అమ్మ చెట్టు –మనందరి జ్ఞాపకాల పూతోట

జూలై ఏడు – సత్యశ్రీనివాస్ నిర్వహణలో మదర్ ట్రీ ప్రదర్శన

జి. సత్య శ్రీనివాస్ సుమారు మూడు దశాబ్దాల పైగా  అడవులు, గిరిజనుల,గ్రామీణుల, పర్యావరణ అభివృద్ధి కోసం స్దానికులతో, వివిధ దేశీయ, అంతర్జాతీయ సంస్ధలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారు. పరిశోధన, దేశ ,విదేశీ విద్యార్ధులకు పరిశోధనలు చేయడంలో మార్గదర్శకత్వం, స్ధానిక ప్రజలు, సంస్ధలకు శిక్షణ ఇవ్వడంలో, ప్రోగ్రాం, ప్రాజక్ట్ నిర్వహణలో  మంచి ప్రావీణ్యం వుంది.

స్వతహాగా కవి,చిత్రకారులు, ఫోటోగ్రాఫర్,రచయిత. ఇంకా సగం, నేలకన్ను, ఫ్లోటింగ్ ట్రీ (English poetry on Amazon), పిల్లల చెట్టు(ఇ బుక్), ఇంకా సగం-సీక్వెల్.మిడ్ నైట్ రైన్ అండ్ డే డ్రీమర్స్   అన్న కవితా సంపుటిల్న ప్రచురించారు. గ్రీన్ షాడోస్ ,#20 మెమోయిర్స్ పేరున ఫోటోగ్రఫీ, పెయింటింగ్ ప్రదర్శనలు చేశారు.

జులై  7న  తన స్వగృహంలోనే తన అన్న గారు గుడ్లవల్లేటి ఉదయ్ భాస్కర్ జ్ఞాపకార్ధం “మదర్ ట్రీ” పేరుతో  మొక్కలు ,డ్రాయింగ్స్/పెయింటింగ్స్ (గిరిజన ,గ్రామీణ మహిళల చిత్రాలు) తో కలిపి ప్రదర్శన ప్రారంభం అవుతుంది. దీనికి ముఖ్య అతిధులుగా వాడ్రేవు చిన వీరభద్రుడు, పసునూరు శ్రీధర్ బాబు, రాజేశ్వర రావు, పద్మ పాల్గొంటున్నారు. 

మామూలుగా  అయితే కేవలం పెయింటింగ్స్  ప్రదర్శనే చేస్తారు కాని మీరు  మొక్కలు, పెయింటింగ్స్ ప్రదర్శన  రెండూ కలిపి చేస్తున్నారు అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆయన మాటల్లోనే వివరంగా- 

 

“ఇక్కడ “మొక్క”  అంటే ముందుగా మా కుటుంబం గురించి చెప్పాలి. మాఇంట్లో అన్నదమ్ములకు,చెల్లికి అందరికీ  చిన్నప్పటి నుండి వాటి పై వల్ల మాలిన ప్రేమ .శ్రీమతికి, శిశిర్ కి  అయితే చెప్పనవసరం లేదు. అది అంతటితో ఆగలేదు వాటిని పెంచడంతో బాటు, ఎంచుకున్న చదువు,  వృత్తి కూడా వాటితోనే ముడిపడి వున్నాయి.”

“మా పెద్దన్నయ్య జి.వి.రాం, గారు  మెటీరియల్ సైన్స్ లో పోస్ట్ పిహెచ్ డి చేశారు. రెండో అన్నయ్య సుబ్బారావు గారు హైడ్రో జియాలజిస్ట్ , మూడో అన్నయ్య ఉదయ్ భాస్కర్ జియోఫిసిస్ట్ . నేను సోసియాలజి చేసి సోషియో ఎకలజిస్ట్ గా మారాను. అంటే మేము కేవలం మొక్కలు, చెట్లనే కాదు వాటి ,మన ఆవరణ అయిన భూమిని, మానవ సమూహాలు ,వాటితో అల్లుకున్న జీవనం చుట్టూ పనిచేసిన వాళ్ళం . మొక్కలు ,చెట్లు పెంచడం వేరు , వాటితో సహజీవనం చేయడం వేరు.

ఉదయ్ భాస్కర్ గారు సింగరేణి కాలరీస్ కంపెని నుండి ఎక్స్ ప్లోరేషన్  డివిషన్  మ్యానేజర్గా  పదవి విరమణ అయిన తర్వాత అప్పుడు ఆయన హైదరాబాద్లో  స్థిరపడిన తీరు చూస్తే నాకు అనిపించింది. హైదరాబాద్లో సెటిల్ అవుదామని నగరం అంతా తిరిగాడు ఇల్లు కోసం. తనకు  మటుకి తెల్సు ఎటువంటి ఇల్లు కావాలని ! చివరికి షామీర్ పేట్  ధ్యాన్యప్రస్తా లో ఒదిగాడు. అందరూ  అంత దూరం ఎందుకు అని అడిగిన వారే! తను మటుకు కేవలం నాల్గు గోడల ఇల్లుని కాదు వెతికింది.ఆ గోడల కంటే ముఖ్యంగా వుండే చుట్టూ వుండే ఖాళీ స్ధలాన్ని, ఆ ఖాళీలని తన ఇష్టానుసారం మొక్కలతో  పూరించి , వాటితో  సహజీవనం చేయాలన్న ఆశతో !

ప్రస్తుత  కాలంలో ఇల్లు అంటే కేవలం నాల్గు గోడలు, వాటికి వుండే మార్కెట్ వాల్యూ  తప్ప,అందులోని కుటుంబం, జీవనం కాదు. అందుకే ఇల్లు ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్,స్టేటస్ సింబల్,కమాడిటి  తప్ప, లివింగ్ స్పేస్ కాదు. అలా కేవలం ఒక మూడు ,నాల్గు ఏళ్ళల్లో ఇంటి చుట్టూ సుమారు  1500 వందల మొక్కలు నాటేశాడు. కనీసం 60,70 రకాలు.  వర్మి కంపోస్ట్ చేస్కునే వాడు.లేచిన తర్వాత, బ్రేక్ ఫాస్ట్ అవ్వడం ఆలస్యం తన ప్రపంచం అంతా  మొక్కలతోనే ! జీవితం లో ఒక పటిష్టమైన అభిరుచి వున్న వాళ్లకి రిటైర్మెంట్ అంటే తమ ఇష్టాలతో,ఇష్టంగా జీవించడం. ఉద్యోగం జీతం ఇస్తుందేమో కాని,జీవితాన్ని కాదు కదా! ఒక కాలంలో కొందరు ఇంత దూరం ఎందుకు అన్న వాళ్ళు, ఇప్పుడు మరి కొందరు ఎప్పుడూ మొక్కలతోనేనా అని ఆశ్చర్య పోయారు.

తను చదువుకున్నది జియో ఫిజిక్స్.అంటే భూమి, దానిని అల్లుకున్న స్పేస్ గురించి .అది కేవలం తనకు  చదువు మాత్రమే కాదు, ఆలోచనా శైలి, ధృక్పధం కూడా.అందుకే అతని స్పేస్ చాలా విస్తారంగా వుండేది. అంటే ఆస్తి పాస్తులు కావు.జీవనశైలి,నడవడిక. ఎప్పుడు చలాకీగా,యంగ్ గా వుండే వాడు. అందరికీ  సహాయ సలహాలు ఇచ్చేవాడు.

నాకు చిన్నప్పుడు నారు మడిని పరిచయం చేసింది తనే ! తొలకరి అప్పుడు నేను స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు పబ్లిక్ గార్డెన్స్  నర్సరీ నుండి వివిధ మొక్కల నారుమడి తెమ్మనే వాడు. అలా నాకు నర్సరీకి వెళ్ళడం, నారుమడిని  తేవడం అలవాటయ్యింది. నారు తేవడం తను నేర్పిస్తే, మొక్కలు పెట్టడం , పెంచడం మా రెండో అన్నయ్య సుబ్బా రావు గారు నేర్పించారు. అవే  నాకు ఇప్పటికీ   మొక్కలు  పెంచడమే  కాదు ,వాటితో జీవించడాన్ని అలవాటు చేసింది. మరి ఈ ఎగ్జిబిషన్ లో  పెయింటిగ్స్ కు ఎలా చోటు వచ్చింది  ?అదీ ముఖ్యంగా  గిరిజన , గ్రామీణ మహిళల  చిత్రాలు. దీనికి స్పందన :

మనం భూమిని మథర్ ఎర్త్ అంటాము, ఎందుకు ఫాదర్ ఎర్త్ అనము ? కారణం పునరుత్పత్తి.  నేను చూసిన ప్రాంతాలు, పని చేసిన ప్రాంతాల్లో  వాళ్ళే నన్ను ఎక్కువగా ప్రేరేపించారు, అందుకే నేను ఎప్పుడూ  వాళ్ళ చిత్రాలే వేస్తాను . వాళ్ళు నాకు తల్లి చెట్లు . మా అన్నయ్య  ఉదయ్ ని  మేమందరం బాజీ అంటాం , నాకు  ఆయన …

అతనో కవి

బుజ్జి పొద్దు తిరుగుడు

పువ్వులా ఎప్పుడూ చెట్లతో,పూల మొక్కలతో కాలం గడుపుతూ

తానో

పచ్చని కవితలా

వుండే వాడు

ఒక్క సారిగా

ఆ కాలం ఆగి పోయింది

ఇప్పుడు

ఆ తోటలో

అంతటా నిశ్శబ్దం

పూల మొక్కలు ఊసులాడడం లేదు

కాలం

అతని పూల మొక్కల దుస్తులను

తొడుక్కుని తచ్చాడుతోంది

తానో పచ్చని కవితలా వుండేవాడు

ఉలుకు పలుకు లేకుండా

వెళ్ళిపోయాడు

ముగింపు లేని

పచ్చటి దారి నుండి

గూడు కట్టుకున్న తోట నుండి

మేము…

ఆ పచ్చని కవిత తోటలో

నిల్చుండి పోయాం

పొద్దున్నే

సరస్వతి ఆకుల పై నున్న

మంచు బిందువులలో

అతని జ్ఞాపకాల

పూలని పేర్చుకుంటూ…

తానో పచ్చని కవితలా వుండేవాడు…

చివరిగా ఈ ప్రదర్శనకు సహకరించిన వారు- నా సహచరిణి మాధవీ లత, అబ్బాయి శిశిర్, వదిన జానకి,అన్నయ్య కొడుకు విరించి, అమ్మాయి హారిక. ఇంకా బాల్య మిత్రులు ,ఆప్త మిత్రులు.

ఈ ప్రదర్శన జులై 7నుండి సెప్టెంబర్ నెలాఖరు  వరకు వారి ఇంట్లో ,ఇంటి నెంబర్ 59, రోడ్ నంబర్ 4,  లిబ్రా ఎన్ క్లేవ్, బడంగ్ పేట్, హైద్రాబాద్ లో కొనసాగుతుంది.కాంటాక్ట్ 9963220467.

*

నిత్యా

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు