గొర్తి బ్రహ్మానందం గారు ఈ సదస్సు గురించి మొదటిసారి ప్రస్తావన తెచ్చినప్పుడు, నిజానికి నాకు పెద్దగా ఉత్సాహం కలగలేదు. రచనా వ్యాసంగం పూర్తిగా వైయక్తికమైన ప్రక్రియ; పది మంది రచయితలు కలిస్తే కొత్తగా పుట్టుకొచ్చే ఆలోచనలు ఏముంటాయన్న సందేహం ఒక కారణం. నేనింతకు మునుపు వెళ్లిన ఒకటీ, అరా సాహితీ సమావేశాల్లో ఎవరి కవితలు/కథలు వారు చదివి వినిపించటం, లేక ఎదో ఒక విషయం పై ఏకదంపుడు ఉపన్యాసాలు నాకు పెద్దగా ఆసక్తి కలిగించకపోవటం, రెండో కారణం. సదస్సు రోజు దగ్గర పడుతున్నకొద్దీ, ఖాయంగా వస్తామన్న ఆహ్వానితుల పేర్లు చూసి, గత ఐదారేళ్లుగా ఫేస్బుక్ లో పరిచయమైన రచయితలను ముఖాముఖీగా కలిసే అవకాశమైనా కలుగుతోంది కదా అని సమాధాన పరుచుకున్నాను.
సదస్సుకు రెండు మూడు రోజుల ముందర నుంచీ నిర్వహణ సంఘం (బ్రహ్మానందం, అఫ్సర్ , కల్పన, చంద్ర) నుంచి వస్తున్న చర్చాంశాల పట్టిక, చర్చావిధానం చూసి కొత్త ఉత్సాహం పుట్టింది. “కవిత్వం”, “కథావలోకనం”, “పత్రికలు”, “నాన్-ఫిక్షన్”, “సమీక్షలు-విమర్శలు”, “అనువాదాలు”, “పుస్తక ప్రచురణలు”, “సాహితీ సభలు-అస్థిత్వవాద పోకడలు-పాఠకులు” – ప్రధానాంశాలు. ప్రతి చర్చకూ ఒక ప్యానెల్, ఆ ప్యానెల్ కు ఒక చైర్, నలుగురైదుగురు వక్తలు, ప్రతి వక్తకీ, ప్రధానాంశంకి సంబంధించిన ఒక ఉపాంశం. ఒక్కో వక్తకీ కేటాయించిన సమయం 5 నిమిషాలు మాత్రమే! ఆ అయిదు నిమిషాల ప్రసంగం తరవాత, సభాసదులతో ఆ అంశం పై చర్చ.
ఒక్కో ప్యానెల్ లో ఏమి చర్చలు జరిగాయో వివరంగా చెప్పటం నా ముఖ్యోద్దేశం కాదు. సదస్సు పూర్తైన తరవాత, నాతో పాటు నిలిచిపోయిన కొన్ని ఆలోచనలని మాత్రం ఇక్కడ పంచుకోదలిచాను. ఇక్కడ నా గురించి కొంత చెప్పుకోవాలి. గత ఆరేళ్లలో నేను రాసింది ఏడు కథలు. గత రెండేళ్లుగా రాసిందీ, పెద్దగా చదివిందీ లేదు. ఎన్నో సంవత్సరాలుగా (దశాబ్దాలుగా) కవిత్వం, కథలూ రాస్తున్నటువంటి పలువురు సాహితీవేత్తల సమూహంలో నేనసలు చెందుతానా లాంటి ఆలోచనలు చుట్టుముడుతుండగా సమావేశం ప్రారంభమయింది. వేలూరి గారితో మొదలై, వివిధ పత్రికా సంపాదకులూ , పేరు మోసిన కవులూ, కథకులూ, మోతాదుకు మించిన మోడెస్టీ తో చేసుకున్న స్వపరిచయ వాక్యాలు, వాతావరణాన్ని తేలిక పరచటంతో పాటు, నా అనుమానాల్నీ దూరం చేశాయి.
(కవిత్వం ప్యానెల్)
కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో కవిత్వం గురించి చర్చ మొదలయ్యింది. జేకే మోహనరావు గారు, కవిత్వం కాని ఛందోబద్ధమైన పద్యం, పద్య కవిత్వం, వచన కవిత్వం, వాటి మధ్య అంతరాలు గురించిన సోదాహరణ వివరణతో, నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. అఫ్సర్ గారు ప్రసంగించిన అంశం “కవిత్వంలో అస్థిత్వవాదం”. “అసలది ఎంతవరకూ అవసరం? దాని వాళ్ళ జరిగే మెలేమైనా ఉందా?“ లాంటి అభిప్రాయాలతో నిండి ఉన్న నాకు, ఆయన ప్రసంగం ద్వారా ఒక కొత్త పార్శ్వము పరిచయమయ్యింది. సమాజాన్ని ప్రతిబింబించే ఏ సాహిత్యమైనా అంతర్లీనంగా ఎదో ఒక వాదాన్ని సమర్థిస్తూ నే ఉంటుంది. ఆ వాదం బలహీనపక్షాలను సమర్థిస్తే, దానికి అస్థిత్వవాద కవిత్వం అని ప్రత్యేక ముద్ర వేస్తాం. దాని అవసరాన్ని గురించి నిశ్చయంగా వివరిస్తూనే, ఆవేశం తప్ప ఆలోచన కలిగించలేని వాద కవిత్వం, దాని వలన కలిగే సాధకబాధకాలు, ఆయన ప్రసంగంలో నన్ను ఆకట్టుకున్న అంశాలు. రవి వీరెల్లి గారి ప్రసంగంలో, “కవిత్వం ఎలా చదవాలో పాఠకులకి నేర్పించాలి” అన్న ప్రస్తావన పై కొంత చర్చ జరిగింది. కవిత్వానికి దూరంగా ఉంటున్న నాకు అది సహేతుకంగా అనిపించినా, దాని గురించి కొంత వేడి చర్చ జరిగింది. “కవిత్వం తెలిసిన వారు, ఒక కవిత తీసుకొని వివరంగా తమకు ఏది నచ్చిందో లేక నచ్చలేదో రాయాలి” అన్న మాధవ్ మాచవరం గారి ఆలోచన నాకు రవిగారి ప్రస్తావనకు ఒక పరిష్కారంలా తోచింది.
(కథావలోకనం – ప్యానెల్)
ఆరి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో కథావలోకనంలో భాగంగా, కథా వస్తువులలో, శిల్పంలో వస్తున్న మార్పులు, వాటితో పాటు కథా పాఠకులలో ఎరుగుతరుగులు, కథలలో “అశ్లీల పదాల” వాడుక అవసరమా లాంటి విషయాలపై కొంత వాదనలు జరిగాయి. అనిల్ రాయల్ గారు, అశ్లీల పదాల వాడుక అనవసరం అని బలమైన ప్రకటన చేసిన తరువాత జరిగిన చర్చలో, ఎక్కువశాతం ఆయనతో అంగీకరించలేదన్నది నేను గ్రహించిన విషయం.
రామారావు కన్నెగంటి గారి అధ్యక్షతన “పత్రికలు” ప్యానెల్ లో పాల్గొన్న వారందరూ పత్రికా సంపాదకులే. ఈమాట-మాధవ్ మాచవరం, సురేష్ కొలిచాల, కౌముది-కిరణ్ ప్రభ, సారంగ-అఫ్సర్ , సృజనరంజని-మృత్యుంజయుడు, మధురవాణి-మధు పెమ్మరాజు, అన్య సభాసదుల మధ్య ఒక రంజైన చర్చ నడిచింది. గొర్తి గారు ఏర్పాటు చేసిన రుచికరమైన లంచ్, టీ-టిఫిన్, డిన్నర్ ఆస్వాదించిన తరవాతి ఆయాసం, ఈస్టుకోస్టు , మిడ్వెస్ట్ నుంచి వచ్చిన ఆహుతుల జెట్-లాగ్, ఇవేవీ, చర్చకి అడ్డం రాలేదు.
రెండోవ రోజు సదస్సు, ఆరి సీతారామయ్య గారు ప్యానెల్ ఛైర్ గా, కథావలోకనంలో మరికొన్ని కొత్త అంశాలతో నడిచింది. తెలుగు కథలకు పాఠకులు పెరుగుతున్నారా అన్న అంశంపై మాట్లాడుతూ గిరిధర్ కె.వి గారు, తరుగుతున్నారు అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే, చర్చ దానికి భిన్నాభిప్రాయంతోనే ముగిసింది. అమెరికా నుంచి ప్రచురితమవుతున్న వెబ్ పత్రికలకు గత కొన్నేళ్లలో, అమెరికాలో కంటే ఇండియాలో పాఠకులు ఎక్కువగా ఉండటం, తెలుగు వార్తా పత్రికల సర్క్యులేషను పెరగటం, మరో పక్క పుస్తక విక్రయాలు పడిపోవటం లాంటి విరుద్ధ వాదనలు వినిపించాయి. కొత్త కథకులకు రాయటానికి ప్రేరణ ఏమిటన్న విషయం పై, కథలు రాయటం ఆపేసిన నేను ప్రసంగించిన వెంటనే, ఆకాశానికి ఎత్తేసే ధోరణి వల్ల కొత్త కథకులకు ప్రయోజనం ఉందా అన్న అంశం పై మెడికో శ్యామ్ గారు మాట్లాడారు. వేమూరి వెంకటేశ్వర రావు గారు, సైన్స్ ఫిక్షన్ కథల గురించి, వాటిని ప్రచురణలోకి, ప్రాచుర్యం లోకి తీసుకు వచ్చే ప్రస్థానంలో ఆయనకు ఎదురైన కొన్ని అనుభవాలు పంచుకోవటంతో చర్చ ముగిసింది.
అపర్ణ గునుపూడి గారు నృత్య రూపక సాహిత్యంలో పాటించవలసిన నియమాలూ, తీసుకోవలసిన జాగర్తలూ లాంటి, నేను ఇంతకు ముందరెప్పుడూ ధ్యాసపెట్టని విషయాలపై ఆసక్తి కలిగేలా వివరించారు. “సమీక్ష – విమర్శ” అనే అంశంపై శ్రీనివాస్ చుక్కా, మాధవ్, మెడికో శ్యామ్, చంద్ర కన్నెగంటి గార్లు అందరూ పాల్గొనే విధంగా, మంచి చర్చనే నడిపించారు. అనువాద సాహిత్యం గురించి కొండలరావు గారు తాను చైనీస్ నుంచి తెలుగులోకి అనువదించిన అనుభవాన్ని పంచుకున్నారు. మాధవ్ గారు తాను అనుసరించే అనువాద ప్రక్రియ గురించి వివరిస్తూ, కొన్ని వేరే ప్రాంతలలో లేక దేశాలలో నడిచే కథలను, తెలుగు ప్రాంతాలు, పాత్రలుగా మారుస్తాననే విషయంలో కొంత చర్చ జరిగింది. అన్ని కథలూ కాకుండా, ఆ కథా వస్తువు అనువుగా ఉండి, తెలుగు వారికి మరింత దగ్గరవుతుంది అని పూర్తిగా విశ్వసిస్తేనే, అలా చేస్తానని మాధవ్ వివరణ ఇచ్చినా, నా వరకూ ఆ ప్రయాస అనవసరం అనిపించింది. నా చిన్నతనంలో విపులలో వచ్చే అనువాద కథలు, ఆ వేరే దేశాల లేక ప్రాంతాల ఆహార వ్యవహారాలు, పరిసరాలు, సంస్కృతి, జీవన విధానం లాంటి కొత్త విషయాలు తెలుసుకోవటం కోసమే ఆతృతగా చదవటం నాకు బాగా గుర్తు.
గొర్తి గారు ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన మిరపకాయ బజ్జీలతో పోటీగా, డల్లాస్ త్రయం (అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, సురేష్ కాజా గార్లు) కొన్ని “హాట్ టాపిక్స్” లేవనెత్తి ఒక కొత్త చైతన్యాన్ని రగిలించారు. అనంత్ గారు, సాహిత్య సభా నిర్వహణ గురించి ఉపన్యసిస్తే, చంద్రహాస్ అస్థిత్వవాద సాహిత్యం, ఒక హద్దు మీరి, ఆలోచన, లేక ఆవేశం రేకిత్తించే బదులు, ద్వేషాన్ని చిమ్మేలా వికటించటం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. సురేష్ కాజా, తెలుగు కథలకి పాఠకులు తగ్గటానికి కారణం రచయితలే, వారే తమ రచనలతో, పాఠకులకున్న విలువైన సమయాన్ని తమ వైపు ఆకర్షించటంలో విఫలమవుతున్నారని ప్రతిపాదించారు. చాలా మంది తలలు ఊపారు కనక, ఆయనతో ఏకీభవించారనే అనుకున్నాను.
(డల్లాస్ త్రయం…మాధవ్ )
కొత్తగా పురుడు పోసుకున్న ఈ అమెరికా రచయతల సంఘం, తదుపరి ప్రణాళిక, ఏటేటా కలవాలన్న ప్రతిపాదన లాంటి అంశాలపై “ఓపెన్ ఫారం” జరిగిన తరువాత సదస్సు ముగిసింది.
వెనుదిరిగి చూసుకుంటే, ఈ రెండు రోజుల్లోనూ, ఎన్నుకున్న అంశాల విస్తృతి , అందరూ పాలుపంచుకునే అవకాశం కలిపించిన ఆ చర్చా నిర్మాణం, కార్యక్రమ నిర్వహణ వెనకాల జరిగిన ఆలోచనా… అన్నీ నాకు ఆశ్చర్యం కలిగించటం తో పాటు, ఒక క్వాలిటీ టైం గడిపానన్న సంతృప్తినిచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా, మళ్ళీ రాయాలి అనే ఒక స్ఫూర్తిని ఇచ్చింది, ఈ సదస్సు. దీనికి మాత్రం సదస్సు నిర్వహణ సంఘానికి , తోటి సభ్యులకీ రుణపడి ఉన్నాను.
“అన్నిటికంటే ముఖ్యంగా, మళ్ళీ రాయాలి అనే ఒక స్ఫూర్తిని ఇచ్చింది, ఈ సదస్సు…”
పై వాక్యం ఒక్కటి చాలు ఈ సదస్సు ఎంతో విజయవంతం అయింది అని చెప్పడానికి. అంతమంది హేమాహేమీల నుంచి ఎంతో నేర్చుకుని, బాగా వ్రాయడానికి కావలసిన ముడి సరుకులు తెలుసుకునే అవకాశం పోగొట్టుకున్నాను. నేను చేసే సదస్సు నిర్వహణల స్థాయి బహుశా నిరుపయోగం గానూ, అసంతృప్తి గానూ ఉంది అని కూడా అర్ధం అయింది.
మొట్టమొదటి రచయితల సదస్సు నిర్వాహకులైన ఆప్త మిత్రులు గొర్తి సాయి బ్రహ్మానందం, చంద్ర కన్నెగంటి, అఫ్సర్, కల్పన లకి అభినందనలు.
Your wisdom and presence was certainly missed there Vanguri garu. We missed a chance of learning a thing or two from you!
People like me in inIndia are happy to know the brief summarization of the total proceedings. I congratulate all for this venture and best of luck for the continuation without break.
>> అనిల్ రాయల్ గారు, అశ్లీల పదాల వాడుక అనవసరం అని బలమైన ప్రకటన చేసిన తరువాత జరిగిన చర్చలో, ఎక్కువశాతం ఆయనతో అంగీకరించలేదన్నది నేను గ్రహించిన విషయం.
‘ఎక్కువమంది’ అనటం తప్పు. ఎవరూ అంగీకరించలేదు 🙂
I stood alone; and I’m proud of it. I’ll do that again, if I have to.
>>‘ఎక్కువమంది’ అనటం తప్పు. ఎవరూ అంగీకరించలేదు
అంగీకరించిన వాళ్ళు గట్టిగా మాట్లాడలేదు అనడం మరింత కరక్టు.
చక్కని, వివరాలతోకూడిన, సమీక్ష. చాలా బాగుంది యాజి గారు!
నమస్కారం అనిల్ గారు, మీరు ఈ అంశంపై మాట్లాడటం హర్షణీయం.
మీ అభిప్రాయాలు కొందరికే పరిమితమవకుండా సామాన్య సాహితీ అభిమానులకు చేరితే బావుంటుందని నా అభిప్రాయం. రచయితలుగా ఒకసారి పేరుబడ్డాక(?), స్వతహాగా తమకు నచ్చిన జోనర్ మినహా, కొత్త ఆలోచనలు స్వీకరించే Absorbency ఉండదనేది ఓ పరిశీలన.
మామూలు పాఠకులయితే కొత్త ఆలోచనలు స్వాగతించి అంగీకరించగలరేమో?
మీ అభిప్రాయాలు ఏదైనా పత్రికలో ఉంచితే చదవాలని ఉంది.
People like me in inIndia are happy to know the brief summarization of the total proceedings. I congratulate all for this venture and best of luck for the continuation without break.
ఇంకా వివరంగా రాయాలి ఈ సభ గురించి . ఇది మరీ క్లుప్తంగా ఉంది
ఒక్కో రోజు జరిగిన చర్చలను వివరంగా రాయండి మళ్లీ 🙂
అనిల్ రాయల్ గారితో మిగతా వాళ్లు ఎందుకు ఏకీభవించలేదు? వాళ్ల వాదనలేమిట్ట?
సమీక్ష -విమర్శ దీని గురించి కూడా ఏం చర్చ జరిగిందో తెలుసుకోవాలనుంది. సమీక్ష అంటే పొగడ్త గా అర్థం మారిపోయిన ఈ రోజులలో ఆ చర్చ అవసరమైనది. దాని గురించి వివరంగా రాయండి