అశక్తంగా మిగిలిన సాహస జాతి

రామాయణం రాసిన వాల్మీకి బోయవాడని తెలిసినా కనీసం రామ భక్తులు కూడా బోయ జాతిని సమభావంతో చూడక పోవడం సామాజిక వైచిత్రికి నిదర్శనం.

బోయలు రామాయణం రాయడం ద్వారా రాముడిని గొప్పవాడిని చేసి, రాజ్యాల రక్షణ కోసం సైన్యంలో ప్రాణాలకు తెగించి పోరాడారు. భుజాలు కుంగిపోయేలా ప్రభువుల పల్లకీలు మోసి చరిత్ర పొడుగునా యెన్నో త్యాగాలు చేసి వీరోచితమైన జాతిగా గుర్తింపు పొందారు. అయినా యిప్పటికీ బోయలు తమకంటూ స్తిర నివాసం లేక సంచార, అర్థ సంచార జాతిగానే మిగిలిపోవడం ఒక చారిత్రక విషాదమని భావించవచ్చు. రామాయణం రాసిన వాల్మీకి బోయవాడని అందరికీ తెలిసినా కనీసం రామ భక్తులు కూడా బోయ జాతిని సమభావంతో చూడక పోవడం భారతీయ సామాజిక వైచిత్రికి నిదర్శనం.

క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నుంచి ఆంధ్ర దేశ చరిత్రలో బోయల ప్రస్థావన కనిపిస్తుంది. మధ్య యుగాలలో ప్రఖ్యాతి గాంచిన చాళుక్యులు, చోళులు, కాకతీయులు, విజయనగర రాజుల కాలంలో సుమారు 10 నుంచి 15 శతాబ్దాల వరకు గల చారిత్రక ఆధారాలైన శాసనాలలో బోయలు సైనికులుగా, యుద్ధ వీరులుగా, సామంతులుగా వారి ప్రస్థావన యెక్కువగా కనిపిస్తుంది. తూర్పు చాళుక్యుల కాలంలో బోయల ఆవాసాలైన ‘ బోయ కొట్టాల’ గురించి శాసనాలు పేర్కొన్నాయి. పండరంగడి శాసనంలో నేటి ప్రకాశం జిలా అద్దంకి ప్రాంతంలో వున్న బోయ కొట్టముల గురించి వివరించాడు. ఆ ప్రాంతానికి ‘ బోయ వీడు’ అనే పేరుంది. 15 వ శతాబ్దానికి చెందిన మరో శాసనం ఆ ప్రాంతాన్ని ‘బోయ విహార దేశం’ గా పేర్కొంది. కాకతీయుల శాసనాలు బోయలకు తాము నివాసముండే ప్రాంతంలో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు వుంటుంది. విజయనగర కాలంలో బోయలకు విలుకాళ్ళు గా యెంతో విలువ వుండేదని తెలుస్తుంది. వారు బాణాలు సంధించి యెంతటి పరాక్రమవంతుడైన శతృవుని సైతం చిత్తుగా వోడించేవారని చరిత్ర చెబుతుంది.

బోయలు సైన్యంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పటికీ వారిని కాకతీయ పాలకులు పశుపోషణ పని అప్పగించినట్టు, బోయలు దేవాలయాలలో అఖండ వత్తి దీపాన్ని వెలిగించడానికి కావల్సిన నెయ్యిని సరఫరా చేసినట్టు శాసనానాధారాలు వున్నాయి. విజయనగర సామ్రాజ్యంలోనూ, ఆ తర్వాత చిన్న రాజ్యాల పాలనలోనూ బోయలు పాలెగాళ్ళగా, గ్రామాలకు కాపలా దార్లుగా నియమించ బడినట్టు తెలుస్తుంది. అయితే, మధ్యయుగాంధ్ర శాసనాలలో ‘బోయ’, ‘గొల్ల’ అనే పేర్లు సమానార్ధకాలుగా వుపయోగించడం గమనార్హం. మద్రాసు రాష్ట్రం లోని జనాభా లెక్కల ప్రకారం బోయల్లో ‘పెద్ద బోయ’, ‘చిన్న బోయ’, అనే రెండు ప్రధాన శాఖలు వుంటే మరొక అధికార లెక్క ప్రకారం వారిలో ‘పెద్ద బోయ’, ‘చిన్న బోయ’, ‘మ్యాస బోయ’,’సదరు బోయ’ అనబడే నాలుగు వుప శాఖలున్నట్టు తెలుస్తుంది.   ఉత్తర ఆర్కాట్ జిల్లా మాన్యువల్ ప్రకారం బోయలు తెలుగు మాట్లాడే ప్రాంతాలలో యుద్ధ విద్యలు తెలిసిన వారు. వీరు కొండ ప్రాంతాలలో యెక్కువగా నివశిస్తుంటారు. వారికి బయటి ప్రపంచపు నియమాలు తెలియవు. కొందరు వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవిస్తారు. వారిలో అనేక ఉప శాఖలున్నాయి. బోయ ప్రముఖుని ‘ముల్కి బోయడు’ లేదా ‘పాల బోయడు’ అంటారు. 1891 నాటి గణాంకాల ప్రకారం వీరు ప్రధానంగా ‘కన్నడ’, ‘తెలుగు’ బోయలనే రెండు శాఖలుగాను, ‘హాలు’, ‘మాచి’, ‘మ్యాస’, ‘నాయక’, ‘పాలెగార్’, ‘బారిక’ వంటి ఇరవై వుప శాఖలుగాను వుంటారు. ఇటీవల కాలంలోని గణాంకాల ప్రకారం వీరు రాతి పనిని, మట్టి పని, బైలు లేదా బయట పని, చేస్తుంటారు. వారిలో కులాంతర వివాహాలకు ఆమోదం లేదు. ఒకే గోత్రం వారి మధ్య వివాహం నిషేధం. వధూవరుల జాతకాల ప్రకారం వివాహం నిశ్చయమౌతుంది. ప్రదానం అనే వేడుక తర్వాత హిందూ పూజారుల మంత్రోచ్చారణతో పెళ్ళి జరుగుతుంది. వీరి పెళ్ళి తంతు హిందూ పద్ధతిలాగే వుంటుంది. గతంలో ‘రాక్షస’ వివాహాలు కూడా జరిగేవని బోయ కుల పెద్దలు చెబుతారు. విడాకులు, మారు మనువు పద్ధతి బోయలు పాటిస్తారు.

వడ్డెర, పిచ్చుకుంట్లు, ముదురాజు కులాలు బోయల నుంచి విడివడిన కులాలని కొందరు పరిశీలకులు చెబుతారు. ప్రాచీన యుగంలో వాల్మీకి మహర్షి వంటి గొప్ప పండితుడు తమ కులంలో ఉన్నాడని నమ్మడమే కాక కొన్నిసార్లు వారు సామాజికంగా తమను పై స్థాయిలో నిలబెట్టుకోవడానికి బ్రాహ్మణ ఆచార సంప్రదాయాలను అనుకరించారు. అటువంటి సందర్భాలలో వారిని ‘బోయ బ్రాహ్మణులు’ అని వ్యవహరిస్తారు.

మధ్య యుగాలలో బోయలు స్థానిక పరిపాలనలో పాలెగాళ్ళు గా పనిచెయ్యడం వలన అప్పట్లో వారు ఇతర సూద్ర కులాలైన కమ్మ, రెడ్డి, వెలమ, కాపు కులాలతో పాటు సమాన హోదాను పొందారవచ్చు. వీరిని ప్రముఖ చరిత్రకారుడు బర్టన్ స్టీన్ ‘రైతాంగ యోధులు’ అని పేర్కొన్నాడు. ఆధునిక కాలంలో బోయలు రాయలసీమ జిల్లాలలోనూ, అరుదుగా కోస్తా, తెలంగాణా జిల్లాలోనూ నివశిస్తున్నారు. వీరు రాయలసీమలో ఫాక్షనిస్తుల వద్ద వారికి ఆయుధ సహకారాన్ని అందించే వారిగా, ఆయుధాల తయారీదారులుగా వుండి అక్కడి ముఠా కషల్లో భాగస్వాములవుతున్నారు.

బోయలు మధ్య యుగాలనాటి దేవాలయ సంస్కృతిలో భాగస్వాములవ్వడం విశేషం. వారి శారీరక దారుఢ్యం కారణంగా బోయలను గుడిలో పల్లకీలు మొయ్యడానికి ఉపయోగించారు. అలాగే రాజవంశాల వారిని పల్లకీలో మోసింది కూడా బోయీలే! ఆధునిక కాలంలో ఆ పద్ధతి పెళ్ళి పల్లకీలు మొయ్యడం ద్వారా కొనసాగిస్తున్నారు. పండుగలు, ఉత్సవాలలో మేళ తాళాలు వాయిస్తూ వారు జీవనోపాధిని పొందుతున్నరు. వీరు కొమ్ము బూర, కంజిర వంటి వాయిద్యాలను వాయించడంలో సిద్దహస్తులు. రాయలసీమ ప్రాంతంలో బోయలు గ్రామాలలో పొలాలకు కాపలాదారులుగా ఉంటున్నారు. పొలాలకు కాపలాదారులుగా ఉండే బోయలను ‘గిరికోళ్ళు’ అంటారు. చిత్తూరు జిల్లాలో వీరిని ‘గిరికోళ్ళు’, ‘మేకల్లోళ్ళు’ అని కూడా అంటారు.   బోయలకు గ్రామాలలో ప్రత్యేకంగా తమవైన నివాస ప్రాంతాలుండడమే కాకుండా చిత్తూరు, మదనపల్లె వంటి ప్రాంతాలలో వారి పట్ల కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ కులాలు అంటరానితనాన్ని పాటిస్తారని వొక బోయ కులానికి చెందిన పెద్ద మనిషి చెప్పడం గమనార్హం. వారికి పడుకోవడానికి మంచాలుండవు, వున్నా ఆ మంచాల్ని వెల్లకిల్లా వేసి వుపయోగించాలి తప్ప మామూలుగా వేసుకుని ఆ మంచాలపైన కూర్చోవడం, పడుకోవడం చేస్తే అక్కడి భూస్వామ్య కులాలను అవమానించినట్టు భావిస్తారని అక్కడి బోయ కులస్తుడు స్వయంగా చెప్పడం విశేషం. విశాఖపట్నం జిల్లా పాడేరు వంటి యేజెన్సీ ప్రాంతంలో బోయలను ‘బోయ మాలలు’ అని పిలవడమే కాక వారి పట్ల కూడా కుల సమాజం అంటరానితనాన్ని పాటిస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలోని బోయలను ‘చెంచు బోయలు’ అని వ్యవహరిస్తూ వారిని ఆటవికుల కింద పరిగణించడం చూస్తాం. దీన్ని బట్టి వివిధ ప్రాంతాలలోని బోయలకు వేరు వేరు గుర్తింపులు వున్నాయని అర్ధమవుతుంది.

బోయలకు తమదైన ప్రత్యేక మత విధానం లేకపోయినప్పటికీ వారి సాంస్కృతిక అస్తిత్వం తమ కులదేవత జమ్ములమ్మ ఆరాధనలో ఉందని చెప్పొచ్చు. వారు ఆమెను ఆరాధిస్తూ ప్రతి సంవత్సరం ఆమె పేరున జాతర నిర్వహించి ఆమెకు జంతువులను బలి ఇచ్చి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగే జమ్ములమ్మ జాతర ప్రసిద్ధి గాంచింది. చిత్తూరు జిల్లాలో మధ్య యుగాలలో నిర్మితమైన ‘బోయకొండ గంగమ్మ’ దేవాలయం బోయలదే. చిత్తూరు ప్రాంతంలో గ్రామదేవత అయిన గంగమ్మను అందరూ కొలుస్తారు. బహుశా! అక్కడి బోయలు కూడా గంగమ్మనే పూజించి వుండొచ్చు.   మధ్య యుగాలలో వారు వీరశైవ మతంలో వున్నట్టు తెలుస్తుంది. శ్రీ కాళహస్తిలోని భక్త కన్నప్ప అనే శివ భక్తుడికి ‘బోయ తిన్నడు’ అనే పేరుంది. కన్నప్ప చెంచుకులానికి చెందినవాడని కొందరు భావిస్తే అతని అసలు పేరు ‘బోయ తిన్నడు’ కాబట్టి కన్నప్ప అనే పేరుతో ప్రసిద్దికెక్కిన శివ భక్తుడైన తిన్నడు బోయవాడేనని చరిత్రకాలు పేర్కొంటున్నారు. బోయల సామాజిక జీవనం యితర హిందూ కులాలకు దగ్గరగా ఉంటుంది. బిడ్డ జన్మించిన నాటి నుంచి మరణించే వరకు జరిగే వివిధ తతంగాలు, ఆచారాలు హిందువుల వలెనే ఉంటాయి. కుటుంబ జీవితంలో వారు పితృస్వామిక కుటుంబ విధానాన్ని ఆచరిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం బోయ కుల జనాభా సుమారు ఆరు లక్షలదాకా వుండొచ్చని అంచనా. వీరిలో అక్షరాస్యత చాలా తక్కువ. సుమారు పది నుంచి పదిహేను శాతం దాకా వీరిలో అక్షరాస్యత వుంటుందని గణాంకాలు చెబుతున్నాయి. విశాఖ యేజెన్సీలో బోయలు షెడ్యూలు తెగలుగా ప్రభుత్వ రికార్డులకెక్కారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోనూ, ప్రస్తుత తెలంగాణా రాష్ట్రం లోనూ వీరు వెనుకబడిన కులాల జాబితాలో వున్నారు. అయితే నేరస్థ జాతుల చట్టం, 1871 ప్రకారం మొదట నేరస్థ జాతిగా గుర్తించబడిన కులం బోయలే! ఆ తర్వాత యెరుకల వంటి యితర కులాలను చేర్చడం విశేషం. నేరస్థ జాతుల చట్టం లోని లొసుగుల వల్ల వారిని ఆ చట్టం నుంచి మినహాయిస్తూ ‘విముక్త జాతులు’ (de-notified tribes)గా గుర్తించాక 1960 వరకు వారు షెడ్యూలు తెగల జాబితాలో వుండడం గమనార్హం.

గతంలో వీరోచితమైన జాతిగా యెంతో ఘన కీర్తి పొందిన బోయలు ఆధునిక యుగంలో తమ ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయి ఆర్ధికంగా, సాంఘికంగా, రాజకీయంగా వెనుకబడి వున్నారు. కర్ణాటక రాష్ట్రంలో వీరు ప్రధాన స్రవంతి రాజకీయాలలో కొంతమేరకు చురుకుగా పాల్గొంటున్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో బోయల శక్తి సామర్ధ్యాలను అక్కడి అగ్రకుల ఫాక్షనిస్టులు వుపయోగించుకుని వారిని పతనావస్థలోకి నెట్టడం చూస్తున్నాం. విద్య, వుద్యోగ రంగాలలో వెనుకబడి వున్న వీరు తమను యితర ఆదివాసీ తెగగా గుర్తించి షెడ్యూలు తెగల జాబితాలో చేర్చి ప్రభుత్వ పరమైన రాయితీలు కల్పించవల్సిందిగా కోరుకుంటున్నారు.

ప్రాచీన కాలంలో రాముడి గొప్పతనాన్ని కీర్తించడానికి బోయవాడైన వాల్మీకి అవసరమైతే మధ్య యుగాల రాజ్యాలు రాజులు చల్లగా వర్ధిల్లడానికి బోయ యోధులు అవసరమయ్యారు. ఆధునిక కాలంలో ముఠా నాయకుల చేతికి నెత్తుటి మరకలంటకుండా బోయవారు వారికింద పని వారిగా ఆయుధ దారులుగా పనిచేస్తూ తమ సమస్తాన్ని ధార పోస్తున్నారు. బోయలు యెంతో శక్తివంతులై వుండి తమకంటూ తమకంటూ స్థిరమైన జీవితం పొందలేని సంచార, అర్ధ సంచార జాతిగా, అశక్తులుగా మిగలడం దయనీయం.

* యీ వ్యాసానికి కావల్సిన సమాచారాన్ని అందించిన శ్రీ గాండ్ల హరి ప్రసాద్ బోధి, ధర్మచక్ర ఫౌండేషన్, కందుకూరు గారికి కృతజ్ఞతలు

చల్లపల్లి స్వరూప రాణి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Vyaasam dwaara boyala goorchi vivaramgaa andinchina challapalli swaroopa Rani gaariki dhanyavaadaalu

  • గౌరవ చల్లపల్లి స్వరూపరాణి మేడమ్ గారికీ ధన్యవాదాలు మా గురించి ఆర్టికల్ రాసినందుకు… ఈ ఆర్టికల్ చాలా బాగుంది కాకుంటే….మైదాన ప్రాంత వాల్మీకీ బోయలు 30 లక్షల మంది వుంటారు….అలాగే మైదాన ప్రాంత వాల్మీకీ బోయలు…..1969 వరకు SC లుగా వున్నారు…1970 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం G.O Ms No:1793 ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి BC -A లిష్టులో చేర్చారు…..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు