వల్లూరి రాఘవరావు రాసినవి కొన్ని కథలే. ప్రతిదీ విలక్షణమైనదే. గుర్తుంచుకోతగ్గదే. ఒకపరి చదివితే ఎప్పటికీ వెంటాడేదే. అరుదైన కొద్ది కథలే రాసిన రాఘవ తన కథల కాపీలను మాత్రం దాచుకోలేకపోయాడు. ఈ మధ్యే ఓ కథ దొరకబుచ్చుకుని నాకు చదవమని ఇచ్చాడు. అదే ఈ కథ. గుచ్చుకునే కథ. జీవితమనే ముడిఖనిజం నుంచి ఒడిసిపట్టిన నిఖార్సయిన కథ!
త్రిపురనేని శ్రీనివాస్ బాధ్యుడుగా ఉన్న రోజుల్లో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక సాహిత్య పరీమళం వెదజల్లుతుండేది. దానికి కారణం త్రిశ్రీ సాహిత్య పిపాసి కావడమే. నిరంతరం కొత్త గొంతుల కోసం, సత్తువ కలిగిన పలుకు కోసం, వినూత్న దర్శనం కోసం వెతికేవాడు. అదే పనిగా జల్లెడ పట్టేవాడు. అలాంటి సువాసనలు ఎక్కడున్నా ఇట్టే పట్టుకునేవాడు. వెంటతెచ్చుకుని ఆదివారం సంచికలో అచ్చేసేవాడు. తెలుగు పాఠకులకి వారాంతపు పండుగ చేసేవాడు. వల్లూరి రాఘవని త్రిశ్రీ అడిగి మరీ రాయించి, అచ్చువేసిన ఈ కథ అందులో ఓ మచ్చుతునక!
1995 నాటికి తెలుగునాట కొత్త ఉత్తేజాలు ఉరకలేస్తున్నాయి. సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాల్లో దృష్టికోణం మరింత విశాలమైంది. వర్గమా? కులమా? ఏది ప్రధానం అన్న తీవ్ర చర్చ తర్వాత స్థిరపడిన అభిప్రాయంతో కొత్త నడక మొదలైంది. ఒకవైపు స్త్రీవాదం, మరోవైపు దళితవాద గళం పదునెక్కుతున్నాయి. కులసమాజపు వికృత పోకడలను దర్శింపచేసే కవిత్వం ఒక ప్రవాహంగా వస్తున్న కాలం. ఈ సమయంలోనే ఇదే ఇతివృత్తంతో కొన్ని కథలు కూడా వచ్చాయి. అందులో వల్లూరి రాఘవరావు కథ తప్పక ప్రస్తావించ తగ్గది. కులజాడ్యంపు కోరలు ఎంత పదునుగా ఉంటాయో, ఎంత లోతుగా గాయం చేస్తాయో ఈ కథ చదివితే అర్థమవుతుంది.
“అమళ్లదిన్నె శర్మగారి అబ్బాయి అను యేసోబు”. ఇదండీ రచయిత తన కథకి పెట్టిన పేరు. ఈ కథ ద్వారా రచయిత తన చిన్ననాటి సంఘటనని ఏ అలంకారాలు లేకుండా చెప్తాడు. ఒక బేపన పిలగాడు. బడి చదువుల ప్రాయం. క్లాసులో అతనికొక పరమ ఆప్తుడు. పేరు యేసోబు. మాలపిలగాడు. ఆధిపత్యవర్ణాలకి అంటరానివాడయిన ఆ మాలపిలగాడు “అమ్మళ్లదిన్నె శర్మగారి అబ్బాయి”గా ఎందుకు మారాడో, ఎవరు మార్చారో, ఫలితంగా అతనికెంత క్షోభ కలిగిందో, అతని భవిష్యత్తులోకి చీకటి ఎలా కోరలు చాపిందో ఈ కథ ద్వారా రచయిత బొమ్మకట్టిస్తాడు. ఈ పరిణామంతో భీతిల్లిపోయిన బేపన పిలగాడు ఈ వ్యవస్థలోని వక్రత్వాన్ని తిట్టి పోస్తాడు. దీన్ని పెంచిపోషిస్తున్నవారికి శాపనార్థాలు పెడతాడు.
ఈ కథలోని పాత్రల నడక, వాడే భాష, అందులో ఉండే శ్లేష, దళితుల పట్ల అగ్రవర్ణాల ఈసడింపు… అన్నీ ముతక ముతకగా, పచ్చిపచ్చిగా, పరమ వాస్తవికంగా ఉంటాయి. ఆసాంతం కథ చదవగానే గుండె బరువెక్కి ఒక రకమైన కసి ఎగదన్నుకొస్తుంది లోపలి నుంచి. కథలోని అమళ్లదిన్నె శర్మగారి అబ్బాయి అను యేసోబుని తలిచీ మనమూ ఒకింత వ్యాకులపడతాం.
నిష్కల్మషమైన పసిప్రాయం, ఆ వయసులో ఉండే అమాయకత్వం, లేత మనసులు సంధించే సూటి ప్రశ్నలు.. వీటిని ప్రధానం చేసుకోని నడిపితేనే ఈ కథావస్తువు పండుతుంది. ఈ పరిమితికి అటూఇటూ అయితే ఏమాత్రం అందగించదు. ఎందుకంటే లేతప్రాయంలో ఉన్నప్పుడు మనలో ఉదయించిన ప్రశ్నలు, ఆనాడు పడ్డ ముద్రలు నేటికీ ఎంత పదిలంగా ఉన్నాయో తెలిసిందే కదా! సరిగ్గా ఇదే తరహా నడకతో కథని నడిపించాడు వల్లూరి రాఘవరావు.
రెండు దశాబ్దాలకు పూర్వం రాసిన ఈ కథకి మూలం అంతకు రెండున్నర దశాబ్దాల క్రితం జరిగిన ఘటన. ఆ రోజులనాటి సామాజిక వాతావరణం ఈ కథ అంతటా పరుచుకుని ఉంది. ఊళ్లలో మిషనరీ సూళ్లు రావడం, మాలమాదిగల నడవడికలో కొంచెం కొంచెంగా మార్పులు కనిపించడం, వారి పిల్లలకి చదువు అబ్బుతుండటం, కిందికులస్తులు కూడా కోటు-బూటు వేసుకోవడం.. ఈ తరహా పరిణామాల పట్ల పెద్దకులపోళ్లు, ముఖ్యంగా బ్రాహ్మణవర్గ పెద్దల్లో ఎలాంటి స్పందనలు కలిగేవో, వారు ఏ మాటలు అనేవారో, ఆ మాటల్లో ఏ భావాలు ధ్వనించేవో ఈ కథలో స్పష్టంగా చెప్పుకొచ్చాడు రచయిత. నిజానికి ఈ రచయిత లోగుట్టుని బయటపెట్టిన ఇంటిదొంగ. కనుకనే.. మిగతావారికి తట్టని, పట్టుకోలేని విషయాలు కూడా చాకచక్యంగా బట్టబయలు చేశాడు ఈ కథలో!
ఈ కథలో తిట్లుగా వాడిన కొన్ని పదాలపై నాకు వ్యక్తిగతంగా అభ్యంతరం ఉండింది. అయినా ఆనాటి కథ గనుక సవరింపులు చేయకుండా ఇస్తున్నా. పాఠకులు అర్థంచేసుకోగలరని మనవి.
పాతికేళ్లకు పూర్వం ఈనాడుతో ప్రారంభమైంది రాఘవ ఉద్యోగ జీవితం. అనతి కాలంలోనే పత్రికారంగంలో అనేక దశలను అధిగమించారు. సబ్ ఎడిటర్ నుంచి సంపాదకుడి స్థాయికి ఎదిగారు. ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకుడిగా ఉద్యోగ బాధ్యతలను విరమించాక.. ఆంధ్రప్రదేశ్ పత్రిక బాధ్యతలు కొన్నాళ్లు చూశారు. ప్రస్తుతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నారు.
అమళ్లదిన్నె శర్మగారి అబ్బాయి అను యేసోబు
– వల్లూరి రాఘవరావు
మండువా లోగిలి ఆ రోజు అంత సందడి లేకుండా వుండినది. మా పెదనాయన (సోమంచి కృష్టయాజులు గారు) బయట పెణక కింద నించొని జంధ్యాన్ని వొక చేత్తో ముందుకు వెనక్కు లాగుతూ వీపు తీట తీర్చుకుంటున్నాడు. అలాటి వొక దారపుపోగు అందుకు తప్ప మరి దేనికీ వాడడం నేను చూడలేదు.
మాల్లంబ్డీకొడుకులు… థూ… మాల్లంబ్డీకొడుకులు… అంటూ రొంటినుంచి పొడుంకాయ తీసి వొక్క పీల్పు పీల్చినాడు. ఆవేళ కొద్దీగా మబ్బుపట్టి వుండింది. వంటగదిలోంచి ఇంగువా చారు, అగరొత్తుల పొగ కలిసిన వింత వాసన లోగిలి అంతా వ్యాపించినది.
మిషనరీ స్కూల్సు రావడం ప్రాణాంతకం అయింది. జాత్తక్కువ పీనుగులంతా బరి తెగించినారు అని మళ్ళీ మాల్లంబ్డీకొడుకులు, మాల్లంబ్డీకొడుకులు అంటూ పెదనాయన గురగురలాడినాడు.
తేళ్ళ విశ్వాసం అనే రెవిన్యూ గుమాస్తా వొకాయన మా ఇంటి ముందునుంచి అప్పుడే వెళ్ళివాడు. నేను చెప్పజాలని రంగుగల అత్యద్భుతమైన బుష్‌కోటును ఆకుపచ్చ పంట్లాంలోకి దోపి, మిల్లరు బూట్సులు వేసుకుని వుండినాడు. అది నాకెంతో వచ్చినది. మా పెదనాయన మాత్రం ఎందుకో అదే పనిగా తిట్టినాడు. మనిషై పుట్టాక అలాటి రంగులు గల మహా తమాషా అయిన గుడ్డలు వేసుకోవాలని పెద్ద బ్రాహ్మలకి వుండదు. నాలాంటి చిన్న బ్రాహ్మలు అడిగితే ఎగ్గుమాలిన పనులు తలపెట్టకు అని తిట్టినారు.
మొలకు తప్ప వొంటిమీద వొక్క గుడ్డ అయినా లేకుండా మా నాయన, పెద్దనాయన, బాబయ్యలు వీధులలోకి బోర విరుచుకుని పోయేడివారు. వాళ్ళకు దక్షిణలూ, దణ్ణాలూ బానే వుంటాయి. వొంటిమీద ఏ ఆచ్ఛాదనా లేకపోయినందుకు వాళ్ళకు ఎగ్గులేదు. విశ్వాసం వంటి మాలాడు మహా తమాషా అయిన గుడ్డలు వేసుకుని వెడితే అంతా చోద్యంగా నవ్వుకోవడం నేనెరుగుదును. వొంటిమీద అన్ని గుడ్డలు వున్నప్పటికిన్నూ విశ్వాసం నంగినంగిగానే పోతుంటాడు.
బ్రాహ్మలలో గుడ్డలు వేసుకోవాలన్న తహతహ యేదీ వుండదా.. అని నేను యోచిస్తుండగా, మా దొడ్డమ్మ మాటలు వినపడినయి. బోడిగుండుపై ముసుగు సరిచేసుకుని జీలుగు కర్రతో మడిబట్టను గోడమీంచి లాగి… “ఈ కుర్రముండలతో వేగలేక చస్తున్నాను. ముట్టూ, అంటూ లేకుండా శూద్రాళ్ళ ఫాయినా తయారైనారు” అంటూ తిట్టినది. అంతలో మా పెదనాయన అందుకొని మాల్లంబ్డీకొడుకులు వల్లె ఇదంతాను.. ఈ వెధవ ముండలకి మిషనరీ స్కూల్సు కావల్సొచ్చిందేం అంటూ మా అక్కయ్యలను తిట్టినాడు.
రెండో వాటాలోంచి మా బాబయ్య వొక పత్రికను గుండ్రప్పటిగా చుట్టి బయటికొచ్చి “ఒరే వొక సిజర్స్ పెట్టి, గుర్రంనాడా అగ్గిపెట్టె తే ఫో..” అని నన్ను కొట్టుకు బెత్తాయించినాడు. ఆ కొట్టు కివతల చింతచెట్టు కింద శూద్రాళ్ళ ఆడమనిషి పుల్లట్లు మహా రుచిగా వేస్తుంది. పావలాకు మూడు. సిజర్స్ తేగా మిగిలిన చిల్లరతో అట్లు తినవలెనని నా ఆశ. దాని కూతురు నా ఈడుదే.
“ఓలమ్మా.. బేపనోడు ఆపాలు తింటాడంట అహ్హహ్హ..” అంటూ నవ్వుతుంటే దాని ఆగడం చూసి నాకు ముచ్చెమటలు పోసేవి. కొంపలో ఈ విషయం పొక్కినట్లాయెనా…
నాకు బడితెపూజ తప్పదు. వొకసారి మా పెదనాయన కుప్పాయెగ్గెన్న శాస్త్రి నన్ను చింతచెట్టు కింద ఆపాలు తింటుండగా చూసినాడు. ఆ సాయంత్రం మా నాయన కాపుకాసి నన్ను బళ్ళోంచి తీసుకుపోయినాడు. ఆరి మ్లేచ్ఛుడా.. నీకేమి దొమ్మ దాపురించిందిరా.. హవ్వ.. శూద్రకూడుపై యావ పోయినదేమిరా త్రాష్టుడా .. అని బాగా తిట్టి, వొక జంతిక కొనిపెట్టినాడు. అలా చేయమాకు. పెదనాయనకు తెలిస్తే.. అక్కడితో సరి. నేనిట్లా నిన్ను కలిసినట్టు ఎవరికీ చెప్పకు. యెగ్గెన్న పెదకాలవ దగ్గర కనపడి నీ త్రాష్టాన్ని చెప్పినాడు. మరికపై ఇలాంటి పనులు చేయకు అని సైకిలెక్కి మూడులాంతర్ల సెంటరు వైపునకు వెళ్ళిపోయినాడు. తదాదిగా నాకు పుల్లట్లు తినాలన్న ఆశ బాగా పెరిగినది. మా నాయన ఆరోజు నాకు కొనిచ్చిన జంతికను బహుశా శూద్రాళ్ళే తయారుచేశారని నేను ఇప్పటికీ నమ్ముతాను.
బడిగంట మూడవసారి మోగినది. ఎండ చుర్రుమంటున్నది. యాకుందేందు తుషార హార ధవళా.. అని బడి అసెంబ్లీలో లక్కావఝుల గోపాలంగారి అమ్మాయి ప్రార్థన మొదలుపెట్టి వుండింది. ఆరోజు యెంచేతో నాకు ప్రార్థన మీద భక్తి తగ్గినది. ఎండ వలన పిల్లలకు భక్తి తగ్గడం అందరం ఎరిగిన విషయమే కదా!
నా పక్క వరస నుంచి ఏసోబు తెల్లగా నవ్వాడు. వాడట్లా నవ్వుతుంటే మనక్కూడా అట్లా నవ్వాలనిపిస్తుంది. నల్లటి రంగు మొత్తంగా వున్న వాడి శరీరంలో పళ్ళకే తెల్లరంగు వుండింది. వాడు నాకు పరమ ఆప్తుడు. సీమచింతకాయ గుబ్బలు, సన్నగా బ్లేడుతో చీరిన తేగముక్కలు, పప్పుచెక్కలు జామెంట్రీ బాక్సులో వేసుకొచ్చి నాకు పెడతాడు. ఆ బాక్సునందు కోణమానిని, వృత్తలేఖిని వంటివి నేనెప్పుడూ చూసి వుండలేదు. మినపసున్ని, గోరుమీటెలు, తొక్కుడులడ్లు నేను తెస్తాను. వాటికన్నా సీమచింతకాయల్లోనే ఏదో మజా వుండింది.
ప్రార్థన అవగానే బడి మొదలవుతుంది. గదంతా వొకరకమైన ఉల్లాసకరమైన వాసనతో నిండి వుండినది. చాక్‌పీసుల పొడి, గోడల పక్కనుంచి వచ్చే వుచ్చల వాసన మధ్య ఈ తిళ్ళు.. ఆ వాసనా పీల్చవలసిందే యెవరైనా.
అవుట్ బెల్లుకు ముందు వొక బట్టతల ఆయన క్లాసులోకి వచ్చి మాస్టారుతో యేదో చెప్పి నమస్కరించాడు. ఆ తర్వాత ఆయన- బ్రాహ్మల పిల్లలంతా నాతో రండి. బులుసు దొడ్డమ్మగారి ఇంట్లో ఇవేళ నందికేశుడి నోము. అట్లు పెడతారు. కావలసినన్ని తినొచ్చు. కానీ చిన్న తునక కూడా వదలకూడదు. మహా పాపం అలా చేస్తే. బ్రాహ్మల పిల్లలంతా లేచి రండి అని వెళ్ళిపోయినాడు. వూరకే అట్లు.. అవీ తిన్నన్ని తినొచ్చు. నందికేశుడి నోములు మాలో మామూలే.
మేమంత జట్లు వేసుకుంటుండగా ఏసోబు బ్రాహ్మలే ఎందుకురా అనినాడు. మరి యేమో అట్లు బ్రాహ్మలే తినాలి అన్నాను… ఎంచేత అలా.. నువ్వేమో మా సోడా తాగుతావు. మా పందిపిల్లలతో ఆడతావు. సోడాబండిని బుర్రుబుర్రున నడిపిస్తావు కదా అనినాడు. ఇప్పుడు వాడిని తీసుకెళ్ళకుంటే నాకు యేం బాగోదు. మా పెదనాయన వాడిని మాలకాకి, యానాది కుక్క అంటాడు. వాడు అట్లా నాకెప్పుడూ కనిపించలేదు. పైగా సుబ్బమ్మదేవి స్కూలు వెనుక వున్న వాళ్ల తోళ్లషాపుల్లో నా ఆటలన్నీ సాగేవి. బుజ్జిబుజ్జి పందిపిల్లలూ, ఎర్రగా కమురు రంగుకు తిరిగిన తోళ్ళు, కొన్ని ఖాళీ సోడాబళ్ళు, వొక చిన్నబడ్డీ అక్కడ వుండనవి. అన్నీ నాకు మహా ప్రీతిపాత్రమైనవి. వాడు మాల్లంబ్డీకొడుకైతే నేను బేపన లంబ్డీకొడుకుని. వాళ్ళింట్లో నన్ను కూడా అలానే అంటారేమో. ఏది ఎట్లున్నా వాడిని అట్లనోముకి తీసుకుపోవాలి. ఇదిగో ఏసూ వొకమాట. నువ్వు అక్కడ ఏమీ మాట్లాడమాకు. నువ్వు అమళ్ళదిన్నె శర్మగారి అబ్బాయివని నేనంటాను. నువ్వు తల ఊచు. అదీ నేనలా అన్నప్పుడే తల ఉచాలి సరేనా అంటూ వాడిని సన్నద్దుడిని చేశాను.
మేమంతా ఒక వరుసగా బయలుదేరి డొంకరోడ్డు దాటి ఒక్కసారి జట్లుగా విడిపోయినాము. పెదకాలవ హనుమంతుడి గుడిపక్కన బులుసు దొడ్డమ్మగారి యిల్లు. మమ్మల్ని అందరినీ బట్టతలాయన లోపలికి తీసుకువెళ్లినాడు.. బాదం ఆకుల కుట్టుడు విస్తర్లలో అల్లప్పచ్చడి, లేత యెరుపులో తెల్లటి పొరవలె వున్న అట్లు వేసినారు. ఏసోబుగాడు ఠక్కున ముట్టినాడు. నీకు వొడుగైందా అని అడిగాను. అదేమో.. అది కానట్లయితే అట్లు తినరాదా అన్నాడు. ముందు వొడుగైన వటువు ముట్టాలి. అందాకా మనం తినకూడదు అన్నాను. మా పెదనాయన అలానే అంటాడు. అలాగే నేను చెప్పినాను. వొడుగంటే ఏమి వుంటుంది అన్నాడు. అది అవ్వాలి. అప్పుడు తెలుస్తుంది. నేను అన్నాను. నాకూ తెలియదు! తినగలిగినన్ని అట్లు నేను, ఏసోబు తినేశాము. బ్రాహ్మలు మాత్రమే చేసే, తినే నోములో శూద్రుడు కూడా తినినాడు. నా సామిరంగా.. నాకు భలే మజా వచ్చింది. ప్రతి శూద్రుడు ఏసోబులాగునే బ్రాహ్మాడైపోతే బాగుంటుంది. అలా అవ్వడానికి నేను కొన్ని గోత్రాలు, ఇళ్ళ పేర్లు చెబుతాను. అప్పడు అందరూ అట్లు తినొచ్చు.
మేమందరం ఎనమదుర్రు చెక్క వొంతెన ఎక్కేసరికి ఉగ్రరూపుడైన బట్టతల మనిషి ఓరేయ్.. మాల్లంబ్డీకొడకా, నీ కెన్ని గుండెలురా, ఆగరా అంటూ రంకెలు వేయసాగాడు. నా గుండెలు జారిపోయినవి. వొకవేళ ఏసోబు శూద్రుడని తెలిసిందా.. శూద్రాళ్ళూ.. మాలాళ్ళూ వొక్కళ్ళేనా.. నాకు సందేహమయి అడిగాను. మీరు శూద్రాళ్ళా, మాలాళ్ళా.. ఏమిటి తేడా అన్నాను. వాడు అయోమయంగా చూసి యేదో చెప్పబోయే లోపు వొక పెద్ద చెక్కపేడు వాడి వీపుకు తాకినది. నాకు భయమైంది. యెంత ధైర్యంరా నీకు.. బులుసు దొడ్డమ్మ ఇంటి దగ్గరి బట్టతలవాడు ఏసోబును కొట్టినాడు.. ఏసోబు చొక్కా ఆ పేడుకు ఉన్న మేకుకు దిగి చిర్రున చీలిపోయింది. వాడి నల్లటి వీపుపై ఎర్ర పెన్సిల్‌తో రాసినట్టయింది. అమ్మతల్లో.. అని అరిచినాడు. చాలామంది ఈ గొడవకు పోగయినారు. ఊ నడవండి అని కొందరు మమ్మల్ని తరిమేశారు. మా పెదనాయనకు ఈ సంగతి తెలిస్తే.. నాకు గుండె జారిపోయి వుండింది.
మూడు రోజులు గడిచిపోయినాయి. ఏసోబు గాడికి వాతం కమ్మిందని పుల్లట్ల శుద్రదాని కూతురు చెప్పింది. ఎందుకిట్లా అయిందో నాకు తెలియకుండా వుండింది.
నేను అవట్ బెల్లులో తోళ్ళషాపుల దగ్గరకు వెళ్ళినాను. ఏసోబు వాళ్ళ నాయన నన్ను చూసి వొక బూతు మాట అన్నాడు. బాపనోడు బాపనోడిలా ఉండాలిట మాలాళ్ళతో నేస్తం కట్టరాదని చెప్పినాడు. అలాచేస్తే మాలాళ్ళని బతకనివ్వరట..
ఇకపై ఇక్కడికి రావాకు. మా లంజోడ్కి తలలేదు.. నీకేమొచ్చింది అన్నాడు. నాకు పెద్దగా ఏడుపు వచ్చింది. ఏసోబును తీసుకెళ్ళినందుకు నన్ను కూడా కొట్టాలి. నా వీపు చీరేయాలి. అలా కాలేదు. ఆ తర్వాత వాడు బడి మానేసినాడు. వొకనాడు సీమచింత చెట్ల దగ్గర అవుపడినాడు. ఆ వోముకు వచ్చినందుకు దొడ్డమ్మగారి దత్తుడు చావబాదినాడని, ఆ తర్వాత వాళ్ళ నాయనా, వాళ్ళ అమ్మ కూడా తననే బాదినారని, అలాటి పెద్దఇళ్ళకు మాలోళ్ళు వెళ్లకూడదని చెప్పినారని అన్నాడు.. నేను మా దొడ్డమ్మలా బుగ్గలు నొక్కుకుని హవ్వహవ్వ అనినాను. నాకు అలా అనాలనిపించింది. ఆ తర్వాత వాడు బాగా ఏడ్చినాడు.. నేను కూడా ఏడ్చినాను. నాజోలికి రావాకు.. నువ్వు వచ్చినప్పుడల్లా నేను దెబ్బలు తింటున్నానని చెప్పినాడు.
తదాదిగా వాడు నన్ను ఎక్కడ చూసినా వొక భూతాన్ని చూసినట్టు జడుసుకునేవాడు.. నాకు ఇదంతా బాధ అయింది. మాలాళ్ళకీ, బ్రాహ్మలకీ ఒకేలా ఆకలి వేస్తుందని, వొకేలా అట్లో, అన్నమో తింటారు అనిపించింది. ఇదంతా ఎందుకు ఇలా జరిగిందని మా తెలుగు మాస్టారిని అడిగినాను.
గవర్నమెంట్ రూల్స్ వచ్చి మాలమాదిగలు సంఘంలోకి వొచ్చేసినారని.. వాళ్ళతో గవర్నమెంటుకు యెంతో పని వుందని, అలా కావడం చేతనే లోకంలో పాపం పెరిగిందని ఆయన చెప్పినాడు. ఎవడు ఎక్కడ వుండాలో అక్కడే వుండాలి అన్నాడు. అలా యెంచేత అని అడిగినాను.. నా చెవిని మురిపెంగా మెలిపట్టి ఇదే చురుకు వుంటే పెద్దైనాక వార్డు కౌవున్సిలరవు అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆల్‌జీబ్రాలోని కొన్ని లెక్కలు ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకోగలను.. ఈ మాటలు మాత్రం అర్థంకావు..
నా సాయంత్రాలు ఇపుడు మా ఇంటి పెణక కింద నిర్భాగ్యంగా గడిచిపోతున్నాయి. సరదా, మజా యేవీ లేవు . ఏసోబుగాడి తెల్లటి నవ్వు, కుయ్యోమని నవ్వొచ్చేలా మోగే గోలి సోడా, బుర్రుబుర్రు మనే సోడాబండి, లేత కమురు తోళ్ళు.. యేవీ నాకిప్పుడు లేవు. ఈ పెద్దాళ్ళంతా కలిసి యేదో చేసినారు. నాకు గోలీసోడా కావాలంటే, పందిపిల్లలతో చేరి పుల్లాట ఆడాలంటే ఎన్నాళ్ళు పడుతుంది. ఇవన్నీ నాకు కాకుండా చేసిన బులుసు దొడ్డమ్మగారి దత్తుడుని పెద్దైనాక చంపి పారేయ్యాలని అనుకున్నాను. అయినా నాకు ఆత్మశాంతి చాలలేదు. అంచేత గుండ్రపట్టి గులకరాయి వొకటి చేత్తో పట్టుకుని పెదకాలువ హనుమంతుడి గుడి వైపునకు పరుగుపెట్టాను.
(నా బాల్యాన్ని మింగేసిన కులం సాక్షిగా ఈ కథ అందరినీ వుద్దేశించి రాసిందే. ఏమాత్రం కల్పితం కాదు)
బాగుందండి కథ! చివరి రెండు వాక్యాలు మరింత బాగున్నాయి . కులాల పట్ల మనుషుల దృక్పథంలో మార్పు ఎప్పటికి సాధ్యమో కదా !!
<Abivamdhanalllu…!Rameshgaru!
చాలా మంచి పరిచయం అంతకన్నా మంచి కధ. బ్రాహ్మణీకార దుర్మార్గాన్ని సరిగ్గా చెప్పారు. ఇన్నేళ్ల తర్వాత ఈ కులవివక్ష లో దుర్మార్గాన్ని తెలుసుకున్న తర్వాత కూడా పరిస్థితిలో మార్పులేకపోడం నిజంగా మన దౌర్భాగ్యం .
బావుందిరా, దాచేస్తే.. దాగని సత్యాలను వెలికి తీస్తున్నావ్. కానీ…
కానీ ఏంటీ .. ఆ ! వెలికి తీయకూడదనా తమరి ఉద్దేశ్యం. సత్యాలెప్పుడూ నిప్పురవ్వలే దేరా..ఎప్పుడోకప్పుడు కాల్చక మానవ్.
“జంధ్యాన్ని వొక చేత్తో ముందుకు వెనక్కు లాగుతూ వీపు తీట తీర్చుకుంటున్నాడు. అలాటి .. దారపుపోగు అందుకు తప్ప మరి దేనికీ వాడడం నేను చూడలేదు.”
అబ్బబబ్బా … ఈ వాక్యం బహు పసందుగా ఉన్నది సుమీ !
ఒకప్పుడు నాకూ మొలతాడు ఉండేది. అది లుంగీల కాలం కాబట్టి రాత్రివేళ నిద్రలో శీలం కాపాడ్డానికి పనికొచ్చేది ( వ్రతం చెడ్డా ఫలితం దక్కాలి మరి) షార్టులూ, పైజామాలు మొదలెట్టాక మొలతాడు తెంపి మురికికాల్వలోకి విసిరేసా .
గొరుసూ జీ మీరు కథల ఎన్‌సైక్లోపీడియా. మీరు కూడా మరిన్ని కథలు పరిచయం చేయాలని డిమాండ్ చేస్తున్నా.
థాంక్స్ రమేష్ , రాఘవ కథను మల్లి పరిచయం చేసినందుకు . ఇన్ని సంవత్సరాలకు రాఘవ కథ చదవడం బాగుంది. నాకు తెలుగు కథల మీద ఆసక్తి రాఘవ కథ చదవడం తో మొదలయింది, ఆంధ్రజ్యోతి లో 1995 లో అనుకుంట బామ్మా , తన ఆస్తిగా వచ్చిన మర చెంబు గురించి (కథ పేరు గుర్తు లేదు) చదివాను తెలుగులో ఇంత మంచి ఫిక్షన్ రాసె అతన్ని చూడాలని ఆంధ్ర జ్యోతి ఆఫీస్ కి వెళ్లి అదేపనిగా కలిసి వచ్చాను . తరువాతరువాత అతను పూర్తిగా కథలు వ్రాయడం మానేశాడని, సినిమాల కి పనిచేస్తున్నదని విన్నాను . తెలుగు కథ ఒక మంచి కథకుడిని కోల్పోయిందనిపించింది . రాఘవ మల్లి కథలు రాయాలని కోరుకుంటూ … మృదుల
శ్రీ రాఘవతో దశాబ్దాల పరిచయం ఉన్నా… ఆయన కథను ఇంతవరకూ చదివింది లేదు. ఇదిగో ఇవాళ మిత్రుడు ఒమ్మి రమేశ్ బాబు పుణ్యానా… సారంగలో ఈ కథ చదవగలిగాను. కులాలు బాల్యాన్నే కాదు… మనిషినే చంపేస్తున్నాయి. భవిష్యత్తులో కులరహిత సమాజాన్ని చూడగలననే ఆశ నా చిన్నప్పుడు ఉండేది. కానీ అది ఓ తీరని కోరిక అని గడిచిన కాలం చాలా ఘాటుగా జవాబిచ్చింది. ఇలాంటి కథలు మరిన్ని వస్తే బాగుండునని పిస్తోంది… కులం గోడలను బద్దలు కొట్టలేకపోయామనే బాధనుండీ ఇలాంటి కథలు చదివినప్పుడు కాస్తంత ఉపశమనం లభిస్తుంది. రాఘవ గారూ మాలాంటి వారి కోసం మరోసారి మీ బాల్యస్మృతులను పంచుకోరూ… ప్లీజ్!!
వల్లూరి రాఘవ ఇంకొన్ని కథలు కూడా రాశాడు. ప్రతిదీ ప్రత్యేకమే. వాటిని ఆయన వెతికి తీసి పుస్తకంగా వేస్తే బాగుండని నా కోరిక. ఎందుకంటే ఏ అలంకారాలు లేకుండా కథని ముడిఖనిజంలా అందించాడు ఆయన.
రాఘవ నాకు బాల్య మిత్రుడు. అంచేత, కథలోని కోన్ని పాత్రలు నాకు సుపరిచితం. ఈ కథ నన్ను మళ్ళీ 35 సంవత్సరాల వెనుకకు తీసుకు వెళ్ళింది.
మంచికథని అందించారు. సంతోషం. నాబాల్యం గుర్తు వచ్చింది.