అమెరికా తొలి వారం పాఠాలు – అన్నీ బుల్లి తెర చూసే…!

వంగూరి జీవిత కాలమ్-62

మెరికాలో అడుగుపెట్టిన మొదటి వారం, పది రోజుల దాకా నిజానికి పడుకోడం, లేచి అమెరికన్ చిక్కుడు, బంగాళా దుంప మార్చి మార్చి వేపుడు కూరలు—అవును ఆ రెండంటే రెండె… వండుకోడం, తినడం, కలర్ టీవీ లో ఆ రోజుల్లో వచ్చిన ఐదారు చానెల్స్ మార్చి, మార్చి చూడడం. అదీ నా దిన చర్య.  ఆ రోజుల్లో కేబుల్ టీవీ అనేది అమెరికాలోనే లేదు. ఉన్నా అది ధనవంతులకి మాత్రమే. నాకు ఇప్పుడు గుర్తు ఉన్నంత వరకూ ఉన్నవల్లా ఈ నాటికీ ఉన్న అప్పటి టీవీ చానెల్స్ ABC, CBS, NBC, PBS.  భారత ప్రభుత్వం వారు నిర్వహించే దూర్ దర్శన్ అనబడే ఒకే ఒక నలుపు & తెలుపు చానెల్ మాత్రమే అప్పుడప్పుడు చూసిన నాకు ఏకంగా నాలుగు పంచ రంగుల టీవీ చానెల్స్, వాటిల్లో ఊహకి అందని రకరకాల కార్యక్రమాలు చూసే అవకాశం భలే బావుంది. అయితే చానెల్ మార్చవలసి వచ్చినప్పుడల్లా సోఫా లోంచి లేచి ఏకంగా ఐదు అడుగులు నడిచి కాస్త కిందకి వంగి టీవీ మీద చానెల్ బటన్ తిప్పడం విసుగ్గానే ఉండేది.

మొదటి వారం లో నేను చూసేసినవీ, నాకు ఆ ఆమెరికన్ భాష కొంచెం మాత్రమే అర్ధం అయి, చాలా మటుకు అర్ధం అవకపోయినా నాకు భలే నచ్చేసినవవీ, నేను ఒక్కడినే కూచున్నా ఎడాపెడా నవ్వేసిన కొన్ని టీవీ కార్యక్రమాలు  ఆల్ ఇన్ ది ఫేమిలీ,  ఐ లవ్ లుసీల్,, సాన్ ఫర్డ్ & సన్, మేరీ టైలర్ మూర్, జేఫర్సన్స్, కెరోల్ బర్నెట్ షో, చికో & ద మేన్ మొదలైన సిట్యుయేషన్ కామెడీ షోలు. ఈ సిట్యుయేషన్ కామెడీ అనే మాట అప్పుడే మొట్టమొదటి సారి విన్నాను. వాటిల్లో ఉన్న ఆఫ్రికన్ అమెరికన్ షోలు కూడా వాఱి కుటుంబ జీవితాలు ఎలా ఉంటాయో తెర మీద మొదటి సారిగా కనపడి వారి కష్టనష్టాల మీద అవగాహన కల్పించినవే.

ఇక కోజాక్, బరేట్టా లాంటి డిటెక్టవ్ షోలు, యుద్ద వాతావరణం లో మానవతావాదంతో ఎంతో ఆకట్టుకున్న ‘MASH” లాంటి షో మొదలైనవి కూడా చాలా నచ్చాయి. ఇక ఇండియా లో అసలు తెలియనివి ప్రైస్ ఈజ్ రైట్, $10000 పిరమిడ్, హాలీవుడ్ స్క్వేర్స్, మొదలైన గేమ్ షోలు చాలా ఆహ్లాదంగా ఉండేవి. టీవీలో ఆటలు..అంటే గేమ్  షో అనే టా, ఆ ప్రక్రియా కూడా మొదటిసారిగా విన్నవే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాత్రి పదిన్నరకి వచ్చే జానీ కార్సన్ టాకే షో ఒక ఎత్తు. “పదహారణాల” అమెరికన్ అయిన అతని మోనో లాగ్ లో అమెరికా అధ్యక్షుల నుంచి జపాన్ టూరిస్ట్ ల దాకా అతను చెయ్యని వేళాకోళం లేదు,  చెప్పని అమెరికా జోకులు లేవు, చెయ్యని అద్భుతమైన ఇంటర్వ్యూలు లేవు. తన 24 ఏళ్ళ ఆ టీవీ ప్రస్థానం లో మనం మహేష్ యోగిని అనుకరిస్తూ సరదా స్కిట్స్ చేసినా ఆయన్ని చాలా సార్లే ఆహ్వానించి మన యోగాకీ, మెడిటేషన్ ఉపయోగాలకీ చాలా ప్రచారం ఇచ్చాడు. ఆ షో లో తరచూ వచ్చే బాబ్ హోప్ అద్భుతమైన కమీడియన్.

ఇక నేను రోజూ ఆతృతగా ఎదురు చూసినది సాయంత్రం 5 గంటలకి వచ్చే వాల్టర్ క్రాంకైట్ చెప్పే వార్తలు. అతను తెర మీద కనపడగానే అమెరికా అంతా అన్ని పనులూ మానేసి అతడినే చూస్తూ, అతని గొంతుక వింటూ ఇవాళ ఎలాంటి వార్తలు, ఎలా  చదువుతాడా అని చూసే వారు అంటే అతిశయోక్తి కాదు. అలా అని టామ్ బ్రోకా, జాన్ చాన్స్ లర్, హేరీ రీజనర్  లాంటి మిగిలిన రెండు చానెళ్ళలో వార్తలు చదివే వారు తక్కువ వాళ్ళేం కాదు.  జానీ కార్సన్, వాల్టర్ క్రాంకైట్ ఇద్దరూ గొప్పవాళ్ళకే గొప్పవాళ్ళు. వాళ్ళని, ఆ మాటకొస్తే ఆ నాటి అనేక ప్రముఖుల ని అనేక సంవత్సరాలు టీవీ లో చూసి, ఆనందించడమే కాక అమెరికా దేశం గురించీ, ఇక్కడి వారి సంస్కారం, సంస్కృతుల గురించీ చాలానే నేర్చుకున్నాను. ఇప్పటితో పోల్చి చూస్తే ఆనాటి టీవీ చాలా సంస్కారవంతంగా ఉండేది.

ఈ మాట ప్రతీ తరం తర్వాతి తరాల గురించి అనేదే. ఇక  అమెరికాలో కొన్ని తరాల పిల్లలు పెరిగిన అవి చూస్త పెరిగిన సేసేమీ స్ట్రీట్, మిష్టర రాజర్స్ నైబర్ హుడ్ ల గురించి చెప్పక్కర లేదు. అవి చూస్తూ నేను చిన్న పిల్లాడిని అయిపోయే వాడిని. టీవీలు చూసి నేర్చుకునే గతి పట్టిందా అని ఎవరైనా అనుకుంటే నాకు అభ్యంతరం లేదు కానీ నాకు ప్రత్యక్షం గా అమెరికా సమాజం అనుభవం లోకి వచ్చే దాకా పరోక్షంగా అందుబాటులో ఉన్న మార్గం అదే మరి. టీవీ అనేది కేవలం వినోదం కోసమే కాకుండా విజ్ణానం కోసం కూడా నమ్మేవాడిలో నేను ఒకడిని. అయితే అది ఈ నాటి తెలుగు టీవీ లకి ఎంత వరకూ వర్తిస్తుందో అనుమానమే!

అమెరికా వచ్చిన మొదటి వారం లో నేను గడీపిన సమయం అంతా టీవీ చూడడం లోనే కానీ ఒక్కటంటే ఒక్క సారి కూడా భారత దేశం పేరు వినపడ లేదు. అప్పుడు కాస్త గిజ గిజ లాడిపోయినా, త్వరలోనే విషయం అర్ధం అయిపోయింది. మనకి అమెరికా ఎంత దగ్గర అనుకుంటామో వాళ్ళకి ఇండియా అంత దూరం. మనం ఇప్పటికీ అమెరికా ఆరాధనలో తబ్బిబ్బు అయి మాతృభాషనే పణంగా పెడుతున్నాం. ఇప్పటికీ అమెరికా టీవీలో భారత దేశం ప్రస్తావన అరుదుగానే వస్తుంది. అది కూడా ఏదైనా కొంప ములిగినప్పుడే.

ఇదంతా రాస్తున్నది ఏదో ఆనాటి టీవీలలో వచ్చిన కార్యక్రమాల పట్టిక ఇవ్వడం కోసం కాదు. ఒకానొక యువకుడికి, కంప్యూటర్లూ, గూగుళ్లూ, ఇంటర్ నెట్లూ లేని రోజుల్లో అమెరికాలో అడుపుపెట్టినప్పుడు, అమెరికా సమాజం తో ప్రత్యక్ష పరిచయం అవని తొలి రోజుల్లో, వలస వచ్చిన ఈ దేశం గురించి తెలుసుకోడానికి టీవీ అత్యంత ప్రధానమైనది అని చెప్పడానికే. ఒకే ఒక గది ఉన్న స్టూడియో అపార్ట్ మెంట్ లో ఉన్న 19 అంగుళాల జెనిత్ బ్రాండ్ కలర్ టీవీ ఆ మొదటి వెసులుబాటు కలిగించింది. సరిగ్గా అలాంటి టీవీ నే నేను నా సొంత డబ్బు తో కొనుక్కోడానికి రెండేళ్ళకి పైగానే పట్టింది.

అమెరికా గురించి తెలుసుకోడానికి రెండో సాధనం పత్రికలు. అయితే మా తమ్ముడు తెప్పించుకునే చికాగో ట్రిబ్యూన్ రోజూ ఒక్కటే అందుబాటులో ఉండేది. రోజూ తెల్లారేసరికల్లా ప్లాస్టిక్ లో చుట్టేసి గుమ్మం ముందు పారేసి ఉన్న ఆ వంద పేజీల పేపరూ సరిగ్గా రెండే రెండు నిముషాలలో ఇలా తలుపు తీసి అలా ఆ పేపరు కట్ట లోపలికి తెచ్చేసి తలుపు వేసెయ్యకపోతే ఆ చికాగో చలికీ, చలి గాలికీ పిడచకట్టుకు పోయి  ప్రాణాలు పోయినా పోతాయి.  పది, పదిహేను నిముషాలలో కావలసినంత మంచు కురిసి మనల్ని కప్పేస్తుంది కాబట్టి ఇక వేరే మార్ట్యువరీ అక్కర లేదు. ఈ విషయం నాకు మొదట నాలుగైదు రోజుల్లోనే అర్ధం అయిపోయింది. కానీ ఎన్నాళ్ళు అలా ఇంట్లో మగ్గిపోతాం. ఎంతయినా చలి అలవాటు చేసుకోవాలి కదా. అంచేత వారం, పది రోజుల తరవాత కేవలం కళ్ళు మాత్రమే బయటకి కనపడేలా మిగతా శరీరం అంతా టోపీ, మఫ్లరూ, స్వెట్టరూ, పంట్లాం లోపల మరో పంట్లాం, మామూలు కోటూ, లాంగ్ కోటూ, బూట్లూ వేసుకుని బయట అడుగు పెట్టి ఐదంటే ఐదు నడిచి ఆ తెల్లటి మంచు లో కళ్ళు తిరిగి పడిపోయే లోపుగా వెనక్కి వచ్చేసే పరీక్షలు నాకు నేనే పెట్టుకున్నాను. ఇంత హంగామా లేకుండా బయటకి వెళ్తే  ఆ చలికి కాళ్ళు గడ్డకట్టుకు పోయి కింద పడిపోతాం కదా. అది చూడడానికి రోడ్డు మీద నరమానవుడు ఎవడూ ఎవడూ ఉండదు. మరో ఐదు నిముషాలలో పడిన మంచులో కూరుకు పోతాం. తీరా ఆ సాయంత్రం ఇంటికి వచ్చే సరికి మా తమ్ముడికి నేను కనపడక బెంగ పెట్టుకుంటాడుగా. అందుకన మాట అంత జాగ్రత్త. మా ఇద్దరిదీ ఒకే సైజు శరీరాలు కాబట్టి ఈ సరంజామా అంతా మా తమ్ముడిదే.

ఒక వారం తర్వాత అసలు పనికి స్వీకారం చుట్టాను. అనగా ఉద్యోగాల వేట. దానికి ఆ నాటి అమెరికాలో రెండే రెండు మార్గాలు అని తెలియడానికి ఎంతో కాలం పట్ట లేదు. అందులో మా తమ్ముడికి అప్పటికే రెండేళ్ళకి పైగానే అనుభవం ఉంది. ఆ మార్గాల్లో మొదటిది పేపర్లలో వచ్చే “హెల్ప్ వాంటెడ్” అని ఉండే సుమారు సుమారు పది పేజీల ప్రత్యేక సెక్షన్. హాయిగా మనకి అర్ధం అయేలా “ఎంప్లాయ్ మెంట్ సెక్షన్”అని కాకుండా ఈ హెల్ప్ వాంటెడ్’ అంటాడేమిటీ అని మొదట్లో ఆశ్చర్య పోయిన మాట ఇప్పుడు తలచుకుంటే సిగ్గేస్తుంది. ఇండియాలో సేవకుడిలా పని చేసినందుకు నెల వారీ జీతం ఇస్తారు అనీ, ఇక్కడ కంపెనీలో పని చేయడాన్ని ‘సహాయం చెయ్యడం’ అంటారు అనీ, దానికి గంటల కొద్దీ లెక్కలు కట్టి జీతం ఇస్తారు అనీ తెలియడానికి ఎంతో కాలం పట్ట లేదు. ఇక రెండో మార్గం ఏ కంపెనీలలో అయినా మనకి తెలిసిన వారి ద్వారా ప్రయత్నించడం. ఇది ఒక విధంగా మన దేశవాళీ ‘రిమకండేషన్’ పద్దతే కానీ మరీ అంత రికమండేషన్ చెయ్యగానే సొంత బామ్మరిది కి కూడా ఉద్యోగాలు ఇచ్చి పారెయ్యరు అని కూడా తెలిసిపోయింది. ఆ రోజుల్లో చికాగోలో సార్జంట్ & లుండీ, పయోనీర్ ఇంజనీరింగ్ మొదలైన ఇంజనీరింగ్ & కన్స్ ట్రక్షన్ కంపెనీలలో భారతీయులు, అందునా మన తెలుగు వాళ్ళు చాలా మంది పని చేసే వారు. వారిలో తనకి స్నేహితులైన వాళ్ళలో నలుగురిని నాకు పది, పదిహేను రోజులోనే నాకు పరిచయం చేశాడు మా తమ్ముడు. అలా పరిచయం అయిన రెండు నెలలోనే వారిలో ముగ్గురు నా అమెరికా జీవితం గొప్ప మలుపు తిరగడానికి కారకులు అయ్యారు. వాళ్లెవరో, ఆ ములుపు ఏమిటో చెప్పే ముందు చెప్పడానికి ఆ రెండు నెలలలోనూ జరిగిన సంఘటనలూ, తొలి అమెరికా అనుభావాలలో అమెరికాలో సామాన్యుల ప్రవర్తన, నిబద్ధతల గురించి  నేను నేర్చుకున్న ఆసక్తికరమైన విషయాలు త్వరలోనే.

అన్నట్టు పది, పదిహేను రోజులు పోయాక అమెరికాలో మొట్టమొదటి సినిమా చూశాను. భారత దేశంలో సినిమా హాలు అంటే మా కాకినాడ లో క్రౌన్ టాకీస్, బొంబాయి లో మరాఠా మందిర్ లాగా కొన్ని వందలమంది పట్టేటంత పెద్ద హాల్ లో నేల, బెంచీ, రిజర్వుడు ఇలా ఎంత డబ్బు పెట్టి కొంటే అంత వెనకాల కూచుని సినిమా చూడడం మన అలవాటు. ఇక్కడ చూస్తే అంతా తిరకాసు వ్యవహారమే. ఈ హాల్ లో మొత్తం అంతా కలిపితే వంద కుర్చీలూ, అన్నింటికీ టికెట్ ఖరీదు ఒకటే, అదెంతో ఇప్పుడు జ్ఞాపకం లేదు కానీ లోపలికి వెళ్లి నీ ఇష్టం వచ్చిన చోట కూచో వచ్చును. ఈ సంగతి అక్కడా, ఇక్కడా విన్న సంగతే కాబట్టి నాకు పెద్ద ఆశ్చర్యం కలగ లేదు కానీ, మొదటి వరసలలో కూచోడానికి దొరలూ, దొరసానులూ పోటీ పడడం, ఆఖరి వరసలలో నేనూ, మా తమ్ముడూ మాత్రమే ఉండడం మటుకు ఆశ్చర్యమే. ఈ రోజుల్లో వాళ్ళు ఇది చదివి, బొంబాయిలో  ఏడేళ్ళు చదివినా నాకు బొత్తిగా లోకజ్ఞానం అబ్బ లేదు లేదు అనుకుంటే ఏమో, అవునేమో!

హారినీ అమెరికాలో అగ్రవర్ణాల వారు తెర ముందు కూచుంటారూ అంటే, మరి మన సంగతి ఏమిట్రా, ‘అక్కడ అగ్రవర్గం-ఇక్కడ అణగారిన వర్గం” అవుతుందా అని మా తమ్ముడి ని సరదాగా అడిగాను. “ఏమో నాకేం తెలుసూ” అని నవ్వేశాడు మా తమ్ముడు. అనేసి “నువ్వే చూస్తావుగా” అని కూడా అన్నాడు. నాకంటే నాలుగేళ్ళు ముందు 1970 లోనే అమెరికా వచ్చి, యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బెర్క్ లీ లాంటి అగ్ర విశ్వ విద్యాలయం లో చదువుపూర్తి చేసుకుని రెండేళ్ళు అయినా ఇంకా చిల్లర మల్లర ఉద్యోగాలు చేసుకుంటున్న మా తమ్ముడి ఆ మాటల అర్ధం తెలియడానికి నాకు ఎంతో కాలం పట్ట లేదు. నేను మెలిగిన అమెరికా సమాజం, భారతీయ సమాజం, అందునా తెలుగు సమాజం లో చవి చూసిన వర్గ భేదాల రంగూ, రుచీ, వాసనా వేరు. కొన్ని అటూ, కొన్ని ఇటూ. ఆ వివరాలు కూడా త్వరలోనే…

   *

వంగూరి చిట్టెన్ రాజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • We, who came long after you -in mid 90’s, too got the awareness about the american culture and life style by only beacuse of watching sit coms and other TV shows like “Seinfeld”, “Friends”, “Frasier” etc. By watching reruns of “Saved by the bell”, “Beverly Hills 90210”, “Boy meets world”, we learned about schools and colleges system.
    People coming now, are well aware of all those while they are in India itself. I keep reading your write-ups a lot.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు