అసుర‌న్ సూచ్చాంటే.. మ‌న ప‌ట్ట‌పేగులు తెగుతాయ్‌!

నిజ‌జీవితంలో ఓ పాత్ర ఎట్లా ఉంటాదో అట్ల ఉండ‌టం మామూలు విష‌యం కాదు.

లెక్కుండేవాడు.. పేదోడు.. అగ్ర‌వ‌ర్ణాలు- నిమ్న‌వ‌ర్గాలు మ‌ధ్య కొట్టాట‌.. ఈనాటిది కాదు.. యుగాల‌ప్పుటిది. డైర‌క్ట‌ర్ వెట్రిమార‌న్‌..
ఏమి తీసినావుప్పా? ప్రేక్ష‌కుల‌ను ఉక్కిరిబిక్కిరి చేసినావు.. రోంత సేపు ఉడికిచ్చినావు.. రోంత‌సేపు ఏడిపిచ్చినావు..ఎంటిక‌లు నిక్క‌బొడుచుకునే.. అద్భుత‌మైన సిన్మాతీసినావుప్పా.

అధికారం, లెక్క ఉండే అగ్ర‌వ‌ర్ణ జాతికి.. చేనుప‌ని చేసుకోని బతుకుతూ ఊరికి బ‌య‌టుండే.. శివ‌సామి కుటుంబానికి ప‌డే కొట్లాట‌నే  *అసుర‌న్‌* క‌థ‌!   ఓ భూసామి ఫ్యాక్ట‌రీ క‌ట్ట‌డానికి.. శివ‌సామి అనే మూడెక‌రాల పేదోడి భూమిని.. లాక్కోవాల‌నుకుంటాడు.  శివ‌సామి, ప‌చ్చ‌య‌మ్మ దంప‌తుల‌కు.. మురుగ‌న్‌, చిదంబ‌రంతో పాటు ఆడ‌బిడ్డ ఉంటాది. ప‌చ్చ‌య‌మ్మ అన్న కూడా వాళ్ల‌కుటుంబంతోనే ఉంటాడు. పెద్ద‌కొడుకు మురుగ‌న్ కి కోపం ఎక్కువ‌.. ప్ర‌శ్నించే మ‌న‌సున్న ఆత్మాభిమాన‌ముండే పిల్ల‌గాడు. ముర‌గ‌న్ కి పెళ్లిచూపులు జ‌రుగుతాయి..రెండు కుటుంబాలు స‌రే అనుకుంటాయి. ఇట్ల శివ‌సామి అంద‌రూ సంతోషంగా ఉంటారు.  ఓ రోజు రాత్రి వాళ్ల చేనులో అనుకోకుండా పంది ప‌డితే.. శివ‌సామి త‌న కొడుకుల‌తో క‌ల్చి వేటాడ‌తాడు. పంది త‌ప్పించుకుంటాది. పందిని ఎంప‌లాడే కుక్క  సోగ‌ల‌కు త‌గులుకోని స‌చ్చాది. సోగ‌ల‌కు క‌రెంటు ఎందుకు పెట్నారు.. మ‌మ్మ‌ల్ని చంప‌టానికా అని భూసామి ఇంటికాడికి పోయి మురుగ‌న్ గ‌ట్టిగా అడుగుతాడు.

ఒక‌రోజు ప‌ద్ద‌న‌.. శివ‌సామి చేన్లోని నీళ్ల‌ను మోట‌రేసి కొడ‌తాంటారు.. భూసామి మంచులు. ఏంటికి ఇలా చేస్తాన‌ర‌ని.. గ‌ట్టిగా శివ‌సామిభార్య అదిలిచ్చే..ఆ కొట్లాట ట‌యంలో ఇంటికాడుండే..పెద్దోడిని పిల్చ‌క‌చ్చాడు చిన్నోడు. పెద్దోడు కోపిష్టి. వాళ్ల‌తో క‌ల‌బ‌డ‌తాడు. పెద్ద‌కొట్టాట‌యితాది. ఆ పెద్దోడి మంచ‌ల్ను చిత‌క్కొడితే రాత్రివ‌చ్చి పోలీసులు ముర‌గ‌న్ ను స్టేష‌న్‌ను ప‌ట్ట‌క‌పోతారు. పంచాయితీ ద‌గ్గ‌రికెళ్లి కొడుకును స్టేష‌న్‌నుంచి బ‌య‌ట‌కిర‌ప్పించండ‌ని అడిగితే.. ఇంటింటికాడ మంచ‌ల‌కు సాష్టాంగ న‌మ‌స్కారం పెట్టాలంటే శివ‌సామి అట్ల‌నే చేచ్చాడు. ముర‌గ‌న్ ఇంటికొచ్చినాక వాళ్ల నాయిన ప‌డిన అవ‌మానాన్ని విని.. భూస్వామిని సిన్మాహాల్లో మెట్టుతో కొడ‌తాడు. వాడు.. మంచులు పెట్టి అర్ధరాత్రిపూట త‌ల‌కాయ తీయిచ్చి చేన్ల‌ల్లో ప‌డేయిచ్చాడు. శివ‌కామి కుటుంబం రోక్కిప‌డ‌తాది. పోలీసుల‌కు అన్నీ తెలిసి ప‌ట్టించుకోరు. చిన్నోడు చిదంబ‌రం.. ఓ రోజు రాత్రి భూస్వామిని టౌనుకు పోయి అదునుచూసి ఏసేచ్చాడు. ఈ ఖూనీ చేసింది ఈ కుటుంబ‌మేన‌ని పోలీసులు, భూస్వామి మ‌నుషులు శివ‌సామి కుటుంబాన్ని వెంటాడ‌తారు. శివ‌సామి, చిన్న‌కొడుకు.. అత‌ని భార్య, బిడ్డ‌, బావ‌మ‌రిది త‌లాదిక్కు అడ‌విలో పారిపోతారు. ఆ రోజు రాత్రికి ఎక్క‌డ త‌ల‌దాచుకుంటారు… కొడుకు త‌న నాన్న‌ని *అన్న‌కంటే నువ్వే స‌చ్చిపోతే బావుండు* అంటాడు.  అంత మెత‌క స్వ‌భావం ఉండే శివ‌సామి.. వెన‌కాల జీవితంలో ఓ పెనువిషాదం ఉంటుంది. అదేంటీ.. చివ‌రికి త‌న కొడుకు చిదంబ‌రంను ర‌క్షించుకుంటాడా.. శివ‌సామి కుటుంబం చివ‌రికి ఏమ‌వుతుంది.. తెల్సుకోవాలంటే *అసుర‌న్ * చూడాల్సిందే!

అసుర‌న్ సిన్మా చూడ‌టం అంటే భావోద్వేగాల‌తో న‌డ‌చ‌టం. శివ‌సామి పాత్ర‌లో ధ‌నుష్ జీవించాడు. ముగ్గురు పిల్లోల్ల నాయిన‌గా, ధ‌నుష్ చేసిన న‌ట‌న అసామాన్యం. పందిని వేటాడే స‌న్నివేశం కాడ‌నుంచి.. ఊర్లోవాళ్లంద‌రినీ ముక్క‌టం.. కొడుకు చ‌నిపోతే ప‌డిప‌డి ఏడ‌వ‌టం.. ఉన్న ఒక్క‌గానొక్క కొడుకు పులిలా కాపాడుకునే స‌న్నివేశాలు వొళ్లు గుగురుపొడుచ్చాయి. ధ‌నుష్ నిమ్న‌జాతి యువ‌కుడిగా త‌న వ‌య‌సులో ప‌డిన కష్టాలు.. త‌ను ప్రేమించిన అమ్మాయి చావు.. కుటుంబాన్నే పోగొట్టుకుని వేరే ఊరికొచ్చి మామూలుగా బ‌తుక్కునే జీవితం.. ఇట్లా ఏ స‌న్నివేశం గొప్ప‌ద‌నం ఆ స‌న్నివేశానిదే. సినిమా చూసిన‌ట్లుండ‌దు. ఓ ఊర్లో జ‌రిగే త‌గ‌రారు చూసిన‌ట్లే ఉంటాది. శివ‌సామి భార్య‌, ఇద్ద‌రు కొడుకుల న‌ట‌న సిన్మాకు ఆయువుప‌ట్టు. సినిమా అంతా సింగిల్ హ్యాండ్‌తో ధ‌నుష్ ప‌ట్ట‌క‌చ్చినాడు. నాకు తెల్చి.. ఈ త‌మిళక‌థ‌కి జాతీయ అవార్డుల పంట పండ‌టం గ్యారెంటీ.

ఈ సినిమా సూచ్చాంటే అంద‌రిలా కొత్త‌గా ఫీల‌వ్వ‌లేదు. ఉద్విగ్నంగా ఫీల‌య్యా. ఎందుకంటే.. రాయ‌ల‌సీమ‌లోని రెడ్లు.. ఎస్‌సీ, ఎస్టీవాళ్ల‌తో కొట్లాడి సంపేయించార‌ని విన్యా. వాళ్ల‌ను కొట్ట‌డం, అవ‌మాన‌ప‌ర్చ‌టం.. లాంటివి మా క‌ల్ల కొత్త‌కాదు. భూమిని లాక్కోవ‌ట‌మో, చేనికాడ దావ‌లో కొట్లాట‌నో, క‌లంకాడ బండ్రేవు కాడ‌నో.. భూస్వామ్యులు నిమ్న‌జాతుల ప‌ట్ల ఘోరంగా చూడ‌టం, దారుణంగా కొట్ట‌డం కూడా చూసినా. యుగాల‌నాటి నుంచి కులంతో మ‌నిషిని హీనంగా చూడ‌టం ప్ర‌పంచంలో ప్ర‌తిచోటా జ‌రుగుతాండేదే. అధికారం, అగ్ర‌వ‌ర్ణం వాళ్లు చేసే మార‌ణ‌కాండ‌కు ఎదురొడ్డి .. ఓ పేదోడు తిర‌గ‌బ‌డితే ఎట్లా ఉంటాదో ఈ సినిమా చూపిస్తాది.

అసుర‌న్ లాంటి సినిమా క‌థ‌లు మా రాయ‌సీమ‌లో ఊరూరికీ ఉండాయి. ప్ర‌కాశం, తెలంగాణ ప్రాంతాల్లో కూడా మ‌చ్చుగా ఉంటాయి. అయితే మ‌న ద‌ర్శ‌కులు హైద‌రాబాద్‌కి వ‌చ్చి స్థిర‌ప‌డి.. మెద‌ళ్ల‌ను కూడా హైద‌రాబాద్లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో తిర‌గ‌టం వ‌ల్ల .. ఊరిక‌థ‌లు మ‌ర్చిపోయినారు. అందుకే మ‌న క‌థ‌లు మ‌రుగున ప‌డిపోయినాయి. ఊర్ల మాండ‌లికం, జిల్లాల్లోని ఘ‌ట‌న‌లు ఆధారంగా సినిమాలు తీయ‌చ్చు మ‌నం తీయ‌లేం. ఎందుకంటే.. మ‌న హీరోలు నైక్ , రీబాక్ షూనే వేస్తాడు. మెట్రో ఆలోచన‌ల‌తోనే ఉండాలి. మ‌ట్టికాకుండా షూటింగ్ జ‌ర‌గాలి. చ‌క్కా చిన‌గ‌కూడ‌దు. గాల్లో ఎగిరిప‌డే సినిమాలే ఎక్కువ చేస్తారు. ఏమంటే.. అభిమానులు వొప్పుకోరంటారు. మ‌రి త‌మిళోల్లు అంత స‌హ‌జంగా ఎట్లా తీయ‌గ‌లుగుతున్నారంటే.. అక్క‌డ స్టార్ల త‌ల‌కాయ‌నొప్పి త‌క్కువ‌.  క‌థ‌ను క‌థ‌గానే సూచ్చారు. అడ్డ‌పంచ క‌డ్తారు. మెట్లు వేసుకుంటారు. ఓసారి వేసుకోరు. గ‌డ్డాలు పెంచుతారు, పాత‌చొక్కాలు వేసుకుంటారు. పాత్ర‌కోసం దుమ్మునాక్కోమ‌న్యా నాక్కుంటారు. సినిమాకి ఇచ్చే విలువ , పాణం అది. అసుర‌న్ సిన్మాలో ధ‌నుష్ ఊర్లో అంద‌రికీ మొక్కేసీన్ మ‌న టాలీవుడ్ హీరోల్లో ఎవ‌రు సేచ్చారంటే.. మ‌న‌కు ఎవ‌రూ గుర్తుకురారు.
నిజ‌జీవితంలో ఓ పాత్ర ఎట్లా ఉంటాదో అట్ల ఉండ‌టం మామూలు విష‌యం కాదు. ధ‌నుష్ త‌న శ‌రీరం, రంగుకి అనుగుణంగానే గొప్ప పాత్ర‌ల‌ను చేస్తాడు. క‌థ‌ల‌ను, ద‌ర్శ‌కుల‌ను న‌మ్ముతాడు.. కాబ‌ట్టే ఇంత మంచి సినిమాలు చేస్తున్నాడు. రాయ‌ల‌సీమ‌లో ఓ మాట ఉంది. ఎవ‌ర‌న్నా ప‌ని చేత‌కాద‌ని ఎనిక్కి వ‌చ్చిన‌పుడో, ప‌నిచేయ‌లేన‌పుడో.. అవ‌త‌ల బాగా ప‌నిచేసినోడి ఉచ్చ తొక్కుపో అంటారు. అట్ల ధ‌నుష్ ఉచ్చ మ‌న యంగ్ హీరోలు ఓ పారి తొక్కిరావాల.

చివ‌ర‌గా.. నేను చెప్పేదొక్క‌డే. అసుర‌న్ గొప్ప‌చిత్రం. శివ‌సామి బ‌తుకుని సూచ్చే..క‌డుపంతా దేవుతాది. బాధ‌తో ప‌ట్ట‌పేగులు తెగుతాయి.  తెలీకుండా ప్రేక్ష‌కుడికీ క‌త్తి ప‌ట్టుకోవాల‌నిపిచ్చాది!  క‌న్నీళ్లు తెప్పించ‌టమే కాదు.. ఓ మ‌నిషి మ‌రోమ‌నిషి చంపుకుతినే వ్య‌వ‌స్థను క్యాక‌రిచ్చి ఉమ్మేయాల‌నిపిస్తుంది. నేను ఎక్కువ‌… నా మ‌తం ఎక్కువ‌.. నా కులం ఎక్కువ అనే మ‌నుషులు  ప్ర‌తి ఊరూరా ఉంటారు. వాళ్ల‌పై పోరాడితే కుటుంబాల‌కు కుటుంబాలే తుడుచుపెట్టుకుపోతాయ‌నే సందేశం ఉంది. అయితే మ‌నిషి సాటి మ‌నిషిని కాల్చుకుతిన‌టం మాన‌లేదు. పేదోడంటే పెద్దోడికి లోకువే. చిన్న‌కుల‌పోడంటే అగ్ర‌వ‌ర్ణాల‌కు చుల‌క‌నే.  జ‌రిగింది జ‌రిగిన‌ట్లు.. పొల్లుపోకుండా .. అద్భుతంగా సినిమాలో జీవితాల‌ను చూపించ‌టంలో ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ కి నూటికి నూరు మార్కులు వేయాలి. ఇలాంటి క‌థ‌నువొప్పుకున్న ధ‌నుష్ మ‌న‌సుకు పొర్లుదండాలు పెట్టాల‌. ద‌క్షిణాది ఖ్యాతిని పెంచే ఈత‌రం గొప్ప‌తమిళ న‌టుడు ధ‌నుష్‌.. యువార్ గ్రేట్‌!

(ఇంకెందుకాల‌స్యం అమెజాన్ ప్రైమ్‌లో అసుర‌న్ సినిమా ఉండాది. సూడండి. మీకు న‌చ్చుతాది)

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు