అవసరమైన చర్య కోసం

మంటో మెరుపు కథలు

దాడి జరిగిన వెంటనే పొరుగున వున్న మైనారిటీ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు  చంపబడ్డారు, కొందరు ప్రాణాలు దక్కించుకొని పారిపోగలిగారు. ఒక వ్యక్తి ఆయన భార్య మాత్రం ఎలాగో వారి  యింటి భూగ్రుహంలో సురక్షితంగా దాక్కోగలిగారు.

ఎప్పుడైనా దొరికిపోతామేమో అన్న భయంతో రెండు రాత్రులు వారు అక్కడే గడిపారు.

ఇంకొక రెండు రాత్రులు గడిచిన తరువాత, చావు భయం మెల్లగా తగ్గిపోయి ఆకలి బాధలు ఎక్కువయ్యాయి.

ఇంకొక నాలుగు రాత్రులు అలా గడిచాక, చచ్చినా బ్రతికినా ఒకటే  అన్న స్థితికి చేరుకున్నాక దాక్కుని వున్న ప్రదేశం నుంచి ఇద్దరూ బయటకు వచ్చేశారు.

తమ యింటిని ఆక్రమించుకున్న కొత్త వారితో ఎదురుపడి వినిపించనంత నీరసమైన గొంతుతో “మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం‌. దయచేసి మమ్మల్ని చంపేయండి” అన్నారు.

“మా మతం మమ్మల్ని ఎవరినీ చంపడానికి అనుమతించదు” అని వాళ్ళన్నారు.

ప్రాణం వున్న ప్రతీ జీవినీ ఆదరించే జైన మతానికి చెందిన వారు వాళ్ళు.

పరస్పర సంప్రదింపులు జరుపుకున్న తరువాత ‌ జైనేతర మతానికి చెందిన  ఇరుగు పొరుగు వారి చేతుల్లో ఆ భార్యాభర్తలు “అవసరమైన చర్య కోసం” అప్పగించబడ్డారు. 

 

ముందు జాగ్రత్త ఏర్పాట్లు

మొదటి ఘటన వీధి చివర వున్న చిన్న హోటలు ముందు  జరిగింది. వెంటనే ఓ సెంట్రీకి అక్కడ డ్యూటీ వేశారు.

మరుసటి రోజు సాయంత్రం రెండవ ఘటన మొదటి ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే వున్న ఓ స్థానిక కిరాణా దుకాణం వద్ద జరిగింది. ఆ సెంట్రీ డ్యూటీ కొత్తగా ఘటన జరిగిన ప్రదేశానికి తరలించారు.

మూడవ ఘటన అర్దరాత్రి సరిగ్గా ఒక లాండ్రీ దుకాణం ముందు జరిగింది.

హత్య జరిగిన ప్రదేశంలో రక్షణగా నిలుచోమని ఆ సెంట్రీకి ఆదేశం యివ్వబడింది. “ఏ ప్రదేశంలోనైనా ఇంకొక ఘటన జరిగేలోపు ఎప్పుడైనా నాకు డ్యూటీ వేస్తారా సార్ ?” అని ఆ సెంట్రీ అడిగాడు.

 

బుద్ధిలేనివాడు

అతడి ఆత్మహత్యపై వ్యాఖ్యానిస్తూ, అతడి స్నేహితుల్లో ఒకడు యిలా అన్నాడు ” ఎంత బుద్ధిలేని వాడు ! బలవంతంగా గెడ్డం గొరిగేసి, పొడుగ్గా  పెరిగిన జుట్టంతా కత్తిరించేసినంత మాత్రాన్న నువ్వు సిఖ్ఖువి కాకుండా పోవు.

“నీ ముఖాన్ని తలనీలాలు పెరుగుతో ప్రతీరోజూ మర్ధన చేసుకో” , సలహా కూడా యిచ్చాను “గురు క్రుప వుంటే నీ జుట్టు ఏడాదిలోపు పెరిగుతుందనీ ఇంక ఆ తర్వాత ఎవ్వరూ తేడా గుర్తించలేరనీ”.

*

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరు మాంటో కధలు తెలుగులోకి తెచ్చి మంచిపని చేస్తున్నారు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు