రియాద్, సౌదీ అరేబియా.
జూన్ నెల, ఉదయం, తొమ్మిది .
ఆఫీస్ కి బయలుదేరాను. కార్ స్టార్ట్ చేసి, ఏసీ ఆన్ చేసి కార్ చల్లబడేలోపు చేతిలోకి ఫోన్ తీస్కొని ట్విట్టర్ ఓపెన్ చేసా…
“తెలంగాణాలో నైరుతి రుతపవనాల ఆగమనం, మరో రెండు రోజుల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు వచ్చే అవకాశం” ట్విట్టర్ లో ఈ వార్త చదివాకా , మనస్సంతా జ్ఞాపక మేఘాలు కమ్ముకున్నాయి.
కార్ డాష్ బోర్డ్ లో టెంపరేచర్ చూసాను. 42 డిగ్రీ సెల్సియస్ చూపిస్తుంది.
నవ్వొచ్చింది, వర్షాకాలం అనేది జీవితంలోంచి మాయమై నాలుగు సంవత్సరాలు నిండాయి. వర్షాకాలం దానితో పాటు వచ్చే రెండు మూడు నెలల సంతోషాన్ని, చిరాకుని మిస్ అవుతున్నాను. వర్షాన్ని ఇంతలా మిస్ అవుతాను అని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా, అదేనేమో జీవితం. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవడం.
అలా ఆ వర్షాకాలపు జ్ఞాపక మేఘలలో తేలుతూ కార్ నడుపుతున్నాను. ఇంతలో సడెన్ గా ఒక డెలివరీ రైడర్, హై స్పీడ్ లో, రోడ్డు మీద ఉన్న స్పీడ్ లిమిట్ కన్నా చాలా వేగంగా నా కారునీ ఓవర్టేక్ చేసి పోతున్నాడు.
150 సిసి బైకు, పసుపు రంగు యూనిఫామ్, యూనిఫామ్ పైన సేఫ్టీ కి బాడీ ఆర్మర్ . తలపైన ట్రాఫిక్ వయెలేషన్ తప్పించుకోవడానికి పెట్టుకున్న నాసి రకం హెల్మెట్. కాళ్ళకి షూస్, సాక్స్ లేకుండా.
వెనక డెలివరీ బాక్స్, దాని మీద చిన్న అక్షరాలతో ఏదో రాసుంది, ఎందుకో తెలుగులా అనిపించింది. కొంచెం స్పీడ్ పెంచి ముందుకెళ్ళి చూసాను. తెలుగులో “అమ్మి జాన్ కి దువా” అని రాసివుంది.
ఈ ఎడారి రాకాసి ఎండలో అతివేగంగా వెళ్తున్న ఈ రైడర్ మన తెలుగు వాడు అనేసరికి నాకెందుకో అతనినీ కలవాలనీ , మాట్లాడాలనీ ”అమ్మి జాన్ కి దువా” అని రాయడం వెనక కథ తెలుసుకోవాలనీ అనిపించింది.
వెంటనే కారు వేగం పెంచి, ముందు వస్తున్న సిగ్నల్ దగ్గర పట్టుకోగలిగాను.
కార్, విండో దించి “సలాం భాయ్, నమస్తే. తెలుగా ?” అన్నాను.
“వాలేకుం సలాం,నమస్తే…అవునన్నా. తెలుగే” ముఖం మీద నవ్వు తెచ్చుకుని చెప్పాడు.
“ముందు పార్కింగ్ ఏరియాలో ఒక రెండు నిమిషాలు ఆగగలవా?” అన్నాను.
“అన్నా, ఫుడ్ పికప్ కి పోతున్నా ” అని బైక్ కి అమర్చి ఉన్న ఫోన్ లోకి వంగి, కళ్ళు రెండు చిన్నవి చేసి ఏదో చూసాడు. “సరే అన్నా, పర్లేదు టైం ఉంది, ముందు ఆగుతా” అని సిగ్నల్ గ్రీన్ అవ్వగానే ముందుకి వెళ్ళిపోయాడు.
రోడ్డు పక్కన పార్కింగ్ ఏరియాలో ఇద్దరం పార్క్ చేశాం. ఒక చెట్టు కూడా లేదు నీడలో నిలబడదాం అంటే.
నేను కార్ లోంచి దిగి, అతని దగ్గరకి వెళ్లేసరికి హెల్మెట్ తీస్తున్నాడు.చెమటలో తడిసిపోయి ఉన్నాడు.
సన్నని ముఖం, చామనచాయ, చెమటకి తడిసిన జుట్టు. ఎండ వేడికి, నీళ్లు సరిగా తాగక డీహైడ్రేట్ అయి పెదవులు పగిలిపోయి, తెల్లగా పేలిపోయి ఉన్నాయి. చూస్తుంటే నాకన్నా చిన్న వాడిలానే ఉన్నాడు.
“తమ్ముడూ, ఎట్లున్నవ్, ఎం పేరు?” అని కార్లోంచి తెచ్చిన చిన్న వాటర్ బాటి ల్ ఇచ్చా.
“అన్నా, నా పేరు షఫీ, మాది కరీంనగర్, తెలంగాణ” అన్నాడు నీళ్ళు తాగుతూ.
” నాది తెలంగాణనే, ఖమ్మం దగ్గర, ఎందుకు అంత హై స్పీడ్ లో పోతున్నావ్? చాలా ప్రమాదం కదా, అయిన స్పీడ్ లిమిట్ అరవై కదా ఈ రోడ్డు లో” అని అడిగా…
” డెలివరీ బాయ్ ని అన్నా, పీక్ హవర్సు కదా, జర గట్టిగా పడతాయి రైడ్స్ అందుకే జల్దీలో ఉన్నా అయిన ఈడ ఎక్కడ కెమెరా లేదులే” అని నవ్వుతూ చెప్పాడు.
“ఏమైంది అన్నా? ఎందుకు ఆగమన్నారు” అని అడిగాడు.
“నీ బండి మీద తెలుగు లో అమ్మి జాన్ కి దువా అని రాసి ఉంది, అది చూసి ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది, ఎందుకు రాసావు అలా ?.” అని అడిగా…
“గల్ఫు లో డెలివరీ జాబు అంటే ఎంత రిస్కో తెలిసిందే కదా, మా అమ్మిజాన్ “వద్దు బిడ్డ, అంత దూరం పోబాక బిడ్డ, ఇడ్నే ఎదోటి చేస్కుందువ్”అని బాగా ఎడ్చింది నేను గల్ఫ్ పోతానంటే. కాని నా మొండితనం ముందు ఓడిపోయి, “పోయి రా బిడ్డ, ఆ అల్లా దయ నీపైన ఎప్పుడూ ఉండాలని రోజు దువా చేస్తా” అని అన్నది. అల్లా దయ నా మీద ఎప్పుడూ ఉంటదో లేదో కానీ మా అమ్మి జాన్ దువా మాత్రం ఎప్పుడూ ఉంటుంది , అందుకే అలా బండి మీద రాసి పెట్టుకున్నా.” అని చెమ్మ గిల్లిన కళ్ళతో చెప్పాడు.
“అలాగా! సరే, ఎక్కడా ఉండేది నువ్వు?” అని అడిగా.
“హరాలో ఉంటా అన్నా (రియాద్‌లో మన తెలుగు వాళ్లు, భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశీలు ఎక్కువగా ఉండే ఏరియా). మన తెలుగోళ్ళం ముగ్గురం కలిసి షేరింగ్‌లో కంపెనీ క్యాంపులో ఉంటాం.”
“లేట్ అవుతుంది, ఇగ పోతా అన్నా. చాలా సంతోషం, మీ బిజీ టైమ్‌లో నాతో కాసేపు మాట్లాడినందుకు,” అంటూ హెల్మెట్ పెట్టుకున్నాడు.
షఫీ ఫోన్ నంబర్ తీసుకొని, వాళ్ల రూమ్‌కి “రావచ్చా?” అని అడిగాను.
“అరె, తప్పకుండా అన్నా, ఈ శుక్లాలం (శుక్రవారం) రండి ,దావత్ చేసుకుందాం,” అని చెప్పి ఆ ఎడారి ఎండలో బైక్ తో మాయమయ్యాడు.
*
శుక్రవారం, నమాజ్ తర్వాత …
జుమ్మా నమాజ్ అయ్యేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది. షఫీకి కాల్ చేశాను.
“అన్నా, మీ గురించే చూస్తున్నాం, మా రవి గాడు మీకోసం బిర్యానీ వండుతున్నాడు. మీరు ఎం తీసుకురావద్దు” అని చెప్పి వాట్సాప్ లో లొకేషన్ పెట్టాడు.
శుక్రవారం సెలవు దినం కావడం వల్ల, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. పదిహేను నిమిషాలలో హరా చేరిపోయాను.మొదటి సారి వాళ్ళ రూముకి వెళుతూ వట్టిచేతులతో ఎలా వెళ్ళేది.? ఢిల్లీ సూపర్ మార్కెట్ దగ్గర ఆగి ఒక అరడజను చిన్న రసాలు, ఒక థమ్స్ అప్ బాటిల్ తీస్కొని, షఫీ పంపిన లొకేషన్ కి రీచ్ అయ్యా.
పాడుబడిన పెద్ద బిల్డింగ్స్, ఒకప్పుడు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అనుకుంటాను. పాతబడటంతో ఇలా లేబర్ క్యాంపులా మార్చినట్లు ఉన్నారు.
షఫీకి కాల్ చేశా “వచ్చారా అన్నా, ఒక్క నిమిషం…పైకి చూడండి, మీ లెఫ్ట్ సైడ్”
నాలుగవ ఫ్లోర్ బాల్కనీలో నిలబడి చెయ్యి ఊపుతూ షఫీ కనిపించాడు. “అన్నా, పై నుంచి గేట్ తాళంచెవి కిందకి వేస్తాను, ఓపెన్ చేసుకొని నాలుగవ ఫ్లోర్ కి రండి, నేను డోర్ బయట ఉంటాను.” అని తాళంచెవుల గుత్తి ఒక చిన్న గుడ్డ లో చుట్టి కిందకి వదిలాడు. పట్టుకునేటపుడు దెబ్బ తగలకుండా భలే ఐడియా అనిపించింది.
గేట్ ఓపెన్ చేశాను. ముతక వాసన ముక్కుకి తగిలింది, ఒకటి రెండు పిల్లులు , వాటి మల ముత్రాలతో గాలిలో ఒక రకమైన వాసన.మెట్ల మీదా , కిందా అంతా దుమ్ము ధూళి. గోడలు బీటలు వారి, పెచ్చులు ఉడిపోయి ఉన్నాయి.
మెల్లగ నాలుగవ ఫ్లోర్ కి చేరుకున్నాను. బయట నిలబడి ఉన్నాడు షఫీ “ రండి అన్నా, వెల్కమ్” అని లోపలికి పిలిచాడు. చేతిలో ఉన్న కీసు (అరబిక్ లో కవర్) చూసి, “ఎం తేవద్దు అన్నాను కదా?” అన్నాడు.
“ఎం లేదులే తమ్ముడు, మీ దోస్తు బిర్యానీ వండుతాండు అన్నావ్ కదా , అది లాగించి తర్వాత థమ్స్ అప్, చిన్న రసాలు వేద్దాం.”
ఆ ఫ్లోర్ లో ఉన్న అపార్ట్మెంట్స్ ను కలిపేసి ఒక పెద్ద ఓపెన్ హల్ లాంటిది చేశారు.హాల్ మొత్తం కార్డ్ బోర్డ్స్ తో పార్టీషన్ చేసి చిన్న చిన్న రూమ్ లు గా మార్చి ఉన్నారు. నాకు వెంటనే నా అమీర్ పేట్ హాస్టల్ రోజులు గుర్తొచ్చాయి. సెలవు కావడంతో చాలా మంది రూమ్స్ లో ఉన్నారు. కొందరు గట్టి గట్టిగా మాట్లాడుతూ, నవ్వుతూ లూడో ఆడుకుంటున్నారు, కొందరు కామన్ వాష్రూమ్ దగ్గర బట్టలు ఉతుక్కుంటున్నారు.పార్టిషన్ రూమ్స్ లో పాత విండో ఏసీలు పెట్టీ ఉన్నాయి, ఆ ఏసీలు అన్ని ఒకేసారి నడుస్తుంటే ఎదో పెద్ద ఫ్యాక్టరీలా ఉంది.
హాల్ దాటుకుని షఫీ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాము. చిన్న రూం, మూడు గోడలకు మూడు మంచాలు, మంచాలపైన స్టీల్ పైపులతో అరేంజిమెంట్ చేసి ఉంది. ప్రైవసీ కోసం దానిపై నుంచి కిందనున్న మంచాలపైకి దుప్పట్లు వదిలి స్లీపర్ బస్సులలో ఉండే బంకర్ బెడ్ మాదిరి చేసుకున్నారు . రూమ్ నీటుగా ఉంది . ఒక చిన్న అల్మారాలో పారాచూట్ కొబ్బరి నూనె, వాసెలిన్, జండూ బామ్ ,ఇంటినుంచి ఎప్పుడో తెచ్చుకున్న ఖాళీ పచ్చడి సీసాలు .
నేను వెళ్ళే సరికి రవి కామన్ కిచెన్ నుంచి అప్పుడే వచ్చాడు, చెమటలో తడిసిపోయి ఉన్నాడు. “అరేయ్ షఫీ, మన ఎర్రగడ్డలు ( ఉల్లిపాయలు ) మళ్ళి ఎవరో వాడుకున్నారు రా, బేకార్ సాలే గాల్లు, ఎన్ని సార్లు చెప్పిన మారరు. జల్దీ బకాల(కిరాణా షాపు) కి పోయి తిస్కరా పో ” అని అన్నాడు…
నన్ను రవి కి పరిచయం చేసి, ఎర్ర గడ్డలు తేవడానికి పోయాడు షఫీ.
రవి నాతో మాట కలిపాడు – “నమస్తే అన్నా, ఎట్లున్నారు? మీ గురించి షఫీ చెప్పాడు. మీరు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది.”
“నా ఫ్యామిలీ ఇక్కడ లేదు రవి, ప్రస్తుతం ఇండియాకి వెళ్లారు. సరదాగా మీతో టైమ్ స్పెండ్ చేద్దాం అనిపించి వచ్చాను. ఇంతకీ నువ్వేమిటి చెమటలో తడిచిపోయావ్”
“అన్నా, కామన్ కిచెన్ లో ఏసీ లు ఉండవు , చాల మంది ఒకేసారి వంట చేస్తారు కదా, ఆ వేడి, బయట వేడి మొత్తం కలిపి చాలా ఉక్క పోస్తది అందుకే ఈ చెమట” అన్నాడు.
“అవునా, నేను చూడొచ్చా” అని అడిగాను.
“చూడొచ్చు అన్నా, కానీ ఎక్కువ సేపు ఉండలేరు. పదండి చూపిస్తాను” అని కామన్ కిచెన్ లోకి తీసుకెళ్లాడు.
రెండు రూముల మధ్య గోడలు తీసేసి, పెద్ద హాల్లా మార్చారు. దాన్ని కామన్ కిచెన్‌లా వాడుతున్నారు. వరుసగా పది గ్యాస్ స్టోవ్స్, ఒక్కో స్టవ్ కి నాలుగు బర్నర్స్, ప్రతి బర్నర్ మీద ఎవరో ఒకరు ఎదో ఒకటి వండుతున్నారు . సుమారు ఇరవై మంది దాకా ఉన్నారు. ఎవరికీ శరీరం పైన చొక్కా లేదు, చెమటలు కారుతూ ఉన్నారు. వేడి, ఉక్క, చెమట, గ్యాస్, వంట కోసం వాడుతున్న మసాలా ఇవన్నీ కలిసి ఒక రకమైన వాసనతో నిండిపోయి ఉన్నది ఆ కామన్ కిచెన్ ఏరియా. అదంతా లెక్క చేయకుండా వాళ్ళందరూ సంతోషంగా, ఫోన్ లలో పాటలు వింటూ, కబుర్లు చెప్పుకుంటూ వండుకుంటున్నారు.
“సరే అన్నా , రూమ్ కి పోదాం, షఫీ గాడు వచ్చే ఉంటాడు.” ఆ మాటతో ఆ అబ్సర్డిటీ నిండిన కిచెన్ ప్రపంచం నుంచి బయటకి వచ్చాను.
“హ్మ్మ్, షఫీ… మీ రూమ్ లో ముగ్గురు ఉంటారు అన్నాడు. మూడో అతను ఎక్కడా ” అని అడిగాను.
“హ అవును, గంగాధర్ అని, మన నిజాంబాద్ అతను, ఆనికి కూడా నువ్వొస్తున్నవ్ అంటే ఉండాలి అనే ఉండే. కానీ ఈ నెలాఖరున ఆని కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి, ఓవర్ టైం పోయిండు. సెలవ్ రోజు ఓవర్ టైం చేస్తే డబుల్ పే ఉంటది, కొంచెం పైసల టైట్ ఉంది మనోనికి ఇంటికాడ. మిమ్మల్ని అడిగాను అని చెప్పమన్నాడు.”
నేను కాసేపు సైలెంట్ అయిపోయాను, మనసు, మెదడు పిచ్చి పిచ్చిగా అరచి గోల చేస్తున్నాయి. ఆరు రోజులు గొడ్డు చాకిరి చేసి, విశ్రాంతి కోసం దొరికే ఆ ఒక్క సెలవు రోజు కూడా ఓవర్ టైం డ్యూటీ చేయడానికి పోయాడు గంగాధర్.ఎందుకు ? కొడుకు స్కూల్ ఫీజు కోసం. గంగాధర్ కొడుకు పెద్దోడై ఈ కష్టాన్ని గుర్తిస్తే బాగుండు. గుర్తిస్తాడంటావా ? లేక గంగాధర్ కూడా మరో ‘మల్లన్న’ అవుతాడా?? లెట్ ది టైం టెల్ ది టేల్.
రూమ్ లోకి వచ్చి ,గంగాధర్ బెడ్ మీద కూర్చున్నాను, పక్కనే గోడకి గంగాధర్ ఫ్యామిలీ ఫోటో అంటించి ఉంది . ఏసీ మెల్లగా ఊపందుకుంటోంది గ్ర్ర్ర్ర్ర్ర్… గ్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్… నా మైండ్ మళ్ళి గంగాధర్ ఆలోచనల్లోకి జారిపోవాలని చూస్తోంది. ఏసీ … రూముతో పాటు నా మైండ్ ని కూడా చల్ల బరుస్తోంది .
“అన్నా, బిర్యానీ రెడీ అయ్యింది . కూర్చుందాం రండి.” షఫీ పిలిచాడు.
పదిహేను నిమిషాలలో భోజనం ముగించాం. ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాకు మాత్రం బిర్యానీ ముద్ద లోపలికి వెళ్తుంటే కామన్ కిచెన్ లో రవి పడ్డ కష్టం మెదడు లో ఉడుకాడుతుంది. “ ఛీ! ఈ ఒక్క రోజైనా వీళ్ళకి ఆ యాతనని తప్పించలేకపోయావ్. మంచి రెస్టారంట్ కి తీసుకొనిపోయి ఉంటే ఎంత బాగుండేది… ఎందుకనిపించలేదు నీకు? ఎప్పుడు ఇంతే చెయ్యాల్సింది చెయ్యవు. సిగ్గుగా లేదు?. వాళ్ళని ఎందుకు ఇంటికి ఆహ్వానించలేకపోయావ్ ? ఒక్కడివే ఉంటున్నావ్ కదా?. రోజు రెండు పూటలా ఆర్డర్ పెట్టుకుని తింటావ్ గా.ఎంపతీ, సింపతీ అని ఊరికే మాటలు చెప్పు, వాట్సాప్ లో, ఇంస్టాలో స్టేటస్లు పెట్టుకో,అదే చేయగలవ్. యూ బ్లడీ సెల్ఫిష్ ఫెలో.” అని అసహ్యించుకుంటుంది మెదడు, నిశ్శబ్దంగా ఏడుస్తుంది మనస్సు.
భోజనం తరువాత థమ్స్ అప్ తాగుతూ మాటల్లో పడ్డాం ముగ్గురం.
“రవి, షఫీ, అసలు మీరు గల్ఫ్ ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు” అని అడిగాను.
“మీరెందుకొచ్చారో, మేము అందుకే అచ్చినం అన్నా. పైసలకోసమే “ అని నవ్వి చెప్పడం మొదలుపెట్టాడు రవి.
“ఇంటికాడ పరిస్థితి బాలేదు, బాపుకి వయస్సు మళ్లుతుంది, పానం బాగుండట్లేదు పనిలోకి పోలేక పోతున్నాడు. అమ్మ బీడీలు చూట్టడానికి పోయేది. నాతొ పాటు చెల్లి, ఒక తమ్ముడు. ప్రతిరోజు యుద్ధమే అన్నాఇంటికాడ, చాలా బాధేసేది. నేను పెయింటింగ్ పనికి పొయ్యేది, ఒక రోజు పొతే, రెండు రోజులు ఉండేది కాదు పని. చెల్లిని, తమ్ముడిని చూస్తే పానమ్ తరుక్కుపోయేది. ఇట్లా అయితే అవ్వదు ఏదైతే ఐంది గల్ఫ్ పోదాం అని, నేను షఫీ గాడు అనుకునేటోళ్ళం.”
హైదరాబాద్ లో ఉన్న మా దోస్తు ఒక రోజు ఫోన్ చేసి “ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్, TOMCOM అనే ప్రైవేట్ కన్సల్టెన్సీతో కలిసి గల్ఫ్ దేశాలలో డెలివరీ బాయ్ జాబులు ఇప్పిస్తున్నారు, మీరు ట్రై చెయ్యండి, డ్రైవింగ్ లైసెన్స్, టెన్త్ పాస్ సర్టిఫికెట్, కాస్త ఇంగ్లీష్ మాట్లాడితే చాలు.జాబ్ ఇస్తారు. శాలరీ కూడా బాగుంటుంది” అని ఇంకా చాలానే చెప్పాడు.
“ఆ మాటలు విని మేము కూడా వెళ్లి రిజిస్టర్ అయ్యాం, రెండు నెలల్లో వీసా, టికెట్స్ తీసి రియాద్ కి పంపించారు. వచ్చిన కొత్తలో అంతా మస్తుగా ఉండేది, నెలకు 2,800 రియాల్స్ వరకు వచ్చేది జీతం, ఎనిమిది గంటల షిఫ్ట్, వారం లో ఒక రోజు సెలవు, నమ్మలేక పోయాం ! టార్గెట్ అయ్యాక వచ్చే కమిషన్ అంతా కలిపి 3000-3500 రియల్స్ వచ్చేవి, ఇక్కడ అస్సలు ఖర్చులు ఉండేవి కావు. రూమ్ కి , ఫుడ్ కి కూడా అలవెన్స్ ఇచ్చేవారు. నెలకి 80,000 ఇంచు మించు ఇంటికి పంపేవాళ్ళం.అక్కడ కరీంనగర్ లో , హైదరాబాద్ లో ముక్కు నేలకి రాసిన మాకు నెలకు అంత జీతం వస్తుందా చెప్పు అన్నా .”
“మూడు నాలుగు నెలలు చాల బాగా గడిచాయి, మా ఇంటిదగ్గర కూడా చాల బాగుండేది, చిన్న చిన్న అప్పులు తీర్చుకున్నాం. కానీ మా లాంటి వాళ్లకి మంచి రోజులు ఎక్కువకాలం నిలవవు కదా అన్నా.కంపెనీ పెద్దదవుతున్నకొద్దీ పాలసీలు మారిపోయాయి. ఇప్పటిదాకా మాకు డెడికేటెడ్ గా ఏరియా ఉండేది. అక్కడ లొకేషన్స్, రోడ్స్, స్పీడ్ కెమెరాలు, ఏ రెస్టారెంట్ ఎక్కడ ఉంది, షార్ట్ కట్స్ మాకు కొట్టినపిండి. ఇప్పుడు రోజుకో కొత్త ఏరియా, తెలియని రోడ్లు, ఎక్కడెక్కడో షిఫ్ట్ లు. దీన్ని తట్టుకోవడం అసాధ్యంగా మారింది. టైంకి నిద్ర, తిండి లేక చాలా సార్లు ఆక్సిడెంట్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది.
అంతే కాదు, టార్గెట్లు పెరిగాయి, టార్గెట్ దాటాక వచ్చే కమీషన్ తగ్గింది. టార్గెట్ ఫెయిలైతే పెనాల్టీ.దీంతో కొంతమంది రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, స్పీడ్ బ్రేకింగ్… కొందరు చనిపోయారు కూడా. కొందరు జైల్లోఉన్నారు.టార్గెట్ తీరాలంటే పన్నెండు, పదహారుగంటల పాటు రోడ్లపై నిద్రాహారాలు మాని తిరగాల్సిన పరిస్థితి ”
“ఇక్కడ కంపెనీ ఇచ్చే ఇన్సూరెన్స్ అసలు ఎందుకూ పనికి రాదు , ఏదో నామమాత్రం. ఆసుపత్రికి వెళితే కనీసం 40 -50 రియాల్స్ (సుమారు రెండువేల రూపాయలు) అవుతుంది, ఎం అడిగినా మీకు ఆ కవరేజ్ లేదు, ఈ కవరేజ్ లేదు డబ్బులు కట్టాల్సిందే అంటారు. అందుకే చాలా మంది ఎంత ఆరోగ్యం పాడైన పట్టించుకోరు.
మా పరిస్థితి అంతే అన్నా.ఎవరికీ ఏమి చెప్పుకోలేం. మూడునెలల కిందట దుబాయ్‌లో కొంతమంది డెలివరీ రైడర్లు సమ్మె చేస్తే, సాయంత్రానికే వాళ్లందరినీ ఫ్లైట్ ఎక్కించి ఇంటికి పంపించారు. ఆ భయంతో ఇక్కడ ఎవరు నోరు తెరవరు.మనదేశాల్లో ఉన్నట్లు యూనియన్లు, కార్మిక సంఘాలు ఇక్కడ లేవు.
నాకెందుకో ఈ గల్ఫ్ దేశాలని మనోళ్లు (వలస జీవులు) భుజాలపై మోస్తున్నారు అనిపిస్తుంటుంది. వీళ్ళ ఇళ్ళూ ,మసీదులు మనమే కట్టేది, బాత్రూమ్లు మనమే కడిగేది, బండ్లు మనమే తోలేది, ఆఫీసులల్ల మనమే పని చేసేది. వీళ్ళ చరిత్రంతా మనోళ్ల చెమట, రక్తంతో నిండిపోయి ఉన్నది. కానీ మనకి మాత్రం వాళ్ళ దేశాలలో చోటు లేదు,ఎన్ని ఏళ్లు పనిచేసినా, చివరికి వెళ్ళిపోవాల్సిందే- మనం ఎప్పటికీ ‘అజనబి’లమే(పరాయివాళ్ళు) (గల్ఫ్ దేశాలలో పర్మనెంట్ రెసిడెంట్, సిటిజెన్షిప్ అన్నవి లేవు).
“మరి ఇంత కష్టం పడుతూ ఎందుకు ఇక్కడ ఉండటం? ఇండియా వెళ్లిపోవచ్చు కదా?” అని అడిగాను.
“అందరూ చాలా ఈజీగా అనేస్తారు అన్నా. మీరనే కాదు. ఆ డెలివరీ జాబ్ ఎదో ఇక్కడే చేస్కోవచ్చు కదా, ఎందుకు అంత దూరం వెళ్లి కష్టపడాలి?. ఇక్కడ ఏ పని చేసినా పదిహేను,ఇరవైవేలు ఎక్కడికి పోవు. రాజాలాగ బతకొచ్చు అంటుంటారు. ఇక్కడికి రాకముందు అక్కడే కదా ఉన్నాము . రాజాలా ఎప్పుడన్నా బతికింది? ఇక్కడలా నెల జీతం సంపాదించామా ఎప్పుడైనా?
వెనక్కి వెళ్లి ఏం చేయాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఇక్కడికి మేము ఒక కలతో వచ్చాం అన్నా. మా కుటుంబానికి ఒక మంచి జీవితం ఇవ్వాలని.ఈ కష్టాలకు భయపడి పారిపొమ్మంటావా ? నువ్వు కూడా మీ అమ్మనీ ,నాన్ననీ ,ఉన్న ఊరినీ ,కుటుంబాన్నీ వదిలి ఇంత దూరం వచ్చి కష్టపడుతూనే ఉన్నావ్ కదా అన్నా? కష్టం లేనిదెక్కడన్నా? ఎక్కడికివెళ్ళిన కష్టపడాల్సిందే, నీదొక కష్టం, నాదొక కష్టం, మన వలస బతుకంటేనే కష్టం కదన్నా.
నా చెల్లి,తమ్ముడు రోజు వీడియో కాల్ లో చెప్పే స్కూల్ ముచ్చట్లు -అవ్వా ,బాపు “బువ్వ తిని , మందులేసుకున్నాం బిడ్డా” అని చెప్పే ఆ రెండు మాటల ముందు ఈ కష్టాలన్నీ తేలిపోతాయి అన్నా.
మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా కలిసి ప్రేమతో మాట్లాడుతూ, మనిషిలా చూస్తే అదే చాలు, ఈ కష్టాలన్నీఈదేస్తాం. ” అన్నాడు రవి.
“అమ్మి జాన్ కి దువా ఎలాగూ ఉంది కదా అన్నా” అని షఫీ నీళ్లు నిండిన కళ్ళతో నవ్వాడు.
ముగ్గురం కన్నీళ్లు పెట్టుకున్నాం. “అరే అన్నా, చిన్న రసాలు తిందాం పదా , మాకు ఇదంతా నార్మల్, ఇవాళ బాధపడతాం మళ్ళీ రేపు జామ్ అని బైక్ మీద దూసుకుపోతూనే ఉంటాం.”
*
అదే రోజు రాత్రి తొమ్మిది…
ఇంటీకి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాను. ఒక ఇండియన్ న్యూస్ ఛానెల్ ప్లే అవుతుంది. కళ్ళజోడు పెట్టుకున్న న్యూస్ యాంకర్ అరుస్తున్నాడు.
“ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్, ఇప్పుడు జపాన్‌ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.”
గట్టిగా నవ్వి, టీవీ ఆఫ్ చేసి, సోఫా మీద తలవాల్చి, కళ్ళు మూసుకున్నాను.
*
నోట్స్: 2023లో UAE లో నమోదైన రోడ్డు ప్రమాదాల మొత్తంలో, 42 మంది మోటార్‌సైకిల్ రైడర్ల మృతి సంభవించిందని, అలాగే మరో 1, 020 మంది గాయపడ్డారని దేశం లోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. షేక్ జాయిద్ రోడ్ వద్ద ఉన్న సౌదీ జర్మన్ హాస్పిటల్‌లో ప్రతి నెలా సగటున 20 మంది మోటార్‌సైకిల్ డెలివరీ రైడర్లకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.”వీళ్లలో ఎక్కువ మంది బ్రెయిన్ ఇంజురీస్‌తో వచ్చేవారే. అలాగే కాళ్ళు, చేతుల్లో ఎముకలకు సంబంధించిన బలమైన గాయాలు కూడా కనిపిస్తాయి. ఈ 15–20 కేసుల్లో నెలకు కనీసం ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతుంటారు.”అని ఆ హాస్పిటల్‌లో ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ అహ్మద్ కమాల్ మఖ్లౌఫ్ చెప్పారు.
*
Sanjay ,
This is really nice , idi chadvaka naku kuda kallu chemarchay…
You are writings are so nice that you are not only having telling the story but also giving the social message through your stories .
Thank you so much for these stories and Keep writing bro.
Its Really Awesome… Keep Writing My Dear Bro! Waiting For your Third One
Excellent Narration Sanjay garu….Katha kallaku kattinattuga chala baga varnincharu.Mee
bhava jalam, padha jalam chala nachai . Especially “Gnapaka Meghalu”, “Aedari Aenda” inka “udukaaduthundhi” padhalu sarikothaga manasuni aakattukunnai…meeru marinni kathalatho mammalni aakattukovalani korukuntunnam…And also Thank you for the informative and emotional story…
ఎడారి ఎండలో ఎదురీదే యోధులకు…. కన్నీళ్లు ముంచెత్తుతున్నా వెన్ను చూపని ధీరులకు అమ్మిజాన్ కి దువా