తెలుగు యువ కథకులలో విలక్షణ కథకుడిగా పేరు తెచ్చుకున్నారు చరణ్ పరిమి. చిత్రకారుడిగా ఖ్యాతిని, రచయితగా ప్రఖ్యతినీ అందుకుంటూ తన ప్రతిభ చాటుతున్నారు. గతేడాది వెలువరించిన ఆయన తొలి కథాసంపుటి ‘కేరాఫ్ బావర్చీ’ పాఠకుల మన్నన పొందింది. 2024 సంవత్సరానికిగానూ ఆయనకు ‘డాక్టర్ వి.చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం’ ప్రకటించారు. ఈ సందర్భంగా సారంగతో ఆయన పంచుకున్న విశేషాలివీ..
- నమస్తే చరణ్! ‘డాక్టర్ వి.చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం’ అందుకోబోతున్న మీకు ముందుగా శుభాకాంక్షలు. అవార్డు ప్రకటించిన విషయం తెలియగానే మీలో కలిగిన భావనలేమిటి?
థ్యాంక్యూ! ఈ అవార్డు నాకు ప్రకటించినందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పటికైనా ఈ అవార్డు అందుకోగలననే నమ్మకం నాలో ఉంది. ఇప్పుడు రావడంతో కొంత థ్రిల్లింగ్‌గా ఫీలయ్యాను. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినవారికి, నా తొలి కథాసంపుటి ప్రచురించిన ఆన్వీక్షికి పబ్లిషర్స్ నిర్వాహకులు మహి బెజవాడ, వెంకట్ శిద్దారెడ్డి గారికి, ముందుమాట రాసిన అరిపిరాల సత్యప్రసాద్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా నా కథలు చదివిన పాఠకులందరికీ ధన్యవాదాలు.
- వి.చంద్రశేఖరరావు గారి గురించి మీ మాటల్లో చెప్పండి.
నేను వి.చంద్రశేఖరరావు గారిని ఎప్పుడూ కలవలేదు. నిజానికి ఆయన చనిపోయాకే ఆయన గురించి తెలుసుకున్నాను. కథల్లో ఆయన వాడిన మేజిక్ రియలిజం విధానం, ఆయన సర్రియలిస్టిక్ వ్యక్తీకరణలు, ఆ ఇమేజరీలు.. అవన్నీ నాకు నచ్చాయి. కొన్ని ఆలోచనలను బలంగా చెప్పడానికి సర్రియల్ స్టైల్ ఎంచుకున్నారు. ఆయనతో పోల్చుకోవడం కాదు కానీ నా కథలు ‘ఎ డే డ్రీమ్’,‘అన్ఆర్టిస్ట్ బయోగ్రఫీ’, ‘వెదుకులాట’ లాంటి కథల్లో అలాంటి ప్రయోగాలే చేశాను. ఆయన కథల గురించి ఎంత చెప్పినా తక్కువే! ‘ఆమె నలభై అయిదవ పుట్టినరోజు’ కథే తీసుకో! కథ మొత్తం వెనక్కి ప్రయాణించడం. పూర్ణ 45వ పుట్టినరోజుతో మొదలై 20 ఏళ్ల వయసు దాకా సాగుతుంది. సాహిత్యంలో క్రిస్టోఫర్ నోలన్ ప్రయోగంలా అనిపిస్తుందది. ఆమెకి వచ్చే కలలే మనకు కథ చెబుతాయి. ‘డ్రీమ్ ఈజ్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది లైఫ్’ అని బెన్ వోక్రి అనే నైజీరియన్ కవి చెప్పినట్టు చంద్రశేఖరరావు గారు ‘కలల మనిషి’ అనే కథలో రాశారు. ఇది చదివాక మళ్ళీ ఆయన కథలు పరిశీలించి చూస్తే అప్పుడు ఆ ఇమేజరీ ఇంకాస్త బాగా చిక్కింది. ఆయన కథలు చదవడం ఒక గొప్ప అనుభవం.
- అవార్డులనేవి రచయితల ప్రయాణానికి ఎలా దోహదపడతాయని మీ అభిప్రాయం?
నా వరకూ అవార్డులనేవి రచయితలకిచ్చే అలర్ట్ లాంటిది. నీ పనిని నువ్వు మరింత సీరియస్‌గా తీసుకోవాలి, మరింత బాగా రాయాలి అని చెప్పేందుకు ఇచ్చేవే అవార్డులు. ఏ కళాకారుడికైనా తాను చేసిన పనికి గుర్తింపు రావడం ఆనందమే! అవార్డులు ఆ గుర్తింపును అందిస్తాయి.
- గతేడాది మీ పుస్తకం విడుదలైంది. పుస్తకం రాకముందు, వచ్చిన తర్వాత మీ రచనా శైలిలో ఏమైనా మార్పులు వచ్చాయా?
పుస్తకం రాకముందు నా కథల్లో ప్రయోగాలు ఎక్కువ ఉండేవి. శైలి, శిల్పం, కథావస్తువు.. ఏదో ఒక దాంట్లో తప్పకుండా కొత్తగా, వ్యత్యాసంగా రాయాలని అనిపించేది. పుస్తకం వచ్చిన తర్వాత రాసిన కథలు సూటిగా పాఠకులకు చేరేలా రాశాను. గతంలో ఒకే తరహా కథా వస్తువులు ఎంచుకొని రాశాను. ప్రస్తుతం కొత్త విషయాలపై కథలు రాసే ప్రయత్నం చేస్తున్నాను.
- అవార్డులు సరే, ఒక కథకుడిగా జనాల నుంచి ఎలాంటి గుర్తింపు కోరుకుంటున్నారు?
జనాలు నన్ను ఇలాగే గుర్తించాలన్న ఆలోచన లేదు. వాళ్లు నా కథలు గుర్తిస్తే చాలు! అన్ని రకాల కథలూ రాశాడన్న విధంగా నన్ను గుర్తుంచుకుంటే చాలు. కథకుడిగా నాకు నచ్చిన కథలు నేను రాశాను. వాటిని పాఠకుల వరకూ చేర్చడమే నా పని.
- సాహిత్యంలో మీ తర్వాతి కార్యాచరణ ఏంటి?
దళితవాదం, ఇతర సామాజిక అంశాల నేపథ్యంలో నేను రాసిన కథలతో త్వరలో నా రెండో కథా సంపుటి రాబోతుంది. మరిన్ని కథలు రాసేందుకు సిద్ధంగా ఉన్నాను.
*
డాక్టర్ వి. చంద్ర శేఖర్ రావు నా అభిమాన కథకుడు, ఆయన కథల్లోని గ్లూమినెస్, గచ్చకాయరంగులో వుండే హైద్రాబాద్ వాతావరణం, విఫల విప్లవ జీవితాలు, డిప్రెస్డ్ లైఫ్ అనుభవిస్తాము.
మనం కథ చదువుతామా ? అయన కథ రాసేడా ?
కాదు ,ఆయన కథా నైరూప్య చిత్రంలో ఎర్రటి , నీలపు రంగుల్లో చిక్కుకుని విలవిల్లాడుతాము. ప్రతి కథా ఒక వైవిధమైనదే, మోహనా మోహనా నా అభిమాన కథ, వేసవి కాలం ఎండల్లో తారు రోడ్డు పక్కన చెప్పుల్లేకుండా నడిచి నట్లుండే కథ.
అభినందనలు చరణ్.