We confess our little faults to persuade people that we have no large ones.
– Francois de La Rochefoucauld
1
మనం కలిసిన మొదట్లో అనుకుంటా – సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవనని చెప్పావు.
నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒక పుస్తకం చదివాను. పేరు గుర్తులేదు. జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా? గెలవడం ఎలా? ఎవరితోనైనా స్నేహం చేయడం ఎలా? ఇలాంటి టైటిల్ ఏదో ఉన్న పుస్తకం. అందులో చెప్పిన ఒక విషయం ఒకటి నాకు బాగా నచ్చింది. ఏదైనా సమస్య మనల్ని పట్టివదలకుండా ఉన్నప్పుడు, ఆ సమస్య ద్వారా మనం ఎదుర్కొంటున్న మానసిక స్థితిని ఒక పేపర్లో రాసిపెట్టి ఎక్కడైనా బధ్రంగా దాచిపెట్టాలి. కొన్ని వారాల తర్వాత మనం మళ్లీ ఆ పేపర్‌ని తెరిచి చూసుకుంటే, మనం అంతకుముందు ఆ సమస్య గురించి పడిన బాధంతా ఎంతో చిన్నదిగా కనిపించి మనమే నవ్వేసుకుంటామని ఆ పుస్తకంలో చదువుకున్నాను.
నా ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏం చేసినా ఆ బాధ తీరేలా అనిపించలేదు. మగాళ్లకి చాలా ఈజీ. గడ్డం పెంచుకుని, సిగెరెట్టు, మందు తాగుతూ దేవదాసు ముసుగు వేసుకోవచ్చు. ఆడవాళ్లకి అలాంటి వేషాలు నప్పవు. అందుకే నా బాధంతా ఒక పేపర్లో రాసిపెట్టి, పుస్తకంలో చెప్పినట్టే కొన్ని వారాల తర్వాత తీసి చూశాను. నా బాధ ఏ మాత్రం తగ్గకపోగా, ఆ పేపర్లో రాసింది చదివాక నా బాధ ఇంకా ఎక్కువయింది.
మనం ఎదుర్కొంటున్న బాధలు శాశ్వతం కాదు. అవి చాలా వరకూ తాత్కాలికం అని నువ్వన్నావు.
అవును చాలా మందికి అవి తాత్కాలికమే కావొచ్చు. కానీ నేను చాలామందిలో ఒకదాన్ని కాదేమో. నువ్వు కష్టాలే పడాలి అని దేవుడు నా తలమీద రాసి నన్ను పుట్టించాడేమో! బహుశా, నేను అందరికంటే స్పెషల్ అయ్యుండొచ్చు కదా!
2
ఒక సాయంత్రం పూట కోవలం బీచ్ లో సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్నాం. ఇద్దరి చేతిలో పుస్తకాలు. ఎవరి పుస్తకం వారు చదువుకుంటున్నాం.
నేను చదువుతున్న పుస్తకాన్ని హఠాత్తుగా మూసేసి, నాకు ఉద్యోగం మానెయ్యాలనుంది అన్నాను. సరే అన్నాడు.
అంత ఈజీగా ఒప్పుకుంటాడనుకోలేదు. తర్వాత ఏం చేస్తావు అని కూడా అడగలేదు. నాకు మళ్లీ యాక్టింగ్ ట్రై చెయ్యాలనుంది అన్నాను.
సమాధానం చెప్పలేదు. పుస్తకం కిందకు దించి నా వైపు చూసి నవ్వి మళ్లీ పుస్తకం చదవడంలో బిజీ అయిపోయాడు.
యాక్టింగ్ ఒక్కటే కాదు. రాయాలని కూడా ఉంది అన్నాను. అతను మళ్లీ నా వైపు చూసాడు నవ్వుతూ.
నా ఎక్స్పీరియస్సెస్ అన్నీ రాస్తే అన్నా కెరెనీనా కంటే పెద్ద నవల అవుతుంది. రాయగలననే నమ్మకం కూడా కలుగుతోంది. బ్లాగ్ లో రాస్తున్నాను కదా ఈ మధ్యనే. చాలా కామెంట్స్ వస్తున్నాయి. హైదారాబాద్ వెళ్లగానే సీరియస్ గా రాయడం స్టార్ట్ చేస్తాను.
పుస్తకం మూసేసి పక్కన పెట్టాడు. నువ్వు రాయగలవు. యాక్టింగ్ చెయ్యగలవు. ఇంకా చాలా చెయ్యగలవు. యు ఆర్ రియల్లీ స్పెషల్. కానీ జాబ్ చేస్తూనే ట్రై చెయ్యొచ్చుగా. ఫ్రీ టైంలో రాస్తూ ట్రై చేస్తే, రాయాలనే ఆలోచనని ఎన్నిరోజులు కొనసాగించగలవో నీకే అర్థమవుతుంది. అలాగే షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చెయ్యొచ్చు.
లేదు. నాకు ఏం కావాలో నాకర్థమైంది. రైటింగ్ విల్ హెల్ప్ మీ. రోజూ ఏదో బరువు మోస్తున్నట్టుంది. దాన్నంతా నేను ఇంట్రెస్టింగ్‌గా పేపర్ మీద పెట్టగలను అనిపిస్తుంది. యాక్టింగ్ కూడా ట్రై చేస్తాను. హీరోయిన్ రోల్సే అవసరం లేదు. ఎప్పుడో ఒక సినిమాలో హీరోయిన్ గా చేశానని జీవితాంతం హీరోయిన్ గా ఉండిపోవాలని నాకు లేదు.
ఏం మాట్లాడకుండా నా వైపు చూస్తున్నాడు.
నేను చెప్తుంది నీకు అర్థం కాదు లే! నా కథ నేను రాయాలి. నేను మళ్లీ యాక్టింగ్ చేయాలి. లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది.
ఒక్కో టైంలో అందరికీ ఇలాగే అనిపిస్తుంది. మనకి జరిగింది ఇంకెవరకీ జరగలేదనుకుంటాం. వియ్ థింక్ వియ్ ఆర్ స్పెషల్. కానీ చదివే వాళ్లకి అది నీ కథో ఇంకెవరి కథో సంబంధం లేదు. వాళ్లకి చదవడానికి ఇంట్రస్టింగ్ గా ఉండే కథ కావాలి. మన కథే మనం రాసుకుంటే మనకి ఇంట్రస్టింగ్‌గా ఉండొచ్చు. చదివే వాళ్లకి అది ఇంట్రస్టింగ్‌గా అనిపించాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ గురించి నేను చెప్పనక్కర్లేదు. అక్కడ నువ్వు ఫేస్ చేసిన కష్టాలేంటో నీకే తెలుసు. సో నీ ఇష్టం. నేను ఆపను. కానీ చూస్తూ చూస్తూ నువ్వు కష్టపడడం కూడా చూడలేను.
షేక్స్పియర్ ఏమన్నాడు? Life is a tale, told by an idiot, full of sound and fury. Signifying nothig. నువ్వే కదా ఈ కోట్ నాకు చూపించావు. నువ్వు నన్ను ఇడియట్ అనుకున్నా ఫర్వాలేదు. ఈ కథ నేను రాసి తీరుతాను. మే బీ ఆ కథని సినిమాగా తీస్తే నేనే యాక్ట్ చేస్తానేమో!
స్టార్ట్ చెయ్యి అయితే అని మళ్లీ పుస్తకం తీశాడు.
థాంక్యూ అని అతని భుజం మీద తల వాల్చాను.
3
నిన్ను కలిసిన మొదటి రాత్రే నేను నీ భుజం మీద తలపెట్టి పడుకున్నాను. గుర్తుందా?
ఆ రోజు నేను అసలు పార్టీకి వచ్చుండాల్సింది కాదు. నా ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఒకమ్మాయిని కలవడానికి కెఫేకి వెళ్లాను. నాకు ఆ అమ్మాయితో పెద్దగా పరిచయం లేదు. కానీ ఎందుకో నన్ను కలవాలని అడిగింది. పరిచయం లేని వారితో నేను అంత ఈజీగా కలవను. కానీ ఆ అమ్మాయి ఫోన్ చేసి అడిగినప్పుడు ఎందుకో కలవాలనిపించింది.
ఆ అమ్మాయి ఒక సూపర్ మార్కెట్లో పని చేస్తుంది. అక్కడ పనిచేసే మేనేజర్తో ప్రేమలో పడింది. ఒక రోజు ఆ అమ్మాయిని తన రూంకి తీసుకెళ్లాడు. కూల్ డ్రింక్ అని చెప్పి ఏదో కలిపి ఆ అమ్మాయికిచ్చాడు. చాలా సేపటి తర్వాత లేచి చూసుకుంటే బ్లీడింగ్ అవుతోంది. బయట హాల్లో ఆ మేనేజర్ తో పాటు ఇంకిద్దరు కూడా పడుకుని ఉన్నారు. ఏడుస్తూ అర్థరాత్రి పూట ఆరు కిలోమీటర్లు నడుచుకుని తన రూంకి వచ్చేసింది. ఆ రోజు నుంచి నెలరోజులు ఎక్కడికీ బయటకు వెళ్లలేదు.
మొదటిసారి నన్ను కలవాలని బయటకొచ్చింది. ఇందిరా పార్క్‌కి వస్తానంది. దగ్గర్లో ఉన్న కెఫేలో కలిసి తను చెప్పిందంతా విన్నాను. హైదరాబాద్‌లో ఉద్యోగం అని చెప్పి ఇంట్లో వాళ్లతో పోట్లాడి వచ్చింది. ఇది జరిగిన తర్వాత ఇంటికెళ్లి వాళ్లు చెప్పినట్టుగా పెళ్లి చేసుకోడానికి సిద్ధమైంది. ఇదంతా ఎవరికైనా చెప్పుకోవాలని నాకు ఫోన్ చేసింది.
ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు ఆమె నా కథలో ఒక పాత్రలా పనికొస్తుందా అని ఆలోచించానా నేను? అందుకేనేమో అంత విషాదం విన్న తర్వాత కూడా ఆ రోజు పెద్ద ఆలోచించకుండా రాత్రి పార్టీకి వచ్చాను. కానీ పార్టీ మధ్యలో మగాళ్లెవరో అమ్మాయిల గురించి చీప్ జోకులేస్తుంటే – అప్పుడు తగిలిగింది నాకు. ప్రపంచంలో ఎక్కడో దగ్గర ఏదో ఒక మూల ఎవరో ఒక అమ్మాయి ఆ క్షణంలో మగవాడి బలం కింద నలిగిపోతుంది అని, ఎవరో సుత్తితో గట్టిగా కొట్టినట్టు నా మనసుకి తగిలింది.
ఆడవాళ్ల జీవితం ఎప్పుడూ ఒక ఎడ్జ్ మీద ఉంటుంది. ఇలా తోసేస్తే అలా పడిపోయేలా! నేను ఎంత ధైర్యంగా అయినా ఉండొచ్చు. ప్రపంచాన్ని ఎదిరించవచ్చు. కానీ అడుగడుగునా మాకు డేంజర్ సిగ్నల్సే.
మార్గరెట్ అట్వుడ్ అంటుంది: తమని చూసి ఆడవాళ్లు నవ్వుకుంటారేమోనని మగవాళ్ళు భయపడ్తుంటారు. తమని మగవాళ్లు చంపేస్తారేమోనని ఆడవాళ్లు భయపడ్తుంటారు.
ఆ రోజు ఎంత ఏడ్చానో నేను. బహుశా పుట్టగానే పిల్లలు ఏడుస్తారు చూడు. అలా ఏడ్చాను. నేనెందుకలా ఏడుస్తున్నానో ఎవరికీ అర్థం కాలేదు ఆ రోజు. నీకు తప్ప.
ఆ రాత్రి నువ్వు నా పక్కన లేకుంటే నేనేమైపోయేదాన్నో.
4
ప్రేమ ఒక ఉచ్చు. దాన్ని అందరూ అర్థం చేసుకునేలా మనం అర్థం చేసుకోకూడదు. అందుకే మనం ప్రేమలో పడొద్దు. ప్రేమని అర్థం చేసుకుందాం, అన్నాడు అతను.
ఎలా అయితేనేం ప్రేమించుకుందాం అంటావు, అంతేగా అన్నాను.
నవ్వాడతను.
నేను నిన్ను ఇంప్రెస్ చెయ్యడానికి చెప్పడం లేదు. నిజంగానే నాకు ప్రేమ గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. ప్రేమంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సహసంబధం. ఎన్నో అసమానతలకు కారణమైన స్వార్థం అనే సిద్ధాంతాన్ని ప్రేమ సవాలు చేస్తుంది. కానీ అదే ప్రేమ పెళ్లి వరకూ దారితీయగానే మార్కెట్ శక్తులు వారి జీవితాన్ని నియంత్రిస్తాయి. ఇల్లు కొనాలి. డబ్బులు కావాలి. కార్ కొనాలి. లోన్ కావాలి. ఇవన్నీ సాధించుకునే క్రమంలో ప్రేమ మాయమవుతుంది. ఎందుకంటే ప్రేమ శాశ్వతం కాదు. ఇట్స్ ఏ పాసింగ్ క్లౌడ్. కానీ మనం దాన్ని చూసి ఆకాశమనుకుంటాం. అదే సమస్యంతా. ఇది లవర్స్ మధ్య ఉండే ప్రేమ గురించే కాదు. తల్లీ బిడ్డల మధ్య ఉండే ప్రేమ గురించి కూడా. తల్లి ఎటువంటి లాభాపేక్ష లేకుండా పిల్లల్ని పాలిచ్చి పెంచుతుంది. అందులో ప్రేమ తప్ప మరేమీ ఉండదు. కానీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవగానే మార్కెట్ డిమాండ్లకు లొంగాల్సిండే. శ్రమించాలి. కష్టపడాలి. డబ్బులు సంపాదించాలి. అలా చెయ్యకపోతే ఆ తల్లి కూడా అతన్ని క్షమించదు. క్యాపిటలిస్ట్ మార్కెట్లో అతన్ని కార్మికుణ్ణి చేస్తుంది. సో నేను చెప్పేదేంటంటే ప్రేమ ఉంది, కానీ దాన్ని తన లాభాల కోసం ఉన్నది లేనట్టుగా చిత్రీకరిస్తుంది క్యాపిటలిజమ్.
ప్రేమని ఇలాంటి ఒక కోణంలో చూడడం నాకు అదే మొదటిసారి.
అతనితో నడవడం ఇష్టం, అతని మాటలు వినడం ఇంకా ఇష్టం. ఎలాంటి టైంలో అయినా అతను పిలిస్తే వెంటనే వెళ్లి కలిసేదాన్ని. నన్నేమైనా చేస్తాడేమోననే భయమే లేకుండా. ఒక రోజు, పద మనమెక్కడికైనా వెళ్దాం అన్నాడు. ఎక్కడికెళ్తున్నామో కూడా చెప్పలేదు.
షిల్లాంగ్ లో ఫ్లైట్ దిగ్గానే చాలా ఎక్సైట్ అయ్యాను. మనం చిరపుంజి వెళ్తున్నామని చెప్పగానే ఇంకా ఎక్సైట్ అయ్యాను. అత్యధిక వర్షపాతం కలిగిన ప్రదేశంగా చిన్నప్పుడు స్కూల్లో చదువుకోవడం తప్పితే ఎప్పుడూ అక్కడికి వెళ్తానని అనుకోలేదు. షిల్లాంగ్ నుంచి చిరపుంజికి వెళ్లే దారి మొత్తం పొడవైన పైన్ చెట్లతో కప్పివేయబడ్డ దట్టమైన అడవులు. ఆ అదవులపై నిరంతరంగా తేలియాడుతున్న పొగమంచు. కారు కిటీకీలోంచి తల బయటకు పెట్టి ఆ స్వచ్ఛమైన గాలుల్ని పీల్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ప్రకృతి సౌందర్యం మధ్యలో నేను మళ్లీ చిన్నపిల్లనైపోయాను. నేను మళ్లీ ఇలాంటి ఆనందాన్ని ఇంకెప్పుడైనా పొందగలనా అని ఏద్చేశాను.
మనం ఇలాంటి ప్రదేశాలు ఇంకా చాలా చూడాలి. లెట్స్ ఎక్స్‌ప్లోర్ అన్నాడు.
సరేనని తలూపి అతన్ని కౌగలించుకున్నాను.
5
నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతావని ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లి, ప్రేమ – ఇలాంటి పదాలకు నువ్విచ్చే డెఫినిషన్స్, వాటి వెనుక నువ్వు చెప్పే థియరీలు విని నాకెప్పుడూ ఒక అనుమానం ఉండేది. ఎన్ని రోజులు మనిద్దరం ఇలానే ఉండగలం. సొసైటీ కోసమే ఈ పద్ధతులన్నీ అని నాకూ తెలుసు. ఇలాంటి పద్ధతులన్నింటికీ నువ్వు వ్యతిరేకం అని కూడా తెలుసు. కానీ, నాకంటే ముందే నువ్వే పెళ్లి మాటెత్తావు.నేను సంతోషంగానే ఒప్పుకున్నాను.
సమాజం యొక్క ప్రత్యేక అవసరాలకు సరిపోయేలా, మనుషుల ఆలోచనలను ఇరుకైన ఆకృతుల్లో ఇరికించడానికే పెళ్లి, కుటుంబం అనే వ్యవస్థల్ని మనమీద రుద్దుతుందని నువ్వే చెప్పావు. కానీ ఫస్ట్ నైట్ సంగతేంటి? ఇది కూడా సమాజం సృష్టించిన ఒక పద్ధతే కదా అని పెళ్లైన రాత్రి నిన్ను ఏడిపించాను గుర్తుందా? అది వేరే ఇది వేరే అన్నావు నువ్వు.
ఆ రాత్రి గుర్తుందా? రాత్రంతా కరెంట్ లేదు, కొత్తింట్లో రాత్రంతా దోమలు మనల్ని నిద్రపోనీలేదు.
మన పెళ్లికి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, గుర్తుందా? అతనికి దోమల గురించి ఒక థియరీ ఉండేది. ఒకప్పుడు ఇన్ని దోమలు ఉండేవి కాదు. ఈ మస్కిటో కాయిల్స్ తయారు చేసేవాళ్లే కొత్త రకం దోమల్ని తీసుకొచ్చి మనమీద వదిలారని కొత్త థియరీ చెప్పాడు అతను. అన్నింటికీ ఒక కాన్స్పిరసీ థియరీ ఉండేది అతనికి. నేను అతన్ని ప్రేమించడం వెనుక కూడా ఏదో ఒక కాన్స్పిరసీ ఉందని పారనాయిడ్ గా ఫీల్ అయ్యేవాడు.
కానీ నువ్వలా కాదు. నన్ను ఎప్పుడూ జడ్జ్ చెయ్యలేదు. నా ఇష్టమొచ్చినట్టు ఉండనిచ్చేవాడివి. నా ఫ్రెండ్స్ అందరికీ నీ గురించి గొప్పగా చెప్పుకునేదాన్ని. నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టమే. ఇప్పటికి కూడా!
మొదట్లో నిన్ను కలిసినప్పుడు నాకు పీరియడ్స్ వచ్చిన ప్రతిసారీ మైగ్రేన్ వచ్చేది. తలనుంచి కాలి వరకూ ఎడమవైపంతా ఒకటే నొప్పి. నేను మంచం మీద పడుకుని ఉంటే నా దగ్గరే కూర్చుని తల నిమురుతూ నేను నిద్రపోయేవరకూ ఉండిపోయేవాడివి. లేదు కన్నా, పోతుంది నాన్నా, అని నా బాదని పోగొట్టే ప్రయత్నం చేసేవాడివి. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులకి నొప్పి పోయింది. ఎందుకో తెలియదు. బాధ పోవడం బావుంది. కానీ అది లేకపోవడం ఒక కొత్త ఫీలింగ్. ఎప్పుడూ మన మీద జోకులేస్తూ, మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుండే మన ఫ్రెండ్ ఎవరో మనల్ని వదిలేసి వెళ్లిన ఫీలింగ్.
6
మాది చాలా చిన్న పల్లెటూరు. మా పేరెంట్స్ పెద్దగా చదువుకోలేదు. వాళ్లకి నా గురించి, నా ఆలోచనల గురించీ ఏమీ తెలియదు. నేను చాలా చిన్నప్పట్నుంచే ఇండిపెండెంట్ గా బతకడం నేర్చుకున్నాను. కానీ మా పేరెంట్స్, అందరి పేరెంట్స్ లాగే నా మీద హక్కుతో ప్రవర్తించేవాళ్లు. అది నాకు నచ్చదు. అందుకే కొంచెం వాళ్లకి దూరంగా ఉంటాను. కానీ వాళ్లు అలా ఎప్పుడూ అనుకోలేదు. నా మీద నాలుగువైపుల నుంచీ ప్రేమని, బాధ్యతని, బరువుని, ఫిర్యాదుల్నీ సమానంగా మోపారు. ఒక్కోసారి ఈ భారాన్ని నేను మోయలేననే అనిపించేది. కానీ కొన్ని తప్పవేమో ఈ జీవితానికి.
అతనిలో నాకిష్టమైన విషయం ఇదే. అతని నిజాయితీ. మొదటి సారి కలిసినప్పుడే అతని గురించి మొత్తం చెప్పేశాడు. జీవితం పట్ల ఇంత క్లారిటీ ఉన్న వ్యక్తి నాకు ఎప్పటికీ అర్థం కాడనుకున్నాను. కానీ వాళ్ల అమ్మని కలిసాక జీవితం పట్ల, జీవితం మనకేమిస్తుంది, జీవితం నుంచి మనమేం పొందాలనే విషయం పట్ల అంత క్లారిటీ ఉన్న వ్యక్తిని నేనెప్పుడూ కలవననే విషయం నాకర్థమైంది.
మా వాడికి ఎప్పుడూ ప్రేమ పిచ్చి. చిన్నప్పుడు చాకలికి బట్టలేస్తుంటే వీడి జేబులో ఎవరికో రాసిన ప్రేమ లేఖ దొరికింది. అప్పట్నుంచే నాకు డౌట్ వీడి మీద. అందుకే వీడెక్కడ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడో అని భయపడి మంచి కట్నం వచ్చే సంబంధాలు చూసిపెట్టాం. కానీ వాడు మా మాట వినలేదు. నిన్నే పెళ్లి చేసుకుంటానని మొండికేశాడు. మాదేం పోయిందమ్మా? మీ జీవితం మీ ఇష్టం. కట్నమొస్తే సుఖంగా బతుకుతాడనుకున్నాం. మీ ఇంట్లో వాళ్లు ఎలాగూ కట్నం ఇవ్వరు. ఇప్పుడీ ఇరుకింట్లోనే మీ సంసారం మొదలుపెట్టాలి. అవసరమా ఈ కష్టాలన్నీ?
పెళ్లయిన తర్వాత ఆరు నెలలకి మొదటిసారి మా ఇంటికొచ్చిన అత్తగారు చెప్పిన మాటలు.
మా అత్తగారి మొహంలో ఫీలింగ్సే ఉండవు. అన్నీ మేటర్ ఆఫ్ ఫాక్ట్ లా చెప్పేస్తారు. వాటిని డీకోడ్ చెయ్యడం నావల్ల అయ్యేది కాదు. మంచి అని ఒకటుంటుంది. చెడు అని ఇంకోటుంటుంది. కానీ న్యూట్రల్ నాకెప్పటికీ అర్థం కాదు. మావాడంటే నాకు అసలు ఇష్టం లేదు. వాడికేం తక్కువ చేశాం. కష్టపడి మట్టిపిసికి వాడిని చదివించాం, అనేది మా అత్తగారు. విత్ ఏ బ్లాంక్ ఫేస్. ఆవిడకన్నా అసంతృప్తులైన మరో వ్యక్తిని నేను చూడలేదు. అగైన్ విత్ ఏ బ్లాంక్ ఫేస్.
Most people do not really want freedom, because freedom involves responsibility, and most people are frightened of responsibility అని ఫ్రాయిడ్ చెప్పిన విషయం నాకు చాలా రోజులు అర్థం కాలేదు, నేను నా పాటికేదో జీవితాన్ని గడిపేస్తున్నానా! ఇంతలో అతను వచ్చాడు. అతనితో ఒక కుటుంబమే వచ్చి నా జీవితంలో పిడుగులా పడింది. ఎప్పటికీ నిరుత్సాహంగా, నిర్జీవంగా మాట్లాడే మా అత్తగారి మొహంలో సంతోషం చూడ్డానికేమో నేను కడుపు తెచ్చుకున్నాను.
మాదేముందమ్మా! ఒక పిల్లనో పిల్లాడినో కనిస్తే మేము సంతోషంగా ఉంటామని మా అత్తగారు అన్నప్పుడు, నేనేం కోల్పోతున్నానో నాకర్థం కాలేదు. బ్లాంకెట్ స్టేట్మెంట్స్ నాకు నచ్చవు. స్త్రీ యే స్త్రీకి శత్రువు అంటారు. నాకు ఆ మాట నమ్మాలని లేదు. కానీ మా అత్తగారిని కలిసినప్పుడల్లా, ఆ మాట ఎవరు చెప్పారో కానీ వచ్చి ముందు నిల్చుంటే సాష్టాంగ ప్రణామం చెయ్యాలనిపించేది.
మా అత్తగారు వెళ్లిపోయాక ఇదే విషయం అతనితో చెప్పాను. కోపంగా చూశాడు. కొంచెం సేపు మౌనంగా అటూ ఇటూ తిరిగాడు. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. సమస్యలని పట్టించుకోకుండా చేయడానికి సమాజం మనకి ఇలాంటి కొత్త వ్యాల్యూ సిస్టం ని సృష్టించి మనల్ని కూడా దాంతో ఏకీభవించేలా చేస్తుంది. అత్త విలన్. కోడలు మంచిది. బాస్ వేస్ట్ ఫెలో. పనిచేసేవాడు హీరో. పేదవాడు మంచి వాడు, డబ్బున్న వాడు చెడ్డవాడు. ఇలా ఒక కొత్త డెఫినిషన్ని అన్ని విధాలుగా మన మీద రుద్దడానికి చేసే ప్రయత్నం ఇది. టివిల్లో సినిమాల్లో ఇలాంటి విషయాల్ని పదే పదే చూపించడం వల్ల జనాలు ఇవన్నీ నిజమని నమ్మేశారు. ఇప్పుడున్న పరిస్థుతుల్లో జనాల్ని ఉత్తేజపరచడం కష్టం. ఉత్సాహం, ఉత్తేజంలేని జనాలతో సమాజాన్ని మార్చడం కష్టం. గాంధీ ఉప్పు సత్యాగ్రహం అంటే దేశం అతని వెంట నడిచింది. విదేశీ వస్తు బహిష్కరణ అనగానే జనాలు ఆయన మాట విన్నారు. వీటివల్ల ఏం జరుగుతుందనే అనుమానం ఆ రోజుల్లో ఎవరికీ లేదు. ఇట్ వాజ్ ఏ వాయిస్ ఆఫ్ డిసెంట్. అటువంటి అసమ్మతిని ప్రకటించే కాలం కాదు ఇది, అని చెప్పాడు.
అప్పట్నుంచీ ఎప్పుడూ మా అత్తగారి గురించి అతనితో మాట్లాడలేదు.
7
నీ మీద నాకు చాలా కోపముంటుంది. కానీ నీమీద నాకు చాలా గౌరవం కూడా ఉంటుంది. ఆ గౌరవం కోపాన్ని కప్పేస్తుంది ఒక్కోసారి. నీ మీద గౌరవం ఎందుకంటే నువ్వు చాలా సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉంటావు. అది నాకు నచ్చుతుంది.
ఇప్పుడు ఇక్కడ అందరికీ అన్నీ కావాలి. చిన్నవో, పెద్దవో స్పష్టమైన కలలు కలిగి ఉన్నవాళ్లే ఎక్కువ. కానీ ఆ కలలపట్ల ఉండాల్సిన ఉద్రేకం ఎవరిలోనో లేదు. నెమ్మదిగా గడుస్తున్నాయి రోజులు. జీవితానికి స్పీడ్ బ్రేకర్ లా తయారైంది ఈ మొబైల్ ఫోన్. జీవితగమనాన్ని ఆపేస్తుంది. ప్రతి గంటలో ఒక అరగంట మనల్ని ఎక్కడెక్కడికో లాక్కుని తీసుకెళ్లిపోతుంది. ఉత్తేజం, ఉత్సాహం లేక సారంలేని జీవితం గడిపేస్తున్నాం. అందరి ఉద్రేకం ఆ మొబైల్ ఫోన్లో ప్రదర్శనకే సరిపోతుంది.
ప్రశ్న: నీకేం కావాలి?
సమాధానం: సంతోషంగా ఉండాలి.
ప్రశ్న: నువ్వు మాత్రమే సంతోషంగా ఉంటే చాలా? లేకపోతే ఈ ప్రపంచమంతా సంతోషంగా ఉండాలా?
సమాధానం: నేను ముందు సంతోషంగా ఉండాలి. నాతో పాటు మిగిలిన వాళ్లు కూడా సంతోషంగా ఉంటే మేలు.
ప్రశ్న: అంటే నీకు నువ్వే ముఖ్యం?
సమాధానం: నాకు నాతోపాటు నా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ముఖ్యం.
ప్రశ్న: ఈ సృష్టిలో ఏ జంతువూ తన సాటి జంతువు గురించి ఆలోచించదు. మరి మనిషికే ఎందుకు ఈ బాధ?
సమాధానం: ఎందుకంటే సృష్టిలో ఏ జంతువు కూడా తన తోటి జంతువుని తక్కువగా చూదదు. మనిషి అలా కాదు. ఎన్నో కారణాలు చెప్పి నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ అని విభజించాడు.
ప్రతి రాత్రీ నా పొట్ట తడుముతూ నువ్వడిగే ప్రశ్నలు నాకిష్టం. నా సమాధానాలు నీకు నచ్చడంలేదు. నాకర్థమవుతుంది. నేనిలా ఆలోచించడం తప్పా?
అస్సలు కాదు, నథింగ్ ఈజ్ రాంగ్. నథింగ్ ఈజ్ రైట్ అంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోతావు నువ్వు,
8
చాలా రోజుల తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ ని కలిసాను.
నువ్వు ప్రెగ్నెంట్ అంటే నమ్మలేకపోతున్నాను అంది.
ఎందుకు? అడిగాను.
టూ ఇయర్స్ అయిందా మీకు పెళ్లయ్యి? అప్పుడే ఎందుకే పిల్లలు?
పెళ్లై టూ ఇయర్స్ అయింది. అంతకుముందు థ్రీ ఇయర్స్ కలిసే ఉన్నాం కదా! సో మొత్తం ఫైవ్ ఇయర్స్. ఐ థింక్ ఇట్స్ ది రైట్ టైం, అన్నాను.
నో బేబ్. నా వల్లైతే ఇదంతా కాదు. నేను నీకు చెప్పేంత దాన్ని కాదు. నువ్వు నాకంటే ఇంటెలిజెంట్. నువ్వు రాస్తావు. బొమ్మలేస్తావు. నేను నీలాగా ఆర్టిస్ట్ ని కాదు. కానీ ఒక విషయమైతే నీకు చెప్పాలనిపించింది. నేను ఒకతన్ని చాలా డీప్ గా ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. బట్ అది కొన్ని రోజులే, మనం చూసే సినిమాలో, చదివే పుస్తకాలో ఏంటో తెలియదు; మనల్ని ప్రేమించే ఒకరి కోసం ఎప్పుడూ తపించుపోతుంటాం. నిజానికి ఆ అవతలి వ్యక్తి అవసరం అంతలేదని నాకప్పుడు తెలియలేదు. మా ఇద్దరి బ్రేకప్ అయ్యాక నేను చాలా రోజులు ఒక చీకటిలో ఉండిపోయాను. అప్పుడు అమ్మ నాకు చాలా ధైర్యాన్నిచ్చింది.చాలా మంది చీకటిని ద్వేషిస్తారు, కానీ ఆలోచించు. నువ్వూ-చీకటి. నీ ఆలోచనలతో నువ్వు ఒంటరిగా ఉండడం ఊహించు. మొదట భయమేస్తుంది, కానీ ధైర్యంగా నిలబడితే అది మన జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది. గతంలో మనకు తెలియని మనల్ని మనకు పరిచయం చేస్తుంది, మన పరిమితులను దాటి మనం ముందుకెళ్లగలుగుతాం. అప్పుడు నీకు ఇంకొకరి అవసరం లేదని తెలుస్తుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడమంటే ఏంటో అర్థమవుతుంది. కానీ అలా జరగడానికి టైం పడ్తుంది. చాలా ఓపిక కావాలి. ఒక్క సారి సెల్ఫ్ లవ్ అంటే తెలిస్తే జీవితం వేరే విధంగా ఉంటుంది.
సో ఇప్పుడు సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావన్నమాట, అన్నాను.
ఎంజాయ్ అని కాదు. ఇలాంటి ఒక రకమైన జీవనశైలి ఉంటుందని నేను అర్థం చేసుకున్నాను అంతే. ఇందులోనో కష్టాలుంటాయి, కానీ అవి నా కష్టాలు. నేనే పడతాను. అంతే కానీ పెళ్లెప్పుడు, పిల్లలెప్పుడు అని ఫార్ములాయిక్ లైఫ్ ఇష్టం లేదు. అలా అని ఇది తప్పనటం లేదు. ఇదొక రకమైన లైఫ్ స్టైల్, కానీ ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను పుట్టిన కొన్నేళ్లనుంచే అమ్మ నాకు పరిచయం, కానీ నేను పుట్టకముందు ఆమెకొక జీవితముండేదని నేనెప్పుడూ అంత పట్టించుకోలేదు, అమ్మ చనిపోయిన తర్వాత ఒక రోజు కప్ బోర్డ్ సర్దుతుంటే, అమ్మ టీనేజ్ లో ఉన్నప్పటి స్కెచ్ బుక్ చూశాను. చాలా మంచి ఆర్టిస్ట్ అమ్మ. కాలేజ్ రికార్డ్స్ కి అమ్మే ఎప్పుడూ బొమ్మలేసేది. కానీ నేనెప్పుడూ అమ్మని ఆర్టిస్ట్ గా చూడలేదు. అమ్మొక్కటే కాదు, నాన్నకీ ఏవేవో డ్రీమ్స్ ఉండుంటాయి, కానీ నాన్న మా కోసం వాటన్నింటినీ వదిలేసి ఉంటాడు.
కాలేజ్ అవ్వగానే పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్లిపోవాలనుకున్న నా ఫ్రెండ్ ఆ రోజు అలా మాట్లాడ్డం నాకు నిజంగానే ఆశ్చర్యం కలిగించింది.
9
ఆ రోజు అతను ఆఫీస్ నుంచి తిరిగొచ్చేసరికి నేను ఇంకా నిద్రపోలేదు.
ఎప్పటిలాగే అతను లేట్ గా వచ్చాడు. సారీ, ప్రాజెక్ట్ చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉంది. ఒన్ మోర్ వీక్ అండ్ ఐ విల్ బి ఫ్రీ అన్నాడు.
నేను కథ రాస్తున్నాను అన్నాను.
వావ్. కథ చెప్తావా నాకు? అన్నాడు.
ఆఫీస్ లో బాగా అలసిపోయి వచ్చాడని నాకు తెలుసు. అయినా ఓపిక చేసుకుని నా కథ వినడానికి సిద్ధమవడం నాకు నచ్చింది.
కథ ఇంకా రాయలేదు. ఒక ఔట్ లైన్ అనుకున్నాను. రేపట్నుంచి మొదలుపెడ్తాను.
ఐ యామ్ ఎక్సైటెడ్. కథ చెప్పు.
హ్మ్. నాకు కథ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
నీ ఇష్టమొచ్చినట్టు చెప్పు. నేను అర్థం చేసుకుంటాను.
సరే. అయితే విను.
ఒకామె ఉంటుంది. వయసు 40 ప్లస్ అనుకోవచ్చు. హౌస్ వైఫ్. భర్త ఆఫీస్ పని అని, ఎప్పుడూ ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. ఇద్దరు పిల్లలూ ఉదయం స్కూల్ కి వెళ్తారు. రాత్రి ఎప్పుడో ట్యూషన్స్ అన్నీ ముగించుకుని వచ్చి అన్నం తిని నిద్రపోతారు. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. టివిలో సీరియల్స్ చూసి చూసి బోర్ కొడ్తుంది. పుస్తకాలు చదువుదామంటే ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఒక సాయంత్రం పూట, అపార్ట్మెంట్ పైన టెర్రస్‌లో వాకింగ్ చేస్తుంటుంది. పక్కనే ఉన్న ఇంకో అపార్ట్మెంట్ టెర్రస్ పైన ఒకమ్మాయి, ఒకబ్బాయి గాలిపటం ఎగరేస్తుంటారు. ఆమె గోడచాటున నిల్చుని వాళ్లిద్దరినీ చాలాసేపు చూస్తుంది. ఆ రోజునుంచీ ఆమెకు గాలిపటం ఎగరేయాలని కోరిక కలుగుతుంది. చాలా రోజుల తర్వాత భర్త ఇంటికి వస్తాడు. తన గాలిపటం కోరిక చెప్తుంది ఆమె. బుద్ధుందా? ఈ వయసులో గాలిపటం ఎగరేయడమేంటి? అని తిడ్తాడు. ఆమెకు చిన్నప్పుడు వాళ్ల నాన్న తిట్టిన తిట్లు గుర్తొస్తాయి. పక్కింటి అబ్బాయితో గాలిపటం ఎగరెయ్యాలనుకుంటున్నాని తెలిసి నాన్న ఎంత కోప్పడ్డాడో ఆమెకి మళ్ళీ ఒకసారి గుర్తుకొస్తుంది, ఆమెకి కోపమొస్తుంది. ఆ కోపంలో ఫోన్ విసిరేస్తుంది. ఆ డొక్కు నోకియా ఫోన్ పగిలి ముక్కలవుతుంది. ఆమె కోపం తీర్చడానికో ఏమో, భర్త ఆమెకి స్మార్ట్ ఫోన్ కొనిస్తాడు. మొదటిసారిగా అమెకి ఫేస్‌బుక్ పరిచయం అవుతుంది. ఫేస్‌బుక్‌లో కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ఛాటింగ్‌లో ఒకబ్బాయి పరిచయం అవుతాడు. గాలిపటం గురించి ఆమెకు చాలా కొత్త విషయాలు చెప్తాడు. ఒకరోజు పిల్లలు స్కూల్ ట్రిప్‌కి వెళ్ళిన సమయంలో ఆ అబ్బాయిని కలిసి ఊరికి దూరంగా ఎక్కడికైనా వెళ్లి గాలిపటం ఎగరెయ్యాలని ప్లాన్ చేస్తుంది. ఆమె ఇంట్లోనుంచి బయట అడుగు పెట్టినప్పట్నుంచీ అందరూ ఆమెనే చూస్తునట్టు ఫీలవుతుంది. అందరి చూపుల్నీ దాటుకుని ఎలాగో ఆ అబ్బాయిని కలుస్తుంది, గాలిపటం ఎగరెయ్యాలనే ఎక్సైట్‌మెంట్‌లో అతనితో బైక్ మీద ఊరి బయటకు వెళ్తుంటుంది, ఆ ఆబ్బాయి బైక్‌ని ఒక కూరగాయల మార్కెట్ గుండా పోనిస్తాడు. అక్కడ ఒక షాప్‌లో ఉల్లిపాయలు కిలో రెండు రూపాయలు అనే బోర్డ్ చూస్తుంది ఆమె. ఆ యువకుణ్ణి బైక్ ఆపమంటుంది. మూడు నెలలుగా కిలో యాభై, అరవై పెట్టి కొంటున్న ఉల్లిపాయలు కేవలం రెండు రూపాయలకే దొరకడం ఆమెను ఎంతో ఆనందానికి గురిచేస్తుంది, వెంటనే ఒక ఐదు కిలోలు ఉల్లిపాయలు కొనుక్కుని ఆమె ఇంటికి బయల్దేరడంతో కథ ముగుస్తుంది.
ఇద్దరం కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు.
బావుంది, కానీ రేపు ఈ కథ వచ్చాక ఎదురయ్యే విమర్శలకు నువ్వు సిద్ధంగానే ఉన్నావా? అడిగాడు.
విమర్శకుల గురించి నాకు భయం లేదు. నీకేమనిపించిందో చెప్పు?
హ్మ్. మంచి కథ. కానీ నువ్వు వాడిన మెటాఫర్ మరీ డైరెక్ట్‌గా ఉంది, మెటాఫర్ ఎప్పుడూ అంత స్పష్టంగా ఉండకూడదేమో! కొంత అవ్యక్తంగా ఉండాలేమో అనిపించింది.
10
ప్రేమికులు ఒకరికోసం ఒకరు ఎంత కట్టుబడి ఉంటారో అనే విషయం మీదే ప్రేమకథలన్నీ ఆధారపడి ఉంటాయి.గొప్ప ప్రేమ కథల్లో అభద్రతకు స్థానం లేదు. ఒకరిపట్ల ఒకరికి ఉండే అసమానమైన ప్రేమ, నమ్మకమే ప్రేమకథలన్నింటికీ పెట్టుబడి. కానీ నిజజీవితంలో అలా కాదు. మనం ప్రేమించిన వాళ్లు మనకెక్కడ దూరమైపోతారో అనే అభద్రతే ప్రేమికులను దగ్గరగా ఉంచుతుంది.
పెళ్ళైపోయింది కదా!
అవతలి వ్యక్తి మనతో ఎప్పటికీ ఉండవలిసిన బాధ్యత కలిగి ఉన్నారనే పూర్తి నమ్మకం ఉండే సంబంధాలు ఒకప్పుడు ఎక్కువే ఉండేవి. కానీ కాలం మారుతోంది. బాధ్యతలను బరువుగా, సంప్రదాయాలను సందేహంగా చూసే సమయమిది. ఇటువంటి సమయంలో ఏ సంబంధం శాశ్వతం అనుకోలేము. అలా ఉండాలనుకుంటే ఎన్నో అనుమానాలు. ఈ అనుమానాలే అభద్రతా భావానికి గురిచేస్తాయి.
అభ్దద్రత అనేది ప్రేమ కథలో చాలా అన్‌రొమాంటిక్‌గా అనిపించినా, ఈ అభద్రతే లేకపోతే ఎవరికి వాళ్ళు వారి సెల్ఫ్ ఇండల్జన్స్‌లో మునిగిపోయి అవతలి వాళ్ళని పట్టించుకోకుండాపోయే అవకాశాలే ఎక్కువ.
అందుకే కొన్ని సార్లు నెగిటివ్ అనుకున్నది చివరికి పాజిటివ్‌గా అనిపించవచ్చు.
11
ప్రొసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ చెయ్యాలనుకోవడం వాళ్ళిద్దరిలో ఎవరి ఐడియానో చెప్పడం కష్టం. జీవితంలో అదొక ముఖ్యమైన ఘట్టం అని ఇద్దరికీ అనిపించిందేమో! ఇద్దరూ కలిసి తీసుకున్న కొద్ది నిర్ణయాల్లో ఇది ఒకటి. కంది పప్పు, పెసర పప్పు – ఇలాంటి చిన్న చిన్న విషయాలే వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవకు కారణాలు. అలాంటిది, పైన్నుంచి బర్డ్స్ ఐ వ్యూలో చూస్తే, ఆ ఆదర్శపు జంట ఫోటో స్టూడియో వెతుక్కుంటూ తిరగడం ఒక గమ్మత్తు.
వాళ్ళిద్దరూ ఫోటో స్టూడియో చేరుకోడానికి చాలా సమయం పట్టింది.
ప్రతి నెలా ఇదే రోజుకి ఫోటో తీద్దాం. వచ్చే ఆరు నెలలు. ఆ తర్వాత మీరు మీ కిడ్ ని ఎత్తుకుని తీసుకునే ఏడవ ఫోటోతోఈ సీరీస్ ని ఎండ్ చేద్దాం. ఇవన్నీ సీరీస్ గా ఫ్రేం చేస్తే అద్భుతంగా గా ఉంటుంది, అన్నాడు ఫోటోగ్రాఫర్.
ఈ ఆరు నెలలు ఎలా గడుస్తాయో అనుకున్నది ఆమె.
12
నువ్వు ఆ రోజు ఒక బుక్ లాంచ్ కి వెళ్లివచ్చావు.
నాకు చాలా స్పెషల్ గా అనిపించింది. నువ్వు బాగా చదువుతావు. అది నాకిష్టం. కానీ తెలుగు ఎందుకో చదవవు. చలం, కొకు, శ్రీపాద, మల్లాది – ఇలా ఏవో నాలుగైదు పేర్లు చెప్తావు. కంటెంపరరీ ఎందుకు చదవవు నువ్వు? చాలామంది చాలానే రాస్తున్నారు. వాళ్ల గురించి నీకు లెక్క లేదు. దాని గురించి అడిగితే నీకు కోపం.
కానీ కొత్తగా ఒక బుక్ లాంచ్ కి వెళ్లొచ్చావంటే నాకు సంతోషం వేసింది. కానీ నీ మొహంలో సంతోషమే లేదు. ఎందుకెళ్లానురా అన్నట్టు నిట్టూర్చావు. ఫ్రెండ్స్ ఎవరో బుక్ పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి మొహమాటం మీద వెళ్లినట్టున్నావు. నాకూ ఆ విషయం గురించి అడగాలనిపించలేదు. కానీ నువ్వు బుక్ లాంచ్ నుంచి తీసుకొచ్చిన పుస్తకం ఓపెన్ చేశాను.
ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు.
నాకంటే ముందు చనిపోయే మనుషులతో తిరుగుతున్నాను
నా తర్వాత చాలా కాలానికి చనిపోయే చెట్ల నీడన కూర్చుంటున్నాను
అందని చేయి-పత్రశకలం (అత్మహత్యా సదృశ దేశదిమ్మరి ఆఖరి కోరిక)
చిత్రకొండ గంగాధర్.
పేరే నచ్చింది. ఎవరితను?
ఒకటో రెండో కవితలు చదవగానే అతనెవరో తెలుసుకోవాలనిపించింది. మొదటిపేజీలు తిరగేశాను.
ఆఖరికి ఆ వేళ (2011 సెప్టెంబర్ 25) తన స్వగ్రామం బొడ్డపాడు చేరుకున్నాడు. ఏ నేలమీదన తొలిశ్వాసని పీల్చుకున్నాడో, అదే చోట శాశ్వతంగా ఊపిరి వదిలేయాలనుకున్నాడు, చెరువు ఒడ్డున చెప్పులు విడిచాడు., ఆ గట్టుకే ఓ ఉత్తరమూ, డైరీ అప్పగించాడు. ఎకాయెకీ నీళ్లలోకి దిగి నడిచిపోయాడు.
నాకు విర్జీనియా వూల్ఫ్ గుర్తొచ్చింది,
After World War II began, Woolf’s diary indicates that she was obsessed with death, which figured more and more as her mood darkened.On 28 March 1941, Woolf drowned herself by filling her overcoat pockets with stones and walking into the River Ouse near her home.
ఆ రాత్రి నీతో చాలా మాట్లాడాలనుకున్నాను. నువ్వు ఎంతో అలసిపోయినట్టున్నావు. లేపినా నిద్రలేవలేదు నువ్వు.
13
I think I should start writing. What am I doing? Why am I just sitting at home? Is this what I wanted? Why are you doing this to yourself?
నీకు తెలుగు సరిగా రాదు. నువ్వు తెలుగులో రాయడం ఎందుకు? ఇంగ్లీష్ లో రాయొచ్చు కదా!
ఇవాళ ఎలాగైనా రాయడం మొదలు పెడ్తాను.
గదిలో మూలన నిల్చుని నా వైపే చూస్తోన్న నిశబ్దంగా గిటార్.
టేబుల్ మీద గాలికూగుతున్న కాగితాల మీద కదలకుండా పడుకున్న పెన్.
గోడ మీద తగిలించబడ్డ ఖాళీ కాన్వాస్.
వంటింట్లో తరగడానికి సిద్ధంగా ఉన్న కూరగాయలు.
This is not happening. I don’t know whom to blame? నాకు తెలుగు సరిగా రాదు. లిమిటెడ్ వకాబులరీ. వ్యాకరణం తెలియదు. ఇంగ్లీష్ కూడా అంతే!
ఇప్పటికైనా పోయిందేం లేదు. మళ్ళీ ఫ్రెష్‌గా మొదలుపెట్టొచ్చు. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవచ్చు. రోజూ ప్రాక్టీస్ చేయొచ్చు.
14
నీకంటూ ఒక నిర్ణయం తీసుకునే హక్కు నీకుంటుంది అనుకుంటావు. నాకు ఈ ప్రపంచంతో సంబధమేమిటి? నేను నా ఇష్టమొచ్చినట్టే ఉంటాను అనుకుంటావు. కానీ నిన్ను అలా ఉండనియ్యదు ప్రపంచం. నువ్వు నీ ఇష్టమొచ్చినట్టు ఉంటున్నావని నువ్వనుకుంటున్నప్పటికీ, నీ చుట్టూతా ఉన్న ప్రపంచం నిన్ను గమనిస్తూ ఉంటుంది. తన సర్వశక్తులతో నిన్ను మ్యానిపులేట్ చేస్తూనే ఉంటుంది. ఆ మ్యానిపులేషన్ కి గురికాకుండా ఉందామని మనం ఎంతగా ప్రయత్నించినా అది ఒక్కోసారి మన శక్తికి మించిన పనవుతుంది.
ఎక్కడో చదివాను. జర్మనీలో లక్షలాదిమంది యూదులని నాశనం చేయాలని నాజీలు ఆలోచించినప్పుడు వారికొక సమస్య ఎదురైంది, ఉన్నదేమో కొంతమంది సైనికులు. కానీ యూదులేమో లక్షల సంఖ్యలో ఉన్నారు. లక్షలాదిమంది యూదులను వేల సంఖ్యలో ఉన్న సైనికులు నియంత్రించడం అంత సులభం కాదు. అందువల్ల నాజీలు ఒక పథకం పన్నారు. తమ వినాశనం తధ్యమని తెలిసిన యూదులనుంచే సహకారాన్ని ఎలా పొందాలని ఆలోచించారు.
యూదుల ముందున్నది రెండే ఆప్షన్స్. ఒకటి చావడం. లేదా బతకడం, కానీ అందులో బతకడమనే ఆప్షన్ దాదాపు లేనట్టే. ధైర్యం చేసి నాజీ క్యాంపుల నుంచి తప్పించుకు పారిపోతే తప్ప, సో నిజానికి యూదుల వద్ద ఉన్నది ఒకటే ఆప్షన్. నాజీలు ఇక్కడే తెలివిగా వ్యవహరించారు. యూదుల ముందున్న చావు అనే ఒక బ్యాడ్ ఆప్షన్ ని కొంచెం బ్యాడ్, చాలా బ్యాడ్, ఘోరమైన్ బ్యాడ్ అనే ఆప్షన్స్‌గా వాళ్ల ముందుంచారు. ఇప్పుడే చచ్చిపోతారా? ఇంకొన్ని రోజులు బతికి చచ్చిపోతారా? హింసాత్మకమైనా చావు కావాలా? ప్రశాంతమైన చావు కావాలా? ఇలా లేని ఆప్షన్స్ ని సృష్టించారు.
ఈ జీవితం కూడా ఇంతే!
చివరికి అంతా శూన్యం. It’s all futile. కానీ ఏదో ఉందనే భ్రమల్ని కల్పించిపెట్టారు.
ఆ భ్రమలు అప్పుడప్పుడూ తొలిగిపోతుంటాయి. అప్పుడు సత్యం క్రిస్టల్ క్లియర్‌గా నీముందు సాక్షాత్కరిస్తుంది. ఇంక చాలు అని ఫ్యాన్ నిన్ను పిలుస్తుంటుంది. పాయిజన్ బాటిల్ నీ వైపు దొర్లుకుంటూ వస్తుంది. రైలు పట్టాలు తప్పి నీ వైపే పరిగెడ్తుంది. కానీ ఇంతలోనే, చదివిన వాక్యమో, విన్న పాటో, కలిసిన మనిషో – ఇలా ఏదో ఒక రూపంలో ఆ సత్యాన్ని కప్పివేస్తుంది. జీవితం మీద ఆశ కలుగుతుంది.
ఇంకా ఏదో ఉందనే భ్రమలో మళ్లీ జీవితం కొనసాగుతుంది.
15
కథ రాయడం ఎలా? అన్లైన్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. వారంలో మీ మొదటి కథ రాయండి.
జీవించదాం ఎలా? అనే కోర్స్ ఎక్కడైనా ఉంటే జాయిన్ అవ్వాలనుంది.
చెప్పాలనుకున్న కథలోని ప్లాట్‌ని ఒక పద్ధతి ప్రకారం పేర్చుకోవాలి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ కథను మలుపులు తిప్పాలి, చివరికి ఎలా కథను ముగించాలి – కథ రాయడం మొదలుపెట్టకముందే రచయితకు తెలిసుండాలి.
నగరంలో ఒక కొత్త ఫ్లై-ఓవర్ కట్టారు. ఈ మధ్యనే కొత్తగా కారు కొన్నాడు ఒకడు. ఎప్పటిలానే జీవితంలో ఏ కొత్తదనమూ లేకుండా గడిచిపోతోంది ఆమె జీవితం. కొత్త ఫ్లై-ఓవర్ మీద కొత్త కారులో వేగంగా వెళ్తూ కారు అదుపుతప్పింది. ఇంటినుంచి తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ పట్టుకుని ఆఫీస్ పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుని తినడానికి బయల్దేరిన ఆమెకు ఏదో వింత శబ్దం వినిపించి గాల్లోకి చూసింది. గాల్లో ఎగురుతున్న కారు కింద పడి అక్కడికక్కడే ఆమె చనిపోయింది. రాత. అంతా నుదుటి రాత. ఇలా అనుకోవడం తాతల కాలంలో నడిచింది. పైనెవరో ఉన్నారు. వాడు రాసినట్టే జరుగుతుంది తప్ప, మనం నిమిత్త మాత్రులం అనుకోవడం ఇప్పటికీ చెల్లుబాటులో ఉందా?
మీరు కథ రాయడం ప్రారంభించే ముందు కథలోని పాత్రలు, ఆ పాత్రల లక్షణాలు రచయితకు తప్పనిసరిగా తెలిసిఉండాలి.
మనషులు ఒక నిజం తెలుసుకోవాలి. మనిషి అంటే ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉన్న ఒక వ్యక్తి కాదు. మనిషి ఒకడే. కానీ తనలో అనేక మంది ఉంటారు. తన మెదడు నుంచి నిరంతరం తరలివెళ్లే ఎలిక్ట్రిక్ సిగ్నల్స్ కి బానిస మనిషి. అతన్ని 24 తో భాగాహారం చేసి, ఆ వచ్చిన భిన్నాల్ని 60 తో భాగాహారం చేసి – ఇలా నిరంతరం మనిషి ముక్కలవుతూనే ఉంటాడు. అతను ఒక అర్థం పర్థం లేని ప్రదర్శనలో పాత్రధారి. కార్యక్రమంలో ఈ భాగం ఒక పాత్రధారికి అంకితం. ఆ పాత్ర టైం అయిపోగానే తెర వెనుక ఎదురుచూస్తున్న ఎంతో మంది తమ ఛాన్స్ కోసం పోరాడుతూ చేసే తీవ్రమైన గందరగోళం. ప్రతి వారం, ప్రతి రోజు – నిరంతరంగా సాగే ఒక నిరర్థక నాటకం మనిషి జీవితం. ఒక కోపిష్టి తన ప్రదర్శన అవగానే తన టోకెన్ ని ఒక నిరాశావాదికి అప్పగిస్తాడు, అతను ఒక కామాంధుడికి ఛాన్స్ ఇస్తాడు. అతని తర్వాత ఒక పిరికివాడు, ఆ పై ఒక మాటకారి. ప్రతి మనిషీ ఒక సమూహం – మూర్ఖుల కూటమి.
ప్రతి కథకూ ఒక బిగినింగ్, మిడిల్, ఏండ్ ఉండాలి.
A story should have a beginning, a middle and an end, but not necessarily in that order. – Jean-Luc Godard
16
పేరేం పెడ్దామనుకున్నారు?
శ్రీ.
అదేం పేరు?
ఏమో మా ఇద్దరికీ నచ్చింది.
ఏమోనమ్మా! అన్నీ మీ ఇష్టమేగా!
ఆంటీ, మీరెందుకు అన్నీ ఇంత నెగెటివ్ గా మాట్లాడుతారు?
నాకవన్నీ ఏం తెలియదమ్మా! ఇంతకీ శ్రీ అంటే అమ్మాయా? అబ్బాయా?
అమ్మాయే ఆంటీ!
అంటే అమ్మాయని స్కానింగ్ లో తెలిసిపోయిందా?
లేదాంటీ. అమ్మాయే మా ఇద్దరికీ ఇష్టం.
మీకంత సీన్ లేదులే! అబ్బాయే పుడతాడు. మేము తిరుపతికెళ్లి మొక్కుకున్నాం. పేరు కూడా శ్రీనివాస్ అని పెడ్దామనుకున్నాం.
అలా ఎలా చేస్తారు ఆంటీ మీరు? మమ్మల్ని ఒక్క మాటైనా అడగొద్దా?
మీరన్నీ మమ్మల్నడిగే చేస్తున్నారా? మీ ఇష్టాలు మీవి. మా ఇష్టాలు మావి.
ఒకవేళ ఆమె అత్తగారు అన్నట్టే మగపిల్లాడు పుడితే ఏం పేరు పెట్టాలి అని ఆలోచనలో పడింది ఆమె. శ్రీశ్రీ అని పెడితే ఎలా ఉంటుంది అనుకుందామె.
17
ఫోటో స్టూడియోకి వెళ్దామా? అన్నావు నువ్వు.
నీకు నిజంగానే శ్రీ కావాలా? నువ్వేం చెప్పావు నాకు?
You are a child someone had put in a bulrush basket daubed with pitch and sent down-stream for me to fetch at the riverbank of my bed.
నువ్వు ఇది చెప్పినప్పుడు నేనెంత సంతోషించానో తెలుసా?
నువ్వు మిలన్ కుందేరా చదివి వినిపిస్తుంటే నేను నీతో ప్రేమలో పడ్డాను. నాకందరూ ఉన్నారు. తల్లీ, తండ్రీ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, పిన్ని, బాబాయి, అత్త, మామ – అందరూ. కానీ నువ్వు కలిసాక నాకు ఎవ్వరూ లేరనిపించింది. నువ్వు కథలు, కవితలూ చదివి వినినిపిస్తుంటే నువ్వు నా కోసమే పుట్టావనిపించింది. కాదు. నేనే నీ కోసం పుట్టాననిపించేది.
కానీ ఇప్పుడు? ఎందుకు దూరం దూరంగా తిరుగుతున్నావు?
నువ్వడిగిన తర్వాత గంటకి తయారయ్యి నేను ఫోటో స్టూడియోకి వెళ్దామన్నాను. నువ్వు నీ ల్యాప్ టాప్ లో పని చేస్తూ బిజీగా ఉన్నావు.
I know I should not ask you questions. You are busy earning for us. For Sri, For a better life. But I am a fool, I ask. And a volcano erupts.
మనమింకా చిన్న పిల్లలం కాదు. మనకి ఇల్లు లేదు. కారు లేదు. రేపు నా జాబ్ పోతే మనం రోడ్డున పడతాం. నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది అంటావు. నాకు కోపమొస్తుంది. నేను కూడా సంపాదించాను. కానీ ఇప్పుడు సంపాదించడం లేదు. ఎందుకో నీకు తెలుసు. ఇంకో ఆరు నెలల్లో నేను మళ్లీ జాబ్ చేస్తాను. మనం ఇల్లు కొనుక్కోవచ్చు. కారు మనం వద్దనుకున్నాం. ఇద్దరం చెరొక సైకిల్ మీద హాయిగా తిరగొచ్చని నువ్వే చెప్పావు గుర్తుందా?
ఆ సాయంత్రం చాలా సేపు గొడవ పెట్టుకున్నాక ఇద్దరం ఫోటో స్టూడియోకి వెళ్లాం. నాకు ఫోటో తీయించుకోవాలని అనిపించలేదు. అక్కడ మళ్లీ గొడవ పడ్డాం. ఇద్దరం ఇంటికొచ్చేశాం.
ఇప్పుడు నీకివన్నీ గుర్తున్నాయా?
18
స్టోరీ కోసం కలెక్ట్ చేసుకున్న కొన్ని నోట్స్.
- No woman wants an abortion like she wants an ice cream cone or a Porsche. She wants an abortion like an animal caught in a trap wants to gnaw off its own leg. – Frederica Mathewes-Green
- The birth of a child is supernatural spiritual event. – Lailah Gifty Akita
- I don’t do anything with my life except romanticize and decay with indecision. – Allen Ginsberg
- John laughs at me, of course, but one expects that in marriage. – Charlotte Perkins Gilman
- Life’s what you see in people’s eyes; life’s what they learn, and, having learnt it, never, though they seek to hide it, cease to be aware of -what? That life’s like that, it seems. – Virginia Woolf
- Believing the lie that time will heal all wounds is just a nice way of saying that time deadens us. ― Jonathan Nolan
19
మన జీవితంలో కొన్ని యాదృచ్చికమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల వెనక ఉన్న కారణాలు ఎటువంటి వివరణకు అందని పరిధిలో ఉంటాయి. ఇటువంటి సంఘటనలనే ఇంగ్లీష్‌లో కోఇన్సిడెన్స్ అంటారు. ఇటువంటి కోఇన్సిడెన్సెస్ అనుభవించే వ్యక్తులకు మాత్రమే అర్థవంతంగా ఉంటాయి; ఇతరులకు ఈ సంఘటనలు మూఢనమ్మకాలుగా అనిపించే అవకాశం ఉంది.
“When the Impossible Happens” అనే పుస్తకంలో సైకియాట్రిస్ట్ స్టానిస్లావ్ గ్రోఫ్ ఒక కోఇన్సిడెన్స్ గురించి ఇలా రాసుకొచ్చారు.
నా గురించి బాగా తెలిసిన స్నేహితుడు ఒకరు, నువ్వు తప్పకుండా మా కలీగ్‌ని కలవాలి. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అచ్చం నీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. మీ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి, అని చాలా సార్లు చెప్పాడు. అన్నిసార్లు చెప్పాక సరే చూద్దాం అని అతని కొలీగ్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. ఆమెకి కూడా మా ఫ్రెండ్ నా గురించి చెప్పి ఉండడంతో వెంటనే గుర్తుపట్టింది. నేను ఈ వీకెండ్‌లో డల్లాస్‌లో ఒక కాన్ఫరెన్స్‌కి వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు మయామిలో మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నాని చెప్పాను. ఆశ్చర్యకరంగా ఆమె కూడా డల్లాస్‌లో నేను వెళ్తున్న కాన్ఫరెన్స్‌కే వెళ్తున్నానని చెప్పింది. ఆశ్చర్యపోయాను. అవునా, అయితే మనం డల్లాస్‌లోనే కలుసుకోవచ్చని మాట్లాడుకుంటుండగా, మేమిద్దరం ఒకే హోటల్లో రూమ్స్ బుక్ చేసుకున్నామని తెలిసింది. ఇంకా ఆశ్చర్యపోయాను. డల్లాస్ వెళ్లాక, కాన్ఫరెన్స్ లో ఆమెను కలుసుకున్నాను. మేము ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేదు. ఈవెంట్‌లో మమ్మల్ని ఎవరూ పరిచయం చేయలేదు, కానీ మేము ఒకరినొకరు చూసుకొనప్పుడు వెంటనే పరిచయస్తుల్లా గుర్తుపట్టాం. ఇన్ని కోఇన్సిడెన్స్ ఒకదాని మీద ఒకటి జరిగిపోవడంతో మా సంబంధం కొద్ది సమయంలోనే బలపడింది. మా ఇద్దరినీ కలపడానికి ఈ విశ్వమే ఏదో రహస్య పన్నాగం పన్నింది అనుకున్నాం. పెళ్ళి చేసుకున్నాం. ఎంత త్వరగా పెళ్ళి చేసుకున్నామో అంత త్వరగా విడిపోయాం కూడా. ఇది జరిగిన తర్వాత నాకర్థమైంది ఒక్కటే. ఈ యాదృచ్చిక సంఘటనల అనుభవాల యొక్క సమ్మోహన శక్తిని బేషరతుగా విశ్వసించకూడదని నేను నేర్చుకున్నాను. మనం ఆ మాయలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాయలోంచి బయటపడి మనం మళ్లీ రెండు పాదాలను నేలపై ఉంచే వరకు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు.
20
నాకంటే ముంచు చనిపోయే మనుషులతో తిరుగుతున్నాను – ఈ వాక్యం ఎందుకు చదివానా అనిపించింది అమెకు.
ఐ యామ్ సారీ, అని డాక్టర్ మాటల్ని వినగానే ఆమెకు విషయం అర్థమైంది.
ఇది పెద్ద వర్రీ అవ్వాల్సిన ప్రాబ్లం ఏమీ కాదు. ప్రెగ్నెన్సీ రికగ్నైజ్ చేసిన 15-25% కేసుల్లో మిస్ క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఐ థింక్ ఇట్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది వీక్ నెస్ ఆఫ్ ది సెర్విక్స్. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఇన్ కాంపిటెంట్ సెర్విక్స్, అన్నాడు డాక్టర్.
అవును. ఆమె ఇన్ కాంపిటెంట్ డాటర్. ఇన్ కాంపిటెంట్ వైఫ్. ఇన్ కాంపిటెంట్ రైటర్. ఇన్ కాంపిటెంట్ యాక్టర్. ఇప్పుడు ఇన్ కాంపిటెంట్ మదర్.
The medical term for a miscarriage is spontaneous abortion, but spontaneous is the key word here because the condition is not an abortion in the common definition of the term.
కామన్ డెఫినిషన్ ఎవరికీ అక్కర్లేదు. ఆమె గర్భం పోగొట్టుకుంది అని అందరూ చెప్పుకున్నారు. అందులో తన తప్పేమీ లేదని ఆమె చెప్పినా ఎవరూ వినే పరిస్థితిలో లేరు.
ఆమె కొన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడేది కాదు. తన గదిలోనుంచి బయటకు వచ్చేది కాదు. ఎప్పుడైనా బయటకు వెళ్తే, ఆమె తర్వాత చాలా కాలానికి చనిపోయే చెట్ల నీడన కూర్చుని తనలో తానే మాట్లాడుకునేది.
21
మేము నీ గురించి చాలా కలలు కన్నాం రా పాపా.
మనం టివి చూడ్డం మానేద్దాం. అప్పుడు శ్రీకి కూడా టివి అలవాటు అవ్వదు. మనం చిన్నప్పట్నుంచే పుస్తకాలు చదివిద్దాం. స్కూల్‌లో చేర్చేటప్పుడు మనం కులం పేరు రాయొద్దు. చిన్నప్పట్నుంచే దాని ఇష్టమొచ్చిన పని చెయ్యనిద్దాం. ఎప్పుడూ కొట్టకూడదు. నాకు మ్యాధ్స్ బాగొచ్చు కాబట్టి నేను మ్యాథ్స్ నేర్పిస్తాను. నువ్వు ఇంగ్లీష్, తెలుగు నేర్పించు. సంగీతం క్లాసులకు పంపిద్దాం. అది కొంచెం పెద్దవగానే మనం ఊరికి కొంచెం దూరంలో ఎక్కడైనా ఒక ఇల్లు కట్టుకుందాం. అక్కడ మన పంటలు మనమే పండించకుందాం. సాటి మనుషులతో ఎలా నడుచుకోవాలో, అందరినీ సమానంగా ఎలా చూడాలో నేర్పిద్దాం.
కానీ మేము ఓడిపోయాం పాపా.
మేమెలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో కూడా మాకు ఇంకా తెలియడం లేదు. నువ్వే వచ్చుంటే నీకేం నేర్పించే వాళ్లమో తెలియదు. ఈ లోకంలోకి నువ్వు వచ్చుంటే మా జీవితం వేరొక విధంగా ఉండేదేమో! మళ్లీ మేమిద్దరం ప్రేమగా ఉండగలిగే వాళ్లమేమో! ఏమో చెప్పలేం. నువ్వు వచ్చుంటే ఈ లోకంలో నిన్ను మేమనుకున్నట్టు పెంచలేక రోజూ బాధపడుతూ ఉండేవాళ్లమేమో!
ఈ లోకం ఇప్పుడు చాలా మారిపోయింది పాపా.
ఇప్పుడు ఇక్కడ ఊరికినే ఎవ్వరూ ఏమీ చెయ్యడం లేదు. నేనిప్పుడు ఊరికినే ఇక్కడ ట్యాంక్ బండ్ ఒడ్డున నడుస్తూ నీతో మాట్లాడుతున్నాను. కానీ లోకం అలా అనుకోదు. నన్ను పిచ్చిదానిలా చూస్తుంది. అయినా లోకంతో నాకు పని లేదని సరిపెట్టుకుంటాను. కానీ దీనంతటికీ కారణం నేనే అయినట్టు నా లోకం అనుకున్న వాళ్లే నన్ను చూస్తుంటే తట్టుకోలేని బాధ కలుగుతోంది పాపా.
నువ్వు ఎక్కడో మళ్లీ పుడతావు పాపా.
అప్పుడు నువ్వు, నేనూ ఎక్కడో కలుస్తాం. చాలా రోజులుగా పరిచయం ఉన్న వాళ్లలా మనం మళ్లీ మాట్లాడుకుంటాం. నువ్వొక్కదానివే నన్ను ఓదార్చగలవు. ఇంకెవరికీ నా బాధ అర్థం కాదు కాబట్టి నీ ఒడిలో పడుకుని ఆ రోజు నేను ఏడుస్తాను, నువ్వప్పుడు తల్లిలా నన్ను లాలిస్తావు. నాకు ధైర్యం చెప్తావు.
22
కొన్ని జ్ఞాపకాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని అజ్ఞాపకాలు అనాలేమో! అజ్ఞాపకాలు అని ఏదైనా పదం ఉందా తెలుగులో?
Nonmemory: Not of pertaining to memory (the mental faculty).
అజ్ఞాపకం: వాస్తవంలో జరగని సంఘటన వివరాల గురించి కలిగే జ్ఞానం.
నాకు అమ్మమ్మ అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం. శెలవుల్లో ఎప్పుడూ అమ్మమ్మ దగ్గరే ఉండేదాన్ని. కానీ చదువుకోడానికి హైదరాబాద్ వచ్చాక అమ్మమ్మతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. పెళ్లైన కొత్తల్లో ఒకసారి మేమిద్దరం కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లాం. ఆ తర్వాత ఎప్పుడూ వెళ్లలేదు. అప్పటికే అమ్మమ్మ ఆరోగ్యం ఏమీ బాగోలేదు. అప్పుడప్పుడూ అమ్మ ఫోన్ చేసి అమ్మమ్మకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడవే అని చెప్పేది. అయినా ఎందుకో ఎప్పుడూ నేను ఫోన్ చెయ్యలేదు. రెండు మూడు సార్లు చెప్పి అమ్మ కూడా వదిలేసింది, ఆ తర్వాత ఎప్పుడూ అమ్మమ్మ మాటే మా మధ్యలో రాలేదు. కానీ నాకెందుకో అమ్మమ్మ చనిపోయుంటుందని నమ్మకం. అమ్మమ్మ చనిపోయినప్పుడు నాకు అమ్మ ఫోన్ చేసి రమ్మన్నట్టు కూడా లీలగా గుర్తుంది, కానీ ఇవన్నీ నిజంగా జరిగాయా నేను ఊహించుకుంటున్నానా అనే విషయం నాకు ఖచ్చితంగా తెలియదు. అందుకే అమ్మమ్మ ఇంకా బతికుందా చనిపోయిందా అనే విషయం ఎవరిని అడగాలో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి నాది.
ఒక అర్థరాత్రి నాకు ఫోనొచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఫోన్. లిఫ్ట్ చేస్తే వేరే ఎవరో హిందీలో మాట్లాదారు. తను ముంబైలో ఒక హోటల్ పధ్నాలుగో ఫ్లోర్ నుంచి పడి చనిపోయిందని చెప్పారు. అంతకు కొన్ని వారాల ముందే నాకు తన దగ్గర్నుంచి ఫోనొచ్చింది. బ్రెజిల్ లో ఒక హోటల్‌లో చెఫ్ గా చేరానని చెప్పింది. కానీ ఇంతలోనే ఈ వార్త వినడం నాకు నమ్మబుద్ధి కాలేదు.
ఉదయం కడుపు నొప్పితో నిద్రలేచాను. బ్లీడింగ్ అయింది, డాక్టర్ దగరకెళ్లాం. ఆ రోజే నా స్పాంటేనియస్ అబార్షన్ గురించి తెలిసింది.
చాలా రోజుల పాటు నేను ఇంట్లోనుంచి బయటకు రాలేదు. అమ్మ ఫోన్ మీద ఫోన్. మా అత్తగారు ఫోన్ మీద ఫోన్. ఆఫీస్ కెళ్లిన దగ్గర్నుంచి గంట గంటకీ అతని ఫోన్. ఒక వారం రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఫోన్నుంచి వచ్చిన కాల్ గుర్తొచ్చింది. కాల్ లిస్ట్ లో చూశాను. ఆమెనుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు లిస్ట్ లో లేదు.
ఆ రోజు అర్థరాత్రి ఆమె నుంచి నాకు నిజంగానే కాల్ వచ్చిందా? లేక నేను కల కన్నానా? ఏం చెయ్యాలో అర్థం కాలేదు, ఫోన్ చేసి నువ్వు బతికున్నావా అని ఎలా అడగాలి?
ఈ అజ్ఞాపకాలు ఒక్కోసారి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి,
మేమిద్దరం హైదరాబాద్ రోడ్లలో రాత్రంతా నడుస్తూ, ఎక్కడో దగ్గర ఇరానీ కెఫే కనిపిస్తే ఆగి టీ తాగి, మళ్లీ చేతిలో చెయ్యేసుకుంటూ నడిచినవన్నీ జ్ఞాపకాలా? అజ్ఞాపకాలా అని ఒక్కోసారి అతన్ని అడగాలనిపిస్తుంది. కానీ కొన్ని విషయాలు అడిగి తెలుసుకోకపోవడమే మంచిదని ఎప్పటికప్పుడు వదిలేస్తూనే ఉన్నాను.
23
పతి, పత్నీ, ఔర్ వో అని హిందీలో ఒక సినిమా ఉంది. భార్య, భర్త మధ్యలో ఇంకొకరు.
ఆ మధ్యలో వచ్చేది ఇంకొకరు ఎవరో కాదు.
పెళ్లి.
Between his skin and hers, there was the smallest of spaces, barely enough for air, for the slick of sweat, now chilling. Even still, a third person, their marriage, had slid in.
From (Fates and Furies by Lauren Groff)
24
పుస్తకాల్లో, కథల్లో జీవితాలకు సమాధానాలు వెతక్కూడదనిపిస్తుంది ఒక్కోసారి. మరి ఇంకెక్కడ వెతకాలో తెలియక మళ్ళీ ఇంకేదో పుస్తకం పట్టుకుంటాను. ఏదో కొత్త విషయం ఆకర్షిస్తుంది. నిజమే కదా అనిపిస్తుంది. ఏదో సినిమా చూస్తాను. ఒక మంది సన్నివేశమేదో మనసుని కదిలిస్తుంది. జీవితం కొత్త వెలుగులో కనిపిస్తుంది. మళ్ళీ ఇంతలోనే జీవితం లాగి చెంపమీద కొడ్తుంది. అంతా అస్తవ్యస్తమవుతుంది.
టు బి ఆర్ నాట్ టు బి. టు డూ ఆర్ నాట్ టు డూ. టు లివ్ ఆర్ నాట్ టు లివ్.
ఉండడమా, ఊడ్డమా?
యాంక్సైటీ.
25
ప్రశ్న: ఇవాళ ఆమె పుట్టిన రోజు. ఆమె అతనికంటే నాలుగేళ్లు చిన్నది. ఆమెకు కూతురు పుట్టుంటే ఇప్పటికి రెండేళ్లు దాటి రెండు నెలల వయసుండుండేది? ఇప్పుడు ఆమె వయసెంత?
సమాధానం: జీవితానికి అర్థం కోల్పోయాక వయసుతో సంబంధం లేదు.
ప్రశ్న: నిమిషానికి అరవై సెకండ్లు. గంటకి అరవై నిమిషాలు. రోజుకి ఇరవై నాలుగు గంటలు. వారానికి ఏడు రోజులు. నెలకి నాలుగు వారాలు. సంవత్సరానికి యాభై రెండు వారాలు. ఒక జీవితానికి ఎన్ని సంవత్సరాలు?
సమాధానం: జీవితం అర్థం కోల్పోయాక ఎన్ని సంవత్సరాలు బతికినా అనవసరం.
26
ఆ రాత్రి అతను ఇంటికి రాగానే స్నానం చేసి వచ్చి ఆమె పక్కనే పడుకున్నాడు. అతనేమీ మాట్లాడలేదు. ఆమె కూడా చదువుతున్న పుస్తకంలోంచి తలదించలేదు. పెళ్లైన నాలుగేళ్లలో, వాళ్లు కలిసిన ఏడేళ్లలో నిద్రపోయేముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా పడుకోవడం ఇదే మొదటి సారి.
ఆమెకు కొన్ని రోజుల క్రితమే అనుమానం వచ్చింది. కొన్ని విషయాలు అడిగి తెలుసుకోకపోవడమే మంచిదని ఆమెకు తెలుసు. కొన్ని విషయాల గురించి పట్టించుకోకుండా వదిలేయడమే మంచిదని అతనికీ తెలుసు.
మాటల్లో చెప్పుకోలేని ఎన్నో విషయాలు ఆ రాత్రి వాళ్లిద్దరూ మౌనం ద్వారా తెలియపరుచుకున్నారు.
27
ప్రేమ అనేది చాలా ఫాసినేటింగ్ సబ్జెక్ట్. ప్రేమని అర్థం చేసుకోడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించారు.
Love-related changes in the brain: a resting-state functional magnetic resonance image study అనే రీసెర్చ్ ద్వారా కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. కొత్తగా ప్రేమలో పడ్డ కొంతమందిని ఎన్నుకుని వారికి తమ ప్రేమికుల ఫోటోగ్రాఫ్ చూపించారు. వారు ఆ ఫోటో చూస్తున్న సమయంలో వారి బ్రెయిన్ స్కానింగ్ చేసినప్పుడు వారికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి.
డ్రగ్స్ కి బానిసైన వ్యక్తి, తనకి కావాల్సిన డ్రగ్ దొరికినప్పుడు మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయో ప్రేమికుల విషయంలో కూడా సరిగ్గా అలాంటి వ్యవస్థలే మెదడులో క్రియాశీలం కావడం వాళ్లు గమనించారు.
లవ్ ఈజ్ ఏ డ్రగ్. మొదట మత్తిస్తుంది. ఆ తర్వాత అది కేవలం అలవాటుగానే మారుతుంది. అందుకే పెళ్ళైన కొత్తల్లో ఉండే ప్రేమ కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తూ, చివరికి అదొక అలవాటుగా మారుతుంది. ఈ అలవాటులో భార్యాభర్తలిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. పిల్లల్ని కనడానికి మాత్రమే కాకుండా చాలా సంవత్సరాల పాటు వారిని పెంచి పోషించడానికి ప్రేమకంటే ఈ అనుబంధమే ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ సృష్టిలోని జీవరాశులన్నింటిలో పిల్లలను పెంచి పోషించే బాధ్యతని తలకెత్తుకునేది మనుషులొక్కరే.
ప్రేమ గురించి చేసిన పరిశోధనల ప్రకారం ఒక విషయమైతే అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో మూడు రకాల మనుషులుంటారు. ప్రేమలో ఉన్నవాళ్ళు. ఒకప్పుడు ప్రేమలో ఉండి ఇప్పుడు ప్రేమలేని వాళ్లు, అసలెప్పుడూ ప్రేమే తెలియని వాళ్లు. నేనిప్పుడు రెండవ రకం మనిషిని. అతను మొదటి రకం.
28
ఆమె వాళ్లిద్దరినీ చూడగానే పెద్దగా ఆశ్చర్యపోలేదు.
అతను ఆమెను హగ్ చేసుకున్నాడు. చీక్-కిస్ చేశాడు. ఆ తర్వాత బై చెప్పాడు. ఆమె అతనికి బై చెప్పి వెళ్లిపోయింది. హగ్. చీక్-కిస్ ఇవన్నీ ఈ రోజుల్లో పెద్ద విషయమేమీ కాదు.
వాళ్లిద్దరినీ అలా చూసి వాళ్లమీద ఆమెకు అనుమానం వచ్చేంత విషయమేమీ లేదు. ఆమె కూడా రోజూ చాలామందిని కలుస్తుంది. అందులో మగవాళ్లుంటారు. ఆడవాళ్లు ఉంటారు. వాళ్లని హగ్ చేసుకుంటుంది. ఒక్కోసారి చీక్-కిస్ కూడా చేస్తుంది. అది చాలా సాధారణమైన విషయం.
కానీ వాళ్లిదరి మధ్య ఉన్నది వేరు. అది అది కాదు. అది ఇంకేదో.
అలా అని నువ్వెలా చెప్పగలవు అని ఎవరైనా అడిగితే ఆమె దగ్గర సరైన సమాధానం లేదు, కానీ ఆమెకు ఖచ్చితంగా తెలుసు.
నీకెలా తెలుసు? అని ఎవరైనా గుచ్చి గుచ్చి అడిగితే ఆమె ఆలోచించి ఈ విధంగా చెప్పవచ్చు – అతని గురించి నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. అతన్ని ప్రేమలో ఉన్నప్పుడు నేను చూశాను. చాలా రోజుల తర్వాత ఇప్పుడతను మళ్లీ ప్రేమలో పడ్డాడు. కావాలంటే బ్రెయిన్ స్కాన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అసలు అంతకూడా అవసరం లేదు. అతని కళ్లల్లోకి చూడండి. ఆ మెరుపు మీకే సమాధానం చెప్తుంది.
ఇదంతా ఆమెకు తెలుసని కూడా అతనికి తెలుసు.
29
రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకి.
ఏడవాలనిపించింది.
కానీ ఏడిస్తే తెర పైకి లేస్తుంది.
లోకం ఇప్పటికే పాప్ కార్న్ పట్టుకుని ఎదురుచూస్తూ ఉంది.
డ్రామా మొదలవుతుంది.
మొదలవ్వకూడదు.
నేను రాయాలనుకున్న కథల్లో పాత్రలా తయారైంది నా పరిస్థితి, అనుకుంది ఆమె.
గట్టిగా ఏడవాలనిపించింది.
వాకింగ్ చెయ్యడానికి పార్కులు, స్విమ్మింగ్ చేయడానికి పూల్స్, స్మోకింగ్ చెయ్యడానికి స్మోకింగ్ జోన్స్ ఉన్నట్టు, ఏడవడానికి కూడా నగరంలో కొన్ని ప్రదేశాలను ఏర్పాటు చేస్తే బావుంటుందని అనుకుందామె.
ముఖ్యమంత్రి గారూ, ఈ నగరంలో ఏడవడం కూడా కష్టమైపోతుంది. దయచేసి ప్రజల దుఃఖాల్ని అర్థం చేసుకుని వారి కోసం డెజిగ్నేటెడ్ క్రైయింగ్ ఏరియాస్ ని ఏర్పాటు చెయ్యాలని మనవి.
30
మనిషి ఎందుకు ఏడుస్తాడు?
పూర్వం మనషులు ఇప్పటిలా కాంక్రీటారణ్యాల్లో కాకుండా కీకారణ్యాల్లో బతుకుతున్నప్పుడు, మనుషులు ఒక గుంపుగా ఒక చోటునుంచి మరొక చోటుకి సంచరిస్తూ బతికేవాళ్లు. అలా తిరుగుతున్న సమయంలో, ఎవరైనా ఆ గుంపు నుంచి తప్పిపోయినప్పుడు తమ గురించి తెగలోని మిగతా వాళ్లకు తెలిసేలా కేకలు వేసేవాళ్లు. ఆ కేకలే మానవ పరిణామ క్రమంలో ఏడుపుగా రూపకల్పన దాల్చింది.
We cry when we are abandoned.
31
టింగ్.
వాట్సాప్ మెసేజ్.
యోగా క్లాస్‌లో పరిచయమైన ఒక ఫ్రెండ్ నుంచి మెసేజ్. ఆమె ఫోన్ తీసి చూసింది.
ఏంటి ఈ మధ్య యోగా క్లాస్ కి రావడం లేదు?
నాట్ ఫీలింగ్ వెల్.
కొంచెం బుగ్గలొచ్చాయి మీకు. 😊
ఫ్లర్ట్ చేస్తున్నాడా? అనుకుందామె.
చేస్తే చెయ్యనీ. తప్పేముంది. అయినా అతనేం అబద్ధం చెప్పడం లేదు. కొంచెం వెయిట్ పెరిగాను, అనుకుంటూ అద్దం దగ్గరకెళ్లి చూసుకుంది.
😊
మళ్లీ ఎప్పుడు కలుస్తారు?
యోగా క్లాస్ మిమ్మల్ని మిస్ అవుతోంది.
గేమ్ స్టార్టయింది.
మిస్సవుతుంది యోగా క్లాసా? మీరా?
నిజం చెప్పాలంటే నేనే 😊
విల్ సీయూ సూన్. బై
నో. ఈ గేమ్ నేను ఆడను. అప్పుడు నాకూ అతనికీ తేడా ఏముంది అనుకుందామె.
మొబైల్ ఫోన్ తీసి అతని డిస్‌ప్లే పిక్చర్ చూసింది. నాకంటే ఐదేళ్లు చిన్నవాడయ్యుంటాడు అనుకుంది. చాలా సేపు అతని ఫోటో వైపే చూస్తూ ఉండిపోయింది.
కొద్దిసేపటికి వాట్సాప్‌లో అతని ప్రొఫైల్ మీద క్లిక్ చేసి బ్లాక్ కాంటాక్ట్ బటన్ మీద నొక్కింది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య ఛాట్ మొత్తాన్ని క్లియర్ చేసేసింది.
32
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు వాళ్లిచ్చే అప్లికేషన్ లో కింద చిన్న లెటర్స్ లో బీమా అనేది అభ్యర్థించే విషయం అని రాసుంటుంది. పెళ్లిలో కూడా అంతే. పెళ్లయ్యాక ప్రేమ కూడా అభ్యర్థించే విషయమే!
మగవాడు దేభ్యము మొహమేసుకుని అభ్యర్థించాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళ విషయంలోనే ఆ విషయం చెల్లుతుంది. అలా అభ్యర్థించడంలో మనసుని ఎంత చంపుకోవాలో ఆడవాళ్లకే తెలుస్తుంది.
నా జీవితం ఇంకొకరికి అంకితమని నేను సర్వదా భావిస్తున్నాను అని ఆడపిల్ల పుట్టినప్పుడే బర్త్ సర్టిఫికెట్‌లో చిన్న లెటర్స్‌లో రాస్తుండి ఉంటారు. కళ్లకు కనిపించనంత సూక్ష్మమైన అక్షరాలతో రాయగలిగే టెక్నిక్ ఏదో మగజాతి ఎప్పుడో కనిపెట్టేసి ఉంటారు.
33
తప్పందా నీదే! నువ్వు ఎందుకో ఎప్పుడో ఎక్కడో ఆగిపోయావు. నువ్వే కదా మా అందరికీ ఒకప్పుడు ఇన్స్పిరేషన్. నిన్ను చూసే నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను. సరే, నేను పెద్ద టాప్ హీరోయిన్ అయ్యుండకపోవచ్చు. కానీ టివి వరకూ నాకు మంచి రోల్సే వస్తున్నాయి. కానీ నువ్వెందుకో ట్రై చెయ్యకుండా ఆగిపోయావు. ఎప్పుడూ ఇలా గ్లూమీగా ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పు? నాకైతే అతని తప్పేం కనిపించడం లేదు. హీ ఈజ్ జస్ట్ లివింగ్ హిస్ లైఫ్.
నిజమే. కానీ హీ ఈజ్ డామేజింగ్ మీ బియాండ్ రిపేర్.
నేనొప్పుకోను. బియాండ్ రిపేర్ అంటే? థర్టీ ఇయర్స్ కే ఇలా గివప్ అంటే ఎలా? ఇంకా చాలా జీవితం ఉంది. అంత ప్రాబ్లం అయితే డివోర్స్‌కి ట్రై చెయ్యండి.
నువ్వు చెప్పినంత ఈజీ కాదు అది.
ఎందుకు?
ఏమో నాకూ తెలియదు.
తెలుసుకో. అండ్ ఇట్ విల్ ఆల్ బి ఫైన్.
నా ఫ్రెండ్ వెళ్లిపోయాక చాలా సేపు సోఫాలో కూర్చుని గోడ మీద వేలాడదీసిన బ్లాంక్ ఫోటో ఫ్రేం వైపు చూస్తూ కూర్చున్నాను. ఆ ఫోటో ఫ్రేంని ఇద్దరం కలిసే కొన్నాం. నీకు డెలివరీ అవ్వగానే ముగ్గురుం కలిసి ఒక ఫోటో తీసుకుందాం. ఈ ఫ్రేంలో ఆ ఫోటో పెడ్దాం అనుకున్నాం. అప్పట్నుంచీ గోడ మీద ఫోటో లేకుండా ఉండిపోయింది ఆ ఫ్రేం.
34
అక్కా, అక్కా అని ఎవరో పిలిచారు. మొదట తనని కాదనుకుందామె. కానీ మళ్లీ దగ్గర్లోనే ఆ గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది. ఒకమ్మాయి తన వైపే వేగంగా నడుచుకుంటూ రావడం చూసి ఆగిందామె.
అక్కా నన్ను గుర్తు పట్టలేదా? అడిగిందా అమ్మాయి.
లేదన్నట్టు చూసిందామె.
ఆమె చేతిలో ఉన్న సూపర్ మార్కెట్ బ్యాగ్‌ని తీసుకుంది ఆ అమ్మాయి.
నేనక్కా! మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని. మనం ఒకసారి కలిసాం. నేనప్పుడు ఈ సూపర్ మార్కెట్‌లోనే పనిచేసే దాన్ని, ఇందిరా పార్క్ దగ్గర కేఫ్‌లో కలిశాను. గుర్తుందా? అడిగిందామె.
ఆమెకు గుర్తొచ్చింది.
ఎలా ఉన్నావిప్పుడు?
చాలా బావున్నానక్కా. ఇక్కడే సూపర్ మార్కెట్‌లో స్టోర్ మేనేజర్ అయ్యాను. పేరెంట్స్‌ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చాను. ఇప్పుడు హ్యాపీ అంతా.
ఆ అమ్మాయి కళ్లల్లో నిజమైన సంతోషాన్ని చూసిందామె.
ఎందుకక్కా ఇన్ని కిలోల ఆనియన్స్ కొన్నారు? కారు డిక్కీలో బ్యాగ్ పెడ్తూ అడిగింది ఆ అమ్మాయి.
ఆనియన్స్ రేట్ తగ్గింది కదా! అందుకే అని నవ్వుతూ చెప్పిందామె. చాలా రోజుల తర్వాత ఆమె మొదటిసారిగా స్వచ్ఛంగా నవ్విందామె.
పెళ్లయిందా?
లేదక్కా. చేసుకోకూడదనుకున్నాను. అప్పుడు మిమ్మల్ని కలిసాక ఊరికెళ్లిపోయాను. చాలా రోజులు జరిగిన విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ అమ్మకి అనుమానం వచ్చింది. ఒక రోజు అమ్మకి మొత్తం చెప్పేశాను. అమ్మ నా మీద చాలా కోప్పడింది. అంత పిరికిదానివా నువ్వు? అని నాతో పాటు హైదరాబాద్ కి వచ్చింది. సూపర్ మార్కెట్‌కి వచ్చి పెద్ద గొడవ చేసింది. దెబ్బతో అందరూ భయపడిపోయారు. అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. నాకు మళ్లీ ఉద్యోగమిచ్చారు. అక్కా, నాకు ఈ జరిగినదాంట్లో ఆశ్చర్యం కలిగించిన విషయం మా అమ్మ ధైర్యం. ఎప్పుడూ నాన్న తిడ్తుంటే పడి, కొట్టినా పడి, జీవితంలో తనకంటూ ఏమీ చేసుకోని అమ్మ నా కోసం అంత పోరాటం చేస్తుందని నేననుకోలేదు. సమయం-సందర్భం రావాలే కానీ ఆడవాళ్లను మించిన ధైర్యవంతులు ఎవరూ ఉండరని, అప్పుడే నాకర్థమయిందక్కా,
ఆ అమ్మాయి మాటలు విని ఆమె చాలా రోజుల తర్వాత సంపూర్ణ ఆనందంతో ఇంటికి వెళ్లింది.
35
వాళ్లిద్దరూ మొదట్లో ఒకరికొకరు చాలా ఈమెయిల్స్ రాసుకునేవాళ్లు. అందులో పోయెట్రీ ఉండేది. వాళ్లు చదువుకున్న విషయాల గురించి ఒకరికొకరు చెప్పుకోవడం ఉండేది.
ప్రతి రోజూ ఒక ఈమెయిల్ అయినా చేసుకునే వాళ్లు.
అతను పంపించిన ఒక ఈమెయిల్:
He, She and God
He said,
I am stupid. Am I?
She said,
I could paint the skies about it,instead I whisper, Love you as you are.
God said,
My child, she was your mother eighteen lifetimes ago.
ఇప్పుడు ఆ మెయిల్ చదివితే దాని అర్థమేంటో ఆమెకు తెలియలేదు. అర్థం తెలియకపోయినా అప్పుడు ఆ మెయిల్ చదివి ఎంత ఆనందంగా ఆమె హృదయం స్పందించిందో ఇప్పుడూ అంతే ఆనందంగా ఆమె హృదయం స్పందించింది.
36
నా నెంబర్ మీకెవరిచ్చారు?
ఫేస్‌బుక్‌లో మీ కామన్ ఫ్రెండ్ ఒకర్ని అడిగి తీసుకున్నాం మేడం.
నాకిప్పుడు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు.
కాదు మేడం. మేము మీ మిక్చర్స్ అన్నీ చూశాం. మీరే ఈ రోల్ కి సెట్ అవుతారు.
ఎందుకలా అనుకున్నారు?
మీ కళ్లల్లో ఒక పెయిన్ ఉంది మేడం. మీలాంటి యాక్టర్ కోసమే నేను చాలా రోజుల్నుంచీ వెతుకుతున్నాను. మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను. మీరు ఈ రోల్ కి డెఫినెట్‌గా సూట్ అవుతారు.
సరే స్క్రిప్ట్ పంపించండి, చూస్తాను.
37
EXT. OUT SIDE THE LOVER’S APARTMENT – EVENIN G
వర్షం పడుతోంది. ఆమె తన కారులోంచి దిగి గొడుగు కూడా తీసుకోకుండా అపార్ట్ మెంట్ బిల్డింగ్ ముందుకు నడిచింది. ఆమె కారు అక్కడ ఆపుతుందనే విషయం తెలియని అతను కంగారుగా కారు దిగి ఆమె వెంటే వెళ్లాడు. ఇంతలోనే వెనక్కి పరిగెత్తుకుని కారు దగ్గరకొచ్చి గొడుగు తీసుకుని ఆమె దగ్గరకు పరిగెత్తాడు.
అతడు
(ఆమెకు గొడుగు పడ్తూ)
ఎక్కడికి? ఇక్కడేం పని నీకు? పద వెళ్దాం.
ఆమె
నాకు ఇక్కడే పని. గత కొన్ని రోజులుగా నీకూ ఇక్కడేగా పని. అందుకే ఈ రోజు ఏదో ఒకటి తేల్చేసుకుందామని వచ్చాను,
అతనేం మాట్లాడలేదు. గొడుగు పట్టుకుని అక్కడే ఆగిపోయాడు. ఆమె ఇవన్నీ ఏం పట్టనట్టు వర్షంలో తడుచుకుంటూ ఆపార్ట్ మెంట్ వైపు నడిచింది.
అతను గొడుగు విసిరేసి నడిరోడ్డులో కూలబడిపోయాడు. ఎక్కడో దూరంగా పిడుగు పడ్డట్టుగా పెద్ద మెరుపు మెరిసింది. ఉరుము ఉరిమింది.
CUT TO:
INT. LOVER’S APARTMENT – EVENING
అపార్ట్మెంట్ లోపల ఒక ఇరవై రెండేళ్ల అమ్మాయి తన లాప్‌టాప్‌లో ఏదో పని చేసుకుంటూ ఉంది. ఇంతలో డోర్ బెల్ రింగయిన శబ్దం. ఆ అమ్మాయి వచ్చి తలుపు తీసింది, ఎదురుగా నిల్చున్న ఒకామెను చూసి
అమ్మాయి
చెప్పండి.
ఆమె
ఏంటి చెప్పేది? నీకేం తెలియదా?
ఆమ్మాయి
మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం కావడం లేదు.
ఆమె
మరీ అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చెయ్యొద్దు.
అమ్మాయి
మీరేం మాట్లాడుతున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ముందు మీరు లోపలకి రండి. మాట్లాడుదాం.
లిఫ్ట్ ఆగిన శబ్దం. అతను లిఫ్ట్ లోనుంచి బయటకు వచ్చాడు. అతను పూర్తిగా తడిసిపోయిన్నాడు. వాళ్లిద్దరూ అతని వైపు చూశారు. ఆ అమ్మాయికి విషయం అర్థమైంది. తన వైపే కోపంగా చూస్తున్న ఆమె వైపు చూసింది ఆ అమ్మాయి.
CUT TO:
38
నాకు స్క్రిప్ట్ అంత నచ్చలేదండీ. చాలా సినిమాటిక్ గా ఉంది.
అదేంటి మేడం. అందరూ బావుందన్నారు. క్లైమాక్స్ లో మీ క్యారెక్టర్ డైలాగ్స్ అందరికీ నచ్చాయి.
అక్కడే నాకు ప్రాబ్లం ఉంది. అలాంటి సందర్భాల్లో మీరు రాసినంత పెద్ద సంభాషణలకు అవకాశం ఉందదని నా ఫీలింగ్.
అంత పెద్ద ఇష్యూ జరిగాక ఆ మాత్రం కోపంగా మాట్లాడాలి కదా మేడం.
లైఫ్ లో అలా జరగదేమో! సో అందుకే నేను రిలేట్ కాలేకపోయాను. ఐయాం సారీ.
39
నిజమైన ప్రేమలా అనిపించేది విషాదాంతమైన ప్రేమ ఒక్కటే
- దేవదాస్,
- లైలా మజ్ను,
- అన్నా కెరినినా
- మైదానం,
- మేడం బోవరీ,
- రోమియో జూలియట్
40
నీకు ఈ విషయం ఇంకా గుర్తుందో లేదో! నాకు మాత్రం ఈ విషయం ఇంకా చాలా బాగా గుర్తుంది. మనం కలిసిన ఒక నెల రోజుల తర్వాత అనుకుంటా. ఆ రోజు మనిద్దరం లంచ్ కి వెళ్దామనుకున్నాం. నేను లంచ్ టైం కి ఆఫీస్ నుంచి బయటకొస్తుంటే, మా టీం లీడ్, ఈ రోజు టీం లంచ్. మర్చిపోయావా? అన్నాడు. చేసేదేం లేక నేను మా టీంతో కలిసి బయటకు లంచ్ కి వచ్చాను. అందరూ జోకులేసుకుంటూ గట్టిగట్టిగా నవ్వుకుంటూ సరదాగా ఉన్నారు. నేను మాత్రం నీతో లంచ్‌కి రాలేకపోయానని నీ గురించే ఆలోచిస్తూ కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాను. వీధిలో ఒకతను చిన్న చిన్న లాంతర్లు అమ్ముతూ కనిపించాడు. ఎందుకో అవి చూడగానే నువ్వే గుర్తొచ్చావు. లాంతరు వెలుతులో నేను చిన్నప్పుడు చదువుకునే వాడిని, అని నీ అమాయకపు కళ్లతో చెప్పిన మాటలు గుర్తురావడం వల్లనేమో! వెంటనే బయటకు వెళ్లి ఆ బుల్లి లాంతరు కొన్నాను. నీకంటే ముందే ఇంటికొచ్చి డైనింగ్ టేబుల్ మీద ఆ లాంతరు వెలుగులో నీతో డిన్నర్ చేయాలని నా కోరిక. అ సాయంత్రం నాకు ఆఫీస్ లో పనుండి కొంచెం లేట్‌గా వచ్చాను. నాకు జాబ్ అంటే చాలా చిరాకొచ్చింది. ఇంటికొచ్చి డోర్‌బెల్ రింగ్ చేశాను. నువ్వు తలుపు తియ్యలేదు. తలుపుతీసే ఉందని కొంచెం సేపటికి అర్థమయింది. తలుపు తీసుకుని లోపలకొచ్చాను. ఇల్లంతా చీకటిగా ఉంది. డైనింగ్ టేబుల్ మీద బుల్లి లాంతరు వెలుతురులో కూర్చుని ఉన్నావు నువ్వు. ఇంకా ప్యాకింగ్ కూడా తియ్యని లాంతరు నా చేతిలోనే ఉంది.
నువ్వెలా కొన్నావిది? అడిగాను.
ఏమో రోడ్ మీద కనిపించింది. ఈ రోజు నీతో ల్యాంటర్న్ లిట్ డిన్నర్ చెయ్యాలనిపించింది. అందుకే కొన్నాను, అన్నాడు.
నా చేతిలో ఉన్న లాంతరు అతనికిచ్చాను. అతను కూడా ఆశ్చర్యపోయాడు.
ఆ రాత్రి బెడ్ మీద పడుకుని మే బి దిస్ ఈజ్ లవ్ అనుకుంటూ చాలా సేపు నిద్రపట్టలేదు.
నెల రోజుల్లోనే కలవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం – ఏంటి మీరిద్దరూ ఇంత ఫాస్ట్ గా ఉన్నారు అని అడిగేవాళ్లందరూ నన్ను. పెళ్లేం లేదు. కొన్ని రోజులు లివిన్ లో ఉంటాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం అని చెప్పేదాన్ని అందరికీ.
41
గత కొన్ని రోజులుగా ఆమె అనుభవానికి వచ్చిన ఏడు విషయాలు:
- అతను ఇప్పుడు ఆఫీస్ అవ్వగానే వెంటనే ఇంటికి తిరిగొస్తుండడం.
- సినిమాలో యాక్ట్ చెయ్యమని అడిగిన దర్శకుడు తనతో మాట్లాడాలని రోజూ ఏదో ఒక విధంగా ప్రయత్నం చేయడం.
- భర్త మీద ఆమెకు కొంచెం కొంచెం గా కోపం తగ్గడం
- తను అనుకుంటున్నట్టుగా ఆ అమ్మాయి వయసు 22 కాకపోవడం
- ఆ అమ్మాయి జుట్టుకున్న పింక్ కలర్ స్ట్రీక్స్ ని మొదటిసారి గమనించడం
- ప్రేమ అనేది కేవలం మన శరీరంలో జరిగే కొన్ని కెమికల్ రియాక్షన్ల ఫలితం అని తెలుసుకోవడం
- అప్పుడప్పుడూ బెడ్ మీద పడుకుని ప్రేమ కేవలం కెమికల్ రియాక్షన్ మాత్రమే కాదేమో అని తనలో తానే వాదించుకోవడం
42
చిరపుంజి నుంచి తిరిగొచ్చి వాళ్లిద్దరూ షిల్లాంగ్‌లో ఒక హోటల్లో దిగారు. డిన్నర్‌కి వెళ్దామా అని అడిగిందామె. లేదు నాకు ఆఫీస్ పనొచ్చింది. నువ్వెళ్లు అన్నాడు. సరే, అని అతని తల మీద ఒక ముద్దు పెట్టి ఆమె బయటకెళ్లింది. చాలా సేపు ఆమె షిల్లాంగ్ వీధుల్లో తిరిగింది. చాలా సేపటి తర్వాత ఆకలేసి ఒక హోటల్లోకి వెళ్లి డిన్నర్ ఆర్డర్ చేసింది. డిన్నర్ అయిన తర్వాత తానుండే హోటల్ దారి మర్చిపోయింది. ఫోన్ చేద్దామంటే మొబైల్ ఫోన్ లేదు. హోటల్లోనే మర్చిపోయింది. చాలా సేపు వాళ్లనీ వీళ్లనీ అడిగి హోటల్ దారి కనుక్కుంది. చీకట్లో నడుచుకుంటూ వస్తుంటే ఆమెకు రోడ్ మీద ఏదో కలర్‌ఫుల్ గా కనిపించింది. దగ్గరకెళ్లి దాన్ని చేతిలోకి తీసుకుంది. అది చిన్న పిల్లల కాళ్లకు తొడిగే ఉలెన్ సాక్స్ లాంటిది. చాలా బావుందనిపించింది ఆమెకు. దాన్ని కోట్ పాకెట్‌లో పెట్టుకుని హోటల్ కొచ్చింది. చాలా కంగారుపడిపోయున్నాడు. కనీసం ఫోన్ చెయ్యాలని కూడా తెలియదా? అని తిట్టాడు. అబ్బా, ఇప్పుడేం కాలేదు కదా అని సముదాయించింది.
ఉదయం ఆమె నిద్ర లేచే సరికి అతను పక్కన లేడు. కొంచెం సేపటికి తిరిగొచ్చాడు. చాలా ఆనందంగా ఉన్నాడు ఆ రోజు. మా ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అయింది అని చెప్పాడు. ఇద్దరం కిందకు దిగి రెస్టారెంట్‌లో కాఫీ తాగుతున్నాం. మధ్యలో ఏదో గుర్తొచ్చి అతను తన షార్ట్స్ పాకెట్‌లో చెయ్యిపెట్టి రంగు రంగుల ఉలెన్ సాక్స్‌ని తీశాడు. ఇది నీకెక్కడిది అని అడిగిందామె. ఉదయం వాకింగ్‌కి వెళ్తే రోడ్డు మీద దొరికింది అన్నాడు.
43
ఒక అజ్ఞాపకం.
మేమిద్దరం ఒక కెఫేలో కలుసుకున్నాం.
మీరనుకుంటున్నట్టు మా మధ్య ఏమీ లేదు. నిజానికి ఇదంతా నా వల్లే జరిగింది. అతని తప్పేం లేదు. ఐ లైక్డ్ హిమ్ ఏ లాట్. ఒకప్పుడు ఆఫీస్ లో చాలా హ్యాపీగా ఉండేవాడు. రానురాను కొంచెం డల్ అయ్యాడు. ఎందుకు అలా అయ్యాడని నేనే అతనితో పరిచయం పెంచుకున్నాను. ఎట్రాక్ట్ చేశాను. కానీ అతను ఎప్పటికీ ఎవరికీ ఎట్రాక్ట్ అవ్వడు. హి లవ్స్ యూ సో మచ్. ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై. ఇట్ వాజ్ జస్ట్ ఏ వన్ నైట్ స్టాండ్. నన్ను నమ్మండి. హీ రియల్లీ లవ్స్ యూ. అండ్ హీ లవ్స్ ఓన్లీ యూ.
నేనేం మాట్లాడలేదు.
తను వెళ్తూవెళ్తూ నన్ను హగ్ చేసుకుంది. మీరు చాలా బావుంటారు అని చీక్-కిస్ చేసింది.
44
“Is it possible, in the final analysis, for one human being to achieve perfect understanding of another?
We can invest enormous time and energy in serious efforts to know another person, but in the end, how close can we come to that person’s essence? We convince ourselves that we know the other person well, but do we really know anything important about anyone?”
– Haruki Murakami
45
ఆ రోజు ఉదయం ఆమె ఏదో తెలియని ఉత్సాహంతో నిద్రలేచింది. అతను ఆఫీస్ కి వెళ్లిపోగానే కంప్యూటర్ ఆన్ చేసి గూగుల్ ఫోటోస్ ఓపెన్ చేసింది. వాళ్లు ఆరేళ్ల క్రితం కలిసినప్పటి ఫోటోస్ చూసింది. మొదట్లో వాళ్లిద్దరూ కలిసి ఫోటోస్ తీసుకోడానికి ఇష్టపడేవాళ్లు కాదు. కలిసిన చాలా రోజుల తర్వాత వాళ్లు హైదరాబాద్ జూలో ఫోటోగ్రాఫర్ చేత ఒక ఫోటో తీయించుకున్నారు. ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకుంది. పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుని దగ్గర్లో ఉన్న ఫోటో స్టూడియోకి వెళ్లి ప్రింట్ తీయించింది. ఇంటికొచ్చి గోడ మీద ఉన్న ఫోటోఫ్రేంలో ఫిట్ చేసింది.
సాయంత్రం అతను ఇంటికొచ్చాడు. గోడమీదున్న ఫోటోఫ్రేం చూసి ఆశ్చర్యపోయాడు. తన చేతిలో ఉన్న ఫోటో ప్రింట్ చూపించాడు. ఇద్దరూ చాలా రోజుల తర్వాత హగ్ చేసుకున్నారు.
ఐ యాం సారీ అన్నాడతను. యూ బెటర్ బి అందామె.
ఇద్దరూ నవ్వుకున్నారు. పద ఎక్కడికైనా వెళ్లిపోదాం కొన్ని రోజులు అన్నాడు.
ఆమె అతని పెదాల మీద ముద్దు పెట్టింది.
46
సినిమా చూస్తుంటాం. ఒక దగ్గరకొచ్చేసరికి ఇక సినిమా అయిపోవస్తోంది అని వాచీ చూసుకోకుండానే ప్రేక్షకుడికి తెలిసిపోతుంది.
హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్‌ని కౌగిలించుకుంటాడు. ప్రేక్షకుడు సంతృప్తిగా కుర్చీలోంచి లేస్తాడు. తెరమీద క్రెడిట్స్ రోల్ అవుతుంటాయి.
కానీ అదంతా అబద్ధం అని కాసేపటికి అర్థమవుతుంది.
హీరో హీరోయిన్లిద్దరూ సంతోషంగా ఇంటికెళ్లిన తర్వాత రోజు అతను తడి టవల్‌ను పరుపు మీదే వదిలేస్తాడు. టాయిలెట్ సీట్ పైకెత్తడం మర్చిపోతాడు. అతను ఆఫీస్‌లో కొలీగ్‌తో వాట్సాప్‌లో సరసాలాడుతుంటాడు. ఆమెకి కోపమొస్తుంటుంది. కానీ ఆపుకుటుంది. కాలం గడిచిపోతుంది. ఆమెకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. వాళ్లకోసం కోపాన్ని అణుచుకుంటుంది. ఆమెకు నలభై ఏళ్ళ వయసు వచ్చేస్తుంది. కళ్లకింద చీకటి వలయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. ఎంత మేకప్ చేసినా ఆ డార్క్ సర్కిల్స్‌ని కనిపించకుండా చేయొచ్చేమో కానీ ఆ కళ్ళలో విషాదాన్ని మాత్రం దాయలేకపోతుంది.
హ్యాపీ ఎండింగ్ అనుకున్న కథ విషాద ఏకాంతంగా కొనసాగుతూనే ఉంటుంది.
47
నిర్లిప్తతను మించిన హ్యాపీ ఎండింగ్ ఏముంటుంది?
“సోల్ సర్కస్” 2019
***
చిత్రం: మహీ
[…] View all posts అలిఖిత నవలలోని నలభై ఏడు శకలాలు […]