ఆత్మన్యూనత నుంచి ఆత్మగౌరవం దాకా

2000-2001 నుండి తెలుగు కథ అంటే కేవలం సీమాoద్ర కథకులు రాసిన కథలేనని అటు సంకలన కర్తలు, ఇటు విమర్శకులు గాఢoగా నమ్మి అక్కడి కథలనే ఎక్కువగా కథా వార్షికలకు ఎంపిక చేయడం, విమర్శా వ్యాసాల్లో అక్కడి కథలనే ఎక్కువగా కోట్ చేయడం చేశారు. ఇలాంటి వాతావరణoలో సహజంగానే తెలంగాణ కథకుడు ఒక విధమైన ఆత్మన్యూనతకు లోనయ్యాడు.

తెలంగాణలో కథే లేదని, ఉన్నా అది ఏడుపుగొట్టు కథేనని లేదా విప్లవ కథేనని దుష్ప్రచారం చేస్తూ వస్తోన్న వారికి తెలంగాణ కథ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూ వస్తూనే ఉంది. తెలంగాణ కథలో కేవలం వస్తువు మాత్రమే ఉంటుందని శిల్పం కోసం దివిటీ పట్టి వెతకాలని విమర్శిస్తున్న వారికి కూడా తెలంగాణ కథ జవాబు చెప్తూ ముందుకు నడుస్తోంది. వస్తు, శిల్పాలను మేళవించి ఎంత బాగా రాసినా ఫలానా కథా వార్షికలో తమ కథకు చోటు దొరకలేదని, అగ్రశ్రేణి విమర్శకుల దృష్టికి పోలేదని ఒకింత బాధ పడే తెలంగాణ కథకులు ఇప్పటికీ ఉన్నారు.

2000-2001 నుండి తెలుగు కథ అంటే కేవలం సీమాoద్ర కథకులు రాసిన కథలేనని అటు సంకలన కర్తలు, ఇటు విమర్శకులు గాఢoగా నమ్మి అక్కడి కథలనే ఎక్కువగా కథా వార్షికలకు ఎంపిక చేయడం, విమర్శా వ్యాసాల్లో అక్కడి కథలనే ఎక్కువగా కోట్ చేయడం చేశారు. ఇలాంటి వాతావరణoలో సహజంగానే తెలంగాణ కథకుడు ఒక విధమైన ఆత్మన్యూనతకు లోనయ్యాడు. అప్పటికే తెలంగాణ భాష నాజూకుగా ఉండదని, కథ అల్లకంలో ‘షూలేస్’ కున్నంత సహజత్వం చూపరనే  విమర్శ చాప కింద నీరులాగా పర్చుకుంటోంది. ఇదే సమయంలో తెలంగాణ మలిదశ (2001-2014) ఉద్యమం కూడా మొదలైంది. దీంతో ఒక్కసారి తెలంగాణ సామాజిక ముఖచిత్రం మారిపోయింది. నీళ్ళు, నిధులు, నియామకాలు, తెలంగాణ భాష, ఆత్మగౌరవం లాంటివి పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి.  ఈ నేపథ్యంలో తెలంగాణ రచయితలు, విమర్శకులు, కథకులు అసలు తెలుగు కథ వస్తు, శిల్పాలను ఎవరు నిర్ణయిస్తారు? దానికి ఏవైనా కొలమానాలు ఉన్నాయా? వారు రచయితలా, విమర్శకులా లేదా సంకలనకర్తలా/సంపాదకులా? అనే చర్చ తీవ్ర స్థాయిలో మొదలైంది.

వ్యూహాత్మకంగానే ఒక ప్రాంతపు కథను నిర్లక్ష్యం చేస్తున్నారని, కనీసం జనాభా దామాషా ప్రకారమైనా తెలంగాణ కథలకు వార్షిక సంకలనాల్లో చోటు లభించడం లేదని వాపోయారు. ఇలాంటి పరిస్థితే 2013 దాకా కొనసాగింది. ఈ పరిస్థితుల్లో ‘మన ప్రాంతం మనకు కావాలె’అన్నట్టుగానే మన కథను మనమే గౌరవిoచుకుందామనే సోయితో ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం 2013 నుంచి తెలంగాణ కథా వార్షికలు తీసుకురావాలని నిర్ణయించింది.  అలా మొదలైన ప్రయాణం నేటికి దశాబ్దపు మైలు రాయిని చేరుకుంది.

తొలి సంకలనం ‘రంది’ సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబల సంపాదకత్వంలో వెలువడింది. తన్లాట – 2014 సంకలనo సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, వెల్దండి శ్రీధర్ ముగ్గురి సంపాదకత్వంలో వెలువడింది.  తరువాత వెలువడిన అలుగు – 2015, కూరాడు – 2016, దావత్ – 2017, రివాజు – 2018, రూబిడి – 2019, బుగులు – 2020, నెనరు – 2021, దురస్తు – 2022 సంకలనాలు డా. సంగిశెట్టి శ్రీనివాస్,    డా. వెల్దండి శ్రీధర్ ల సంపాదకత్వంలో వెలుగు చూసాయి. ఇప్పటి దాకా 72 మంది కథకులు రాసిన 113 మెరుగైన కథలను పైన పేర్కొన్న సంకలనాల ద్వారా సహృదయ పాఠకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవి మాత్రమే ఉత్తమ కథలా? అని ప్రశ్నించే వారు లేకపోలేదు. మాకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం సగటున 13 కథలను సంకలనం చేస్తూ వస్తున్నాము. ఇంకా చదవాల్సిన కథల జాబితా ప్రతి సంకలనం చివరి పుటల్లో పొందు పరుస్తున్నాము. పాఠకులు వాటిని కూడా చదవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ప్రతి సంకలనంలో సీనియర్ కథకుల కథలతో పాటు కనీసం 50 శాతమైనా కొత్త కథకుల్ని ప్రోత్సహిస్తున్నాము. తద్వారా వారిలో రాయాలనే ఉత్తేజాన్ని నింపడానికి ప్రయత్నిoచాము. ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తేనే కొత్త భావనలు, కొత్త అభివ్యక్తులు, కొత్త డిక్షన్ కథలకు వచ్చి చేరుతుందని ఒక నమ్మకం. మా నమ్మకం వమ్ము కాకుండా కొత్త కథకులు చాలా మంది సీనియర్ కథకులతో పోటీపడి కథలు రాస్తున్నారు. ఈ సంకలనాలు ప్రాతినిథ్య కథా సంకలనాలు కాకున్నా ప్రతి కథ తన స్థానాన్ని తాను వెతుక్కొని ఇందులో కూర్చుంటుంది. ఎలాంటి ప్రణాళిక లేకుండానే అన్ని వర్గాల కథలకు చోటు కల్పించినట్లు అయింది. అలా ఈ కథా సంకలనాలకు ఒక ‘ఓరిగామి’ లక్షణం అలవడిoది.

10వ మెట్టు మీద నిలబడి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గత దశాబ్ద కాలపు సామాజిక చరిత్రకు మిగతా ఆకరాలతో పాటు ఈ కథలు కూడా ఒక ఆధారంగా నిలుస్తాయి. ఇప్పటికే కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ కథా సంకలనాల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. తెలంగాణ కథకు ఇదొక గొప్ప గౌరవం.

తెలుగు కథా సాహిత్యం  ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఎంతో  సౌలభ్యంగా తెలంగాణ కథను విస్మరిస్తున్న సోకాల్డ్ విమర్శకులకు, ప్రాంతేతరులకు ఈ కథా సంకలనాలు ఒక తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తాయి. తెలంగాణ కథను కూడా పట్టించుకోవాల్సిన అనివార్య పరిస్థితిని ఈ కథలు ఎత్తి చూపుతున్నాయి. తెలంగాణ కథ కూడా మిగతా భారతీయ భాషలకు ఏమాత్రం తీసిపోకుండా  వెలువడుతుందని ఈ కథలు నిరూపిస్తున్నాయి.

తెలంగాణ కథలంటే సమస్యను ఏకరువు పెట్టే కథలు అనే అపవాదును ఈ కథా సంకలనాలు పరాస్తం చేస్తున్నాయి. అయితే కొన్ని సమస్యా కేంద్రక కథలు లేక పోలేదు. అప్పటి సమయ, సందర్భాలను బట్టి ఆయా కథల ఎన్నిక జరిగి ఉంటుందనే విషయాన్ని మనసులో ఉంచుకొని చూస్తే మా ఆరాటం అర్థం అవుతుంది.

ఈ పది కథా సంకలనాలను పరిశీలిస్తే ఎన్నో ఖాళీలు కనిపిస్తాయి. వాటిని భర్తీ చేసే బాధ్యత కూడా కథకుల మీద ఉన్నదని గమనించాలి. ఈ పదేళ్ళ కాలంలో సమాజం ఎంతో వేగంగా మారింది. ఎన్నో సంక్షోభాలు సగటు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రభుత్వాల నిరంకుశత్వం, భావప్రకటనా స్వాతంత్ర్యం లేకపోవడం, రచయితల మౌనం, కార్పోరేట్ శక్తుల దోపిడీ, నిరుద్యోగుల ఆకలి మంటలు, యువత మానసిక సంఘర్షణ, బలహీనతలు, స్వార్థం, అమానవీయత, తెలంగాణ ఉద్యమం కోసం తమ బిడ్డల్ని త్యాగం చేసిన కుటుంబాల దీనస్థితి, ప్రకృతి, వనరుల విధ్వంసం, అవినీతి, రాజకీయ నాయకుల అక్రమ సంపాదన, మత విద్వేషాలు, మైనార్టీలు, స్త్రీలు, పిల్లలపై అత్యాచారాలు, దళితులపై దాడులు, పరువు హత్యలు, అభద్రత, తెలుగు భాష పతన దశ, మనుషుల మధ్య కనిపించని దూరం… ఇలా ఎన్నో కల్లోలాలు సమాజాన్ని అతలాకుతలం చేశాయి.

రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా కాపాడుకోలేక పోతున్నాం. ఇవిగాక ఎన్నో కులాల జీవితాలు, వాటిల్లోని చీకటి ఇంకా కథల్లోకి ఎక్కనేలేదు. ఎప్పటికప్పుడు కాలపు అన్ని అంచుల్లోని జీవితాల్ని కథీకరించడంలో కథకులు వెనుకబడ్డారని చెప్పాలి. రావాల్సినంత గాఢoగా కథలు రాలేదేమో అనిపిస్తుంది. ప్రజల నోళ్ళల్లో నానుతున్న తెలంగాణ తెలుగును బలంగా ప్రయోగించటంలో ఇంకా ఎంతో సాధన చేయాల్సే ఉన్నది.  శిల్పం విషయంలో కూడా ఇంకా మెరుగుపడాల్సి ఉన్నది. చాలా కథలు నీరసంగా, పొడి పొడిగా వస్తున్నాయి. కొన్ని కథలు ఏదో ఒక సమస్యను ఎత్తుకొని కథ చివరలో దాని పరిష్కారాన్ని చూపెడుతున్నాయి. కొత్త కథకులు ఈ పొరపాట్లు ఎక్కువగా చేస్తున్నారు. దాన్నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలి. కొత్తగా రాసేవారిలో అధ్యయన లోపం కూడా కనిపిస్తుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి.

కథతో నడవడమంటే సమాజంతో కలిసి నడవడం. మన భాషతో కూడి నడవడం, మనుషులతో నడవడం, అందుకే కథ మన జీవితాల్లో రక్తగతమై నిలిచింది. కథ లేని కాలాన్ని ఊహించలేం. కథను బతికించుకోవాలంటే చెట్టును బతికించుకున్నట్టు మనిషిని బతికించుకోవాలి. భాషను కాపాడుకోవాలి. కథను రెండు చేతుల మధ్య దీపాన్ని కాపాడుకున్నట్లు కాపాడుకోవాలి. అందుకు తెలుగువారంతా కృషి చేయాలి.

సద్విమర్శను ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉన్నాము. అందుకే ప్రతి సంకలనం వెనుక కిందటి సంవత్సరపు సంకలనం మీద రాసిన ఒక విమర్శా వ్యాసాన్ని ప్రచురిస్తున్నాము. ఇది ఎప్పటికప్పుడు మమ్మల్ని కథా సరళ రేఖ మీద నడిపిస్తుంది. ఈ సందర్భంగా విజ్ఞులైన విమర్శకులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

గతంలో కర్ర ఎల్లారెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ కథా వార్షికలు తీసుకొచ్చినా ఏవో కారణాల వల్ల  మధ్యలోనే ఆగిపోయాయి. దశాబ్ద కాలంగా మా ఈ ప్రయత్నం నిరాటంకంగా ఇలా కొనసాగుతున్నదంటే దానికి సహృదయ పాఠకుల ఆదరణ, కథకుల సహకారమే కారణం. ఇక ముందు కూడా తెలంగాణ కథను అక్కున చేర్చుకొని మమ్మల్ని ముందుకు నడపాల్సింది కూడా కథకులు, పాఠకులే.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

4 comments

Leave a Reply to చందు తులసి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పదేళ్ళుగా కొనసాగుతున్న మీ కృషికి అభినందనలు సార్.

  • తెలంగాణ సామాజిక ముఖచిత్రం ఎంతో వైవిధ్యభరితమైనది. ఇక్కడ వెనుకబాటు,వేదన ఎంతగా ఉందో చైతన్యము, సృజన శీలత అంతకన్నా ఎక్కువ స్థాయిలో కాలానుగుణంగా ప్రకటితమౌతూ వస్తుంది. ఇక్కడ వెల్లువెత్తిన పోరాటాలు సమాజాన్ని నిత్యం జాగృతం చేస్తున్నాయి. ఈ వెలుగు సృజన రంగంలోనూ ప్రసరిస్తోంది. పాట,కవిత్వం,కథ,నాటకంతో పాటు తెలంగాణ ఆత్మ అయిన జానపదం తమ ఉనికిని పతాక స్థాయిలో ప్రకటిస్తున్నాయి.
    అయితే వలస వాదుల ఏలుబడిలో మన భాషా సాహిత్యాల పట్ల వ్యూహాత్మకంగా కొనసాగిన వివక్ష మన సాహిత్యానికి దక్కాల్సిన గౌరవం దక్కకుండా చేసింది. రాష్ట్ర సాధనోద్యమ సందర్భం నుండి నేటి వరకు మన సాహిత్య గౌరవం కోసం గొంతు విప్పుతున్న సంగిశెట్టి శ్రీనివాస్ అన్నకు నెనర్లు . పరిశోధకుడిగా విస్మృత సాహిత్యాన్ని వెలికి తీయడంతో పాటు, తెలంగాణ కథకు పట్టం కడుతున్న కృషి గొప్పది.మితృలు వెల్దండి శ్రీధర్, స్కైబాబ ఆయనకు తోడవడంతో తెలంగాణ కథ ను మిగతా ప్రాంతాల కథల పక్కన సమున్నతంగా నిలపగలుగుతున్నారు. మిత్రులకు అభినందనలు

  • ప్రపంచ కథకు దారులు వేసింది తెలంగాణ గడ్డనే. ఇప్పుడు వారనుకునుటున్న ఉత్తమ కథలు తెలంగాణలో ఎప్పుడో వచ్చాయి. ప్రజా సాహిత్యం గురించి మాట్లాడాల్సి వస్తే, అది ముమ్మాటికీ తెలంగాణ ప్రాంతమే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ నిషేధం విధించిన చెరబండ రాజు “చిరంజీవులు కథ”కు దక్కిన గౌరవం, దేశంలో ఏ భాషలోనైనా ఏ కథకైనా దక్కిందా? తెలంగాణ కథలు ప్రజా మన్నన పొందిన కథలు. అవార్డులు, రివార్డులు ప్రాతిపదిక కాదు. గొప్పదనం చూపును బట్టి ఉంటుంది. అయినా ఎవరి దారి వారిది. కథా వలయంలో ఎవరు ముందున్నారు అంటే నోరున్న వాళ్లదే చెల్లుతుంది. మీ కృషి శాశ్వతమైంది. అభినందనలు.

  • క్రిందటేడాది సంకలనం పై ఒక విమర్శనా వ్యాసం ప్రచురించడం అన్నది చాలా గొప్పగా నచ్చింది .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు