ఎంకటేశు రాములోరి మందిరం అరుగు మీద కూర్చొని, ఎదురుగా వున్న చర్చీ ముందు ధ్వజస్తంభం లాంటి సిలువ మీదుగా మబ్బుల్లోకి చూస్తున్నాడు. ఆకాశంలోకి కాదేమో, గతంలోకి. తన గతంలోకి. తనదే అయిన గతంలోకి.
అరవై ఏళ్ల క్రితం ఇదే మందిరం లోపల తన పెళ్లయ్యింది. మాలదాసుడు హన్మంతరావు చేశాడు పెళ్ళి. మాల, మాదిగల పెళ్లి, చావులకి బ్రాహ్మలు పౌరోహిత్యం చేయరు. ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ. బాగా డబ్బు సంపాదించిన మాల, మాదిగల కార్యాలకి పట్టణాల్లో పేద బ్రాహ్మలు పౌరోహిత్యం చేస్తున్నారు. కానీ పల్లెల్లో ఇప్పటికీ మాలదాసుడే.
ఆ తర్వాత ఇదే మందిరంలో పార్వతమ్మతో కలిసి కనీసం మూడు, నాలుగు సార్లు శ్రీరామనవమికి పెళ్లి పీటలు ఎక్కాడు. ఆమె కాన్సర్‌తో చనిపోయి ఏడేళ్లవుతోంది.
ఆఖరిసారి పీటలెక్కేప్పటికి హన్మంతరావు చనిపోయాడు. అతని కొడుకు రామకృష్ణ పౌరోహిత్యం చేశాడు. ఎంకటేశు కొడుకు సురేశ్‌తోపాటు డిగ్రీ చదువుకొని దగ్గర్లోని పట్టణంలో ఒక ప్రైవేట్ స్కూల్లో తెలుగు టీచర్‌గా పని చేస్తున్న రామకృష్ణ పండగలకి, పబ్బాలకి సైడ్ బిజినెస్‌లాగా పౌరోహిత్యం చేస్తుంటాడు.
ఆ పాత గుంటూరు, ఈ కొత్త బాపట్ల జిల్లాలో మాల, మాదిగ కులాలన్నీ క్రైస్తవ్యంలోకి మారిపోయాయి. ఎక్కడో ఎంకటేశు లాంటి ఒకటీఅరా ఇంకా హిందూ మతంలో మిగిలిపోయారు. కాబట్టి మాలదాసుడి పౌరోహిత్యం ఒక వృత్తిగా నడిచే పరిస్థితి లేదు. రామకృష్ణ పెళ్లి చేసుకోడానికి మాలదాసుల కులంలో అమ్మాయి కూడా దొరకలేదు. అతని భార్య బ్లెస్సీ పిల్లల్ని తీసుకొని చర్చీకి వెళ్తుంది. రామకృష్ణ మాత్రం మతం పుచ్చుకోలేదు. ఎంకటేశులాగే హిందూ మతంలో మిగిలిపోయాడు.
తుప్పు పట్టిన రామమందిరం ఇనుప గేట్‌కి తాళం లేదు గానీ, గడి వేసుంది. గేట్‌కి రెండు పక్కలా రెండు సిమెంట్ అరుగులున్నాయి పెచ్చులూడిపోయి. రెండో పక్క అరుగు మీదికి బొంబాయిగోడొచ్చి కూర్చున్నాడు.
“ఏమ్మాయ్యా? మహాలక్ష్మి, సురేశ్‌గోడు, ఆళ్ల పిల్లలు బాగుండారంటే?” రోజూ అడిగే మొదటి ప్రశ్న.
“బాగనే ఉండారు లేరా, రాత్రి ఎనిమిదింటికి ఈడియో కాల్ చేత్తారుగా ఇద్దరూ” ఎంకటేశు సమాధానం సిద్ధంగా వుంది.
“ఏం కూర మాయ్యా” రెండో ప్రశ్న.
“సువార్త వంకాయలో వరుకులేసి వొండిందియ్యాల, నసాలానికంటింది” కూర రుచి నెమరు వేసుకుంటూ చెప్పాడు ఎంకటేశు.
సువార్త అదే వూరిలో వుండే ఎంకటేశు మేనకోడలు. ఎంకటేశు కూతురు మహాలక్ష్మి నెలనెలా డబ్బులు పంపించి సువార్తతో ఎంకటేశు భోజనం ఏర్పాటు చేపిస్తుంది. అమెరికాలో వుండే కూతురు మహాలక్ష్మి, హైదరాబాద్‌లో వుండే కొడుకు సురేష్ ఎంత బలవంతం చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఉండటం ఎంకటేశుకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పుడన్నా ఒకసారి కొడుకు బలవంతాన కారులో తీసుకెళితే కష్టంగా నాలుగు రోజులుండి రేపల్లె డెల్టా ఎక్కేసి వెనక్కొచ్చేస్తాడు.
“ఏం వరుకులు మాయ్యా? పెద్దోడా? మేకా? ” బొంబాయిగోడికి అన్ని వివరాలు కావాలి.
“గొడ్డు మాసం ఎవురు తింటన్నార్రా ఇప్పుడు మాలపిల్లిలో? యేట వరుకులే. నాకోసమని సువార్త మొగుడు లేత మటన్ కొనుక్కొచ్చి ఎండబెడతాడు. మాలచ్చింకి గాని సురేషుగ్గాని తెలిత్తే ఆణ్ణి, నన్నూ తిట్టి పారేత్తారు. మటన్ తిను గాని ఎండు కూర తినొద్దని”.
“ఎండుముక్క రుచి తెలియకుండా పెంచిందాళ్ళని పారోతత్త, మరి తప్పదు” పకపక నవ్వాడు బొంబాయిగోడు.
“పొద్దున్నే యేసేసావేరా” వాడి వాలకం చూసి అడిగాడు ఎంకటేశు.
బొంబాయిగోడి అసలు పేరేంటో ఆ వూళ్ళో ఎవరికీ తెలీదు. అంతా మర్చిపోయారు. పదిహేనేళ్ల వయసు నుంచి లారీ మీద పనికెళ్లేవాడు. ఎక్కువగా బొంబాయికి చేపలు లోడ్ వేసుకెళ్లే లారీలో. డ్యూటీ దిగి ఇంటికొచ్చిందగ్గర్నుంచి బొంబాయి గురించే చెప్పేవాడు. దాంతో వాణ్ణి అందరూ బొంబాయిగోడు అనటం అలవాటయిపోయింది. లారీ క్లీనర్ నుంచి డ్రైవర్ అయ్యాడు. తాగుడు పెరిగి పెరిగి చివరికి పనిపోయింది. ఇంట్లోనే వుంటూ భార్య సంపాదన మీద బతుకుతున్నాడు.
“ఆ మియ్యమ్మాయి బో డబ్బులిత్తందని పొద్దున్నే యేసేత్తా” నవ్వుతున్నాడు బొంబాయి.
“పనీపాటా చెయ్యని నీకు నోట్లోకి నాలుగు ముద్దలు పెట్టడమే దండగ. మళ్ళీ తాగడానిక్కూడా డబ్బులియ్యాలేరా మమ్మాయి” అని బొంబాయి నవ్వులో శ్రుతి కలిపాడు ఎంకటేశు.
నవ్వుతుంటే పొలమారింది. బొంబాయి సైగ చేయడంతో ఎదురుగా వున్న బడ్డీ కొట్టు క్రిస్టినా పిల్లోడితో ఒక నీళ్ల సీసా పంపించింది. ఎంకటేశు రెండు గుక్కల నీళ్లు తాగి కుదుటున పడ్డాడు.
తాత, తండ్రి ఇచ్చిన రెండెకరాల పొలం పండిస్తూ, నాలుగు గేదెలు పెట్టుకొని పాలమ్ముతూ కొడుకు, కూతుర్లను బాగా చదివించాడు ఎంకటేశు.
రామ్మందిరం, చర్చీల మధ్యలో తర్జని చూపిస్తూ నిటారుగా నిలబడి వున్నాడు అంబేద్కర్. ఆయన్ని చూసిన ప్రతిసారి ఆ చూపుడువేలు తనవైపే చూపెట్టి చేతిలోని పుస్తకం పిల్లల్ని ఇంకా ఇంకా చదివించమని చెబుతున్నట్లు అనిపించేది. చాలాకాలం అది పుస్తకం అనే అనుకున్నాడు. దేశాన్ని నడిపించే రాజ్యాంగం అని ఒకరోజు కొడుకు చెప్పాడు. ఆ తర్వాత చదువు మీద గురి ఇంకా పెరిగింది.
“తాతయ్యా! టీ ఇవ్వనా?” అడిగింది క్రిస్టినా. సమాధానం కోసం చూడకుండా పిల్లోడితో రెండు కాగితపు కప్పుల టీ పంపించింది.
పెద్దగా శబ్దం చేస్తూ టీ చప్పరిస్తూ “పారోతత్త చేతి చిక్కటి టీ ఎక్కడ..ఈ క్రిస్టినా నీళ్ల టీ ఎక్కడా” అన్నాడు బొంబాయి.
“అదీ ఫ్రీగానే తాగేవోడివి, ఇదీ ఫ్రీనే బొంబాయి పెదనాన్నా” వెక్కిరింత కాదు వాస్తవం చెబుతున్నట్టు చెప్పింది క్రిస్టినా. మనసారా నవ్వేసాడు బొంబాయి.
క్రిస్టినా కొట్లో తిన్నా, తాగినా ప్రతిదానికి లెక్క రాసుకొని ఎంకటేశు దగ్గర తీసుకుంటుంది తను. అది తనకి మహాలక్ష్మి ఇచ్చిన స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్.
“తీసిన పాలు తీసినట్టే పోసేవోణ్ణి పాడి చేసినంత కాలమూ. ఒక్క మనిషి తప్పితే ఎవ్వురూ నా పాలని పల్చన అనలేదు” గతంలోకి జారిపోయాడు ఎంకటేశు.
“ఎవుడా ఎదవ?” క్రిస్టినా అడిగింది.
“ఇంకెవురు, అసింట పొంతులు” అన్నాడు ఎంకటేశు.
పక్కనే వున్న పాలెంలో ఎక్కువమంది పొలాలున్న సూద్రులే. రెండిళ్ళు మట్టుకి బ్రాహ్మలు. ఒకటి ఊరి కరణం ఇల్లు, రెండోది అదే పాలెంలోని రామాలయం పూజారి. చుట్టుపక్కల గ్రామాల పంచాంగకర్త సుబ్బయ్యశాస్త్రి ఇల్లు. ఆయన చాలా నిష్టగా ఉండేవాడు. పొద్దునా, సాయంత్రం మాలపల్లి దాటుకొని పెద్దకాలువ దగ్గరికి స్నానం, సంధ్య కోసం నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆయన పిలకా, జారిపోతున్న పంచె చూస్తూ “పొంతులూ..పొంతులూ” అంటూ చిన్నపిల్లలు వెంటబడేవాళ్ళు. “అసుంట..అసుంట” అంటూ ఎవ్వర్నీ తాకనిచ్చేవాడు కాదు. ఆయన్ని పల్లెలో అందరూ ‘అసుంట పొంతులు’ అనేవాళ్ళు.
ఎంకటేశు ఎప్పుడన్నా పని మీద పాలెం వెళితే రామాలయంలోకెళ్ళి సీతారాములకి దండం పెట్టుకోవాలి అనిపించేది. పల్లెలోని రామ్మందిరంలో వుంది సీతారాముల అనాకారి విగ్రహం, పాలెంలో అయితే చక్కగా చెక్కిన అందమైన విగ్రహం. పైగా సీతారాములిద్దరికీ చిన్న చిన్న బంగారపు కిరీటాలు. అక్కడే తచ్చాడుతుండే సుబ్బయ్య “ఒరే మాలెంకటేశా! పల్లెలో రామ్మందిరం కట్టిచ్చుకు చచ్చారు గదరా, మళ్ళీ ఇక్కడికెందుకు తగలడ్డావ్?” అని తెలుగులో మొదలేసి “మాల్లంజొడకా! మళ్ళీ నా గుడి దగ్గర కనబడ్డావంటే గుడ్లుబీకి …లో పెడతా” అని బూతుల్లోకి దిగిపోయేవాడు.
ఈ అసుంట పొంతులుతో పెట్టుకొన్నా, పెంట మీద రాయేసినా ఒకటే అనుకొని ఉసూరుమంటూ వెనక్కి వచ్చేసేవాడు ఎంకటేశు.
ఊర్లో అందరూ మతం పుచ్చుకొని చర్చికి వెళుతున్నా, ఎంకటేశు మట్టుకు రోజూ పొద్దున్నే ఒక మందార పువ్వు కోసుకొచ్చి సీతారాముల పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకొని పొలం వెళ్లిపోయేవాడు. ఆఖరికి పల్లె మొత్తం మతం పుచ్చుకున్నా తను మాత్రం రామభక్తుడిగానే మిగిలిపోయాడు.
ఎప్పుడు పాలెం వెళ్లినా రామాలయం లోపలికి వెళ్లాలన్న కోరిక మాత్రం చావలేదు. ఉడుకు రక్తపు ఇరవై ఏళ్ళ వయసు నుంచి, క్షణం తీరిక లేకుండా రెండెకరాల సొంత పొలం, పది పన్నెండెకారాల కౌలు పొలం సాగుబడి చేసిన నలభై ఏళ్ళ వయసులోనూ కూతురు అమెరికాలో, కొడుకు హైదరాబాద్‌లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డ అరవై ఏళ్ల వయసు దాకా ఆ కోరిక సజీవంగానే వుంది.
ఇప్పుడు ఎనభైకి దగ్గర్లో వున్నాడు. ఎన్నిసార్లు తరిమేసినా అతని రామభక్తి కొనసాగింది. ఉధృతి మాత్రం కాస్త తగ్గింది. పిల్లలిద్దరికీ క్రైస్తవ సంబంధాలు వస్తే కాబోయే అల్లుడు, కోడళ్ల చదువు, సంస్కారమే చూసాడు గానీ మతం పట్టించుకోలేదు. స్నానం చేసి కాసేపు బొట్టు లేకుండా కనబడితే భార్యను కసురుకునే ఎంకటేశు, బొట్టు పెట్టుకునే కూతురు, పెట్టుకోని కోడళ్లని తప్పుబట్టాలని ఏనాడూ అనుకోలేదు. తాను మాత్రం ఏనాడూ చర్చికి వెళ్ళలేదు, పిల్లల పెళ్లిళ్ళకి తప్పించి.
కూతురు పీజీ చదువు కోసం ఒక ఎకరం పొలం అమ్మకానికి పెడితే పాలెంలో రైతులంతా “నీకేమైనా యెర్రి పట్టిందేరా? భూమి అమ్ముకొని చివరి రోజుల్లో ఎట్టా బతుకుదామని” అని వెనక్కు లాగాలని చూసారు. చివరికి వాళ్ళల్లోనే ఒకరు మార్కెట్ ధర కంటే రెండు లక్షలు తక్కువకు ఆ పొలం కొనుక్కొన్నారు. ఆ రోజు తన అవసరం అలాంటిది.
ఢిల్లీలో వుంటూ ప్రతి సంవత్సరం అంబేద్కర్ పుట్టినరోజుకి వూరికి వచ్చే యల్లమంద, అలా ఒకసారి వచ్చినప్పుడు రామ్మందిరం అరుగు మీద ఎంకటేశు పక్కన కూర్చున్నాడు. అతని చేతిలో అంబేద్కర్ పుస్తకాలు. కొన్ని అతనే రాసినవి, కొన్ని వేరే వాళ్ళు రాసినవి. చదవడం వచ్చిన ప్రతి ఒక్కళ్లకి ఆ పుస్తకాలు పంచుతాడు అతను. ‘యల్లమంద’ అనే తన పేరును ‘దేశిపుత్ర బోధిసత్వుడు’ అని మార్చుకున్నాడతను, వాళ్ళమ్మ దేశమ్మ పేరు కలిసి వచ్చేలాగా.
ఆమాటా ఈమాటా అయ్యాక “బాబాయ్, నిన్ను వాళ్ళ రామాలయంలోకి రానియ్యరు. నీ రామ్మందిరంలోకి పూజా పునస్కారం చేయడానికి ఆళ్ల పురోహితుడు రాడు. అంటే దానర్థం అది నీ గుడి కాదు, అది నీ దేవుడు కాదు” అని గుడిలోని విగ్రహం చూపెడుతూ అన్నాడు బోధిసత్వుడు.
“ఇక్కడా నీ దేవుడు లేడు, అక్కడా నీ దేవుడు లేడు” ఎదురుగా వున్న చర్చిని చూపెడుతూ కొనసాగించాడు.
“అదిగో మధ్యలో వున్నాడు నీకైనా నాకైనా దేవుడు” అంబేద్కర్ బొమ్మని ఉద్దేశించి “ఆయన వల్లే నేనయినా, లక్ష్మయినా, సురేషయినా నాలుగక్షరాలు నేర్చుకొని హుందాగా, గౌరవంగా బతుకుతోంది. మనలనందర్నీ ఊరి బయటకు తరిమేసి అసుంట అసుంట అని అంటరానివాళ్ళని చేసిన అదే వూరికి ఇవ్వాళ ఏసుదాసు సర్పంచ్ అయ్యాడంటే, ఆ మహానుభావుని వల్లే. ఆయన దేవుడే లేడు అన్న బుద్ధుని మార్గం పట్టాడు” అని ఎంకటేశుకి అర్థమయ్యేలా సరళమైన భాషలో ఆ రాత్రి పొద్దెక్కే దాకా మాట్లాడుతూనే వున్నాడు. చాలామంది పిల్లలు, పెద్దలు వాళ్ళ చుట్టూ కూర్చుని వింటున్నారు.
“ఎంత బాగా మాట్లాడుతున్నాడురా! అందుగ్గదూ కలెక్టర్లకి కోచింగ్ ఇచ్చే ఉద్యోగం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు వాళ్ళు.
ఆ సంభాషణ ఎంకటేశు మీద చాలా ప్రభావం చూపింది. నన్నూ, నా జాతిని ఊరి బయటకు తరిమి ఒంటికి, చదువుకి అంటరానివాళ్ళని చేసిన వాడు దేవుడెలా అవుతాడు, ఆడు చేయకపోతే ఇదంతా చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? బుద్ధుడు చెప్పినట్టు ఈ దేవుడు నిజంగానే లేడా?
ఇవ్వాళ కాదు, ఈ అనుమానం నలభై ఏళ్ళ క్రితం మొదటిసారి వచ్చింది.
ఎవరో గొడ్లని కాచే పిల్లలు చెప్పారు, అసుంట పంతులు ఒకే ఒక్క కొడుకు సుబ్బరమణ్యం శవం పెద్ద కాలవలో తేలిందని. నీళ్లు బాగా తాగి ఉబ్బిపోయి భయంకరంగా వున్న ఆ సుబ్బరమణ్యం శవం తీయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో గోచి బిగ్గట్టి ఎంకటేశు కాలవలోకి దూకాడు.
కమ్మోళ్లమ్మాయిని ప్రేమించిన సుబ్బరమణ్యం ఆత్మహత్య చేసుకొన్నాడని కమ్మోళ్ళు, ఎవురన్నా చంపి కాలవలో పడేసుంటారని పల్లెలో వాళ్ళు అనుకున్నారు. అసుంట పొంతులు కుటుంబం ఏమనుకొంది, అసలు వాళ్ళకి ఏమి తెలుసు అన్న విషయం ఎవరికీ ఎప్పటికీ తెలీలేదు.
ఎంకటేశుకి మాత్రం తెల్లారి లేస్తే రాములోరి దగ్గర పడుండే పొంతులు ఒక్కగానొక్క కొడుకుని అకాలంగా ఎలా తీసుకుపోయాడు ఈ దేవుడు? అస్సలున్నాడా అని మొదటిసారి అనుమానం వచ్చింది. కానీ ఆ ఆలోచన అంతకుమించి సాగలేదు.
ఆ తర్వాత ఒక రోజు పొంతులు దారిన పోతున్నవాడు అదాటున ఆగి ఎంకటేశు పక్కనే అరుగు మీద కూలబడ్డాడు. ఎంకటేశు ఉలిక్కిపడి లేచి వెళ్ళబోతుంటే చెయ్యిబట్టి ఆపాడు. పొంతులు నన్ను పట్టుకోవడమేంటి అని ఎంకటేశుకి ఒక్క నిముషం ఏమి అర్థం కాలేదు.
“ఒరే ఎంకటేశా! నేన్నిన్ను ఎన్నోసార్లు గుడిలోకి రానియ్యకుండా బయటకు గెంటేసాను. కాన్నాకొడుకు అన్యాయంగా చచ్చిపోయిన్రోజు ఆడ్ని బయటకు లాగడానికి ఏమీ ఆలోచించకుండా కాలవలోకి దూకావు” అని ఊపిరి తీసుకోడానికి ఆగాడు.
“నీ రుణం ఆడూ, నేనూ ఈ జన్మకి తీర్చుకోలేము. నేను కొన్నేల మందికి జాతకాలు రాసాను, మూర్తాలు బెట్టాను. కానొరే, నా కొడుకు జాతకం నేను తెలుసుకోలేకపోయాను. వాడి చావు మూర్తం నేను బెట్టలేదు. రేయింబవళ్ళు దేవుడి బొమ్మ ముందే గడిపాను. దేవుడినెప్పుడూ చూడనే లేదక్కడ. దేవుణ్ణి చూట్టానికి ఆ గుళ్ళోకి రానవసరం లేదొరే!” అని ముగించి ఎంకటేశు సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు పొంతులు.
వెళ్లేముందు వెంకటేశు భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా తడిమాడు. ఆ రోజు ఏడ్చుకొంటూ వెళ్ళిపోయిన అసింట పొంతులు మళ్ళీ కనబడలేదు ఎంకటేశుకి. వారంలోపు నిద్దర్లోనే పోయాడు.
ఎదురు చర్చిలో మైక్ ఆన్ చేసి పాటలు బెట్టారు. తన చిన్నప్పట్నించి వున్న చర్చి ఇదొక్కటే. కానీ ఇప్పుడు పల్లెలో మరో నాలుగైదు చర్చిలొచ్చాయి. అంగీలేసుకునేవాళ్ళు, ముసుగులేసుకునేవాళ్ళు, మిలిటరీ బట్టలేసుకునేవాళ్ళు, మెళ్ళో చేతులకీ అసలేమీ వేసుకోనివాళ్ళు..రకరకాల చర్చీలు.
తనని చర్చికి రప్పించడానికి, మతం పుచ్చుకునేలా చేయడానికి పాస్టర్ల దగ్గర్నుంచి, పక్కింటోళ్ల దాకా చాలామంది ప్రయత్నం చేశారు. తన పిల్లలు మాత్రం ఆ పని ఎప్పుడూ చేయలేదు. వాళ్ళకి తన మీదున్న గౌరవం కారణం అయ్యుండొచ్చు.
ఎవరో పిల్లోడు రామ్మందిరం గేటు గడి లాగుతున్నాడు. “ఒరేయ్! తుప్పట్టిపోయుందా గడి. గీరుకుపోతే చెయ్యి సెప్టిక్ అవ్వుద్ది వదిలేయ్” కసిరాడు బొంబాయి. గేట్ వదిలేసి రోడ్ మీదికి పరిగెత్తాడు ఆ పిల్లోడు. గేట్‌లోంచి లోపలికి చూసాడు ఎంకటేశు. రాముడి బొమ్మ దగ్గిర పువ్వుబెట్టి, పూజ చేసి సంవత్సరం పైన అవుతోంది. విగ్రహాలకి బూజు పట్టి వుంది. అతనికి ఎందుకో నవ్వొచ్చింది, కానీ నవ్వలేదు.
“వందనాలు అన్యుడు గారు” బైబిల్ పాఠాలు విని చర్చిలోంచి బయటకొచ్చిన పిల్లల్లో ఓ చిన్న పిల్ల అందా మాట. “వందనాలు తల్లీ” అని నవ్వాడు ఎంకటేశు.
అన్యుడు అంటే ఎగతాళి అనుకొని, ‘నోర్ముయ్‌రా లంజొడకా’ అనో, ‘నోర్ముయ్ లంజకానా’ అనో అనే దగ్గర్నించి చాలా ఎదిగాడు ఎంకటేశు.
‘అన్యులను ప్రభువు రక్షణలోకి తీసుకొని రావాలి, వారికి సువార్త అందించాలి’. ఈ మాట వాళ్ళ పాస్టర్ రోజూ చెబుతాడు. ఇప్పుడు ఆ పల్లెలో మిగిలిన ఆఖరి అన్యుడు ఎంకటేసు.
దూరంగా వెళ్ళిపోయిన పిల్లల మీంచి చూపు ఎంకటేశు వైపు తిప్పాడు బొంబాయి. కదలిక లేదు. అతనికేదో అనుమానం వచ్చింది. ఒక్క ఉదుటున లేచి వచ్చి “మాయ్యా! మాయ్యా!” అని పిల్చాడు. ఎంకటేశు బదులు పలకలేదు. బొంబాయికి అర్థమయ్యింది.
“క్రిస్టినా, సువార్తకి ఫోన్ చెయ్యమ్మాయి. ఎంకటేశు మాయ్య చచ్చిపోయాడు” అని అరిచాడు.
అయిదు నిముషాల్లో వార్త హైదరాబాదులో సురేషుకి, అమెరికాలో మహాలక్ష్మికి చేరిపోయింది. పల్లెలో వున్న సురేష్ స్నేహితులు తర్వాత జరగాల్సిన పనుల్లో పడిపోయారు. గంటలోపు దగ్గర్లోని టౌన్ నుంచి మార్చురీ పెట్టె తీసుకొని మరికొందరు సురేష్ స్నేహితులు వచ్చారు. అమెరికా నుంచి మహాలక్ష్మి రావడానికి సమయం పడుతుంది కాబట్టి, ఎంకటేశుని రెండు, మూడు రోజులు భద్రంగా ఉంచడం కోసం కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోయాయి.
రాత్రి తొమ్మిదికల్లా సురేష్ భార్య, పిల్లలతో వచ్చేసాడు. మావగారిని అలా చూసిన కోడలు కన్నీరుమున్నీరు అయ్యింది. పిల్లలని దగ్గరకు తీసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన అయ్యేసరికి సురేష్‌కి ఏదో తట్టింది. ఫోన్ చేతిలోకి తీసుకొన్నాడు.
మాలదాసుడు రామకృష్ణకి ఫోన్ చేసాడు. “సురేషా, నేనే రేప్రొద్దున వద్దాం అనుకుంటున్నాను” అన్నాడతను.
“వస్తే ఉదయానే రా. మళ్ళీ స్కూల్‌కి వెళ్లిపోవచ్చు. మాలక్ష్మి ఎల్లుండి సాయంత్రానికి వస్తుంది. కాబట్టి మరుసటి రోజు ఉదయం పెట్టుకుంటాం ఫ్యూనరెల్. ఆ రోజు సెలవు పెట్టుకో. మేమందరిమీ బాప్తిస్మం తీసుకున్నా ఆయన అలాగే ఉండిపోయాడు. ఆయన ఆఖరి కార్యక్రమాలు ఆయన నమ్మినట్టే జరగాలి” తన ఆలోచనకి ఒక రూపం ఇస్తూ చెప్పాడు సురేష్.
“అలాగే సురేషా, అందరు బంధువులకీ ఓకే కదా” అడిగాడతను.
“మాలక్ష్మి నా మాట కాదనదు. ఎవరన్నా అటూఇటూ మాట్లాడినా పట్టించుకోవాల్సిన పని లేదు. నాన్న విశ్వాసం, అభిప్రాయం అన్నిటికంటే ఎక్కువ ఈ విషయంలో” దృఢంగా చెప్పాడు సురేష్.
“అలాగేరా, నేను రేప్రొద్దున వస్తా” చెప్పాడు రామకృష్ణ.
చెప్పినట్టుగానే ఉదయానే వచ్చాడు రామకృష్ణ. పలకరింపు, సంతాపం అయ్యాక కర్రసాయంతో ఒక పక్కగా నిలబడివున్న సామేలుని పిల్చాడు దగ్గరికి. ఒలుకులు అని పిలిచే ఆ పల్లె స్మశానానికి వీరబాహుడు సామేలు. క్రైస్తవ శవమైనా, హిందూ శవమైనా కడతేరిపోవాల్సింది సామేలు చేతిమీదుగానే.
శవదహనానికి కావలసిన సరంజామా ఏర్పాట్ల గురించి సామేలుకి చెప్పాడు రామకృష్ణ. పక్కనే వున్న సువార్త భర్త జేబులోంచి కొంత డబ్బు తీసి అడ్వాన్స్ కింద ఇచ్చాడు సామేలుకి.
“సిన్న పంతులు గోరు, మన పల్లెలో ఇందూ పీనుగ లేచి సానా ఏళ్లయ్యింది. అయినా నాకు గుర్తే, ఏమేం కావాలో. మీరేమీ కంగారు పడొద్దు. అన్ని ఏర్పాటు చేసేస్తా టయానికి” అన్నాడు సామేలు.
అటుగా వచ్చిన బొంబాయి విన్నాడా మాట. ఏదో కంగారుగా సురేష్ పక్కకి ఓ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. “అబ్బాయా..” అంటూ సురేశ్‌ని ఉద్దేశించి “మీ నాన్న రామ్మందిరంలో రోజూ దీపారాధన చేసేవాడు. మన మాలపల్లెలో ఆ మందిరానికి మిగిలిన సివరాకరి ఇందూ మడిసి మీ నానే. ఒప్పుకోవాల. కానీ ఆయన మందిరంలో దీపారాధన చేసి ఎన్నేళ్లవుతుందో తెలుసా?” అడిగాడు.
ఉలిక్కిపడ్డాడు సురేష్. రోజు సాయంత్రం ఒకే కాన్ఫరెన్స్ కాల్‌లో సురేష్, మహాలక్ష్మి కుటుంబాలు వాళ్ళ నాన్నతో క్రమం తప్పకుండా మాట్లాడుతారు. కానీ తమ తండ్రి చిన్నప్పటినుంచి అలవాటయ్యిన పూజా పునస్కారాలు కొన్నేళ్లుగా చేయడం లేదనే విషయం తమకు ఎరుకలోకి రాకపోవడం షాకింగ్‌గా వుంది సురేష్‌కి.
“తెలీదు బావా..నా గమనంలోకి రాలేదా సంగతి” ఉలికిపాటులోంచి తేరుకుంటూ అన్నాడు సురేష్.
“మీర్రారు గానీ, యల్లమంద గోడు పెతేడు అంబేద్కర్ పుట్టిన్రోజు చెయ్యడానికి ఢిల్లీ నుంచి వస్తాడు గదా. ఆడు చెప్పేడు మీ నాన్నకి” ఈ రోజు దుఃఖంలో వున్నా బొంబాయి తాగలేదు, కానీ ఈ మాటలు చెబుతున్నప్పుడు అతను ఒకరమైన ట్రాన్స్‌లోకి వెళ్ళాడు.
“ఎన్నో తరాలుగా అంటరానోళ్ళని చేసి ఊరి బయట పెట్టి చదువు, సేద్యం లేని దరిద్రంలోకి నెట్టేసిన హిందూ మతంలో పుట్టాను నేను, కానీ హిందువుగా చావను అని అంబేద్కర్ మహానుభావుడు అన్న మాట యల్లమంద చెప్పింతర్వాతే మీ నాయన మందిరంలోకి కాలుబెట్టడం మానేశాడు” తన్మయంగా చెప్పాడు బొంబాయి.
సురేష్ కళ్ళు విప్పారాయి. ఇది తన తండ్రి గురించి తనకు తెలియని కొత్త కోణం.
“కాబట్టి నేంజెప్పేదేందంటే, ఈ మాలదాసుడు మీ నాయన కర్మ చెయ్యడం ఆయనకి ఇష్టం లేదు” తాను చెప్పాలనుకున్న విషయం చెప్పేసి అక్కడ్నుంచి లేచాడు బొంబాయి.
సురేశ్ బోధిసత్వుడికి కాల్ చేసాడు.
“తెలిసింది సురేష్, సాయంత్రానికి విజయవాడ వస్తాను రాత్రికల్లా మనూర్లో వుంటాను” అన్నాడు బోధిసత్వుడు.
“సరేనన్నా! నీతో కొంచం మాట్లాడాలి నాన్న గురించి” అని బొంబాయి చెప్పిన విషయం చెప్పాడు సురేష్.
“అవును సురేష్! నాన్న బడికెళ్లి చదువుకోలేదు గానీ జీవితం చదివాడు. లాస్ట్ రెండు మూడేళ్లుగా ఆయన తాత్వికంగా చాలా ఎదిగాడు. నేనిచ్చిన పుస్తకాలు రోజూ సువార్త కొడుకుతో చదివించుకునేవాడు” అంటూ చాలా చెప్పాడు బోధిసత్వుడు.
బాబీగాడితో పుస్తకాలు చదివించుకుంటాడని తెలుసు గానీ, అది అంబేద్కర్ సాహిత్యం అని సురేష్‌కి తెలీదు. తండ్రి గురించి విన్న తర్వాత చాలా గొప్పగా అనిపించింది అతనికి.
గుండెల్లో ఒక రకమైన తృప్తి.
ఎక్కడికో వెళ్లిన రామకృష్ణ మళ్ళీ సురేష్ దగ్గరికి వచ్చాడు. “రామూ, వద్దులే. దహనం చెయ్యొద్దు అనుకొన్టున్నాము” అన్నాడు సురేష్ అతనితో.
సాయంత్రం చీకటి పడుతూ ఉండగా బోధిసత్వుడు వచ్చాడు. చూడగానే సురేష్ అతన్ని గట్టిగా పట్టుకొని, భోరుమని ఏడ్చాడు, “అన్నా! నాన్నని చూడు” అంటూ. అతన్ని ఓదారుస్తూ బోధిసత్వుడు తన చేతిసంచిలోంచి నీలిజెండా పైకి తీసి ఎంకటేసు మీద కప్పాడు. అక్కడే ఉన్న “అన్యుడు గారు వందనాలు” అన్న పిల్ల ఆ జెండా వైపు వింతగా చూసింది. ఆ పిల్ల వైపు నవ్వుతూ చూసిన బోధిసత్వుడు “జై భీమ్” అన్నాడు.
ఆ చిన్నపిల్లతో సహా అక్కడున్నవాళ్ళంతా ఒక్కసారిగా “జై భీమ్” అన్నారు.
***
ఫలానా రాస్తున్నానని ముందే చెప్పలేను!
- నమస్తే సార్! మీ గురించి చెప్పండి.
నమస్తే! మాది గుంటూరు జిల్లా రేపల్లె. నేను పుట్టి పెరిగింది అక్కడే. 1992లో స్టేట్ బ్యాంక్‌లో చేరి ఉద్యోగరీత్యా ఆంధ్ర, తెలంగాణ, ముంబయి, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల్లో పనిచేశాను. ప్రస్తుతం ముంబయిలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. రెండేళ్ల నుంచి కుటుంబంతో ఇక్కడే ఉంటున్నాను.
- కథలు రాయాలన్న ఆసక్తి ఎలా కలిగింది?
చిన్నప్పటి నుంచి చందమామ, బాలమిత్ర, బాలభారతి మాసపత్రికలు చదివే అలవాటు ఉండేది. మా నాన్న వడ్డె ఆశీర్వాదం హైస్కూలు హెడ్మాస్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఆయనకూ పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ఐదో తరగతి వచ్చేనాటికి నాకు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, జాషువా ‘గబ్బిలం’ పద్యాలు కంఠతా వచ్చేవి. సత్య హరిశ్చంద్ర, ఉద్యోగవిజయాలు నాటకాల్లో పద్యాలు రాగయుక్తంగా పాడలేకపోయినా, వాటిని కూడా కంఠతా పట్టి చెప్పేవాణ్ని.
తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చేరాక పుస్తకాలు చదవడం ఎక్కువైంది. అక్కడ చాలా పెద్ద లైబ్రరీ ఉండేది. ఒకేసారి అటు యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు, ఇటు రంగనాయకమ్మ రచనలూ చదివేవాణ్ని. విశాలాంధ్ర వ్యాన్ వస్తే అందులో పుస్తకాలు కొనేవాణ్ని. ఆ సమయంలో చదివిన టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ ‘నా జీవిత యాత్ర’ నాపై ప్రభావం చూపించింది. అక్కడే కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’ నవల చదివాను. రాస్తే ఆ స్థాయిలో రాయాలని అనిపించింది.
- తొలి కథ ఎప్పుడు రాశారు?
బ్యాంక్ ఉద్యోగంలో చేరిన కొత్తలో ఫ్రెండ్స్‌తో కలిసి ఉండేవాణ్ని. ఆ సమయంలో స్వాతి వారపత్రికలో సరసమైన కథల పోటీ ప్రకటించారు. దానికేదైనా కథ రాసి పంపిస్తే బాగుంటుందని అనుకున్నాను. అయితే నా ఫ్రెండ్ ఒకతను నిరుత్సాహపరిచాడు. దాంతో తప్పకుండా రాయాలన్న పట్టుదల పెరిగింది. అలా ‘ఆఖరి లేఖ’ అనే కథ రాసి పంపితే వాళ్లు ప్రచురించారు. ఎయిడ్స్ వచ్చిన ఒక రా ఏజెంట్ తనకు ఆ వ్యాధి రావడానికి కారణంగా భావిస్తున్న ఓ వేశ్యకి లేఖ రాయడమే అందులోని అంశం. ఇప్పటిదాకా ఓ ఏడెనిమిది కథలు రాసి ఉంటాను.
- ఇన్నేళ్లల్లో అన్ని తక్కువ కథలే రాశారెందుకు?
నా ఉద్యోగ జీవితంలో సమయం దొరకకపోవడమే ప్రధాన కారణం. నేను కథ రాసి 12 ఏళ్లయ్యింది. ఆఖరిసారి ‘ముడుపు’ కథ నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. అంతకుముందు 2013 నుంచి ఓ మూడేళ్లపాటు ముంబయిలో ఉన్నాను. ఆ సమయంలో రచయిత, అనువాదకుడు పి.మోహన్ నడిపే వెబ్‌సైట్ కోసం నాలుగు కథలు రాశాను. ముంబయి నగరంలో ఉండే అధోలోకపు తెలుగువారి గురించి రాసిన కథలవి.
- మీ పాప కూడా మీకులాగే రచయిత్రిగా మారింది కదా?
అవును. తన పేరు శ్రేష్ఠ. చిన్నప్పటి నుంచి తనకు పుస్తకాలు చదవడం అలవాటు. ఏడేళ్ల వయసులోనే హ్యారీపోటర్ పుస్తకాల సిరీస్ అంతా చదివేసింది. ఆ తర్వాత సీరియస్ సాహిత్యం చదవడం మొదలుపెట్టింది. తనకిప్పుడు 11 ఏళ్లు. రస్కిన్ బాండ్, ఖాలీద్ హుస్సేని, జెకే రౌలింగ్ తన అభిమాన రచయితలు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో రెసిడెన్షియల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. తను తెలుగు మాట్లాడుతుంది కానీ చదవడం, రాయడం రాదు. కొన్ని తెలుగు పుస్తకాలను నేను చదివి, అనువాదం చేసి తనకు వినిపిస్తాను. అలా మహమ్మద్ ఖదీర్‌బాబు రాసిన ‘కథలు ఇలా కూడా రాస్తారు’ పుస్తకం చదువుతూ అనువాదం చేసి తనకు వినిపించాను. ‘bribooks.com’ అనే వెబ్‌సైట్ ద్వారా పదేళ్ల వయసులో తన మొదటి నవల పబ్లిష్ చేసింది. దాని పేరు ‘All for a Change’.
- చాలా ఏళ్ల తర్వాత రాసిన ఈ ‘ఆఖరి అన్యుడి చావు’ కథ వెనుక నేపథ్యం ఏమిటి?
రేపల్లె దగ్గర్లో దాసరిపాలెం మా అమ్మమ్మగారి ఊరు. ఆ ఊరు మొత్తం క్రైస్తవ మతం తీసుకుంది. నాకు తెలిసి ఊరు ఊరంతా మతం మారిన ప్రాంతం అది. అలాంటి చోట కొన్ని పాత్రల మధ్య ఇలాంటి కథ జరిగితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ కథ రాశాను. నాకు కథ రాయడానికి దొరికే సమయం తక్కువ. అందుకే రెండు నెలల కాలంలో ఏడెనిమిది సార్లు విమానంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ కథ రాశాను. అలా ఆకాశంలో ఈ కథ తయారైంది.
- ముందు ముందు ఇంకా ఏమేం రాయబోతున్నారు?
ఫలానాది రాస్తున్నానని ముందే చెప్పలేను. నేను రాయడం కన్నా చదవడాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. పుస్తకాలు తెప్పించుకొని, వీలు దొరికినప్పుడల్లా చదువుతాను. ఆన్వీక్షికి ఉగాది నవలల పోటీలో బహుమతి పొందిన నవలలన్నీ తెప్పించుకున్నాను. ప్రస్తుతానికి మూడు చదివాను. చదవడంలోనే ఎక్కువ ఆనందం పొందుతాను.
Add comment