ఆగిపోయిన ఆర్నెల్ల  కాలం గురించి…….!

మా అమ్మ, తమ్ముడు, అక్కయ్య,… మేము, (హైదరాబాద్, చార్మినార్ సమీపాన) ఆ చంద్రాయణ గుట్ట లో హాయిగా జీవితం సాగుతున్నది. తమ్ముడిని ‘బాబు’ అని పిలిచేది, అమ్మ.

ఉన్నట్టుండి మంచం దిగి, సంచి వేసుకుని ఇంటి బయటకు నడుస్తున్నది. అమ్మను, తమ్ముడిని అక్కను కలువడానికి వెళుతున్నానని అనుకుంటున్నది.  మనవరాలు అడిగింది..‘‘తాతమ్మ ఇంటి బయటకు నడుస్తున్నది…. తాతమ్మ వెళ్లిపోతున్నదక్కా’’ అంటూ వేగంగా వచ్చేసి మళ్లీ ‘‘తాతమ్మ ఎక్కడికి పోతున్నావే?’’

తాతమ్మ అడిగింది… ‘‘ఇంటికి వెళుతున్నానే.  మా అమ్మ పిలుస్తున్నది. అక్కడ అక్క, బాబు, మాతో వస్తున్నాడు. మాట్లాడుకోవాలె.’’ మనవరాలు ప్రశ్నిస్తూ.. ‘‘హయ్యో ఎక్కడున్నావు నువ్వు. వెనుక నాటి రోజుల్లో లేవే.  బాగనే ఉంది.’’.

తాతమ్మ  మళ్లీ అంది: ‘‘అదేం కాదు. మా అమ్మ పిలుస్తున్నది.’’ మనవరాలు మరోసారి చెప్పింది.. ‘‘హయ్యో… తాతమ్మ మీ అమ్మ ఇప్పుడు లేనే లేదు. ఎప్పుడో పోయిందే…’’

ఇంకా మాట పూర్తి కాకముందే మనవరాలును ఛళ్లున చెంపదెబ్బ కొట్టింది. చెంప వాచి పోయింది.

తాతమ్మ కోప్పడుతూ అడిగింది… ‘‘ఏమే నా కన్నతల్లిని పోయిందంటావా’’.

అమ్మను జాగ్రత్తగా మంచానికి చేర్చారు.

అమ్మకు.. ముగ్గురు సంతానం. మా అన్నయ్య, నేనూ (కేశవ్), చెల్లి.

అమ్మ.. ఒక పెద్ద చెట్టు. 92 ఏళ్లున్న నీడిచ్చే, వెచ్చదనం ఇచ్చే, ఆప్యాయతకు పెద్ద చెట్టు. మంచి ఫలాలు పండుతాయి. నాకు, అన్నకు, చెల్లికి, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, అందరికీ ప్రేమను పంచే పచ్చని చెట్టు.

అమ్మకు ఇప్పుడు ఏ అవసరమూ లేదు. జ్ఞానంతో అసలే అవసరమే లేదు. ఆనందిని.

అమ్మకు తను 66 సంవత్సరాలున్న కొడుకునని కూడా తెలియదు. జ్ఞాపకం రావడం లేదు. విచిత్రం. తుంటి ఎముక విరిగిందని, ఆ దెబ్బలు, బాధలు ఆమెకు తెలియదు.  ఆపరేషన్లు చేసారని తెలియదు. తుంటి ఎముకని అతికించి, విరిచి, కొన్ని తీసేసి, మరి కొత్త నట్లు ఇనుపముక్కలతో బిగించారు. ఆ కాలు వల్ల ఈ కొత్త అతుకులతో నిలువగలిగింది, అయినా తెలియదు. అంత ఆలోచనే లేదు. ఆ అవసరమే లేదు. దీన్ని హాయి అనాలో లేదో? కాకపోతే మరేమని అనాలి? మరిచిపోయిందా, బాధంతా తెలియకుండా భరించిన  అమ్మ స్థిత ప్రజ్ఞురాలు కదా?

అమ్మకు 92 సంవత్సరాలని… ఆ జ్ఞాపకాలు కరిగిపోతున్నాయి. శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమికి ఒక రోజు ముందు అమ్మగారు పుట్టినారు. గోకుల అష్టమి ముందు రోజును అమ్మ పుట్టినరోజు అని గోకుల సప్తమి అని అంటూ ఉంటాను, సులువుగా గుర్తుంటుందని.

ఇప్పుడు ఏమీ పూర్తిగా జ్ఞాపకం లేదు. కనుక అమ్మ ఇప్పుడొక యోగిని. మౌని, హాయిగా ఆనందంగా అమ్మ నవ్వుకో కలిగిన యోగిని, ఆనందిని అమ్మ. జ్ఞాన రాహిత్యాన్ని ఆమె ప్రస్తుతం ఆనందిస్తున్నది ఆ కొత్త అనుభూతులను అనుభవిస్తున్న ఆనందిని.

మా అమ్మ. ఎన్నో కష్టాలు భరించింది.

అయిదుగురు అన్నదమ్ములు కలిసి ఉండేవారు. పెదనాన్నగారు సంగీతం పాఠాలు నేర్పేవారు. నాన్నగారు ఆంధ్రపత్రిక ఏజెన్సీకి పనిచేసేవారు. తన మూడో సోదరుడు నాన్నకు సాయంచేసేవారు. ఇద్దరు తమ్ముళ్లు చదువుకునేవారు. చిన్న తమ్ముడు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుకునే వారు.  ప్రతి నెల మొదట హాస్టల్ కి డబ్బు ఇచ్చేవారు.

ఆంధ్రపత్రికలు 1200 కాపీలు అమ్మేవారు నాన్నగారు.  సైకిల్ కు కట్టుకుని తెల్లవారుజామున ప్రతి ఇంటికి దినపత్రికను విసిరేవారు. రోజూ కొనుక్కునే వారు నెలరోజుల తరువాత డబ్బు ఇస్తారు. కొందరు ఎగవేసేవారు. చందాలు వసూలై వస్తే గిస్తే డబ్బులో అయిదుగురి కుటుంబం బ్రతకాలి.

నాన్నగారు ఆవిధంగా మొదట అంది వచ్చే వంద రూపాయలను ముందు తన తమ్ముడికి (చిన్నాయినకు)  పంపాలి. ఆమ్మ (అంటే అమ్మ అక్క) అమ్మ, ముగ్గురు తోడికోడళ్లు (చెల్లెలు) సామగ్రి వచ్చేకోసం ఎదురుచూస్తూ   ఉంటారు. అందాకా వంటింటి పొయ్యిలో పిల్లి లేవదు.  మా పెద్దన్నయ్య, అన్నయ్య ఇద్దరూ కలిసి రోజూ పప్పు ఉప్పులు పొట్లాలు సిద్దం చెయ్యాలి. నాన్నగారు పైసలు ఇస్తే, కిరాణ సరుకు కొనుక్కొంటేనే పప్పులు ఉప్పులు తరువాత వండుకోవడం ప్రారంభం.

నా నాన్నగారు తెల్లవారుజామున నాలుగింటికి వరంగల్లు రైల్వేస్టేషన్ కి వచ్చే మద్రాస్ ఎడిషన్ పత్రికల కట్టలు విసిరేసి వెళ్లిపోయేవాడు. అందులో విజయవాడ నుంచి చేరిన పత్రికల కట్టలను నాన్న వెతుక్కొవాలి.  స్టేషన్ బయట చీకటిలో ఆ కట్టలలొ కొన్ని కరపత్రాలు కనపడేవి. వెల్లడిచేయడానికి ప్రభువులకు వీల్లేని పోరాడే అంశాలు ఉండేవి. నిజాం ప్రభుత్వం పైన జనం పోరాడే వాళ్లు. పత్రికల కట్టలలో మధ్యలో అవి కనబడకుండా కాపాడేవాళ్లు. నిజాం పోలీసులు, బ్రిటిష్ ఆంగ్లేయ పాలకుల పోలీసులకు దొరికితే చంపేయడమే  కాక ఇంకేమిటి?

పత్రికలు నడుపుకుంటూ, సైకిల్ తొక్కుకోవలసిందే. నా చిన్నప్పుడు  సైకిల్ తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్ నడిపేది.నాన్నను తలుచుకోగానే నాకు కళ్లు పొంగేవి.

తరువాత ఏజన్సీ తోపాటు వారపత్రిక నడపడం మొదలుపెట్టారు. 22 ఏళ్లు తరువాత దిన పత్రికగా మార్చారు. పొద్దున 9 నుంచి రాత్రి 11 గంటలదాకా, చాలాసార్లు అర్ధరాత్రి దాకా పనిచేసుకునే వారు నాన్న. పత్రికలు నడపడం కష్టం అయ్యింది. ఆ పని అంత సులువు కాదు, ఎన్నడూ లాభం అని లెక్కించేదే లేదు. వారపత్రిక కాదు పెళ్లి పత్రికలు ప్రింట్ చేస్తేనే బాగుండేది అని ఇతర బంధువులు అనేవారు నాన్నగారితో. పత్రిక వ్యాసాలు, రచించి, ప్రచురించి అందరితో అద్భుతంగా పత్రికను నడిపించే శక్తి తనకే తెలుసునని అనుకునేవాడు. అంతకు ముందు అనేకానేక పనులు చేసుకుంటే తప్పగాని జీవిక సాగి ఉండేది కాదు.  రచయిత గా పాత్రికేయుడిగా, స్వాతంత్ర్య సమర వీరుడని ప్రభుత్వం గుర్తించింది.

అమ్మకు ముగ్గురు సంతానం.  అన్న, మధ్య కొడుకు (కేశవ్) చెల్లెమ్మ. చాలిచాలని జీవనం, అమ్మకు, నాన్నకు రకరకాల ఇంటి కష్టాలు. చిన్న పత్రికల ప్రింట్ కష్టాలు నాన్నకు. ఇద్దరూ కష్టజీవులు.

నాన్న గుండె అలిసిపోయి ఆగింది,  70 సంవత్సరాలు పని చేసిన తరువాత. అంతకు ముందు పత్రికకూడా ఆగిపోయింది.  నాన్నవెళ్లిపోయి ముఫ్పయ్ ఏళ్లు గడిచాయి.

ఒక్కోసారి శాపమో అంటే, మరోసారి కాదనే వారు. నేను ఎప్పుడూ ఆలోచించే వాడిని. వరమా శాపమా? అని మా నాన్న మధ్య మధ్య అంటూ ఉండేవాడు…  నాన్నలేకుండా దాదాపు 28 సంవత్సరాలు. మా నాన్నగారు  పరమపదించడానికి కు ముందు ఆమెకు అన్నీ తెలుసు, అందుకే బాధపడింది ఆ కష్టాలకు.

నాకు స్ట్రోక్ వల్ల గుర్తురావడం లేదు. ఆర్నెల్ల తరువాత కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. 92 ఏళ్ల వయసులో చాలా మరిచిపోతున్నది.

ఓ సాయంత్రం ప్రసంగం తరువాత మరిచిపోవడం ప్రారంభమైంది, తెలియకపోడం మొదలైంది. ఒకరు ఫోన్ నెంబర్ అడిగారు. చెప్పలేకపోతున్నాను. కల్యాణిని అడిగి నా నెంబర్ చెప్పమన్నాను. ఇంటి చేర్చారు. కాని నాకేమీ తెలియదు. ఏదైనా కానీ అని కల్యాణి తన కొడుకుని తీసుకుని ఆరుగంటలకు న్యూరోలిజీ యువ వైద్యుడు సాయి కల్యాణ్ కి ఫోన్ చేస్తే అందుకున్నాడు. నాకు దేవుడే. వెంటనే ఫోన్ లోనే ఎమ్మార్ ఐ చేయించమన్నారు. కిమ్స్- కృష్ణ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంపించారు. స్ర్రోక్ వచ్చింది. నా కొడుకు ఏడుస్తున్నాడు. తట్టుకోలేకపోయేవాడు…. కాని కల్యాణి ధైర్యం ఇచ్చింది. కొడుకు నిలదొక్కుకోవాల్సిందని చెప్పింది. అదే నీ కర్తవ్యం’’ అని చెప్పింది.  కొడుకు పడిపోకుండా నన్ను పట్టుకున్నారు. ఎవరూ ఆపలేకపోతున్నారు. స్కాన్ చేయించడానికి సాధ్యం కావడం లేదు. కళ్లు ముందున్నా చూడడం లేదు. నొప్పులు, కష్టాలు, దెబ్బలు తెలియదు. ఇంజక్షన్లు  తెలియదు. కడుపులో సూదులు పొడిచారని తెలియదు. కాస్సేపు కాళ్లు పడిపోవడం, వంకరం అవడం … అమ్మకి తన కొడుకు (కేశవ్) అని ఇప్పుడు తెలియదు. నాకు ఏమీ తెలియడం లేదు. జీవితంలో ఒక నెలరోజులు శూన్యం. కడుపు లో గుచ్చినది ఏమిటో, ఎక్కడుందో. ఏం చేసారో, చేయలేదో? హాస్పిటల్, డాక్టర్లు, మందులు తెలియదు.

పదిరోజుల తరువాత దాకా నాకేమీ తెలియదు.  పూజ గది కి వెళితే ఏం చేయాలి? దేవుడి ముందు నిలబడ్డాను. ఏం చేయాలక్కడ? దేవుడు తెలియదు. పూజ తెలియదు. అడియేన్ అంటూ సాలంగ్రామ ముందు భక్తితో మొక్కి నమస్కరించవలసిన నేను, పిచ్చిగా చూస్తున్నాను.  కాస్సేపయిన తరువాత సాపాటు, అదే భోజనం చేద్దాం రండి అంది. ఏమిటా పని? అదేమటని కూడా తెలియదు.

అన్నం కావాలని కూడా అనడం రావడం లేదు. అన్నంకావాలని కూడా అడగకపోతే ఎవ్వడిస్తాడురా నీకు తిండి అని అమ్మ ఎన్నో సార్లు అనేది.

స్ట్రోక్ వల్ల నిద్ర రాదు. తల నొప్పి తీవ్రంగా ఉంటుంది. తల అంతా తిరిగిపోతూ ఉంటున్నది. ‘‘ఏంరా బాగుంటున్నావా’’ అని అడిగితే అవునంటున్నానట. కాని ఎవరు అది, నాతో ఏం చెబుతున్నారని అర్థం కాదు. అక్కడ భగవద్గీత గురించి టిటిడి టివిలో రోజూ ప్రసంగం వినేవాడిని.

భగవద్గీతలో ఓ దశలో జ్ఞాపకాలు, జ్ఞానం, మరుపు  కృష్ణుడు తానే అందరికీ ఇస్తాడు అని చెప్పినట్టు లీలగా గుర్తుంది. తిరుఅధ్యయనం అంటే ఏమిటి. ఆర్ఘ్యాలు, ఆచమనాలు, భగవంతుడెవరు? పెదాలు పంటి దాటనంత లోపునే అన్నీ ఆలోచనలే, మాటలు మంత్రాలు. చదువేమిటి? కాని అతనికి ఇంకా ఆ నాలుగో అయిదో అక్షరాలు మాత్రమే తెలుసు. నోరు లోలోపలే చదివే శక్తి రెండు నెలలు దాటిన తరువాత కూడా కొన్ని చిన్నఅక్షరాలు కూడా అర్థం కావడం లేదే…

వేలాది వ్యాసాలు, ఎన్నో పుస్తకాలు రాసిన నాకు ఎందుకో గుర్తు రావడంలేదు. అర్థం కావడం లేదు.

ఇప్పుడు అదంటే ఏమిటి? ఒక్క అక్షరం కూడా తెలియదు. అక్కడ నేను ఉన్నచోట ఏ ధ్వనిని కూడా తట్టుకుని నిలువలేను. టివిలో సినిమా చప్పుడు వినలేను. పుస్తకం చదవాలని ఉంది కాని అర్థం కాదు. ఒక్క పేజీ కూడా నోటితో చెప్పలేను. మొదట్లో పదాలు కూడా అర్థం కాలేదు. చాలా సేపు ప్రయత్నం చేస్తే ఒక లైన్ తెలిసేది. కాని అంతలో తలనొప్పి. ఏ పనీ చేయకుండా, వినకుండా, చదవకుండా, భోజనం, మందులు కావాలని కూడా అడగడం రాకపోయేది. ఎటు నడివాలో తెలియదు.

నిదానంగా కొత్తగా పాత సినిమాల ద్వారా జ్ఞాపకాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ సినిమాలతో నవ్వుకోగలిగాను. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, బిత్తిరి సత్తి, వేణుమాధవ్, ధర్మవరపు గార్లు (చాలామంది ఉన్నారు. నేను అందరూ మహానుభావులు హాస్య రచయితలు ఎందరో గురించి చెప్పలేకపోతున్నాను క్షమించండి.) మేలు చేసిన మీ వంటి వారిని ఎప్పుడూ మరిచిపోలేను. నవ్వించి నేర్పారు. నవ్వించి బతికించారు.

కంటి రెప్పవలె కల్యాణి, హర్ష జాగ్రతగా ఎప్పుడు చూస్తూ ఉంటున్నారు. ఒక రోజు మధ్యాహ్నం వాన పడుతూ ఉంది. స్ట్రోక్ సమస్య వల్ల వర్షంలో నిలబడాలని నడిపోవాలని హాయిగా ఉంది. మెదడు పైన నీళ్లు చిందుతూ ఉంటే కొత్తగా ఆనందంగా ఉంది. నడిచిపోతున్నాను. దారిలో ఒక మిత్రుడి ఇల్లు నాకు గుర్తొచ్చింది. కాని ఎక్కడికో అని చెప్పలేను. అదెవరూ కూడా తెలియదు. ఇంట్లోకి వెళ్లాను. అక్కడున్న పత్రిక మేనేజర్ నన్ను గుర్తించాడు. సార్ మీరు మాడభూషి కదూ అంటూ వారు నన్ను పై అంతస్తునుంచి పిలిచారు. పాత్రికేయుడు బైస దేవదాస్ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. స్ట్రోక్ ఇబ్బందుల ఉందని ఆయనకు తెలియదు. మాట్లాడలేకపోతున్నాను. తెలిసినంత చెప్పడానికి ప్రయత్నం చేసాను. బైస సతీమణి నన్ను చూసి కన్నీరు పెట్టుకున్నారు. లేదమ్మా ఇప్పుడు ఫరవాలేదని అన్నాను. జాగ్రత్తగా కారు లో తీసుకువచ్చారు.

*

అన్నయ్య ఇంట్లో మా అమ్మగారిని చూడడానికి వెళ్లాలనిపించింది. అమ్మ నాకు కళ్లతో చెబుతున్నారు. మాటలు తెలుసు కాని నేనెవరో తెలియదు. నాకు తెలుసు కాని అన్ని మాటలు చెప్పలేను. తెలియకపోయినా నన్ను ఆప్యాయతతో చూస్తున్నారు. ఆ అమ్మకు ఇతడు  తన కన్నకొడుకు అని, ఓ రెండు మూడు నెలల  నుంచి అమ్మవలెనే కొడుక్కి కూడా ఏమీ తెలియదు.

కొన్నినెలల తరువాత కూడా తన కుమారుడికి జ్ఞాపకం, జ్ఞానం లేదు. ఇద్దరికి ఒకరిగురించి మరొకరికి తెలియదు. ఏ బాధా లేదు. కుమారునికి అయితే కొన్ని కొన్ని జ్ఞాపకాలు వస్తున్నాయని… అమ్మకు ఇంకా జ్ఞాపకం రావడంలేదు. ఇప్పుడేవీ తెలియదు. వరమో శాపమో.  తనకి తెలియదు. నేను కూడా, మా అమ్మ అన్నట్టు ఆనందంగా నవ్వుతూ ఉన్నాను. ఏదో చెప్పినట్టు, అన్నట్టు. నేను చదవి చదవలేని మధ్య, మా అమ్మకి పూర్తిగా తెలియకపోయినా, ఆప్యాయతతో చేతి వేళ్లు జొప్పిస్తూ నా తలకి నూనె రాస్తున్నది.

ఒకే ఒక్క పదం, అది ‘మార్చు’.  ‘మార్చు’ అంటే దీపం ఆర్పాలన్నా, దీపాలు వెలిగించాలన్నా… మళ్లీ అదే అంటే మళ్లీ వేయడం.

ఆమె నాకు భార్య కావచ్చు. కాని నాకు ఆమే తల్లి, మరిచిపొయిన నా మాతృదేవత కావచ్చు. కాని కల్యాణి నాకు మాతృదేవత.  నా అమ్మే ఆమే. నోటికి తినిపించినా ఆమే. కల్యాణికి కేశవ్ కు వచ్చిన రెండో మాట. నాకు ఏమని, తెలుసా ‘‘నవనీతం’’ ఏది అడిగినా అదే మాట.

ఎంత వింత. నా చదువు, యాభై పుస్తకాలు రచించానని ఎంత అహంకారమో కదూ. అన్నీ మరిచిపోయిన తరువాత ఎన్ని రచనలు రాసి చేసేదేమిటి? నా ఇంట్లో మొదట కనిపించేవి పుస్తకాలే, నేను నాకు వచ్చిన ఫలకాలు, జ్ఞాపికలు… ఇక్కడున్నాయి, ఏమిటవి, జ్ఞాపకం జ్ఞానం మరిచిపొయినవి. కొన్ని వారాల దాకా నాకు చాలా తెలియదు. అంతకుముందు చేసే మంత్రాలు, పూజలు, స్తోత్రాలు ఏమో ఎక్కడికి పోయాయో.

పెద్ద అక్షరాలు ఒకటో రెండో గుర్తొస్తున్నాయి. కాని చదవలేను. చెప్పలేను. తెలిసినా మాట్లాడలేని శక్తి. ఓ నాలుగు నెలల నాటికి మరికొన్ని అక్షరాలు, పలికిన పదాలు…. ఓ రోజు కల్యాణి నాలుగు విష్ణు సహస్ర నామాలు చెప్పించడం చూసిన వారు ఆశ్చర్యపోయారు. కొన్నిపదాలు సొంతంగా నేనే చెప్పలేను.

చదువుల తల్లి…చెప్పిన మాటలు ఇవి.  ఓనమాలు ఓం నమః మాకు తెలియదని తెలియదు. నా సైనికాధికారుడి కుమార్తె, (నాకుమార్తె – కూతురు) అంటే నాకు మనవరాలు విష్ణు, అంతకుముందు కరోనా కాలంలో కంప్యూటర్ లో వీడియోలద్వారా విష్ణు చదువుకున్నది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏ బి సి డి నేర్పేది  అప్పుడు స్ట్రోక్ బాధల మధ్యలో చదువు నాకు అభ్యాసం నేర్పింది విష్ణు. ‘ఆల్ఫాబెట్ ట్రైన్’, ఫోనిక్స్ సాంగ్, ఈ పాఠాలతో పాటు, యూట్యూబ్ ద్వారా ‘హనుమాన్ చాలీసా, అయిగిరినందిని’  అనే మహిషాసురమర్ధని పాటలు నేర్పింది. నాతో పాటు శ్రీకృష్ణుని హిందీ భజన్, ‘జేసుదాస్ స్వాగతం కృష్ణా’ అనే పాటలు, ‘ఓం నమో వేంకటేశ’ అని నాలుగేళ్ల విష్ణు మాతో నాతో కలిపి జపమాల తిప్పుతూ చదివేది. తెలుగు రైమ్స్ చదివేది.  చదువుల తల్లి…చెప్పిన మాటలు ఇవి అప్పుడు రకరకాల చదువులను నాకు అభ్యాసం చేసింది విష్ణు. సైనికాధికారి అల్లుడుగారు పనులెన్నో ఉన్నాఒకటో క్లాస్ ఇంగ్లీష్ లెక్కలు యూట్యూబ్ ద్వారా నాకు చేర్పేవారు.

నా బతుకు జీవనంలో ఆర్నెల్ల  కాలం ఆగి పోయింది. అమ్మకు తెలియదు.

మనం లేకపోయినా కాలం ఆగిపోదు కదా. కల్యాణికి కాలం ఆగిపోలేదు. మరిచీ మరవని, చెప్పలేనివి, చెప్పగలిగినవి, చెప్పడానికి ఇంకా కాలం కావాలనడం అన్నీ నాకు తెలియనివి, తెలుస్తున్నవి. ఒక్క క్షణం ఆగిన కాలం మళ్లీ నెమ్మదిగా సాగుతూ నాకు నేర్పుతున్నాది. ఏప్రిల్ నుంచి కాలం ఆగి సాగుతున్నది. కొత్త సంవత్సరం వస్తున్నది. కాలం మహా నదియై ప్రవహిస్తూ ఉంటుంది. కాలమే నాకు మళ్లీ అక్షరాభ్యాసం చేస్తున్నది.

*

మాడభూషి శ్రీధర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆ ఆర్నెల్ల బాధలు దాటించి ప్రస్తుతం మీకు తిరిగి కొత్త జీవితం ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు