ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేసారు. “మీ జీవితం ఒక సినెమా అయితే మీరు దానికి ఏమి టైటిల్ పెడతారు?” అని. ఈ ప్రశ్న నన్ను తట్టిలేపింది. ఎందుకంటే ,ఇది మన మొత్తం జీవితాన్ని ఒక చిన్న వాక్యంలో సారాంశపరచమని అడుగుతుంది. నా ఆసక్తి ఏంటి అంటే, ఇతరుల దృక్కోణాలను అర్థం చేసుకోవాలనే కుతూహలం, నా స్వంత జీవిత కథనాన్ని పునరాలోచించుకునే దిశగా ఈ ప్రశ్న ఉంది. అక్కడ లభించిన కొన్ని సమాధానాల్లో మనుషుల్ని, వారి దృక్పదాన్ని, సమాజాన్ని ఇంకా జీవిత సారాన్ని అర్థం చేసుకునే దిశగా నా ఆలోచనలు కదిలాయి. అక్కడ దొరికిన శీర్షికలు, నా ఉద్దేశ్యంలో మానవ జీవితాన్ని చిత్రించే అద్భుతమైన కళాకృతిలాంటివి. మనం జీవితాన్ని ఎలా చూస్తామో, ఆ దృక్పథమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అన్నది నిజం. ఒక యాభై కామెంట్లు వచ్చాయి. ఒక 50 మంధి అభిప్రాయం సేకరించటం, భావ సారాంశాన్ని తీయటం తక్కువేమి కాదు
** కొన్ని శీర్షికలు ఆశావాదంతో (“చిరునవ్వుతో”, “యుగానికి ఒక్కడు”) లాంటివి ఉండగా,
** మరికొన్ని నిరాశవాదంతో (“చీ వెధవ జీవితం”, “నన్ను సంక నాకిచ్చిన ఈ చదువు, ఈ సమాజం”)
** కొందరు జీవితాన్ని ఆటలా చూడటంతో (“డబుల్ కిక్”, “రిస్క్”)
** కొందరు ప్రయాణంగా పరిగణించటంతో (“జీవన ప్రయాణం”, “గగన విహారం”),
**కొందరు భరించాల్సిన బరువుగా (“సర్దుకుపోవడం అన్నీ భరించడం”)
** కొందరు చాలా తేలికతో (‘నేను నా యేసాలు, నా సావు నేను చస్తా)
ఇలా ఈ శీర్షికలు మనిషి అనుభవాల సంక్లిష్టతను, అస్థిత్వంలో ఉన్న లోతును చూపిస్తాయి. ప్రతి మనిషి కథ తనదైన రాగంతో సాగుతుంది – కొన్ని “నిశ్శబ్ద రాగం”లా మైమరపించేవి, కొన్ని “అనుకోకుండా ఒక రోజు”లా ఆశ్చర్యపరిచేవి, కొన్ని “సినిమా”లా నాటకీయమైనవి, ప్రతి వ్యక్తి తన జీవితానికి స్వయంగా రచయిత, నటుడు, దర్శకుడు అవుతాడు. భిన్న రాగాల జీవితాన్ని ఎవరి స్థాయిలో వారు అనుభవిస్తుంటే, కొందరు జీవితానికి ఏకస్థాయి అర్థాన్ని జోడిస్తారు. ఎలాగ అంటే, జీవిత ముఖ్య ఉద్దేశ్యము ఆనందంగా ఉండటం అని లేదా అంతా పరమాత్మ చేతిలో ఉంది అని. ఇలాంటి ఏక తత్వాలు.
ఇకపోతే జీవితం అంటే విభన్న తత్వాన్ని వివరించిన కొందరు వ్యక్తులు, సంధర్భాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాశీకి వెళ్ళివచ్చిన ఒకరు రాసిన బ్లాగులో వారి ఒక ఆలోచన కొత్తగా ఉంది. “మరుజన్మ వద్దు అని కోరుకుని కాశికి వెళ్ళి గంగలో మునుగుతారట. ఇంత కీ మరు జన్మ వద్దు అని ఎందుకు అనుకుంటారో నాకు అసలు అర్థం కాదు. ఏది లేని శూన్యంకన్నా, శక్తి మెరుగు కదా? ఆ శక్తిని నిర్వహించటానికి, మనిషి బౌతికకాయం మెరుగు కదా? పూర్వ జన్మ స్మృతి లేనపుడు మరుజన్మ కొత్తదే కదా? మనిషి అన్నిటికన్నా బుద్ధి జీవి కదా? అయినా ఎందుకు వద్దు అనుకుంటారో నాకు అర్థం కాదు.” అన్నది ఆ బ్లాగులో ఒక భాగపు సారాంశము. ఇది భౌతికవాద సిద్దాంతం నుంచి వచ్చిన ఆలోచనలా ఉంది. నిజమే భౌతికశాస్త్ర ప్రకారం ‘శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము ‘. అది అలా కొనసాగుతూనే ఉంటుంది.
ఇక మనసు కవి ఆత్రేయ అన్న మాటలు కూడా పదే పదే గుర్తువస్తాయి. “బాధే సౌఖ్యమనే భావన రానీవోయి” అంటే బాధని సౌఖ్యంగా అనుకోమంటారు తప్ప బాధ కూడా విలువైనది అని చెప్పలేదు ఈయన. బాధ, ఆనందము రెండూ భావనాత్మకమే, అలాంటప్పుడు ఒక భావనని కావాలనుకొని, ఇంకొక భావనని ఒద్దు అనుకోవటం ఏమిటి? ఆనందమైతే బ్రతకటము, బాధామయం ఐతే చనిపోవాలనుకోవటమో, మరు జన్మ వద్దు అనుకోవటమో ఏమిటి? ఆనందంగా ఉన్నపుడు చనిపోకూడదా? ఇదే రివర్స్ థింకింగ్ అంటారు. కొన్ని సంస్కృతులు, ముఖ్యంగా బౌద్ధ, హిందూ దార్శనిక పరంపరలు, కష్టాన్ని వృద్ధికి అవకాశంగా, సుఖాన్ని ‘మాయగా’ చూస్తాయి. ఇక్కడే “వ్యతిరేక ఆలోచన” ప్రారంభమవుతుంది. ఈ అసాధారణ ఆలోచనా విధానాన్ని ఆచరించడానికి, వ్యక్తి దుఃఖం-ఆనందం రెండింటిలోనూ ఉన్న పూర్తి అర్థాన్ని గ్రహించి, జీవితం ముందుకు కొనసాగుతూనే శాంతి కనుగొనవలసి ఉంటుంది.
ఇక ఆల్బర్ట్ కాము జీవిత అనే అంశం పైన విశ్లేషణ ఇంకా ఆలోచనాత్మకంగా ఉంటుంది. మహా అద్భుతంగా కూడా ఉంటుంది. “జీవితానికి అర్థం లేదు అని అర్థం చేసుకుని మరీ జీవించ దగ్గ విలువైనది జీవితం” అని అంటారు. అవును ఇది మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన వాక్యము. కాముకి, ఆత్రేయ దృక్పదానికి ఇక్కడ స్థిరమైన బేధం కనిపిస్తుంది. జీవితానికి ఏమి అర్థాన్ని ఆపాదించుకోకుండా జీవించాలి అన్న అభిరుచితి జీవితాన్ని గడపాలి అని అంటారు ఈయన. ప్రాణం ఎప్పుడు, ఎలా, ఏ స్థితిలో ఉన్నా విలువైనది అనేది ఈయన బహురకాలుగా ప్రపంచానితి చాటి చెప్పే ప్రయత్నం చేసారు.
ఈ మధ్య వచ్చిన ఒక కొత్త పుస్తకం ” ఆర్కిటెక్ట్ ఆఫ్ చేంజ్”కూడా రివర్స్ థింకింగ్ ని కలిగిస్తుంది అంటే జీవితం అంటే ఆనందంగానే ఊండాలి అన్నట్లు కాకుండా, ఏదైనా జీవితంలో భాగమే, అన్నీ కలిసి ఉంటేనే జీవితం అని. రచయిత అరిక్ అబిత్బుల్ తన హీరోను సాధారణంగా మనమందరం ఎదుర్కొనే పరీక్షలు, సవాళ్లకు ఎదురుగా నిలబెడతాడు. జీవన సంఘర్షణని ప్రేమించటం, నిర్వర్తించటం, నెరవేర్చటం ఇదే జీవితం అన్న విశయాన్ని అవ్షలోం అనే ఆర్కిటెక్ట్ పాత్ర ద్వార వివరించే ప్రయత్నం చేస్తాడు.
ఇలా కొందరి మూడు సినిమా శీర్షికలతో మొదలయ్యి, జీవితాన్ని వివిధ దృక్కోణంలోనుంచి చూసేవారి వరకు జీవితం అనేది ఒక లోతైన శీర్శిక.నేను ఎక్కువగా ఆల్బర్ట్ కాముతో ఏకీభవిస్తాను. “జీవితానికి అర్థం లేదు అని అర్థం చేసుకుని మరీ జీవించ దగ్గ విలువైనది జీవితం”. జీవితానికో అర్థమే కాదు ,స్క్రిప్టు లేదు, దశ దిశ కూడా లేదు. కాబట్టే జీవితాన్ని చేదించుకుంటూ, శోధించుకుంటూ, అనుభవించుకుంటూ పోతుంటారు ఎవరికి వారు. కష్టమైన సుఖమైనా అన్నీ జీవితంలో భాగమే, ఒకటి ఒద్దు, ఒకటి కావాలి అనుకునేది లేదు. జీవితం ఒక ఓపెన్ రిసోర్స్.
*
Add comment