వాడి గురించి ఊరందరికి తెలుసు. ఏం తెలుసు అంటే… కొందరు ‘పిచ్చివాడు’ అంటారు. మరికొందరు ‘అయ్యో! వెర్రిబాగులోడు’ అంటారు. ఇంకొందరు ‘వాడి జోలి మనకెందుకులే!’ అనుకుంటారు. కానీ వాడు మాత్రం ఎవ్వరినీ పట్టించుకోడు. ‘నా లోకం నాదే’ అన్నట్లు బతికేస్తుంటాడు. ఎవరు ఏది పెట్టినా తింటాడు. అదీ ఆకలేస్తేనే. ఎక్కువ పెట్టినా ‘వద్దు’ అని తల అడ్డంగా ఊపుతాడు తప్ప, నోరు విప్పి మాట్లాడడు. అలాగని మూగోడు కాదు. వాడిలో వాడే అప్పుడప్పుడు కోపంగా, ప్రేమగా, బాధగా మాట్లాడుకోవడం ఊరిలో చాలామంది చూశారు. కానీ వాడేం మాట్లాడుకుంటున్నాడో వినే ప్రయత్నం చేయలేదు. చేసినా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే.. అవి బయటకు వినపడవు. లోలోపలే.
గుబురుగా పెరిగిన గడ్డం. జులపాలుగా ఎదిగిన జుట్టు. నల్లటి శరీరం. అందుకే కొంతమంది పిల్లలు వాడిని ‘మొద్దోడు’ అని ఆటపట్టిస్తుంటారు. అయినా వాడేం పట్టించుకోడు. ఎక్కువసేపు మౌనంగానే ఉంటాడు. ఎప్పుడూ వాడి చేతిలో కర్ర మాత్రం తప్పకుండా ఉంటుంది. దాన్ని యమధర్మరాజు చేతిలో పాశంలా ఫీలవుతుంటాడు వాడు. అప్పుడప్పుడు కుక్కలు వెంటబడితే వాటిని పంచభూతాల్లా తరిమేస్తుంటాడు. అలాగని వాడి వయసేం డెబ్బై, ఎనభై కాదు. ముప్పైఐదు, నలభై మధ్యలో ఉంటాయి. ఈడుకొచ్చిన ఆడపిల్లలు సైతం వాడి పక్కనుంచి వెళ్తున్నా కన్నెత్తి చూడడు. అందుకే ఎవరూ వాడ్ని ఏమీ అనరు. ‘పాపం పోనీలే..’ అని జాలిచూపుతారు. డబ్బులిస్తే తీసుకోడు. కాసంత తిండి పెడితే చాలు.
ఊరి మధ్యలో గ్రామ దేవత జాలమ్మచెట్టు. జాలమ్మ చెట్టు అంటే అదేదో ఎవరికీ అంతుపట్టని చెట్టుకాదు. రావిచెట్టునే దేవతా చెట్టుగా పూజిస్తారు. ఆ చెట్టు చుట్టూ రచ్చబండ. పైన పూరిపాక. ప్రతి శనివారం సాయంత్రం ఎనిమిది నుంచి రాత్రి పదిగంటల వరకు అక్కడ అమ్మవారికి భజన చేస్తారు. సమయం ఏడు కావస్తుంది. వీధిలైట్లు వెలుగుతున్నాయి. జంగం పూజారి కోటేశ్వరరావు వచ్చి చెట్టుకు పూజచేసి భజనకు కావాల్సినవన్నీ సిద్ధం చేస్తున్నాడు. చెట్టు మొదట్లో దీపారదన వెలుగుతూ ఉంది. వాడు మాత్రం రచ్చబండకు ఉత్తరదిక్కు మూలన కూర్చొని చేతిలో ఉన్న కర్రను అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటున్నాడు. పిల్లలు ఉమామహేశ్వరరావు ప్రైవేటుకు వెళ్తున్నారు. పదోతరగతి పరీక్షలు దగ్గరపడుతుండడంతో గుంపుగా ఆడపిల్లలు వాటి గురించే మాట్లాడుకుంటూ త్వరత్వరగా నడుస్తున్నారు. ‘పరీక్షలు ఎలా రాయాలి? మార్కులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? ఇంకా ఎక్కువసేపు కష్టపడాలి?’ అని ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారు. ఆ మాటలు విన్న వాడు ఒక్కసారిగా చేతిలో ఉన్న కర్రను తీసుకొని రాలిన రావి ఆకులను గట్టిగా కొట్టడం మొదలు పెట్టాడు. కొడుతూ కొడుతూ వాళ్ల ముందుకు వచ్చి, కోపంగా చూశాడు. దాంతో ఆ పిల్లలందరూ ఉలిక్కిపడి, దూరంగా జరిగారు. వాడు మాత్రం, వాళ్లను ఎగాదిగా చూసి, ‘ఛీ.. ఛీ..’ అంటూ కర్రతో వాళ్ల ముందున్న నేలను బలంగా కొట్టి, మరోసారి చూసి వెళ్లిపోయాడు. పిల్లలు ‘హమ్మయ్యా’ అని ఊపిరి పీల్చుకొన్నారు. అప్పటి వరకు మార్కులు, ర్యాంకుల గురించి మాట్లాడుకున్నవాళ్లు, వాడి గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. మళ్లీ వెళ్లి కర్రతో రాలిన రావి ఆకులను కొడుతూ కూర్చొన్నాడు. ఎక్కడన్నా పచ్చి ఆకు కనిపిస్తే, దానికి మాత్రం దెబ్బ తగలనీయడం లేదు.
పూజారి జంగం కోటేశ్వరరావు చాలాసేపటి నుంచి వాడ్నే గమనిస్తున్నాడు. టపా టపా అని శబ్దం చేస్తుంటే… వాడి వైపు చూసి ‘ఒరే…! ఆ పిచ్చిపని ఆపుతావా?’ అన్నాడు కోపంగా విసుగొచ్చి. పైకి లేచి కోపంగా ఓ సారి కోటేశ్వరరావు వైపు చూసి.. ‘నమో… జ్వాలాముఖీ దేవీ.. గాడెస్ ఆఫ్ ట్రూత్’ అనుకుంటూ అక్కడ నుంచి లేచి ఊరికి ఉత్తరంగా నడవడం మొదలు పెట్టాడు.
నడుస్తున్నాడు… నడుస్తూనే… నడుస్తూ… నడు… న…
*** *** ***
సమయం తొమ్మిదన్నర గంటలు. మొదటి ఆట సినిమా వదిలేశారు. రెండో ఆటకోసం మైకులో పాటలు మొదలయ్యాయి. వాడు నడుస్తూనే ఉన్నాడు. ఊరు దాటి పొలాల గట్ల మీద ఒంటరిగా నడుస్తున్నాడు. చేతిలో ఉన్న కర్రతో గట్ల మీదున్న బురదను అటు ఇటు కొడుతున్నాడు. ఆకాశంలో చంద్రుడు వెన్నెల్లో తేలాడుతున్నాడు. చీకటిని చిదుముతూ పాల నురుగుతో నవ్వేస్తున్నాడు. నక్షత్రాలు మెరుస్తున్నాయి. వెన్నెల ఏపుగా పెరిగినా పసుపుతోటలపై పడి ఆకుల్ని సప్తగుణవర్ణశోభితం చేస్తుంది. ఆ వర్ణాలను చూసి వాడు చిరాకుపడ్డాడు. లోపల నుంచి వచ్చే సంతోషాన్ని బలవంతంగా ఆపుకున్నాడు. మిణుగురులు చేల మీద నాట్యం చేస్తున్నాయి. ఆ మిలమిలలతో వాడు ధీమాగా ముందుకు ఆడుగులు వేస్తున్నాడు. చేతిలో ఉన్న కర్రను దూరంగా విసిరేశాడు. అది వెళ్లి చిన్న మడుగులో పడింది. చేతులు పెద్దపెద్దగా ఊపుకుంటూ నడవడం మొదలెట్టాడు.
అప్పటి వరకు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు వాడి చేతివేళ్ల కొసల నుంచి రాలుతున్నాయి. అలా రాలిన నక్షత్రాలు నేలను తాకి మళ్లీ ఆకాశంలోకి వెళ్లిపోతున్నాయి. చంద్రుడి నుంచి వెన్నెల కిరణాలు నేరుగా వాడి జుట్టుపై పడి చీకట్లను చెదరగొట్టి, వివర్ణమైన కాంతి పుంజాలై ఆకాశానికి తిరిగి వెళ్లి పోతున్నాయి. మిణుగురులు స్వయం కాంతితో వాడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాడు ఓ ప్రాకృతికి సౌందర్యరాగభరితంగా వెలిగిపోతున్నాడు. పొలాలు దాటి డొంక దారికి మళ్లాడు.
ఎదురుగా కొత్తగా పెళ్లైన జంట సైకిల్ మీద మొదటి ఆట సినిమా చూసి వస్తున్నారు. భార్యను ముందు ఎక్కించుకొని అతను హుషారుగా సైకిల్ తొక్కుతున్నాడు. ఉన్న కోర్కెలు లక్షల్లో ఈ భూమి నాకు ఒక ఫుడ్ బాలూ… అంటూ అప్పుడే చూసి వస్తున్న సినిమాలోని పాటను పాడుతున్నాడు. వాళ్లకు వీడు కనిపించాడో లేదో తెలియదు కానీ, వీడికి వాళ్ల స్పష్టంగా కనిపించారు. ఆ పాట కూడా వినిపించింది. వాళ్లవైపు కోపంతో నిండిన ప్రేమతో చూశాడు. విరక్తితో కూడిన సంతోషంతో నవ్వుకున్నాడు. భావానికి అందని వాడి మనసు చాలా సేపు వాళ్లు వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఆ భావావేశం ఉన్నంత సేపు నక్షత్రాలు, వెన్నెల కిరణాలు, మిణుగురులు.. తమ క్రియను ఆపేశాయి. ఉద్వేగం తగ్గగానే మళ్లీ మామూలుగా వాడిని ప్రకృతి పురుషుడ్ని చేశాయి. అలా వాడు ఉత్తరం దిక్కుకేసి ఇంకా నడుస్తునే ఉన్నాడు.
నడుస్తున్నాడు… నడుస్తూనే… నడుస్తూ… నడు… న…
**** **** ****
సమయం పదకొండు గంటలు. ఊరికి ఉత్తరంగా ఉన్న స్మశానం. నిశ్శబ్దంగా లేదు. రెండు మూడు నక్కలు వింతవింతగా అరుస్తున్నాయి. అప్పటి వరకు వెన్నెల కురిసిన చంద్రుడు చీకటి కూపంలోకి జొరబడ్డాడు. నక్షత్రాలను మేఘాల కమ్మేశాయి. వాడు మాత్రం నడుస్తూనే ఉన్నాడు. మిణుగురులు, చేతివేళ్ల నుంచి రాలుతున్న నక్షత్రాలు, వెన్నెల కిరణాలు వాడి నుంచి అప్పటికే దూరం జరిగాయి… స్మశానంలోకి అడుగు పెట్టాలన్న వాడి ఆకాంక్షను గుర్తించాయేమో…!
వాడు కూడా వాడిలో జరిగే మార్పును గుర్తించలేదు. నేరుగా స్మశానంలోకి అడుగుపెట్టాడు. సమాధులు, అక్కడక్కడా శవాలను కాల్చేసిన మసి కుప్పలు, సమాధులు కట్టకుండా శవాలను పాతిపెట్టిన మట్టి దిబ్బలు.. రావి, మర్రి చెట్ల ఎండుటాకులు రాలి వాటి మీద గాలికి దొర్లు తున్నాయి. పెద్దపెద్దగాలి ఏదో భూతం ఆకలితో అరిసినట్లు వీస్తుంది. వాడిని చూసిన నక్కలు పెద్దపెద్దగా అరవడం మొదలుపెట్టాయి. వాడు మాత్రం అవేవి పట్టించుకోలేదు. నేరుగా లోపలకు వెళ్లాడు. అప్పటి వరకు అరచిన నక్కలు వాడు దగ్గరకు రావడంతో భయపడి దూరంగా వెళ్లిపోయాయి. వాడు ఒక్కసారిగా స్మశానం మొత్తం పరికించి చూశాడు. దూరంగా సమాధి మీద ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది.
ఆ అమ్మాయిని చూసిన వాడి ముఖంలో దుఃఖ ఛాయలు వెన్నెల రేఖల్లా విచ్చుకున్నాయి. కానీ ఆనందం, సంతోషానికి మధ్య రాలిన భావరాహిత్యంతో వాడు నడుస్తూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లసాగాడు. గాలి వీయడం తగ్గిపోయి నిశ్శబ్ధం భరించలేనంతగా మారిపోయింది. వాడు ఆ అమ్మాయికి దగ్గరయ్యే కొద్దీ అప్పటి వరకు భయంతో అరవకుండా ఉన్న నక్కలు మళ్లీ అరవడం మొదలుపెట్టాయి. ఆ అరుపులు మరింత భయంకరంగా ఉన్నాయి. వాడు మాత్రం ఆవేవీ పట్టించుకోకుండా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లాడు. పెద్దగా మెరుపు మెరిసింది. ఆ కాంతిలో ఆమె ఆకారం ప్రస్ఫుటంగా కనిపించింది. తలను మోకాళ్ల మీద పెట్టుకొని, చేతులు రెండు వాటి చుట్టూ చుట్టుకొని విరబోసిన తలతో వికల్పకంగా రోధిస్తుంది. శరీరంపై ఏ ఆచ్ఛాదనా లేదు.
వాడు దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయిని అట్లాగే కౌగిలించుకున్నాడు. అప్పటి వరకు వినిపించిన ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. అద్వైత సిద్ధాంతం పురిటినెప్పులు పడుతుంది. ప్రకృతి, పురుషుడు అలౌకికంగా లౌకికంలో… అలౌ.. లై. లౌ.. భౌతికం.. అధి భౌతికం.. తికం.. తిలకం.. లకం.. ఐక్యం.. అలౌక్యం. అంతా జన్య జనక బంధం. ధం.. ధ్వని.. నిశ్శబ్ధంలలో.. శబ్దం.. ధం. ధం.. ధం. ధన్.. మణిత. ణిత.. త.. తం. తాం.. సృష్టి స్థితి లయ త్రయ నాట్యం. ట్యాం, ట్యం.. టం
ఆ అమ్మాయి బూడిద కుప్పలా రాలిపోయింది. ఒక్కో రేణువుగా విడిపోయింది. శిరోజాల నుంచి పాదాల వరకు నిమ్మపండు లాంటి నుసిలా కూలిపోయింది. వాడి కౌగిలిలోంచి అలా అలా… బూడిదై.. నుసై.. మసై.. సై… మనసై.. విడిపోయింది. అబ్ స్ట్రాక్ పెయింటింగ్ లా… గ్రాఫిక్స్ తో చేసిన శిలాప్రతిమ నుంచి రాలిన సుకుమార పుష్ప రేణువుల్లా.. అంతే.. వాడి ముఖంలో విస్ఫులింగాలు విజృంభించినంత కోపం. కుప్పకూలిన ఆ అమ్మాయి మసిని తీసుకొని శరీరానికి రాసుకున్నాడు. ప్రేమ, కసి, కోపం, బాధ.. నవరసాల సమ్మేళనంతో వాడి శరీరం, మనసు ఊగిపోయాయి. గాలి భావరాహిత్య స్థితిలోకి మారిపోయింది. వాడు భరింతలేనంత కసితో స్మశానం నుంచి పెద్దపెద్ద అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చాడు. ముందుకు వస్తుంటే.. వెనుక స్మశానం చిన్నదై పోయింది. ఛిద్రమై పోయింది. ఆ ఉద్రేకంలోనే పడమర దిక్కుకేసి నడవడం మొదలుపెట్టాడు.
నడుస్తున్నాడు… నడుస్తూనే… నడుస్తూ… నడు… న…
**** **** ****
సమయం పన్నెండు గంటలు. వాడు అలా నడుస్తునే ఉన్నాడు. కొంతసేపటికి వాడిలోని ఉద్రేకం తగ్గింది. అడుగులు నిదానంగా పడసాగాయి. శ్వాసలో కూడా మార్పు వచ్చింది. వెన్నెల చిక్కగా, రక్తిగా, భక్తిగా, అనురక్తిగా కురుస్తూనే ఉంది. మళ్లీ వాడి చేతి వేళ్ల కొసల నుంచి నుంచి నక్షత్రాలు రాలడం మొదలైంది. వెన్నెల చుక్కల్లా వాడితలపై రాలుతూ, తిరిగి ఆకాశంలోకి వెళ్తుంది. మిణుగురులు వాడిని చుట్టు ముట్టి దారి చూపిస్తున్న దేవతల్లా మెరుస్తున్నాయి. దారికి రెండు వైపులా పొలాలు పచ్చివాసన వేస్తున్నాయి. ఏపుగా పెరిగిన వరిపైరు వెన్నెల్లో ఎన్నులతోగాలికి సుతారంగా ఊగుతుంది. వాడు అలాగే నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. ఆ ప్రాకృతికి సౌందర్యంలో లీనమై, విలీనమై, వికృతమై, నిర్లిప్తంగా, ర్లిప్తంగా, నిరాకారంగా.. అనాకృతమై, ఆకృతై.. కృతై.. కృతంగా నడుస్తున్నాడు.
వాడిగొంతులో తడి ఆరిపోతుంది. అంత చల్లటి వెన్నెల్లో సైతం గుండెల్లోంచి నేరుగా గొంతులోకి రావాల్సిన తడిపొర పొడిగా మారింది. దాహం వేస్తున్న సంగతి వాడికి అర్థమైంది. దగ్గర్లో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమోనని చూశాడు. ఎక్కడా చిన్న మడుగు కానీ, కుంట గానీ కనపడలేదు. పొరబోయింది. ముందుకు నడుస్తూనే నీళ్లకోసం వెతుకుతున్నాడు. పొలాలన్నీ తడిగా ఉన్నాయి కానీ, తాగడానికి నీళ్లు మాత్రం వాడికి కనపడలేదు. వేగంగా ముందుకు నడిచాడు. అటు ఇటు చూస్తూ ఉన్నాడు. దూరంగా ఒక చిన్న మడుగు కనిపించింది. ‘హమ్మయ్యా’ అనుకున్నాడు. వడివడిగా అడుగులు వేశాడు. వాడు వెళ్లేకొద్దీ ఆ మడుగు దూరం అవుతున్నట్లు అనిపించింది. ఎండమావిలా.. వెన్నెల మావేమో అనుకున్నాడు తనను భ్రమింపజేస్తుందోమోనని.. కోపంతో ఇంకా ఇంకా ముందుకు నడిచాడు.
మడుగు దగ్గరైంది. సంతోషం వేసింది. కానీ అది ముఖంలో ఏ మాత్రం కనిపించలేదు. నేరుగా మడుగు దగ్గరకెళ్లి వంగి చూశాడు. ఆ నీళ్లు బురదనీళ్లు. పాచిపట్టి ఉన్నాయి. తాగడానికి ఏ మాత్రం పనికిరావు. వాడు చేత్తో ఆ మడుగులో పేరుకొని ఉన్న పాచిని అటు ఇటు కదిపాడు. నీళ్లు తేటగా కనిపించాయి. చంద్రుడు నీళ్ల మధ్య అలలతో దోబూచులాడుతూ కనిపించాడు. ఎప్పుడైతే నీళ్లకోసం వాడు మడుగు దగ్గర వంగాడో అప్పుడే వాడి చేతి వేళ్ల నుంచి రాలుతున్న నక్షత్రాలు, వాడిపై కురుస్తున్న వెన్నెల ఆగిపోయాయి. వాడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా నీళ్లు తేటగా ఉండాలని పాచిని, బురదను చేతి వేళ్లతో అటూ ఇటు నెడుతూనే ఉన్నాడు. కొంత సేపటికి బురద, పాచీ పూర్తిగా తొలిగిపోయాయి. నీళ్లు తాగడనికి అనుకూలంగా మారాయి. అప్పటికే వాడిగొంతులో తడి పూర్తిగా ఆరిపోయింది.
తాగాలని దోసిటితో నీళ్లు తీసుకున్నాడు. దోసిలి నోటి దగ్గరకు వెళ్లే సరికల్లా ఆ నీళ్లు వేళ్ల కోసల నుంచి జారిపోయాయి. మళ్లీ తీసుకున్నాడు. మళ్లీ జారిపోయాయి. కళ్లుకు బైర్లు కమ్మిన్నట్లు అనిపిస్తే, తడిచేత్తో తుడుచుకున్నాడు. అంతే…!
మడుగులోని నీళ్లన్నీ మళ్లీ పాచి, బురదతో కనిపించాయి. చేతులతో ఆ పాచిని, బురదను అటు ఇటు నెడుతూ, మరోసారి కళ్లను తుడుచుకున్నాడు. ఆ మడుగులో వాడికి సూర్యుడు, చంద్రుడు, భూమి… గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కనిపించాయి. ఒకదాని తర్వాత మరొకటి వర్తులాకారంలో తిరుగుతున్నాయి. వాడు వాటిని చేతులతో అటు ఇటు నెట్టాడు. ఆది అంతం లేని సృష్టి మొత్తం వాడికి దర్శనమిచ్చింది. చరాచర జగత్తంతా ఆ చిన్న మడుగులో తిరుగుతూ ఉంది. వాడు ఎంత కసిగా నీళ్లకోసం పక్కకు నెడుతున్నా.. అవి మాత్రం పోవడం లేదు. వాడి కళ్లతో దోబూచులాడుతున్నాయి. చిన్న జీవరాశి నుంచి డైనోసార్ వరకు ఆ మడుగులో చక్రంలా పరిభ్రమిస్తున్నాయి. వాడు కోపంతో లోపలకు చేతులు పెట్టి దేవుతున్నాడు. ఎంత లోపలకు చేతులు వెళ్తే అంతలోపలి నుంచి ఉల్కలు, గ్రహరాశులు, తెగిపోతున్న గ్రహశకలాలు, వింతవింత కాంతులతో ఢీ కొంటుకుంటున్న అనేకానేక గ్రహాల ముక్కలు. చిత్ర విచిత్ర పాలపుంతలు.
ఆ చిన్న మడుగులో వాడికి కనిపిస్తూనే ఉన్నాయి. వాడు కళ్లు ఇంతవి చేసుకుని చూస్తున్నాడు. చేతులుతో దేవుతూనే ఉన్నాడు. నీళ్లను తీసుకొని తాగుదామని నోటి దగ్గరకు దోసిలి తీసుకునే సరికల్లా ఆ వేళ్ల మధ్య నుంచి ఆ నీళ్లు జారిపోతున్నాయి. ఆ మడుగులోంచి వింతవింత కాంతులు వాడి ముఖంపై ప్రతిబింబిస్తున్నాయి. అలుపెరగని యోధుడిలా వాడు మాత్రం ఆపకుండా మడుగును దేవుతూనే ఉన్నాడు. దేవుతూనే ఉన్నాడు. దేవుతూ.. దేవుడూ.. దేవతా… దేవుతూ.. అదే తాత్వికతకు అందని అనుభూతల కాంక్షావలయం. ఆ మడుగులోంచి అనేకానేక పారభౌతిక చలిత గ్రహాలు.. సృష్టి సంకల్పిత, అసంకల్పిత జీవరాశులు.. పరావృతం అవుతూనే ఉన్నాయి. అవుతూనే ఉన్నాయి. వాడు మాత్రం విసుగు, విరామం లేకుండా దోసిళ్లతో…
అద్వైతం, ద్వైతం… ఆకారం నిరాకారం.. నిరంతర పరివర్తన పరిణామం.. ఆకారం పొందలేని శ్రీకారం నుంచి అనంత భ్రమణ మూలాలు తెగుతూ… తెగుతూ.. తెంచుకుంటూ.. తెంపుతూ.. వాడిలోనే.. వాడిలోకే… వాడై.. వాడే.. సంచలన చలిత జ్వలితం.. జ్వాలాకృతం. ఆకృతం. కృతం. చర్విత చర్వణం. రణం.. మరణం.. జననం.. అంతం.. ఆరంభం.. భం.. అంతం..
విసుగు విరామం లేకుండా దోసిలితో దేవుతూ…
వాడు మాత్రం దాహార్తితో అలా.. అలా.. లా… అలలా. మడుగులో.. డుగులో.. గులో.. లో.. లోపలకు.. లోతులకు.. లోతుకు.. ఇంకా ఇంకా.. అందని ప్రశ్నల మూలాల్లోకి.. అంతుచిక్కని ఆగమ్య తమో కిరణాలాల నీడల్లోకి.. జాడల్లేని మనఃపుంజాల మాయాజాలంలోకి.. జ్ఞానం.. వైజ్ఞానం ఏర్పాటు చేసిన పరిధిని బద్దలు కొడుతూ.. తీరని తృష్ణాకృత క్రీడల్లో… వాడు.. పంచభౌతిక ప్రకృతి.. శరీరం కలిసి.. మెలిసి.. కలగలిపి.. విరిగిన ముక్కల ఆశలకు ఈ వల ఆ వల.. వల.. కాపల ఆ మడుగు.. వాడు..
విసుగు విరామం లేకుండా దోసిలితో దేవుతూ…
నిన్న… నేడు.. రేపు
————-
(post modern x post modern )+ ( post modern x altra post modern) = రవీంద్ర కథ
ఉదయ్ గారు..మీరు చెప్పినవి ఉన్నాయో.. లేదో నేను ఆలోచించ లేదు.
నన్ను నేను లోలోపల తొంగి చూసుకునే క్రమంలో… వచ్చింది ఆ కథ…
థాంక్స్.. ఎవరన్నా లోతుగా చర్చిస్తే… నిండా సంతోషం
సౌందర్యం, భయానకం మిళితమై వొళ్ళు గర్పొడిచింది రవింద్ర ..
మీ ప్రయోగం సఫలం అవుతుంది .
అభినందనలు .
ఎందుకో మనసులో అంతులేని ఆలోచనల నుంచి తెగింది ఆ కథ…
నేను పూర్తిగా నన్ను నేను సెన్సార్ చేసుకోకుండా రాశాను. థాంక్స్.