బాధను దూరం చేసిందీ కథ!

నిజానికి మన జీవితం చాలా ర్యాండమ్‌గా ఉంటుంది. ఆ ర్యాండమ్‍నెస్‍లోంచి ఏదో కొంత అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టే మనిషి మిగిలిన జంతువులంటే ప్రత్యేకమయ్యాడు. ఈ కథ కూడా అటువంటి పూర్తి ర్యాండమ్‍నెస్‍తోనే సాగుతుంది.

నేను ఇప్పటి వరకు 13 కథలు రాసాను. నేను కథలు రాసాను అనడం కంటే ఆ కథలే నా చేత రాయించాయి అని చెప్పడం కరెక్ట్ అనుకుంటాను. నేను కథ రాసిన ప్రతిసారీ చాలా ఇబ్బందికి గురవుతాను. ఆ కథ నాలోంచి బయటకు వచ్చేంత వరకూ తెలియని ఫ్రస్ట్రేషన్‌కి గురవుతాను. ఆ కథ రాసేసాకే తెలియని బాధేదో నన్ను వదిలిపెడ్తుంది. ముఖ్యంగా “అలిఖిత నవలలోని 47 శకలాలు” కథైతే నన్ను తీవ్రమైన డిప్రెషన్‌కి గురిచేసింది. అయినా కూడా ఒక  కథ రాయడానికి ఇంత కష్టపడాలా అనిపించలేదు. నిజానికి నాలోంచి ఎప్పటికీ తీరదనుకున్న బాధను దూరం చేసిందీ కథ. అందుకే ఈ కథంటే నాకు చాలా ప్రత్యేకమైన ఇష్టం. అంతే కాకుండా ఇందులో నేను చేసినన్ని ప్రయోగాలు మిగతా ఏ కథలోనూ చెయ్యలేదు. నాకు తెలిసిన, చదివిన కథల్లోని శిల్పాన్ని ఎక్కడా ఉపయోగించకుండా ఈ కథకు మాత్రమే కలిగి ఉండే  శిల్పంతో ఈ కథారచన చేశాను. అందుకు కూడా ఈ కథంటే నాకు చాలా ఇష్టం.

టెంప్లేట్‌కి భిన్నంగా, ఇదివరకు ఎవరూ చెప్పని విధంగా, ప్రయోగాత్మకంగా కథ చెప్పాలి అని నేను ముందే అనుకోను. నా ప్రతి కథలోనూ ఏదో ఒక ప్రత్యేకతను ప్రదర్శించాలని పాఠకులకు అనిపించినా అది తెచ్చిపెట్టుకున్న శైలి కాదు. ఉదాహారణకు, నేను కథల్లో ఎక్కడా సంభాషణల కోసం ప్రత్యేకంగా  కొటేషన్ మార్క్స్ ఉపయోగించను. అది కావాలని చేసింది కాదు. కొటేషన్ మార్క్స్ అవసరం లేదనిపించింది. ఇంతవరకూ నా కథలు చదివిన వాళ్ళెవరూ కొటేషన్ మార్క్స్ లేని కారణంగా కథ అర్థం కాలేదు అనలేదు. అంతేకాదు ఇదే ఇంకా చదువుకోడానికి సులభంగా ఉంది అన్నారు.

అలాగే నాకథలన్నీ కూడా నాన్‌లీనియర్‌గా నెరేట్ చేశాను. అందులో కొంత స్వార్థం ఉంది. చాలా సార్లు కథలో ముందు పేజీ చదివి, చివరి పేజీ చదివితే కథంతా అర్థమైపోతుంది. పాఠకులు ఇలా స్కిప్ చేస్తూ చదవడం నేను చాలా సార్లు చూశాను. నేను కూడా చాలా సార్లు అలా చదివిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మొదట్నుంచి చివరిదాకా  చదువుకుంటూ వెళ్తేనే నా కథ అర్థమయ్యేలా, చదువుతున్నంతసేపూ పాఠకుడు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేలా కథలు రాయాలనే ఉద్దేశంతో  నేను ఈ టెక్నిక్ ద్వారా కథలు రాసాను. అయితే నా కథల్లోని వస్తువుని మాత్రం పాఠకులు రిలేత్ చేసుకునే విధంగా ఉండేలా జాగ్రత్త పడుతూ వచ్చాను. మామూలుగా ఇలాంటి ప్రయోగాత్మకంగా రాసే కథల్లో ఉండే అబ్సర్డిటీ నా కథల్లో ఉండదు.

“సోల్ సర్కస్” పుస్తకం ప్రచురిస్తున్నప్పుడు, అప్పటివరకూ ప్రచురితమైన పది కథలతో పుస్తకం తేవాలనుకున్నాను. కానీ ఆ కథలన్నీ ఇది వరకే ఎక్కడో దగ్గర చదివిన పాఠకుల కోసం ఒక్కటైనా ప్రచురణ కాని ఒరిజినల్ కథ ఒక్కటైనా పుస్తకంలో ఉండాలని ఆలోచించి “అలిఖిత నవలలోని 47 శకలాలు” కథ రాసాను. అప్పటివరకూ నేను రాసిన కథలన్నీ ఒకెత్తైతే, ఈ కథ మరొక ఎత్తు.

అదే సమయంలో నేను కొర్తజార్ అనే అర్జెంటినా రచయిత రాసిన ఒక కథను అనువాదం చేస్తున్నాను. కొర్తజార్ కథల గురించి చెప్తూ, జార్జ్ లూయీ బోర్హెస్ ఏమన్నారంటే – “No one can retell the plot of a Cortázar story; each one consists of determined words in a determined order. If we try to summarize them, we realize that something precious has been lost.”

బోర్హెస్ చేసిన ఆ స్టేట్‌మెంట్ నాకు చాలా ఇన్‍స్పైరింగ్‍గా అనిపించింది. ఒక కథ రాయాలి. అది ఎలా ఉండాలంటే ఆ కథ చదివిన పాఠకుడికి మాత్రమే అర్థమవ్వాలి. అంతేకాదు ఒక్కో పాఠకుడికి ఒక్కోలా అర్థమవ్వాలి అని అనుకుని రాయలేదు కానీ, మనసులో ఎక్కడో ఆ పాయింట్ నాలో గట్టిగా ముద్రించుకుపోయినట్టుంది. అందుకే, నాకు తెలిసినటువంటి స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ ఈ కథ నా చేత రాయించుకుంటూ వెళ్ళింది.

నిజానికి మన జీవితం చాలా ర్యాండమ్‌గా ఉంటుంది. ఆ ర్యాండమ్‍నెస్‍లోంచి ఏదో కొంత అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టే మనిషి మిగిలిన జంతువులంటే ప్రత్యేకమయ్యాడు. ఈ కథ కూడా అటువంటి పూర్తి ర్యాండమ్‍నెస్‍తోనే సాగుతుంది. ఆ ర్యాండమ్‌నెస్‍లో మీకు తప్పకుండా అర్థమైతే ధ్వనిస్తుంది. Searching for beauty in the chaos అన్నట్టు. నా వరకూ నిజ జీవితానికి అతి సమీపంగా రాయగలిగిన  కథ ఇది. నేను ఇప్పటివరకూ రాసిన అతి పెద్ద కథ కూడా ఇదే.

అన్నింటికంటే ముఖ్యంగా ఈ కథ పాఠకులను ఎంతో ఉన్నత స్థాయిలో ఊహించి రాసిన కథ. వారి ఇంటెలిజెన్స్‌ని గౌరవించే కథ ఇది. కథల పరంగా రుడిమెంటరీ టెక్నిక్స్‌ని మాత్రమే పట్టుకుని వేలాడకుండా, ఎంత కొత్త టెక్నిక్‌లో చెప్పినా పాఠకులు ఈరోజు ఎంతో మేధస్సు కలిగి ఉన్నారు, వారికి వివిధ రకాల కథన రీతుల పట్ల అవగాహన ఉందనే నమ్మకంతో రాసిన కథ. ఈ కథలో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ నెరేటివ్స్ కలగలిపి ఉన్నాయి. అయినా కూడా పాఠకులు ఎక్కడా గందరగోళానికి గురవ్వరు. పైగా ఆయా సందర్భానికి అదే సమంజసం అని కూడా అర్థం చేసుకోగలరని అనుకున్నాను.

ఈ కథను ఇదివరకే చదివిన చాలామంది స్పందన కూడా నాకు చాలా సంతృప్తినిచ్చింది. వారి స్పందన విన్నాక ఇది నేను రాసిన కథ అని గర్వంగా చెప్పుకోగలను అనిపించింది. అంతేకాదు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ చదువుతుంటే రాసిన నాకే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అందుకే ఇది నా కథల్లో నాకు ఇష్టమైన కథ.

*

వెంకట్ శిద్ధారెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు