ఆడపిల్ల చదువు  ‘ఇగురం’

తెలుగు కథా సాహిత్యానికి ఎంతో మంది రచయితలు తమ జీవితాల్ని, విలువైన కాలాన్ని వెచ్చించి ఎన్నో మైలు రాళ్ళ లాంటి కథల్ని అందించారు. వారిలో కొంత మంది పేరు కోసం పాకులాడే ఉబలాటపు కథకులైతే మరి కొంత మంది తమ అసలు పేరు చెప్పకుండా కేవలం కలం పేరుతో రాసి అజ్ఞాతంగానే ఉండిపోయేవారు కొందరు. ఇంకా కొంత మంది అసలు పేరు, కలం పేరు కూడా లేకుండా వేరే ప్రసిద్ధ రచయిత పేరుతోనో, ఇప్పుడిప్పుడే కొత్తగా కలం పట్టిన రచయిత పేరు మీదనో రాసి తమ జ్ఞానాన్ని, ఉత్తమ కథల్ని ప్రపంచానికి చాటే వారున్నారు.

ఏ విధంగానైతేనేమీ కథా సముద్రంలోకి ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో కథా రత్నాలను జారవిడిచారు. అందుకే తెలుగు కథా సాగరంలో కంఠ దఘ్నంగా మునిగి ఓపిగ్గా ఏరుకునేవారికి ఎన్నో విలువైన వజ్ర, వైడూర్యాల్లాంటి కథలు లభిస్తున్నాయి.  అట్లాంటి ఒక అనర్ఘ కథా రత్నం ఇగురం. రచయి(త)త్రి పేరు భాగ్యరేఖ. ఇది కలం పేరో అసలు పేరో తెలియదు. చాలా మందిని విచారించినా రచయిత వివరాలు తెలియరాలేదు. ఈ వ్యాసం ద్వారానైనా తెలిస్తే కథా సాహిత్యానికి మేలు జరిగినట్టు అవుతుంది. ఈ కథ మొదట 20 జూన్ 2004లో వార్త ఆదివారంలో ప్రచురింపబడింది. తరువాత కర్ర ఎల్లారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన ‘తెలంగాణ కథ – 2004’ లో కూడా ఒక ఉత్తమ కథగా స్థానం సంపాదించుకుంది.

పిల్లల్ని కంటాము గాని వాళ్ళ తల రాతల్ని కంటామా? అని సామెత చెప్తుంటారు కానీ నూటికి ఎనభై శాతం ఆడ పిల్లల తల రాతల్ని వాళ్ళ నుదుటి మీద తల్లిదండ్రులే బలవంతంగా రాస్తుంటారు. పిల్లల కలల్ని చిదిమేసి తల్లిదండ్రులు తమ అభిప్రాయాల్నే పిల్లల మీద రుద్దుతుంటారు. తాము గీచిన గీత మీదే నడవాలని శాసిస్తుంటారు. ఆడ పిల్ల పుట్టగానే నిజంగానే ఆమె ఈడ పిల్ల కాదు ఆడ పిల్లనే అని భావించి ఎంతో కొంత దూరం చదివించి ఒక అయ్య చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటారు. “స్త్రీ కి కూడా ఒక శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి” అంటాడు చలం. కాని ఎంత మంది తల్లిదండ్రులు, భర్తలు పాటిస్తున్నారనేది కోటి రూకల ప్రశ్న.

అవసరమైతే తల్లిదండ్రుల్ని ఎదిరించి తన ఇష్టానుసారం నడుచుకునే స్వేచ్చను అబ్బాయికి ఇచ్చినంతగా అమ్మాయికి ఇవ్వలేదు ఈ సమాజం. అమ్మాయిలకు తాను ఉన్నత చదువులు చదివి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే జీవితం జీవించాలని ఉంటుంది. కాని ఆ ఆశ చిగురు దశలోనే తుంచి వేయబడుతుంది. ఈ ‘ఇగురం’ కథలో కూడా భారతి అలాంటి కలలే కంటుంది. కాని ఆమె తండ్రి ‘మంచి సంబంధం’ అని ఇంటర్మీడియేట్ కాగానే ఆమె ఇంకా చదువుకుంటానని పోరు పెడుతున్నా వినకుండా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తాడు. భారతి తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పలేక తల వంచుకొని తాళి కట్టించుకొని వెళ్ళి పోతుంది. కానీ అది ‘మంచి సంబంధం’ కాదు. అల్లుడు పని దొంగ. పెద్దగా చదువు లేదు. పోనీ ఏదైనా బిజినెస్ పెట్టిస్తే బతుకుతాడనుకుంటే వ్యాపారం చేయరాక అందులో కూడా నష్టం వస్తుంది.

పని లేక పోతే అవారగాడు అయితడని మరో పనిలో కుదిరిస్తే అది కూడా చాత కాదు. ఈ పాటికే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అల్లుని కోసం సర్దుతుంటే భారతి తండ్రి మల్రెడ్డి దగ్గరున్న పైసలన్నీ అయిపోతాయి. అల్లుడు ఇంకా డబ్బులు తేపొమ్మని భారతిని కొట్టేది కొడుతుంటాడు. ఇట్లా చాలా సార్లు జరుగుతుంది. కాని భారతి పంటి బిగువున భరించి విషయాన్ని తండ్రిదాకా రానీయదు. ఎంత కొట్టినా డబ్బులు రాక పోవడంతో ఈసారి ఇంకా బాగా కొడుతాడు, బాగా అంటే పెయ్యన్ని వాతలు తేలుతాయి. ఆ దెబ్బలకు తాళ లేక భారతి అమ్మగారింటికి వచ్చేస్తుంది.  మల్రెడ్డి మనసంతా కుంపటిలా మారి పోతుంది. ఏంజెయ్యాలో అర్థం కాక తన చిన్నమ్మ లచ్చిమక్క దగ్గరికి వస్తాడు.

“బంగారమసుంటి బిడ్డె. దాని అద్రుష్టంల ఇట్ల రాశిండేంరా దేవుడూ.. మరెట్ల జేస్తనంటావ్ రా?” అని అడుగుతుంది లచ్చిమక్క.

“చేశేదేముంది చిన్నీ! మల్లిన్ని పైసల్దీస్క పొయ్యి మన్సు రాయి జేస్కోని పిల్లనాడ దించొస్త”

లచ్చిమక్క ఉలిక్కి పడ్డట్టయింది

“పిల్లేమంటుందిరా మరీ…”

“మల్ల వోనంటే పోనంటుంది గని… ఆడివిల్లాయే కష్టమో.. సుకమో.. పోక తప్పుతదా?”

“మరి పిల్లకిష్టం లేనప్పుడు సావుమని తోలిస్తవా?”

“అట్లంటెట్ల చిన్నీ! ఆడ కష్టముందని ఇంట్ల వెట్టుకుంటమా! పెండ్లయిన ఆడివిల్లను?”

“లే… ఆల్లు సంపుతే దెచ్చి బొందల వెట్కుంటము” కస్సున లేచింది లచ్చిమక్క.

లచ్చిమక్క ఏం ఉపాయం చెప్పింది. చివరికి భారతి జీవితం ఏమైంది? సంసారం నిలబడిందా?  తెగతెంపులు అయిందా? భారతి మళ్ళీ చదువు కొనసాగించిందా? లేదా అత్తగారింటికి పోయిందా? మల్రెడ్డి ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఇవన్నీ కథలోనే చదవాలి.

భారతీయ వివాహ వ్యవస్థను, సగటు తల్లిదండ్రుల మనస్తత్వాన్ని, అత్తవారిండ్లలో ఆడ పిల్లల ధైన్య స్థితిని, సోమరి పోతులైన నేటి తరం యువకుల పరాన్నజీవత్వాన్ని చాలా లోతుల్లోకి వెళ్ళి చర్చించిన కథ ఇది.  కుటుంబమనే ముసుగులో పురుషులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే విధానాన్ని కూడా ఈ కథ ప్రశ్నించింది. అనాదిగా ఆడపిల్లల ఆశలు, ఆశయాలు, జీవితాలు ఎంతలా బుగ్గిపాలవుతున్నాయో ప్రతి అక్షరంలో చూపెట్టిన కథ. ఇంత సాంకేతిక యుగంలో జీవిస్తున్నామని అనుకుంటున్నా ఇంకా అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. పిల్లల ఇష్టాయిష్టాలను లెక్క లోకి తీసుకోకుండా బలవంతంగా ఏదో ఒక మొరటు గుంజకు అమ్మాయిలను కట్టేస్తున్నారు. అక్కడితో ఆ అమ్మాయి జీవితం నిప్పుల మీది నడక. భూగోళం మీది ఏ మనిషికైనా చదువే ప్రధానం  కదా! మరీ మఖ్యంగా ఆడపిల్లలకు చదువే ఊత కర్ర. అది కాస్తా మధ్యలోనే విరిగి పోతే. జీవితం సాంతం అవిటిది అవుతుంది.  మొగుడి మీద ఆధార పడాల్సిందే. వాడు కూడా బాధ్యత లేని వాడు దొరికితే ఇక జీవితాలు ఎలా ఏడుస్తాయో కళ్ళకు కడుతుందీ కథ.

కథలో ప్రధాన పాత్రలు మూడు. లచ్చిమక్క, మల్రెడ్డి, భారతి. అప్రధాన పాత్రలు రెండు. అల్లుడు, టీచర్. ఇవి రెండూ తెర మీదికి రావు. భారతి పాత్ర కూడా తెర మీదికి రాదు కాని కథంతా ఆమె గురించే.  లచ్చిమక్క పాత్రను మలిచిన తీరులోనే రచయిత్రి నేర్పు అంతా దాగి ఉంది. లచ్చిమక్క అవడానికి ఒక తరం ముందరి మనిషి. కానీ ఆలోచనల్లో ఈ తరం మనిషి. పైగా పని పట్ల గౌరవమున్న పాత్ర కూడా. మన పని మనం చేసుకోవడంలో తప్పేంటి? అని అంత పెద్ద వయసులో కూడా తన పనులు తానే చేసుకొని ఇప్పటి టీవీల ముందు కాలు మీద కాలేసుకొని కూర్చునే తరానికి బుద్ధి చెప్పే పాత్ర.

అంతేకాదు చదువు విలువ తెలిసిన పాత్ర కూడా. ఆడపిల్లకు చదువు వస్తే అవనికే వెలుగు వస్తుందని నమ్మిన పాత్ర. “అయ్యో ఏ కాలంలున్నవురా పిల్లగా? దాన్నొకరు నడ్పేదేందిరా? అంతో ఇంతో సదువుకున్నది పన్నెండోద్దాక. కాలేజీకి పంపు.. పైకి సద్విపియ్యి. రేపు దాని పొట్టకు బట్టకే గాదు. ఇంక పదిమందిని నడ్పనీకే సరిపోను సంపాయిస్తది. దాని కాళ్ళ మీద అది నిలవడ్తది. ఆనాడే అది పెండ్లొద్దు గిప్పుడే… డిగ్రీ సదువుతనంటే ఇనకపోతివి. ఆ సారు గూడ తనంతల తనే నీ ఇంటి కొచ్చి పిల్లకు అన్నిట్ల తొంబై మార్కులొచ్చినై డాక్టర్ సదువు సదివిపిస్తే తప్పక సీటొస్తదని ఒక్క తీర్గ జెప్పి పాయె. మంచి సంబందం.. మంచి సంబందం అనుకుంట.. నీకు ఉచ్చ నిల్వక పాయె…”  అంటూ ‘పెళ్లికెందుకు తొందర – చదువు నేర్పు ముందర’ అన్నట్టుగా ఆడ పిల్ల చదువు ప్రాధాన్యతను నొక్కి చెప్పిన ముందు చూపున్న పాత్ర. ఒక స్త్రీ బాధను మరో స్త్రీయే సరిగ్గా అర్థం చేసుకుంటుందనే విషయాన్ని నిజం చేస్తూ భారతి మనసును సరిగ్గా అర్థం చేసుకొని ఆమె సమస్యకు పరిష్కారం చూపుతుంది.  బాల్య వివాహాలు వద్దని, బతుకు పాఠాన్ని నేర్పుతుందీ పాత్ర.

మల్రెడ్డి అవడానికి ఇప్పటి తరం మనిషే అయినా ఆయన ఆలోచనలు పాత తరం నాటివి. మిగతా సమాజం లాగానే ఆడ పిల్లకు పెళ్లి చేసిన తరువాత కష్టమో నష్టమో భర్తను పట్టుకొని ఎడ్వాలె అని నమ్మే మనిషి. దాని అదృష్టానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు. దాని గ్రహచారం అలా కాలింది అని అన్నీ దైవ నిర్ణయమే అన్నట్టుగా సాగుతుంది మల్రెడ్డి ఆలోచనల తీరు. సహజంగానే భారతికి ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నా తండ్రి మాటకు గౌరవమిచ్చి పెళ్ళికి తల వంచుతుంది. ఇట్లా ఇందులోని పాత్రలన్నీ తమ సహజ గుణానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాయి.  ఒక్క లచ్చిమక్క పాత్ర తప్ప.

కథను చెప్పడానికి రచయిత్రి ఎంచుకున్న శైలీ, శిల్పం, భాష అమోఘం. కథంతా సంభాషణా శైలి లోనే సాగుతుంది. మకరందం లాంటి తెలంగాణ తెలుగు నాదత్వం,  సొగసు ప్రతి పాఠకుడ్ని ఆకట్టుకుంటాయి. కథా వ్యాకరణ వేత్తలు కథకు ‘సంక్షిప్తత’ ప్రాణం వంటిదంటారు. ఈ కథ దీనికి నిదర్శనంలాంటి కథ. కేవలం రెండు పేజీల కథలోనే రచయిత్రి జీవిత సారాన్ని వడగట్టి చూపెట్టింది.  ఆడ పిల్ల చదువు పట్ల ప్రతి మనిషికుండాల్సిన దృక్పథాన్ని చాలా ప్రతిభావంతంగా చెప్పింది.  జ్ఞాన నేత్రమే అన్నీ సమస్యలకు పరిష్కారం చూపెడుతుందని దానికి చదువు కీలకమైందని చెప్పడంలో విజయం సాధించింది. బాల్య వివాహాలు జరిగినంత కాలం, ఆడపిల్లను చదువుకోకుండా ఆపినంత కాలం, బాధ్యతలేని యువత పెరుగుతున్నంత కాలం ఈ కథ ఒక చెంప పెట్టులా సగటు మనిషి నడవడిని సవరిస్తూనే ఉంటుంది.

(గొరుసు జగదీశ్వర రెడ్డి గారికి కృతజ్ఞతలు) 

కథ మొత్తం ఇగురం చదవండి:

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

22 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • యాడ పట్కొచ్చినవ్ సారూ ఈ కథ. టెక్స్ట్ బుక్ ల పెట్టాల్సిన కథ కద ఇది….
    ఈ కథకి రావాల్సిన గుర్తింపు రాలేదు. మంచి కథ సదివించినవ్…. నీ కడుపు సల్లగుండ ,🤗

  • చక్కని విశ్లేషణ శ్రీధర్ గారు.

  • అబ్బా!! మంచి కథ. మొదటి నుండి చివరి దాకా ఎక్కడ ఆగకుండా చదివించేలా రాసారు కథ. విశ్లేషణలో కూడా లోతుగా ఉంది..👌

  • ఆడపిల్లల జీవితాలు తమ చేతులలో కాక కట్టుకునే భర్తలపై, మెట్టినింటి వాతావరణంపై ఆధారపడడం తరతరాలుగా కొనసాగుతున్న సామాజికవైపరీత్యం!
    ఆడవాళ్ళు అన్నప్పుడు అది మాములే సర్దుకుపోవాలె అని చెప్పడం ఆనవాయితీ అయిపోయింది.
    వెల్దండి శ్రీధర్ గారి విశ్లేషణ పఠనకుతూహలాన్ని పెంచే విధంగా ఉంది.
    ‘తర్వాత ఏం జరిగిందో వెండితెరపై చూసి ఆనందించండి!’ అనే ధోరణిలో కాక సూచనాప్రాయంగానైనా కాస్త చెప్తే బాగుండుననిపించింది.
    కథ పేరు ఇగురం అని ఉంది . అంటే అమ్మాయికి ఇగురం చెప్పి, మల్ల బలవంతంగా పంపించిన్రేమోనని నా భయం .
    కథ పెడితే బాగుండేది.

    • ధన్యవాదాలు సార్… రెండవ పేరాలో ఇగురం అని బ్లూ కలర్ లో ఉంది. దాని మీద టచ్ చేయండి. కథ డౌన్ లోడ్ అవుతుంది.

      • ఓకే సర్ .
        ఇప్పుడే open చేసి చదివిన.
        నేను భయపడ్డట్టు కాకుండా ధైర్యంగా ముందడుగు వేయడం ముదావహం.
        తెలంగాణ భాషలో చక్కగ నడిచింది కథ.
        అయితే వ్యావహారికంగా ఇగురానికి వాడే అర్థం ఇక్కడ కలువదేమో!

  • Dr Sridhar’s analysis on “iguram”
    is very interesting and inspiring which made me to download the story and go through it instantaneously. The apt use of the great feminist distinct writer Chalam’s quote reflects the depth of critic’s literary knowledge. Sincere appreciation to Dr Veldandi for bringing the excellent short story in to lime light!

  • ఆద్యంతం ఉత్సుకతతో సాగినటువంటి కథ. అని అర్థమవుతుంది. ఇందులో పాత్రలు ముఖ్యంగా భారతి, మల్రెడ్డి, లచ్చిమక్క. ఈ మూడు పాత్రల్లో అతి కీలకమైన పాత్ర లచ్చిమక్క. కాకపోతే ఈ కథలోని మూలమలుపు ఎక్కడ నుండి మొదలవుతుంది అంటే మొత్తం సమాజాన్నికి వెలుగు బాటలు వేసి నడిపించేటువంటి జ్ఞాన జ్యోతులు ‘వెలుగు:గురువు. ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పినటువంటి విషయాన్ని లచ్చి
    మక్క పాత్రతో చెప్పబడింది. అంటే భారతి లో ఉన్నటువంటి తెలివితేటలను గురువే స్వయంగా వచ్చి చెప్పడం ద్వారా ఆ పాత్రకు ప్రాణం పోసినట్టు అయ్యిందని నా అభిప్రాయం. ఏదేమైనా ఇగురం కథ చాలా చక్కగా పాత్రల యొక్క స్వభావాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు సార్ మీకు అభినందనలు..

    -కొలిపాక శ్రీనివాస్
    9866514972.

  • చాలా బాగుంది శ్రీధర్ సార్. మీ విశ్లేషణ కథను ఎలా అర్థం చేసుకోవాలో?, రచయిత/ రచయిత్రి ఉద్దేశాన్ని చాలా చక్కగా చెప్పారు.

  • ఈ కథ చదివినప్పుడు అందులోని భాషే నన్ను కట్టిపడేసింది. ఇప్పుడు మళ్లీ మీ విశ్లేషణ. ప్రతికథకీ ఒక యాంకరింగ్ పాయింట్ వుంటుంది. కథలోని ఆ పాయింట్ ని కరెక్ట్ గా పట్టుకుని పాఠకులకు అందించారు శ్రీధర్. అభినందనలు.

  • మంచి కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు శ్రీధర్.. కథ మొత్తం పెడితే చదివి ఆనందించేవాళ్లం..

    • రెండవ పేరాలో ఇగురం అని బ్లూ కలర్ లో ఉంది. దాని మీద టచ్ చేయండి. కథ డౌన్ లోడ్ అవుతుంది.

  • ఒక అనర్ఘ కథా రత్నం ” ఇగురం” రచయిత్రి భాగ్యరేఖ గారి వివరాలు కర్రా ఎల్లారెడ్డి సారు ( Mobile No. : 98662 52260 ) ‘తెలంగాణ కథ – 2004’ సంపాదకులు … దయతో ఇలా చెప్పారు.

    రచయిత్రి భాగ్యరేఖ గారు కామర్స్ లెక్చరర్, రంగారెడ్డి జిల్లా వాసి. వారి భర్త బాలిరెడ్డి గారు వాస్తు శాస్త్ర నిపుణులు. భాగ్యరేఖ గారు సుమారు 20 మంచి కధలు రాసారు. తెలంగాణ కథ సంకలనాలలో కొన్ని కధలు వచ్చాయి. వారి పర్మిషన్ తీసుకోకుండా ఓ ఆడబిడ్డ ఫోను నంబరు, యీ మెయిల్ వివరాలు ఇక్కడ రాయకూడదు కదా. అందుకే ఇవ్వడం లేదు. ఫేస్ బుక్ లో కూడా భాగ్యరేఖ గారి మరిన్ని వివరాలు చూడవచ్చని కర్రా ఎల్లారెడ్డి సారు చెప్పిండు.

  • అనాదిగా ఆడపిల్లల ఆశలు, ఆశయాలు, జీవితాలు ఎంతలా బుగ్గిపాలవుతున్నాయో ప్రతి అక్షరంలో చూపెట్టిన ఇగురం కథ భాగ్యరేఖ తల్లికి… యీ కధా అనర్ఘాన్ని మనకు వివరణాత్మకంగా, విశ్లేషణతో పరిచయం చేసిన డా. శ్రీధర్ వెల్దండి గారికి నెనర్లు.

    ” అన్నాయం జరిగినప్పుడు ఆడవిల్లకు అమ్మగారి అండ కొండంత బలం బిడ్డా ” అని…. ఆడపిల్ల జీవితం అవిటిది కాకుండా చదువే ఊత కర్రలా నిలుస్తుందని ఇగురం : వివరం చెప్పి మనసంతా కుంపటిలా ఉన్న మల్రెడ్డి తన బిడ్డ భారతికి దన్నుగా నిలబడేలా చేసిన మల్రెడ్డి చిన్నమ్మ లచ్చిమక్కకు మొక్కుతున్నా.

    కొత్తగూడెంలో ఆడబిడ్డలకు సదువు సధ్యలే కాక భావి జీవితం బతుకుతెరువుల సుద్దులు చెప్పిన మహాభోధి డా. రాయదుర్గం విజయలక్ష్మి గారికీ ఇలాంటి వెతల కతలు తెలుసు. ఇంటర్మీడియేట్ కాగానే ఇంకా చదువుకుంటానని పోరు పెడుతున్నా వినకుండా పెళ్లిచేసి అత్తవారింటికి పంపించే తల్లిదండ్రుల మాటకు ఎదురుచెప్పలేక పోయి ధైన్యస్థితిలో తలలు వంచుతున్న తన స్కూలు ఆడబిడ్డలకు ధైర్యం చెప్పేవారు. ఇన్నాళ్లు చదువుల్లో నెగ్గిన మీరు ఇకమీద భావి జీవితంలో కూడా నెగ్గుతారు అంటూ ఆత్మవిశ్వాసం కలిగేలా చేసేవారు.

  • మంచి కథ. సదువుతుంటే జ్ఞానబోధ చేసినట్టుంది. మీ విశ్లేషణ సదివి కథ సదువుతుంటే వాళ్ల ముచ్చట కండ్ల ముంగిట జరిగినట్టు ఉంది.

  • డా. శ్రీధర్ గారికి నమస్కారం కథను బాగా విశ్లేషించారు.కథలోని సారాన్ని ఆంతర్యాన్ని దృశ్య చిత్రీకరణ చేశారు

  • బాగుంది సార్ విశ్లేషణ. కథ చదవడమే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు