అమెరికా వచ్చిన మొదటి  రోజు జ్ఞాపకాలు……..

ప్పటికి…అనగా 2021 నాటికి 46 ఏళ్ళ క్రితం…

బొంబాయి లో బయలు దేరిన మా ‘పాన్ ఏమ్’ విమానం ఫ్రాంక్ ఫర్ట్, లండన్, న్యూయార్క్ ల దాకా అంతర్జాతీయ స్థాయి ప్రయాణం అయితే న్యూయార్క్ విమానాశ్రయం లో “కష్టములు” అన్నీ తీరిపోయి, మరొక స్థానిక విమానంలో న్యూ యార్క్ నుంచి చికాగో వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిదయింది. అమెరికా అంతరిక్షం లో ప్ర్రయాణం జరిగిన ఆ నాలుగు గంటలూ నేను చీటికీ మాటికీ జేబు లోంచి దాన్ని బయటకి తీసి ముద్దుగా చూసుకుని మురిసిపోతూనే ఉన్నాను. దాని పేరే గ్రీన్ కార్డ్.

అలా మురిసిపోడానికి కారణం ఏమిటంటే….బొంబాయి లో అమెరికన్ కాన్సలేట్ వాడు నా చేతికి ఒక పెద్ద గోధుమ రంగు కవర్ ఇచ్చి “ఇందులో నీ గుండె కాయ తాలూకు ఎక్స్ రే, ముఖ్యమైన కాగితాలు, ఇంకా ముఖ్యమైన గ్రీన్ కార్డ్ ఉన్నాయి. ఇది సీల్ చేసిన కవర్ కాబట్టి నువ్వు అమెరికాలో దిగిన తర్వాత అక్కడ కష్టమ్స్ వాళ్ళు మాత్రమే ఆ సీల్ ఓపెన్ చెయ్యాలి. ఈ లోపుగా నువ్వు సరదా పడి ఈ కవర్ తెరిచేసి, మళ్ళీ సీల్ వేసేద్దాం అనుకుంటే ఆ పప్పులు ఉడకవు” అని తీవ్రంగా వారించి ఇచ్చాడు. అంచేత న్యూయార్క్ లో వాడు ఆ కవర్ చింపేసి, ఆ గ్రీన్ కార్డ్  నా చేతిలో పెట్టి “అమెరికాకి స్వాగతం” అని చెప్పేదాకా ఆ గ్రీన్ కార్డ్ అనేది ఎలా ఉంటుందో అనేది నాకు తెలియదు. తీరా తెలిశాక పెళ పెళ లాడుతున్న ఆ ప్లాస్టిక్ కార్డ్ ని పదే పదే చూసుకోకుండా ఎలా ఉండడం?

ఆ రోజు ఆ సంవత్సరానికి ఇంచుమించు ఆఖరి రోజు…. డిశంబర్ 30, 1974..అని గుర్తు. సుమారు రాత్రి తొమ్మిది గంటలకి ప్రపంచం లో అతి పెద్దదైన చికాగో ‘ఓ హేర్’ విమానాశ్రయం నుంచి మా తమ్ముడి ఇంటికి వెళ్తున్న ఒకానొక అమాయక, కించిత్తు గర్విష్టి అయిన ఒక ఆరువేల నియోగి బ్రాహ్మణ తెలుగు యువకుడి మానసిక పరిస్థితి ఊహించుకోవలసినదే! నమ్మండి, నమ్మక పొండి…నాకు ఉన్న ఈ ‘ప్రత్యేక విశేషణాలు’ ఇండియాలో ఉన్న 29 ఏళ్ళ పాటు నాకు తెలియనే తెలియవు. ఆ తర్వాత అమెరికాలో అడుగుపెట్టిన మరో 29 ఏళ్ళలో నేను ఫలానా ట…అని స్పష్టంగా తెలిశాయి.

ఇక ముందుగా ఎంతో సంతోషం వేసింది అమెరికాలో మా తమ్ముడు వాడి సొంత కారు స్వయంగా నడపడడం. అప్పటికి ఆంజి..అంటే నా తమ్ముడు…అసలు పేరు వెంకట సూర్య హనుమంత రావు…ముద్దు పేరు ఆంజి..నా ముద్దు పేరు రాజా…పేరుకి తమ్ముడే  కానీ ఇద్దరం కవల పిల్లల లాగే పెరిగాం..ఇప్పటికీ అలాగే ఉన్నాం.  వాడు అమెరికా వచ్చి నాలుగేళ్ళు అయింది. ఇక ఎక్కడా అవులూ గేదెలూ, మధ్యే మధ్యే రోడ్డూకి అడ్డంగా చిన్న చిన్న నూకాలమ్మ, సత్తెమ్మ తల్లి గుడులూ, మొక్క జొన్న పొత్తులు అమ్ముతున్న బళ్ళూ, చుట్ట కాల్చుకుంటూ అటూ, ఇటూ అడ్డదిడ్డంగా నడుస్తున్న కూలీ నాలీ, ఆఖరికి స్కూటర్లూ, మోటర్ సైకిళ్ళూ  ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం అతి వేగంగా కార్లు మాత్రమే నడిచే ఫ్రీ వే ల ని హాలీవుడ్ సినిమాల లో చూసి ఊహించగలిగినవే కానీ, ఫ్రీ వే దిగి మామూలు రోడ్ల మీదకి వచ్చాక రోడ్డూ దీపాలు అన్నీ “పసుపు నారింజ రంగు” ..అంటే ఆరెంజ్  లో ఉండడం నేను ఊహించనిదే. ఆ LED దీపాలు ఆ రోజుల్లో అమెరికాలో చికాగో కి ఉన్న ప్రత్యేకత అని తర్వాత తెలిసింది.

ఇక మా తమ్ముడి కారు 1968 ఫోర్డ్ కస్టమ్ గేలక్సీ 500. దాని ఫొటో ఇక్కడ జతపరిచాను. అప్పటికి ఇండియాలో కేవలం ఎంబాసిడర్, ఫియట్, జీప్, స్టేండర్డ్ హెరాల్డ్ అనే కార్లు పేర్లు మాత్రమే వినీ, చూసిన నాకు ఈ కారు పేరు భలే బావుంది. అలా అని మోరిస్ మైనర్, లాండ్ మాస్టర్, లేలండ్ లాంటి బ్రిటిష్ వాళ్ళ కార్లు తెలుసు కానీ అప్పటికి అమెరికన్ కార్లు, జపాన్ కార్లు ఇండియాలో రాలేదు. ఆ మాటకొస్తే అసలు ఏ జపాన్ వస్తువు అయినా చవక రకం నాణ్యత లేనిది అని ఎవరూ కొనే వారు కాదు.  ఈ ప్గోర్డ్ కారు మా తమ్ముడి మొదటి కారు. వాడు 1971-72 లలో యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బెర్క్ లీ లో మాస్టర్స్ ఇని ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ సైన్సెస్ చేశాక, ఉద్యోగం కోసం చికాగో వచ్చి, అతి చిన్న ఉద్యోగం ఏదో సంపాదించి, వంద డాలర్ల కి ఆ కారు కొనుక్కున్నాడు. అవును….ఆ కారు ఖరీదు $100 మాత్రమే అయినా బాగానే నడిచేది. మరో రెండేళ్ళ తర్వాత ఆ కారు ఎలా “మరణించిందో” తర్వాత చెప్తాను.

ఆ రాత్రి ఇంటికొచ్చి, జెట్ లాగ్ లో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. మర్నాడు పొద్దున్న ఏ పదకొండు గంటలకో నిద్ర లేచేసరికి గదిలో మా తమ్ముడు లేడు. అసలు ఒక గది తప్ప ఇంకేమీ లేదు. ఆ గదికి ఒక మూల కిచెన్..అంటే రెండు గాస్ స్టవ్ లు. మరొక మూల స్నానాల గది. నేను పడుకున్నది నేల మీద పెద్ద పరుపు మీద. అంటే అదే బెడ్ రూమ్. ఇంకా విపరీతమైన ఆశ్చర్యం ఏమిటంటే….తల పైకెత్తి చూస్తే కిచెన్ కి పైన ఒక కిటికీ…ఆ కిటికీ లోంచి చూస్తే బయట రోడ్డూ, దాని మీద పరిగెత్తే కార్లు. అక్కడక్కడా తెల్ల తెల్లగా మంచు గుట్టలు. ఇంకా చూస్తే ఆ కిచెన్ మీద మా తమ్ముడు రాసి పెట్టి వెళ్ళిన ఒక చిన్న కాగితం. అందులో “రాజా, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. రెండు గిన్నెల్లో పప్పు, పెరుగు, మూకుడులో బీన్స్ కూర, పక్కనే కుక్కర్ లో అన్నం ఉన్నాయి. లేవగానే అక్కడే ఉన్న సీరియల్ కానీ, బ్రెడ్ కానీ తిని ‘టాంగ్’ తాగు. స్నానాల గదిలో వేడి నీళ్ళు వస్తాయి. జాగ్రత్తగా చూసుకుని ఆ మీట తిప్పు. నేను వచ్చే లోపుగా కాలక్షేపానికి అక్కడ ఉన్న టీవీ లో “ఆన్” బటన్ నొక్కు. సాయంత్రం రాగానే జివి రమణ గాడి ఇంటికి వెళ్దాం”. అదీ మా తమ్ముడి నోట్ లో సారాంశం.

అప్పుడు మా తమ్ముడి ఇంటి చిరునామా 7524 W. Lawrence Ave. Harwood Heights, Il. గూగుల్ వారి ధర్మమా అని ఇప్పటి ఆ ఇంటి ఫొటో ఇక్కడ జతపరుస్తున్నాను. ఆ ఫొటోలో ఫైర్ హైడ్రెంట్ వెనకాల ఉన్న అపార్టెమెంట్ భవనం లో కనపడుతున్న కిటికీ యే మా తమ్ముడి ఉండే అపార్టెమెంట్. అది ఆ భవనం బేస్ మెంట్ లో..అంటే భూమికి క్రిందన స్టూడియో ఎపార్టెమెంట్ అనే ఒకే ఒక గది అన మాట. ఆ గది మొత్తం వైశాల్యం బహశా 500 చతురపు అడుగులు ఉంటుందేమో. ఇక మా తమ్ముడి నోట్ లో చెప్పిన ఆ టాంగ్ అనే ద్రావకం నారింజ రసం రుచి ఉంటుంది కానీ కృత్రిమం గా చేసిన డ్రింక్ అనమాట. పైగా ఆరెంజ్ అంటే మన ఆకు పచ్చ నారింజ కాదు, ఇది నాగపూర్ ఆరంజ్ లాగా పసుపు పచ్చ నారింజ.  అలాగే ఆ కెల్లాగ్ సిరియల్ లాంటివి ఇండియాలో నేను ఎప్పుడూ తిన లేదు. అంటే బొంబాయి లో ఎనిమిదేళ్ళు ఉన్నా అప్పటికి ఆమ్లెట్లూ, బ్రెడ్డూ అలవాటే కానీ ఈ అట్ట పెట్టెల ‘సిరియల్’ బ్రేక్ ఫాస్ట్ లు ఇండియా రాలేదు. నాకు తెలీదు.

మా తమ్ముడు ఇంటికి వచ్చేలోపుగా మధ్యాహ్నం నేను జెట్ లాగ్ నుంచి బయట పడి, ఆ అతి చిన్న గదిలోనే ఒక మూల ఉన్న 19” అంగుళాల జీవిత్ కంపెనీ వారి కలర్ టీవీ ‘ఆన్” బటన్ నొక్కాను. నా జన్మ లో మొట్టమొదటి సారిగా పంచ రంగుల టెలివిజన్ చూడడం అదే మొదటి సారి. నిజానికి ఆ పంచరంగుల కంటే….ఆ మధ్యాహ్నం చూసిన “షో” కి నా కళ్ళు తిరిగిపోయాయి. ఆ షో పేరు కెరోల్ బర్నెట్ షో. ఇండియాలో ప్రభుత్వం వారి దూర్ దర్శన్ ప్రసారాలు మాత్రమే చూసిన నాకు ఇలాంటి సిట్యుయేషన్ కామెడీ లో సృజనాత్మకత, హాస్యం చూసి చాలా ఆశ్చర్య పోయాను. ఇప్పటికీ ఆ ఆశ్చర్యం నుంచి తేరుకో లేదు అనే చెప్పాలి. అమెరికన్ వారి హాస్య ప్రియత్వం, చతురత అప్పడూ, ఇప్పుడూ నాకు చాలా ఇష్టమే.

మా తమ్ముడు ఇంటికి రాగానే ఇద్దరం తయారు అయి ఎక్కడో ఇప్పుడు గుర్తు లేని ఆ జివి రమణ ఇంటికి బయలు దేరి, ఫ్రీ వే ఎక్కే ముందు దారిలో మా వాడు”ఇక్కడ గేస్ కొట్టించుకుందాం” అని మా తమ్ముడు తన కారు గేస్ స్టేషన్ లోకి  డ్రైవ్ చేసీ చెయ్యగానే, లోపలి నుంచి ఒకానొక తెల్ల వాడూ గబ గబా వచ్చి గుడ్ ఈవెనింగ్ అని చెప్పేసి   మా కారు గేస్ టాంక్ కన్నం లో పంప్ గొట్టాం పెట్టాడు. మరొక నల్ల వాడు కారు అద్దాలు సబ్బు నీళ్ళతో కడిగేసి, టైర్లలో ఒత్తిడి సరి చేసే టప్పటికి పెట్రోలు టాంక్ నిండి పోయింది. అంత సేపూ ఆ కుర్రాళ్ళిద్దరినీ మా తమ్ముడు జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. మా తమ్ముడి కారు టాంక్ ఏకంగా 24 గేలన్లు.  పూర్తి టాంక్ కొట్టిస్తే మీటర్ సుమారు 4 డాలర్లు, కాస్త చిల్లర అయింది. ఆ డబ్బు చెల్లించడానికి కారు దిగి కొట్టు లోపలికి వెళ్ళినప్పుడు “రాజా, వాణ్ణి జాగ్రత్తగా చూస్తూ ఉండు” అన్నాడు. ఎందుకో తరవాత చెప్పాడు. ఆ కుర్రాడు కొంటే వెధవ అయితే అప్పుడప్పుడు, ఆ గేస్ టాంక్ మూత జేబులో పెట్టేసుకుంటాడుట. మరీ కొంటె వెధవ అయితే ఇంజన్ బెల్ట్ కత్తిరించెయ్యడమో, మరొక కోతి పనో చేస్తాడుట. అలా చేస్తే మళ్ళీ రిపేరు కి మనం వెనక్కు వస్తాం అనే వాడి దుర్మార్గం ఆలోచన ట. ఇది నాకు భలే ఆశ్చర్యం వేసింది. కొన్ని నెలలలో నేనే అలాంటి క్లీనర్ ఉద్యోగం చేస్తాను అని అప్పుడు కలలో కూడా అనుకో లేదు. ఇక ఇప్పటి తో పోల్చి చూస్తే అప్పుడు గేస్ స్టేషన్ల లో తెల్ల వాళ్ళు, నల్ల వాళ్ళు తప్ప ఇప్పటిలా పసుపు, గోధుమ రంగు జాతి వాళ్ళు లేనే లేరు. మెక్సికన్ లేదా స్పానిష్ వాళ్ళు అప్పుడూ, ఇప్పుడూ, భవనాలు, ఇళ్ళు క్లీనింగ్ సర్వీస్,  గడ్డి కోత, వ్యవసాయం లాంటి పనులలోనే ఎక్కువగా ఉంటారు. వాళ్ళు భూమి పుత్రులు అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు శుభ్రం చెయ్యకపోతే అమెరికా ఎలా ఉండేదో ఊహించలేను.

అమెరికాలో మొదటి రోజు జరిగిన ఈ అతి చిన్న విషయమే అమెరికాలో నా మొట్టమొదటి అనుభవం గా అనుకోవచ్చును. ఇక పెట్రోల్ బంక్ ని గాస్ స్టేషన్ అనడం. రోడ్డుకి ఒక వేపు ఉన్న గాస్ స్టేషన్ లో గేలన్ 24 సెంట్లు ఉంటే రోడ్డుకి అవతలి వేపు మరో గేస్ స్టేషన్ లో 28 సెంట్లు ఉండడం. అయినా కూడా జనం తక్కువ ఖరెదు ఉన్న మొదటి గేస్ స్టేషన్ కి వచ్చి డబ్బు ఆదా చేసుకోకుండా ఆ ఖరీదైన చోటికే ఎందుకు వెళ్ళేవారో అర్ధం కాకపోవడం, కారు డిక్కీ ని ట్రంక్, లిఫ్ట్ ని ఎలివేటర్, ఆఖరికి అమెరికా అధ్యక్షుడైనా సరే, మగాడైతే చాలు, దట్ గై అని గయ్యిమనడం మొదలైనవి మరికొన్ని కొత్త అనుభవాలు.

ఇవే కాక ఎవరా జి వి రమణ..ఏమా కథ, ఇతర తొలి అమెరికా అనుభవాలు….త్వరలోనే…

*

వంగూరి చిట్టెన్ రాజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరు వచ్చిన 12 ఏళ్ళకి నేను వచ్చాను. కాకపొతే, F-1 వీసా మీద. మీలాంటి ముందు తరం మూలాన, మాకు ఎలా అక్కడ బతకాలో తెలిసి వచ్చింది. రాజా స్వీట్స్ లో 2 డాలర్లకి లంచ్, వీకెండ్ లో మహారాజా లో బఫె — అప్పుడప్పుడు గుడికి, ఇలాగ నా జ్ఞాపకాలు.

    • భలే, రామారావూ….మరో రెండు నెలల తర్వాత నేను హ్యూస్టన్ లో అడుగుపెట్టి, అక్కడే ఇంకా పాతుకుపోయిన వివరాలు రాస్తూ పోతాను…ఎందుకంటే…నువ్వు చదువుతున్నావు కాబట్టి…..అది భలే స్ఫూర్తి….ఇక ఆ మీనాక్షీ దేవాలయమ్లో వినాయకుడి గుడి కి భూమి పూజ 1978 లో… రాజా స్వీట్స్ కి రిబ్బన్ కత్తిరించాను…యస్….భలే జ్ఞాపకాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు