- Flowers for her
పూలంటే చాలా ఇష్టం తనకి. ముఖ్యంగా మల్లెపూవులు. వాటి సమక్షంలో తన ముఖం, మరి అప్పుడే రాజుకున్న నిప్పులాగా, కనకాంబరం పూల జ్వాలలాగా ధగ ధగమని మెరిసిపోయేది. ఎందుకో తెలియదు కానీ, అమాయకత్వం పోత పోసుకున్న ఒక చిన్నపిల్లలాగా అగుపించేది తను నాకు: వరండాలో కాళ్ళు జాపుకుని
సాయంకాలపు నారింజ రంగు వెలుతురులో, చీరలో, తల వంచుకుని వేళ్ళ మధ్య దారంతో, ఎవరో తలపుకు రాగా చిన్నగా పెదాలపైకి చేరే చిరునవ్వుతో, సన్నగా వీచే ఆ గాలిలో, నిమగ్నతతో నిదానంగా శాంతితో మల్లెపూవులు అల్లుకుంటూ!
అప్పుడు, గాలికి తన కురులు కదిలేవి, వేపాకులూ కదిలేవీ, రాలేవీ! నేలపై నీడలు నీటిపై నీడల్లా వొణికేవి. చివరికి నేను తన వేళ్ళ మధ్య దారమై ఆ పూలల్లో చేరి, మాలగా మారి సువాసన భరితమై తన ఒడిలోంచి ఒంపుగా పైకి ఎగిసి తన కొప్పులోకి చేరేవాడిని!
***
ఇక, ఎన్నో ఏళ్ల తరువాత, పూవులు అసలే మిగలని కాలాలలో, వరండాలో మరి నిస్తేజంగా జారగిలబడి, ఏదో గొణుక్కుని కాళ్ళను వొత్తుకునే తనకు, ఆ సాయంకాలపు రాత్రుళ్ళలో ఏవైనా పూవులు, తన నొప్పిని తుడిపివేసే, మాయం చేసే ఇంద్రజాలపు పూవులను ఏవైనా ఇవ్వాలని చాలా ఉండేది నాకు –
పెదాలు చిట్లే ఇటువంటి వేసవి కాలాలలో, తనకో ఒక చినుకు పూవును ఇవ్వాలని ఉండేది నాకు. ఎవరూ లేని తన ఒంటరి దినాలకి తోడుగా సహచరుడి వంటి ఒక పూవుని తన చెంత ఉంచాలని అనిపించేది నాకు. మాట్లాడే వాళ్ళు లేక, రోజుల తరబడి మౌనంగా ఉండిపోయే తనకు, తనని పలకరించే ఒక చిన్నని తెల్లని మాట పూవును నాటాలని అనిపించేది నాకు. ఇక ఎప్పటికో తను నిదురోతే ఏ పీడ కలకో తను ఉలిక్కి పడితే, నెమ్మదిగా తట్టి, దుప్పటిని కప్పి జోకొట్టే ఒక చేయి పూవుని తన హృదయ పాత్రలో ఉంచి, చూస్తూ ఉండాలని అనిపించేది నాకు!
***
పూలంటే అమ్మకి చాలా ఇష్టం. ముఖ్యంగా నేను ఎన్నడూ తనకివ్వని, నీడవంటి, నేను అనే పూయని పూవు అంటే అమ్మకి చాలా ఇష్టం!
***
- గుప్పెడు మొగ్గలు
________________________
గుప్పెడు మల్లె మొగ్గలు అమ్మ చేతిలో –
చలిలో, ఎండలో
ఒడ్డున మెరిసే చిన్ని గవ్వల్లాగా
ఉన్నాయి అవి, తేలికైన సువాసనతో –
“ఎలా ఉన్నావు?”
అని అడుగుతాను, గవ్వల్లాంటి
ఆమె కళ్ళని చూస్తూ. ఆవరణలో గాలి
వీచి ఆకులు రాలిన
శబ్దం, మబ్బులు కమ్మిన, మసక
మధ్యాహ్నంలో. “నొప్పిగానే ఉన్నదా?
ఇంకా?” అంటాను –
చిన్నగా నవ్వుతుంది అమ్మ, తల
ఎత్తి, నన్ను చూసి. ఎందుకో తెలీదు –
***
గుప్పెడు మల్లె మొగ్గలు అమ్మ చేతిలో
మాలగా మారి,
నేలపై ఒక పక్కగా, ఎవరూ తాకక –
తను ధరించని గుప్పెడు మల్లె మొగ్గలు
ఆ చలిలో, ఎండలో
అనంతమైన ఒంటరితనంలాగా
గాలికి వణుకుతూ, అక్కడే … అక్కడే ….!
***
(from upcoming Madre: Revised Edition)
Add comment