(అ)సాధారణత్వం

శాంతి పథ్. చాణక్యపురి ప్రాంతంలోంచి నిటారు గీతలా రోడ్డు. దిల్లీలో అత్యంత సుందరమైన మార్గం. రెండువైపులా దౌత్యకార్యాలయాలు- ఎంబస్సీలు, హైకమీషన్లు. శాంతి కపోతాలు స్వేచ్చగా తిరిగే ప్రదేశం.  దౌత్యకార్యాలయాలన్నీ తమతమ ప్రాంగణాల్లో దర్పంగా జాతీయ పతాకాల్ని ఎగిరేసుకొనే అత్యంత గౌరవప్రద కీలక స్థావరాలు. ప్రపంచమంతా శాంతినే విస్తరింపచేయాలనే సందేశాల్ని నిత్యమూ వెదజల్లే పతాకాల రెపరెపలు. ఆ కార్యాలయాల్లో లోపలి సంగతులు ఎవరికి తెలుసు? అపుడప్పుడు ఆ రెపరెపల్లో అసమానతలు, జాత్యహంకారాలు, ఆర్థికాధిక్యతలు, మతాల వర్ణాలు, కుతంత్రాలు బయటపడుతుంటాయి.  యుద్దాల ఘంటికలూ వినబడుతుంటాయి.

భవనాలు మూసపోసినట్టుగా ఒకే మాదిరిగా ఉండవు. ఒక్కో భవనం ఒక్కో రకం. ప్రతిదేశం అంతో ఇంతో వారి వారి దేశ భవన నిర్మాణ, సంస్కృతి పోకడలని ఇమడ్చి కట్టుకొన్నాయి. గల్ఫ్ దేశాల దౌత్యకార్యాలయాల భవనాల్ని చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. శాంతి పథ్ కి ఇరువైపున్న భవనాలు. మూడు అంతస్తులకి మించవు. నీలి ఆకాశం నిక్కచ్చిగా కనబడుతుందాప్రాంతంలో. ప్రాంగణాల్లో పూల వనాలు.  రకరకాల చెట్లు, ఫౌంటెన్లు, నడక దార్లు మనోహరంగా ఉంటాయి. వాటికి ధీటుగా ఆ ప్రాంతపు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక శ్రద్దతో పరిశుభ్రంగా అద్దంలా మెరిపిస్తుంటుంది. అందుకే ఆ ప్రాంతం అందర్నీ అయస్కాంతంలా లాక్కుంటుంది.

పేర్లకి తగ్గట్టుగానే దౌత్యం ఎప్పుడూ ఆ కార్యాలయాల్లో తాండవం చేస్తుంటుంది. సూటు బూట్లలో చాణక్యులు ఇరవైనాలుగు గంటలు ఎత్తులు, పైఎత్తులు, అన్ని పోకడలతో హడావుడిగా తమతమ పనుల్లో ఉంటారు. అన్ని రంగాలకి సంభందించిన నివేదికలు, వాణిజ్య, రాజకీయ సంబంధాలపై విశ్లేషణలు, గూఢాచార సమాచారాలని తమతమ దేశాలకి పంపుతుంటారు. రాజకీయశాస్త్రం రోజూ కొన్ని పుటల్ని నింపుకొంటూ జ్ఞానసంపదని పెంచుతూ ఉంటుంది.

చాణక్యపురిలో అపర చాణుక్యులెందరో. అన్ని మానవ రంగుల్లో- తెలుపు, నలుపు, గోదుమ. మన దేశాన్ని రెండువందల ఏళ్ళు పాలించిన బ్రిటిష్ వారి పతాకమూ దిల్లీ నడిబొడ్డులో ఎగురుతుంది. బద్ద శతృదేశాలైన చైనా, పాకిస్తాన్ దేశాల జాతీయ పతాకాలు కూడా నిత్యమూ స్వేచ్చగా ఎగురుతూనే ఉంటాయి.

అదే రాజధానిలో చాణక్యపురి నుండి పది కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన స్థలం. ఒక మహాత్ముని ఆత్మ విశ్రాంతికోసం కట్టిన స్మారక వేదిక. రాజ్ ఘాట్. ఏ బేషజాలు లేకుండా అత్యంత సాధారణంగా!

                     *                   *                   * 

“లంచ్ బ్రేక్ లో ఫోన్ చేయ్యనే లేదు. టీ బ్రేక్ లో చేస్తారనుకొంటూ ఎదిరిచూసాను. సాయంత్రం గడిచింది. రాత్రి మొదలయ్యింది. నేనెంత గాభరాగా ఉన్నానో తెలుసా?” చేతిలోని బ్రీఫ్ కేస్ అందుకొని పక్కనపెట్టింది నీలిమ అనే నీలు. అలసిఉన్న నా మోహాన్ని క్షణంలో చేతుల్లోకి తీసుకొని నుదిటిపై ముద్దు పెట్టింది. ఆ రోజటి హై వోల్టేజ్ అలసట నా శరీరాన్నుండి అబ్రక డబ్రా! మాయం!! ఉదయం ఎంబస్సీకి వెళ్ళేటప్పటి ఉత్సాహం తిరిగొచ్చింది. శక్తులన్నీ క్షణంలోనే రీఛార్జి అయ్యాయి. నేనూ నీలు మొహాన్ని మృదువుగా పట్టుకొని…

“ఇంకా ఎన్నిరోజులు డియర్? ప్రధానమంత్రి విజిట్ అయ్యేంతవరకు సాయంత్రాలు కలిసి టీ తాగడానికి బ్రేక్ పెట్టినట్టేనా?”

“ఇంకో టూ డేస్. రెండు రోజులైతే మళ్ళీ మన రొటీన్. ఐదున్నరకల్లా ఇంట్లో… కాదు ఒళ్ళో…” కొంటెగా చూస్తూ అన్నాను.

నాలుక బయటపెట్టి వింత శబ్దంతో నన్ను వెక్కిరించింది నీలు.

నేను శాంతి పథ్ మార్గానికి ఓ పక్కనున్న రాయబార కార్యలయంలో పనిచేస్తున్నాను. పెద్ద కాంపౌండ్. గేటు దాటి అడుగుపెడితే కొత్త ప్రపంచం. పనినే పూజగ భావించే నాకు అది స్వర్గం. అన్నీ అధ్బుతంగా పనిచేస్తాయి. కరెంటు పోదు. సర్వర్ డౌన్ కానే కాదు. కెంద్రీకృతమైన ఏ‌సి వ్యవస్థ లోపాలే ఉండవు. శుద్దమైన గాలిని బిల్డిగ్ అంతటా పంప్ చేస్తుంటారు. ఇంకా ఎన్నో… ఎన్నెన్నో సౌకర్యాలు. వసతులు వారి దేశంలో కన్నా మిన్నగా ఉంటాయని ఆ దేశం నుండి వచ్చిన అధికారులే మాతో అనేవారు. నేను వారి మాటల్ని నమ్మకపోయేవాన్ని. మూడు సార్లు ఆ దేశానికి అధికారికంగా వెళ్ళి చూసివచ్చాక నాకు మరింత సంతోషం. గర్వం కూడా. పని చేసేవాడికి వరప్రసాదం. ఆ వరం నా పరమై రెండు దశాబ్దాలౌతుంది.

నీలు వాలెంటరిగా రోజు నాలుగు గంటలు పని చేస్తుంది. ఇంటికి దగ్గర్లో ఉన్న దివ్యాంగులకోసం పెట్టిన ప్రత్యేక పాఠశాలలో పిల్లల సమగ్ర వికాసానికి ఉడతలా చేయూతనిస్తుంది.

“లంచ్ చేయడానికి సమయం చిక్కిందా మరి?” మొదటి ముద్ద నోట్లో పెట్టుకొంటూ నీలు.

“హెడ్ క్వార్టర్స్ నుండి ముందస్తు టీం వచ్చింది కదా. వారితో పాటు మాకు ఏర్పాటు చేశారు. కానీ లేటుగా, అంటే మూడున్నరకి తిన్నాం.”

“అవే తినిపించారా?” నీరసంగా నీలు ప్రశ్న.

“ఇంకేం తినిపిస్తారు? అవే! సాండ్విచ్ లు. వర్కింగ్ లంచ్ కదా!”

ముద్దలు, ముచ్చట్లు, మురిపంగా…

“రేపుకూడా బిజీ డే. ఈ రోజటికంటే ఇంకా ఆలస్యం కావచ్చు.”

“మీ ఎంబస్సీ దేశ ప్రధానమంత్రి నంబర్ ఇవ్వు. నే మాట్లాడుతా.” పోకిరి నీలు.

“ఏం మాట్లాడుతావు?”

“ఆయనేమో భార్యని తీసుకొని అధికార హోదాలో వస్తున్నాడు. విజిట్ విజయవంతం చేయడానికి ఎంబస్సీలో స్టాఫంతా కుటుంభాలని వదిలి రోజుల కొద్దీ ఇక్కడ ఓవర్ టైమ్ చేయాల్సి వస్తుంది.”

“ఇండియాలో కార్యక్రమాలన్నీ అయ్యాక, వెళ్ళే ముందు స్టాఫ్ తో పార్టీ ఉంది. స్పౌస్ లని కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. అప్పుడు ప్రధానమంత్రినే కాదు, ఆయన భార్యని కూడా చూస్తావు. అడుగు.” నవ్వుతూ మా ఇంటి ‘హర్ ఎక్సలెన్సీ’ కి ఉచిత సలహా ఇచ్చాను!

“తప్పక అడుగుతాను.” ఇలాటి పార్టీల్లో నీలు కొత్తదనమేమీ లేకుండా కలుపుగోలుగా ముచ్చటిస్తుంది.

ఇద్దరం నవ్వుకోన్నాం.

నేను పని చేసే ఎంబస్సీ దేశపు ప్రధానమంత్రి నాలుగు రోజుల అధికార యాత్రపై మన దేశానికి వస్తున్నాడు. ఇలాటి అగ్ర దేశాల ముఖ్యమైన నాయకులు అధికార హోధాలో వస్తున్నారంటే పనులు కొన్ని నెలల ముందే మొదలవుతాయి. ఎన్నో ప్రోటోకాల్స్. సంప్రదింపులు, ఈమైల్స్, ఫోన్లపై ధీర్ఘ సంభాషణలు, అనుమతులు…. నాలాటి స్థానిక ఉద్యోగికి తెలియనివి ఇంకా ఎన్నో ఉంటాయి. ముందస్తు టీం వస్తుంది. ప్రోగ్రాంలో జోడించిన ప్రదేశాల్ని చూస్తారు. ఆకళింపు చేసుకొంటారు. ఎవరెక్కడ కూచోవాలో, నిల్చోవాలో, సెక్యూరిటీ స్థాయి, అన్ని విషయాలని నిమిషనిమిషాలని లెక్కిస్తూ తుది మెరుగులు దిద్దుతారు. కార్యక్రమంలోని ప్రతి అంశానికి ఒక్కొక్క టీం. బృందాలకి నాయకులు, ఉపనాయకులు. గడియారం ముల్లుల్లా జరిగే ఈ కార్యక్రమంలో అన్ని రకాల హంగులుంటాయి. మన దేశ ప్రధానమంత్రితో, ఇతర విషయపర మంత్రులతో, వ్యాపార బృందాలతో మీటింగులు, విలేకర్లతో సమావేశాలతో పాటు మన దేశ విశిష్ట ప్రదేశాలని కూడా జోడిస్తారు. అలాటివాటిలో తప్పకుండా ఉండేవి తాజ్ మహల్, మహాత్మా గాంధీ స్మారక చిహ్నమైన రాజ్ ఘాట్. విజిట్ ప్రాముఖ్యతను బట్టి, కొన్నిసార్లు ఈ వీవీఐపీలు ఇతర మహానగరాల్లో అడుగుపెట్టడం కూడా ఒక ఆనవాయితి.

ఇవన్నీ ఒక ఎత్తైతే, స్పౌసల్ ప్రోగ్రాం (వెంబడి వచ్చే భార్య/భర్త కోసం) అదేస్థాయిలో రూపంపోసుకొంటుంది. ప్రధానమంత్రి శ్రీమతికి సమాంతరంగా మరో కార్యక్రమం జరుగుతుంది. కొన్ని ఉమ్మడి కార్యక్రమాలకి ప్రధానంగా అధికారేతర లేక సంస్కృతిపరమైన వాటిలో ఇద్దరు పాల్గొంటారు. అన్ని కోణాలనుండి దేశాన్ని, చరిత్రని, సంస్కృతిని పరిచయం చేసుకోడానికే ఇలాటి కార్యక్రమాలు. దేశాల మధ్య సంబంధాలని మరింత గట్టి పరచడానికి ఇవి ఉపకరిస్తాయి.

నేను అత్యంత బిజీగా ఉండడానికి కారణం నేనూ ఒక బృందలో కీలక సభ్యుడిగా ఉండడమే! ప్రధానమంత్రి తన భార్యతో రాజ్ ఘాట్ దర్శించడం. రాయడానికి ఆరు పదాల చిన్న వాక్యమే! పదిహేను నిమిషాల విజిట్ వెనకున్న తయారీ, పనులు, సంక్లిష్టత, సాధారణ మనుషులు ఊహించని రీతుల్లో!

జీవితమంతా సత్యం, అహింసా, సాధారణత్వం భోదిస్తూ ఆచరించిన మహాత్మున్ని స్మారక ప్రదేశాన్ని  వీవీఐపిలు దర్శించడానికి ఎంత పనో?

ఆ అనుభవాన్ని మీతో చెప్పడానికే ఈ కథ!

*             *                   * 

బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాను. ఎనిమిదింటికి ఎంబెస్సీకి చేరాలి. నీలు ఎదురుగా కూచోని నా వైపే జాలిగా చూస్తుంది. మరో బిజీ దినం. దౌత్యకార్యాలయాల సంస్కృతి భిన్నంగా ఉంటుంది. పని ఒత్తిడిలు పకడ్బందీగా ఉంటాయి. పనులన్నింటిని గడువులోపు చెయ్యల్సిందే! సెక్యూరిటీ కారణాలవల్ల కార్యాలయ పనివేళల తరువాత ఆఫీసులో ఎక్కువసేపు కూచోనివ్వరు. నాకు ఒత్తిడి పనులున్నపుడు నీలు వెంటనే గ్రహిస్తుంది. మామూలు రోజైతే మాట్లాడుతూ తింటాను. బిజీ దినముంటే పని గురించే నా ఆలోచనలు! నీలు లేచి నా వెనకాల వచ్చి నిల్చుంది. భుజాలపై చేతుల్ని మృదువుగా ఆనించింది. తలపై తన మొహాన్ని మోపింది. కొన్ని క్షణాలు అలాగే ఉంచి, తలని ముద్దుపెట్టుకొంది.

కారు నడుపుతూ పర్వీన్ సుల్తానా ఆలపిస్తున్న హంసధ్వని రాగాన్ని వింటూ ఎంబస్సీ చేరుకొన్నాను. సెక్యూరిటీ కోడ్ నొక్కి తలుపు తెరచుకొని మూడవ అంతస్తులో ఉన్న నా గదికి చేరి పని మొదలుపెట్టాను. దిల్లీలోని అతి కలుషితమైన గాలిని పీలుస్తూ ఎంబస్సికి చేరిన నా ఊపిరితిత్తులు ఆనందంతో శుద్దిచేసిన గాలిని పీల్చుకోడానికి గేరుని మార్చుకొన్నాయి. సాయంత్రం అయిదువరకల్లా కొత్త లోకంలో జీవరసాయనిక చర్యల్ని చేసి తెల్లారి ఉదయం ఎనిమిది వరకు సమృద్దిగా దొరికే కరువులేని కలుషిత గాలి.

ఈ రోజు రెండు పనుల్ని చేయాలి. రాజ్ ఘాట్ వద్ద బృందంతో వెళ్ళి తెల్లారి జరుగబోయే కార్యక్రమానికి పూర్తి స్థాయి రిహార్సల్. రాజ్ ఘాట్ సమాధి కమిటీ సెక్రటరీతో నిమిష-నిమిషానికి జరగబోయే వివరాల్ని కూలంకషంగా చర్చించడం. సమాధిపై పెట్టె వలయాకార పువ్వుల మాలని (రీథ్) ఫ్లోరిస్ట్ దుకాణం నుండి తీసుకొని ఎంబస్సిలో మరునాడు ఉదయం వరకు వాడిపోకుండా నిర్దేశించిన ఊష్ణోగ్రతలో ఉంచడం.

పది గంటలకి పోర్టికో చేరుకొన్నాను. ఒక ప్రత్యేక బస్సు నిండా హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చిన అధికార్లు. మరో మూడు ఎంబస్సీ కార్లు, ఒక మినీ వాన్. ముఖ్యమైన పని కావడంవల్ల డిప్యూటీ ఎంబాసిడర్ కూడా మాతో ఉన్నాడు. మరో కార్లో ఇద్దరు స్కూలు బాలికలు (స్టాఫ్ పిల్లలు) ఉన్నారు. ఒకరు బ్రౌన్ అయితే మరొక పాప తెలుపు. ఎంబస్సీ కోరికపై ప్రత్యేకంగా వచ్చిన చిన్నారులు. వర్ణ సమానతకు ప్రతీకలు.

నాలో ఏదో గుబులు. పనులన్నీ సక్రమంగా చేసినా తెలియకుండా ఏమైనా పొరపాటు జరుగుతుందేమోనన్న జంకు. అనుభవం ధైర్యాన్ని నింపుతుంది. కీలక పాత్ర అవకాశం వచ్చినందుకు ఒక వైపు గర్వపడుతునే ఉన్నా.

కారులొంచే అందరితో మాట్లాడి ప్రోటోకాల్స్ కి ఎక్కడ భంగం కాకుండా, ఏ గేటు దగ్గరికి చేరాలో, ఎవరు రిసీవ్ చేసుకొంటారో ప్రయాణసమయంలోనే చేసాను. తుదిమెరుగులు దిద్దాను.

డిల్లీ రోడ్లపై సిడి (కార్ప్స్ డిప్లొమాటిక్) అనే పొడి అక్షరాలున్న నీలి రంగు నంబర్ ప్లేట్లతో కార్లు, వాన్ జారుకొంటూ రాజ్ ఘాట్ కి వెనకవైపున్న ప్రత్యేక ద్వారం వద్దకు చేరుకొన్నాం. వాహనాల్లోంచి అందరూ చకచకా దిగారు. ఇద్దరు అమ్మాయిలు కూడా.  నాకు అక్కడి స్టాఫ్ తో ఆపాటికే పరిచయమైంది. సమాధి కమిటీ సెక్రటరీకి కీలక వ్యక్తుల్ని పరిచయం చేసాను. ఆయన మమ్మల్ని గాంధీ సమాధివైపు తీసుకెళ్ళాడు. అందరూ షూస్ విప్పి సెక్రటరీ వెనకాల నడక సాగించారు. ఇప్పటివరకు సమాధిని దర్శించిన అగ్ర దేశాల నాయకులు, ప్రముఖ వ్యక్తులు, ఇంకా ఎవరెవరచ్చారో క్లుప్తంగా చెప్పాడు.

హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చిన బృంద నాయకురాలు రంగంలోకి దిగింది. వారి దేశంనుండి వచ్చిన సెక్యూరిటీ మనుషులు వాళ్ళ పనిలో పడ్డారు. ఎక్కడ, ఎలా, ఎవరెవరు పొజిషన్లలో ఉండాలో పరిశీలుస్తున్నారు. మీడియా వారు ఎక్కడ, సమాధికి ఎంత దూరంలో నిల్చోవాలో చర్చలు జరుగుతున్నాయి. ఇలాటి విజిట్స్ ఎన్నో చూసిన సెక్రటరీ తన అనుభవాలని వివిరిస్తున్నాడు. ఫోటోలు తీయడానికి అనువైన ప్రదేశాన్ని చూపించాడు. ఇంకో బృందం ప్రధానమంత్రి, ఆయన శ్రీమతి రాగానే ఇద్దరు ప్రత్యేక కుర్చీల్లో ఎక్కడ కూచోవాలో, షూస్ విప్పాలో, ఎక్కడినుండి కాలినడక మొదలవుతుందో సెకండ్లలో, నిమిషాల్లో లెక్కిస్తున్నాం.

సమాధిని దర్శించి వచ్చాక అవే కుర్చీల్లో కూచోని షూస్ వేసుకొన్నాక అందంగా అమర్చిన మరో కుర్చీలో ప్రధానమంత్రి కూచోని టేబుల్ పై పెట్టిన విజిటర్స్ బుక్కులో కామెంట్స్ రాయాలి. ఆ ముఖ్యమైన పని అయ్యాక, గాంధీ సమాధి కమిటీ తరపున గాంధీ విగ్రహం (బస్ట్), గాంధీ రాసిన పుస్తకాల సెట్టుని బహూకరిస్తారు. అదంతా అయ్యాక తిరుగు ప్రయాణం.

ఇవన్నీ ఒక ఎత్తైతే, ప్రధానమంత్రి నడిచే బాట, వేగం, సమాధి దగ్గర ఏ వైపునుండి వెళ్ళి నిల్చోవాలి, పూల వలయాన్ని ఇద్దరు బాలికలు పట్టుకొని జంటకి ముందు మెల్లిగా అడుగులు ఎలా వెయ్యాలి, సమాధి దగ్గరికి చేరుకోగానే బాలికలిద్దరూ ఏవిదంగా చెరోవైపు తప్పుకోవాలి, ప్రధానమంత్రి పూల వలయాన్ని సమాధిపై పెట్టి, శ్రద్దాంజలి ఘటించి, బుట్టలో ఉన్న పూలరెమ్మల్ని విసిరే పనితో అక్కడి కార్యక్రమం పూర్తవుతుంది. ఆ క్షణాలే మీడియా వారికి కీలకం. ఆ ఫోటోలే, వీడియో క్లిప్పులే ప్రపంచమంతా తిరుగుతాయి.

ఇద్దరు బాలికల్ని. రిహార్సల్ కోసం పేరెంట్స్ నుండి కొన్ని గంటల కోసం పర్మిషన్ తీసుకొని వచ్చాం. వీరి సెలక్షన్ అపాటికే అయ్యింది. ఇద్దరు రెండుచేతుల్తో రీథ్ పట్టుకొని మెల్లగా అడుగులేస్తూ నడవాలి. చిన్న  చేతులు రీథ్ ని అడ్డంగా పట్టుకొని అడుగులేస్తారు. నడకలో కొంచం మార్పొస్తుంది. ప్రాక్టీస్ కోసం ఈరోజు నాలుగైదుసార్లు నడిపించాలి. అంటే ఇద్దరి విశిష్ఠ అతిథుల డమ్మీ ఆకారాలు పిల్లల వెనక రిహార్సల్ కోసం నడవాలి. నేను ఏం చేద్దాం అనుకొంటూ అటు ఇటూ చూస్తున్నానో లేదో దగ్గర్లోనే ఉన్న డిప్యూటీ ఎంబాసిడర్ పసిగట్టి వేగంగా అడుగులేసి నా దగ్గరికి వచ్చాడు.

“ఈరోజు నీవే వీవీ‌ఐ‌పి! నేను స్పౌస్ గా నీ పక్కన నడుస్తాను.” నేను నమ్మలేదు.

డిప్యూటీ ఎంబాసిడర్ చాలా కలుపుగోలుగా ఉంటాడు. లోకల్ స్టాఫ్ తో బాగా, సరదాగా మసులుతాడు. ఆయన సూచనకి నేను ఒక్కసారే ఆశ్చర్య పోయాను. దౌత్యకళలో ఎంతో నిపుణులు.

“ఎంబాసిడర్ తరువాత మీరే సీనియర్. ద్వీతీయ స్థానంలో ఉన్నారు. ప్రధాని పాత్ర మీరే చేస్తేనే బాగుంటుంది.” అన్నాను నవ్వుకొంటూ.

“నో… నో… ఇంత కష్టపడుతున్నావ్. నీవే ఆ పాత్ర చేయాలి. నీ పక్కన నేను శ్రీమతిగా నడుస్తాను… కమాన్ గర్ల్స్…” నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బాలికల్ని రమ్మని పిలిచాడు.

నా చేయి పట్టుకొని నిల్చున్నాడు. దగ్గరున్న వారందరూ మావైపే ఆసక్తిగా చూస్తున్నారు. నవ్వుకొంటున్నారు. మా ఇద్దరికీ నవ్వాగడంలేదు!

మెల్లిగా అడుగులేస్తున్నాం. మా ముందర చిన్నారుల నాలుగు పాదాలు. డమ్మీకోసమని రీథ్ సైజుకి కత్తిరించిన అట్టల వలయాన్ని పట్టుకొని అడుగులేస్తున్నారు. వారి స్పీడు మా అడుగులని నియంత్రిస్తాయి. మొదటి రౌండ్ లో బాలికల అడుగులు కాస్త తడబడ్డాయి. రెండు జోడీల మధ్య, ఎనిమిది పాదాలమధ్య సమన్వయం కుదరలేదు.

రెండో రౌండు. నడకలో మెరుగు. డమ్మీని పట్టుకొని నడవడంలో కాస్త ముందు వెనకలు.

మూడో రౌండు. మరింత మెరుగు. నడక వేగమయ్యింది. మేమిద్దరం వెనకపడిపోతున్నాం. బాలికల మధ్య మా మధ్య ఇంకా సమన్వయం కావాలి.

నాలుగో రౌండ్. కావలసినదానికి దగ్గరిలో.

ఐదో రౌండ్. పర్ఫెక్ట్. పిల్లలిద్దరిలో తాళం-మేళం కుదిరాయి. ఈ చిన్నారులే రేపు ప్రధానమంత్రి, ఆయన శ్రీమతికి ముందు నడిచే మార్గదర్శకులు!

జీవితంలో నాకు దొరికిన విచిత్ర, అమూల్యమైన అనుభవం! మరచిపోలేని మహాకార్యం.

*           *                   * 

అందరితో సాండ్విచ్ లంచ్ పూర్తి చేసుకొని మూడు గంటలకి నాగదిలోకి వెళ్ళి అత్యవసర పనులేమైనా ఉంటే చూద్దామనుకొన్నాను. లాండ్ లైన్ ఫోన్ పై ఎర్ర లైటు వస్తూపోతుంది. ఎనిమిది రికార్డుచేసిన మెసేజులు. ఆన్ చేసి విన్నాను. ఈమేళ్ళని చకచకా చూసేశాను.

సాయంత్రానికి కావలసిన సౌకర్యాలని పరీక్షించాను. అనుమతులు తీసుకొన్నాను. దౌత్యకార్యలయం కావున పద్దతులప్రకారంగా అన్ని నియమాలని గౌరవించాలి. ప్రోటోకాల్స్ పాటించాలి. ఎక్కడ షార్ట్ కట్లు ఉండకూడదు.

అయిదున్నరకి రీథ్ రెడీ అవుతుంది. అన్నిచోట్ల వీటిని తయారుచేయరు. దిల్లీలో రెండుమూడు చొట్లే తయారుచేస్తారన్న విషయం ఈ బాధ్యతల్ని చేపట్టాకే తెలిసింది. పైకి సులభంగానే అనిపించినా ఈ రీథ్ విషయంలో సూక్ష్మ, సున్నిత వ్యవహారాలుండడంతో సంక్లిష్టత బాగా పెరుగుతుంది. దాని ప్రకారంగా సవాళ్ళ జాబితానూ. ఈపాటికే స్టార్ హోటల్లో ఉన్న ఫ్లోరిస్ట్ షాప్ కి నాలుగైదు సార్లు వెళ్ళాం. కొలతలు, పూల ఎన్నిక, పూల మిశ్రమం, రంగులు, వలయానికి అడ్డంగా అలంకరించే రిబ్బన్, రంగు, దానిపై క్లుప్త సందేశం, అక్షరాల సైజు, వాటి రంగు… ప్రతిదాన్ని ఎంబస్సీలో ఫైనల్ చేసి హెడ్ క్వార్టర్స్ కి పంపి, వారి కామెంట్స్, సూచనల ప్రకారంగా మార్పులు. ఇలా ప్రతి స్థాయిలో సంప్రదింపులకి చాలా సమయం పడుతుంది.

రాకెట్ నిర్మాణంలా అనిపించే ఈ పుష్పాలంకారాకృత వలయాన్ని నేనే డెలివరీ తీసుకోవాలి. ఇంటికి వెళ్ళేముందు రీథ్ ని రాత్రంతా ఫ్లోరిస్ట్ రేకమండ్ చేసిన ఉష్ణోగ్రతకు సరిచేసి ఓ  గదిలో ఉంచాలి.

ఎంబస్సీ క్లబ్బులో మసాలా చాయ్ తాగి మరో పనికి ప్రయాణం. ఇరవైనాలుగు గంటలు నక్షత్రాలు కనబడే ఆ హోటల్లో హూందాగ ఉన్న ఫ్లోరిస్ట్ దుకాణం చేరుకొన్నాను. కాదు కాదు. పూల వనానికి చేరుకొన్నాను. ఎన్నిరకాల పువ్వులో. ఏడు రంగులే అయినా మిశ్రమాల్లో నా ముందు ఎన్నెన్నో ఆకర్షణ పత్రాలు. దృశ్యం ఎంతో రిఫ్రెషింగా ఉంది. రీథ్ ముద్దుగా రూపంపోసుకొంది. కావ్యాల్లో వర్ణించే సుకుమారతని అద్దుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉంది.

రిబ్బన్ని ఎలా ఫిక్స్ చేయాలో పూలగుఛ్చాల మధ్యన వనకన్యలా ఉన్న సుకుమారి వివరంగా తెలిపింది. ఇద్దరు రీథ్ ని పదిలంగా తెచ్చి కార్లో పెట్టారు.

జీవావయాల్ని ఒక పట్టణం నుండి మరో పట్టణానికి రోగి ప్రాణాల్ని కాపాడడానికి తరలించడానికి ఏర్ పోర్ట్ నుండి హాస్పిటల్ వరకు రోడ్డు ప్రయాణం ఎలా అమలు చేస్తారో టక్కున గుర్తుకొచ్చింది. తలతిప్పి వెనకున్న రీథ్ ని గౌరవంగా చూశాను. బాధ్యతలు నేర్పిన బాధ్యతది.

కార్లోంచి రీథ్ జాగ్రత్తగా తీసి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఒక గదిలో పెట్టాం. వలయానికి రాత్రికదే నిలయం. దేవుడులేని ఆలయం. ఉష్ణోగ్రతని అప్పటికే సెట్ చేశారు. బేష్. మరునాడు ఉదయం ఏడు గంటలకి మళ్ళీ దీని ప్రయాణం.

హమ్మయ్య! ఆ రోజటి పనులయ్యాయి. రేపు ఉదయం పదకొండిటికల్లా నేను స్వేచ్చజీవిని. అది గుర్తుకొస్తేనే ఆనందంగా ఉంది. రెస్ట్ దొరుకుతుంది. చిన్న ఊరి నుండి వచ్చి డిల్లీకే అతుక్కుపోయిన నాకు ఉన్నతశ్రేణి పనిలో బాగస్తున్ని కావడం గొప్ప అవకాశం. మహాత్మాగాంధి సమాధి, ఓ ప్రధానమంత్రి విజిట్, యజమాన్యానికి నాపై నమ్మకం… అన్నిటిని మించి దీనివేనకున్న తయ్యారీలు, అబ్బురపరచే అంశాలు… అన్నిటిని దగ్గరగా, అందులో ఒక బాగంగా మమేకమై కలిసిపోవడం – ఎంతమంది సాధారణ తెలుగోళ్ళకి ఇలాటి సువర్ణావకాశం లభిస్తుంది? సంతోషంతో పార్కింగ్ ప్రదేశానికెళ్ళి కార్లో కూచోని సెల్ తీసాను.

“అయామ్ కమింగ్. ఐ లవ్ యు నీలు.” జోష్ తో చెప్పాను.

“వేటింగ్ ఫర్ యూ. నీ స్వరం వింటుంటే పనులన్నీ బాగాయినట్టున్నాయి కదూ?”

“ఓహ్. ప్రతి పని అనుకున్నరీతిలో గడియారం ముల్లుల్లా జరిగాయి. వివరాలు వచ్చాకే.”

“ఈ సమయంలో ట్రాఫిక్ ఎక్కువ. జాగ్రత్తగా రండి. డిన్నర్ కి నీ ఫేవరైట్ కాకరకాయ వండుతున్నాను.”

“దట్ ఈస్ వండర్ఫుల్. థాంక్స్. సీ యూ.” గాంధీ  భజనలని పెట్టాను. పదిహేను రోజులనుండి ఇంటికి వెళ్ళేటప్పుడు వీటినే వింటున్నాను. ఒకపనికి కావలసిన తాత్వికత, గాంధీజమ్ లోతుల్ని తెలుసుకోడానికి దోహదపడుతుంది. తన్మయత్వంతో గాయకులు భజనల్ని పాడుతున్నారు. మాధుర్యాన్ని సంపూర్ణంగా నేను ఆస్వాదిస్తున్నాను.

నలభై నిమిషాల్లో ఇంట్లో. సమయం తొమ్మిది.

“మిమ్మల్ని ఏమని పిలవను? గాంధీ అనా? లేక ప్రధానమంత్రా?” చిలిపిగా నవ్వుతూ నీలు.

“ఎస్ కే అంటే చాలు… ఐ మీన్ సంధాన కర్త. భూమాత ఒడిలో విశ్రాంతి తీసుకొంటున్న సత్యాగ్రహ మూలపురుషుడికి, ఆచరించి చూపిన మహానాయకునికి శ్రద్ధాంజలి అర్పించడానికి మరో గొప్ప నేత ఒకదేశ ప్రధానిగా కొన్ని నిమిషాలు ప్రశాంత వాతావరణంలో కనెక్ట్ కాబోతున్నారు కదా!” కొంటె ప్రశ్నకి సీరియస్ జవాబు!

నానోట్లో కాకర కరిగిపోతుంది. ఈ కూరగాయని నీలు ఎన్నోరకాలుగా వండుతుంది. దిల్లీ వచ్చాక ‘బంధ్ కరేలా’ (కాయని నిలువున కోసి మసాలాల మిశ్రమాన్ని నింపి, దారం చుట్టి వండేది) చేయడం బాగా నేర్చుకొంది. చపాతీతో తినడానికి భలేగుంటుంది. ఈ కాంబినేషన్నే ఆస్వాదిస్తున్నాను.

“ఇంత రుచికరంగా ఎలా చేస్తావ్? ఎన్నిసార్లు తిన్నా, ప్రతిసారి కొత్తదనాన్ని ఎలా తీసుకొస్తావ్?” చీరల డిజైన్లలో అంతం లేనట్టుగా కొత్తరుచుల ముందు నేను బలహీనున్నైపోతాను.

“నీ ప్రశ్నకి నా జవాబు తెలుసు. నువ్వు పరమానందంతో ఈ కూరని తింటావు. ప్రతిసారి ఇదే డైలాగ్ అంటావు. నాకు పేటెంట్ ఉందని నానుండి వింటావ్.” నీలు చిలిపి జవాబు.

“ఈ చేతులతోనే కదూ కూరని చేసింది.” రెండుచేతుల్ని దగ్గరికి తీసుకొని కళ్ళకద్దుకొని ముద్దులు పెట్టాను.

“ఈరోజు ఒక విచిత్రం జరిగింది.” నేను.

“చెప్పండి… చెప్పండి…” నీలు ఆరాటం.

డిప్యూటీ ఎంబాసిడర్ నా చేయిపట్టుకొని నడచిన సంగతి ఊరిస్తూ చెప్పాను.

ఒకటే నవ్వు. పువ్వులేరుకొనే నవ్వులవి.

“నాకు ఫోన్ చేస్తే నేనక్కడ వాలిపోయేదానిగా. నిజమైన భార్యగా రిహార్సల్ కి ఎంతో నిండుతనం వచ్చేది కదా…”

ఇప్పుడు నవ్వడం నావంతు.

ఇద్దరం కాస్సేపు నిండుగా నవ్వు కొన్నాం.

“మీరు పడుకోండి. ఏడింటికి ఆఫీసులో ఉండాలన్నారు కదా.” నేను రేపటి తయ్యారి చేసుకొంటాను. మా స్కూల్లో పిల్లలకి డాన్సు నేర్పాలి.”

*           *                   * 

ప్రధానమంత్రి కూచోని వారి దేశప్రజల తరఫున విజిటర్స్ బుక్కులో సందేశాన్ని రాసాడు. చరిత్రలో నిలిచిపోయే అక్షరాలవి. కేమరాల క్లిక్కులు, వీడియో రికార్డింగులే సాక్ష్యాలు. గాంధీ సమాధి కమిటీ తరపున ప్రధానమంత్రికి గాంధీ విగ్రహం, పుస్తకాల సెట్టు అందజేసారు. అవి చేతులు మారి నాకు చేరాయి. ఎంబస్సీకి తీసుకెళ్లి బధ్రంగా ఉంచే బాధ్యత నాది.

ప్రధానమంత్రి భారతదేశ యాత్ర దిగ్విజయమయ్యిందని ఎంబస్సీ అంతా చెప్పుకొంటున్నారు.

వీల్స్ అప్! ఆయన విమానం గాల్లోకి లేచి అప్పటివరకు బరువుని మోసిన టైర్లు లోపలికి ముడుచుకొన్నాయి.

గత రెండు నెల్లనుండి రాత్రులు పగల్లు పనిచేసిన వారందరూ “హమ్మయ్యా… వెళ్ళిపోయారు…” సంతృప్తితో గట్టిగా ఊపిరి పీల్చుకొన్నారు. అందులో నేనొకన్ని.

మరునాడు పొద్దున ఎంబాసీడర్ నుండి గ్రూప్ ఈమేల్ వచ్చింది. ప్రధానమంత్రి విజిట్ మరిచిపోలేని సంఘటనగా, రెండు దేశాల మధ్య ఎన్నో ఒప్పందాలు జరిగాయని, వాణిజ్యం ఆకాశాన్ని తాకుతుందని, వివిధ కార్యక్రమాల్లో తమ తమ బాధ్యతల్ని అత్యున్నత ప్రమాణాల్లో సేవలందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మెచ్చుకొంటూ రాసారు. రెండు సార్లు చదివాను. పంక్తులమధ్య నా పేరుని చూసుకొన్నాను. నా శ్రమంతా ఎనర్జీగా మారి ఉత్సాహాన్ని నింపింది.

నా ఎదుట గాంధీ విగ్రహం. పక్కనే పుస్తకాల సెట్టు. యంగ్ ఇండియాలో గాంధీ రాసిన ఏడు సామాజిక పాపాల (సేవెన్ సోషల్ సిన్స్) లిస్ట్. కాటన్ వస్త్రంపై ప్రస్ఫుటంగా కనిపిచ్చెట్టుగా సాధారణ రీతిలో ముద్రించిన లఘు పంక్తులు.

ప్రధానమంత్రి పర్యటనలో ఆయన గౌరవార్థం ఇచ్చిన బహుమతులన్నీ ఒక్క చోటికి చేరతాయి. వాటిని చక్కగా ప్యాక్ చేసి ‘డిప్లొమాటిక్ బ్యాగ్’ సౌకర్యంతో ప్రధానమంత్రి కార్యాలయానికి చేరతాయి. ఈ పనులన్నీ కాస్త నెమ్మదిగా చేయాల్సిన పనులు. ఆ పిలుపు వచ్చేంతవరకు గాంధీ విగ్రహం, ఆయన రచనలు అన్నీ నా గదిలోనే! కంప్యూటర్ మానిటర్ పై నుండి దృష్టి నా ముందు గోడపై పడితే గాంధీ దర్శనమే! రోజుకి ఎన్నిసార్లో!!

దుమ్ము దూళి పడకుండా అద్దాల పెట్టెలో గాంధీ బస్ట్. ఛాతీవరకే ఉన్న ధ్యానముద్ర. ప్రచారంలో ఉన్న బస్ట్. భుజాలపై కప్పుకొన్న వస్త్రం. ఎలాటి ఆడంబరం లేని అత్యంత సాధారణ ప్రతీక. రోజు కనబడకుండానే నాకు కనబడేది. చూడకుండానే చూసేవాన్ని. ఓ అనుబంధం మెల్లగా, అతి మెల్లగా రూపం పోసుకొంటుంది. నాకూ ఆయన మధ్య.

రొటీన్ జీవితం మొదలయ్యింది. పెండింగ్ పనుల్ని పూర్తిచేసే యజ్ఞంలో నేను. కూర్చిలోంచి లేచాను. సీటు వెనక్కి మూడడుగులు వేసాను. విశాలమైన అద్దం ముందు నిల్చున్నాను. అక్కడినుండి నాకు కనబడేది శాంతి పథే. ఆ అద్భుతమైన దృశ్యం నాకు ప్రతిసారి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. ఆ రోడ్డు మరింత అందంగా కనబడిందారోజు. పచ్చదనంతో నిండుగా.  రెండు నిమిషాలు ఆ దృశ్యాన్ని నా కళ్ళల్లో నింపుకొన్నాను. తలని వెనక్కి తిప్పాను. బాపు మొహం అటువైపే ఉంది. కళ్ళు మూసుకొని ఉన్న ధ్యానముద్ర. అద్దాల పెట్టెలో భద్రంగా… కలుషిత గాలి తాకనీకుండా…

శాంతి పథ్. తెలుగులో శాంతి మార్గం. రెండు పదాలే. ప్రపంచానికంతా తప్పక కావల్సిన మొదటి పదం. అగ్రరాజ్యాల దౌత్యకార్యాలయాలన్నీ చుట్టుపక్కలే! శాంతి మార్గంపై తడబడుతున్న పాదాలు… అశాంతికి ప్రేరకాలు…

రాష్ట్రపతి భవనంపై మన జాతీయ పతాకం ఎగురుతుంది. రెండువందల సంవత్సరాలు మన దేశాన్ని దోచుకొంటూ పాలించిన బ్రిటిష్ దౌత్య కార్యలయ ప్రాంగణంలో వారి జాతీయ పతాకమూ ఎగురుతుంది. శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్ జెండాలూ ఎగురుతూనే ఉన్నాయి. రష్యా. పాలేస్టైన్, సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఈజిప్ట్, ఇస్రాయిల్, బ్రెజిల్, టర్కీ, ఎన్నో. మరెన్నో. దిల్లీలో ఉన్న అన్ని ఎంబెస్సీల,  హైకమీషన్ల ప్రాంగణాల్లో… వారి వారి జాతీయ పతాకాలు రేప రేప లాడుతున్నాయి, ఏళ్ళుగా, దశాబ్దాలుగా… ఎగురుతూనే ఉంటాయి.

సాధారణ మనిషి… శాంతి పథ్ వైపే మౌన ముద్రలో…

ఆయన సమాధిని దర్శించడానికి అసాధారణ రీతిలో తయ్యారి…

అహింస, సత్యం, సత్యాగ్రహల్ని ప్రభోదించిన మహా ఆత్మ. ఆయన సమాధి పక్కనే దేదీప్యమానంగా జ్వాల కదులుతూ వెలుగుతుంది. వెలుగుతూ కదులుతుంది.

*

టి. సంపత్ కుమార్

1 comment

Leave a Reply to Rammohan Rao Thummuri Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ ఆసక్తికరంగా సాగింది.ఒక సంఘటన వెనుక ఉండే తతంగం గురించి కథ రాయాలనే ఆలోచన రావడం అభినందనీయం.కథ లో దాంపత్య సౌరభం మేళవించటం కథకు ఉపబలకంగా ఉంది. కథా పరంగా మెలోడ్రామా ఏదీ లేకపోయినా ఏదైనా ఉంటుందేమోనని పాఠకుడు చదివే విధంగా కథను ఎక్కడి కక్కడే ఆపుకుంటూ పోవడం రచయిత కున్న అపార రచనానుభవం.శీర్షిక కథకు బాగా కుదిరిం ది. కథ పాఠకుడికి దృశ్యమానం చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారు.సంపత్ కుమార్ గారికి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు