మిత్రులారా,
క్రిందటి వారమ్ కేంద్ర సాహిత్య ఎకాడమీ (న్యూ ఢిల్లీ) వారి నుంచి అధికారిక భాషలో, ఇంగ్లీషులో వచ్చిన వచ్చిన ఆదేశాలు చదవగానే భలే సంతోషం వేసింది. హమ్మయ్య , ఇన్నాళ్ళకి అమెరికా తెలుగు కథకి, కథకులకి భారత దేశంలో అత్యున్నత ప్రభుత్వ సాహితీ సంస్థ అయిన సాహిత్య ఎకాడెమీ (న్యూ ఢిల్లీ) వారు ఇచ్చిన గుర్తింపు చాల సంతోషం కలిగించింది. ఆ ఉత్తరం సారాంశం ఏమిటంటే అమెరికా తెలుగు కథ ఆవిర్భవించిన మొదటి యాభై సంవత్సరాలలో వచ్చిన తెలుగు కథలలో ఉత్తమ శ్రేణికి చెందిన కథలని ఎంపిక చేసి “Anthology of Telugu Short Stories of America (1964-2014) పేరిట ప్రచురించడానికి సాహిత్య ఎకాడెమీ వారు నిర్ణయించినట్టూ, ఆ చారిత్రక కథా సంకలానికి ప్రధాన సంపాదకులుగా అమెరికాలో నన్నూ అనగా వంగూరి చిట్టెన్ రాజు నీ, భారత దేశంలో డా. సి. మృణాళిని గారినీ నియమిస్తూ ఉత్తరువులు జారీ చేశారు. నాకు తెలిసీ విదేశాలలో వెల్లివిరుస్తున్న తెలుగు సాహిత్యాన్ని కేంద్ర సాహిత్య ఎకాడమీ గుర్తించడం ఇదే మొదటి సారి. దీనికి నేపధ్యం ఏమిటంటే….. ఈ ఏడాది మొదట్లో నేను భారత దేశం వెళ్ళినప్పుడు ఢిల్లీ మీదుగా నా తిరుగు ప్రయాణం పెట్టుకుని, కాస్త సమయం ఉండడంతో సాహిత్య ఎకాడెమీకి వెళ్లి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు గారిని పలకరించాను. అప్పుడు ఆయన్ని “మా ఉత్తర అమెరికాలో 1964 నుంచీ దిన దిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్న తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కథా సాహిత్యానికి గుర్తింపుగా సాహిత్య ఎకాడమీ ఏం చెయ్య గలరూ? “ అని అడిగాను. అడగడమే కాదు, తెలుగు సాహిత్య చరిత్రలో ఎంతో చారిత్రక నూతన అధ్యాయం అయిన తొలి యాభై సంవత్సరాల కథలలో మంచివి ఎంపిక చేసి అక్కడి కథా పరిణామాన్ని నిక్షిప్తం చేసే కథా సంకలనం ప్రచురిస్తే బావుంటుంది అని సూచించాను. ఆ ఆలోచన ఆయనకి నచ్చింది. సరిగ్గా అదే సమయానికి సుప్రసిద్ద సాహితీవేత్త మృణాళిని గారు అక్కడే ఉండడంతో ఆ ఆలోచనకి పదును పెట్టాం. ఆ కథా సంకలనానికి “అర్ధ శతాబ్దిలో అమెరికా కథ” అనే మకుటం బావుంటుంది అని మృణాళిని గారి సూచన మాకు నచ్చింది. ఆ తరువాత నేను అమెరికా రాగానే వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున ఈ ఆలోచనని–అంటే 1964 – 2014 లలో వచ్చిన అమెరికా కథల సంకలనం ప్రతిపాదన సాహిత్య ఎకాడమీ వారికి పంపించాను. సత్వర స్పందన రాకపోవడం తో దాని సంగతి మర్చే పోయాను. మా ప్రతిపాదన ఎకాడెమీ వారి తెలుగు సలహా మండలి ఆమోదించినట్టు, మేము ఆ కథల ఎంపిక మొదలు పెట్టవచ్చును అనీ ఆరు నెలల తరువాత మొన్న వచ్చిన ఉత్తరంలో మాకు తెలియ పరిచారు. మాకు ఏవిధమైన పారితోషికాలూ ఉండవు సరి కదా, అన్ని పుస్తక ప్రచురణ తప్ప అన్ని ఖర్చులూ మావే. పుస్తక ప్రచురణ తరువాత ఇతర భారతీయ భాషలలోకి ఈ కథలు అనువాదం ఎకాడెమీ వారు చేయించే అవకాశం ఉంది. ఈ మంచి వార్త మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరో వారం రోజులలో మెల్ బోర్న్ సదస్సుకి వెళ్లి వెనక్కి వచ్చాక “అర్ధ శతాబ్దిలో అమెరికా తెలుగు కథ” సంకలనం మీద మృణాళిని గారి సహాయంతో ఒక ప్రణాళిక తయారు చేసి, నియమ నిబంధనలు రూపొందించుకుని మాకు ఇచ్చిన బాధ్యతని నిబద్ధతతో నిర్వహించడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. అమెరికా కథల సేకరణ, అతి క్లిష్టమైన ఎంపిక విషయాలలో తగిన సహకారం అందించమని అమెరికా కథకులని, సాహితీ వేత్తలని, పత్రికా సంపాదకులనీ, పాఠకులనీ అర్ధిస్తున్నాను. అందరి సలహాలని స్వాగతిస్తున్నాను. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన కేంద్ర సాహిత్య ఎకాడెమీ వారికి, తెలుగు సలహా మండలి వారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను. త్వరలోనే సమగ్ర ప్రకటన వెలువరించి ఈ బృహత్ కార్యక్రమం ప్రారంభిస్తాం. అంత వరకూ..శలవ్… భవదీయుడు, వంగూరి చిట్టెన్ రాజు |
అమెరికా కథకులకి శుభ వార్త
నాకు తెలిసీ విదేశాలలో వెల్లివిరుస్తున్న తెలుగు సాహిత్యాన్ని కేంద్ర సాహిత్య ఎకాడమీ గుర్తించడం ఇదే మొదటి సారి.
Congratulations Raju Garu.
America to Hastinapuri ki mee sahitee parichayam telugu vari bhagyamu.
Meeku, Victoria rani gariki koumudi web masapatrika abhimanula hrudayapurvaka
Abhinadanalu.
Excellent initiative sir…..thanks for all your efforts