలలో నలిగిన యువ ప్రేమ పక్కన నిలబడుతుంది. ఈ వస్తువు పైనే ‘వెంటాడే దయ్యం’ కవిత.’ఆధునిక అనాగరికుడు ‘ ప్రేమను ద్వేషించే చట్టాల పైన రాసింది. లవ్ జిహాద్ చట్టాలతో ప్రేమను నేరం చేసిన మెజారిటీరియన్ దృక్పధాన్నీ నిరసిస్తూ “నిండు సూలాల చందమామ కడుపులోకి/ విసిరిన విద్వేష శూలం” లాంటి ప్రయోగాలు ఉన్నాయి.కుల వ్యవస్థ వాస్తవాన్ని నిరాకరించే వారికి జవాబు “ప్రేమి’కులం’”కవిత. ‘పరువు హత్య ‘పేరిట అగ్రకుల అహంకారం చేసిన ఇలవరసన్ ప్రణయ్ లాంటి దళిత యువకుల హత్యలకు నిరసన ఉంది.
ఈ పుస్తకంలో నల్లజాతి నటి హల్లెబెర్రీ పై రాసిన కవిత ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తుంది.
”అర్థంకాని మౌనరోదనలో/ అన్నీ కలిసిపోయిన ఆ క్షణం/తెల్ల ఆకాశమంతా/ పరుచుకున్న/
ఇంద్రధనుస్సులా నాహల్లె/నిన్ను మనసారా/ఈ మాల గుండెలకి హత్తుకోనివ్వవే.”
నయా వలసవాదం యొక్క లాభాల వేటగాడిని విమర్శిస్తూ ‘నల్ల నల్లని పాట’,’వాడొక్కడే’, గత సింహళ జాత్యహంకారాన్ని వ్యతిరేకించిన వ్యంగ్యమైన, ఆవేదన పూరిత కవితలు కూడా ఉన్నాయి.
కుహనా దేశభక్తిని ఎండగడుతూ ‘మనుషులు లేని దేశం’,’కరకు కాలం’,’ఆదిమ పౌరుడు’ లాంటి మంచి కవితలున్నాయి. మొదటి దానిలో “మనుస్వామి పడగనీడలో/పవళించిన పవిత్రదేశం/
మానవ మనుగడ గీతం/జాతుల కలల జాతర/ సామూహిక ఆత్మ సంగీతం/వెలిసిపోయిన/
ఇంద్రధనస్సులా దేశం/” అనే పంక్తులు కదిలిస్తాయి. అంతేకాదు పెట్టుబడికి మాత్రం హద్దులు రద్దుచేసి, నిత్య వలస శ్రామికులను,”ఆధార్ ఉంటే గాని మానవత్వాన్ని గుర్తించని దేశీయ, విదేశీయ దోపిడీని కాదంటూ”రాజ్యానికి దేశభక్తికి అవతల నుంచున్న..ప్రపంచ ప్రధమ పౌరుడిని నేనిప్పుడు!” అని కవి చెబుతాడు. ఈ నాడు వలస శ్రామికులపై అన్ని చోట్ల జరుగుతున్న అమానుష దాడిని హృదయమున్న ప్రతివాడూ ఖండించాల్సిందే. గ్లోబలిజేషన్ ప్రక్రియలో పెట్టుబడులకు లేని సరిహద్దులు శ్రామికులకు ఎందుకు అని ఆందరూ ఆలోచించాలి. ఈ సుంకాల రాజకీయాలకు లాభాల గోల తప్ప శ్రామిక వర్గం సంక్షేమం కాదనే వర్గ చైతన్యం పెంచుకోవాలి. రాజీ లేని పోరును ప్రస్తుతిస్తూ “ప్రజా ఉద్యమ సంతకం.. చట్ట భాషకి ఎప్పుడు అర్థం కావాలి?”అని ప్రశ్నిస్తాడు. ఈ తరుణంలో ఫ్రాంజ్ ఫానన్ తన రచన “Black Skin, White Masks” లో ఉటంకించిన”every citizen of a nation is responsible for the acts perpetrated in the name of the nation” అందరూ గుర్తు చేసుకోవాలి.
‘నా పేరే’ రేపటి పోరురా!’ కవిత నేటి మన దేశ సమగ్ర ముఖచిత్రానికి అచ్చమైన పద చిత్రం. అసమానతలు, హింస, వనాలలో ఖనిజాలను దోచే జాతీయ,విజాతీయ సంస్థలపై వదిలిన కవితా క్షిపణి. ఆ కోవలోనిది మార్కెట్ పిడివాదం పై ఎక్కుపెట్టిన “ప్రపంచ మృత్యుగీతం” కవిత.
కేశవ్ కుమార్'”ఆదిమ పౌరుడు”లో అంబేద్కర్ భావాల ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
‘”ప్రజాస్వామ్యం”,”టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ”,”షాహిన్ బాగ్” లాంటి కవితలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. మొదటి కవితలో “ప్రజాస్వామ్యమంటే/మెజారిటీ ఓట్ల ఆమోదం కాదు/
ఓట్ల వెనక నోట్లు కాదు/ నోట్ల వెనకనున్న కులదోపిడీ కాదు/ అదో సామాజిక నైతిక సమానత్వం!”
అనే పంక్తులలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వంతో పాటు సాలిడారిటీ అవసరమనే అంబేడ్కర్ ఆలోచనల ప్రభావం ఉంది.
“చెడగొట్టాలి” అనే కవిత, “ఓరి అమాయకుడా!’ అనే కవితలలో కొంత భావ వైరుధ్యం కనిపిస్తుంది. అయితే రెండో కవితను కడుపులో చల్ల కదలకుండా మార్పు గురించి మాట్లాడే ఉపన్యాస కేసరుల హిపోక్రసీపై వ్యతిరేకంగా చూడాలి. ఈ కవి కేవలం ఫార్మల్ డెమోక్రసీని సమర్థించడు. అలాగే అసాధ్యమైన, అవాస్తవిక ఆచరణ పట్ల కూడా మక్కువ చూపడు. యంత్రస్వామ్యాన్ని తీవ్రంగా ఖండిస్తాడు. ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త రజనీ కొఠారి చెప్పినట్లు ఈ యంత్ర స్వామ్య, ప్రకృతి విధ్వంస అభివృద్ధి నమూనా marginalised వర్గాలను expendable గా పరిగణిస్తుంది.
ఇక “దేశం సిగ్గుపడాలి” కవిత కారాగారంలోనే కన్నుమూసిన ఫాదర్ ‘స్టాన్ స్వామి’ గురించి రాసింది. గోర్కీ వర్ణించిన స్వర్ణ పిశాచి నగర నాగరికత విశ్వ వ్యాప్తమైన నేడు ఈ పుస్తకంలోని చివరి కవిత “మానవానంతర ప్రపంచంలో” రాసిన “కొత్త భాషని కప్పుకున్న నైతిక సూత్రమొకటి/
మానవ సమూహమంతా ఆవాహనమవ్వాలి!” అనే మాటల్లో ఎంతో ఆశావాదం కనబడుతుంది. ఈ సంపుటిలో చాలా కవితలు కొలిమి, పాలపిట్ట, విశాలాంధ్ర, ప్రజాశక్తి మొదలగు పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
తన సోదరుడు విజయ్ కుమార్ స్మృతికి ఈ పుస్తకాన్ని అంకితం చేసిన ఈ తాత్విక కవి కేశవ్ కుమార్ భావిలో మరెన్నో రచనలు చేయాలని కోరుకుందాం.
*
ఆదిమ పౌరుడి పై heart touch సమీక్ష
Excellant message