ఆరు బయట
అరుగు మీద అన్నం తినిపిస్తూ
పిల్లలకు చందమామను చూపించింది అమ్మ
అప్పుడు పిల్లలడిగారు
‘అమ్మా…
చందమామకు అన్నం ఎవరు పెడతార’ని
అమ్మ నవ్వి…
‘భూమి తల్లి పెడుతుందని’ చెప్పింది
పిల్లల అనుమానపు చూపులు విసిరారు
‘భూమికి చేతులు లేవు కదా!’ అన్నారు
మళ్లీ అమ్మ నవ్వి-
మనకు పండ్లు ఎలా వస్తాయ్’ అంది
‘చెట్ల నుంచి అన్నారు’ పిల్లలు
‘చెట్లకు నీళ్లెక్కన్నుంచి వస్తాయ్’ అంది అమ్మ
‘భూమి నుంచి’ అన్నారు పిల్లలు
‘భూమి చెట్లకు నీళ్లిస్తుంది,
మనకు కూరగాయలిస్తుంది
అలాగే చందమామకు కూడా భూమే బువ్వ పెడుతుంది’ అంది అమ్మ.
పిల్లలు అమ్మ వంక వెన్నల చూపులతో చూస్తూ
‘భూమేమైనా చందమామ వాళ్లమ్మనా?’
అని అడిగారు, చిలిపిగా.
అవునర్రా అంది ఆ తల్లి చిరునవ్వుతో.
పిల్లలు నాన్నతో కలిసి సినిమా చూస్తున్నారు
(‘మాతృదేవోభవ’)
సినిమాలో మరికొందరు పిల్లలు
‘అనాదలం’ అనే పదాన్ని పట్టుకున్నారు వీళ్లు
అప్పుడు తెరమీద విషాదం పరుచుకుని ఉంది
‘నాన్నా…
అనాదలంటే ఎవరు?’ అనడిగారు పిల్లలు
కష్టమైనా చెప్పడం తప్పలేదు
కాస్త సున్నితంగా
‘అమ్మా నాన్నా లేని వారని’ అన్నాడు నాన్న
‘అదెట్ల నాన్నా, అమ్మా నాన్నా లేకుంటే
పిల్లలకు అన్నమెవరు పెడతారు?’
అని ఎదురు ప్రశ్న.
‘దేవుడు, అంటే దేవుడులాంటి మనుషులు
చాలా మంచి మనుషులు’ అన్నాడు నాన్న
ఆ మాటల్లో శూన్యముందని తెలుసు అతనికి
కానీ
ఆ శూన్యాన్ని నింపే మరో మార్గం కనిపించలేదు.
పిల్లలందుకున్నారు
‘అయినా సరే పిల్లలకు మాత్రం అమ్మా నాన్నలు ఉండి తీరాల్సిందే’
కరాఖండిగా చెప్పేసారు వాళ్లు.
క్రూరత్వపు పడగ నీడ
ఆ పసి మనసులపై వాలొద్దనుకున్నాడు అతను
బహుశా శూన్యాన్ని వాళ్లలా నింపేసారు కాబోలు!
‘అవును, ఉంటారు.
అమ్మా నాన్న లేకుండా పిల్లలెలా ఉంటారు?
అమ్మా నాన్న అందరికీ ఉంటారు.
అది వొట్టి సినిమా. అంతే’ అన్నాడతను.
పిల్లలు ఆ సినిమా బాగలేదని చూడమన్నారు.
మరుసటి రోజు
ఇంట్లో బొమ్మలతో ఆడుకుంటుంటూ
‘నువ్వు అమ్మ , నేను నాన్న’ అంటూ
‘అమ్మా నాన్న ఆట’ కనిపెట్టారు పిల్లలు.
లేలేత చేతి మునివేళ్ల స్పర్శతో
బొమ్మలు ప్రాణం పోసుకున్నాయి
పిల్లలకేం కావాలో
వాటికి అవేకావాలి అని అలకేస్తున్నాయి
పిల్లలేం ఆడుకుంటారో
అవీ ఆ ఆటలే ఆడుకుంటామని మొండికేస్తున్నాయి
అవి మాట్లాడుతున్నాయి
అవి పాటలాడుతున్నాయి
అప్పుడేమాత్రం ఆట బొమ్మలు కావవి
పిల్లల చేతుల్లో పురుడు పోసుకున్న
అపురూప ప్రాణ సమానులు.
వాటికి ఆలనాపాలన చూస్తున్నారు
అమ్మా, నాన్నల్లా ఆ పిల్లలు.
యుద్ధాల పేరిట, మతాల పేరిట,
రాజ్యాధికారం పేరిట
ఈ భూమిపై అసలు సిసలైన మనుషులైన
పిల్లలను అనాథలను చేస్తున్న
ఈ విద్వంసక, విషాద సమాజంలో
బొమ్మలు మాత్రం అనాథలు కాకపోవడం
ఎంత అదృష్టం!
*
రాయకుండా ఉండనివ్వవు:అనిల్ డానీ
కవిత్వం రాస్తున్న తొలి నాళ్ళలో అమ్మ మొదటి వస్తువు. అమ్మ కళ్ళలో కనబడే ప్రేమని, మనల్ని ఓదార్చే తీరుని, ఎవ్వరికీ చెప్పుకోలేనివి అమ్మ దగ్గర చెప్పుకున్నవి , మనల్ని రాయకుండా ఉండనివ్వవు. అందుకే అమ్మ చాలా కవితల్లో ఒక గొప్ప ప్రతీకాత్మకంగా నిలిచిపోయింది. నాన్న ఒక ధైర్యం , ఒక ఆలోచన, ఒక భయం, ఒక వీపు దెబ్బ, ఒక మెచ్చుకోలు చూపు. అమ్మా నాన్న ఇద్దరిని సమతూకంగా చేసి రాసిన కవిత ఇది. పిల్లల మొదటి ఉపాధ్యాయులు అమ్మా నాన్నలే అన్న మాట ఇందులో అండర్ కరెంట్ గా నడుస్తూ ఉంటుంది.
భూమికి చేతుల్లేవు కదా అన్న దగ్గర poem ఒక మలుపు తీసుకుంది. దాన్ని కొంచం పెంచుకుంటూ రాశారు. బావుంది ప్రయత్నం. ఇంకాస్త crisp గా రాసి ఉండొచ్చు. మనకిష్టం అయిన వ్యక్తుల మీద రాసేప్పుడు కలం, మనసు రెండూ మనమాట వినవు. వాటిని కాస్త అదుపులో ఉంచి రాయాలి,కాస్త దూరం వెళ్ళాక మీరే అలా రాయగలరు. శీర్షిక కూడా మరో ఆలోచన చేస్తే బాగుండేది. వచనం పాలు ఎక్కువైనా కవిత్వపు నడక ఉంది .
*
“యుద్ధాల పేరిట, మతాల పేరిట,
రాజ్యాధికారం పేరిట
ఈ భూమిపై అసలు సిసలైన మనుషులైన
పిల్లలను అనాథలను చేస్తున్న
ఈ విద్వంసక, విషాద సమాజంలో” అమ్మా నాన్నట బావుంది
Thank you, Sir
చాలా బాగుందన్నా.. థాంక్యూ
Thank you, Navin.
అమ్మనాన్న ఆట బాగుంది.. చాలా చాలా, చిన్నపుడు, మనం ఆడుకున్న ఆట లా మాత్రం లేదు….అమ్మనాన్న లేని అనాథలుమనచుట్టే చాలామంది ఉంటారని, ఉన్నారని, పిల్లలు కు,తెలిపితే బాగుండేది..సమాజ పోకడ తెలిసిది వాలకు, కొంత వరకు
మీరన్నది వాస్తవమే. పిల్లలు నాలుగు ఒకరు, ఏడేండ్లు మరొకరు. ఇంకొంత లోతుకు పోతే వాళ్లు సమాజం పైన నమ్మకం కోస్పోవచ్చునేమో అన్న అనుమానం, భయం వేసింది. అందుకే అక్కడే ఆగాను. బహుశా సున్నితత్వం కోల్పోకుండా వాళ్లకు నిదానంగ ప్రపంచపు వాస్తవ రూపం చూపిస్తే బాగుంటుందనుకున్నాను. Thank you, Madam.
హృదయాని హత్తుకునేవిధంగా బాగా రాసారు.
Thank you, Anna.
కవిత బాగుంది.ఈ కవిత ఇలాగే రాయాలి.అంత సరళంగానే ఉండాలి. పిల్లలు నవ్వులా తెల్లగా, వాళ్ల మనుసులా తేటగా బాగుంది.నాకు నచ్చింది
Thank you.
కవిత ఇంకొంచెం crisp కావొచ్చు..శీర్షిక మరొకటి ఆలోచించొచ్చు.
నడక బాగుంది.
Sure Anna. ఇంకొంత చిక్కగా ఉన్నదంటే బాగున్నిందు. ముందు ముందు తప్పక యత్నిస్తాను.
🙂
Yes, thank you 😊 anna.
సింపుల్ గా చెప్పినా మంచి సృజనాత్మకత సున్నితత్వపు మేళవింపుతో అలరించారు…Good attempt👌👌
యుద్ధాల పేరిట, మతాల పేరిట,
రాజ్యాధికారం పేరిట
ఈ భూమిపై అసలు సిసలైన మనుషులైన
పిల్లలను అనాథలను చేస్తున్న
ఈ విద్వంసక, విషాద సమాజంలో
బొమ్మలు మాత్రం అనాథలు కాకపోవడం
ఎంత అదృష్టం!
సొదుం శ్రీకాంత్ లో నచ్చే విషయం నాకిదే.
కడుపులో మెలిపెట్టే బాధను సోప్ వేయకుండా చెబుతాడు. అతడు మాట్లాడినా, బాధపడినా సమాజం, ప్రపంచం గురించే. తప్పు ఎవరిదైనా తప్పు తప్పే అనే వ్యక్తి. అంతేకానీ ప్రభుత్వ తప్పులను మంచిదిగా మార్చే లౌక్యం శ్రీకాంత్ కి తెలీదు. మా తరంలో శ్రీకాంత్ లాంటి మనుషులు చాలా అరుదు. అతని వాక్యాల్లో, అతని మాటల్లో నేనెంతో నేర్చుకున్యా. మంచి మనిషి. మంచి మంచున్న మానవతావాది.
శ్రీకాంత్ భయ్యా…నీకీ పొగడ్తలు ససేమీరా ఇష్టం ఉండవు.
గమనిక ఇవి పొగడ్తలు కాదు నిజాలే.
ధన్యవాదాలు
రాళ్లపల్లి రాజావలి
చిన్నపిల్లాడినైపోయి అమ్మనాయినలతో కొంచెం సేపు మాట్లాడుకున్న అన్న.అద్భుతమైన కవిత