అయిదు దశాబ్దాల తాజాదనం!

ఈ నెల పద్నాలుగుకి పతంజలి శాస్త్రి గారికి 75 ఏళ్ళు నిండుతాయి. ఓ మనిషి జీవితంలో ఇదొక అరుదైన ఘట్టం. అదే మనిషి గొప్ప రచయిత, పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త కూడా ఐతే ఆ అరుదైన ఘట్టం ఆయన వున్న మొత్తం వర్గానికి చెందుతుంది. ఈ నేపధ్యం లో గత ఎనిమిది నెలల నుంచి శాస్త్రి గారు రాసిన వివిధ కథల్ని “సారంగ”లో క్లుప్తంగా చెప్పుకుంటూ వచ్చాం. మధ్య మధ్య లో ఆయన గురించి రాసిన వ్యాసాలు కూడా ప్రచురించాము. ఇలా ఒక రచయితా రచనలని  75 ఏళ్ల సందర్భంగా గుర్తు చేసుకోడం తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పటి వరకు జరిగినట్లు లేదు. అలాగే ఈ కృషి ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా సంపూర్ణంగా సహకరించిన సారంగ ఎడిటర్లకు ఎన్ని కృతఙ్ఞతలు చెప్పినా తక్కువే. అలాగే ఈ 75 ఏళ్ళు నిండుతున్న సందర్భంగా చాలామంది ప్రముఖుల్ని ఆయన గురించి వ్యాసాలు రాయమని అడిగాము. ఐతే అందరూ తలకు మించిన పనుల భారం తో ఇవ్వలేమని చెప్పేశారు. మా దగ్గరకు వచ్చిన ఒకటి రెండు వ్యాసాలు అలాగే శాస్త్రి గారు కొత్తగా రాసిన  కథ ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీకు అందిస్తున్నాము.

-“ఛాయా” మోహన్ బాబు

*

తంజలి  శాస్త్రి గారి అనేక అభిమానుల్లో  నేనూ ఒకడిని. శాస్త్రి గారిని మొదటిసారి  రాజమండ్రి  సాహితీ సభలో కలిసాను, వారు పెద్ద  రచయితని  అప్పటికి  తెలీదు. కుర్తా, ఫ్రెంచ్ గెడ్డం, కళ్ళజోడూ చూసి బహుశా రిటైర్డ్ ప్రొఫెసర్ కానీ లేక జర్నలిస్ట్ అయ్యుండాలని తీర్మానించుకున్నాను, అదే  నిజమయ్యింది  కూడా.  మా  పరిచయం  పెరిగాక  ‘పతంజలి  శాస్త్రి కథలు’ కథా  సంకలనం సంతకం  చేసి ఇచ్చారు. ఆ పుస్తకం గొప్ప రసానుభూతిని కలిగించింది. ఎప్పుడు రాజమండ్రి వెళ్లినా శాస్త్రి గారితో కలిసి చాయ్ తాగడం, వారు మాట్లాడుతుంటే వినడం తప్పనిసరి.

వర్తమాన  కథా  సాహిత్యం కొంత వరకు ఫాలో అవుతాను. ప్రతీదీ  మన  ఇష్టాయిష్టాలనే  జల్లెడలో వడగట్టుకుంటాం కనుక సాహితీ పెద్దలు  ముక్తకంఠంతో బాగుందన్న కథ కూడా నచ్చాల్సిన అవసరం లేదు. రచయిత అనుభవం వలనో, నైపుణ్యం వలనో వస్తువు, శిల్పం, శైలి  వంటి  సాంకేతిక  అంశాలలో  లోపం  లేకపోయినా ఏదో అసంతృప్తి మిగిలేది. శాస్త్రి గారి పుస్తకం ఏళ్ల వెలితిని  ఒక్కసారిగా పూరించింది. బరువైన అంశాలని సున్నితంగా చెప్పిన  శైలి,  చెప్పీ చెప్పకుండా వదిలేసిన   ఖాళీలు, క్లుప్తత, సునిశిత హాస్యం, కథలని ముగించిన తీరు, కథలు కావవి  వచన  కవిత్వం.. రిపీట్  వేల్యూ  ఉన్న రచనలు – his writings are a total package! ఈ  అంశాలు  అనేక కథల్లోనూ ఉంటాయి, శాస్త్రి గారి ప్రత్యేకత  ఏమిటని అడిగితే  అంతర్లీన  ఆలోచన (ఆత్మ) అని  చెబుతాను. ఊహించి రాసినవి, విని రాసిన వాటికంటే  చూసి, అనుభవించి, అంతరీకరణ  చేసుకున్న  గొంతులో  ఓ లోతు ఉంటుంది. ఆ గొంతు శాస్త్రి గారి ప్రత్యేకత!

కథకి  సామాజిక  ప్రయోజనం ఉండి  తీరాలి,  ప్రయోజనం  లేనివి  వ్యర్థమైన  రాతలు;  కథ  కళారూపం కనుక ప్రయోజనపు  బరువుల  అవసరం  లేదు అనే  ఎంతకీ  తెగని  సాహితీవేత్తల వాదనలు  తరచుగా చూస్తాము. ఈ ధోరణులు  వింటుంటే దేనికదే ప్రత్యేకం అనే  అనుమానం రాక  తప్పదు ఈ రాద్ధాంతం జోలికి వెళ్లకుండా రెంటినీ నేర్పుగా ఒడిసిపట్టిన కథకులు పతంజలి శాస్త్రి గారి ప్రయోజనకరమైన సృజన అంటే  ఇష్టం; రాతలకి  మాత్రమే పరిమితం కాని పర్యావరణ కార్యశీలత  అంటే  అపారమైన గౌరవం.

శాస్త్రి గారికి  రచనలు, వ్యక్తిత్వం వేరు కాదు రెండూ ఒకటే, He is the summary of his characters.

‘వడ్లగింజలు’లో రామం కలెక్టర్  మాట వింటే  బాగుండేదా? (మధ్యతరగతి సర్దుబాట్లు), ‘ఈ చెట్టు తప్ప’లో దయచేసి మీరీ చెట్టు కొట్టకండనే  పట్టాభిగారు (పర్యావరణం), ‘వైతరణికీవల’లో తల్లిని పంపిస్తూ శర్మ పడే వేదన, ‘కతలవ్వ’  మేఘాల రెక్కలు అతికించి  కలలో వర్షాలు కురిపించినా అది కరువు ప్రాంతమనే సమాంతర వాస్తవం మనతో  ప్రవహిస్తూ ఉంటుంది…ఎన్నో నిర్దిష్టమైన పాత్రలు, సందర్భాలు,  ప్రశ్నలు.

ఐదు దశాబ్దాలకు పైగా రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నా శాస్త్రి  గారి  కథల  తాజాదనం  తగ్గదు (జీవితంలా)  – సమకాలీన వాస్తవికతని  ప్రతిఫలిస్తాయి,  రచనా శైలి ఎప్పటికప్పుడు కొత్తదనం  సంతరించుకుంటుంది,  స్పృశించిన అంశాల పరిధి విస్తరిస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే  ఇప్పటికీ పదునైన, పాఠకులని నిర్ఘాంతపరిచే రచనలు చేయడం విశేషం. నిరంతరం  తమని తాము తిరిగి ఆవిష్కరించుకోవడం ఎలా సాధ్యం? He is a keen observer of the world around him as he is genuinely connected and concerned అనిపిస్తుంది. సమాజం పట్ల, సాహిత్యం పట్ల  చెక్కుచెదరని బాధ్యత,  నిబద్ధతను తెలియజేస్తుంది.

****

మధు పెమ్మరాజు

మధు పెమ్మరాజు నివాసం హ్యూస్టన్ దగ్గరలోని కేటీ నగరం. శీర్షికలు, కధలు, కవితలు రచించడం, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం వీరి హాబీలు. వీరి రచనలు కౌముది, కినిగే, ఆంధ్రజ్యోతి, చినుకు, వాకిలి, సారంగ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

2 comments

Leave a Reply to Suresh Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ” గత ఎనిమిది నెలల నుంచి శాస్త్రి గారు రాసిన వివిధ కథల్ని “సారంగ”లో క్లుప్తంగా చెప్పుకుంటూ వచ్చాం. మధ్య మధ్య లో ఆయన గురించి రాసిన వ్యాసాలు కూడా ప్రచురించాము. ఇలా ఒక రచయితా రచనలని 75 ఏళ్ల సందర్భంగా గుర్తు చేసుకోడం తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పటి వరకు జరిగినట్లు లేదు. అలాగే ఈ కృషి ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా…” — “ఛాయా” మోహన్ బాబు

    అవును. పాఠకుల కోసం ఇన్ని నెలలుగా వాటిని అందించే ప్రయత్నం మీరు చేసిన మంచి పని. Thankless job. కానీ గొప్ప పని. ఇప్పుడయినా వాటిని పాఠకులు ఆదరిస్తారని ఆశిద్దాం.

    “ఆయన గురించి వ్యాసాలు రాయమని అడిగాము. ఐతే అందరూ తలకు మించిన పనుల భారం తో ఇవ్వలేమని చెప్పేశారు”

    ఆ పనుల భారం నుంచీ వాళ్ళు త్వరలోనో ఆ తర్వాతో విముక్తులవగానే రాస్తారని ఆశిద్దాం. మళ్ళీ మళ్ళీ అడగటం ఒకటే పని జరిగే మార్గం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు