అయిదు దశాబ్దాల బహుజన జీవన చిత్రం

చారిత్రకంగా జరిగిన సంఘటనను వస్తువుగా స్వీకరించి కథలు, నవలలు రాయడం  అనేది  కత్తి మీద సాము లాంటిది. అలాంటి  ప్రయోగాలను తెలుగు నవలాకారులు చాలా అరుదుగా చేస్తుంటారు. ఈ అరుదుగా వచ్చే నవలలో అత్యంత అరుదైన నవల దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి”చంద్రవంక”.  సామాజిక – రాజకీయ విషయాలను నేపథ్యంగా చేసుకుని వచ్చిన యితర నవలలతో  పోల్చుకున్నప్పుడు, ఎజ్రా శాస్త్రి ఎనభై రెండు (82) పేజీల (ముందుమాటలు కలుపుకుని 110 పేజీలు) చంద్రవంక నిడివి చాలా చిన్నది. గట్టిగా పట్టుకుని కూర్చుంటే రెండున్నర గంటల్లో నవలను ఆసాంతం చదవవచ్చు. అయితే పిట్ట కొంచెం కూత ఘనం  అన్న చందాన, చంద్రవంక నవల తెలుగు గడ్డపై దాదాపుగా  అయిదు దశాబ్దాల బహుజన జీవన చిత్రాన్ని ముఖ్యంగా సామాజిక ఉద్యమాల జీవన గమనంలోని అనేక కోణాలను ఆవిష్కరింపజేసే ఒక ప్రయత్నం.

చంద్రవంక నవలలోకి తొంగి చూస్తే,  కమ్యూనిస్టు ఉద్యమం నేపథ్యం నుండి వచ్చి అగ్రకుల పెత్తందార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పేద వర్గానికి చేయూతగా నిలిచి, ఆ వర్గాన్ని చైతన్యపరచి వారి హక్కుల కొరకు అలుపెరుగని పోరాటం జరిపే చంద్రవంక; చదువుల ద్వారా జీవితంలో ఏదైనా సాధించి తమను కన్నవారికి తోడుగా ఉండడంతోపాటూ, నలుగురికి చేదోడు వాదోడుగా ఉండాలనుకునే ఇద్దరూ యువకులు –  విజయ్, చైతన్యలు ఈ నవల లోని ముఖ్యమైన పాత్రలు.  మాదిగ కులానికి చెందిన ఈ ముగ్గురు వ్యక్తుల చుట్టూ ఈ నవల ప్రధానంగా నడుస్తుంది. వాస్తవానికి చంద్రవంకే ఈ నవల కథానాయకురాలు (షీరో-Shero). విజయ్, చైతన్య పాత్రలతో పాటు సందర్భానుసారంగా వచ్చే ఇతర పాత్రలు కథానాయకురాలి గమనంలో వచ్చే సహాయ పాత్రలు అంతే.

స్వాతంత్య్రానంతరం ఆంధ్రదేశంలో ఆర్థికపరంగా కుల పరంగా అన్యాయానికి గురవుతున్న ప్రజానికానికి అండగా పౌర సమాజం నుండి ప్రాదుర్భవించిన ఉద్యమాలలో ముఖ్యంగా చెప్పుకోదగినవి రైతుకూలీ ఉద్యమం, నక్సలైట్  ఉద్యమం, దళిత ఉద్యమం, దండోరా ఉద్యమాలు. ఈ ప్రజోద్యమాలు  బహుజనులు సామాజిక-రాజకీయ జీవిత ప్రతిబింబాద్దాలు. ఒక రకంగా ఈ ఉద్యమాలు వర్తమాన ఆంధ్రదేశ చరిత్రకు ప్రతినిధులు,  చంద్రవంక నవలకు ప్రధాన వస్తువులు. కథానాయకురాలు చంద్రవంకకు ఈ ఉద్యమాలన్నింటితోనూ ప్రత్యక్ష – పరోక్ష సంబంధాలు   ఉంటాయి. అమె కుటుంబ ప్రస్థానం రైతు కూలీ సంఘం నుండి మొదలవుతుంది. ఆమె తల్లిదండ్రులు ఇరువురు రైతు కూలీ సంఘం కార్యకర్తలే. రైతు కూలీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా తండ్రి డప్పు పడితే, తల్లి గజ్జ కట్టి ఆడేది, పాడేది.  ప్రభుత్వం రైతు కూలీ సంఘం సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి రైతుకూలీల సమస్యలను పరిష్కరించాల్సింది  పోయి, ఆ ప్రశ్నలు లేవనెత్తిన గొంతుకలను నులిమెయ్యడం చేసింది. చంద్రవంక తల్లిదండ్రులపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు గావిస్తుంది, చివరకు బూటకపు ఎన్ కౌంటర్లో వారి  ప్రాణాలు తీస్తుంది. అయితే రాజ్యం చంద్రవంక తల్లిదండ్రుల ప్రాణాలు తీసి ఆమె నుండి వారిని దూరం చేసింది కానీ, వారిచ్చిన ధైర్యాన్ని, వారు చూపిన మార్గాన్ని ఆమె నుండి అది దూరం చేయలేకపోయింది. వర్గ శత్రువును అంతం చేసి  పేదవారిని ఆర్థిక అసమానతల నుండి విముక్తికి  అడవి మార్గం పట్టింది, అన్నలతో కలిసి తుపాకి చేబట్టింది.

ఈ దేశంలో వర్గమే కాదు, కులం కూడా ఒక ప్రధాన వైరుధ్యం. కాబట్టి వర్గంతో పాటు కుల పోరాటం కూడా జమిలీగా జరగాలని ఉద్యమంలో ఆధిపత్య స్థానాలను ఆక్రమించిన అగ్రకుల నాయకత్వానికి మిగిలిన బహుజన నక్సలైట్లతో కలిసి చంద్రవంక విన్నవించుకుంటుంది. బహుజనులు తమనుండి ఆదేశాలను తీసుకుని వాటిని తూ చ తప్పక అమలుచేయడానికి అలవాటుపడిన అగ్రకుల నాయకత్వానికి బహుజనులు తమ ముందు నిలబడడమేగాక,  ప్రశ్నించడం అనేది అసలు రుచించలేదు. దానితో బహుజన నాయకులు అడవిని దాటి, గన్నును వదిలి బాబాసాహేబ్ అంబేద్కర్ లా పెన్ను పట్టుకున్నారు, జనజీవన స్రవంతితో మమేకమై ప్రజాస్వామ్య ఉద్యమాల బాట పట్టారు.

సామాజిక ఉద్యమాలతో రాజకీయాలతో పరిచయమున్న ప్రతి వ్యక్తికి కారంచేడు, చుండూరు ఘటనలు సుపరిచితమే. అందువల్ల  చంద్రవంక నవలలో ఈ రెండు ఘటనల ప్రస్తావనలో క్రొత్తదనమేమీ కనపడదు.  అయితే సంఘటనల తరువాత జరిగిన ఉద్యమాలు, బహుజనుల సమీకరణలు ఆ ఉద్యమ నాయకుల త్యాగాలు కొద్ది మందికి మాత్రమే క్షుణ్ణంగా తెలుసు. ఎజ్రాశాస్త్రి దళిత ఉద్యమ పోరాట ఘట్టాలను కొన్నింటిని తన చంద్రవంకలో చెప్పడం ద్వారా  కొత్తగా  వర్తమాన చరిత్రను తెలుసుకుంటున్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా చుండూరు సంఘటన జరిగిన తరువాత దళితవాడ పరిస్థితిని ఎజ్రాశాస్త్రి చెప్పిన తీరు మనం చెప్పుకోవాలి. హృదయం ఉన్న ప్రతి పాఠకుని కళ్ళు చెమ్మగిళ్ళే సందర్భమది:

సంఘటన జరిగి ఇరవై నాలుగు గంటలైంది. ఫస్ట్ ఎయిడ్ చెయ్యక రసికారుతున్న పచ్చిగాయంలా ఉంది దళితవాడ. దాని సొగసు, స్వరూపమే మారిపోయింది. మాలపల్లెలోని ఇళ్లన్నీ చిందర వందరగా ఉన్నాయి.  ట్రంకు పెట్టెలు వీధిలోకి విసిరి వేయబడ్డాయి. అందులో విలువైన దస్తావేజులు, చదువుకున్న సర్టిఫికెట్స్ ఒక ముక్కు బేసరో,  తాళిబొట్లో, కాళ్ల పట్టీలో ఏవైతేనేం? దాచుకున్న బతుకు బజారు పాలయింది. కూటి కోసం దాచుకున్న కాసినో కూసినో వడ్లు, పప్పు గింజలు ఎగజల్లి కాళ్లతో తొక్కబడ్డాయి. కుండల్లో కూడు, కూర, మజ్జిగ బావురుమంటున్నాయి. దుర్మార్గానికి చిహ్నంగా నిలచింది ఆ సన్నివేశం (పే. 47).

‘దాచుకున్న బతుకు బజారు పాలైంది’ అన్న ఈ ఒక్క వాక్యం చాలు చుండూరు రెడ్లు జరిపిన మారణకాండ తరువాత దళితుల స్థితిని ప్రతిబింబింప చేయడానికి.

కారంచేడు చుండూరు ఉద్యమాల తరువాత ప్రజాస్వామ్య బద్ధమైన హక్కుల సాధన కొరకు బహుజనుల నుండి వచ్చిన ఉద్యమాలలో మాదిగ దండోరా ఉద్యమం చెప్పుకోదగినది. సామాజికన్యాయ సమ పంపిణీకై మాదిగల నాయకత్వంలో వచ్చిన ఒక ప్రజాస్వామ్యక  ఉద్యమం దండోరా.  మాదిగ ఉద్యమంలో ఆదినుండి భాగస్వామి అయిన ఎజ్రాశాస్త్రి ఆ ఉద్యమ ఆవిర్భావం, ఆ ఉద్యమ డిమాండ్లు, ఆ ఉద్యమ నాయకత్వం, ఆ నాయకత్వం ఉద్యమాన్ని ఆంధ్రదేశంలోని ప్రతి జిల్లాకు, ప్రతిమండలానికి, ప్రతిగ్రామానికి తీసుకువెళ్లిన విధానం, నాయకత్వం వెళ్ళిన ప్రతిచోట కార్యకర్తలను ఆ నాయకులు తయారుచేసుకున్న విధానం – మొదలైన  విషయాలెన్నింటినో ఈ నవలలో డాక్యుమెంట్ చేస్తాడు. మాల నాయకత్వం చెబుతున్న ‘ఐక్యత’, ‘రాజ్యాధికారం’ అనేవి పెద్ద బూటకమని రిజర్వేషన్ లలోని వాటాలు ఇవ్వనివారు రేపొద్దున రాజ్యాధికారంలో వాటా ఇస్తారా అని చాలా స్పష్టంగా ఎజ్రాశాస్త్రి కరుణాకర్ అనే పాత్ర ద్వారా ప్రశ్నిస్తాడు: “విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మనకు తీవ్రమైన అన్యాయం జరిగింది, జరుగుతుంది. అది మీకు తెలియనిది కాదు, అది అన్యాయమని మనకు తెలిసి కూడా మనవాళ్లు ప్రశ్నించలేక పోతున్నారు. ఎక్కడో మీ లాంటి వాళ్ళు తప్ప. ‘సోదరుడు’ దొరికినంత దోచుకుని సోదరభావం, ఐకమత్యం, రాజ్యాధికారం అనే నక్కజిత్తుల మాటలు చెబుతున్నాడు. అవన్నీ బూటకమని తేలిపోయింది” (పే.92) అని మాదిగలకు ప్రభోదిస్తాడు.

ప్రజాస్వామ్య బద్ధమైన మాదిగ దండోరా డిమాండ్ ని అన్ని రాజకీయ పార్టీలతో పాటు,  పౌర సమాజంలోని ప్రతి ప్రజాస్వామ్య వేదిక, సంస్థ మద్దతును ప్రకటించాయి. మాదిగ దండోరా డిమాండ్ లోని న్యాయబద్ధత వలన అయితేనేమి,  మాదిగ ఉద్యమ ఉప్పెన అయితేనేమి, మాదిగ కులాన్ని తన ఓటు బ్యాంక్ గా మార్చుకునే పన్నగమైతేనేమి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దళిత రిజర్వేషన్లను హేతుబద్దీకరించే ఒక ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి రాష్ట్రంలోని దళితవర్గాన్ని నాలుగు తరగతులుగా విభజించి ఆయా తరగతులలోని జానాభా నిష్పత్తి  ప్రకారం రిజర్వేషన్ వాటాలను కేటాయించింది. అయితే మొదటి నుండి మాదిగలకు వ్యతిరేకంగా ప్రతి ఉద్యమం నిర్వర్తిస్తున్న మాల నాయకులు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా హైకోర్ట్ కి వెళ్ళారు. హైకోర్టులో చుక్కెదురైతే,  సుప్రీం కోర్ట్ కి వెళతారు. రిజర్వేషన్ లతో ఐ ఏ స్ లు  అయ్యి దేశ రాజధానిలో పెద్ద ర్యాంకుల్లో ఉన్న మాల ఆధికారులు పెద్దమొత్తంలో డబ్బులు సేకరించి సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యిచ్చిన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా కేసు నడిపారు. చివరకు రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ ఆర్డినెన్స్ చెల్లదని,  అది రాజ్యాంగానికి వ్యతిరేకమని, రాజ్యాంగాన్ని వివిధ కోణాల నుంచి అర్థం చేసుకోలేని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తప్పుడు తీర్పు యిచ్చి మాదిగలను అంతు తెలియని దుఖః సముద్రంలోకి నెడతారు.

సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల జీవితాలు ఒక్కసారిగా అతలాకుతలమయ్యాయి. తారుమారు అయిన మాదిగల స్థితిని ఎజ్రాశాస్త్రి చెప్పిన విధానం హృదయం ఉన్న ప్రతి ఒక్కరని  ద్రవింపజేస్తుంది, ఆలోచించే ప్రతి మెదడును ఆలోచింపజేస్తుంది. “కళ్ళల్లో కన్నీళ్లు ఆగడంలేదు. నాలుగేళ్లు నిశ్చింతగా ఎవరు కూడు వాళ్లు తిన్నారు. ఎవరికి రావలసిన రాయితీలు వాళ్ళు ఆనందంగా అనుభవించారు. కులపోళ్ళంతా కుశాలగున్నారు” (పే. 107) . సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తరువాత ఏ మాదిగ నోట్లో ముద్ద దిగలేదని, తీర్పు విషయం కాదుగాని, తమ సోదరులు అనుకుంటున్న మాలలే ఇందుకు కారణమయ్యారని మాదిగ గుండెలు బరువయ్యాయని ఎజ్రాశాస్త్రి అంటాడు:  “ఎవరి ఇంటి మీద పొగ రావడం లేదు. అలా అని పగతో రగలడం లేదు. అమాయక ప్రజలు కదా! ఎడవడం ఒక్కటే వాళ్ళకు తెలుసు. ఓడిపోయామని కాదు. ఇంట్లో వాడే కంట్లో పుల్ల పెట్టాడని(పే.108)”. అదే విధంగా, భూమిమీద ఉండే అన్ని విషయాలగురించి తన కన్నకొడుకుకో, కూతురికో కష్టం వచ్చిందన్నట్లు మాట్లాడే మేథావులు  సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని పాటించడాన్ని ఎజ్రాశాస్త్రిగారు ఆక్షేపిస్తాడు: “హిజ్రాల గురించి,  వియాత్నం గురించి, పాలస్తీనా గురించి,  తెలంగాణ గురించి ఇలా రకరకాల ఉద్యమాలు న్యాయమని మాట్లాడే మన మేథావులు రిజర్వేషన్ కాడికి వచ్చాలకే ఎనక్కి తగ్గుతుండ్రు ఏందబ్బా!”(పే. 108) అని కాస్త ఎగతాళిగా అంటాడు.  రిజర్వేషన్ల హేతుబద్దీకరణ కేసు సుప్రీంకోర్టులో వీగిపోయినప్పటికీ మాదిగ ఉద్యమం ఇంతటితో ఆగేదికాదని నూతనుత్తేజంతో ఉద్యమాన్ని ముందుకునడిపించుకోవాలసిన అవసరం ఉందని   రచయిత ఎజ్రాశాస్త్రి భావిస్తాడు. అలా భావిస్తూనే, రాజ్యాధికారమే బహుజనుల చివరిలక్ష్యమని, “రాజ్యాధికారం వస్తే అన్నీ మనకాళ్ళ దగ్గరకు వస్తాయి” (పే. 110) అని తన సహచరుడు విజయ్ తో చంద్రవంక అనడాన్ని బహుజనుల తక్షణ కర్తవ్యం రాజ్యాధికారమని ఆ దిశగా బహుజనులు తమ శక్తియుక్తులన్ని మళ్ళించాలని బహుజనులకు పిలుపునిస్తూ ఎజ్రాశాస్త్రి ఈ  నవల ముగిస్తాడు.

ముగింపుగా, గత యాభై సంవత్సరాలుగా తెలుగు నేలపైన వర్గతత్వానికి, కులతత్వానికి వ్యతిరేకంగా బహుజనులు  జరుపుతున్న సామాజిక ఉద్యమాలను ఎజ్రాశాస్త్రి చంద్రవంక పాఠకులకు పరిచయం చేసింది. అయితే నవలలో పేర్కొన్న ఒక్కొక్క  ఉద్యమం కొన్ని పుస్తకాలకు సరిపడా విషయం ఉన్న ఉద్యమాలు. ఆ కోణం నుంచి చూసినప్పుడు నవలలో ప్రస్తావించిన ఏ ఉద్యమానికి కూడా రచయిత సరైన న్యాయం చెయ్యలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఉదాహరణకు బహుజనులు నక్సలైట్ ఉద్యమంలో భాగస్వాములుగా ఉండి అగ్రకుల నాయకులతో కలసి పనిచేశారు. అయితే వారు  కుల ప్రశ్నను లేవనెత్తినప్పుడు అగ్రకుల నాయకత్వంతో ఏ విషయాలు ఏకరువు పెట్టారు, ఎటువంటి ప్రశ్నలు సంధించారు? అసలు అక్కడ జరిగిన సంభాషణ ఏంటి?  దాని పర్యావసనం ఏమిటి? ఇటువంటి విషయాలను రచయిత ఏ పాత్ర ద్వారా చెప్పలేదు. అదేవిధంగా కారంచేడు, చుండూరు ఉద్యమాలు మన కాలంలో బహుజనులు చేసిన గొప్ప ఉద్యమాలు. తమ అస్తిత్వాన్ని, ఉనికిని చాటి చెప్పి తమకు సమానత్వం కావాలని డిమాండ్ చేయడంతో పాటు తెలుగు నేలను ప్రజాస్వామ్యీకరించడంలో ఒక గొప్ప పాత్రను ఆ ఉద్యమాలు పోషించాయి. రాజ్యాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న అగ్రకుల నాయకులు న్యాయవ్యవస్థను సైతం తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతులయ్యారని కారంచేడు చుండూరు పరిణామాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. చంద్రవంకలో ఈ విషయాల ప్రస్తావనే లేదు.

అదే విధంగా ఉద్యమాలను తమ భుజస్కంధాల మీద వేసుకొని తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడిన నాయకుల పేర్లను కాక వేరు పేర్లను పెట్టడం ద్వార రచయిత ఆశించిన ప్రయోజన మేమిటో తెలియదు. కారంచేడు సంఘటన గురించి చెబుతూ  మొట్టమొదటి సారి ‘ప్రకాశం జిల్లా కారంచేడు’ (పే. 29) అని, ఆ తరువాతనుండి ‘దారంచేడు’ గా మార్చాడు. అలానే చీరాలను చీదరాల అని చుండూరుని తుండూరు అని మార్చడం కాస్త చీదరగా ఉంది. ఇకపోతే మాదిగ దండోరా ఉద్యమ ఆరంభంలో ఉద్యమ నాయకులు రచయిత ఎజ్రాశాస్త్రి దగ్గరికి వచ్చినట్లు వారిరువురు అతనితో కలసి చర్చించినట్లుగా రచయిత చెప్పుకుంటాడు. నాకెందుకో ఇది కాస్త ఎబ్బెట్టుగా ఉంది.

రచయిత దండోరా ఉద్యమంలో పాలుపంచుకుని ఆదిలో మాదిగ నాయకత్వానికి ఒక మార్గాన్ని నిర్థేశించినట్లయితే అతని భాగస్వామ్యాన్ని, పాత్రను ఇతరులు చెప్పటం ఒక విలువ. అంతేగాని తనకు తాను చెప్పుకోవడం ఒక రకమైన జుగుప్సను కలిగిస్తుంది. నవలలో చాలా చోట్ల అచ్చుతప్పులు స్పష్టంగా కనపడతాయి. ఈ మధ్యకాలంలో ఇటువంటివి సర్వసాధారణంగా జరుగుతున్నప్పటికీ కాస్త జాగ్రత్త తీసుకున్నట్లయితే బాగుండేది. భాష విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంది. సుసంపన్నమైన తెలుగు భాష వరవడిని, తెలుగు నుడికారాన్ని తెలుగులో వ్రాసే ప్రతి  రచయిత కాపాడాలి,  ఆ విలువల పరంపరలను  కొనసాగించాలి. అది వారి కనీస బాధ్యత. ఆ  బాధ్యతను చంద్రవంక నవలలో ఎజ్రాశాస్త్రి పాటించినట్లుగా కనిపించదు. ఇటువంటి చిన్న చిన్న పరిమితులను సరిదిద్దుకోవాలని నా మనవి. ఏది ఏమైనా యాభై సంవత్సరాల తెలుగు బహుజన జీవితాన్ని 82 పేజీల నిడివిగల ఒక నవల ద్వారా చెప్పడం అంత సులభంకాదు. చాలా విషయాలను లోతుగా చెప్పలేక పోయినప్పటికీ, బహుజన ఉద్యమాలను ఈతరం పాఠకులకు పరిచయం చేయడంలో చంద్రవంక విజయం సాధించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా రచయిత మేథో శ్రమను మనం అభినందించాలి. భవిష్యత్తులో ఇటువంటి రచనలు మరెన్నో ఎజ్రాశాస్త్రి చేయాలని కోరుకుందాం.

*

సాంబయ్య గుండిమెడ

3 comments

Leave a Reply to పి.శ్రీనివాస్ గౌడ్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “A novel must show how the world truly is, how characters genuinely think, how events actually occur. A novel should somehow reveal the true source of our actions.”
    ― Kevin Hood
    ఎజ్రాశాస్త్రి తాజా నవల చంద్ర వంక గురించి డా.సాంబయ్య గారి వ్యాసం సంయమనంగా సాగింది.నవలలోని సుగుణాలు చెపుతూనే లోపాలు కూడా సూచనాత్మకంగా చెప్పారు.చరిత్రను నమోదు చేయడం నవల చేసే పనుల్లో ఒకటి.
    చంద్రవంక చదవాలి.సామాజిక ఉద్యమాలను ఏ రకంగా రచయిత చిత్రించాడోనని ఆత్రుతగా వుంది.
    రచయిత కు , వ్యాసకర్తకి అభినందనలు.

  • విప్లవ పోరాటం నుండి బహుజన పోరాటాల్లో నాయకుల వైఫల్యాల పునాదుల పై మరో చరిత్ర నిర్మాణం దిశగా బహుజన రాజ్యాధికారంకోసం పిలుపు స్వాగతించాలి. ఈ దేశం లో వర్గం కన్నా ముందు కులం పోతేనే సమసమాజం ఆకాంక్ష ఫలిస్తుంది. వూర్ల పేర్లు మార్చటం రచయిత పరిధిలోని అంశం. నక్సలైట్ ఉద్యమంలో బహుజన గళాలు లేవనెత్తిన అంశాలు రచయిత కి తెలిసి వుండక పోవచ్చనే కోణం లో చూడాలి. ఏ పోరాటం లోనైనా బహుజనులే కాగడాలు

  • అద్భుతమైన రివ్యూ సర్…నవలను ఆసాంతం హత్తుకుని…నిఖార్సయిన మాటలతో సమీక్షించారు. రచయితకు ఉపయుక్తమైన విషయాల్ని సూటిగా తెలియజేసారు.
    రచయిత ఎజ్రాశాస్త్రి అన్నకు శుభాకాంక్షలు..
    ఒక గొప్ప ఉద్యమ చరిత్రను నవలగా అందించారు…💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు