అయోధ్యా రెడ్డి ‘ఆహారయాత్ర’

1974లోనే ‘మృత్యువులో వ్యత్యాసం’ అనే పేరుతో తొలి కథ రాసి దాని తరువాత అప్పుడప్పుడు కథలు రాస్తూ వచ్చిన డా. ఎ.యం. అయోధ్యారెడ్డి సుదీర్ఘ కాలం మౌనంగానే ఉండి పోయారు. ‘మంజీర రచయితల సంఘం’ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న అయోధ్యారెడ్డి దాదాపు మూడు దశాబ్దాలు జర్నలిస్ట్ గా పని చేశారు. కొన్ని ఎంపిక చేసుకున్న హిందీ, ఇంగ్లీష్ కథల్ని తెలుగులోకి అనువాదం చేశారు. కెన్యా రచయిత గూగీ వాథియాంగో ప్రసిద్ధ నవల ‘Weep Not Child’ నవలను ‘ఏడ్వకు బిడ్డా!’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. తొలి దశలో రాసిన కథలనన్నింటినీ కలిపి 2017లో ‘ఆహారయాత్ర’ కథా సంపుటి వెలువరించారు. ఈ సంపుటి తరువాత రాసిన కథల్ని కూడా ఇటీవల ‘అక్కన్నపేట రైల్వే స్టేషన్’ పేర మరో కథా సంపుటిని తీసుకొచ్చారు. మానవ సంబంధాల గీత మీద, వాళ్ళ అతుకుల బతుకుల రాత మీద, సాటి మనిషి భావోద్వేగాలను కథీకరించే అయోధ్యారెడ్డి రాసిన కథల్లో విలక్షణమైన కథ ఆహారయాత్ర

వారం రోజులుగా కురిసిన వర్షాలకు సర్వం వరదల్లో కొట్టుకుపోయిన తర్వాత ఆకలికి తాళలేక నీలి అనే చీమ ఆహారయాత్రకు బయలుదేరింది. తోడుగా వద్దన్నా చిట్టి అనే దాని చెల్లి (చిట్టి) చీమ కూడా వెంట బయలుదేరింది. వరదల సమయంలో ఈ చీమల నుండి విడిపోయిన వీళ్ల తండ్రి చీమ జాడ ఇప్పటికీ తెలియడం లేదు. నీలి బాధ పడుతూనే నడుస్తూంటుంది. పోతూ పోతుంటే “సైనిక చీమలంటే ఎవరక్కా?” అని అడిగింది. చిట్టి చీమ.

“వాటిని రక్షక భటులంటారమ్మా.. అవి రాణి వాసంలో ఉంటాయి” అంటుంది నీలి చీమ.

“రాణివాసమంటే… అదెక్కడుంది? మనం ఒక్కసారి వెళ్దాం ” కుతూహలంగా అడుగుతుంది చిట్టి చీమ.

“మనల్ని అక్కడికి రానివ్వరమ్మా! పని చేసే పెద్ద చీమలకి మాత్రమే అందులో ప్రవేశం”

“ఏం పని చేయాలక్కడ?”

“ఒక్కటేమిటి…? ఇల్లు తుడవడం, రోడ్లూడవడం దగ్గర్నుంచి రాణి వాసంలో ప్రతి పని చెయ్యాలి. ముఖ్యంగా సాయంత్రానికల్లా ఎంతో కొంత ఆహారాన్ని సంపాదించి అక్కడ అందజెయ్యాలి.”

“మరి వాళ్లకేం మాయరోగమక్కా? వాళ్ళ కూడు వాళ్ళు సంపాదించుకోలేరా? వాళ్ళకు మనమెందుకు తెచ్చి పెట్టాలి?” అని ప్రశ్నిస్తుంది. ఇట్లా సాగిపోతుంది ఆ అక్కా చెల్లెళ్ల సంభాషణ.

కొంత దూరం పోయాక నీలి చీమకు ఒక రొట్టె ముక్క కనిపిస్తుంది. నీలికి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. ఆకలి జబ్బుతో బాధ పడే వాళ్ళ స్థావరంలోని శ్రామిక చీమలకు రెండు రోజులకు సరిపడే ఆహారం దొరికిందనుకుంటుంది. ఆనందంగా స్థావరానికి వెళ్ళి తను చూసిన రొట్టె ముక్క సంగతి తోటి చీమలకు చెప్పి అందరినీ ఆ రొట్టె ముక్క దగ్గరికి బయలుదేరదీస్తుంది. చీమలన్నీ అక్కడికి చేరుకునే సరికి ఇంకా ఆ రొట్టె ముక్క అక్కడే ఉంది. చీమలన్నీ కలిసి ఆ రొట్టె ముక్కను తమ స్థావరానికి తరలించడానికి వ్యూహం రచించాయి. మరో క్షణంలో రొట్టె ముక్కను తరలించడం ప్రారంభమయ్యేదే ఇంతలో “ఈ ఆహారం మాది అడ్డు తొలగండి” అంటూ ఒక గండు చీమల దండు అక్కడి వచ్చింది.

ఈ ఆహారాన్ని ముందుగా చూసింది నేను. నేను చూసినప్పుడు ఇక్కడ ఎవరూ లేరు. మా తిండి లాక్కోవడం అన్యాయం అంటుంది నీలి చీమ. అవును అన్యాయం అన్నాయి మిగతా చీమలు.

“నోరు ముయ్యండి! మీరా మాకు న్యాయం చెప్పేది. ఈ ఆహారం మాది. మేం ఏది చెప్తే అదే న్యాయం. బలమున్నోడు ఎక్కడుంటే అక్కడుంటుంది న్యాయం. మీ దిక్కున్న చోట చెప్పుకోండి. నడవండిక్కణ్ణుంచి” అని గట్టిగా అరిచాయి గండు చీమలు.

నీలి చీమకు ఏం చేయాలో తోచలేదు. అయినా వరదల వల్ల మా వాడంతా కొట్టుకు పోయి అయిదు రోజుల్నుంచి తిననే లేదు. మీరు ఇప్పుడు ఈ ఆహారాన్ని విడిచి పెట్టక పోతే మేం ఆకలితో మాడి చస్తాం అని ప్రాధేయపడుతుంది. చస్తే చావండి మాకేంటి? అని రొట్టె ముక్కను లాక్కుపోవడానికి ప్రయత్నిస్తాయి. శ్రామిక చీమలు అడ్డుకుంటాయి. మాటా మాటా పెరుగుతుంది. క్షణాల్లో యుద్ధవాతావరణం నెలకుంటుంది. శ్రామిక చీమలకు, గండు చీమలకు భీకర పోరు జరుగుతుంది. వందల కొద్ది శ్రామిక చీమలు చనిపోయి శవాల గుట్టలు పేరుకుపోతాయి. కొన్ని ప్రాణ భయంతో పారిపోతాయి. ఇక సంతోషంగా రొట్టెను తరలించడానికి రొట్టె చుట్టూ చేరుతాయి గండు చీమలు. ఇంతలో “గాల్లోకి లేచింది రొట్టె. భయంతో కెవ్వున అరిచి చిందర వందర అయ్యాయి చీమలన్నీ.” ఎక్కడి నుంచో వచ్చిన ఒక చేయి చూస్తుండగానే ఆ రొట్టెను అక్కడి నుంచి కనిపించకుండా చేస్తుంది. గండు చీమలన్నీ కన్నీళ్లతో నిస్సహాయంగా చూస్తుండి పోతాయి.

పైకి పంచతంత్రం కథ లాగా కనిపించే ఈ కథ వర్గ పోరాట దృక్పథంతో రాసిన ఒక గొప్ప కథ. సమాజంలో మెజార్టీ ప్రజలు ఎప్పుడూ నిరంతరం కష్టపడుతూ ఉంటారు. పెత్తందార్లు, పెట్టుబడిదార్లు మాత్రం ఆ కష్ట జీవుల శ్రమను దోచుకొని జల్సాగా గడుపుతుంటారు. జీవితం కొందరికి వడ్డించిన విస్తరి. ఇంకొంత మందికేమో ఎంగిలాకు కూడా దొరకని పరిస్థితి. జంతువులని, కీటకాలని పాత్రలుగా చేసి కథ చెప్పడం మనకు మొదటి నుండి ఉన్నదే. కానీ అవి నిజంగా జంతువుల కథలు కాదని మనకు తెలిసిందే. ఈ కథలో రూపం చీమలే కానీ సారంలో అవి మనుషులే. కష్టపడే వాడి దగ్గరే డబ్బులు ఉండాలి. కానీ వాస్తవంలో జరిగేది వేరు. రోజుకు 18 గంటలు కష్టపడే రైతు ఎండిన బీళ్ల అంచున ఏ చెట్టుకో వేలాడుతున్నాడు. దోపిడి చేసి శ్రామికుల రక్తాన్ని డబ్బుగా మార్చుకొన్న వాళ్లు ఎండ తగలకుండా ఏసీ గదుల్లో కులుకుతున్నారు. పైగా ఇదంతా తమ తెలివి తేటల వల్ల, లౌక్యం వల్ల తామే కష్టపడి సంపాదించామనుకుంటారు. మార్క్స్ గతి తార్కిక భౌతిక వాదాన్ని రచయిత చాలా నేర్పుగా పాఠకుడికి అర్థం చేయించడం కనిపిస్తుంది ఈ కథలో. అంబేడ్కర్ అన్నట్టు వ్యవస్థ ఎప్పుడూ బలహీనమైన మేకల్ని బలి తీసుకుంటుంది కానీ సింహాలని కాదు. పీడిత వర్గం ఎప్పుడూ ఆకలితో పోరాడుతూనే ఉంటారు. ఎప్పుడూ బలవంతుడిదే రాజ్యం. ఆదిమ కాలంలో అయినా ఇప్పుడైనా. రాజ్యాంగంలో చాలా రాసుకుంటాం. కాని అవి కేవలం ఆ పెద్ద పుస్తకం యొక్క రెండు అట్టల మధ్యనే బంధింపబడి ఉంటాయి. కవిత్వంలోనే కాదు కథల్లో కూడా ధ్వని ఉంటుందని ఇలాంటి జంతువుల పేరు మీద రాసే కథలు నిరూపిస్తాయి. చివరాఖరికి పీడక వర్గమంతా గ్రహించాల్సిన విషయమేమిటంటే పొట్టోని నోరు పొడుగోడు కొడితే పొడుగొని నెత్తి పోషమ్మ కొడుతుందని. ఎంతో గంభీరమైన విషయాన్ని రచయిత చాలా సరళ శిల్పంలో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కథ ఎత్తుగడ నుంచి ముగింపు దాకా చీమల బారులా చాలా జాగ్రత్తగా నడుస్తుంది. చీమలన్నీ కలిసి బలవంతమైన పామును తరిమే రోజు రావాలి అప్పుడే రచయిత కలగన్న సమసమాజం సాధ్యమౌతుంది.

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • The critical review on Sri Ayodhya Reddy’s Short story “Aahaara yaathra”is enlightening. The story of the” thinking” and laughing ANIMAL from the beginning of the (in) human history is an unending and continuous story of EXPLOITATION, INJUSTICE AND INHUMANITY.This is global and any variation is only in form and format but the exploitation is consistently persistent… Dr Veldandi rightly explained that the solutions shown to the problem by visionaries like Marx and Babasaheb are manipulated by the vested interests who monopolize the economy,polity, and power.. it’s unique, peculiar, genetic, connatural, universal and historical to the (in) human society.. that there’s no society without exploitation… inequalities and Injustice are unending and continuous…I don’t know how this unequal, irrational,inhuman,parochial,insensitive and indifferent and self centric mankind arrogate to itself the nomenclature” Homo Sapiens” ? This is also an exploitation against other CREATURES…

  • మిత్రుడు అయోధ్య రెడ్డి కథ పై మంచి విశ్లేషణ చేసినవు శ్రీధర్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు