లతకడా(బట్టలు) 

ఇంటి ముందు, ఇట్కల పైన కూసున్నరు అత్తా కోడళ్ళు,ఇద్దరి తలకాయలు మెరుస్తున్నయి, ఒకర్ది మసిలాగా ఇంకొకర్ది భూరే (మట్టి బంగారు)రంగులాగా మెరుస్తున్నయి.

వారికి కొంత దూరంల,ఇంటికి ముందే చిమకోళ్లు తిరుగుతున్నయి. వాటికి ఎన్కలా నెమలి పిల్లలు తిరుగుతున్నయి.అమ్మకి పిల్లలకి జమీన్ అస్మాన్ ఫరక్ ఉంది.

సాసు బోడి (అత్తకొడల్ల) ముఖాలు ఎటు ముకాన ఉన్న చిమకొడి అడ్గులను గంనిస్తానే వుంటరు.

చంపల దగ్గర ఏలాడుతున్న టోప్లి ( బుట్ట కమ్మల వంటి వెండి ఆభరణం) లు గిజిగాని గూడులా ఉయ్యాలలు ఊగుతున్నయి.

ధర్మ్యా తన దాది (నానమ్మ) గోద్లో (ఒడిలో) తల ఆన్చి భూమి పై పరిచి ఉన్న అయిమే ఫేట్యా పై ,యాడి (అమ్మ) కూసున్న వైపు   కాళ్ళు సాగదీసుకుని పడుకున్నడు. వాళ్ళ యాడి  దాదా (తాతయ్య)  షేవింగ్ బ్లేడ్తో  వాడి గోర్లు కత్తిరిస్తాంటే యాడి సేతుల మీద ఉన్న పచ్చబొట్ల సుక్కల్ని గమనిస్తున్నడు ధర్మ్యా.

దాది  ధర్మ్యా తల ఎంట్రుకల్ను తన సేతి ఏళ్ళతో దూస్తా రాగం తీత్తాంది.

సో…. జో మారో సోనా  – నిద్రపో నా బంగారమా

తూ సప్నేర జంగలేన జాన్ ఆ – నువ్వు కలల అడవికి పోయి రా

   2

వేల్ వేలేన ధుండ్ ఘుసన రచ కంకొడా – తిగతిగకు వెతుకు బోడ కాకరకాయలు దాక్కుని ఉంటాయి

ధాస్ మతేస్  – పరుగులు తియకు

పాడ్ మతేస్  – చేతిలోకి తీసుకోకు

సాత్ రంగేరో పంకొడా  – ఏడు రంగుల ఈకల్ను

మత్తర్ కరచ – మాయ చేస్తది

చమకావచ  – భయపెడతది

చోడేస్ మత్ కొంకొడారి వేలేన – వదలకు బోడ కాకర తీగను

సో…… జో…..  అంటూ పాడ్తా దుస్తుంది.ఆ దువ్వుడు అతనికి హాయిగా అన్పిస్తాంది,  ఆయిమె సేతి ఏళ్ళ ఉంగరాలు ధర్మ్యా తలకాయలోపల ఉన్న దొస్తులతో ముచ్చట్లు పెడ్తాంటే సమ్మగన్పిస్తాంది.

కన్లు మూసుకో పోతున్నయి. దాది సేతి గాజులు “ఎం నిద్రపోతవు లే లే” అంటూ ఖన్ ఖణ్ మంటూంటయి.

అటూ తండాలో జరంత దూరంల ఉన్న ఏప సెట్టు నిండా సిల్కలు వాలి గోల పెడ్తున్నయి, రోజు సాయంత్రం సూర్యునికి సిల్కలే టాటా సెప్పి అతని మూతిమీద దొడ్డికి పోతయ్,ఆ సిల్కల్ని యాడి పచ్చబొట్లలో ఊహించుకుంటున్నడు కానీ సిల్కలకు బదులు ధర్మ్యాకు పచ్చని సెట్లే కనిపిస్తున్నయి.

ఓ నెమలి పిల్లా ధర్మ్యా కాలి ఏళ్ళ సందుల పొడస్తా గులగుల పెడ్తాంది. వాళ్ళ యాడి

“బొస్సి అటూ పో వెరేయి ఎట్ల తింటున్నయి, అట్ల తిను పో అంటూ”

తన తొడమీద జమ చేసిన గోర్లతో ఆ పిల్లను భయ పెట్టనికి దాని  మీద ఇసిరింది. అయినా అది పోకుండా ఆడాడనే తిర్గుతాంది.

ధర్మ్యా ఆ పిల్లని గమ్నిస్తా “యా (అమ్మ) అదిలెయ్ అదేం నన్ను తినది” అంటూ అన్నడు. ధర్మ్యా వాళ్ళ దాది “కద్లకు” అంటూ అతని తల కొంచం జర్పింది.

“ఆ రోజుల్లో రోజు నెమలి మాంసం అండుకుని తినేటోల్లం, అడ్వికి నెమలి గుడ్ల ఏటకి పోయి వాటిని తెచ్చి కోడి కింద పెట్టీ పొదిగిపిస్తుంటిమి, ఒకొక్క ఇంట్ల పది నెమల్లైన ఉండేయి. ఇప్పుడు అన్ని సర్కారోల్లు సర్కస్ల పెట్టిస్తున్నరు పట్టి” బాధతో ధర్మ్యాతో వాళ్ల దాది అంది, ధర్మ్యా వాళ్ళ యాడి ఇంటునే గొర్లల్ల,వాటి సందుల్ల ఇరుక్కుపోయ్న మట్టిని తిస్టాంటే, వాళ్ళ యాడి ఎన్కాల ఉన్న గొడలోని  పుసల్లాంటి పూలను సూస్తున్నడు ధర్మ్యా. ఆ పూలు ఎన్ని ఉన్నాయో లెక్కపెడ్తున్నడు.

ఆ గోడకు ఉన్నవి పూలు కాని పూలు , ధర్మ్యా  ఇంటి గోడ పైన పర్చి ఉన్న  బట్టని గమ్నిస్తున్నడు.

————

ధర్మ్యా వాళ్ళది పెంకుటిల్లు ఎర్ర మట్టి , రాళ్ళు , సున్నం తో కట్టిండ్రు. ధర్మ్యా ది ఐదో తరం. ఇంటి లోపల  పైన సదిరిన దూలాలు ఇంకా పచ్చిగనే ఉన్నయి, కానీ దూలాల పైన ఏసిన ఎర్రమట్టి పూతే రోజుకింత రాల్తా ఉంటది, సాలేగుళ్ళను సించుకుంట.

ఇంటి కొసన ఓ మూల పెద్ద రింగు ఉంది, దాంట్ల నుంచి వంట సేసేప్పుడు పొగ బైటికి పోతా ఉంటది, రాత్రుళ్ళు ఆ రింగుల నుండి పిల్లి ఇంట్లకి అచ్చి దాని పని అది సేస్కుని ఎళ్లిపోతుంటది.

పిల్లి అచ్చుడు అచ్చి ఎల్కల్ని వట్టనీకి రాత్రంతా గుర్ గుర్ మంట తిర్గుత ఉంటది. దాని గుర్ గుర్కి యాడికి కోపమైతది, దొర్కితే దాన్ని కొట్టనికి పక్కనే కట్టే పెట్కుని పంటది. పిల్లి దొర్కకుండా గపత్ (మాయం) అయితది ఇంట్ల ఎక్కడో ఒక్కాడా పియ్యి కుప్ప పెట్టి.

———–

ధర్మ్యా వాళ్ళ దాదాకు కొత్తగా వాయా(పెళ్లి) అయినప్పుడు ఓ రోజు  వర్షాకాలంల పిడ్గుపడి  గోడ నెర్రబారింది, కిస్మత్ ఎందంటే ఈళ్ళ ఇంటికి మాత్రమే చిన్న నెర్ర బారింది. వేరే వాళ్ళ గోడలు కులిపొయ్నయి. బర్రెలు , ఆవులు సచ్చిపొయ్నయి.

అప్పుడు ధర్మ్యా వాళ్ళ దాదా  తన పెండ్లామ్ తన ఇంటికి మంచి షకునం అన్కుని, ఆమె ఘుంగ్టొనీ, దారు (సారా) కాయనికి తెచ్చిన  ఎర్రమట్టిల ముంచి ఆ నెర్ర ఉన్న జాగని కప్పిండు, సేర్ (పట్నం) పోయినప్పుడు ఆడ నుండి మొలలు తీస్కొచ్చి ఆ బట్ట గాలికి కొట్టుకపోకుండ, ఊడకుండ ఉండనికి బట్టకి నాల్గు కొసలకు మొలలు కొట్టిండు.

రోజులు బద్లి అయితున్న కొద్ది రంగు కరిగింది గానీ ఆ బట్ట చిన్గ లేదు. ఆ బట్టకి సుట్టూ చీమలు మట్టితో గూడు కట్టినయి, సూడనికి అది ఓ ఫోటో డబ్బాలా ఉంది, దానిని సూడనికి ధర్మ్యా దోస్తులు అచ్చి. చీమ గూడు పై ఉమ్మి ఆడాడా ఆ మట్టిని రాల్చి సంబరపడేటొళ్లు.

ధర్మ్యా దొస్తుల్ల ఒకడు డావలో (ఎడమ చేతి వాడు) అనేటోడ్కి చిమలంటే లౌ (చాలా) పీర్తి, ధర్మ్యా ఆళ్ళ దోస్తులకి అది గమ్మత్ ( వింత)గా అన్పించేది.

డావలో మంచి ఎటగాడు, సూటి పెడ్తే ఖతం దెబ్బ తగ్లకుండా ఉండదు. ఆడి కోసం ధర్మ్యా అల్లింట్ల చిమల్ని సంపి జమచేశి ఇస్తుంటడు.

అలా ఆ డావలో ఆ బట్టకి సుట్టూ ఉన్న మట్టిని నాకి పోయెటోడు.

ఆడి నాలుక మచ్చ మళ్లీమళ్లీ చమక్ టమక్ మని కనిపిస్తా ఉంటే బట్ట ఇంకోలా కన్పించేది ధర్మ్యాకి.

ఆ బట్టని సూడడం అంటే ఎంతో పీర్తి (ఇష్టం) ధర్మ్యాకి. రోజు అతడి సమ్యం ఆ పూల లెక్కలతోనే మొదలౌతది , చీమల లెక్కలతో ముగుస్తది. గోడ మొత్తంల ఆ డబ్బా భాగం అతనికి ఇంకో పర్పంచంలా అన్పిస్తది. ఆ బట్టలో ఉన్న అన్నీ పూల రంగుల్ని తెల్సుకుని అన్ని రంగుల బట్టల్ని  కొనిపించుకోవాల్నుకున్నడు ధర్మ్యా. కానీ ఆ పూల రంగులు గుర్తు పట్టనికి పూరాగా లేవూ, అన్నిట్ మీద ఎర్రమట్టి పరదా కప్పేసి ఉన్నది.

———–

తెల్లారితే సాలు ఆటలాడుడు , బట్టల్ని మైల సేసుకోనుడు. చెట్ల పై నుండి దుంకి బట్టలు చింపుకోనుడు అల్వాటు అయ్పోయింది. తండాల మన్సులు ఉండరు గపత్ (మాయం) అయిపోతరు. తండా అంతా పిల్లలదే.

ఎండిపోయిన కప్ప,పిట్ట ఈకలు, చెర్వు శంఖాలు,ఐసు కాంతం, రంగు రంగుల రాళ్ళు అన్నింటిని తాబేలు చిప్పల పెట్కుని ఇంటికి తెచ్చేటోడు.వాళ్ళ యాడికి గిదంత నచ్చదు రోజు తిడ్తానే ఉంటది.

ధర్మ్యా వాళ్ళ దాది మాత్రం “పోని పోరడు మంచిగ ఆడ్కుంటాండు,మన జమానా అంతా గాలి బత్కు అయిపోయింది,మనం ఆడింది లేదు,ఏమి జమ చేసింది లేదు, పోని ఆడ్ని ఆడుకొని” అంటూ మన్వడ్ని ఎన్కేస్కోస్తూ బోడి (కోడలు) తో చెప్త ఉంటది, అయిమె మానకుండా కొడ్కునీ తిడ్తానే ఉంటది.

పండగ అస్తున్నదంటే సాలు యాడితో బట్టల గురించి అమాయకంగా లడాయి పడతడు ధర్మ్యా .

ధర్మ్యా  మొండోడు వాడికి స్టైల్గా ఉండుడు అంటే పీర్తి . ఏసిన బట్టలు మళ్లీ ఎయ్యాలంటే ఓ వారం పడతది. వాడిని సూసి వాళ్ళ యాడి పరేషాన్ అయితుంటది.

ధర్మ్యా వాళ్ళ యాడి కొనే  ప్రతి సీరనీ ఓ నెలైనా దాస్తది. తర్వాత వారానికి ఓ సారి ఏసుకుంటది, తర్వాత ఆ సీర సూద్దామన్నా కన్బడదు.

ఎప్పుడైనా సాక్లెట్ కోసం యాడినీ ఓ రూపాయి అడ్గితే సాలు వాళ్ళ యాడితానా తయ్యారుగుండె మాటలు.

నసీబేన్ చుటాడేన్ రప్యాభీ ఛేయి”

( “నుదుటన అతికించడానికి రూపాయి కూడా లేదు”)

“కన్నాయి నవ్వే లతకడా పేర్తు దికాయి క తోన?”

(“ఎప్పుడైనా నేను కొత్తబట్టలు వేసుకోంగ చూసినవా?”) అంటూ ఆడ్ని నిరాశ పరుస్తది.

సేసేది ఏమీ లేక యాడిని తిట్టుకుంట ఇస్క దిబ్బల దగ్గరికి పోయి పిచ్చుక గూళ్ల ఆట ఆడి , ఆ ఇస్కలో దొర్కిన రంగురాళ్లను, శంఖాలను , ఆల్చిప్పల్ను ఏరుకుని , జేబుల నిండా నింపుకుని సాయంత్రానికి బర్రెలు అడ్వి నుండి తిరిగి తండాకు అచ్చే యాళ్లకు ఇల్లు చేరుకుంటడు.

ఇంటి ముందు జాగాల కన్పించే పుర్గులను పట్టి

“ఎయ్ నువ్వు గిట్లనే నడ్చుకుంట పోతే మన గట్ల(అడ్వి / కొండలుండె ప్రాంతం) దాకా పోవు గందుకే ఇగో నా దగ్గరున్న అల్చిప్ప కింద నిన్ను దాసవెడతా రేపు పొద్దుగాల్లనే పోదువు”

అంటూ తను తెచ్చిన వాటిని అలా కప్పెస్తడు,దాని గురించి ఆలోచిస్తా, కొన్నిసార్లు తినకుండా నిద్రపోతడు. వాళ్ళ యాడి ఏమో అదంతా ఉడ్చేస్తది.

ఆరున్నర ఏడుకల్లా దీపాలు ఆరిపోతయి. ఆకాశంలోని సుక్కలకి, గూళ్ళు ఎతుక్కుంటూ ఎళ్లే పక్షుల్కి వాటి కింద తండా కన్పించనంత చీకటి తండాలో నిండిపోయి ఉంటది.

______________

శుక్రారం దుబాయ్ కార్మికులకు సెల్వు.ఇంట్లో వాళ్ళందరూ తూర్పులోని సూర్యుడు ఆకాశం మధ్యలోకి అచ్చేదాక ఆగి చూస్తరు. ఆ మధ్యకాలంల ల్యాండ్ పోన్ మోగ్తది. ఒకరితర్వాత ఒకరు మాట్లాడుకున్నాకా

“నాన్నతో మాట్లాడ్త” అంటూ మారం చేసి  ధర్మ్యా ,తన సేతిలోకి పోన్ రాంగనే

“బాపా (నాన్న) యాడి డబ్బులన్నీ తినేస్తాన్ది రూపాయి కూడా ఇస్త లేదు” అంటూ ఉన్నవి లేనివి అన్ని సెప్పి తన మన్సులోని బాధని వడబోస్కుంటడు.

ధర్మ్యా ని సంతోషపరచనికి వాళ్ళ బాపా  అక్కడివారు ఎవరైనా తండాకి అస్తున్నరంటే,వారితో దుబాయ్ బట్టలు, దుబాయ్ సాక్లెట్లు పంపిస్తానని బుజ్జగిస్తడు .

ఆ మాటల్ని పట్కుని దినాం (ప్రతి రోజు) ఆకాశంలో ఎక్కడైనా ఇమానం కనిపిస్తదేమో దాంట్లో తండా మన్సులు ఒళ్లైనా తండాకు అస్తున్నరేమో ? అని ఊహించుకుంట ఇమానాల లెక్కలు ఏస్కుంటా ఉండేటోడు.

ఆకాశంలో  మరీ దూరంగా ఏ పిట్ట కన్పించినా

“హవాయిజాహాజ్   అపన్ తాండేన ఆరీ”

( ” ఇమానం తండాకు అస్తుంది” )అంటూ ఎగిరెగిరి అరుస్తుంటే, నానమ్మ ఆడెక్కడ జారి కింద పడి ముడ్డి పగలకొట్టుకుంటడో,కాళ్ళు ఇరగ్గొంటుకుంటడో అన్న భయం.పిలిచి ఓ అటాన ఇచ్చి ఇంట్ల కూసో వెడ్తది.

“దాది ఎప్పుడు అస్తది ఇమానం” ఆశగా అడుగుతడు ధర్మ్యా. అతడు అడిగేటపుడు మెడ నరాలు తెలుతై, కన్లు మెరుస్తయి.

అది గమనిస్తూ వాళ్ల దాది తన సేతితో మన్వడి పెదాల మీద అన్ని ఏళ్లను ఒక్కాడా పెట్టీ అనించి ఆ సెతిని ముద్దు పెట్టుకుంట

“వస్తది రాత్రి మన్షులు నిద్ర పోయినంకా ఆ విమానం తండా మన్షుల్ని దింపి పోతది ” అని వాళ్ల దాది అంటే

”  ఆ…. అదేంది రాత్రే ఎందుకు దింపుతది,ఇప్పుడు ఈ ఎల్తురుల దింపొచ్చుగా” అని ధర్మ్యా అంటే

” ఓ పారి ఇట్లాగే తండాకు ఇమానం అస్తె దాన్ని సుట్టుముట్టి ఆగం ఆగం చేసిండ్రు. అందుకే అందరూ పండుకున్నంకనే అచ్చి దింపి పోతది”

“ఓహ్… హనుక (అలాగా),అయితే ఈరోజు రాత్రి దాన్ని నేను సూస్త,నేను పండుకుంటే దాది నన్ను నిద్ర లేపు” అని దాది చెయ్యి వట్కుని ఉపుతాఉంటడు.

సీకటి కాగానే ధర్మ్యా వాళ్ల దాది కళ్ళు నిండిపోతయి. తండాలో ఎప్పుడు ఎదో ఒక పుకార్ లేస్తానే ఉంటది. దుబాయ్ల పనికి పోయినొల్లకు ఎప్పుడు ఏం అయితదో తెల్వది,అవును అది నిజమే, ఆమె పెద్ద కొడ్కు దుబాయ్ల ఎట్ల సచ్చిండో తెల్వది, ఏడాది నానా తంటాలు పడితే నాలుగు లారిల నిండా డబ్బాలు అచ్చినాయి జిల్లాకు, ఆమె లెక్క ఎంత మందో పోగట్టుకున్నరు, అందరూ ఐసు పొరగాల్లే. శుక్రారం తప్పించి,ఆయిమే ఎడ్వని రోజు అంటూ లేదు.

——–

దినామ్ ఎవరు ఎటుపోతరో, ఎం పనిమీద పోతరో అనుకుంట ప్రతి ఒక్కళ్ళ మీద నజర్ పెట్టాడు ధర్మ్యా.ఇంట్లో మన్సులు  కదిల్తే ఎక్కడున్నా ఆళ్ళ ముందుకు అచ్చేస్తడు అట్ల దాది దాదాలతో  ఆళ్లు ఎటు పోతే అటు  ఎళ్ళిపోయేటోడు.

దాది అయితే మిర్చి తినిపిస్తది, సోడా తాగిస్తది , దాదా అయితే తాగే  సింది* ( తాటికల్లు)కి కొనుక్కునే బఠాణీల నుండి ఓ పది ఇత్తులు తిననికి ఇస్తడు.

ఎక్కువగా దాదాతో తిరుగుతుంటడు. దాదా సైకిల్  రాడ్ మీద నిలబడి, దాదా సైకిల్ నడుపుతాంటే అతని మెడకాయని గట్టిగా వట్కుని సుట్టూ ఉన్న వాతావరణాన్ని సూస్తూ వన్కుతుంటడు.ఎక్కడ సైకిల్ రాడ్ మీది నుండి జారిపడిపోతనో అన్న భయం అతని రెండు చెవుల్ని  గడ్డకట్టిస్తుంది. సెతుల్ని ఇనుప చైనుల మారుస్తుంది.

—————–

(సాంజ్) సాయంత్రాలు దాదా దారు*(సారాయి) తాగేప్పుడు, అతని పక్కనే కూసుని ధర్మ్యా తన దాదా (అంగార్ డబ్బి)అగ్గిపెట్టెలో దాస్కున్న చిల్లర కెంచి ఓ బిళ్ళ తీసి చిత్తూ బొత్తూ ఆటని ఆడి దాదాకు బీడి కొనుక్కోమంటూ ఆ బిళ్ళని ఇచ్చి,తన దోస్తుల బట్టల గురించి ముచ్చట్లు షురూ చేస్తడు.

“మీ జమానాకి అన్ని ఉన్నయి మా జమానా కి కట్టుకుందామంటే ఏమి దొరకలేదు,మొన్న మొన్నటి దాకా , మీ నాయ్నా పెళ్లి కంటే ముందు దాకా తండాలో అందరి దగ్గర ఒకటే జత బట్టలు ఉండే, అదే దుప్పటి, ఉయ్యాల, గోడ  వగైరా, స్నానం చేస్తే పెయ్యి మీద బట్టలు ఆరే దాకా చెట్ల ఆకులతో కప్పుకునో , లేక పెయ్యి నిండా మట్టి పూస్కొనో ఆగి ఉండేటోళ్ళం, నీ కిస్మత మంచిగుంది అంటూ గ్లాసులోని సారాని తాగుతూ ధర్మ్యాతో అన్నాడు వాళ్ల దాదా.

యాడి దాది కాలికి గుచ్చుకున్న ముల్లును తీస్తూ ఉంటది లేదంటే సూర్యా ఫూల్ (పొద్దుతిరుగుడు పువ్వు) ఇత్తనాల్ని ఒలుస్తు ఉంటది.

దాదా దారు తాగానికి కుసుంటడు, ఎవ్వరితోని మాట్లాడడు లోటా , దాని లోపలున్న దారు అదే అతని పర్పంచం, సాయంత్రాలు ధర్మ్యా దాదాతో ఏదో ఒకటి ముచ్చట్ల పెడ్తడు.

దాదా పక్కన గోడ మీద ఎళ్తున్న నల్ల చీమల్ని సూసి వాటితో ఆడుకోనికి నేల మీద ఒరిగాడు, తన చేతి వేళ్ళతో వాటిని ఆట పట్టిస్తూ, కింది నుండి పైకి పోతున్న చీమల్ను ఆగం చేస్తాండు. దాదా ఏదో ఒక కత సెప్తడు, ఆ  సెప్పిన మాటలకు ఊహా రూపం ఇస్తూ నిద్రలోకి  జారిపోతడు. ధర్మ్యా నిద్రపోయాడంటే ఎంత లేపిన లేవడు, లేసిండంటే గట్టిగా ఏడ్సెటోడు. ఆకలేస్తే ఎంత రాత్రైనా లేచి అన్నం తింటడు.అందుకే ఆడ్ని ఎవ్వరు కడ్లించరు.

————

ధర్మ్యా పుట్టిన సంవత్సరానికే  అతని తండ్రి దుబాయికి ఎళ్ళిపోయిండు. ఎళ్లి ఐదు సంవత్సరాలవుతున్నయి, బాపా అంటే దుబాయ్, దుబాయ్ అంటే బాపా తప్పించి ధర్మ్యాకి తన అయ్య ఎట్ల ఉంటడో  తెల్వదు,ఇంట్లో  ఒక్క ఫోట్వో లేదు ,రేషన్ కార్డులో  యాడి ,దాది,దాదా  మరియు ధర్మ్యా మాత్రమే ఉన్నరు. తానొక్కడే కాదు తండాలో మస్తు మంది పిల్లలకి ఆళ్ళ నాన్న ముఖం ఎట్లా ఉంటదో ? తెల్వదు. దుబాయ్కి ఎళ్ళిన చానా మంది  ఏడున్నరో ? ఎట్లా ఉన్నరో? బతికున్నరో ?  సచ్చినరో ? కూడా తెల్వది.

——-

ఎప్పుడన్నా మరి బాపా యాదికొస్తే అమ్మ ఒడిలోకి కుక్కపిల్లలా  ఒర్గిపోతే , యాడి మాత్రం ఆడ్ని కూర్సోబెట్టి పెన్లు చూస్తది , పెన్లను ఏరుతుందో వెంట్రుకల్ని పీకుతుందో ?! అర్దం కాదు ధర్మ్యాకి. గింజుకుంటడు, ములుగుతడు, దొడ్డికొస్తుంది పోవాలి, అంటూ తప్పించుకుంటడు.

తల మీద యాడి పేన్లకోసం నొక్కిన కొక్కుడు, రాత్రంతా కాకి పొడిచినట్లు , పొడుస్తునట్లూ ఊహలు. నిద్రలో ఉలిక్కి పడుతుంటడు. అప్పుడప్పుడు ఉచ్చ పోసేస్స్తాడు.

ధర్మ్యా నిద్ర పోయినాకా, ఆడి దిండు కింద కొడవలిని పెడ్తది.

ఆ కొడవలి ఏ రోజు తన తలని కరుస్తదో అన్న భయంతో అమ్మ దగ్గర పండుకోవడం మానేసిండు , నానమ్మతోనే పండుకునుడు షురూ చేసిండు.

ఓ రోజు నెమలి వెన్ను బొక్కని తెచ్చి ఆడి మొల్దారానికి కట్టింది.దుసుకున్నప్పుడు ఊడిన ఎంట్రుకలను అల్లి ఆడి కాలికి కట్టింది. “ఆ రెండిట్ల ఏది పోయిన నీకే కష్టమైతది” అంటూ భయపెడతది.

దాదా రోజు రాత్రి ఎటు ఎళ్తున్నడో, ఎందుకు ఎళ్తున్నడో  ? అర్ధమయ్యేది కాదు ధర్మ్యాకి, దాదా ఎటూ పోలేదు ఇక్కడే ఉన్నడు అంటూ రాత్రుళ్ళు ఆయన దోతిని దుప్పటిగా కప్పి ఉంచేది.

సూర్యుడి కంటే ముందే దాదా అస్తూ అస్తూ ఓ బాతునో, ఉడుమునో, కుందేలునో తెచ్చేటోడు, ఆ తెచ్చిన దానిని ముక్కలుముక్కలు సేసేదాకా   వాటినే పట్కుని  వాటి నోట్లో నీళ్ళు పోస్తూ , వాటి కాళ్ళ కింద మెత్తని భాగాల్ని వత్తి ఆడేటోడు.

————

ధర్మ్యా  వాళ్ళ  యాడి , వాళ్ళ బాపా పైసలు పంపగానే అందరికీ లతకడా కొన్నది, కొన్నవన్నీ దాదికి సూపించి బీర్వాలో పెడ్తాంటే, బీరువా తాళాలు ఎక్కడ దాస్తుందో తెల్వదు ? అందుకే తన బట్టల్ని బయటే గోడకు తగిలించమన్నడు ధర్మ్యా.

ధర్మ్యా  మాట ఇనకపోతే నోట్లోనుంచి సొల్లంత కారి నోరు, కళ్లు ఎండిపోయేదాక ఏడుస్తడు , అందుకే ఆడి ఇష్టప్రకారం ఆడి చొక్కా, ప్యాంటుని గోడకు తగ్లించింది.మరుసటి రోజు ఉదయం  ఏం చేయ్యాలో ఎట్లా చేయ్యాలో అంతా తన మన్సులో  పథకం ఏసుకున్నడు.

—————-

తెల్లారింది,ఇంటి ముందు కోళ్ళ గుంపు అచ్చి చేరినాయి, గంగ్నాల్ (నీళ్ళని వేడి చేయనికి వాడే  పాత్ర) కింద కట్టెలు సప్పుడు సేస్తూ మండుతున్నయి. బొంగునీ అందుకుని కావాలనే ఊదుతున్నడు, మండుతున్న కట్టెల వైపు మంట ఆరిపోతుంది.పొగలు తీగలై పైకి లేస్తున్నయి గాలిలోకి. కట్టెలు మళ్లీ అంటుకుంటున్నయి, ఏదో కాలిన వాసన అస్తాంది. మండుతున్న కట్టెల లోపల చెదలు ఉన్నట్లు గమనించిండు ధర్మ్యా . ఒకొక్క కట్టేని తీస్కుని నేలకు రెండు సార్లు కొట్టిండు ,దాంట్లో ఉన్న పురుగులన్నీ ఆ మంట వేడికే సచ్చిపోయినట్లున్నయి, పొడి ఇసుకలా ఆ చెదలు, మండుతున్న బొగ్గులు  మిణుకు మిణుకుమంటూ నేలరాలాయి.

అంతలోనే వాళ్ళ దాది అచ్చింది .

“షివ్యో….. లంజలే, మారజ్ ఆంగన్ మలి కాయ్ తమెన్ చరేన”

(“షివ్యో….. లంజల్లారా, నా వాకిలే దొరికిందా మీకు తినడానికి”)

“ఇంకో సారి నా ఆంగన్ లకి అచ్చినరంటే నా (మాటిన)మొగుడ్ని, (పోతోని)మనవడ్ని మీ పైకి ఎక్కిస్త”

అంటూ కోళ్ళను తిడ్తూ తన కాలి చెప్పు తీసి ఆ గుంపుపై ఇసిరింది. కొళ్లన్ని పారిపోయ్నాయి.వాటిని తిడ్తూనే  వేడి నీళ్ళు భోగొన్లో కల్పి స్నానం చేయించింది. దాది సేతి ఏళ్ళ గుర్తులన్ని  ధర్మ్యా పెయ్యి పైన అచ్చయ్యాయి.చుక్కలుచుక్కలుగా రాలుతున్న నీళ్లను తన ఎంట్రుకల పై నుండి దుల్పుతూ, పెయ్యి పై నీళ్లను దుల్పుకుని , వణుకుతూ ఇంట్లోకి పరిగెత్తిండు.

గోడకు తగ్లించిన అతడి బట్టల్ని తీసి దుల్పుతున్నడు,ఇంటి బయట సైకిల్ హరన్ సప్పుడు , యాడి దాదా ఇద్దరు సైకిల్ మీద అచ్చినట్లు ఉన్నరు. దులిపిన బట్టల్ని  ఏసుకున్నడు, ఏదో  మాయమైనట్లు అన్పించింది అతనికి. యాదికి చేస్కోనికి ప్రయత్నిస్తున్నడు కానీ యాదికొస్తలేదు . సర్లే మళ్లీ ఆలోచించచ్చు అనుకుంటూ కొత్త బట్టలు తొడుక్కుని ఇంటి బైటికి   అచ్చిండు.

దాది కన్పించలేదు ముచ్చట్లు పెట్టనికి తండాలోకి ఎళ్లిపోయిందనుకున్నడు.

దాదా  దూడ పొట్టపైన ఎంట్రుకల్ని కత్తిరిస్తున్నడు, మనవడి కొత్తబట్టలు సూసి మెచ్చుకున్నడు.

ఇంటి గోడ దగ్గర సైకిల్ పక్కనే ఒరిగి ఉన్న ఎడ్ల బండి గిర్కనీ  సుట్టుకున్న తీగనీ ఒలుస్తున్న యాడి ధర్మ్యా వైపు సూడకుండానే బట్టలు ఓ గంట తర్వాత తీసెయ్యమన్నది, బాగుందో లేదో చెప్పకుండానే.

కళ్ళ అంచులు గిలకలేసాయి,  పెద్వి ముందుకొచ్చింది. బుగ్గలు బరువుగా అన్పించినయి, దాది అయినా లేదు ఓదార్చనికి. తన్నుకొచ్చిన దుఃఖాన్ని గుటకలేస్తూ మింగిండు.

యాడి మీద కోపంతో ఎంటనే బట్టలు ఇప్పేసిండు ,అప్పుడు గుర్తొచ్చింది గోడకు ఉండాల్సిన నాన్న బట్టలు లేవని , గోడకు ఎలాడే ఏ వస్తువు అక్కడ లేదని అర్థమైంది.తన బట్టలు అలాగే మాయమవుతాయేమోనని  భయమేసి తన బట్టల్ని  ఓల్డా(గంప) కింద దాసిపెట్టీ ఇంటి ముందు రాయి మీద రెండు సేతులు చంపలకు అంటించుకుని ఎగిరే పిట్టల్ని సుస్తా కూసున్నడు.

———–

దిత్వార్ ( ఆదివారం) కావడంతో ,తండాలోకి గ్యాస్ బూరలు అమ్మేవాళ్లు సైకిల్ ఏసుకుని వచ్చిండ్రు,అంతకు ముందు వాళ్ళు బూరలు ఆడవాళ్ళ  ఎంట్రుకలకు  ఇచ్చే టోళ్లు,తర్వాత మానుకున్నరు.ఇవ్వనికి ఏమి లేక పిల్లలు ఆళ్ళ ఎనక  తండా అంతా తిరిగి తిరిగి వ ఆళ్ళను సాగనంపేవారు.

ధర్మ్యా తన బట్టల్ని మురికి చేస్కుని అచ్చిండు. యాడి సేతుల్లో దెబ్బలు తిన్నడు, గుక్క పట్టి ఏడుస్తున్నడు. అంతలోనే దాది అచ్చింది. కోడల్ని ఏమి అనలేదు కోపంగా సూసి,ధర్మ్యాను దగ్గరికీ తీసుకుని ఓ ఆటానా ఇచ్చి రసగుల్లలు కొనుక్కోమంది.

ధర్మ్యా వాళ్ళ యాడి స్నానం చేస్కుని కట్టెలకోసం  అడ్వికి , వాళ్ళ తాతయ్య  తన సైకిల్ని ఇంటి దగ్గరే పెట్టి ఎటకి పోయిండు.

ఆదివారం కావడంతో తండాకు ఎవరెవరో అస్తున్నరు. అరుస్తున్నరు, హారన్ కొడుతున్నరు, అవన్నీ ఇంట్లోకి వినిపిస్తున్నయి. ధర్మ్యాను సముదాయించనికి  తన చేతి ఏలికున్న రూపాయి బిళ్ళ ఉంగరాన్ని సూపిస్తూ

“నీకు ఇలాంటిది చేయిస్తా నీ రాణికి ఇద్దువు గాని” అంటూ ఫోటో ఆల్బమ్ సూపించనికి పెచ్చులు ఊడిన, ఉడుతున్న ఇనుప పెట్టేను బీరువా పైనుండి  తీసింది. పేరుకే అది బీర్వా ఎప్పుడు డగక్ డగక్ మంటు ఉంటది.

హరన్ సప్పడు, పిల్లల గోల వినబడుతూనే ఉన్నయ్.

ఆ బూరలు అమ్ముకునే ఆళ్ళ ఎంట తండా పిల్లలు తిర్గుతూ తిర్గుతూ ధర్మ్యా దోస్తు భగవాన్లు ,ధర్మ్యా  వాళ్ళ ఇంటి దాకా అచ్చిండు, ధర్మ్యాని  తన ఎంట సేపల ఏటకు  తీసుకెళ్ళనికి .

భగవాన్లు ధర్మ్యా వాళ్ళ ఇంట్లోకి ఎల్తూ బైట సైకిల్నీ సూసి ఆగిపోయిండు. సైకిల్ హ్యాండిల్ పట్కుని దానిని గిరగిరా తిప్పుతూ తెలియని ఆనందంల మునుగుతాండు .ఇంట్లోంచి ఇనబడుతున్న మాటలను ఇంటూ, తను తిప్పుతున్న సైకిల్ హ్యాండిల్నీ ఆపి ఇంట్లోకి పర్గెత్తుకు పోయిండు .

ధర్మ్యా  వాళ్ళ దాది ఓ కాలు జాపుకుని ఒళ్ళో ధర్మ్యాను కూసోబెట్టుకుని, ఆల్బమ్ను తెర్చింది, పరిగెత్తుకు అచ్చిన భగవాన్లునీ సూసి

(” డ్డ్హీలో  ఆయే సారుణి, ట్టోకర్ లాగ్ జాయేనీ?!”)

“మెల్లిగా రవచ్చుగా , దెబ్బలు తగలవా ?” అంటూ కళ్ళు పెద్దగా సేసి సూసింది. అతడు భయపడలేదు, ఆమె జాపుకున్న కాలుకి పక్కనే కూసుని

(“దాది ఇప్పుడు సూపించు ఫోటోలు” అంటూ ఆల్బమ్ వైపు సూసాడు.

ఆల్బమ్ మీద ఉన్న ఎర్ర రంగుని కొంగుతో తుడిచి,

” కాయిరే భగవాన్లు సారిదాడో ఫరేరజ్క”

(”  ఏం రా భగవాన్లు రోజంతా తిరగడమేనా ?”) అంటూ

ఆల్బమ్ అట్టని తెర్చింది. ఒకొక్క అట్టలో  ఎనిమిది ఫోటోలు ఉన్నయి,అన్ని మసగ్గా ఉన్నా , ఆ ఫోటోలో వారు బాగా కనిపిస్తున్నరు.

భగవాన్లు ఆయిమె తిప్పుతున్న ఫోటోలను సూస్తూ మన్సుల ఇట్లా అనుకున్నడు “ఎంతమందో ఫోటోలో ఆడోళ్లు గోరుర్నియా (బంజారాల్లాగా) బట్టల్లో పొడుగ్గా ఎర్రగా , పురుషులు తెల్లని బట్టల్లో పెద్ద పెద్ద పాగడి (తలపాగలతో)  సూదుల్లాంటి మీసాలతో ఉన్నరు. ఇళ్లంతా మనోళ్లేనా ?! లేక యాడైన పోయినప్పుడు వేరేటోళ్ళ ఆల్బమ్ ఏమైనా దొర్కితే తీసుకొచ్చిందా  ?!

ఆ ఫోటోల్లో ఉన్నట్లూ ఎవరూ లేరు ఇప్పుడు, బట్టల్లో, ఆభర్ణాల్లో  మార్పులు గమ్నించిండు భగవాన్లు ,అనుమానం అతని మన్సులో పెరిగిపోతా ఉంది.

అయిమే ఫోటోలు తిప్పుతా ఉంది. భాగవాన్లు అన్ని సుస్తున్నడు

భగవాన్లుకు వాళ్ళ దాది కన్పించింది ఓ ఫోటోలో. అప్పుడు అది తమకు సంభందించిన ఆల్బమ్ అని అనుకున్నాడు

ఎన్నో ఫోటోలు , ప్రతి ఫోటోని పట్టి పట్టి సూస్తుంది ధర్మ్యా వాళ్ళ దాది, బహుశా అప్పటి కాలంల ఆళ్ళ జీవితాలు యాదికొచ్చి ఉంటయి , తన కుడి సేతినీ తలపైన పెట్టీ జారిపోతున్న ఘుంగ్టోనీ సర్దుకుంది, ఎడమ  సేతిని కుడి సేతి కింద నుండి పై దాకా రెండు సార్లు కింది నుండి పైకి పాకించి  సూసింది. మౌనంగా నవ్వుతానే వేరే ఫోటోలోకి  ఎళ్ళింది. అన్ని ఫోటోలు ఒకేలా ఉన్నాయంటూ ధర్మ్యా అక్కడ నుండి లేచి బయటకు ఎళ్ళిపోయిండు. భగవాన్లు , ధర్మ్యా వాళ్ళ నానమ్మ ఇద్దరు  ఫోటోలు సుస్తూ కూర్చున్నరు.

—————-

ధర్మ్యా తండాలోని పిల్లలతో ఫూన్ది *(తూనీగలు) పట్టనికి ఎళ్ళిపోయిండు. వాతావర్ణం మసగ్గా ఉంది.

పూలతో నిండిన పిచ్చి మొక్కల పైన వాలుతూ ఉన్న వాటిని పట్టడనికి అల్లరల్లరి చేస్తున్నరు తోటి వారు,తనతో పాటూ అచ్చిన వారు రెండు రెండు తూనీగలు పట్కుని వాటి తోకల్ని దారాలతో కట్టుకొని ఎళ్లిపోయిండ్రు.

ధర్మ్యా ఇంకా పడ్తూనే ఉన్నడు ,పక్కనే కన్పించిన పిచ్చి మొక్కని పీకి దానితో గట్టిగా గడ్డి పై వాలిన తూనీగపై కొట్టిండు. మెల్లిగా ఆ మొక్కని జర్పుతూ తూనీగని పట్టేసుకున్నడు, దాని తోకనీ కట్టనికి చిన్యానీ దారం కొంచం ఇవ్వమన్నడు, కానీ అ తూనీగ ఎంటనే సచ్చిపోయింది. ఇంకోకటి పడ్దామని ప్రయత్నం చేసిండు.ఏదో మాయ జరిగినట్లూ అతనితో ఉన్న తోటి పొరగాల్లు సప్పుడు సెయ్యకుండా ఎళ్ళిపోయిండ్రు. ఎనక్కి తిర్గి  సుసిండు .అడ్వికి కట్టెలకి ఎళ్ళిన వారు అస్తున్నరు,వారి మధ్యల  ధర్మ్యా  వాళ్ళ యాడి కూడా ఉంది. పెద్ద పెద్ద కట్టెల మోపులతో పాముల్లా కదులుతున్నరు.

ధర్మ్యా తన సేతిలోని మొక్కని కింద పడేసి పరిగెత్తిండు పిల్లలు నిలబడ్డ సోటుకు , ఆ మందలో  కొందరు

“మార్ యాడిజ్ ఆంగ్ అవచ –  మా అమ్మే  ఫస్ట్ అస్తది ”

“కొని మార్ యాడి అంగ్  – లేదు మా అమ్మే ఫస్ట్ “అంటూ గోల  చేస్తున్నరు.

అందరూ తండాలోకి ఒకేసారి అచ్చిండ్రు. ఒకొక్కరు ఒక్కో వైపు విడిపోతాంటే, పిల్లలు అలాగే ఆ మంద నుండి వెరైయ్యిండ్రు.

ధర్మ్యా వాళ్ళ అమ్మతో పాటే నడుస్తూ ఇంటి ఎనకలకి ఎల్లిండు ఆమెకి  నీడలా. తన తల మీది మోపుని కింద పడెయ్యబోతూ  పక్కకి జరగమన్నది ధర్మ్యానీ.జరిగిండు, మోపుని కింద పడేసింది . మోపుకి సుట్టు కట్టి ఉన్న తీగ తెగిపోయింది. కట్టెలన్నీ చెల్లాచెదురైయ్యినాయి,తల మీది బట్టని తీస్కుని ముఖం తుడ్చుకునీ అన్నింటినీ ఏరి కట్ట కట్టి ఇంటి వైపు నడ్చిండ్రిద్దరు.

పొయ్యి పక్కన ఉన్న తొట్టిలోంచి నీళ్ళనీ లోటాతో నింపి ధర్మ్యా కాళ్ళ పై పోసి తన కాళ్ళు కడుక్కునీ ముఖం మీద నీళ్ళు సల్లుకొని దోసెడు నీళ్ళతో ఎనక విపుని తడి చేస్కుని, జారిపోతున్న రెండు బొక్క గాజుల్ని పైకి జరుపుతూ ఇంట్లోకి నడ్సింది.తన కంటే ముందే ధర్మ్యా ఇంట్లోకి ఎళ్ళిపోయిండు.

” అల్లర ఉల్లర ఖేతేమా” అంటూ  జోల పాట పాడ్తూ పోతడ్యా* ( డబ్బులు, ఆకు, వక్కా దాచ్కునే సంచి) కుడ్తాంది.

దాది అచ్చిన వారిని పట్టించుకోకుండా తన ముందు ఉన్న బట్టలోనీ రంగుల పూసల్ని సూది లోకి ఎక్కిస్తూ కుట్టు పనిలో మున్గి  ఉంది.

అన్నం తిననికి గిన్నె పైన మూతను తీసి ఎంత అన్నం ఉందో సూసింది ధర్మ్యా వాళ్ళ యాడి ఎర్రని చీమలతో నిండిపోయి ఉంది.అన్నం గిన్నెను ఎండల పేట్టి  ధర్మ్యాను అక్కడే కాపలా పెట్టింది.

ధర్మ్యా వాళ్ళ దాది  వాళ్ళ యాడితో

“అన్నాన్నీ ఒళ్ళు ముట్టరు పిల్లోడు కంలిపోతడు”

“ధర్మ్యా లోపలికి రా” అంటూ పిల్చింది

ధర్మ్యా “ఆరో ఇదే” (వస్తున్నానిదిగో) అంటూ  ఇంటి నీడలో నిలబడి  కళ్ళ ముందు గాలిలో ఎగురుతున్న  ఎర్రని తుమ్మెదల్ని   సూస్తూ  ఎటు పోతున్నయి ? ఎక్కడుంటయి ? ఆ రంగులు వాటి బట్టలా? అనుకుంటున్నడు, అమ్మ  అచ్చి  గిన్నెను ఇంట్లోకి తీస్కపోయింది. అమ్మ గాజుల సప్పుడు విని తుమ్మెదల పర్పంచం లోంచి బైట పడి ఇంట్లోకి నడ్సిండు.

యాడి ఓ పళ్ళెం తీస్కొని అన్నం ఏస్కుంది. ఆమె ముందు ధర్మ్యా  తిన్పించమంటూ కూసున్నడు.ఎవరో లాగేసుకుంటారాన్నట్లూ తింటూ అతనికి తిన్పించింది.పళ్ళెం సుట్టూ పడి ఉన్న మేతుకుల్ని ఏరి తిని కిందికి జారిన బళ్యాలను (బొక్క గాజులను) ఇంకో సేతితో పైకి జరిపి చెయ్యి  కడుక్కుంది.

“ఫూపి” (“అత్తమ్మ”)   నేను తోటకి ఎల్తున్నాను”

“మై ఆవుచు” – (“నేను వస్తాను”) అని అన్నాడు  ధర్మ్యా .

దాది “ఒద్దు ఒద్దు తోటలో దయ్యముంటది, సాయంత్రం హాట్( సంతకి) పొదామంది”

ధర్మ్యా  ఒప్పుకోలేదు పోతానంటే పోతానన్నడు, సేసేదేమీ లేక సరే అంది దాది

అమ్మతో పాటు ధర్మ్యా తోట వైపు అడ్గులు ఏస్తూ దారికి ఇరువైపుల పెర్గిన సీతాఫల చెట్లు ,గుత్తులు గుత్తులుగా ఏలాడుతున్న రేలపూల సెట్లను గమ్నిస్తూ  నడుస్తున్నడు. బీడు భూముల తిరుగుతున్న నెమళ్ళను సూస్తూ,పచ్చగా ఉన్న భూముల్ని పట్టించుకోకుండా ,మట్టిలో గీతలు గీస్తు యాడి ఎంట నడుస్తున్నడు.

దారి అంతా మాంసం పర్చినట్లు ఉంది, దారికి అటూ ఇటూ గుబురు గుబురుగా పెర్గిన పిచ్చి పూల సెట్ల పైన తితిలిలు (సీతాకోకచిలకలు) ఎగురుతున్నయి.

దూరంగ నల్లని కొండల పైన నిలబడి అరుస్తున్న నెమళ్ళు, పచ్చని రంగు. గమనిస్తూ నడుస్తున్నడు.

ధర్మ్యా వాళ్ల యాడి వెన్కకు తిరిగి సుసింది, బిత్తర బిత్తర సుస్కుంట నడుస్తున్న ధర్మ్యాను ” జల్డి జల్ది నడు ఓటరిగా కన్పిస్తే రీచ్ (ఎలుగుబంటి) ఎంట పడి చీరుతది” అంటూ చెప్పి నిలబడిపోయింది. కొంతదూరం ఆమెతో కల్సి నడ్సి ఆగిపోయిండు.

దారి మద్యలో కాళ్ళు నొప్పులు అంటే ఆళ్ళ యాడి  అతడిని తన ఎన్కాల డ్డో డో పీలా(వీపు పై ఎత్తి,రెండు సేతులతో గట్టిగా పట్కుని మోయడం)  ఎత్తుకుంది. ధర్మ్యా  తన రెండు చేతులను యాడి మెడ సుట్టూ చుట్టిండు, అతడి కాళ్ళు యాడి కడ్పుని సుట్టేసుకునీ గట్టిగా పట్టుకున్నయి.

యాడి అరాంసే నడుస్తాంది. దూరంగా ఎందరో నిలబడ్డరు, ఆ నిలబడి ఉన్న వారి సుట్టూ రంగు రంగుల గొడలున్నట్లూ కనిపిస్తున్నయి .

ఇంకొంత దూరంలో పెద్ద పెద్ద కొండలున్నయి. నెమళ్ళు గుండు రాళ్ళ అంచున నిలబడి ఇళ్ళనే సూస్తున్నయి. ఆడాడ సెట్ల కొమ్మలకు ఏలాడుతున్న వాగల్(గబ్బిలాలు),ఎర్రని పుట్టల నుండి లేసిన సెట్లు, తీగలు.

అన్నింటిని గమనిస్తున్నడు, అల్ల యాడి గుడ్డి దానిలా నడుస్తున్నది. ఇద్దరూ  తోట చేరుకున్నరు.ధర్మ్యాను కిందికి దింపి “సూసుకుంట  నా ఎన్కనే నడు, ఒడ్డు గడ్డిలో ఏమేం ఉన్నాయో తెల్వది సూడు” అనుకుంటా నడుస్తాంది.

ధర్మ్యా తన దారిని సూడకుండా ఎదురుగా ఉన్న  పంటని సూస్తున్నడు. పంట సుట్టూ గోడలుగా అనిపించినవి వాళ్ళ యాడి చీరలు. దీర్ఘంగా సూసిండు వాటిని, వాళ్ల యాడి తోటకి సుట్టు తన పెయ్యి మీద నుండే చీరను సుడ్తున్నటు అనిపించింది.

ఆ మొక్కజొన్న కాడల్ని గమనిస్తూ తోట మధ్యలోకి నడ్సిన్డు,కట్టెలు పాతి పెట్టిన చోట ఆగి పైన నిల్సున్న దిష్టి బొమ్మల్ను గమనిస్తూ నడ్సిండు.

ఆ దిష్టి బొమ్మలు ఏసుకున్న బట్టలు నాన్నవిగా  గుర్తు పట్టిండు.ఆశ్చర్యంగా ఓ సారి సుట్టూ తిరిగి సూసిండు. ఆ రంగుల చీరలు గాలికి ఊగిపోతా ఉన్నయి, అచ్చం దూరం నుండి గోడల్లాగా కనిపిస్తున్నయి అనుకుంటూ దగ్గరగా ఎళ్లి వాటిని ముట్టి సూసిండు.

అవ్వన్నీ అమ్మ చీరలే, బట్టల గురించి ఏవో ప్రశ్నలు మొదలయ్యాయి అతని మన్సుల,

ఈ లతకడ ఈ జొన్నలకు బట్టల్లాంటివా ?

దిష్టి బొమ్మలకు బట్టులు అవసరమా ?

అన్నన్ని బట్టలు ఇట్ల ఖరాబ్ చేస్తుడెందుకు ?

ఇంట్లో అందరూ పిచ్చోల్లున్నరు, తండాల అందరూ అట్లనే ఉన్నరు.

దిష్టి బొమ్మ పైన నిలబడ్డా పిట్టని సూస్తూ , ఆ బొమ్మ తలలాగా ఉన్న కుండలో పిట్టగుడు ఉందనుకున్నడు. జొన్నల దగ్గర నిల్సున్నడు.

ఒడ్డు పై పెర్గిన గడ్డి పోచల గుండా నెమ్మదిగా జిగురు వదుల్తూ పాకుతున్న జలగని సూసి నిలబడిపోయిండు అది ఎటుపోతదో చూడనికి.

ధర్మ్యా వాళ్ళ యాడి తోట సుట్టూ తిరిగి అచ్చేసింది. ఇద్దరు ఇంటి దారి పట్టిండ్రు. ఈ సారి ఇంటికి ఇంకో దారిల నుండి నడ్సిండ్రు,దారి మధ్యలో కన్పించిన పంటకు సుట్టూ ఏ బట్ట లేకపోవడం సుసి ఆళ్ళ అమ్మ

“యాడియే సుర్రి సే నాస్ కర్నాకచ –  అయ్యయ్యో అడవిపంది పంటనంత పాడు చేస్తది”

అమ్మ మాట విన్నాక అడివిపంది ఎట్లా ఉంటదో సూడనికి నిలబడిపోయిండు.

” ఆ దారిలో అచ్చినప్పుడు కన్బడలేదు ఇప్పుడు ఈ దారిలో ఎటు నుండి అచ్చిందో ”

అవును దాది చెప్పింది నిజమే ఇటూ దయ్యం ఉన్నట్లుంది  అనుకున్నడు.

తల తిప్పి సూస్తే అళ్ళ యాడి చాలా దూరం ఎళ్లిపోయింది, పర్గెత్తుకుంట యాడినీ చేరుకుని చీరల గురించి అడిగిండు,అవి కంచెలు అని తెలుసుకున్నడు. వైర్లకు బదులు చీరలు కట్టామని చెప్పింది.

———

ఇల్లు చేరుకున్నరు , దాది  సాంకా*( కొర్రలతో చేసే వంటకం ) వండుతాంది. తాతయ్య  బీడి పొగను ముక్కులకెంచీ అనదులుతున్నడు.

అచ్చి రాంగనే ధర్మ్యా రెండు లోటాల నిళ్లుతాగి దాదికు దగ్గరలో ఇంటి బయట పొయ్యి ముందు కూసుని ఇంటి గోడకు ఉన్న ఆ బట్టలోకి సూసిండు.పంట సుట్టూ కంచెలు ఎగిరిపోతున్నట్టు, ఆ బట్టల కెంచీ జింకలు ఉర్కుతున్నట్లు, ఆ దిష్టి బొమ్మలు నేలను అందుకోనికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించినయి.

*

రమేష్ కార్తిక్ నాయక్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బంజారా జీవన చిత్రణ….చాలా అద్భుతంగా ఉంది రమేష్ గారూ….
    Insider రచయితైతే ఆ సంస్కృతికి ప్రాణమస్తదంటే ఇదే…..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు