అసుంట అసుంట…నాకు నచ్చట్లేదు!

కొత్త శీర్షిక ప్రారంభం – ప్రతి నెలా మొదటి శనివారం

మా పనావిడకి ఫోన్ చేసి మే నెల జీతం తీసుకెళుదువుగాని రా అని పిలిచాను. దీదీ ఏం పని చెయ్యకుండా ఏప్రిల్ నెల జీతం తీసుకున్నా, మే నెలది అడగడానికి మొహమాటం వేసింది దీదీ, కానీ ఇంటద్దె కట్టాలి ఎలాగా అని ఆలోచిస్తుంటే నువ్వే ఫోన్ చేసావు అంది. వెంటనే రమ్మన్నాను. తను వస్తానంది. ఆవిడకి మా అమ్మాయికి ఒక మంచి అనుబంధం. పాపాయికి యేడాదిన్నర వచ్చిన దగ్గరనుంచీ ఆవిడే మాకు పనావిడ. ఈ నాలుగేళ్లల్లో వాళ్లిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఇప్పుడు ఆవిడ ఇంటికి రాగానే పిల్ల ఆవిడ చేతుల్లోకి దూకుతుంది. అది కూడదు అని చెప్పాలి. అలా చెప్పడానికి నాకు మనసు రావట్లేదు. కానీ చెప్పాలి తప్పదు. కరోనావైరస్ గురించి పిల్లకి కాస్త అవగాహన ఉంది కాబట్టి నన్ను తప్పుగా అర్థం చేసుకోదనే నమ్మకం ఉందిగానీ నేనెలా చెప్పేది ఆ మాట! ఇదంతా నాకు నచ్చట్లేదు.

పక్కింటాయన తండ్రి, రెండు నెలలనుంచీ కోమాలో ఉన్న ఎనభైయేళ్ల ముసలాయన మొన్న చనిపోయారు. ఇంటి ముందు పట్టుమని పదిమంది కూడా లేరు. ఉన్నవాళ్లంతా మాస్కులతో దూరదురంగా నిల్చుని పలకరించుకుంటున్నారు. అతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా దూరంగా నిల్చున్నాడు. ఎంత దుస్థితి! స్నేహితుడి తండ్రి చనిపోతే భుజం మీద చెయ్యేసి పక్కన నిలబడవలసిన మనిషి దూరంగా ఉండిపోయాడు.  బాధేసింది. ఇదంతా నాకు నచ్చట్లేదు!

ఫ్రిడ్జ్ పాడయ్యింది. ఫ్రిడ్జ్ లేకపోతే, అందునా వేసవికాలంలో, కాలు చెయ్యి ఆడదు. బాగుచేసేవాళ్లకి ఫోన్ చేసి ‘వస్తారా?’ అని అడిగాను. వెంటనే వస్తామన్నారు. ఎందుకో వాళ్ల మాటల్లో ఉత్సాహం, ఆనందం వినిపించింది. పని లేక, డబ్బుల్లేక ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డారో పాపం! మాస్కులేసుకుని ఇంటికొచ్చారు. రాగానే శానిటైజర్ బాటిల్ తెరిచి చెయ్యి పట్టమన్నాను. మా దగ్గరుంది మేడం అంటూ సంచిలోంచి తీసి ఇద్దరూ చేతులకి పాముకున్నారు. నేను ప్రశ్నార్థకంగా వాళ్లవైపు చూస్తుంటే ‘ఇది లేకపోతే ఎవరూ ఇళ్లకు రానివ్వట్లేదు మేడం. ఇది లేక రెండు మూడు పనులు కోల్పోవలసి వచ్చింది. ఇప్పటికే రెండు నెలలు కష్టంగా గడిచింది. ఇంక పని దొరకకపోతే కష్టం. ఉన్న డబ్బులతో ముందు ఇది కొనుక్కున్నాం మేడం’ అని శానిటైజర్ సీసా చూపించాడు. జాలేసింది. ఇదంతా నాకు నచ్చట్లేదు.

లాక్‌డౌన్ మెల్లిమెల్లిగా సడలిస్తున్నారు. రేప్పొద్దున్న ఆఫీసుకి వెళ్లే పరిస్థితులు రావొచ్చు. ఆఫీసులో సాటి ఉద్యోగులే కాకుండా స్నేహితులుంటారు. దాదాపు మూడు నెలల తరువాత వాళ్లని చూస్తూ చేతులు చాచి వాటేసుకోకుండా దూరం నుంచి పరాయివాళ్లలా ఎలా పలకరించాలి? ఇదంతా నాకు నచ్చట్లేదు.

పిల్లలకు స్కూళ్లు తెరిచే అవకాశాలు ఇప్పట్లో కనిపించట్లేదు. మూడు నెలలై ఇంట్లో చేతులు కాళ్లు కట్టేసినట్టుంది వాళ్లకి. మెల్లిమెల్లిగా పిల్లలు పార్కులు, ఆటస్థలాలకి వెళ్తే ఒకరినినొకరు ముట్టుకోకుండా, తోసుకోకుండా ఏం ఆడుకుంటారు వాళ్లు? తోటి పిల్లలని కలవకుండా ఎన్నాళ్లుంటారు? వాళ్లని ధైర్యం చేసి మనం పంపించగలమా? జవాబు దొరకట్లేదు. ఇదంతా నాకు నచ్చట్లేదు!

కింద ఇంటి ఓనర్స్ ఇంట్లో ఏదో అవసరం. పెద్దవాళ్లు సాయానికి ఎప్పుడైనా పిలుస్తుంటారు. నన్నేదో తాకరాదన్నట్టు అసుంట అసుంట నిల్చుంటే, కారణం తెలిసినా నాకది నచ్చలేదు. మా ఇంటికెవరైనా వచ్చినా నేను వాళ్లని అసుంట అసుంట అంటున్నానని గుర్తొచ్చినప్పుడు ఇదంతా నాకస్సలు నచ్చట్లేదు!

*

ఆలమూరు సౌమ్య

పుట్టిన ఊరు విజయనగరం. ప్రస్తుతం దేశ రాజధానిలో మకాం. కుటుంబంలో సాహిత్యాభిరుచి ఉండడం, తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండడం వలన చిన్నప్పటినుంచీ తెలుగు సాహిత్యం మీద మక్కువ పెరిగింది. రాయలన్న తపనతో బ్లాగు మొదలెట్టాను. NATS 2013 కోసం కొత్త కథల ఆహ్వానం చూసి మనమూ రాస్తే బావుంటుందే అనిపించి తొలి ప్రయత్నం చేసాను. "ఎన్నెన్నో వర్ణాలు" అనే కథ NATS 2013 లో ప్రచురితమయ్యింది. అదే నా మొట్టమొదటి కథ. ఆ కథను "వాకిలి" సాహిత్య పత్రికలో మలిప్రచురణ చేసారు. అప్పటినుండీ కథలు, సమీక్షలు, వ్యాసాలు, అనువాద కవితలు..అడపదడపా రాస్తూ ఉన్నాను.

28 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంత లేటుగా రాయడం నాకసలు నచ్చలేదు…
    నాలుగైదు సంఘటనలు రాసి ముగించేయడం నాకసలు నచ్చలేదు…

  • మనుషులను ప్రేమించే అందరి మనోస్తితీ యింతే !

  • అసుంట అనే పదం ఒకప్పుడు ,ఉన్నత కులంగా చెప్పుకునే పెద్దలు,తక్కువ కులాలుగా పరిగణిపబడె ప్రజలను దూరంగా ఉండమనడానికి వాడేవారు.తరువాత కాలం లో అది క్రమంగా తగ్గిపోయింది.కానీ..ఆ పదం ను ,ఆ పద్దతిలో ఇప్పుడు ఎవరూ ఒప్పుకోరు.
    కానీ ఇప్పుడు ప్రపంచం అంతా నెలకొని వున్న దుర దృష్టకర పరిస్టితిని బట్టి భౌతిక దూరం పాటించ వలసిందే.అయితే సున్నితమైన పదాలు వాడి పరిస్తితి ని వివరించ వచ్చు.
    ” అసుంట” అనే పదం అసహ్యించుకునే పదంగా సమాజంలో స్టిర పడి పొయింది.

    • అసుంట అని కావాలనే వాడాను! అందులో స్పష్టమైన class diference కనిపించింది. డబ్బున్నవాళ్ల అసుంట స్పష్టంగా కనిపిస్తోంది అన్నిచోట్లా! ముఖ్యంగా పనిమనుషుల గురించి, మీనియల్ జాబ్ వర్కర్స్ పట్ల ‘అసుంట’ కనిపిస్తోంది! class and caste are interrelted.

  • ‘Asunta’ word is used very commonly in some households even today to say “move over or move aside” like “Asunta jaragamma”or “koncham asunta jarugu” like how others say “koncham pakkaku jarugu

    • చండాలం, ఉప్పర, పింజారీ పదాల వాడుకలాగే! అలవాటైతే, మామూలైపోతే మార్చుకోవాలి తప్పితే కామన్ అని ఒప్పేసుకోలేం కదా!

      • I am confused. So what exactly does ‘Asunta’ means ? I thought it was a synonym for ‘pakkaku’. I am not questioning you but genuinely want to to know the real meaning.
        I have not heard the use of this word to demean others but heard it used in very normal way to ask people to move aside to give room for others, like “asunta jarga radu peddayana kuchuntadu” etc.

      • అసుంట is mainly used by upper caste brahmins. తడి, మడి ఆచారాల్లో భాగం!

  • నిజమేనండీ…నాకూ నచ్చట్లేదు….కొన్ని పరిస్థితుల్లో నచ్చకపోయినా తప్పట్లేదు…బాగా రాసారు

  • కరోనా భయానికి అటువైపు ఉన్న సమస్యలు బాధలు కష్టాల్ని చాలా సింపుల్ గా చాలా పెర్ఫెక్ట్ గా వివరించారు. చాలా బాగుంది.

  • అసుంట, అంటే ఏమిటి? ‘ సుంటా ‘ కాని వాడా అని అర్ధమా? లేక నేను సుంటా, నేను సుంటా అని అర్ధమా? 🙂

    • కొన్ని ప్రాంతీయ, మాండలీక పదాలకు అర్థాలు స్థిరపడతాయి తప్పితే వ్యుత్పత్తులు ఉండకపోవచ్చు. అసుంట అంటే అటుపక్క, దూరంగా జరుగు అని అర్థం.

  • మీకు,నచ్చ నట్లే, మాకు,నచ్చటం లేదుచాల విషయాలు.. అలాగని తిరిగితే…ఫలితం redzone. kwaramtaine, ఒకరి వాళ్ల, అందరూ. 3days lo పెళ్లిబాగా దగ్గరవాళ్లది. అసుంటా, అసుంటా,… అని తిరగాలి..ఏమినచ్చటం లేదు..ధన్యవాదాలుఅండీ,.. బాగా రాసినందుకు💐👌!

  • “నేలతో నీడ అన్నది నను తాకరాదని” పాట గుర్తుకువచ్చింది ఎందుకో.

    క్లాస్ డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ, నాకూ కొన్ని అనుభవాలు ఉన్నాయి.

    హైదరాబాద్ నుంచి వచ్చినవాళ్ళమని మా అమ్మమ్మగారికి (వాళ్ళింటిలో తలదాచుకున్నామన్న మాట) పనిచేసే ఆవిడ మానేసింది. చాలా సూటిగా ఆ ముక్క చెప్తే మావాళ్ళంతా బాధపడ్డారు. ఎవరి జాగ్రత్త వాళ్ళది, తప్పేముందని నేను సర్దిచెప్పాను. అయినా, సర్దుకోక చేసేదేముంది!

    మేం చాల ఆరోగ్య సమస్యల్లో ఉండి (ఎవరికీ దగ్గు, రొంప, జ్వరాలు లేవు, అదృష్టవశాత్తూ) ఇంట్లోవాళ్ళెవరూ పనిచేసే స్థితి లేకున్నా పనిచేస్తున్నప్పుడు – పనిచేయడానికి మనుషులను పిలుస్తూ తిరిగాను. వాళ్ళూ చేయమనే చెప్పారు, చాలా నిర్మొహమాటంగా.

    మనిషి మీద మనిషికి నమ్మకం పోయిన సందర్భం ఇది.

    వాడవాడలా తిరిగి ఒకావిడను కుదుర్చుకున్నాం. మా అమ్మావాళ్ళు వచ్చి అప్పటికే నెల దాటింది. కాబట్టి, “హైదరాబాద్ నుంచి వచ్చారన్న” తిట్టు మాట ఎవరూ వాడట్లేదిక.

    • పవన్ రాము పనిచెయ్యము అని చెప్పడం వాళ్ల హక్కు. కాదా? అందులో అవమానం ఏమీ లేదు! ఎవరి భయాలు వాళ్లవి! అయితే పనిమనుషులు కాబట్టి వాళ్లవల్ల మనకొస్తుంది, మనవాళ్ల వాళ్లకి రాదు అనుకోవడంలోనే ఉంది గొడవ!

    • Thank you. సుమాళి రాయించిందనుకోండి 🙂

  • Sowmya Garu,

    Pai dantlo mee anubhavalu vunayi….ituvanti samayam lo manchi kadha rayandi…..memu chadivi anandistamu.

  • బావుంది. సూటిగానూ, సున్నితంగానూ ఉంది. నాకు నచ్చింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు