ఆకాశమై విస్తరించి……

క్షరాలను రువ్వినా,
వాక్యాలను సంధించినా
లక్ష్యం కవితా కేంద్రమే కదా.
కాని
ఆకాశ వైశాల్యం చెక్కుకున్న చుక్కల వాడలో
ఏ రిక్క కవన బిందువో కనుక్కోవడం కష్టమే మరి.
నా మనోభావాన్ని విన్నట్టు
లక్ష నక్షత్రాలు ఒక్కుమ్మడి పక్కుమన్నాయి
నా ముందు కుప్ప పడిన మెరుపు నవ్వులు
ఒక్కొక్కటే లేచి అంటున్నవి
“ సూక్ష్మ బిందువుకాదు నింగి గుండె;
విస్తరించిన దేహమై ఎల్లలు దాటింది.
నీవు కరిగిన బాణానివై ప్రవహిస్తే
ఆకసం రసాశ్రువై నీ ముందు వాలుతుంది.“
నా హృదయంలో ఏదో సంచలన ఉరవడి;
ఎదను తడిమి చూసుకుంటున్న నా వేళ్లను
ముద్దిడుతున్న వెచ్చని రసస్పర్శ!
అనంతాకాశం నాతో హస్త చాలనం చేస్తున్నది,
గురివింద గింజంత గురిచుక్క
నా గుండె నిండా నిండుకున్నది !

        సంజ రేకులు !

సంధ్య !
ఆది సంజో, అసుర సంజో తెలియని
అస్పష్ట సంధ్య !
తూర్పు పడమరలను కలిపిన
మసక దిగంతాల మగత కనురెప్పల
నిదుర బరువులను మోస్తూ
నడుస్తున్నాను;
చీకటి నుండి చీకటికి నా ప్రయాణం.
దారి పొడుగునా
విరిగిన సంజగాజుల పెంకులు :
మనసు ముక్కలు, దేహ ఖండాలు,
విద్రోహాలు, విస్ఫోటనాలు ,
తెగుతున్న ఆత్మబంధాలు,
తెగపడుతున్న రాక్షసాలు !
ఇరు సంజల మీద వంగిన
ఇరుల దారుల ఇరుకు వంతెన మీద
నడుస్తున్నాను,
అరసున్నై వంగిన
శూన్యరేఖా అవశేషాల మీద
బరి పాదాలతో నడుస్తున్నాను;
పగటి వెన్నెలలను,
రేయి వేవెలుగులను
నా కునుకు రెప్పల కింద దాచుకుంటూ,
నా ఉభయ సంధ్యలను వెలిగించే
సూర్యగోళాలను, చంద్రబింబాలను
నా దోసిటిలో ముడుచుకుంటూ.
రువ్వాలిక
ఆకాశం లోకి
నా పిడికిలో జ్వలించే పావురాయి రెక్కలను.
*

Ramaswamy Nagaraju

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు