అమ్మ : కొన్ని ఆలోచనలు

1
చిన్న కాకరకాయలు ఎక్కడ కనిపించినా అమ్మే గుర్తుకు వస్తుంది. అమ్మ చిన్న కాకరకాయల వేపుడు ఎంత రుచిగా చేసేదో..
ఒక్క కాకరకాయ వేపుడే కాదు అమ్మ చేసిన ఏ వంటైనా ఎంతో రుచిగా వుండేది. అమ్మ చేతి వంట అంటే  ఇంట్లో వాళ్ళకే కాదు  బంధువులకు, ఇంటిపని, పొలం పని చేసే అందరూ ఎంతో ఇష్టపడే వాళ్ళు.  అందుకే అడిగి మరీ పెట్టించుకొని తినేవాళ్ళు.
అమ్మ చేతిలో ఏముందో..  ఏముంటుంది ప్రేమే కదూ..  అది మరీ ఎక్కువగా వుండేది. తను తినకపోయినా పరవాలేదు కానీ ఎదుటివాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టి సంతోష పడేది అమ్మ. అందుకే అమ్మ చేతికి ఎముక లేదు అనేవాళ్ళు అందరూ –
2
దసరా పండుగ వస్తుంది అంటే అమ్మ ఎంతో హడావిడి చేసేది.
ఇల్లంతా సంవత్సరానికి రెండు సార్లు సున్నం వేయించేది. దసరా పండుగకు, ఉగాది పండుగకు.సున్నం వేశాక ఇల్లంతా వెన్నెల పరచుకున్నట్టు తెల్లగా, చల్లగా, హాయిగా, ప్రశాంతంగా అనిపించేది.
అమ్మ పెద్దలకు సాంబ్రాణి వేసే పద్దతి విషయంలో నాన్నను కొంచెం ఎద్దేవా (ఎగతాళి)చేసేది.  మీ అమ్మా నాన్నల మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదబ్బా.. మా పుట్టింట్లో చూడు మా అమ్మా నాన్నల ఫోటో పెట్టి ఎంత మంచిగా సాంబ్రాణి వేస్తారో అనేది. అందుకు నాన్న మాకు ఆ పద్దతులు ఏమీ లేవు నువ్వు కొత్తగా ఏమీ పెట్టకు అనేవాడు. అయినా నాన్న మాటను పట్టించుకోకుండా జేజి, జేజినాన్న ఫోటో పెట్టి సాంబ్రాణి వేసేదాకా వదల్లేదు అమ్మ.
బ్రతికి వున్నన్ని రోజులు జేజి  అమ్మను చాలా సాధించేది. అమ్మ మాటపడే రకం కాదు. అందుకే  కొంచెం గడుసుగానే సమాధానం చెప్పేది. కానీ వాళ్ళ మీద ఎప్పుడూ రవ్వంత గౌరవం కూడా తగ్గించేది కాదు. వాళ్ళకు ఏ సమయానికి ఏమి కావాలో తనే చూసుకునేది. జేజినాన్న ఇష్టంగా అమ్మను ఇంటికోడలుగా తెచ్చుకున్నారు. జేజికి అమ్మను కోడలుగా తెచ్చుకోవడం ఇష్టం లేకపోయింది. తన మేనకోడలును కోడలుగా తెచ్చుకోవాలని వుండింది. అందుకే జేజి అమ్మను ఎప్పుడూ నచ్చేది కాదు.
రెండు సంవత్సరాల నుండి దసరా వస్తుంది అంటేనే గుండె కలుక్కుమంటుంది. అమ్మ చనిపోయింది అంటే మనసు ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. అమ్మ ఎక్కడికీ వెళ్ళలేదు మాతోనే వుందనే నమ్మకం. ఇప్పుడు జేజి, జేజినాన్న లతో పాటు తన ఫోటోను వుంచి సాంబ్రాణి వేస్తుంటే  గుండెను పిండేస్తున్నట్టుగా వుంటుంది. 2024 జనవరి వస్తే అమ్మ మమ్మల్ని ఒంటరిగా వదిలి నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఊరిలో అమ్మలేని ఆ ఇల్లును చూస్తే వెన్నెలను మింగిన అమావాస్యలా కనిపిస్తోంది.
*

లక్ష్మి కందిమళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు