అల్కాపురి గార్డెన్స్ లో…  ఢాం

అవును, జీవితమంతా కష్టపడి కట్టిన ఇల్లు ఇప్పుడు దేవస్థానం గొడవలో వుంది. అని ఆయన తనలో తాను మధన పడి పోవడం మొదలుపెట్టారు.

శీతాకాలం చీకటి, సింగిల్ రోడ్డు.

ఒకటే పొగమంచు.

ఊరంతా  టచ్ మీ నాట్ మొక్కలు.

ఎక్కువగా తుమ్మ చెట్లు.

దూరాన సింహాల్లాంటి కొండలు.

రాత్రి ఎనిమిదికి సద్దుమణిగిపోయే కాలం.

జనం అక్కడా..అక్కడా ఇల్లు కట్టుకొని వున్నారు.

కాలనీలన్నిటికీ వేసిన మట్టిరోడ్లలో  రాళ్లు పైకితేలి వున్నాయి.

వాటి పక్కన వాక మొక్కలు , వాటి ఎర్రటి, నల్లటి పండ్లతో.

కొన్ని వీధిలైట్లు వెలుగుతున్నాయి.. చాలా చోట్ల చీకటి.

ఖాళీగా వున్న ఇళ్లస్థలాలో వర్షం నీరు చేరి అందులోని కప్పలు ఈ ప్రపంచమంతా మాదే అన్నంత గోల చేస్తున్నాయి.

ఈ లోగా ‘ డాం ….డాం..’ అని తుపాకీ పేలిన చప్పుడు.

* * *

బొబ్బర వాని పాలెంలో మిరప మొక్కలకు సింహాచలం నుంచి వొస్తున్న గెడ్డ నీళ్లు పారించి. మందుకొట్టేసి పాటలు పాడుతున్న  బంబు ‘ డాం ….డాం..’ అన్న శబ్దానికి ఒక్క నిముషం మత్తు వొదిలించుకొని అలా ఉండి పోయి, ఆకాశం వైపు చూసాడు.

అందమైన స్వచ్ఛమైన, నక్షత్రాలు , సప్తర్షిమండలం స్పష్టంగా కనిపిస్తున్న ఆకాశం.

” తుపాకీ శబదం ఇనిపించింది.. యాడనించిరా గుంటా ?” అడిగాడు బంబు అక్కడే ఆ ముందున్న స్మశానం గోతులకాడ తచ్చాడుతున్న బొబ్బర అరసింహాన్ని.

” అది కుందేలు వేటగాళ్లదేమో మాయ్యా ” అన్నాడాడు సింహాచలం కొండలవైపు చూస్తూ.

” ఒరే .. అర బుర్ర నా కొడకా… ఆళ్ళెందుకు కాలుస్తార్రా..లైటువేస్తే అయ్యే వొచ్చి వొళ్ళో పడతాయి, ఇది వేరే.. ”

” మరయితే.. ”

ఇద్దరూ మొక మొకాలు చూసుకున్నారు.

* * *

”ఒరేయ్ ఆ ముసలయ్యని పిలుచుకురా అక్కడ గేదెలు కాస్తుంటాడు ”అన్నారు పురుషోత్తపురం రాజు గారు.

వేపగుంటలో మొదలైన  డవునికి బస్సులు చాలా వేగంగా  పురుషోత్తపురం బస్టాపులో ఆగకుండా పాపయ్యరాజుపాలెం వైపు దూసుకుపోతున్నాయి తుపాకీ గొట్టం లాగా.

పురుషోత్తపురం రోడ్డవతల పొలాల్లో గేదెలు కాసుకుంటున్న ముసలయ్య ప్రశాంతంగా వొచ్చి రాజు గారు పెట్టమన్న చోట సంతకం పెట్టాడు.

” ఇదిగో బాబూ నీ క్యాస్ట్ సర్టిఫికట్ పై సంతకం, వీఆర్వోను కలిసి ఆ తర్వాత ఎమ్మార్వో ఆఫీసులో ఇవ్వు ” అని కాలనీ నుంచి వొచ్చిన ఆ కుర్రాడికి వివరంగా చెప్పి ఆ కాగితం ఇచ్చే రు రాజుగారు.

” అవునురా ముసలయ్యా.. రాత్రి అల్కాపురి గార్డెన్స్ నుంచి తుపాకీ శబ్దం వినిపించింది అంటున్నారు , నువ్వేమైనా విన్నావా ?

” నానూ  విన్నాను రాజుగారు, కానీ అది నిజమా కాదా ? సరిగా విన్నాణ లేదా అనే అనుమానంలో పడిపోంను”  అన్నాడు ముసలయ్య.

“అల్కాపురి ఓళ్ళతో గొప్ప సీకాకు కదండీ బాబూ, మా గేదలోపాలి ఆళ్ళ ఇళ్ల దగ్గరలో కెళ్లాయని.. సెడా పుర్రాకులు తినిపించేసారండి, నానప్పడినుంచి చాలా జాగర్తకుంటాను ఆల్లతో  ” అని చుట్ట ముట్టించుకుని చేతిలో కర్రతో జాయిగా రోడ్డు దాటుకుని వెళ్ళిపోయాడు ఆ సర్పంచ్ ముసిలయ్య.

” ఏటో..ఊర్లోనే ఉంటాము గానీ అన్ని విషయాలు మనకు బోధపడవు..తెలీవు ” అని మధనపడుతూ సిగరెట్టొకటి ముట్టించారు రాజు గారు.

ఆ పాత కటకటాల పెంకుటింటి ముందు కూర్చున్నాయన రోడ్డు వంక చూస్తూ సిగరెట్టు పూర్తయ్యాక ఇంటి లోపలికెళ్ళిపోయారు.

* * *

“వొరేరేయ్ ఇక్కడాపు..” అన్నాడు పెంటకోట కోదండం.

” ఇక్కడ పోసీ మంటావా పర్లేదా? ” అన్నాడు కంచరపాలెం నుంచి వొచ్చిన ఆళ్ళన్నయ్య వాసు.

” పోనీ ఇక్కడ బాత్రూం కట్టిస్తాను, అప్పటి వరకు ఆపుకో అన్నియ ”

” నీకు రాంరానూ వెటకారం మా లావు అయిపోతాంధ్రా గుంటా ” అని అక్కడ నిలుచున్నాడో లేదో …డు..డు..డు..అని బులెట్ సౌండ్.

” ఏయ్ ..ఎవడ్రా ఇక్కడ ?”

పోయడానికి రెడీ అవుతున్న వాడల్లా ఆ మాటకి పక్కకి తిరిగి చూసాడు.

” ఏం.. ఇది నీ ప్లేసా..మదుం దగ్గర కదా పోస్తున్నాను ”

ఆదాటున.. ఆ భారీ మనిషి బులెట్ దిగి.. “నా కొడకా..కోడ్తె  మళ్ళీ ” అని కొట్టడానికి వొచ్చాడు.

“ఇది మా దారి.. మా ఇంటికెళ్లి దారి…ఈ దారిలో ఎవడన్నా కనపడ్డాడో.. గుద్దల తన్నేస్తాను ” అన్నాడతను.

” ఏదీ తన్ను చూద్దారి.. ” అన్నాడు వాసు.

వెంటనే విషయం గ్రహించి తేరుకున్న కోదండ ” ..సర్సార్ ..మా వాడికి తెలీదు, వూరినించి వొచ్చాడు.. నే చెపుతాలే..మీరెళ్ళండన్నా” అన్నాడు గౌరవపూర్వకంగా.

అతను వెనక్కి వెళ్లి బులెట్ స్టాండు వేసి, అక్కడే నడుము మీద చేతులు వేసుకొని నిలబడ్డాడు.

” వాసన్నియ్యా.. పదా  తొందరగా..” అని  తన హీరో హొండా  బండి స్టార్ట్ చేసి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు.

” వొరేరేయ్.. ఆపరా  తమ్ముడూ ఏట్రా ఆడి గోరోజనం ?”  అన్నాడు కంచరపాలెం వాసు.

బండి అలాగే రోడ్డు పక్క పాన్ షాపు దగ్గర ఆపాక, ఇద్దరూ చెరో చిన్ని సైజు గోల్డ్ ఫ్లేక్ లు ముట్టించారు.

” ఒరేయ్..ఆళ్ళు పెద్ద కులపోల్లు, ఆ స్థలాలన్నీ  ఆళ్ళవే. ఆ మట్టిబాట వెంట వెళితే లోపలెక్కడో వుంటాది ఆళ్ళ ఇల్లు, అదో పెద్ద బంగాళా అంటారు..నేనూ చూడలేదనుకో..పాత్రుళ్ళ కుర్రాడు చెబితే వినడమే ”

“ఒరేయ్..ఎంటీరామారావు ముఖ్యమంత్రి అయ్యాక వీళ్లంతా ఈ యెర్ర భూములవైపు వొచ్చేసారు, ఎకరాలెకరాలు  కొన్నారు.  కోళ్లఫారాలు పెట్టారు, రెడ్లు కూడా వొచ్చారనుకో, అసలు మనూరికి కోళ్లఫారాలు అని పేరు ఆ తరువాత కాలనీ పేరు పెట్టారు”

కోదండ చెప్పింది వింటంలేదు, ఇందాక జరిగిందే ఆలోచిస్తున్నాడు వాసు.

“ఈ భూములు మనవి , మన  పెద్దోళ్ళకు వ్యాపారాలు చేతకాక ఇలా తగలెట్టేసుకున్నారు, మనమూ కోళ్లఫారం పెట్టాము ఎందుకూ, సగం జబ్బొచ్చి చచ్చిపోయాయి, మిగతావి మనం వొందుకు తినేసాం ” అన్నాడు నిష్టూరంగా” చేతిలో సిగరెట్టు అలా వెలుగుతూ ఉండగానే.

” వారి నాయనో.. ఈ భూములు మనవేంట్రా అన్నియ్య.. ఇవి రాజులవి.. ఆళ్ళ నుంచి బ్రాహ్మలకిచ్చారు, అల్లు చూసుకోలేక తోటలన్నీ రెల్లీలకిచ్చేసారు, మిగతావి తూరుపు కాపులకి, వెల మోళ్ళకి అయినకాడికి అమ్మీసారు, ఇపుడు భూమున్నోడే రాజు, ఆ డికాడ భూముంది, కులంతో పనిలేకుండా ఆడు రాజు, అందుకే ఆడు రంకెలేశాడు, మనకాడ లేదు, కొద్దిగుంది..అందుకే ఇలా దమ్ముకొడుతున్నాం”అని గాల్లోకి పొగొదిలాడు.

ఎలా గుంది నా ఫిలాసఫీ, అనలైజేషన్ అన్నట్టు వాసు వైపు చూసాడు.

” ఏడిసినట్టుంది..పదా, ఆడికి డబ్బుతో వొళ్ళు కొవ్వెక్కింది, మనకు డబ్బులేక కొవ్వు కరిగిపోతోంది ” అన్నాడు.

ఆల్లు మంచోళ్ళేనన్నియ్యా..స్టేట్ ఫుట్బాల్ ప్లేయర్లు..చాలామంది కుర్రోళ్ళకి ఫుట్బాల్ కిట్లు ఇచ్చారు, మరి ఆళ్ళ లోకం ఆళ్ళది.

“అన్నట్టు నిన్న తుపాకీ గుండు శబ్దం వొచ్చింది అన్నారు, ఎక్కడ్రా? కొంపదీసి ఈల్ల కొంపలోంచా” ఒక రకమైన ఆనందంతో అడిగాడు వాసు.

కోదండ ఏం మాట్లాడలేదు.

ఇద్దరూ రోడ్డుకి అటూ ఇటూ తాటిచెట్లతో చీకటిగున్న ఆ దారిలో బండి వెలుగులో ముందుకెళ్ళిపోయారు.

* * *

” రాత్రి తుపాకీ గుండు శబ్దం మీకువినిపించిందా?” అన్నారు ఆకుల నాగేశ్వరరావు గారు, బెవర రాంభద్రరావు గారితో.

“వినిపించింది… అప్పుడే పుస్తకం చదివి వూర్లో మిత్రుడికి ఒక వుత్తరం రాస్తున్నాను”

” ఎక్కడనుంచి వొచ్చిందంటారు ?”

” అదే తెలీటం లేదు… ”

” పొద్దుట పాలు పోసే వాడు చెప్పాడు.. ఆ శబ్దం అలకాపురి గార్డెన్స్ నుంచి వొచ్చిందని.. ”

“సరే అక్కడ కుటుంబాలు ఉన్నాయా ? ఆ లోపల ఆళ్ళకి పాలు, నీళ్లు..ఎలాగో ఏంటో..అసలు ఈ మగాళ్లని తప్ప ఆళ్ళ మనుషుల్ని   ఎవరూ చూసినట్టు ఇప్పటివరకూ ఎవరూ చెప్పగా వినలేదు.”

” సర్లే అదలా ఉంచండి.. గవర్నమెంటు మనమీద పేల్చిన తుపాకి సంగతి చూడండి.. ఊర్ల నుంచి.. మట్టి పిసుక్కునే కుటుంబాల  వొచ్చాము.. ఏదో భగవంతుడి దయవల్ల గవర్నమెంటు వుద్యోగం వొచ్చింది…సుఖవంతమైన ఇల్లు కట్టుకుందామని  మంచి స్థలమని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము.. ఇప్పుడీ ఇల్లు దేవస్థానం స్థలంలో కట్టాము, కూల్చేస్తాము అంటున్నారు .. ఈ తుపాకీ సంగతి చూడండి ” అని అన్నారు బెవర రాంభద్రరావు.

మల్లేశ్వరరావు గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.

అవును, జీవితమంతా కష్టపడి కట్టిన ఇల్లు ఇప్పుడు దేవస్థానం గొడవలో వుంది. అని ఆయన తనలో తాను మధన పడి పోవడం మొదలుపెట్టారు.

కాసేపటికి స్వాగతంలో అనుకున్నట్టు “రాజులు దేవస్థానానికి రాసేరు, దళారీలు మోసం చేసి లే అవుట్లు వేసి తమకి అంటగట్టారు, ఇల్లు కట్టే వరకూ ఎవరూ కిక్కురు మానలేదు. ఇలా ఒకటా రెండా వందల కుటుంబాలు కట్టేసుకున్నాయి.. ఆ తరువాత తీరిగ్గా వొచ్చి.. ఇది దేవస్థానం భూమి అని నిద్రపట్టకుండా చేసేరు.. సింహాద్రి అప్పన్న.. నీ కిది న్యాయమా తండ్రీ అంటే అయన శిలలా కూర్చుండి పొయ్యాడు. “  అన్నాడు.

పంచగ్రామాల భూసమస్య మెడకు చుట్టుకుంది, ఇవి దేవస్థానం భూములు అంటే తాము ఇల్లు కడతామా ఇక్కడ, ఏదో రైతుల దగ్గర కొని కట్టేసాము, దానికి ఏదో ఒక పరిష్కారం చూపించాలి కదా ?

ఈ లోగా వీరభద్ర రావు గారు లేచి ‘వుండండి.. టీ పట్టుకొస్తాను ” అని లోపలికెళ్లారు.

* * *

కొన్నాళ్ళకి పెందుర్తి మీద పెద్ద తుపాకులు పేలాయి, సింగల్ రోడ్డు కాస్తా నాలుగు రోడ్ల మెట్రో రోడ్డు అయిపొయింది, రోడ్డు పక్కనున్న వందల తాటిచెట్లు తలలు వాల్చేశాయి.

మర్రిచెట్లు నేలకొరిగిపోయాయి. వాటిమీద వున్న పక్షులు ఎగిరిపోయాయి, నగరంలో వున్న పక్షులు పెందుర్తి కాలనీలల్లో  కాంక్రీట్ ఇల్లు కట్టుకొని వేలాదిగా వాలిపోయాయి.

గెడ్డలన్నీ కప్పడిపోయాయి.

ఎక్కడ ఉందో ఎలా ఉంటాదో తెలియని అలకాపురి గార్డెన్స్ ఇల్లు గురుంచి, ఆ మనుషుల గురుంచి అందరూ మరిచిపోయారు.

చుట్టూ కొండలమధ్య, తోటలమధ్య కావలా కుక్కలతో రాజుల్లా దర్పంతో వున్న అలకాపురి కుటుంబం, తమ ప్రయివసీకి భంగం కలుగుతోందని నగరంలోకి వెళ్లి మంచి అపార్టుమెంటులో వుంటున్నారని,వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకున్నారని, జనజీవనంలో కలిసి పోయారని పూర్వపు పెందుర్తి జనాలు అనుకుంటుంటారు.

ఏదైనా ఒక ప్రత్యేకమైన కుటుంబం ఆ తోటల మధ్య ఉండి…పెరుగుతోన్న వూరు,  వాళ్ళమీదకు రాగానే ఇన్నాళ్లు ప్రజలకు దూరంగా వున్నవాళ్లు నగర జనంలోకి వెళ్లిపోయారు. బహుశా అక్కకూడా వాళ్లెవరో ఏంటో ఎవరికీ తెలీదేమో.

అయితే ఆ తుపాకీ ఎందుకు పేలిందో.. ఏం జరిగిందో.. జనం మాట్లుడుకునే దాంట్లో నిజమెంతో పురుషోత్తపురంలో సిమెంటు తో చేసిన మరిడిమాంబ తల్లి విగ్రహానికే తెలియాలి.

*

హరివెంకట రమణ

రచయిత కుదురుగా ఓకే చోట పనిచేస్తే ఎలా ? అందుకే పత్రికా రంగం లో మొదలయ్యి యానిమేషన్ లో పనిచేసి తరువాత యెన్. జీ. ఓ రంగంలో పిల్లల హక్కులు, విద్య,సంరక్షణ అంశాలపై పనిచేస్తున్నాను. చదువేమో తెలుగు, సోషల్ వర్క్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్సు.
'బర్మాకేంపు కథలు '( ఈ మధ్యే పుస్తకం గా వొచ్చింది ) ఇంకా స్కూలు అనుభవాలు ' మా బడి కథలు ' గా వొచ్చేయి మరో పదిహేను కథలు పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. పాతికేళ్లుగా వ్యంగ్య రాజకీయ చిత్రకారుడిగా ఫ్రీలాన్సరుగా ఉంటూ మూడు కార్టూను పుస్తకాలు ప్రసవించాను. ( హరి కార్టూన్లు, జగమేమాయ, ఇదీలోకం)

భారత ప్రభుత్వ యువజన అవార్డు 2012 లో అందుకుని, 2022 లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై మానవ అక్రమరవాణా అంశంపై అధ్యయన యాత్రకు నెలరోజుల పాటు పర్యటించిన నేను పత్రికల్లో విద్య, బాలల అంశాలపై వ్యాసాలు కూడా రాస్తుంటాను.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ‘అల్కాపురి గార్డెన్స్ లో… డాం’ కధ ఆసక్తి గా సాగింది.పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఒక్కప్పుడు జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని కధగా మలిచిన, చదివింప చేసిన రచయిత అభినందనీయులు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు