పో చుట్టుకు పో
అనుబంధాల గట్లను తెంపి
అహంకారపు జ్ఞాపకాల్లో తడిపిన
అనుభవాల దారాన్ని
నీ చుట్టూ అల్లుకుంటూ ఓ కొత్త ‘పట్ల’ పురుగు ననుకుంటూ
మురిసిపోతూ చుట్టుకు పో
ఏదో ఒక జ్ఞాని ముసుగు ధరించి
నిస్సహాయ అభాగ్యుల ముందట
అజ్ఞానామృతాన్ని మోహినిలా ఒలకబోయడం
నీ నవనాట్య భంగిమలకు
నీకు నువ్వే మురిసిపోయి మెలికలు తిరగడం
స్వకీయ ఘన చరిత్రను
అడగకున్నా నలుగురికీ వెయ్యిన్నొకటోసారి పంచడం
నీ భజంత్రీలకు నయన శ్రవణానందాన్ని కలగజేయడం
వారి పొగడ్తల్లో మరోమారు పులకించి తడిసి ముద్దవడం
ఎవరూ చూడనిక్షణంలో
నలిగి మూలుగుతున్న ఆత్మను
బయటకి లాగి
బతిమాలి బామాలి కసిరి లోపలికి తోసేయడం
ఇదే కదా మన పరమాద్భుత జీవితం
అయిపో
మొనాటనీతో తడిసి బుగిలి వాసనేస్తున్న
ఈ చెక్క జీవితంలో
మరో చెదపురుగువై తొలుచుకు పో
లోలోపలగా గుహలను తొలుస్తూ
నీ చుట్టూ ఒక ఇంద్ర జాలపు గూడును నిర్మిస్తూ
ఒక సరి కొత్త జుగుప్సాత్మక అహంకారపు క్రిమివై పో
గట్టిగా నిన్నెవరైనా పట్టుకున్నప్పుడుకదా తెలిసేది
నీవు కడుతున్న కోట
ఒక బూటకపు డొల్ల గూడని
నీవెవరికీ పనికిరాని స్వోత్కర్ష కీటకానివని
కాలం కలిసొచ్చే వరకే నీ నవ మోహన నాట్య భంగిమలని
అయినా అందాకా,
అయిపో
క్రిమివై పో
నీ పనికిరాని ప్రపంచాన్ని తొలుచుకుపో …
*
👍 👍 👍 👍
ఎవరూ చూడనిక్షణంలో
నలిగి మూలుగుతున్న ఆత్మను
బయటకి లాగి
బతిమాలి బామాలి కసిరి లోపలికి తోసేయడం
– మనమందరం ప్రతి రోజూ, ప్రతి క్షణమూ చేసే సిగ్గుమాలిన పని నిజంగా అదే కదా!
Beautiful Vijay.
Thank you Raahul