నేను చదివిన గొప్ప కథల్లో జర్మన్ రచయిత పీటర్ బిక్సెల్ రాసిన కథ “ఒక టేబుల్ టేబుల్ మాత్రమే” (ein tisch ist ein tisch) ఒకటి. అని జర్మన్ రచయిత పీటర్ బిక్సెల్ రాసినది. నా బాల్యంలో విపుల మాసపత్రిక లో చదివాను. ఇటీవలే ఆ పత్రిక ప్రచురణ ఆగిపోయింది. ఈ కథలో ఒక ముసలి వాడు ఏమీ తోచక కుర్చీని టేబుల్ అనీ, టేబుల్ ని తివాచీ అని, మంచాన్ని పటం అనీ పిలవడం మొదలు పెడ్తాడు. ఈ ఆ భాషే అలవాటయ్యి అందరితోనూ అలానే మాట్లాడటం మొదలుపెడితే, చివరికి అందరూ అతడిని పిచ్చి వాడిలా చూడటం మొదలుపెడతారు.
నేను చిన్నప్పుడు మన ఊరి పాండవులు అనే సినిమా చూశాను. అందులో రావు గోపాలరావు ప్రజలను మోసం చేస్తూ చందాలు వసూలు చేస్తుంటాడు. ఈ తంతునంతా సందేహంగా గమనిస్తున్న ప్రజలతో “ఆ డబ్బులు డాలర్లు గా మీకు ఇస్తారు” అని అతడి అనుచరుడు చెబుతుంటాడు. అప్పుడు రావు గోపాలరావు అంటాడు “డాలర్లు కాదు డాల్డాలు అనాలి. బరువుగా ఉంటుంది”. ఇన్నాళ్ళైనా నాకు ఈ డైలాగ్ ఎందుకు గుర్తుంది? అప్పుడైతే నవ్వుకున్నాను కానీ, ఇప్పుడు ఇందులో నాకు గొప్ప తాత్విక వివరణ కనిపిస్తోంది.
నేను హైస్కూల్ కి రాక ముందు రోజుల్లో ఒక పుస్తకం చదివాను. పేరు గుర్తు రావడం లేదు కానీ, అందులో “కాల గర్భం” అన్న పదం గురించి చెబుతాడు రచయిత. దాన్నిగురించి, “చూడండి, ఎంత మంచి పదమో, దాని వెనక ఎంత అర్థం ఉన్నదో” అని, వివరిస్తూ రాశాడు. ఆ పదాన్ని మొదటి సారి అంత దగ్గరగా చూసిన నాకు ఆ వివరణ నచ్చింది. అయితే ఇప్పుడు ఆ పదం ఎందుకు నచ్చడం లేదు?
హై స్కూల్ లో ఉన్నప్పుడు, మొదటి సారి కృష్ణ శాస్త్రి కవితలు చదివినప్పుడు ఆ భాష నన్ను బాగా ఆకట్టుకుంది. “లలిత లలిత దర హసిత వినిర్గిత // చలిత లలిత చంద్రాతపములు” అంటే పడి చచ్చి పోయేవాడిని. అలాగే తిలక్ వాడిన “ఏటి కొంగల నిదుర, బాతు రెక్కల నీడ” పదాల్లో నేను ప్రపంచం చూసుకునే వాడిని. “ఎంత అద్భుతమైన పదం వాడాడు” అని మిత్రులందరమూ అనుకునేవాళ్ళం.
వీటన్నిటికీ మధ్య అసలు సంబంధం ఏమిటి?
మొదటి నుంచీ మొదలు పెడదాం. నాకు చిన్నప్పటి నుంచీ భాష అంటే భలే మోజుగా ఉండేది. నాకు చదువుకున్న వారి భాష, పట్టణాల మాట్లాడుకునే వారి భాష, పుస్తకాలలో వాడే భాష, పనిమనుషుల భాష, వాటిల్లో తేడాలు చిన్నపుడు పెద్దగా తెలియదు. నేను మా ఊరి నుంచి తాడికొండ గురుకులానికి వెళ్ళినప్పుడు అక్కడ మిగిలిన జిల్లాల నుంచి, రక రకాల సామాజిక, ఆర్ధిక వర్గాల నుంచి వచ్చిన వారి మాటలు విని, నాకు తెలియకుండానే వాటిని అనుకరిం చేవాడిని. మొదటి సారిగా నేను సెలవులకి వెళ్ళినపుడు “అట్లాగ, ఇట్లాగ” అనకుండా, “అలాగ, ఇలాగ” అంటూ మాట్లాడానని నన్ను మా ఊరి వాళ్ళు ఎగతాళి చేశారు కూడాను.
మొదటి సారి నిఘంటువుని — ముందు ఇంగ్లీషు నిఘంటువు, తర్వాత తెలుగు నిఘంటువుని — నేను తాడికొండ లో చూశాను. పుస్తకం నిండా ఎన్ని పదాలు? ఎన్నెన్ని అర్థాలు? ఆ రోజుల్లో భాష బాగా వచ్చు అంటే, బాగా అర్థాలు తెలిసిన వాడు అనుకునే వాళ్ళం. అయితే, సూత్రాలు తెలిసినంత మాత్రం సైంటిస్ట్ కానట్లు, నిఘంటువులలో పదాలకు అర్థాలు తెలిసినంత మాత్రాన పదాలు తెలిసి పోతాయా?
అసలు, ఒక పదాన్ని తెలుసుకోగలమా? పర్యాయ పదాలు అనే మాట ఎంత అసమంజసం? మనుషుల్లాగే, ప్రతి పదానికి సొంత డిఎన్ఏ ఉంటుంది. ప్రతి పదానికీ ఒక రంగు, రుచి, వాసనతో పాటు ఒక కథ కూడా ఉంటుంది. నిఘంటువు చదివితే అవన్నీ తెలియవు– ఆ పదంతో ఒక జీవిత కాలం గడపాలి. ఆ పదం సమస్త స్వరూపం తెలుసుకోవాలంటే దాన్ని ఎవరు ఏ విధంగా వాడుతున్నారో, వాడారో కూడా మనకి తెలియాలి.
అదృష్టవశాత్తూ, ఇది ఒక నిరంతర సాధన లాంటిది. మనం పూర్తిగా తెలుసుకోకుండానే, మన శ్రోతలకు, పాఠకులకి తెలిసేలా చెబితే చాలు. అంటే, నిజమైన అర్ధం తెలియక్కరలేదు. ఎదుటివాడు ఆ పదాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో తెలిస్తే చాలు. నాకు అమెరికాలో చాలా రోజులు గడిపిన తర్వాత, ఇండియాలో వాడే ఇంగ్లీషు పదాలతో ఇటువంటి సమస్యే వచ్చి పడింది! వాళ్ళు అందరూ వాడే అర్థం ప్రకారం వాడటం లేదే? ఉదాహరణకి డౌట్ అనే పదం ‘ప్రశ్న’ అనే అర్ధంతో ఎంతమంది వాడుతున్నారు? మొదట్లో నాకు చిరాకు వేసేది. కానీ, పది మంది వాడితే, అదే ప్రామాణికమౌతుంది కదా? అది అంత సులభం కాదులెండి! ప్రామాణికం కావాలంటే, ప్రాచుర్యం లోకి రావాలి — శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు!
నాకు అమెరికా వచ్చిన కొత్తలో ఒక మిత్రుడు చెప్పాడు — మనుషుల పేర్ల అర్థాలు తెలుసుకున్నప్పుడు నీకు ఈ సమాజం అర్థం అయినట్లు అని. ‘అర్థం’ అంటే, ఆ పదం విన్నపుడు మనసులో ఏం ఊహ మెదులుతుంది? అని. ఉదాహరణకి, పరంధామయ్య, ప్రణీత్ అన్న పేర్లు విన్నారనుకోండి. వీళ్ళు తండ్రీ బిడ్డలు అని చెప్పారనుకోండి. మీరు ఎవర్ని తండ్రి అనుకుంటారు?
పరంధామయ్య పేరు వినగానే, మనకి పంచె కట్టుకొని పడక్కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి గుర్తుకు వస్తాడు. బహుశా, ఆయన వయసు అరవై ఏళ్ళుంటాయి. ఆయన జేబులో ఒక పెన్ను, ఆయన వెనక గోడమీద ఒక కేలండర్, ఆయన ముక్కు మీద ఒక కళ్ళజోడు, పక్కనే చెప్పుల జత. అదే ప్రణీత్ అంటే, వయసులో ఉన్న పిల్లవాడు, జీన్స్, టీ షర్ట్ వేసుకొని, టెన్నిస్ షూస్ తో, బహుశా మోటార్ బైక్ మీద, బడ్డీకొట్టు దగ్గిర కనబడతాడు. చేతిలో కొత్త మొబైల్, చుట్టూ కుర్రకారు స్నేహితులు.
మీకు బహుశా ఇవే గుర్తు రాకపోవచ్చు, కానీ ఏదో గుర్తు రాక మానదు. ఏదయినా ఎందుకు గుర్తుకు వస్తుంది? మనకి తెలిసిన సామాజిక, చారిత్రక, భౌగోళిక విషయాలన్నీ ఆ పేరు రంగు, రుచి, వాసనలు, కథలు గుర్తుకు తెస్తాయి. ఇది ఏ నిఘంటువూ చెప్పదు. ఒక సమాజంలో జీవిస్తూంటే ఆ సమాజం తనతో తానూ చేసుకునే సంభాషణ వింటున్నప్పుడు అది అర్థం అవుతుంది. అలా కాకపోయినా ఆ సమాజం…దానీ సంస్కృతి కొంచెం తెలిసినా మనకి అర్ధం అవుతుంది. ఉదాహరణకి, బెంగాలీ ప్రపంచంలో నేను గడపక పోయినా కొన్నేళ్లు ఆ పుస్తకాలు చదివాక ‘జగత్తారిణి’ అంటే అత్తగారనీ, సులోచన అంటే వయసులో ఉండే అమ్మాయి అనీ తెలిసింది!
మీకు ఇంగ్లీషు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే, ఇంగ్లీషు పేర్ల గురించి ఎంత తెలుసునో చూడండి. ‘వెంకన్న’ పేరులో వచ్చే మట్టి వాసన మీకు ఇంగ్లీషులో ఏ పేరులో వస్తుంది? ‘హిమబిందు’ పేరులోని నాజూకు తనం మీకు ఏ పేరు గుర్తుకు తెస్తుంది? మంగతాయారు సిగ్గు పడుతూ తలుపు చాటునుంచి కాఫీ ఇచ్చినట్లు, ఏ ఇంగ్లీష్ పేరు ఉన్న యువతి ఇస్తుంది? [కాకపోతే, ఎవరో సుబ్బారావు, ఏదో జాన్ స్మిత్ సరిపోతారు!]
నాకు ఒక ‘బగ్స్ బన్నీ’ కార్టూన్ గుర్తుకు వస్తుంది. ఒక చోట, ఒక ఓపెరా కండక్టర్, అంటే సంగీత విద్వాంసుడు, పేరు జియోవాన్ని జోన్స్ అని చూపిస్తారు. జియోవాన్ని అనేది ఇటాలియన్ పేరు. ఓపెరా ఇటలీ లో పుట్టింది. అందుకని, ఆ పేరు ద్వారా ఆ సంబంధం సూచించాడు. కానీ, జోన్స్ అనేది వెల్ష్ పేరు. అది కొంచెం పల్లెటూరి పేరు. మొరటు పేరు. ఇవి రెండు కలిపితే దుష్ట సమాసంలాగ వ్యంగ్యం సూచిస్తుంది. అప్పుడప్పుడూ నేను ఇంగ్లీష్ పుస్తకాల్లో ఇండియన్ పేర్లు చూస్తుంటాను — తంగవేలు మెహతా లాగా! మనకి వెంటనే తెలుస్తుంది, భాష, శబ్ద ప్రమాణాలు, ఒరవడులు తెలియని వాళ్ళు పెట్టిన పేరు అని.
అందుకే నాకు రావు గోపాలరావు ‘డాల్డాలు’ అంటే అర్థం అయింది. ప్రజలు పదాలని ఏవిధంగా అర్థం చేసుకుంటారో తెలిసిన రచయితా రాసిన డైలాగది! పదాలకి అర్థం చెప్పేవాడు ఇవ్వడు, వినేవాడు ఇస్తాడు. చెప్పేవాడు తెలివిగల వాడైతే, వినేవాడికి ఏ అర్థం వస్తుందో చూసుకుని చెబుతాడు.
కవిత్వంలో ముఖ్యంగా ఈ కష్టం తెలుస్తుంది. అసలే సరైన శబ్దాల కోసం కవులు పడే బాధ ఎక్కువ. శబ్దాల అసమర్థత గురించి, భావాన్ని శబ్దాల్లో పెట్టాలంటే పడే కష్టం గురించి, బైరాగి ఎప్పుడో అన్నాడు. అర్థ బ్రహ్మం కన్నా శబ్దబ్రహ్మం ముఖ్యం అని పానుగంటి వారు అవహేళన చేశారు కానీ, సర్వ బ్రహ్మం (అంటే అర్థమూ, శబ్దమే కాకుండా, అన్ని బ్రహ్మాలూ కలిపి!) లాగా పదం ఇచ్చే అనుభూతి అన్నిటినీ అధిగమించి ఉంటుంది.
ఇప్పటిదాకా నేను భాష గురించి అని చెబుతున్నా, నిజానికి, కేవలం పదాల గురించి మాత్రమే రాస్తున్నాను. నేను మొదటి పదిహేడేళ్లు కేవలం తెలుగు పదాలతోనే గడిపాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు, దైనందిన జీవితంలో ఇంగ్లీష్ పదాలు మాత్రమే వాడుతున్నాను. పుట్టింటినుంచి వెళ్లి పోయిన అమ్మాయిలాగా, ఆ జ్ఞాపకాలు, ఆ మమకారం, ఆ బాంధవ్యం ఇంకా నాకు తెలుగు పదాలతోనే ఉంది. ఇప్పటికీ, “ఏటికొంగల నిదుర” అన్నా, “బాతు కొంగల నీడ” అన్నా, నాకు ఉండే జ్ఞాపకాలు కీట్స్ చదివినా, షెల్లీ చదివినా రావు. మల్లె పూలంటే మనసు చలిస్తుంది కానీ, డాఫోడిల్స్ అంటే ఇన్నేళ్లు మల్లెపూలకు దూరమైన డాఫోడిల్స్ దేశంలో ఉన్నా ఆ అనుభూతి కలగదు. మరి పదాల జ్ఞాపకాలే కదా ఆ రంగు, రుచి, వాసనా ఇచ్చేది?
అందుకే నాకు ఇంగ్లీషులో కవిత్వం గుండెకు అంటదు, అనుభూతికి అందదు. అయితే, అక్కడ కూడానూ అందరు కవులూ అనుభూతి మీద ఆధారపడే కవిత్వం రాయరు. కాదు — ఆ అనుభూతి ఒక భాష, ఒక జాతి, ఒక నేల కి చెందిన అనుభూతి కాదు. ఉదాహరణకి ఇలియట్ కవిత్వంలో చరిత్ర, మతం, జ్ఞానం, తత్వం, పురాణం లాంటివి అనుభూతి పరంగా ఉంటాయి. నేను అమెరికా వెళ్లిన మొదటి సంవత్సరం, వేస్ట్ ల్యాండ్ వెనక ఉండే ఫుట్ నోట్స్ చూసి, ఒక్కొక్క రిఫరెన్స్ — బైబిల్, ఎడ్మండ్ స్పెన్సర్, డాంటే, హోమర్, కింగ్ ఆర్థర్ పురాణ కథలూ– వెతికి చదివాను. చివరికి నాకు “అర్థం” అయింది — అంటే సరైన అనుభూతి కలిగింది.
ఉదాహరణకి, “Frisch weht der Wind // Der Heimat zu, // Mein Irisch Kind // Wo weilest du?” లైన్లు తీసుకోండి. ఈ పదాలు అర్థం చేసుకోవాలంటే, ఆ ట్రిస్టాన్, ఇసోల్దే ల కథ తెలియాలి. ఆ చలి గాలీ, ఆ సాగరపు హోరు తెలియాలి. ఆ దేశపు ప్రేమ కథల చరిత్ర తెలియాలి. అయితే, అవన్నీ చదవగా, చదవగా ఆ రెండు లైన్ల వెనక ఉండే భావావేశం తెలుస్తుంది. అదే ఇలియట్ చేసిన పని! అంతకు ముందున్న పదాలు యథాతథంగా వాడుకోవడం మూలాన ఆ భావాల్ని ఆవాహం చేశాడు.
విచిత్రమేమిటంటే, ఇంగ్లీషులోకి అనువాదం చేసిన కవితలు — ముఖ్యంగా స్పానిష్ భాష నుంచి — నాకు అర్థమవుతాయి. నేను నెరూడా, పాజ్, లోర్కా లాంటి వాళ్ళను ఇంగ్లీషులో చదివితే నాకు నా సొంత దేశపు గొంతు వినపడుతుంది. బహుశా, నాలాగే, అవి కూడా, ఈ పరాయి భాషకి అంటుకట్టిన మొక్కలాగా ఉన్నందువల్లనేమో!
ఈ మధ్య మళ్ళీ తెలుగు కవిత్వం చదువుతున్నా, వింటున్నా కొంచెం అసహనంగా ఉంటోంది. మరీ, నా జ్ఞాపకాలు, నా సెంటిమెంట్ల మీద ఆడుకున్నట్లు ఆ చిన్నతనం నాటి, నాకు నచ్చిన పదాలు విచ్చలవిడిగా వాడి కవితలు రాసినట్లు అనిపిస్తోంది. ఇన్నేళ్ళుగా, పరాయి దేశంలో ఉంటూ, గుండెల్లో దాచుకున్న ఈ పదాలు మరీ సులభంగా వాడుతుంటే, మల్లెపూలని నేలమీదకి విసిరేసి నిర్ధయగా తొక్కివేస్తున్నారనిపిస్తోంది. మొదట ‘కాలగర్భం’ అన్న అందమైన పదం అరిగిపోయిందని చెప్పాను కదా! నిజానికి సినిమా పాటలు కొన్ని అందమైన పదాలు వాడుకుని, అవి కలిగించే అనుభూతులు పల్చన చేశాయి. ఇప్పుడు, భాషలకి, పదాలకి అతీతంగా, అర్థం తప్ప, అనుభూతి తప్ప వాటి బాహ్యరూపం లేకుండా ఉండే కవిత్వం వినాలని ఉంది. అందుకే కామోసు చాల మంది పెద్దయిన తర్వాత నాన్ ఫిక్షన్ ఎక్కువగా చదువుతారు!
చివరిగా, నాకు ఒక జోకు గుర్తుకు వస్తుంది. సుబ్బారావు ఒక బార్ లోకి వెళ్ళాడు. అక్కడ కొంత మంది మనుషులు గుమిగూడి ఉన్నారు. ఒకడు 23 అన్నాడు. అందరూ పగలబడి నవ్వారు. మరొకడు రు 17 అన్నాడు రు. అందరూ మళ్ళీ నవ్వారు. ‘ఇదేంటని’ సుబ్బారావు పక్కవాడిని అడిగాడు. వాడు చెప్పాడు — “మేము ప్రతిరోజూ కలుస్తాము ఇక్కడ. జోకులు చెప్పుకుంటాము. ఆ జోకులు అలవాటయ్యి, ప్రతి జోకుకి ఒక నంబర్ ఇచ్చుకున్నాం. 23 అనగానే, ఆ జోక్ గుర్తుకొచ్చి నవ్వారు”. “అయితే నేను కూడా చెప్పవచ్చా?” అని సుబ్బారావు అడిగి, “28” అని గట్టిగా అన్నాడు. ఎవ్వరూ నవ్వలేదు. “ఇదేమిటి” అని అడిగితే పక్క వాడు “చెప్పే విధానంలో ఉంటుంది” అన్నాడు. అంతలోకి మరొకడు వచ్చి 42 అన్నాడు. అందరూ మరీ విరగనవ్వారు. అంత మంచి జోకా అని అడిగితే, పక్క వాడు చెప్పాడు “కాదు. మొదటి సారి వినడం. అందుకే అంతగా నవ్వుతున్నాం” అని.
పదాలకి, కవిత్వానికి మధ్యన సంబంధం, ఈ జోకు కన్నా మరే శాస్త్రం చెబుతుందనుకోను!
*
చాలా విలువైన వ్యాసం. ధన్యవాదాలు సర్.
– ఎమ్వీ రామిరెడ్డి
చాలా చాలా బాగా చెప్పారు..
మీ ఉదాహరణలు భలే ఉన్నాయి. థాంక్యూ..
మీరన్నట్టు చిన్నప్పుడు కొన్ని పదాలు విన్నప్పుడు కలిగే ఉద్వేగం ఇప్పుడు విన్నప్పుడు కలగటం లేదు..
Misplace అయినట్లు అన్పిస్తుంది..
‘ఒక టేబుల్ టేబుల్ మాత్రమే‘ కథ ఆధారంగా పిల్లలకు attention games నేర్పేక్రమంలో sit అంటే stand; stand అంటే jump; jump అంటే sit అని చెప్పి గుర్తుంచుకోమనీ sit , stand, jump ఆడించేవాడిని. ఒక్క నిమిషం లో అందరూ ఔట్ అయ్యేవారు. Sir ను stand గా అనుకోవడం ఎంతకష్టం. ఒక పదానికి దాని శబ్దం, రూపం, అర్థం మనసులో ముద్ర పడితే చెలరేగడం కష్టం.
చాలా బాగుంది
చాలా బాగుందిమన ఊరి పాండవులు నాకెందుకో ఇష్టమైన సినిమా.
చక్కని విశ్లేషణ.