అరుగు

తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు! అమ్మతో ఒక కేకు కట్ చేసి తినిపించి, తర్వాత ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఆలోచిస్తున్నాము. ఈ యాంత్రిక ప్రపంచంలో పిల్లల కష్టాలను అర్థం చేసుకున్న ఒక తల్లి కథే ఈ అరుగు.

“నాన్నమ్మా .. అమ్మ లోపలికి రమ్మంటుంది”  ఆరేళ్ళ బుజ్జిగాడు  బొద్దుబొద్దుగా చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు తుర్రుమని.   గ్రౌండ్ ఫ్లోర్ లోని అపార్ట్మెంట్  బయట ఒక కుర్చీ వేసుకుని  వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడాలని ఉబలాటం రత్నమ్మకి.  ఇంట్లో కూర్చుని   దిక్కు మాలిన టి.వీ సీరియల్స్  చూడాలంటేనే  బయపడి పోయేది. బయట కూర్చోగానే తనకు ఊరు  జ్ఞాపకం వచ్చేది,  ఊర్లో వచ్చేపోయే వారితో మాట్లాడినట్టు ఊహల్లోకి వెళ్లి పోయేది. బయటకు వచ్చిన  రెండు నిముషాల లోపలే  కోడలు నుండి పిలుపు వస్తుందని తెలుసు రత్నమ్మ కి.

బయట కూర్చున్న ప్రతి సారి జ్ఞాపకాలు ఊరిని వెంటాడుతాయి, అసలు ఆ ఊరి జ్ఞాపకాల కోసమే రత్నమ్మ బయట కూర్చుంటుంది.  ఊర్లో ఉన్నప్పుడు  తీరిక వేళల్లో అరుగు మీద కూర్చుని  వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడందే  పొద్దు గడవదు రత్నమ్మకి. భర్త పోయిన తర్వాత ఒంటరిది అయినా, ఆ అరుగు మీద కూర్చున్నప్పుడు భర్త తోడుగా ఉన్నట్టు అనిపించేది.  ఆ అరుగుకి రత్నమ్మకి ఏళ్ల నాటి అనుబంధం.   దేశముఖ్ లు, జాగీర్దార్ ల పై పోరాటాలకు,   రజాకార్ల దాడులను తిప్పికొట్టేందుకు అంకురార్పణ జరిగింది ఆ అరుగు మీదే.  గ్రామ రక్షక దళాలకు అంకురార్పణ జరిగింది ఆ అరుగు మీదే,  గుళ్లో సీతారాముల కళ్యాణం జరగాలన్నా అన్నీ  ఆ అరుగు మీదే నిర్ణయించబడేవి.

“అత్తయ్యా , లోపకిలి రండి, అక్కడ కూర్చుంటే బాగుండదు”    కొడుకుతో  పిలిపించినా  ఇంకా రాలేదని కోడలి  అరుపు లాంటి పిలుపుకి ఊరి జ్ఞాపకాలనుండి అరుగు అనుబంధం నుండి బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళింది రత్నమ్మ. నీళ్లు వృధా చేయడం,  పరిసరాలు శుభ్రంగా ఉంచుకోక పోవడం లాంటి నిబంధనలకు ఎన్ని నోటీసులు ఇచ్చినా పట్టించుకోని వారు మాత్రం ,  అపార్ట్మెంట్ అనగానే తలుపులు ఎప్పటికీ  మూసిపెట్టి   ఉండాలనే నిబంధనలుమాత్రం  ప్రతి ఒక్కరు  తప్పకుండా అమలు చేస్తారు అని నవ్వుకుంది తనలోనే.

సోఫాలో కూర్చున్న రత్నమ్మ కి,   కూర్చున్నట్టే కానీ జ్ఞాపకాలు ఎప్పుడూ ఊరి చుట్టే!  ఇంటి పక్క శాంతమ్మ కోడలు కడుపుతో ఉండే , ఇప్పటికే పిల్లో,  పిలగాడో  పుట్టి ఉంటాడు.   పని మనిషి రాజమ్మ కొడుకు  దుబాయి నుండి రాగానే పెళ్లి చేస్తా అంది, వాడు వచ్చే ఉంటాడు.. ఇంకా ఎన్నో  ఆలోచనల్లో మునిగి పోయుంటే  “ఏమండీ! వాచ్మెన్  లాగా మీ అమ్మ  అలా బయట కూర్చుండడం ఏమీ బాగాలేదు, మీరయినా చెప్పండి”  లోపలి నుండి తన ఆలోచనలకు అడ్డు కట్టలా  కోడలు కొడుకు తో చెప్తున్న  మాటలు స్పష్టంగానే వినపడ్డాయి.

రత్నమ్మకి ఇప్పుడు డెబ్బయ్  సంవత్సరాల పైమాటే.  నాలుగేళ్ల క్రితం భర్త  చనిపోయిన తర్వాత కొడుకులు తమ దగ్గరికి  రమ్మని చాలా సార్లు అడిగినా ఒంటరిగా ఊర్లోనే ఉండింది తన భర్త జ్ఞాపకాలలో!   ఎంతో మందికి వంట చేసి పెట్టిన చేతులు,రజాకార్ల తో,జాగీర్దార్లతో పోరాటానికి భర్త కు అండగా నిలబడి సవాల్ విసిరిన ఆడపడుచు ఆమె.  వ్యవసాయ పనుల్లో చురుకుగా పాల్గొని కాయకష్టానికి అలవాటు పడ్డ శరీరం.  ఏ పనికీ  ఇతరులపై ఆధారపడని స్వతంత్ర మనస్తత్వం.  ఓపిక ఉన్నంత వరకూ ఊర్లోనే ఉంటానని, తనని  పట్నం రమ్మని బలవంత పెట్టవద్దని కోరింది కొడుకులని.

అందరూ పల్లెలు విడిచి పట్నాల వైపు  బతుకు తెరువు కోసం చూస్తుంటే, ఎందరికో బతుకునిచ్చి ఒకప్పుడు కళకళ  లాడిన ఇండ్లు క్రమంగా నేలమట్ట మవుతుంటే రత్నమ్మ మనసు విలవిల లాడేది. ఎంత లేదన్నా తన భర్త ఉన్నప్పుడు  ఇంట్లో ప్రతిరోజు పది, పదిహేను మందికి వంట చేసేది. పొలంలోపని చేసే వాళ్లకు అందరికి వంట ఇంట్లోనే.  రైతాంగ పోరాటంలో చురుకుగా పాల్గొన్న తన భర్త, కమ్యూనిస్టు నాయకులతో కలిసి పనిచేసి తను నేర్చుకున్న సిద్ధాంతాలు అమలు చేసే ప్రయత్నం చేసేవాడు.  పోరాటంలో అన్ని కులాల వాళ్ళతో కలసి పనిచేయడం, అందరూ కలసి ఒకే తిండి తినడం అలవాటు చేసుకున్న ఆయన పొలంలో పని చేసే కూలీలతో కలసి భోంచేసే వాడు. ఈ ఒక్క విషయంతోనే, ఆయన మనస్తత్వం అందరికీ అర్థం అయ్యేది.   రైతు కూలీలు రెట్టింపు ఉత్సాహంతో పని చేసే వారు ఏ పని చెప్పినా.  ఆయన పోయిన తర్వాత  చాలా క్రుంగి పోయిన రత్నమ్మ, అన్ని బాధ్యతలు ఒంటరిగా మోయడం తన వళ్ళ కాలేదు.  కొడుకులు పట్నాన్ని,  ఉద్యోగాన్ని  వదలి  వచ్చేట్లు లేరు.   దానికి తోడు వర్షాలు పడక పోవడం చాలా మంది  రైతులని ఇబ్బందులకు గురి చేసింది.  నీళ్లు లేక, వేసిన పంటలకి  పెట్టుబడి రాక రోజురోజుకీ  దిగ జారి  పోతున్న రైతుల బ్రతుకులు, పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు.  బాగా బతికిన రైతులు పట్నాల్లో కూలీలు గా మారటం కూడా చూడ లేక పోయింది.

వయసుతో పాటు పెరుగుతున్న మోకాలు నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్రంగా బాధ  పెట్టినా,  ఎవ్వరినీ ఇబ్బంది పెట్టవద్దని  బాధనంతా తనలోనే దిగ మ్రింగింది.  కానీ  ఈ మధ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది క్రమంగా ఎక్కువ అవుతుంటే  హైదరాబాద్ తీసుకెళ్లి పరీక్షలు చేయించారు కొడుకులు.  ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలు కనుక్కున్నారు డాక్టర్లు.   రక్తంలో  ఆక్సిజన్ నిలువలు తగ్గి పోతున్నాయని దానికి మందులతో పూర్తిగా నయం కాదు అని,   ఒక పాప్ మిషన్ అవసరం అని కొన్నారు డాక్టర్ సలహా పై.  ఊపిరి తిత్తులు చేయవలసిన పనిని ఆ పెద్ద మిషన్ చేస్తుంది.  ఈ పరిస్థితిలో తను ఒక్కతే  ఊర్లో ఉంటే  కష్టమని  హైదరాబాద్ లో  ఉండే ముగ్గురు కొడుకులూ మాట్లాడుకుని ప్రతి నెల ఒకరి ఇంట్లో ఉండే సర్దుబాటు  చేసుకుని కొన్ని నెలల క్రితం తమ దగ్గరికి  తీసుకు వచ్చారు రత్నమ్మని  కొంత  బలవంతంగానే. తల్లి తండ్రుల  ఆస్తులను పంచుకోవడం సాధారణమే అయినప్పటికీ  ఇప్పుడు  వారి ఆలనా పాలనా కూడా నెలల వారీగా పంచుకోవడం కొంత విస్మయానికి గురిచేసింది.  తల్లి తండ్రులని అసలే పట్టించుకోని కొడుకులున్న ఈ రోజుల్లో నెలకొక సారి ఇల్లు మారడం మనసుకుకి భారంగా ఉన్నప్పటికీ  పెద్ద కష్టమేమీ కాదనుకుంది, దాని కన్నాఇప్పుడు  పాప్ మిషన్ వాడకమీ పెద్ద  ఇబ్బందిగా ఉంది.

కడుపులో ఇంత ముద్ద  పడ్డా, పడక పోయినా  ఊరిలో ఒకరికొకరు పలకరించుకోవడంలోనే సగం కడుపు నిండి పోయేది.  ఇక్కడ పరిస్థితి,  సముద్రంలో ఉండి  తాగు నీరు కోసం ఇబ్బంది పడ్డట్టు,  చుట్టూ మనుషులే కానీ ఒక్కరికీ  ఒక్క మాట మాట్లాడడానికి  సమయం ఉండదు.  ఉరుకుల పరుగుల జీవితం, దానికి తోడు ఇప్పుడు మాయదారి ఫోన్,  దానిలో పాడుమల్ల  ఆటలు, ఇకఇకలు పకపకలు.  పక్క వాడి  గురించి పట్టించుకోని నగర  జీవితాలు ఇప్పుడు మాయదారి సెల్ ఫోన్లు వచ్చినంక  స్వంత వాళ్ళ గురించి కూడా  పట్టించుకోకుండా తయారయ్యాయి. మాట్లాడానికి కనిపెట్టిన ఫోను, ఆటలకు మాత్రమే  పనికి రావడం చూసి బాధ పడింది.   పక్క వాళ్ళతో మాట్లాడుతున్నా  కళ్ళు  మాత్రం ఫోన్ పైనే!   మొఖాలు చూసి మాటలాడమే కరువైన రోజులు  చాలా విచిత్రంగా ఉంది  రత్నమ్మకి. “తలెత్తుకొని తిరిగే బతుకు బతకాలని”  పెద్దలు అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఈ విధంగా అందరికీ వర్తిస్తుందేమో  అనుకుంది తనలో తాను.

రక్త  సంబంధీకులు, పేగు తెంచుకొని పుట్టిన పిల్లలు పక్కనే  ఉన్నా, ఇన్ని రోజులు  ఆ ఊరితో పెనవేసుకున్న అనుబంధాలని, ఆత్మీయులని వదలి  వేసి వచ్చినట్టనిపించేది ఊరు జ్ఞాపకం వచ్చినప్పుడన్నా!  తనకు పెళ్లయిన కొత్తలో  ప్రతి రోజు సాయంత్రం ఊర్లో ఉన్న బుర్జు దగ్గర ముచ్చట్లు చెప్పుకొనే వారు.  అప్పుడప్పుడే  మొదలవుతున్న రైతాంగ పోరాటాలు,  గ్రామరక్షక దళాల ఏర్పాటు లాంటి సమావేశాలన్నీ తమ ఇంటి పెరట్లోకి మారి పోయినవి.  గుర్రపు స్వారిలో తన భర్త ను చూస్తుంటే చిన్నప్పుడు  అమ్మమ్మ చెప్పిన కలలో రాజకుమారుడు గా కనిపించే వాడు ఆయన.   ఆయుధాలకు పదును పెట్టడం,  రజాకార్లను ఎదిరించేందుకు నాటు తుపాకులు  చేసేందుకు కమ్మరి కొలిమిల్లో  భర్తతో కలిసి పని చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి.  శత్రువు నుండి రక్షించుకునేందుకు పిల్లలందరితో పశువుల కొట్టంలో కాపురం పెట్టిన రోజులు గుర్తుకొచ్చాయి.  నెల రోజులకు పైగా ఊరిని, పిల్లలని వదలి  పోరాటాల్లో పాల్గొనడానికి పోయినపుడు  మళ్ళీ భర్త వస్తాడో రాడో కూడా తెలియని భయం లోపల ఉన్నా బయటకి మాత్రం  ధైర్యంగా పిల్లలందరికీ తండ్రి లోటు లేకుండా పెంచింది.  ఊరిలో జరిగే  ఏ కార్యమయినా, తన భర్త లేనిదే జరిగేది కాదు.   అందరికీ తలలో నాలుకగా బతికిన ఆయన నుండి నేర్చుకున్న పాఠాలు కూడా చాలానే.   ఎప్పుడూ ఇతరులపై ఆధారపడి బ్రతుకలేదు.

ఊరి పెద్ద కోమటి  వృద్ధాప్యంతో మంచం పడితే  నలుగురు కొడుకులున్నప్పటికీ చేయడానికి ఎవ్వరూ దగ్గరికి రాలేదు. అన్నీ  బట్టల్లోనే చేసేసుకుంటుంటే,  పని వారు కూడా అసహ్యించుకునే వారు.  అప్పట్లోనే లక్షల్లో ఆస్తులు సంపాదించినా,  తన స్వంత ఇంట్లోనే నరకాన్ని చవి చూసాడు చివరి రోజుల్లో.  ఆ పెద్ద కోమటి ఎందరినో సతాయించి,  అక్రమంగా  ఆస్తులయితే సంపాదించాడు కానీ ఊరి అందరితో అసహ్యించుకోబడ్డాడు. తండ్రి పోయిన మరుక్షణం ఆస్తుల్లో వాటాలకోసం బిడ్డలందరూ వాలడం చాలా ఆలోచింప చేసింది రత్నమ్మ భర్తని. అప్పటినుండి వృధాప్యంలో ఒకరి తో చేయించుకునే బ్రతుకు వద్దని అనేవాడు రత్నమ్మ భర్త.  మృత్యువు  తెలియకుండా రావాలి ఏదో ప్రమాదంలో హఠాత్తుగా ,  లేదా శత్రువు ఎన్కౌంటర్ రూపంలో,  లేదా  గుండె ఒక్క సారిగా ఆగిపోవడం రూపంలో కానీ అనేవాడు.   మృత్యువుకి వేరేగా  అర్థం అయ్యినట్టు ఉంది,   ఆయనకు మాత్రమే తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలియకుండా,      మెదడుకు సంబధించిన వ్యాధితో కొద్ది  రోజులు మాత్రమే పోరాడి ఓడిపోయాడు. దాదాపు ఆయన అనుకున్నట్టుగానే ఎవరికీ పెద్దగా ఇబ్బంది కల్గించకుండానే  ఈలోకం వదలి పోయారు. ఈ జ్ఞాపకాలతో పాటు దాగివున్న కన్నీళ్లు కూడా ధారగా ప్రవహిస్తుంటే కోడలికి తెలియకుండా తుడుచుకుంది రత్నమ్మ.   ఎన్నో విషయాలు నేర్చుకుంది భర్త నుండి, అయినా ఆమె మనుసులో ఇప్పటికీ మరవలేక పోతుంది తన భర్త చివరగా అన్న మాటలు   “ఒకరితో చేయించుకునే బ్రతుకు వద్దు, యోగిలా చనిపోవాలి కానీ రోగిలా కాదు ” అని.

మిగతా ఇద్దరు కొడుకులు సిటీకి దూరంగా  ఒక చిన్న ఇండిపెండెంట్ ఇంట్లో నివసిస్తున్నారు.  ఇంటి ఆవరణలో కొన్ని పూల చెట్లు, దానికి ఒక చిన్న గేటు.   గేటులో కుర్చీ వేసుకుని కూర్చుంటే కొంత మేరకు అరుగు పైన కూర్చున్నట్టే అనిపించేది. చిన్న కొడుకు మాత్రం అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు.  ఒకటి రెండు రోజుల కోసం చాలా సార్లు  చిన్న కొడుకు అపార్ట్ మెంట్ కు వచ్చి వెళ్ళింది  కానీ , అప్పుడేమంత  ఇబ్బంది అనిపించలేదు.   కానీ,  ఇప్పుడు ఇన్ని రోజులు ఈ  ఇంట్లో ఉండటం, ఎప్పుడూ తలుపులు మూసేసుకొని ఇంట్లోనే ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది  రత్నమ్మకి.   పక్క ఇంటి వాళ్ళు ఏదో  శతృదేశం వాళ్ళు అన్నట్లు కనీసం  పలకరింపులు కూడా లేకుండా పక్క పక్కనే నివసించడం  చాలా వింతగా ఉంది రత్నమ్మకి.  ఈ యాంత్రిక జీవనానికి అలవాటు పడటం చాలా కష్టంగా తోస్తుంది.

మొన్నటికి మొన్న ఇంకొక కొడుకు వద్ద , మనవడికి అన్నం  తినిపిస్తుంటే .. అయ్యొయ్యో..  చేతితో వద్దు అత్తయ్యా అని చెంచా ఇచ్చి పోయింది కోడలు.   అన్నము పప్పు,  కొన్ని సార్లు  కారం అన్నం కూడా  చేతితో ముద్దలు చేసి పెడుతుంటే పోటీలు పడి నోరు తెరిచే వారు తన పిల్లలు, ఆ గోరు ముద్దల  విలువ ఈ  తరం పిల్లలకి ఎలా తెలుస్తుంది? తినిపించినంత సేపు ఏవో నీతి కథలు చెపుతూ ఉంటే ఆవురావురు మని తినేవారు పిల్లలు, మరి ఇప్పుడు ఆ మాయదారి రంగు రంగుల ఫోన్లో  ఆటలు చూస్తేనే బుక్క లోపలి పోతుంది పిల్లలకి.  చిన్న పిల్లలకి ఎన్నో వ్యాధులకు మూలం సెల్ ఫోన్లు అని అందరూ  చెపుతున్నా  ఎవ్వరు వినేట్టున్నారు?  వందల మంది గ్రామ రక్షక దళాలకు రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా వండి తినిపించిన  చేతులు, ఇస్తరాకులు,  పళ్ళాలు  లేకుంటే అందరికి చేతిలో  ముద్లలు పెడితే తిని  పొట్ట నింపుకున్న వారు ఇప్పటికీ ఆ చీకటి రోజులని గుర్తుచేసుకుంటే,  ఈ రోజు  స్వంత పేగు బంధానికి తినిపించేందుకు పనికి రాకుండా పోయాయి ఈ చేతులు !  నగర జీవితం, ఊరి జ్ఞాపాకాలతో  ముడిపెడుతూ  అనుభవాలు ఒక్కొక్కటి  గుర్తుకు తెచ్చుకుంటుంది సోఫాలో కూర్చుని  రత్నమ్మ.

అందరు కొడుకులూ , కోడళ్ళు బాగానే చూసుకుంటున్నారు.  ఏ అవసరానికయినా  డబ్బు, తిండికి   ఏ మాత్రం ఇబ్బంది  లేదు, కాక పొతే బంగారు పంజరం అయిపొయింది బతుకు!   నిలుచున్నా తప్పే, కూర్చున్న తప్పే!   వాళ్ళ కోణం నుండి కూడా అలోచించి చూసింది, అవును బయట వాచ్మెన్  ఒక్కడే కుర్చీ వేసుకు కూర్చుంటాడు ఇరవై నాలుగు గంటలూనూ, ఊర్లో  అయితే  దొరల జమానా కి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటాల్లో పాల్గొన్నప్పుడు అన్ని కులాల వారు అందరూ  ఒకే చోట, పొలం గట్టు మీదో , గొడ్ల చావిడీలోనో  కలసి కూర్చోలేదా? అంతే  కాదు కలసి తిన్నాం కూడా!   మరి ఇక్కడ బయట కూర్చున్నంత  మాత్రాన అంత చిన్న చూపు ఎందుకో?  చూడపొతే వాచ్మెన్   బ్రతుకే హాయిగా ఉన్నట్టు ఉంది, రోజూ అందరినీ పలకరిస్తాడు, వచ్చి పోయే అతిథుల వివరాలు కనుకుంటాడు,ఇందులోనే కొంత ఉపశమనం పొందినట్టు కనిపిస్తాడు.  వాళ్ళ ఇండ్లలో వండుకున్న వంటలు కూడా తెచ్చిస్తారు.  ఎప్పుడూ తనతో మర్యాదగా మాట్లాడే కోడలు ఈ రోజు మొట్టమొదట భర్తకు పిర్యాదు చేయడం, ఇది చిన్న విషయం అయినప్పటికీ అంత తొందరగా  రత్నమ్మ మనసులోంచి పోవడం లేదు.   ఆలోచనలు తీవ్రతరం అవుతున్నాయి.   ఆలోచనలు తీవ్రం అయినప్పుడు శరీరం భాగాలపై  వత్తిడి ఎక్కువ అవుతుంది, ఆ ప్రభావం  శ్వాస తీసుకోవడం పై పడింది, చాలా ఇబ్బందిగా ఉంది శ్వాస తీసుకోవడంలో!  ఇదంతా గమనించిన కోడలు వెంటనే పాప్ మిషన్ ని అమర్చింది.   “ఎప్పుడూ  మిషన్ పెట్టుకోవాలి అంటే మీరు దాన్ని ఉపయోగించడం లేదు”  సుతి  మెత్తని హెచ్చరిక అని అర్థం అయ్యింది రత్నమ్మకి.

తినడానికి, పడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఒక మనిషికి   స్వేచ్ఛ అంటే తన మనసుకు నచ్చినట్టు జీవించ లేక పోవడం ఎంతటి  ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడిప్పుడే అర్థం  అవుతుంది రత్నమ్మకి.   ఇందులో వారిని తప్పుబట్టేది ఏమీ లేదు,  ఇక్కడి నగర సమాజం కొన్ని పద్ధతులని తమపై తామే  బలవంతంగా రుద్దుకున్నారు,  అందరూ గొర్రెల మందగా  దాన్నే అనుసరించడం, ఏ ఒక్కరూ దానికి భిన్నంగా తమకు నచ్చిన విధంగా నడుచుకోకపోవడం  చాలా విచిత్రంగా తోచింది.  ఇదే విషయం ఒకసారి కొడుకుతో అని చూసింది, “ఇక్కడ కమిటీ ఉంటుంది, వాళ్ళే నిర్ణయిస్తారు, గేటు ఎప్పుడు మూయాలో, నీళ్లు ఎప్పుడు పట్టుకోవాలో, పిల్లలు ఎంత సేపు ప్లే ఏరియాలో ఆడుకోవాలో ..”  ఇంకా ఏవో ఏవో చెప్పాడు, కానీ రత్నమ్మ మట్టి బుర్రకి  అందేలా లేవు అవి.  ఒక్కటి మాత్రం అనగలిగింది  నిష్టూరంగా  “ఎప్పుడేం తినాలో, ఎవరేం తినాలో కూడా వారే నిర్ణయిస్తే ఇంకా ఏ బాధా ఉండదు కదా ”  అని.    కొడుకూ, కోడలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు,  ఇంకేమీ పొడిగించడం ఇష్టం లేక.

వందల మందికి వంట చేసిన చేతులు, ఇప్పుడు స్వంత కొడుకు కి కూడా వంట చేయడానికి పనికి రాకుండా పోయాయి, కొడుకుకి  ఇష్టమని ఏదన్నా వండాలనిపించి  వంట గదిలోకి పోవాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఎటూ కష్ట పడి  వండితే , తినిపించబోతుంటే  అది, కొలస్ట్రాల్, ఇది బిపి ,ఇది షుగరు అని వంకలతో తిననీయక పోవడం చాలా బాధేసింది రత్నమ్మకి.   ఎంత ఆపు కోవాలనుకున్నా,  ఆలోచనలను ఆపలేక పోయింది, శ్వాస ఇంకా ఎక్కువ అయింది,  వెంటనే చిన్న కొడుకు  తన  రెండవ అన్నకి ఫోన్ చేస్తే బిపి చూడమన్నాడు అమ్మ బ్యాగులో  మిషన్  ఉంది అన్నాడు.  బిపి  చూస్తే బాగా పెరిగింది.  వెంటనే తన కారులో దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు చిన్న కొడుకు.

“మంచి సమయానికి తీసుకు వచ్చారు, ఇంకా ఆలస్యమయితే చాలా  ఇబ్బంది అయ్యేది” అని వెంటనే  ఆక్సిజన్ మాస్క్ తొడిగి ఏవో టెస్ట్ లు, గోళీలు ఇచ్చి బిపి ని శ్వాస ని అదుపులోకి తేగలిగాడు డాక్టర్. కొద్దీ సేపట్లోనే మిగతా ఇద్దరు కొడుకులు హాస్పిటల్ కి చేరుకున్నారు.  కొన్ని గంటల్లో పరిస్థితి ప్రశాంతం అయ్యింది, పెద్దగా ఇబ్బంది లేదు,  కానీ ఊపిరి తిత్తులు కేవలం పదిహేను శాతం మాత్రమే పని చేస్తున్నాయి, పూర్తి  ఆక్సిజన్ కావాలి  అంటే ఆ మిషన్ ఉపయోగించాల్సిందే అన్నాడు డాక్టర్.

“ఎందుకైనా మంచిది  ఒక రెండు రోజులు ఇక్కడే  అబ్జర్వేషన్లో ఉండనీ, ఆ తర్వాత  ఇంటికి తీసుకెళ్లొచ్చు” అన్నాడు డాక్టర్.   ఆ తర్వాత కొడుకులందరూ మాట్లాడుకున్నారు.  మిషన్ వాడక పొవడం, బయట కూర్చోవడం  గురించి జరిగిన తంతు అంతా  వివరించాడు చిన్న కొడుకు.  ఇక్కడ ఇబ్బంది ఉంటే నేను తీసుకెళ్తాను అన్నారు మిగతా ఇద్దరు కొడుకులు.    నాకేమీ ఇబ్బంది లేదు అన్నాడు చిన్న కొడుకు,  చివరకి నిర్ణయం అమ్మకే వదిలేశారు.  అందరికీ అమ్మంటే ప్రేమే, కానీ ఇక్కడి పరిస్థితుల వల్ల  అమ్మ ఇబ్బంది పడుతుంది అని మాత్రం అర్థం అయ్యింది కొడుకులకి, కోడళ్ళకీ .

రెండురోజుల తర్వాత అమ్మ బాగానే ఉంది, లేచి తిరుగుతుంది.  పక్క పేషంట్స్ తో మాట్లాడుతుంది, వారి వివరాలు కనుక్కుంటుంది.   పూర్తిగా మంచానికే పరిమితమయిన ఒక పేషంటుని చూసింది, సంవత్సరం క్రితం పక్షవాతం వచ్చి కుడి భాగం మొత్తం పడిపోయింది, అన్ని పనులు భార్య ఒక్కతే  చేయలేక పోతుందట. మొదట కొన్ని రోజులు కొడుకులు బాగానే చూసుకున్నా  ఇప్పుడు ప్రతి దానికి విసుక్కుంటాన్నారట.   భార్య దీనంగా ఆ భర్త వైపు చూస్తున్న చూపులు, ఫోన్ చేస్తే విసుక్కునే కొడుకులు,  ఇంకా ఎన్ని రోజులు భరించాలి అని బాహాటంగానే అనడం రత్నమ్మని  విస్మయానికి గురిచేసింది.  ఈ సంఘటన తనను బాగా ఆలోచింప చేస్తుంది.

డిచ్చార్జీ  చేసే సమయం వచ్చినప్పుడు ఎక్కడుంటావని అడిగాడు పెద్ద కొడుకు.  చిన్న కొడుకుది అపార్టుమెంట్ అయినా, విశాల మైన బెడ్ రూమ్,  హాలు ఉన్నాయి.   కానీ మనసుకు నచ్చినట్టు జీవించలేని, నడుచుకోలేని ఇరుకుతనం అది. అయినా  చిన్న వాడిని బాధపెట్టొద్దని   ముందు అనుకున్న ప్రకారం నెల రోజుల గడువు ఇంకా కాలేదని, అందరు కొడుకులకూ ఒకే న్యాయం వర్తించాలని  రత్నమ్మ  చిన్న కొడుకు దగ్గరికే వెళ్ళింది మళ్ళీ.

“మీరు  పాప్ మిషన్ వాడినన్నీ  రోజులు మీకెలాంటి ఇబ్బంది ఉండదు,  ఇపుడు మిషన్ తప్పని సరిగా వాడాలి ”  డిస్చార్జి  రిపోర్ట్ చేసేటప్పుడు  డాక్టర్ కొడులని పిలిచి రత్నమ్మకి గట్టిగా ఒక వార్నింగ్ గా చెప్పాడు.   అది ఇప్పుడు తన బతుకుకి ఒక గుది  బండలా తయారయ్యింది.  ఎక్కడికి తిరిగినా పాప్ మిషన్ పైపుని  అట్టి పెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది.   ఇప్పుడు  తన ఆలోచనలన్నీ ఇంకో కోణం లో మొదలయ్యాయి.  కొడుకు ఇంటికి వెళ్ళినట్టే కానీ తన పక్క బెడ్డు పై పేషంటు భార్య చెప్పిన విషయాలన్నీ  మరవ లేక పోతుంది.  ఈ మిషన్ వాడినంత కాలం బాగానే ఉంటుంది, కానీ రోజు రోజు కీ వయసు మీద పడుతున్న కొద్దీ ఈ మిషన్ ఎంత భారాన్ని  మోస్తుంది?  ఇంకా కొత్త సమస్యలు మొదలు కావు అని గ్యారంటీ ఏమిటి?   తన జీవితంలో  మంచీ,చెడూ  అన్నీ చూసింది ,  కొడుకులందరూ మంచిగా  జీవితంలో స్థిరపడ్డారు, తనను ఉన్నంతలో బాగా చూసుకున్నారు.   ఈ రోజు సమస్య రాగానే కొడుకులూ, కోడళ్ళూ  అందరూ దవాఖానాకు వచ్చి బాగా చూసుకున్నారు.  ఏసుకోవాల్సిన  మందులు డాక్టర్ని అడిగి మరీ టైమ్ కి నాతొ ఏపించారు. ఆరోగ్యం బాగుండాలని అన్ని రకాల పండ్లు , బిస్కట్లు కొని తెచ్చారు.  ఇంతకన్నా ఏ తల్లి తండ్రులకయినా ఏమి కావాలి?  చాలా సంతోష పడింది మనసులో!  కొడుకులు, కోడళ్ళూ, మనవలు, మనుమ రాండ్లు , మరుదులు, వారి పిల్లలు, ఇంకా చాలా దగ్గరి చుట్టాలని చూసినందుకు కడుపు నిండిపోయింది.

“మొదట్లో పక్షవాతం వచ్చినప్పుడు బాగానే  చూసుకున్నారు కొడుకులు”  హాస్పిటల్ లో పక్క బెడ్డు పేషంటు భార్య అన్న ఆ మాటలు తన చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి.  “ఒకరితో చేయించుకునే బ్రతుకు వద్దు, యోగిలా చనిపోవాలి కానీ రోగిలా కాదు” ,     “మృత్యువు  తెలియకుండా రావాలి ఏదో ప్రమాదంలో హఠాత్తుగా”  భర్త తనతో అప్పడప్పుడూ  అన్న మాటలు పదే  పదే  గుర్తుకు వస్తున్నాయి.   ఇప్పుడు ఊరు జ్ఞాపకం రావడం లేదు, తాను ఎక్కడ కూర్చున్నది, ఎమి చేస్తున్నదీ  పట్టించుకునే స్థితిలో లేదు.  కొడుకులు ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు, రేపు రేపు ఇట్లాగే ఉంటానని నమ్మకం అయితే లేదు, ఇప్పడే ఊపిరి తిత్తులు పని చేయడం లేదు.  రేపు కాలో,  చెయ్యో పని చేయకుండా పోతే? ఎన్నో జావాబు లేని ప్రశ్నలు, వింత వింత ఆలోచనలు.   అవును,  నా భర్తకి  మెదడు కి సంబంధించిన వ్యాధితో  మంచాన పడ్డప్పుడు, ఆయన అపస్మారక స్థితిలో ఉంటే,  అన్నీ నేను దగ్గరుండి  చేసినాను,  మరి ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉంటే ఈ కొడుకులు, కోడళ్ళకి చూసుకునేంత  ఓపిక, సమయం ఉంటుందా?

హాస్పిటల్ నుండి వచ్చి తన బెడ్రూమ్  లోకి నడచు కుంటూ వెళ్ళింది .   “తాను చాలా ముందు చూపుతో ఆలోచిస్తోందా?”  తనకు తానే  ప్రశ్నించుకుంది బెడ్డు పై కూర్చుండి.   తన ఆలోచనలు, ముందు చూపుతో చాలా సార్లు భర్తతో పాటు ఊరందరినీ చాలా సార్లు రక్షించింది.   పొయ్యి  రాజేసినప్పుడు  వచ్చే పొగని పట్టి , అక్కడ  మనుషులు దాగినారని గుర్తు పట్టి, హింసలకు గురి చేసిన రజాకార్ల  ఆగడాల నుండి రక్షించుకోవడానికి కొన్ని రోజులు వంట చేయడమే మానినారు ఊర్లలో.    అప్పుడు రజాకార్లు పక్క  ఊర్ల పై పడ్డప్పుడు,  ఎంతో  ముందు జాగ్రత్తగా  సర్వపిండి,  పులిగోర, మురుకులు,  అప్పాలు సిద్ధం చేసి పెట్టింది ఏ రోజు ఎట్లొస్తదో అని. అనుకున్న రోజు రానే వచ్చింది.

రజాకార్ల ఆగడాలనుండి రక్షించుకోవడానికి బతుకు జీవుడా అని  గొడ్ల కొట్టంలో తల దాచుకున్నప్పుడు,   ఆ తిను  పదార్థాలతోనే వారం రోజులకు పైగా పొట్ట నింపుకున్నప్పుడు  “రత్నాలు, నువ్వు ఇంత ముందు చూపు తో  ఇవన్నీ తీసుకు రాకుంటే, ఇయ్యాల మన  పిల్లల పరిస్థితి ఏమయ్యేదో”  భర్త అన్న  మాటలు గుర్తొచ్చాయి.  బంగారం,  వెండి సామానులు మూట కట్టి  చేద బావిలో దాచింది.  రజా కార్లు ఊర్లపై పడి దొరికింది దోచుకున్నారు,  చేయని అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.   సద్దు మనిగాక ఇంటికి తిరిగొచ్చి,  ఇంట్లోంచి అంతా దోచుక పోయినారనుకుని నీరస పడ్డప్పుడు, చేద బావిలోంచి బంగారం వెండి తీసినప్పుడు భర్త కండ్లల్లో కనపడ్డ సంతోషం అంతా ఇంతా కాదు.  టీవీలో ఓక సినిమా వస్తుంది,  సినిమా చూస్తున్నట్టే  గాని మనసు మనసులో లేదు. ఇంతలోనే హీరో డైలాగ్  “సుఖంగా బతకడం కాదు ఇప్పుడు చాలా మంది ఆలోచించేది, సుఖంగా చావడం గురించే ”  తన  ఆలోచనలన్నీ ఈ డైలాగ్ చుట్టూ తిరుగుతూ అక్కడే ఆగిపోయాయి.   తానెప్పుడూ  చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంది, అదే జాగ్రత ఇప్పుడూ తీసుకోవాలి అని ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది.  తన నిర్ణయం ఇతరులని మేలు చేసేదిగానే ఉంటుంది తప్ప ఎప్పటికీ నష్టం చేయదు. మిషన్ శబ్దం రాకుంటే మళ్ళీ కొడుకు వచ్చి మిషన్ స్టార్ట్ చేస్తాడని, పాప్ మిషన్ ని స్టార్ట్ చేసింది.    మిషన్ గిర్రున తిరుగుతుంటే, రాత్రంతా ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంది.

అలవాటు ప్రకారం, పొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చుంది రత్నమ్మ.

“చిన్నోడా ఒకసారి మన ఊరుకి పోయిరావాలనిపిస్తుందిరా!  ఈ  ఆదివారం నీకు సెలవే కదా.. పోయి వద్దామా?”  కొంచెం ఇబ్బంది పడుతూనే అడిగేసింది.  ఇంతకు  ముందుగా ఆలోచించడంలేదు ఇప్పడు.  ఔనన్నా, కాదన్నా అన్నిటికీ సిద్ధపడే  అడిగింది.

“ఒకరిని తప్పు పట్టేప్పుడు  వాళ్ళ దృష్టికోణంలో ఆలోచించాలి ముందు”   అనేవాడు భర్త,  ఇప్పుడు అన్నీ వాళ్ళ దృష్టికోణంలోనే ఆలోచిస్తుంది.   వాడికి వారంలో  ఒక రోజే కదా సెలవు దొరికేది,  భార్యా పిల్లలు కూడా ఎక్కడికో వెళ్లాలనుకుంటారు కదా ఆ ఒక్కరోజే.

“అలాగే అమ్మ”  అన్నాడు కొడుకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా.  చాలా సంతోష పడింది రత్నమ్మ.   అత్తా కోడళ్ల  ఆగడాలు,  దయ్యాలు, చేతబడుల లాంటి టి వి సీరియల్స్ ని  ఇష్టం లేకున్నా కోడలు తో కలిసి చూస్తూ ఎన్నో  సందేహాలను నివృత్తి చేసుకుంటూ,

అసలు బయటకు పోవాలి, బయట  కూర్చోవాలి అన్న ఊసే రాకుండా జాగ్రత్త పడింది.  మోకాలి నొప్పుల వల్ల  అప్పుడప్పుడూ ఇంట్లోనే అటూ ఇటూ తిరుగుతూ పాప్ మిషన్ని ఉపయోగిస్తూనే ఉంది.

అత్తలో వచ్చిన ఈ మార్పుకి కోడలు కూడా చాలా సంతోషపడింది.  అప్పుడప్పుడూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కానీ కొడుకుకి, కోడలికి  కనిపించకుండా తనలో తానె భరిస్తుంది. పాప్ మిషన్ తిరుగుతున్న శబ్దం విన్నప్పుడన్నా  కొడుకు కోడలికి ఒక సంతృప్తి.

అనుకున్న ఆదివారం రానే వచ్చింది.  కోడలు,  మనవడు కూడా వస్తా అనడంతో అందరూ కలసి బయలు దేరారు ఊరికి.  మూడు గంటల ప్రయాణం కార్లో!  “ఒకప్పుడు  ముప్పై  మైళ్ల  దూరంలో ఉన్న తమ ఆడబిడ్డ ఇంటికి ఏ  ప్రయోజనానికి పోవాలన్నా కచరం రెడీ చేసి,   రెండురోజుల ముందే  తొవ్వలో తినే సర్వ పిండి వండి,  పులిగోర కలుపుకునే వాళ్ళం.   మబ్బుల లేచి ( ఎగిల్లు వారక ) ముందే బయలు దేరి, మధ్యలో పంటపొలాల దగ్గర మోట బాయి కనపడితే ఆపుకొని సద్ది మూట ఇప్పుకొని తిని, ఎడ్లకు  మేత వేసి,  ఒక గంట తర్వాత మళ్ళీ బయలు దేరేవాళ్ళం.  ఏ పొద్దు పొడిసినంకనో వాళ్ళ ఊరు చేరేటోళ్ళం”   అప్పటి రోజుల్లో ఎలా ప్రయాణించేదో చెపుతుంది  కొడుకుకి కోడలికి.   ఇద్దరూ ఆసక్తిగా వింటున్నారు. మనవడు ఏమీ అర్ధం  కాక పోయినా వింతగా చూస్తున్నాడు అందరినీ.

కొత్తగా పెళ్లి అయినా తర్వాత పెళ్లి కూతురికి,  అత్తగారి ఇంటి నుండి  అమ్మగారి ఇంటికి వెళ్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు రత్నమ్మ పరిస్థితి అలాగే ఉంది. ఊరికి కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ ఫ్యామిలీ కి ఇంట్లో ఒకభాగం ఉచితంగానే అద్దెకి ఇచ్చారు, ఇల్లు చూసుకోవడానికి ఒకరుండాలని!   ఇంట్లోకి వస్తూనే ఇల్లంతా కలియతిరిగింది, పెరట్లోకి, వంటింట్లోకి  వెళ్లి  చివరగా తనకు బాగా ఇష్టమయిన అరుగు మీద కూర్చుంది. ఐదు నిమిషాల్లో వార్త ఊరందరికీ తెలిసిపోయింది.  మొత్తం అరుగు ఊరందరితో నిండి పోయింది.  ఒకరి నొకరు  అలాయ్ బలాయ్ లు , ఒకరి చేతుల్లో ఒకరి చేతులు ప్రేమ పూర్వకంగా పలకరింపులు, చెంపలు నిమురుకోవడాలు.   చాలా రోజులుగా బోసి పోయిన ఆ అరుగు ఇప్పుడు  మోడువారిన చెట్టు చిగురించి  పూలతో వికసించినట్టు  ఒక పండుగ వాతావరణంలా  తయారయింది.  రత్నమ్మ  కూర్చున్నట్టే కానీ, మళ్లీ శ్వాసకి ఇబ్బంది అవుతుంది, అయినా లోపలే దాచుకుంది. ఇష్టమయిన మనుషుల ప్రేమ ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తుంది అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదేమో!  ఎన్నో ఏళ్లుగా పోగొట్టుకున్నది తిరిగి  పొందినట్లు  ఆనందం కళ్ళలో స్పష్టంగా  కనిపిస్తుంది.

కోడలు కొడుకుకి ఊరు, ఆ మనుషులు కొత్త కాదు, కానీ తమకు చాలా ఇష్టమయిన మనిషి దూరం అయ్యి మళ్ళీ దగ్గరవుతే  వారు చూపించే అభిమానం, ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతుంది వారికి.   అత్త ప్రతిరోజు బయట కూర్చోవాలని ఎందుకు అనుకునేదో ఇప్పుడు తెలిసి వచ్చింది.  అందరికి ఒకరికొకరు పలకరింపులతోనే కడుపు నిండినట్టుంది.  ఊరి విషయాలు, పట్నం వివరాలు ఒకరికొకరు  చెప్పకున్నారు.  ఆ తర్వాత పొలం పనులకు పోయిన వాళ్ళు, పనివాళ్ళు సాయంత్రం వచ్చి కలిశారు. ఇంట్లో ఉంటున్న  పోస్టుమాస్టర్  భార్య వంట చేసి పెట్టింది.  అప్పటికే రత్నమ్మ ఫ్రెండ్స్ కూడా ఏవో వండి ఇచ్చి పోయారు.  అందరూ కలసి భోంచేసారు  చాలా తృప్తిగా.   తాను పుట్టి పెరిగిన ఊరు,  మనుషులు అయినా ఈ రోజు వారందరూ చూపిస్తున్న ప్రేమ, ఆధరణ చాలా కొత్తగా ఉంది  కొడుకుకి, ముఖ్యంగా అమ్మ కళ్ళలో సంతోషం!

జామ ఆకుపై, బెల్లం, చింతపండు, సోపు కలిపి  పాన్ వేసుకున్నట్టు తినడం రత్నమ్మకి చిన్నప్పటి నుండే అలవాటు.  అందుకనే పెళ్లి అయినా తర్వాత తన ఇష్టాన్ని కనుకొని ఒక జామ చెట్టుని ఆమె కోసమే పెట్టించాడు భర్త.  రత్నమ్మ తనకు ఇష్టమయిన  ఆ జామ చెట్టు దగ్గరకు వెళ్లి కొన్ని ఆకులు తెంపుకుంది, డబ్బాలో పెట్టిన చింతపండు, బెల్లం, సోపు వేసిన జామాకును ఉండగా చుట్టి దవడకు పెట్టుకొని నములుతూ,  చిన్న పిల్లవాడు వానికిష్టమయిన చాక్లేట్ సప్పరించినట్టుగా సప్పరిస్తూ ఇల్లంతా కలియ తిరిగింది. మిగతా ఇద్దరు కొడుకులకి ఫోన్ చేసి ఊరి సంగతులు, తన ఫ్రెండ్స్,  చిన్నప్పుడు కొడుకులతో పెరిగిన ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పిన విషయాలు, పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఇంకా ఏవో  ఏవో విషయాలు  చెప్పింది చాలా సంతోషంగా.   మీరు కూడా వస్తే బాగుండేది అంది.   ఈ సారి దసరాని అందరం ఇక్కడే చేసుకుందాం అన్నారు కొడుకులు.     అప్పటికే  చాలా సేపటి నుండి పాప్ మిషన్ పెట్టలేదని,  కొడుకు బలవంతపెట్టి , పాప్ మిషన్ని తల్లి బెడ్ రూమ్ లో పెట్టి , మిషన్ పెట్టుకొని రెస్టు తీసుకోమన్నాడు.

తన పెళ్లి అయిన  తర్వాత మొట్టమొదట  అత్త గారింటికి వచ్చినపుడు, ఆ బెడ్ రూమ్ లోకి వెళ్లనంటే వెళ్లనని  మారాం చేసింది, పరుగెత్తింది.  బలవంతంగా ఎత్తుకొచ్చి వదలి వేసి గడియ పెట్టారు.   ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకు  ఆ రూములోకి అడుగు పెడుతుంటే ఏదో అనుభూతి, ఏదో తెలియని సంతృప్తి!  కొడుకు వచ్చి పాప్ మిషన్ పెట్టి స్టార్ట్ చేసి వెళ్ళాడు. పాప్ మిషన్ పైపు చేతిలో పట్టుకుంది ముక్కుకు పెట్టుకోవడానికన్నట్టు. ఆ మంచాన్ని చూడగానే  భర్తతో కలసి పంచుకున్న జీవితం, అనుబంధం, సుఖాలు, కష్టాలు అన్నీ కళ్ళ  ముందు పాప్ మిషన్ కంటే వేగంగా తిరిగాయి.  మంచం పై కూర్చునే ముందు మోకాళ్ళ పై కూర్చుని ఆప్యాయతతో  నిమిరింది మంచాన్ని కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే.  ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది, తన భర్త వాడిన దిండుని గుండెలకు హత్తుకుంది.  తనివి తీరా ఏడ్చింది.

రత్నమ్మకి తప్ప ఎవ్వరికీ తెలియని ఒక విషయం ఏమంటే, ఎప్పుడయితే రత్నమ్మ హాస్పిటల్ నుండి వచ్చిందో అప్పటినుండీ,  పాప్ మిషన్ అయితే తప్పని సరిగా తిరుగుతుంది కానీ ముక్కుకి పెట్టుకోవాల్సిన పైపు మాత్రం గాల్లోనే వ్రేలాడుతుంది.  తన ఊరు, తన ఆత్మీయులు, తన రక్త  సంబంధీకులు, కూత  వేటు దూరంలో మిగతా కొడుకులు,  తన భర్తతో జీవితం పంచుకున్న చోటు నుండే భర్తను వెతుక్కుంటూ శాశ్వతంగా  వెళ్ళబోతుంది.  తనకు ఇష్టమయిన  జామాకు పాన్ ని సప్పరిస్తూ బెడ్డు మీద  పడుకుని కండ్లు మూసుకుంది.  ఆ రోజు, ఊరు తెల్ల వారింది,  పక్షులు గూళ్ళు వదలి  ఆహారపు వేటకి బయలు దేరాయి, రైతులు పశువుల్ని పొలాల్లోకి తీసుకెళ్తున్నారు,   కానీ రత్నమ్మ మాత్రం శాశ్వత నిద్రలోకి జారుకుంది.  పక్కనే పాప్ మిషన్ గిర్రున తిరుగుతుంది, కానీ  ముక్కుకి పెట్టుకోవాల్సిన పైపు మాత్రం గాల్లోకి చూస్తుంది రత్నమ్మ తన భర్త దగ్గరికి ఎలా వెళ్తుందో చూడాలనట్టు.

రత్నమ్మ మళ్ళీ వస్తుంది, కూర్చుంటుంది అని ఎదురు చూస్తూనే ఉంది  ఆ బోసిపోయిన అరుగు!

*

         చిత్రం: రాజశేఖర్ చంద్రం

వేణు నక్షత్రం

ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా ఎంసీఏ పూర్తి చేసి 1998 లో జీవన భృతిని వెతుక్కుంటూ అమెరికా జరిగింది. సిద్దిపేటలో 90 వ దశకంలో మంజీరా రచయితల సంఘం స్పూర్తితో , కాలేజీ రోజుల నుండే రాయడం అలవాటు చేసుకున్న నా రచనలు (పాటలు, కవితలు , కథలు ) అన్నీ ఏదో ఒక విధంగా సమాజానికి ఉపయోగ పడే విధంగానే వుంటాయి . కథలు మౌనసాక్షి (సుప్రభాతం 1992) , పర్యవసానం ( ఆంధ్రజ్యోతి 1993) మరి కొన్ని కవితలు,పాటల తో ప్రారంభించిన సాహిత్య ప్రయాణం, అమెరికా చేరడంతో కొంత కాలం విరామం ప్రకటించక తప్పలేదు. గత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ రంగం లో పని చేస్తున్నప్పటికీ, ప్రవుత్తి గా సినిమా, టీవీ రంగాన్ని ఎంచుకొని సాహిత్య ,సాంస్కృతిక రంగంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా నా కలానికి ఎప్పుడూ ఏదో పని చెపుతూనే ఉన్నాను .

44 comments

Leave a Reply to Venu Nakshathram Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Chala bagundi! I wish ending is different. Instead of killing mother, I wish her sons agree snd make arrangements for Mother to stay in the village and give her the freedom to live full life.

  • వేణు …. “అరుగు” కథ చాలా కదిలించింది. నా ఊరి ఙ్ఞాపకాలలొకి తీసుకెల్లింది. మా అమ్మగారి వూళ్లో పెద్దదజాకన్నా ముందు బంకుల్ల వుండేది. అదే అరుగు. అక్కడే మా ఆటలు, పెద్దొల్ల ముచ్చట్లు…. చాలా వుండేవి. బంకుల్ల లో మంచం వేసుకుని కూర్చొని మా తాత ఇంటి వాకిట్లో ఆడే భాగొతాలన్నీ రాత్రంతా చూసేవాళ్లం. యెన్నో యాది కొ స్టున్నాయి. వూళ్లో బురుజు దగ్గర జెండా గెద్దె వుండేది.. ఇప్పుడు లేదు… అదే అన్ని పంచాయితీల కు మంచి చెడులకు…. గద్దె. అలా వూరు బంధలను అనుబంధాలను చాలా బాగా రాసావు. కథ ముగింపు కూడా కోరుకున్న చోట రత్నమ్మా మరణం….. బాగుంది.

  • Great story, Venu Anna! While I was reading the story, I could relate the characters to my own family. It felt like most of the Telangana families who moved to cities from villages can relate to it. Great work!!

    • Thank you Prashanth . Yes , I am getting feedback from many people and everyone feeling Rathnamma is their own family member . Thanks for reading and feedback .

  • అరుగు కధ, I enjoyed its theme. A mother understands children problem, and you threaded with అరుగు to explain. Her good memories of it, its proceeding on children life. I enjoyed details. Sharing with my friends.

  • Good story.
    If she helped her husband during the Telangana movement, she should be 90+ now, not 70+.

  • వేణు అరుగు చదివాను .సున్నితమైన భావుకత ఈ కథలో కూడా ఉంది .మనస్తత్వ చిత్రణలో తల్లి పాత్రలో ఒదిగి పోయారు . ఆపాత్రను ఎంతో చక్కగా అవగాహన చేసుకున్నారు .
    పల్లె మనుషుల జీవితంతో పెనవేసుకున్న సామాజిక ,సాంస్కృతిక నేపథ్యాన్ని కళ్ళకు కట్టించారు. తల్లి మనసును అర్థం చేసుకున్న
    తనయులు మీరు .అందుకనే ఇటు యాంత్రికతను ,అటు అమాయికమైన తల్లి అనురాగ నిస్సంగత్వాన్ని కథగా మలిచారు ..శీర్షిక చక్కగా ఒప్పింది
    అభినందనలు
    యోగిలా చనిపోవాలి ,రోగిలాకాదు _మంచి నానుడి .

    • ధన్యవాదములు రాజేశ్వరి అమ్మ గారు .

  • Very heart touching story.!! Each character reflects someone who has come across in our lives…Well narrated Venu anna!

    You have unique style of including Telangana backdrop in every story and real life characters

  • ఉమ్మడి కుటుంబాలు పోయి వైయక్తిక కుటుంబాలు ఏర్పడిన తరువాత మనుషుల మద్య దూరం పెరిగింది.
    ఒకప్పుడు కుటుంబాలు ఉన్నప్పుడు యువత పనులు చేసుకుంటూ తమ ముందు తరానికి తరువాతి తరానికి వారధిలా ఉండేవారు.
    పెద్దవారి అనుభవాలు పాఠాలుగా అందేవి. పిల్లలకు
    విలువల బోధన ప్రయోగాత్మకంగా అందేది.
    త్యాగ నిరతి, సంస్కృతి, ఘన వారసత్వం అందేవి.
    ఎవరికి లభించాల్సిన గౌరవం, ప్రేమ వారికి అందేవి.
    పల్లెల్లో ఇప్పటికీ ఉన్న ఆత్మీయతలు వెతుక్కుంటూ వెళ్ళిన తల్లి పరిస్థితే ఇపుడు అందరిదీను.
    వయసు మళ్ళిన కొద్ది ఆదరణ పెరిగేది. కని ఇపుడు వదిలించుకోవడం పెరిగింది.
    మృగ్యమవుతున్న మానవ సంబంధాలు, ఆత్మీయతలు గురించి ఎప్పటివలె నే హృద్యంగా వేణు నక్షత్రం గారు కథను మలిచిన తీరు బాగుంది. ఏకబిగిన చదివించే శైలి ఆకట్టుకుంది.
    👍👏👏👏👏

    • ధన్యవాదములు సరోజ వింజామర గారు.ఆత్మీయంగా మీరు రాసిన మాటలు చాలా బాగున్నాయి . రత్నమ్మ క్యారెక్టర్ ను చాలామంది తమ కుంటుంబ సభ్యురాలు గా అడాప్ట్ చేసుకోవడం, చివరకి ఆమె తీసుకున్ననిర్ణయం కూడా చాలా మందిని బాధపెట్టింది అని నాతో వ్యక్తిగతం గా అభిప్రాయం పంచుకున్నారు మిత్రులు. చదవడానికి బాధగా ఉన్నప్పటికీ, రత్నమ్మ లాంటి వారికి మున్ముందు ఇబ్బంది కలగనీయకుండా జాగ్రత్త పడాలనేదే తాపత్రయం . శరీరాన్ని బాగు చేసుకోవడానికి మింగే మాత్రలు చేదుగానే ఉంటాయి, అలాగే ఈ నిజాలు ఇప్పటికన్నా తెలుసు కుంటే కొంత సరిదిద్దు కోవడానికి అవకాశం ఉంటుందేమో!

  • ఉన్న ఊరు వదిలి, కన్నవాళ్ళకి, “మన” అన్న వారికి దూరంగా మనం ఉండగలమేమోగాని, రత్నమ్మ లాంటి మన అమ్మలు ఉండలేరు.
    తల్లులు ఒక పక్క పిల్లల దగ్గర ఉండాలనుకుంటారు, ఇంకో పక్క పుట్టి, పెరిగిన ఊరిని వదిలి రాలేరు. ఒక పడవ పయనం ఒక వైపు, ఇంకో పడవ పయనం ఇంకో వైపు. రెండు పడవల మీద ప్రయాణం కుదరదు అని తెలిసి నిరాశ పడిన రత్నమ్మ, చివరికి ఒంటరి అయినాగానీ, తన ఊరిలోనే తుది శ్వాస విడిచింది. ఆమె పడ్డ ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపించారు మీరు మీ కథలో. మీ కథలతో గుండెలని పిండటం, మీకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాను.
    మీకు ధన్యవాదాలు! ఈ కథ వ్రాసి, నగరాల్లో, విదేశాల్లో తల్లితండ్రులకి దూరంగా ఉండే నాబోటి వారి అంతర్మధనాన్ని బాగా బయటికి తీశారు.

    • క్రాంతి గారు , మీ అభిమానానికి క్రతజ్ఞతలు . కొంత సమయాన్ని మన పెద్దలకి కేటాయిస్తే వారు పిల్లల పరిస్థితిని త్వరగానే అర్థం చేసుకోగలుగుతారు. “ఏదీ శాశ్వతం కాదు, జీవితంలో ఏదీ ఇంపార్టెంట్ కాదు” అని కరోనా రూపంలో కూడా తిరుగు లేని జీవిత పాఠాలు నేర్చుకున్నాం. మీలాగా అందరూ ఆలోచిస్తే రత్నమ్మ వాళ్లకి అల్లాంటి పరిస్థితి రాదు అని నా ప్రగాఢ నమ్మకం.

  • ‘అరుగు’ పల్లెముచ్చట్ల గొడుగు. ఉద్యోగాలు ఉపాధి కొరకు నగరాలకో విదేశాలకో పిల్లలు వెళితే, వృధ్ధ తల్లిదండ్రులు ఇద్దరూ బతికుంటే , గత జ్ఞాపకాలను మంధరపర్వతాన్ని చిలికినట్లు మధించుకుంటూ, తమ జీవితారంభాల నుండి పిల్లలు చిన్నతనం స్మృతుల నెమరువేసుకుంటూ వాళ్ళు దగ్గరలేరనే బాధను మరచిపోగల్గుతారు. ఈ కధలో అదే చెబుతారు రచయిత! ఉద్యమాలలో చురుగ్గా పనిచేసిన రోజులు ఆమెకు కొత్త ఊపిరులందిస్తూ, ఉత్సాహపరుస్తుంటే , భర్త జ్ఞాపకాలు, స్వగ్రామంపై మనసు పడి దానిని విడిచి ఉండలేని మనస్తత్వం – నగరవాసం , ముఖ్యంగా అపార్టమెంట్ జీవితం బతుకును బంగారు పంజరంలో బంధించినట్లు , కలిగిన భావన ఉక్కిరిబిక్కిరి చేసి, శారీరకంగా బలహీన పరచడం ఎంత సహజంగానో రచయిత చెప్తారు. కొడుకులను కోడలును ఇబ్బంది పెట్టలేక, పల్లె అరుగు కబుర్లను వీడలేని మనసును కాదనలేక, భర్త చెప్పిన పోతే యోగిలా పోవాలి, రోగిలా కాదనే మాట గుర్తుకొచ్చి, ‘అంతటి భాగ్యం తనకు కలుగుతుందా,’ అనుకుంటూనే, తనలో దృఢంగా వున్న యోగిలా పోవాలనే పట్టుదల, చివరిసారి తన పల్లె అరుగును ఆత్మీయులను చూసుకుని , ఎవరినీ ఇబ్బందులు పెట్టక పాగింగ్ మిషన్ పెట్టుకున్నట్లే వుండేలా చూసుకుని , పైపును ముక్కులోకి అమరకుండా వదలి , తన చివరి కోరికగా భర్త మంచం పైనే తుది శ్వాస సహజంగా విడిచినట్లు యోగినిగా తాను చనిపోయేలా చేసుకున్న ఉద్యమకారిణి ఆలోచనలు, జ్ఞాపకాలు , ఉన్నవూరు, తన పల్లె పరిచయాలు కేవలం వృధ్ధాప్యం ఒంటరితనంతో వున్న తల్లిని పిల్లలు చూడలేదనే అపవాదు వారికి రానీయరాదనే తలంపు, నేటి సాంకేతికత కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలనెంత తుదముట్టిస్తుందో “ ముఖం లోకి చూస్తూ మాట్లాడే పధ్ధతే కనబడదనే వాస్తవాన్ని విప్పి ఆమె ద్వారా చెప్పిస్తారు నక్షత్రం గారు. ఏ కోణంలో చూసినా , పలురకాల సందేశాల సమన్వయంగా ఉన్నది, ‘ అరుగు’ కధ. రజాకార్ల వలన ప్రజలు పడిన హింసను జోడించి , నేటి యువత మరియు మహిళలకు పిలుపుచ్చినట్లుంది .

    • శారదగారు , ధన్యవాదములు .🙏మీరు రాసిన సమీక్ష చదివాను. స్వతహాగా మీరు ఒక రచయిత , అంతేగాక ప్రజా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొనే మీరు అంత సమయం వెచ్చించి చదివి చక్కటి సమీక్ష రాసి పంపిన మీ అభిమానానికి క్రుతజ్ఞతలు . 🙏🙏🙏

  • Good Story. Though leading life with adjustable nature our heart beats towards our old memories. Finally her strong decision towards death with courage reflects and leads to many thoughts..👏👏👏👏💐
    Though you are far from your native for longtime your stories narration is very lively. Very nice Sir🙏💐

  • Woooooo Guys
    Keep these stories coming
    Oka Amma Rajinama
    Oka Mathrudevobhava
    Oka Sarangi
    Mi katha chadivaka Rathnammaki oka nimisham mounam patinchanu
    That’s how I got involved in the Story
    Thank you for such a Heart Touching ✍️
    Also, Thank You Sarangi For Bringing this to US 🙏🏻🙏🏻🙏🏻

    • Thank You Sridhar for your wonderful feedback. I did not expect the Rathnamma character to influence so many readers. I really appreciate your one minute silent . I am touched with all your wonderful responses.

      Thank You All

  • చ‌నిపోయేవ‌ర‌కు ప‌ల్లెటూరిలో జీవించ‌డ‌మే ఆ పెద్ద‌మ‌నుషుల‌కు అస‌లైన‌ జీవితం. అలాంటి వారిని ప‌ల్లెటూరుతో అనుబంధం తెగ్గొట్టి వారిని యాంత్రిక‌జీవ‌నంలోకి తీసుకొస్తే ఇలాగే ఘోషిస్తాయి ఆ మ‌న‌సులు. అలాగే జీవిత‌పు చివ‌రి ద‌శ ఎలా ఉంటుందో ఈ క‌థలో అద్భుతంగా ఆవిష్క‌రించారు వేణు అన్న‌. ప్ర‌తి ఒక్క‌రికి ఆ ద‌శ వ‌స్తుంద‌ని గ్ర‌హిస్తే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఎవ‌రికి వారే ఆలోచించ‌గ‌లుగుతారు. అలా ఆలోచించ‌గ‌లిగే క‌థ ఇది. మానవ సంబంధాలను, ఆత్మీయ విలువ‌ల‌ను ఎప్ప‌టిలాగే త‌న ర‌చ‌న‌లో వినిపించారు.
    పల్లె మనుషుల జీవితంతో పెనవేసుకున్న సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని వేణన్న‌ ఆవిష్క‌రించిన తీరుకు హ్యాట్సాప్.

  • Story Chaduvuthunnatlu asaal ledu anna, meru Ma Eduruga kurchoni Matladutunnatlu ga vundi.
    Nakaite Ma Ammama Gurtochindi, 😔papam tanu kuda Ee Generation ki Tattukoleka maku Duram ga vurilone vuntundi.. Chalaa Emotiol ga vundi anna😥 chaduvutu vunte. Ee story Prathi Okariki Touch Ayyentha Bagundi Venanna👌 Very Very Nice👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • Thank you Sunder for your emotional feedback . The one of the purpose of the story is to realize the elders pain . After reading similar comments of the readers , hope I succeeded in that .

  • అరుగులు లేని మనస్తత్వాలు
    ఇప్పుడు అన్ని కాంపౌండ్ నిర్భంధాలే మీ కథలో ఆసాంతం తల్లడిల్లిన తల్లి ప్రేమ చాలా బ్యాలెన్స్ గా నడిచింది ఇప్పుడు నగరజీవితంలో అపార్ట్మెంట్లలోని డెబ్భై పైబడినవారి పరిస్థితి నూటికి నూరుపాల్లు ఇదే అభివృద్ధిపేరిట అన్నీ వలసబతుకులే ఎన్ని వూపిరులు ఇలా ఆగిపోయాయో. 👌🙏

  • రమణస్వామి ముక్తవరం. 28.05.2020

    శ్రీ.వేణు నక్షత్రం గారి “అరుగు”కథ-సమీక్ష.

    ★ మిత్రులు,ఆత్మీయులు శ్రీ.వేణు నక్షత్రం గారు,మీరు వ్రాసిన ‘అరుగు’ కథ చదివాను. *అరుగు* నక్షత్రం పూదోటలో విరబూసిన నవ పారిజాతం. గత మీ రచన కథల సంపుటి ‘మౌన సాక్షి’ లో మౌనంగా ఉండి నేడు అరుగు మీది కొచ్చి పల్లె జీవనాన్ని పళ్ళెములోపెట్టి చూపించారు.పాఠకులను ఎక్కడికో జాన పదుల గత స్మృతులను నెమరు వేయించారు.
    ★ “అరుగు’ ప్రతి ఇంటి ముందు, పల్లెల్లో మనకు కనిపిస్తుంది.తన భర్తతో ఆ వేదిక పై జరిగిన సన్నివేశాలు, సమావేశాలు, రత్నమ్మ పాత్రలో మనస్తత్వ చిత్రీకరణ, భావోద్వేగాలు,తల్లిగా తన ఆరాటం,పల్లె ప్రజల మనస్తత్వ చిత్రీకరణ ఎంతో చక్కగా ప్రదర్శించారు. పల్లె మనుషుల-మనసులు,వారి సామాజిక, సౌజన్యం ను కళ్లకు కట్టినట్లు కథలో చిత్రించారు.నేటి యువ తరానికి ‘అరుగు’అంతగా నచ్చక పోవచ్చు కాని ఆరు పదులు వెనక్కి వెళితే, అప్పటి సామాజిక పరిస్థితులకు ‘అరుగు’అద్దం పడుతోంది.
    ★ మీరు ఒక రచయితగా కాదు,ఒక కొడుకుగా అమాయక అమ్మ రత్నమ్మ తనయుడిగా పరకాయ ప్రవేశం చేసి,అమ్మ మనసును అర్థం చేసుకున్న తనయుడిగా పాత్రలో ఒదిగి పోయి కథకు జీవం పోసి,అమ్మ ప్రేమను,తన చిరకాల వాంఛను బ్రతికించారు.”యోగిగా చని పోవాలి రోగిగా కాదు” అన్న తన భర్త సూచన నన్ను ఎంతగానో స్పందింప చేసింది. మీ భావుకతకు నా జోహార్లు.
    ★ చనిపోయే వరకు పల్లెటూరిలో జీవించడానికే పెద్ద మనుషులు ఇష్టపడతారు. అలాంటి వారిని పల్లె బంధం నుండి వేరు చేసి నగర వాసపు యాంత్రిక పంజర జీవనంలోకి తీసుక వస్తే జీవిత చారమాంకంలో ఎలా ఉంటుందో ‘అరుగు’ లొ రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు. తన భర్త మంచం పైననే తనూ తనువు చాలించడం,యోగినిగా తాను చనిపోయేటట్లు చేసుకున్న సందర్భం-రచయిత మదిలో మెరిసిన మెరుపు మలుపు, కథను రక్తి కట్టించింది.
    ★ మీ ‘అరుగు’ కథ చదువు చున్నంత సేపు మా ఊరిలోని జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. మా అమ్మ పేరు గూడ రత్నమ్మయే.నాటి 60పదుల వెనుక రజాకార్ల హాయాములో మాదొక కుగ్రామం. మా నాన్నగారు ఆ ఊరి మాలీపటేల్.ఊరిపై రజాకార్ల జులుం, రాత్రిళ్ళు కునుకు లేకుండా జనం.భయ బ్రాంతులతో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన రోజులు కొంనో చూసాను,వారి దమన కాండ,అకృత్యాలు నాటి నా పసి వయస్సుకు(7)కు అంతగా అర్థం కాలేదు.కాని ఇప్పుడు మీ కథ ‘అరుగు’ నాటి అస్పస్టమైన నా గత స్మృతులను గుర్తు చేస్తున్నాయి.నాటి తెలంగాణ భయ కంపిత పౌర జీవనంను ఆవిష్కరించడంలో రచయిత వేణు గారు కృతకృత్యులయ్యారు.
    ★ ఊరిలో ఉండే రచ్చబండ,ఇంటిముందు అరుగు గ్రామ పంచాయతీలకు నెలవు.అన్ని సమస్యలకు ముగింపు అక్కడే.కుటుంబ సమస్యలు, సాయుధ పోరాటాల ఎత్తుగడలలో పాల్గొన్న రత్నమ్మ ధైర్యశాలి అనే చెప్పచ్చు.చావుకు భయపడే పిరికిది కానేకాదు. రత్నమ్మ మరణం రవ్వంత బాధగా ఉన్నా, తాను కోరుకున్న చోట తనువు చాలించడం సబబే అని అనిపిస్తుంది.ఒక రకంగా రెక్కలాడినప్పుడే ఎవరికి భారం కాకుండా వెళ్లిపోతేనే(సహజ మరణం) బావుంటుందని పరోక్షంగా రచయిత వాపోయారు.రత్నమ్మ పాత్రపై సానుభూతిని పెంచారు.
    ★ కథను నడిపించిన తీరు ఉత్కంఠతతో సాగింది.చదువరులను నాటి గ్రామీణ జీవన విధానం లోకి పరుగులెత్తిస్తుంది. నేటి యాంత్రిక నగర జీవనమునకు పునాది పల్లె సీమలే గదా…బ్రతుకు తెరువు కొసం బయటికొచ్చాం కానీ పుట్టి పెరిగిన చోటు, చద్ది తిన్న రేవు ఎలా మరువగలం. రచయిత హృదయాంతరాల నుంచి పెల్లుబికిన తన చిన్న నాటి జ్ఞాపకాలేమో అని అనిపిస్తుంది…
    ★ అమ్మ రత్నమ్మ మరణం నిజంగా బాధాకరం.కొడుకులు సమ్మతించి తల్లిని తన ఊర్లోనే ఉంచే ఏర్పాట్లు చేస్తే బావుండేది. తన చివరి మజిలీ,తన స్వంత ఊరిలోనే గడిపే స్వేచ్ఛ కల్పిస్తే బావుండేది. నాటి ఉమ్మడి కుటుంబాలలో వయసు పెరిగే కొలది ఆదరణ పెరిగేది.కానీ ఇప్పుడు తల్లి దండ్రులను వదిలించుకోవడం మొదలై కొడుకులు వంతుల వారీగా అమ్మను పంచుకోవడం. కొన్ని కుటుంబాలలో అమ్మ నొక కొడుకు నాన్నను మరో కొడుకు ఉంచుకోడం దారుణం.శోచనీయం. అందుకే రచయిత ‘ఓ కొడకా మేలుకో’అని పరోక్షంగా చురక నంటించాడు.మానవ సంబంధాలు మంట గలుస్తున్నావని మందలించారు.
    * చివరి దశలో నిరాశ పడిన రత్నమ్మ,తన ఊరిలో అది తన భర్తతో గడిపిన మంచంపై తుది శ్వాస విడిచింది. ఆమె పడ్డ ఆవేదనను హృద్యంగా కళ్లు చెమర్చేవిగా కథను మలచిన తీరుకు హ్యాట్సాఫ్. హృదయాన్ని పిండే సన్నివేశాలు-పాత్రలు చిత్రించడంలో వేణు సిద్ద హస్థులు.మీ గత కథల సంపుటి “మౌన సాక్షి”లోని కథలు ఎంతగానో నన్ను చలింప చేశాయి.ఇప్పుడు మా అమ్మ రత్నమ్మలా ఊహించుకొని విలపింప చేస్తున్నావు.మీ కథలో కరుణ రసం జాలువారుతుంది.మీ పెన్నుకో దండం….
    * మొన్నటికి మొన్న “అవతలి వైపు”-“ఎంతెంత దూరం”లఘు చిత్రాల దర్శకుడిగా పలు ప్రశంశ లందుకున్నారు. నేడు సాహితీ క్షేత్రంలో ‘ కాదేదీ కవితకనర్హం’ అని అతి సామాన్య పల్లె జీవన బాంధవ్య కతాంశముతో తల్లి-కొడుకుల అనుబంధాలను స్పృజించారు.మీ కథ ‘అరుగు’ఓ మమతల కోవెల.
    * రత్నమ్మ కోసం బోసిగా ఎదురు చూస్తున్న ‘అరుగు’ముగింపు వాక్యం చాలా నప్పింది.అరుగుకు అర్థం ఇక్కడ దొరికింది.పాఠకున్నీ చివరి వరకు చిదివించాలనే ‘అరుగు’ లోని మర్మాన్ని మరిగున దాచి మంతనాలాడిన మీ రచనా చమకృతి శ్లాఘనీయం.
    * చివరగా,అలుపెరుగని మీ సాహితీ సేద్యం నుండి మరెన్నో మంచి కథా కుసుమాలు సౌరభాన్ని వెదజల్లాలని అభిలశిస్తూ……మీ మానస పుత్రిక “సారంగ” విపంచి నుండి మరెన్నో సుస్వరాలు దశ దిశలా ప్రసారించాలని మన సారా కోరుకొంటూ…..
    * చిన్న సూచన….. “సారంగ”లో ఉప శీర్షిక “వేణుగానం” పేరుతొ చిన్న కథలు వారం వారం మీ స్వీయ రచనలే గాని,వర్ధమాన ఔత్సాహిక రచయితలవి గాని ఎంపిక చేసి ప్రచురిస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.ఏకీభవిస్తారని అనుకుంటున్నాను…సెలవా మరి ఉంటాను

    మీ – అభిమానపాత్రుడు
    రమణ స్వామి.ముక్తవరం
    సాహిత్యాభిమాని
    విశ్రాంత ఉద్యోగి
    రంగస్థల నటుడు
    రామగుండం (తెలంగాణ)

    • రమణస్వామి గారు.

      కథ లోనే కాదు , సమీక్ష లో కూడా ఇంత భావోద్వేగం పలికించవచ్చు అని మీ స్పందన తో అర్థం అయింది.”‘మౌనంగా ఉండనీయని కథలు” అని మౌనసాక్షి సమీక్షకి శీర్షిక పెట్టిన వనజ తాతినేని గారి మాటలు ఈ రోజు నూరుపాళ్ళు నిజం అనిపిస్తుంది మీ అందరి స్పందన చూస్తుంటే. సమీక్ష చదువుతుంటే ఏ అవార్డు కూడా ఇంత మంచి సంతోషాన్ని ఇవ్వలేదు! ధ్యన్యవాదములు. మీరు కథ చదివి , అంతకంటే ఓపిగగా చక్కటి స్పందన రాసినందుకు ధన్యవాదములు. మీ అమూల్యమయిన సమయాన్ని వెచ్చిచి చాలా మంచి విషయాలు రాసారు. నాకో పెద్ద అవార్డుతో సమానం మీ స్పందన. కథ చదివి యువకులు కూడా బాగా స్పందించారు . శ్రీధర్ , సుందర్ అనే యువకుల స్పందన ఆ తరహాలోదే . ధన్యవాదములు

      • మిత్రులు వేణు గారికి నమస్సులు.నేల చీల్చుకొని పుడమి తల్లి గర్భము నుండి విత్తనం మొలకెత్తినట్లు ఎంతో శ్రమిస్తే గాని ఒక కథ రూపు దాల్చుకొంటుంది.మీరు పడ్డ శ్రమ ముందు మా స్పందన చంద్రునికో నూలు పొగులాంటిది.మీ లాంటి సమాజ హిత రచనలను ప్రోత్స హించడం,సద్విమర్శ చేయడం పాఠకుడిగా మా నైతిక బాధ్యత.మీనుండి వచ్చే మరో మంచి కథ కోసం వేచి చూస్తూ…. అంతవరకు సెలవు…..మీ అభిమాన పాఠకుడు…. రమణ స్వామి.

  • పాత జ్ఞాపకాలు…జీవిత పోరాటాలు…మరిచిపోలేని గురుతులు… ఎప్పటికీ తరిగిపోని సిరులు!
    ఆ జ్ఞాపకాలు ఇప్పుడు తలచుకుంటే ఎన్నో మధుర జ్ఞాపకాలుగా మన ముందు గిర్రున్న తీరుగుతాయి. సంబంధిత దృశ్యాలు 4కె రిజొల్యూషన్ తో కనిపిస్తాయి. అరుగు కథలో అమ్మ జ్ఞాపకాలను, వర్తమాన కాల కధనంతో ముడివేసి చెప్పిన తీరు అమోఘం. ప్రతివారికి వారి అమ్మను గుర్తుచేసే కథ. కథకుడిగా వేణు నక్షత్రం పాఠకుల గుండె తడిచేసారు అంటే అది అతిశయోక్తి కాదు.

    • ఇలాంటి సమీక్షలే కదా మాలాంటి రచయితల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేది. ధన్యవాదాలు వెంకట్ గారు.

  • “అరుగు”, అస్సలా పదమే దాదాపు 30 ఏండ్లకింద ఎండకాలం సెల్వులకు అమ్మమ్మ ఇంటికి పొయ్యిపోంగనే ఇంటిపక్క దోస్తులతోటి అరుగుమీద ఆడ్కున్న busఆట యాది చెసింది. కథ చద్వుతుంటె కండ్లల్ల నీళ్ళు తిర్గినయ్. రత్నమ్మల మా అమ్మమ్మ కంపిచ్చింది. రత్నమ్మకి ఆఖరి క్షణాల్లల్ల ఐన ఉన్న ఊళ్ళ, ఉన్న ఇంట్ల సుఖంగ కన్నుమూసే అవకాశం దక్కింది. మా అమ్మమ్మకి అది కూడ దక్కలే. పదాలతోటి భావాలని ఎంతో హృద్యంగా చిత్రించిన శిల్పి వేణుగారికి ధన్యవాదాలు.

  • కథ చదువుతున్నాంతసేపు కళ్లు చమ్మగిల్లితునే ఉన్నాయి.. అద్భుతంగా రాశారు..

  • ఆలస్యంగా చదివాను… విపరీతంగా రూపాంతరం చెందుతున్న నేటి మానవ సంబందాల దుస్థితి ని మీ అరుగు అద్దమై చూపింది… This story lives on until we retain the ability to think with our heart, not purely brain.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు