దర్శకుడు హిట్టు ! రచయిత ఫట్టు?

   ‘‘ప్రతిరోజు పండగే’’ సినిమా చూశాను. ప్రథమార్థం నవ్వుల పువ్వులతో అక్కడక్కడ వికసించని మొగ్గలతో ముందుకు సాగిపోయింది. ద్వితీయార్థంలో మురళీశర్మ వచ్చి రావూ రమేష్ అండ్ టీమ్కి క్లాసు పీకి వెల్లిపోయే వరకూ చాలా బాగుంది. ఆ క్లాసు పీకడానికి మురళీశర్మ అర్హుడే కాబట్టి మెచ్చుకో తగినదే. తరువాత రావూ రమేష్ అండ్ టీమ్ మురళీశర్మ వల్ల పొందిన కోపాన్ని తండ్రికి బదిలీ చేసి అక్కడి నుండి వెళ్ళి పోవడం బాగుంది. ఆయా పాత్రల తాలూక ఔచిత్యంలో(Character Arc) చిన్న, చిన్న లోపాలు ఉన్నా ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇప్పుడు హీరో టాస్కేమిటంటే ఆ పాత్రల్లో పరివర్తన తేవడం. దానికి హీరో ఎంచుకున్న దారినిబట్టి ఆ సినిమా హిట్టా, ఫట్టా, సూపర్ హిట్టా అనేది ఆధారపడి ఉంది.!

ఆయా పాత్రల్ని మార్చడానికి రచయిత ఎన్నుకున్న మార్గం మాత్రం అప్పటి వరకూ సినిమా మీద ‘రెస్పెక్ట్’తో చూసిన ప్రేక్షకులకి అది పోయేలాగా, బోర్ కొట్టే డైలాగులతో ఆడియన్స్ బుర్రతినే క్లాసు ప్లాన్ చెయ్యడం ‘స్ర్కీన్ ప్లే’లో అతి పెద్దలోపం. మాటలతో మారిపోయే పాత్రలే అయితే అసలు ఈ కథే పుట్టుండదు కదా?. మాటలతో మార్చలేని వాళ్ళను చేతలతో మార్చవచ్చు. అవును ‘మా హీరో కూడా మెడలో ఎర్రతుండేసుకొని చేతిలో కొడవలి పట్టుకొని భారతీయ వసుదైక కుటుంబంలో కలుపుమొక్కల్ని ఏరి పారేస్తున్నట్టు, గడ్డికోస్తూ నీతిసూత్తులు కూసాడుగా’? అవే చర్యలుగా భావించమంటారా ఏమిటి కొంపదీసి.?

సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబుగారు ఒకసారి సినిమాల్లోకి రావాలని కలలు కంటున్న యువ రచయిలకు, దర్శకులకు కోటి రూపాయల ఖరీదైన మాటొకటి చెప్పారు. అదేమిటంటే ‘‘మీరు సినిమాలు చూసినప్పుడు అవి నచ్చకపోతే వాళ్ళను తిట్టడం మానేసి ఆ కథ, ఆ సినిమా నువ్వు రాస్తే, నువ్వు తీస్తే ఎలా చేస్తావో ఆలోచించు. అది మీకు మంచి ఎక్ససైజ్ (Practice) గా ఉపయోగపడుతుంది.’’ అని చెప్పారు. ఆ మాటలే ఈ రోజు ఇది రాయడానికి ప్రేరణ. నాకు ఏమనిపించిందంటే ప్రథమార్థంలో హీరో సాయి అంటే తండ్రి రావూ రమేష్కి చాలా ఇష్టం. వాళ్ళిద్దరి మధ్యన మంచి ఎఫెక్షన్ ఉన్నట్టు కొన్ని సీన్లు రాశారు. ఇది ఇప్పుడు వాడుకోవలసిన సమయం వచ్చింది. అది ఎలాంటే రావూరమేష్ అండ్ టీమ్ తండ్రిని విడిచి వెళ్ళిపోయాక వాళ్ళందరికి బతికుండగానే పిండం పెడతాడు హీరో. అది తెలిసి వాళ్ళందరూ మళ్ళీ వస్తారు. ఇలా రావడంలో కూడా లాజిక్ మిస్ అయ్యింది.

ఎందుకంటే వాళ్ళు పక్కా కమర్షియల్ అని చెప్పినప్పుడు వాళ్ళ ఫోటోలకు దండలేసినా? పిండాలుపెట్టినా? పట్టించుకోకూడదు. తండ్రి ఆరోగ్యం గురించి రావూరమేష్ డాక్టర్తో మాట్లాడుతూ ‘‘నాలుగు లక్షలు ఖర్చవ్వాల్సిన ట్రిప్పుకు ఇరవై లక్షలు ఖర్చయింది సార్’’ అంటాడు. దీని బట్టి వాళ్ళకు డబ్బే ముఖ్యం అని అర్థమౌతుంది. అలాంటి వాళ్ళు ఎందుకంత ఎమోషనయిపోయి మళ్ళీ ఖర్చు పెట్టుకొని తిరిగివస్తారు.? ఒకవేళ వచ్చినా వాళ్ళు అంత బుద్ధిగా హీరో చెప్పే గడ్డికోత మాటలు ఎందుకింటారు.?

అలా కాకుండా పిండం ఎప్పుడైతే కొడుకు పెట్టాడో రావూ రమేష్ ఎమోషనల్గా డిస్ర్టబ్ అయి గుండెపోటు వచ్చి కొడుకుని చూడాలనిపిస్తే?, అప్పుడు కొడుకు ‘నువ్వు పోయాక వస్తాలే నాన్న! ఇది నీ దగ్గర నేర్చుకున్నదే’ అంటే అప్పుడు రావూ రమేష్ పాత్రలో పరివర్తన వచ్చి, వెళ్ళిపోయిన వాళ్ళందరినీ చచ్చిచెడీ ఒప్పించి అందర్ని తిరిగి తీసుకొచ్చి తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి, కొడుకు పెళ్ళి చేస్తే పాత్రల ఔచిత్యం చక్కగా సరిపోయేది. ఇయర్ ఎండ్ బెస్ట్ సినిమాగా మిగిలిపోయేది.! అలాగే మారుతి అంటే గుర్తుకొచ్చే సినిమా ‘భలే భలే మగాడివోయ్’ ఇందులో ఒక మతిమరుపు పాత్ర జూనియర్ సైంటిస్టు ఎలా అయ్యాడో? ఆ ఎక్జామ్స్, ఇంటర్య్వూలు ఎలా పాసయ్యాడో ఇప్పటికీ అర్థంకాని లాజిక్.! అదే బహుశా మారుతీ మ్యాజిక్.! (నవ్వుతూ.!)

*

ప్రవీణ్ యజ్జల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు