అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి..మూడు బీర్ల తర్వాత

పాత్రల స్వభావాన్ని చెప్పడంలో రచయిత ఎంచుకున్న స్వభావాత్మక దృక్కోణాన్ని అంచనా వేయగలిగితే కథాలోతులను తవ్వొచ్చు.

  కథ మాట్లాడదు. కథకుడూ మాట్లాడడు. చెప్తాడు. చెప్తాడు అనేకంటే కథను దృశ్యాలుగా చూపిస్తాడు అంటే బాగుంటుంది. కథ చదివేటప్పుడు ఆ దృశ్యాలు పాఠకుడి కళ్లముందు కాన్వాస్ పై కదులుతూ ఒకదానికి తర్వాత మరొకటి వెళ్లిపోతూ ఉంటాయి. జీవితం తాలూకు అనుభవాల్ని, అనుభూతుల్ని, వాటి నగ్నసత్యాల్ని.. పాత్రల అంతర్గత, బహిర్గత ఛేతనల ద్వారా, సన్నివేశం సంఘటనల నేపథ్యాల ద్వారా పాఠకుల హృదయాల్లోకి ఇంకింపజేస్తూ వెళ్లిపోతుంటాయి. అలాగని నిజంగా వెళ్లిపోవు సమాజ వాస్తవికతను, దాని తార్కిక లోతులను పరిచయం చేస్తాయి. అనుభూతి గాఢతను బట్టి మనల్ని మరణం వరకు వెంటాడతాయి. వేటాడతాయి. మరి చిన్న కథ ఇంతపని చేయాలంటే అంత సులభమేమీ కాదు, అదీ ఒక్క సన్నివేశంలో…

అక్కిరాజు భట్టిప్రోలు.. రాసింది చాలా తక్కువ కథలే. కానీ ప్రతి కథ ఎన్నో సందేహాల్ని, సమస్యల్ని, ప్రశ్నల్ని మనపై సంధిస్తుంది. మనకు తెలిసిన విషయాల్లోని ఖాళీలను కొత్తగా పరిచయం చేస్తుంది. ఊహలు, ఉబుసుపోక కబుర్లు ఉండవు. భిన్నకోణాల్లో దర్శించిన జీవితం తాలూకు నిగూఢత మాత్రమే కనిపిస్తుంది. సునిశితంగా, సూక్ష్మంగా రచయిత సంధించిన బాణాలు మనసులోకి వెళ్లి, గాయాలు చేసి కొత్త ఆలోనలను ఇంజెక్ట్ చెస్తాయి. “మూడు బీర్ల తర్వాత” కథ అందుకు ఓ ఉదాహరణ. మనిషిని, మనసును రెండు ప్రపంచాలుగా వేరు చేసి, వాటి మధ్య ఉన్న సర్రియలేంద్రజాలాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది ఈ కథ. మనుసు పొరల మధ్య ఉన్న సన్నిటి రేఖను బద్ధలుకొట్టి ఛేతనకు అఛేతనకు, వ్యక్తానికి అవ్యక్తానికి మధ్య లంకె వేస్తుంది. దాచేస్తే దాగిన సత్యాలను బహిర్గతం చేస్తుంది. నటనకు, జీవితానికి ఉన్న బంధాన్ని తరచి చూసుకోండి అంటూ పాఠకుల మీదకు సవాల్ విసురుతుంది.

ఉత్తమ పురుషలో నడిచే ఈ కథంతా పాత్ర అంతర్, బహిర్ స్వరూపాల కలయికే. పాఠకుడిని కూడా కట్టిపడేసే శిల్పంతో సాగుతుంది. ఎక్కడా లెక్కతప్పదు. వాస్తవికతను ఎగిరే జెండాలా నిలబెడుతుంది. కథ కేవలం పార్టీలో జరిగే ఒకేఒక్క సన్నివేశం మాత్రమే. అదీ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు సంస్థ ఇచ్చే పార్టీ. ఆ పార్టీలో కథకుడు తన గురించి తాను చెప్పుకుంటూ, ఇతర పాత్రలను పరిచయం చేస్తూ, వాళ్ల బాహ్య ప్రవర్తనతోటు, ఆంతరింగిక లోతులను సైతం తవ్వితీస్తూ మన కళ్లముందు నిలుపుతుంటాడు. పల్లెటూర్లో పొలం పనుల్లోని ఊడ్పుల నుంచి చైనాలో మానవ హక్కుల అవసరం వరకు, శంకరాభరణం సినిమా నుంచి టీషర్టు దాచలేని స్త్రీ వక్షస్థలం వరకు, పాకిస్తానీలను తురకవాళ్లను తిట్టే దేశభక్తి నుంచి నటీమణుల బొడ్డు గురించి చేసే ఆలోచనల వరకు… ఇలా ఎన్నో ఎన్నెన్నో మాటల్లోంచి, పాత్రల ప్రవర్తనల్లోంచి మత్తుగా, మద్యం మత్తులోంచి దొర్లిపోతుంటాయి. వాటి మూలాల్లోని నిజాలు, ఇజాలు నేరుగా పాఠకుల్ని ప్రశ్నిస్తుంటాయి. అలా ఎలా? అలా ఎందుకు కాదు? మనల్ని మనం దాచుకుంటున్నాం!. ముసుగులేసుకుని నటిస్తున్నాం!!. మనం కూడా లోపల అంతేకదా!!! అని ఎవరికి వారిని పూర్తిగా ముసుగుతీసేసి నగ్నంగా చూపిస్తుంది ఈ కథ. ప్రతి వాక్యం, ప్రతి పదం వేలెత్తి చూపుతూ… కథతోపాటు ఆగకుండా, ఆపకుండా నడిపిస్తుంది. అంతేకాదు ఆమెరికాలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మనఃప్రపంచాల్ని పొరలుపొరలుగా విప్పేస్తుంది.

రామ్ అనే కథకుడు ““హేనికెన్ ప్లీజ్” కౌంటర్లో నల్లావిడ ఆకుపచ్చని హేనికెన్ బాటిల్ ఓపెన్ చేసి నాప్కిన్ తో తుడిచి నా ముందుకు తోచింది. “థ్యాంక్యూ” అంటూ దాన్ని ఆప్యాయంగా చేతిలోకి తీసుకున్నాను.” అంటూ కథను ప్రారంభిస్తాడు. పార్టీలో తను కలిసే, తనను కలిసే వాళ్ల గురించి తనదైన ఆలోచనలతో వ్యంగ్యంతో కూడిన ఒరిజినాలిటీతో కామెంట్స్ విసురుతుంటాడు. భౌతికశాస్త్రం, భూగోళశాస్త్రం, సామాజికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం… అన్నీ, వాటి మధ్య కలగాపులగంగా ఆయా వ్యక్తుల హృదయాంతరాలను పట్టి చూపిస్తుంటాయి. భౌతికశాస్త్రానికి, మనసుకు లింక్ పెట్టి..

“వాతావరణంలో నీటి ఆవిరి యుండును, మనుషుల్లో ఆశలు ఉండును, మనసుల్లో కొరతలు యుండును, ఇది భౌతికశాస్తం” అని చల్లటి హేనికెన్ బాటిల్ మీద మళ్లీ మళ్లీ వచ్చిచేరే నీటిని గురించి కామెంట్ చేస్తాడు. ఆ తర్వాత మార్క్ పాత్ర పరిచయం అవుతుంది. అతడికి కథకుడికి పెద్దగా పరిచయం ఉండదు. కానీ అతడి పలకరింపు వెనక, స్నేహం చేయాలనుకోవడం వెనక కథకుడితో రెండు మూడు రోజుల్లోనే ఏదో పని ఉంటుంది. అందుకే పార్టీకి వచ్చాడని మార్క్ క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తాడు కథకుడు. పార్టీలో ఆమెరికన్లు, బారతీయుల కబుర్లను “బెడ్ రూం పెయింట్, కుక్కకు వచ్చిన రోగం…, హెచ్ 1 వీసా, స్టాక్ ఆఫ్షన్, మల్టీ మిలియనీర్ అంటూ ఏకరువు పెడతాడు. తర్వాత లారా పాత్ర.. “చిరిగిపోయేలా ఉన్న ఇరుకైన టీషర్టు ఆమె స్త్రీత్వాన్ని దాచలేకపోతుంది. అసలామె ఎందుకు దాచవలెను? మూడో బీర్ ప్రభావమా, డిజైనర్ వేర్ మహాత్యమా” అనే సందిగ్థంలో పడతాడు. “అందమైన దాన్ని, తెలివితేటలున్నదాన్ని, పైగా అమెరికన్ని.. ఆఫ్టరాల్ ఏషియా గాళ్లతోటి తింటూ తిరుగుతున్నాను. చూశారా నేనెంతటి మంచిదాన్నో” అని ఆమె వ్యక్తిత్వంలోని సుపిరియారిటీ కాంప్లెక్స్ ను పరిచయం చేస్తాడు.

తర్వాత వాళ్ల గ్రూపు వాళ్లను కలుస్తాడు. అక్కడ నారాయణ్ అనే భారతీయుడు ఇండియా గురించి, ఇండియాలో స్త్రీలను దేవతలుగా కొలుస్తురని చెప్తుంటాడు. దాంతో కథకుడు తన భావనాత్మకలోకంలోంచి.. “ఎందుకీ న్యూసెన్స్. జాతీయతలూ, రేసులూ (తెగలు), రంగులూ తేడాలే లేవని కబుర్లు… సందు దొరికితే చాలు మీరిలాగా, మేమిలాగా.. అనవసరమైన గోల. వొరే నారాయణ్, ఎప్పుడైనా ఆమెరికావాడు “మేమింత గొప్పవాళ్లం సుమా” అంటం విన్నావురా? మనమెందుకు ప్రతీ నిమిషం “మేమంత వాళ్లం, ఇంతవాళ్లం” అంటూ రభస చెయ్యడం? మనకి మనమీదే నమ్మకం లేదు. ఇది తెల్లాణ్ణి నమ్మించే ప్రయత్నం కాదు, మనల్ని మనమే నమ్మించుకునే ప్రయత్నం… నో! నా పార్టీ మూడ్ పాడయిపోయింది” అనుకుంటూ నారాయణ్ తో “అవును ఫ్రాంక్… ఆడవాళ్లనే కదూ… అవును నిజమే.. మనుషులుగా మాత్రం చూడం” అని దేశభక్తి నటించడం, దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వెనకున్న అతడి మనసునే కాదు, అలాంటి దొంగ దేశభక్తుల హృదయాల్నీ బద్దలుకొడతాడు.

నాలుగో బాటిల్ తో దేశీయుల టేబుల్ దగ్గరకు చేరతాడు. చైనాలో మానవహక్కుల పునరుద్ధరణకై శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే ప్రదర్శనకు వెళ్లాలనుకున్న బెంగాలీయుని గుండెలోతుల్ని తనకోణం నుంచి, నికార్సైన నిప్పులాంటి నిజం నుంచి ప్రశ్నిస్తూ.. “ఐఐటీ అయ్యేవరకు రాజకీయాలు, గొడవలు పనికిరావనుకున్నవాడు. భారతదేశంలో సమస్య, ప్రదర్శనా కనిపించినా పోలీసుల లాఠీచార్జీలు, చెమటకంపు మాత్రమే దొరుకుతాయని అసహ్యించుకున్నవాడు. మార్కులు తగ్గుతాయని భయపడ్డవాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్రీ టీషర్టు, స్పాన్సర్డ్ సోడా, షార్టుల్లో అమ్మాయిలూ ఉంటారని వెళ్తున్నాడం”టాడు. ఇంకా “ఇరాక్ మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఏదైనా ప్రదర్శన ఉంటే చెప్పు.. నాకు మిడిల్ ఈస్టర్న్ అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టం” అనేస్తాడు. ఇరాక్, చైనా దేశాల్లోని మానవ హక్కుల ఉల్లంఘన వెనకున్న అతర్జాతీయ సంబంధాల గురించి ఆలోచించమని ఓ సెటైర్ విసురుతాడు.

తెలుగువాడైన ప్రసాద్ “బాలమురళీ కన్సర్ట్ వచ్చే నెలలో బే ఏరియాకి వస్తోంది తెలుసా” అని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రసాద్ ఆలోచనల్లో వచ్చిన మార్పు గురించి, పోగొట్టుకున్న అతడి నెగిటివిటీ గురించి విశ్లేషిస్తూ.. “నాకు తెలిసినంత వరకూ, విజయశాంతి బొడ్డు గురించి వీడు చేసినంత రెసెర్చి మరెవరూ చేసి వుండరు. వీడా మాస్ టేస్టుల నుండీ క్లాస్ టేస్టులకు ఎప్పుడు ఫిరాయించాడో తెలియదు. ఆమెరికా ఖండమా! నీ పాత్ర ఇందులో ఎంత?” అని అమెరికా మోజుతో మనిషి పోగుట్టుకున్న అస్తిత్వ నేపథ్యాలను గుర్తు చేస్తాడు. చివరకు తనను కార్లో ఇంటిదగ్గర డ్రాప్ చెయ్యడానికి వచ్చిన మనీష్ నూ అనుమానిస్తాడు. “తను పొరపాటును తాగి ఏమన్నా అన్నానా.. ఆ కోపంతో ఏదన్నా చెయ్యడానికే వస్తున్నాడా!?” అని. వాళ్లిద్దరి మధ్యా జరిగే సంభాషణలో కథకుడి అంతరంగం బహిర్గతమవుతుంది. కథకుడిలాగే అక్కడున్న వాళ్లు ఆలోచిస్తుండొచ్చన్న అభిప్రాయమూ పాఠకులకు చేరుతుంది. పరాయి దేశాలకు అమ్ముకున్న సొంత వ్యక్తిత్వాలు, దాగిన బానిస బతుకుల్లోని నిజాలు అర్థమవుతాయి.

“నా కొక్కటే సమాధానం కావాలి, మీరు చేస్తున్నది పరనిందా, ఆత్మనిందా?”

“నిందా లేదు, గిందా లేదు… ఇక్కడంతా తెల్లాడి బానిసలు. ఈ బతుకులకి సొంత ఆలోచనల్లేవు.. అసలు సొంతబతుకులే లేవు. వీళ్లందరికీ ఆ సంగతి తెలుసు. నటిస్తున్నారంతే, పురుగులు.”

“మీ ఎదుర్కుండా కూర్చున్న వాడు మీలా ఆలోచించట్లేదని మీకెట్లా తెలుసు?”

“చేస్తున్నాడేమో… నాకేం బట్టింది, వాడి ఆలోచన వాడిది”

“మిమ్మల్ని మినహాయించుకుని మిగతా అందర్నీ పురుగుల్ని చేస్తానంటున్నారు.”

“నేను చేసేదేమిటి? ఇక్కడున్నవన్నీ పురుగులే, నేను మీరూ కూడా.. నన్నేమీ మినహాయించుకోలేదు. అది నా నాలుగో బీర్ ఆధారంగా చెప్తున్నాను.” అని వ్యక్తిగతాన్ని అక్కడున్న వాళ్లందకీ ఆపాదించి వాస్తవికతను వెలిగిస్తాడు.

అలా ఆమెరికాలో ఉన్న తనలాంటి వాళ్ల మేధోపాతాళలోకాలను ఉత్తమపురుషలో రావ్ క్యారెక్టర్ లోనే కాదు, ఇతర పాత్రల మాటలు, చేతలు, వ్యక్తిత్వం, వేషాలలో కూడా పరకాయ ప్రవేశం చేసి కథ నడిపిస్తాడు అక్కిరాజు. వ్యంగ్యం ఎక్కువైనా మనిషి దాచేసుకున్న ముఖాలను బాగా చూపిస్తాడు. ప్రతి పాత్ర ముఖంపై ఉన్న మాస్క్ ను తొలగించేస్తాడు. చివరకు తన మాస్క్ కూడా తీసేసి నేను ఓ పురుగునేనని అని ఒప్పేసుకుంటాడు రచయిత.

ఏక సన్నివేశాత్మకమైన ఈ కథ రావ్ కోణం నుంచి నడుస్తుంది. పూర్తిగా చైతన్య స్రవంతి శిల్పంలో ఇమడకపోయినా ఫ్రాయిడ్ థియరీని కొంత వరకు ఫాలో అయిందనే చెప్పాలి. “ఉపేంద్ర” సినిమాలో “నేను” పాత్రలా మనసుకు, నోటికి మధ్య ఉన్న సెన్సార్ కట్ అయిపోయిన పాత్ర రావ్ ది. అందుకు మూడు బీర్లను, ఆ తర్వాత నాలుగో బీర్ ను కారణంగా చూపిస్తాడు రచయిత. ప్రధాన పాత్రతోనే కథంతా నడిపాడు. పైగా అతడి అంతరంగానికి, బహిర్ ప్రవర్తనకు మధ్య స్పష్టమైన రేఖను గీస్తూనే చెరిపేశాడు. ఆలోచనా తరంగాలకు అప్పుడప్పుడు ఫుల్ స్టాప్ పెడుతూనే కొత్త పాత్ర, గ్రూప్ వచ్చినప్పుడల్లా కొత్త కొత్త విషయాలను సరికొత్త విశ్లేషించాడు. అందుకు మార్క్, లారా, ప్రసాద్ పాత్రలను వాడుకున్నాడు. గ్రూపుల్లో అతనితో పాటు పనిచేసే గ్రూప్.. (భారతీయుడు, చైనీయుడు, ముగ్గురు అమెరికన్లు) దాన్లో ప్రధానంగా నారాయణ్ క్యారెక్టర్. రెండో గ్రూప్ అంటరాని భారతీయులు… (దేశీయగాళ్లు). అందులో బెంగాలీయుడు, తెలుగువాడైన ప్రసాద్. చివరిగా మనీష్. తనదైన భావజాలంతో, వ్యవస్థతో రాజీపడని ప్రశ్నాత్మక దృష్టితో ప్రతి పాత్రలో తనను తాను చూసుకున్నాడు కథకుడు. మేధోవలసల బానిసత్వాన్ని అంచనా వేశాడు.

కొన్ని చోట్ల రచయిత చర్చకు పెట్టిన అంశాలను డీకోడ్ చేసి చూడాల్సిందే. ఐటీ రంగం నుంచి మన గ్రామీణ నేపథ్యానికి ఉన్న లింక్ లను పట్టుకోవాల్సిందే. వర్ణనలు, బుకాయింపులు లేని ఈ కథలో వాటికున్న ప్రాధాన్యాన్ని పాఠకుడు పట్టుకోకపోతే కథకు, రచయితకు అన్యాయం జరిగినట్లే..

“ఈ పార్టీలెందుకిస్తారో నాకు బాగానే తెలుసు. మా పాలేళ్లకి ఊడ్పుల రోజుల్లో ప్రతి రోజూ మందు పోయించే వాడు మా తాత. అదే విషయాన్ని ఇక్కడెవడో యూనివర్శిటీ వాడు రిసెర్చి చేసి మరీ చెప్పి వుంటాడు. “అడపా దడపా పార్టీలూ, పిక్నిక్కులూ ఇవ్వడం ద్వారా ఉద్యోగులలో ఉద్యోగము పట్ల ఆసక్తి పెరుగునూ, తద్వారా ఉత్పత్తి పెరుగును. అది లాభసాటి పెట్టుబడి” అనెవడో స్టాటిస్టిక్సుతో సహా ఋజువు చేసేసి ఓ డాక్టరేటు, “పార్టీలు లాభసాటిగా చేయుట ఎట్లు” అనే ప్రొసీజర్ కి ఓ పేటెంటు కూడా నొక్కేసి వుంటాడు.” భూస్వామి సంస్కృతికి, కార్పొరేట్ శక్తుల ఆలోచనల వెనకున్న రహస్యాలకు ఉన్న అవినాభావ సంబంధం ఒక్కటే. పనివాళ్ల నుంచి ఎక్కువ శ్రమ రాబట్టడం, తమ ఉత్పత్తి పెంచుకోవడం. తక్కువ పెట్టుబడితో, తమ కిందివాళ్లను మభ్యపెట్టి లాభాలను పోగేసుకోవడం అన్న ఆలోచన పై మాటల వెనక ఉందనిపిస్తుంది.

“నా ఆలోచనలన్నీ మాటలయి పోతాయి. మాట్లాడొద్దని అనుకున్నా సరే ఏదో శక్తి పట్టి వాగిస్తుంది. కోర్టులో భగవద్గీతల్ని, బైబిళ్లనీ తీసేసి మందు బాటిళ్లని పెట్టాలి. అప్పుడిక లై డిటెక్టర్లు కూడా అక్కర్లేదు” చట్టాన్ని, న్యాయాన్ని మతంతో, మతగ్రంథాలతో ముడిపెట్టడం వెనక మతాన్ని, ఆ భావజాలాన్ని పెంచిపోషించడం మాత్రమే కనిపిస్తుంది. దాంతో నిజాలు దాగి, అసత్యాలు నిజాలై పోతున్నాయి. సాక్ష్యాలు తారుమారై నేరగాళ్లు మంచివాళ్లుగా చెలామణి అవుతున్నారు. కానీ మద్యం అలాకాదు తాగినోడితో నిజాలు చెప్పిస్తుంది. అంతరాంతరాల్లో దాచేసిన దాన్ని కూడా కక్కించేస్తుంది. న్యాయవ్యవస్థమీద విసిరిన అతిపెద్ద సెటైర్ ఇది.

“ఇద్దరం మెల్లిగా బయటకు నడిచాము. పార్కింగ్ లాట్ లో కారు ఎక్కడ పెట్టానో గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను. మా వూరి కంసాలి వాడన్నా లేడు. వాడు అంజనం వేసి చెప్పేవాడు… ఫలానా కాపుగారి గేదె పక్కూరి బందెల దొడ్డిలో వుందని. వాణ్ణే ఇక్కడ పార్కింగ్ లాట్ ముందు గనక కూర్చో బెట్టగలిగితే బ్రహ్మాండమయిన బిజనెస్.” ఇవి నోస్టాల్జియాలా కనిపించినా అంజనం వేసి, పోయిన వస్తువులను, గేదెలను చెప్పే గ్రామీణ సంస్కృతిలోని మూఢనమ్మకాలను గుర్తుచేయడంతో పోల్చి, కార్పొరేట్ ఉద్యోగుల మానసిక స్థాయిని ప్రశ్నించడం ఇక్కడ ప్రధానాంశంగా కనిపినిస్తుంది.

“మీ బోటి ఆఫ్టరాల్ ఏషియా గాళ్లతోటి తింటూ తిరుగుతున్నాను. చూశారా నేనంతటి మంచిదాన్నో అన్నంటుంటాయి. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి మంజుభార్గవిని ఎంతో “దయ” తో వంటగదిలోకి రానిచ్చినట్టు.” శంకరశాస్త్రి ఆమెను మనసుదాకా రానివ్వడు. తనకు అవసరమైన వంటగది వరకే రానిస్తాడు. ఎంతమంది ప్రశ్నించినా వాళ్ల సంబంధం ఏమిటనే దానికి సమాధానం చెప్పడు. అలౌకికమైన భావనల్లోంచే చూడమన్నట్లు, భౌతికంగా కాదన్నట్లు ప్రవర్తిస్తాడు. లారా కూడా ఏషియన్స్ ను అలాగే చూస్తుంది. ఆధిపత్యం తాలూకూ మూలాలను తెంచే ప్రయత్నం చేయకుండా, పైపై ప్రవర్తనతో తననుతాను గొప్పదానిగా ఊహించుకుంటుంది. నమ్మించే ప్రయత్నం చేస్తుంది.

క్లిష్టమైన ఈ కథన పద్ధతిని అర్థం చేసుకోవడం కొంత కష్టమే, ప్రతి వాక్యంలో రచయిత దాచిన సినీవాలీలను వెతికి పట్టుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ప్రశ్నల్లోని సమాధానాలను కనుక్కోవడం అంత సులభం కాదు. గాఢతతో కూడిన శైలి, క్లుప్తత, ఇతివృత్తం పాత్రలను బట్టి భాష వంటివి ఎన్నో కథను ఈ కథను జఠిలం చేశాయి. కానీ వాక్యానికి వాక్యాన్ని, పదానికి పదాన్ని విడగొట్టి, పాత్రల స్వభావాన్ని చెప్పడంలో రచయిత ఎంచుకున్న స్వభావాత్మక దృక్కోణాన్ని అంచనా వేయగలిగితే కథాలోతులను తవ్వొచ్చు. ఒక్క సన్నివేశాన్ని, ఒకేఒక్క పాత్రద్వారా ఆ పాత్రలోని వైరుధ్యాన్ని, భిన్నత్వాన్నే కాకుండా మగిలిన పాత్రల్లోని సంక్లిష్టతను, ద్వంద్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే గొప్ప కథనపద్ధతికి నిదర్శనం ఈ కథ. పైగా వ్యంగ్యం అలంకారమై మెరుస్తుంది. “ఆమె వక్షం ఇవ్వాళ పెద్దదిగా నేల కనపడుచున్నది?”, “ఉద్యోగము పట్ల ఆసక్తి పెరుగును. తద్వారా ఉత్పత్తి పెరుగును”, “నాకేల ఆగోల” లాంటి సరళగ్రాంథిక వాసనలు వేసే పదజాలం అవ్యక్త ప్రేలాపనలకు చిహ్నంగా కనిపిస్తాయి. ఎవర్ని వారు ప్రశ్నించుకుంటూ ద్వైదీభావ ప్రవర్తనలోంచి బయటపడాలంటే ఈ కథ చదవాల్సిందే.

*

“హేనికెన్ ప్లీజ్” కౌంటర్లో నల్లావిడ ఆకుపచ్చ హేనికెన్ బాటిల్ ఓపెన్ చేసి, నాప్కిన్ తో తుడిచి నా ముందుకు తోసింది.

“థాంక్యూ” అంటూ దాన్ని ఆప్యాయంగా చేతిలోకి తీసుకున్నాను. ఆవిడ దాన్ని ఎంత శుభ్రంగా తుడిస్తే మాత్రం ఏం ప్రయోజనం! చల్లటి బాటిల్ మీద మళ్ళీ నీళ్ళు చేర్తున్నాయి.

వాతావరణంలో నీటి ఆవిరి యుండును, మనుషుల్లో ఆశలు ఉండును, మనసుల్లో కొరతలు యుండును , ఇది భౌతిక శాస్త్రం.

“హే రావ్”

“హే మార్క్”

“రావ్, నువ్వు ఈ పార్టీకి రావని చెప్పాడు డేవ్, నిన్నిక్కడ చూడ్డం ఎంతో బాగుంది”

ఏడిశావ్, నీకూ నాకూ అంత స్నేహం లేదని మనిద్దరికీ తెలుసు. రేపో ఎల్లుండో నాతో ఏదో పని కావల్సి వుంటుంది. యమ అర్జెంటుగా ఈ రోజు స్నేహం చేసెయ్యాలని వచ్చుంటావు. ఈ పార్టీకి నే రాక పోయినా నీ కొచ్చే నష్టమేమీ లేదని నాకు తెలుసులే.

“లేదు మార్క్, నేనూ రాననే అనుక్కున్నాను. మాకు రిలీజ్ దగ్గర పడింది కదా, కొంచెం కష్టంగా ఉంటోంది. మధ్యాహ్నం ఎందుకో నెట్వర్క్ డౌన్ అవటంతో అక్కడింక చెయ్యగలిగిందేమీ లేదు, అదీ గాక…”

“ఓ అలాగా ఏమయితేనేం నువ్వు రాగలిగావు, అదే సంతోషం. మళ్ళీ కలుద్దాం”

నా మాటలు పూర్తవక ముందే సంభాషణ అర్థాంతరంగా ముగించి ఎంతో సభ్యతగానే సెలవు తీసుకున్నాడు మార్క్. నే పార్టీలో కనపడినందుకే మహదానంద పడిపోయిన మార్క్. పోనీలే ఇదే నయం. ఇండియాలో అయితే ఇష్టం ఉన్నా లేకపోయినా ఓ గంటా ఇక్కడే ఉండి ఇద్దరికీ విసుగు తెప్పించే వాడు.

మెల్లిగా అక్కణ్ణించి కదిలాను.   దూరంగా మా గ్రూప్ వాళ్ళు కూర్చుని ఉన్నారు.   మరి కొంచెంఒ దూరంలో దేశీ గాళ్ళంతా అంటరాని వాళ్ళలా మరో గుంపుగా కూర్చుని వున్నారు. ఈ రెండిట్లో ఎటు వైపుకు నడిచేది?

అమెరికా వాడి పక్కన కూర్చుని వాడి బెడ్రూం ఎలా పెయింట్ చేశాడో, వాడి కుక్క గాడికి వచ్చిన రోగం ఏమిటో వినడం బాగుంటుందా లేక భారతీయ జనాభా పక్కన కూర్చుని హెచ్ 1   వీసా కోటా పెరిగా అవకాశాల గురించీ, ఫలానా పాండేకి ఫలానా ఇంటర్నెట్ కంపెనీవాడు ఎంత స్టాక్ ఆప్షన్ ఇచ్చిందీ, వాడెంతలో మల్టీ మిలియనీర్ అవబోయేదీ…..   కాదూ కూడదూ అంటే, కొంత మందూ దేశభక్తీ కల్సికట్టుగా ఎక్కువయితే కాసేపు పాకిస్తాన్నీ, తురకాణ్ణీ తిట్టి, మరింకెన్ని న్యూక్లియర్ టెస్టులు చేస్తే ఇండియా అమెరికా అయిపోతుందో చర్చించడమా?

“రావ్”

నేను నా మీమాంసలో ఉండగానే వచ్చింది సుడిగాలిలా లారా. బంగారు రంగు జుట్టు. పచ్చటి శరీరం. ఇండియాలో 3 వ తరగతి పిల్ల కూడా డబ్బంటూ ఉంటే ఇంతకంటే పెద్ద చొక్కా వేసుకుంటుంది.   చిరిగిపోయేలా ఉన్న ఆ ఇరుకైన టీ షర్టు ఆమె స్త్రీత్వాన్ని దాచలేక పోతోంది.         నా పిచ్చి, ఆమె దాచే ప్రయత్నం చేస్తోందని ఎవరు చెప్పారు నాకు?   అసలామె ఎందుకు దాచవలెను? అది సరే గానీ, ఆమె వక్షం ఇవ్వాళ మరింత పెద్దదిగా నేల కనపడుచున్నది?   కొంత నా మూడవ బీర్ ప్రభావమూ, మరికొంత ఆమె వేసుకున్న డిజైనర్ వేర్ మహత్యమూ అయ్యుండొచ్చు.

“ఓ లారా! ఇదేనా రావటం?”

లేదు రావ్, వచ్చి చాలా సేపయింది. రిచ్ తో మాట్లాడుతున్నాను. నీ సంగతేమిటి, పార్టీ మహారంజుగా జరుగుతున్నట్టుంది?”

ఈమె ఇంగ్లీషు ఓ పట్టాన్ అర్థమయి చావదు. వంటిని అటూ ఇటూ వూపి మాట్లాడుతుందేమో, శ్రద్ధగా విందామన్నా సాధ్యమవదు.

“అవును లారా! చాలా కష్టమయిన టైం నాకు. వచ్చేవారం రిలేజేమో, చాలా ఎక్కువ పని చెయ్యాల్సి వస్తోంది. ఈ పార్టీ నిజంగానే మంచి రిలాక్సేషన్ నాకు”

ఈ పార్టీలెందుకిస్తారో నాకు బాగానే తెలుసు. మా పాలేళ్ళకి ఊడ్పుల రోజుల్లో ప్రతిరోజూ మందు పోయించే వాడు మా తాత.   అదే విషయాన్ని ఇక్కడెవడో యూనివర్సిటీ వాడు రిసెర్చి చేసి మరీ చెప్పి వుంటాడు.   “అడపా దడపా పార్టీలూ, పిక్నిక్కులూ ఇవ్వడం ద్వారా ఉద్యోగులలో ఉద్యోగము పట్ల ఆసక్తి పెరుగునూ, తద్వారా ఉత్పత్తి పెరుగును. అది లాభసాటి పెట్టుబడి” అనెవడో స్టాటిస్టిక్సు తో సహా ఋజువు చేసేసి ఓ డాక్టరేటు, “పార్టీలు లాభసాటిగా చేయుట ఎట్లు” అనే ప్రొసీజర్ కి ఓ పేటెంటు కూడా నొక్కేసి వుంటాడు.

“నిజం రావ్! నాక్కూడా కష్టంగానే వుంది. పోనిద్దూ… మీ ఫ్రెండ్ వెంకట్ ని కలిశావా, మొన్ననే ఇండియా నుంచి వచ్చాడు.   తినడానికి ఎన్ని తెచ్చాడనుకున్నావ్…. బాయ్ ఇండియానించి ఎవరేం తెచ్చినా నాకు నచ్చేస్తాయి”

అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా.   ఈమెని చూస్తే నాకో అనుమానం. ఈమె మాట్లడుతుంటే   “చూశారా నేనెంత అందమయిన దాన్ని , ఇన్ని తెలివితేటలున్న దాన్ని, ముఖ్యంగా అమెరికన్ని, అందునా తెల్లటి తెల్లని దాన్ని…. అయినా సరే చూశారా ఏ తేడా చూపించకుండా మీ బోటి ఆఫ్టరాల్ ఏషియా గాళ్ళతోటి తింటూ తిరుగుతున్నాను. చూశారో నేనెంతటి మంచిదాన్నో “   అన్నట్టుంటాయి. శంకరాభరణం శంకరశాస్త్రి మంజుభార్గవిని ఎంతో “దయ” తో వంటగదిలోకి రానిచ్చినట్టు.

“థాంక్స్ లారా! అదంతా నీ అభిమానం. అంత దూరం నించి మేమేం తెచ్చుకున్నా అన్నింటిలోకి మాకిష్టమయినవే కదా తెచ్చుకుంటాం. అందుకే సహజంగా అవ్వన్నీ మంచి రుచికరమైనవే అవుతాయి అంతే”

హమ్మయ్య, “మాడెస్టీ” ని బానే నటించాను. ఇంక ఇక్కడే వుంటే ఆవిడలా ఇండియాని పొగుడుతూనే వుంటుంది, నేనలా నా మాడెస్టీలో ఇరికిపోతూ, సిగ్గు పడుతూ, చిరునవ్వులు నవ్వుతూ… నో, ఇంక నాకు ఓపిక లేదు.

“ఎక్స్యూజ్ మీ లారా!” మాగ్రూప్ వాళ్ళంతా నాకోసం వెతుకుతున్నారు, నువ్వేదో తెచ్చుకోవడానికి వెళ్తున్నట్టున్నావు. అదిగో ఆ స్థంభం పక్కన కూచున్నారు మావాళ్ళంతా, తప్పకుండా వచ్చి కలుస్తావు కదూ?”

హమ్మయ్య బయట పడ్డాను. మెల్లిగా మాగ్రూపున్న వైపుకు కదిలాను. జోరుగా లైవ్ బాండ్ రాక్ సంగీతాన్ని మోగిస్తోంది. ఇలాంటప్పుడే నాక్కొన్ని విచిత్రమైన ఆలోచన్లొస్తుంటాయి. ఇప్పుడు నేవెళ్ళి అకస్మాత్త్తుగా ఘంటసాల భగవద్గీత క్యాసెట్ పెడితే ఎలా వుంటుంది?

మొత్తానికి అలాటి పనేమీ చెయ్యకుండానే మా గ్రూపు వాళ్ళున్న టేబిల్ దగ్గరకు చేరాను. మొత్తం అయిదుగురు కూర్చున్నారక్కడ.   ఒకడు భారతీయుడు, ఒకడు చైనీయుడు, ముగ్గురు అమెరికన్లు (అలియాస్ తెల్లటి అమెరికన్లు).

నేను చేరే టప్పటికి నారాయణ్ ఏదో సీరియస్ గా మాట్లాడేస్తున్నాడు. అందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు… నటిస్తున్నారు.   నేను ఇంతకు ముందు దాకా ఇక్కడే కూర్చుని వెళ్ళానేమో, నా రాకకి వాళ్ళెవ్వరూ పెద్దగా కదల్లేదు. నేను నా కుర్చీలో కూర్చున్నాను.   మా మానేజర్ ఫ్రాంక్ మాత్రం నా రాకని గమనించి, జరుగుతున్న సంభాషణని నాకు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు.

“రావ్, ఏమీలేదు, నారాయణ్ ఇప్పుడే మీ ఇండియా గురించి చెప్తున్నాడు. మీరు స్త్రీలని ఎంతో గౌరవిస్తారనీ, దేవతలుగా కొలుస్తారనీ చెప్తున్నాడు…”

అబ్బా! ఇక్కడా అదే గొడవా. ఎందుకీ వెధవ వాగుడు. ఎప్పుడూ మీరలా, మేమిలా అనుకుంటూ ఎందుకీ న్యూసెన్సు. జాతీయతలూ, రేసులూ (తెగలు), రంగులూ తేడాలే లేవని కబుర్లూ… సందు దొరికితే చాలు మీరిలాగా, మేమిలాగా… అనవసరమైన్ గోల.      వొరే నారాయణ్, ఎప్పుడైనా అమెరికా వాడు “మేమింత గొప్పవాళ్ళం సుమా” అంటం విన్నావురా?   మనమెందుకు ప్రతీ నిమిషం “మేమంత వాళ్ళం, ఇంత వాళ్ళం” అంటూ రభస చెయ్యడం? మనకి మన మీదే నమ్మకం లేదు.   ఇది తెల్లాణ్ణి నమ్మించే ప్రయత్నం కాదు, మనని మనమే నమ్మించుకునే ప్రయత్నం… నో!   నా పర్టీ మూడ్ పాడయి పోతోంది.

“అవును ఫ్రాంక్…. ఆడవాళ్ళనే కదూ… అవును నిజమే… మనుషులుగా మాత్రం చూడం” అన్నాను.

నారాయణ్ మొహం కొద్దిగా రంగు మారినట్టనిపించింది. మరెవరికీ నా మాట సరిగా అర్థం కాలేదనుకుంటాను.   బహుశా “బాడ్ ఇంగ్లీష్” అనుకుని వుంటారు… నాకే మంచిది.

నారాయణ్ అలా మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు చిరాకు పెరిగి పోతోంది. “ఇది పార్టీరా, వీళ్ళెవరికీ నీ వాగుడు మేద ఆసక్తీ లేదు, నమ్మకమూ లేదు” అని చెపాలనుంది.      చెపితే వింటాడూ? వాడేదో నికార్సయిన దేశభక్తుడిలా అంతెత్తు నుండి అధోపాతాళంలో ఉన్న నన్ను చూస్తున్నట్టుగా ఓ చూపు చూస్తాడు. నాకేల ఆగోల…

ఇక్కణ్ణుంచి కదిలి ఆ అంటరాని భారతీయుల్ని కలవటమే బాగుండేలా ఉంది. కనీసం నాలుగు మసాలా సినిమా కబుర్లూ , క్రికెట్ కబుర్లన్నా తెలుస్తాయి.

మాజనాల దగ్గర మెల్లిగా అనుమతి తీసుకుని లేచాను. నా చేతిలో బాటిల్ ఖాళీ అయిందని గమనించాను.

గాలిలో తేలుతున్నట్టుంది నాకు. రెండు గంటల్లో మూడు బాటిళ్ళు… వంటి బరువు సగం తగ్గిపోయినట్టుంది.   ఈ రోజు వెనుతిరిగేది లేదు.   అప్రయత్నంగా కౌంటర్ దగ్గరకెళ్ళి నాలుగో బాటిల్ తెచ్చుకున్నను.   నేరుగా దేశీయుల టేబిల్ దగ్గర చేరాను.   మొత్తం అయిదుగురో ఆరుగురో వున్నారు. లెక్కించే స్థితిలో లేను నేను.          అందులో ఒక జడపదార్థం (జడ వేసుకున్న పదార్థం) కూడా ఉంది.   ఇప్పుడే నేను జాగ్రత్తగా ఉండాల్సింది.   ఒళ్ళు తూలితే పర్లేద్ గానీ, మాట తూలనీయకూడదు.   ఈ మత్తులో గొడవ ఇదే…. నా ఆలోచనలన్నీ మాటలయి పోతాయి. మాట్లాడొద్దని అనుకున్నా సరే ఏదో శక్తి పట్టి వాగిస్తుంది.   కోర్టులో భగవద్గీతల్నీ, బైబిళ్ళనీ తీసేసి మందు బాటిళ్ళని పెట్టాలి. అప్పుడిక లై డిటెక్టర్లు కూడా అక్కర్లేదు.

హలోలు, కైసా హైలూ, హౌ ఆర్యూలూ అయిన తర్వాత కుర్చీలో కూలబడ్డాను.

“నో మాన్! ఇండియన్ మానేజర్ దగ్గర పని చేయలేను.” పాండే.

“ఓ యా, మాగ్రూపులో కూడా దేసీ గాళ్ళు పెరిగి పోతున్నారు… ఇట్సె పయిన్” షర్మ (శర్మ కాదు, షర్మ)

“ఐ హేట్ ఇండియన్స్”

“ఐ హేట్ దట్, ఐ హేట్ దిస్”

అందరూ తమ తమ కారణాలు, భారతీయులను అసహ్యించుకోగలందులకు తెలియజేశారు.   అకస్మాత్తుగా అందరూ నన్ను చూస్తున్నట్టనిపించింది. ఏదో ఒకటి మాట్లాడేయాలి.

“అవునవును, ఈ టేబిల్ మీద లేని ఆ ఫలానా భారతీయులందరూ వెధవలే, ఒప్పుకుంటాను” అన్నాను. ఆన్నాననే అనుకుంటున్నాను. మొహాల్లో ఆరంగలు చూస్తుంటే అనే ఉంటానని పిస్తోంది.   నే చూస్తున్నానను కుంటున్న రంగులు నిజంగా ఆ మొహాల్లోని వేనా?

సంభాషణ సాగిపోతోంది. నా బాటిల్ కరిగి పోతూనే వుంది.

“రేపు శాన్ ఫ్రాన్సిస్కో ఎవరైనా వస్తున్నారా?” ఓ బెంగాలీయుని ప్రశ్న.

“చైనాలో మానవ హక్కుల పునరుద్ధరణకు గాను ఓ ప్రదర్శన వుంది, ఎవరైనా వస్తారేమోనని” బెంగాలుని జవాబు. ఆ జవాబు చెప్పడంలో ఆ మొహంలో తళుక్కున ఓ గంభీర ముద్ర వెలిగింది. నా స్థాయికి మీరంతా రాగలరా అనే అనుమానం ఆ మొహంలో!   ఔరా ఏమి వీని సామాజిక చింతన!

ఈ మనిషే, చదువుకునే వాడికి రాజకీయాలూ, ఇతర గొడవలూ పట్టకూడదని ఐ.ఐ.టి చదువయి అమెరికా వచ్చిందాకా నమ్మినవాడు.   ఈ మనిషికి వెళ్ళేందుకు ఏ సమస్యా, ప్రదర్శనా కనపడినవి కావు భారతంలో.   మరక్కడ ప్రదర్శన అంటే చక్కటి ఫ్రీ టీ షర్టూ, స్పాన్సర్డ్ సోడా (అంటే కోక్ లూ గట్రా అన్న మాట), షార్టుల్లో అమ్మాయిలూ వుండరు కదా.   చెమట కంపూ, పోలీసు లాఠీలే కదా దొరికేవి. ఇంతా చేసి ఓ పర్సెంటు తక్కువ మార్కులు వస్తే, ఆ కంపులోనే జీవితాలు ఏడవాలి. అమెరికా ఎక్కడ దొరికేను.

అయ్యో ఇదంతా నేను గాని బయటకే అనేయట్లేదు కదా? ఎందుకలా అందరూ నా వంకే చూస్తున్నారు? మళ్ళీ ఏదో ఒకటి వాగక తప్పదు.

“లేదు, ఈ సారి ఇరాక్ మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఏదైనా ప్రదర్శన వుంటే చెప్పు…. నాకు మిడిల్ ఈస్టర్న్ (మధ్య తూర్పు) అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టం.

నేనే మన్నా తప్పన్నానా?   జాగ్రత్తగానే మాట్లాడాలనుకున్నా… ఎందుకలా బెంగాలీవాడు అంత కోపంగా లేచెళ్ళి పోతున్నాడూ? ఇక నేనేమీ మాట్లాడాను.

సంభాషణ హైదరాబాద్ ఆటోలా, న్యాయార్క్ క్యాబ్లా అడ్డదిడ్డంగా సాగిపోతోంది. నేను వింటం మానేసి టేబిల్ మీద ర్యాక్ బ్యాండ్ కి అనుగుణంగా తాళం వేస్తున్నాను.

అకస్మాత్తుగా భుజం మీద చెయ్యి పడ్డంతో ఈ లోకం లోకి వచ్చాను…. రాగలిగినంత.          ప్రసాద్, తోటి తెలుగు వాడు, హిందీలో అందరికీ అభివాదం చేసి కూర్చున్నాడు. వాణ్ణి నేను చదువుకునే రోజుల్నుండీ ఎరుగుదును.

వాడికి హల్లో చెప్పేసి నా యోగంలోకి నేవెళ్ళి పోదామనుకున్నాను. ఇంతలో…..

“ఈ సంగతి తెలుసా, బాలమురళి కన్సర్ట్ వచ్చే నెల్లో బే ఏరియాకి వస్తోంది తెలుసా?”         అందర్నీ వుద్దేశించి ప్రసాదు.

నేను ఉలిక్కి పడ్డాను. వీడు బాలమురళి సంగీతం వింటం ఎప్పుడు మొదలు పెట్టాడో నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకూ, విజయశాంతి బొడ్డు గురించి వీడు చేసినంత రెసెర్చి మరెవడూ చేసి వుండడు. వీడా మాస్ టేస్టుల నుండీ క్లాస్ టేస్టులకు ఎప్పుడు ఫిరాయించాడో తెలియదు. అమెరికా ఖండమా!   నీ పాత్ర ఇందులో ఎంత?

ఇంక అక్కడే వుంటే బాలమురళి బొడ్డు గురించి వాడి అభిప్రాయం అడిగేస్తానేమోనని భయం వేసింది. ఇంక ఇంటికి వెళ్ళటమే మర్యాదగా తోస్తోంది.

లేచి ఇక నేను వెళ్తానని చెప్పాను. అందరూ “హమ్మయ్య పీడ విరగడయ్యింది” అనుకుంటున్నారని నా అనుమానం… దొంగ నా కొడుకులు.

లేచి నడవ బోయాను. కొద్దిగా తూలినట్టున్నాను.

“నిజంగా మీరు డ్రైవ్ చెయ్యగలరా? నేను కారు తేలేదు. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, పొద్దున్నే వెళ్ళగల్ను కావాలంటే”

ఎవరదీ? నాకింతటి స్నేహితుడెక్కడున్నాడబ్బా ఈ జనంలో అని చూశాను. అది మనీష్. కొత్తగా బే ఏరియాకి, మా కంపెనీకి వచ్చాడు. ఇతగాడు పెద్దగా మాట్లాడడం నేనింత వరకూ చూసి ఎరగను.

నా ప్రవృత్తికి విరుద్ధమైనా ఎందుకో తెలీదు “సరే” అన్నాను.

ఇద్దరం మెల్లిగా బయటకు నడిచాము. పార్కింగ్ లాట్ లో కారు ఎక్కడ పెట్టానో గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను. మావూరి కంసాలి వాడన్నా లేడు.   వాడు అంజనం వేసి చెప్పేవాడు…. ఫలానా కాపు గారి గేద్ పక్కూరి బందెల దొడ్డిలో వుందని. వాణ్ణే ఇక్కడ పార్కింగ్ లాట్ ముందు గనక కూర్చో బెట్టగలిగితే బ్రహ్మాండమయిన బిజినెస్. వారంలో కనీసం మూడు సార్లన్నా మర్చేపోతాను నేను, కారు ఎక్కడ పెట్టానో. వెతుక్కుంటే గానీ దొరకదు.

మొత్తానికి అంజనం వెయ్యకుండానే కారుని పట్టుకో గలిగాము.   నిర్మొహమాటంగా తాళంచేతులు మనీష్ చేతిలో పెట్టి, కుడి చేతి వపు సీట్ లో కూర్చున్నాను.         తల వెనక్కి వాల్చి, మనీష కారు స్టార్ట్ చెయ్యడం, తనకి తగ్గట్టుగా మిర్రర్స్ ని మార్చుకోవడం చూస్తున్నను.

కారుని మెల్లిగా రివర్స్ చేసి దారిలో పెట్టాడు మనీష్. ఇంత సహాయం చెయ్యడానికి వచ్చిన మనిషి, పెద్దగా స్నేహం కూడా లేని మనిషి, ఇంత సేపటిలోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారు చిన్న రోడ్లు దాటి ఫ్రీ వే మీదకు చేరింది.

“రావు గారూ! మీరు నిద్ర గానీ పోవట్లేదు కదా?” నా ఆలోచన పసిగట్టినట్టుగా వచ్చింది ప్రశ్న. అదీ తెలుగులో!

“చెప్పండి మనీష్, మీరు తెలుగు వారనుకోలేదు నేను”

“తెలుగుదేశాన్ పెరిగిన కారణాన తెలుగు వాణ్ణి నేను. అందుకే అంత అదృష్టం నాకు. మీ ఇంగ్లీషు గొణుగుళ్ళతో పాటు తెలుగు గొణుగుళ్ళు కూడా అర్థమయ్యాయి నాకు”

ఇతగాడి మీద గానీ నా తిక్క ప్రయోగించ లేదు కద? ఆ కక్ష తోనే వస్తున్నాడా ఈ పెద్ద మనిషి?

“మరేం పర్లేదు లెండి. నేను మీ జోలికి గానీ, మీరు నా జోలిక్ గానీ రాలేదు… ఇంత వరకూ”

బ్రతుకు జీవుడా అనుకున్నాను. చూడబోతే ఈ పెద్ద మనిషి నన్నేదో ఇరుకున పెట్టాడానికి బయల్దేరినట్టుంది.

“అవును సుమండీ, మీరు పెద్దగా మాట్లాడ్డమే చూసి ఎరగను” అన్నాన్నేను.

“అది సరే రావు గారూ, ఒక్క సంగతి చెప్పండి, ఎందుకు మీరలా కావాలని తెలిసి తెలిసి అందర్నీ కించపరుస్తారు?”

“నేనెవర్నీ కించపర్చలేదు, సూటిగా మాట్లాడాను అంతే”

“అని మభ్య పెట్టుకోకండి, నా కొక్కటే సమాధానం కావాలి, మీరు చేస్తున్నది పరనిందా, ఆత్మనిందా?”

“నిందా లేదు, గిందాలేదు… ఇక్కడంతా తెల్లాడి బానిసలు.   ఈ బతుకులకి సొంత ఆలోచనల్లేవు… అసలు సొంత బతుకులే లేవు. వీళ్ళందరికీ ఆ సంగతి తెలుసు. నటిస్తున్నారంతే, పురుగులు “

“హల్లో, హల్లో … మళ్ళీ మీ ధోరణిలోకి పోకండి…   మీ ఎదుర్గుండా కూర్చున్న వాడు మీలా ఆలోచించట్లేదని మేకెట్లా తెలుసు?”

“చేస్తున్నాడేమో… నాకేం బట్టింది, వాడి ఆలోచన వాడిది”

“మిమ్మల్ని మినహాయించుకుని మిగతా అందర్నీ పురుగుల్ని చేసేస్తానంటారు”

“నేను చేసేదేమిటి? ఇక్కడున్నవన్నీ పురుగులే, నేనూ మీరూ కూడా…. నన్నేమీ మినహాయించుకోలేదు.”

“ఈ సంగతి మీ ఒక్కళ్ళకే తెలుసనీ, ఎదుర్గుండా వాడు ఇటువంటి ఆలోచన కూడా చెయ్యట్లేదనీ   ఏ ఆధారంగా చెప్తున్నారు?”

“నాలుగో బీర్ సార్… అది నా నాలుగో బీర్ ఆధారంగా చెప్తున్నాను.   అదిగో ఆ వచ్చే ఎగ్జిట్టే మీరు తీసుకోవాల్సింది.

*

ఎ.రవీంద్రబాబు

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Raveendra babu,

    Except one story about 9/11, all the other stories are just crap, out of 5, I will give rating for 1. The story which is related to 9/11 will get 3/5. Not sure, what did you like about this crap. Putting the random thoughts, which are just do not make any sense, does not even have any interesting element is not called Progressiveness, that is called crap.

  • కథలోని పాత్రల ద్వారా మనసు పొరల్లో నిగూఢమైన వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసాడు రచయిత. రవీంద్రబాబు గారు కథకు ఉపయుక్తమైన నిర్మాణపద్ధతులను విడమరిచి చర్చించటం ద్వారా మరింతగా కథాగమనం ఆకట్టుకుంది. కథలో వాడిన టెక్నిక్స్ పాఠకుల మనసుపై ముద్రవేస్తుంది.

  • I thoroughly enjoyed it. In short, th writer try expose – manishi Jeevan vidaanni, alochana dorarani ee chinna sandarbham aadharam aviskariche prayatnam bagudni. It’s impressive as the writer contextualise various things in small story. Adhi Mandy yokka madhuraanu bhoothi tho koodina goppadanam emo. We vishleshananu athyantha hrudyam ga samgrahinchina Ravindra Babu gaariki naa abhinandanalu.

    • I thoroughly enjoyed it. In short, the writer try to expose – manishi Jeevan vidaanni, alochana dorarani ee chinna sandarbham aadharam ga aviskarinche prayatnam abhinandaneeyam. It’s impressive as the writer contextualise various things in small story. Adhi Mandyam yokka madhuraanu bhoothi tho koodina goppadanam emo! Ee vishleshananu athyantha hrudyam ga samgrahinchina Ravindra Babu gaariki naa abhinandanalu.

  • Hi sir!
    Oka సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పుడుడున్న మనిషి తత్వాన్ని మరియు మానసిక దుర్భలత్వాన్ని బాగా ఆవిష్కరించారు…ఇది altogether new zenre la anipistundundi….
    Dr Ravinndrababu gari vidheshana Chala బావుంది నిజానికి ఆయన విశ్లేషణ ద్వారా ఇది బాగా అవగతమైది
    రచయితకు అభినందనలు

  • రవీంద్రా …
    అక్కిరాజు భట్టిప్రోలు ‘మూడు బీర్ల తర్వాత’ కథని ఎన్నిక చేసుకోవడంలో సాహిత్యం పట్ల, సమాజాన్ని మీరు చూసే దృక్పథం పట్ల మీ పరిణతి ఎంత ఉన్నతమో తెలుస్తోంది. అభినందనలు.
    నో డౌట్‌, శిల్ప పరంగా అక్కిరాజు కథల్లో ఈ కథ ప్రత్యేకమైనదే!
    ‘నేను’ పాత్ర ద్వారా సమాజం పట్ల అతడి నిక్కచ్చితనం, లోకంలోని అవకాశవాదం, మనుషుల్లోని ఊసరవిల్లితనం వంటివన్నీ కుండ బద్ధలుకొట్టినట్టు చెప్పించినా, పరోక్షంగా అవన్నీ రచయిత ఆత్మను పట్టిచ్చేవే. అంటే, ఒకరకంగా రచయిత తనకు తనను కథ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడని అర్థం.
    అయితే, మీరు కథని అంతలా సాగదీసి విశ్లేషించాల్సిన అవసరం లేదు. దాదాపు కథ నిడివి మించిపోయింది. మీ విశ్లేషణ చదివి ఆనక కథ చదివితే ఒకే కథని రెండుసార్లు వెంటవెంటనే చదివినట్టుంది. పాఠకుడి సహనానికి ఇదొక పరీక్ష. కథలో మీకు నచ్చిన అతి ముఖ్యమైన అంశాలను మాత్రమే తీసుకుని క్లుప్తంగా, కూలంకషంగా విశ్లేషిస్తే వెంటనే కథ చదవాలనే ఆకిస్తి రేకెత్తించినవారవుతారు. కథంతా మీరే చెప్పేస్తే కథలో చదవడానికి ఇంకేం మిగల్దు. ఇకముందదు అలా రాసే ప్రయత్నం చేయగలరని మనవి. పరిచయానికి మీరు చేసుకునే కథల ఎంపిక మాత్ర అభినందనీయం.

  • రవీంద్ర బాబు సర్…
    మీరు కథలోకి నడిపించిన తీరు అద్భుతం! విడమరిచి చెప్పడం వల్ల ఆ కథను చదవకుండా ఉండలేక పోయాను… globalisation is nothing but the Americaisation! Everything has been destroying due to globalisation.. ఇది అందరికి తెలియాల్సిన విషయం! రచయితకు, రవీంద్ర బాబు సర్ కి అభినందనలు💐💐

  • ఆల్కహాల్ ప్రభావంలో ఉన్నప్పుడు, లోపలి పొరల్లో దాగున్న ఆలోచనలు బయటకి వస్తాయనీ, అదే మనిషి అసలు వ్యక్తిత్వమనీ, అవే 90% మంది మగవారి ఆలోచనలనీ అందరికీ ఆపాదించగానే ప్రోగ్రెసివ్ కథ అవుతుందా?
    నిజం చెప్పాలంటే, ఈ మధ్య ఇలాంటి కథలు చదివాక, వాస్తవంలో మగవారి ఆలోచన విధానం- పర్వర్టెడ్ థింకింగ్ ఇంత సహజమా? అని బెంగగా ఉంటుంది?
    హద్దులు లేకపోవటం, ఆడవారిపై ఆబ్జెక్టివ్ కామెంట్లు ఇవే సహజాలా? ఆలోచనలకి, నోరుకీ సభ్యత లాంటి ఫిల్టర్లు లేకపోవటం ప్రోగ్రెసివ్ కాదు. వెనుకబాటుతనం. ఇవే సహజం, ఈ ఆలోచనాధోరణి సహజం అని సవ్యంగా ఉన్నవారి ఆలోచనలని కూడా పాడుచేసే ఇలాంటి ప్రేలాపన కథలని ఆకాశానికి ఎత్తేయటం సబబుగానైతే లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు