అచ్చుతప్పు

వాళ్లు ముందు నిన్ను కూల్చారు

-అంటే, నిన్నే అని కాదు

నీలోని ధైర్యాన్ని.

 

వాళ్లు ముందు కొన్ని విత్తనాలు నాటారు

-అంటే, మొక్కల పెంపకం కాదు

పక్కవాడూ మనమూ వేరని.

 

వాళ్లు ముందు కొన్ని ప్రార్థనలు చేశారు

-అంటే, పరిశుధ్దులను కమ్మని కాదు

ఎదుటి వాళ్లకంటే మనం గొప్పని.

 

వాళ్లు ముందే కొన్ని తీర్పులిచ్చేశారు

-అంటే, నువ్వు నేరం చేస్తావని కాదు

తాము చేసేదంతా అన్యాయమనొద్దని.

 

వాళ్లు కొన్ని తేదీలు ఖరారు చేశారు

-అంటే, అగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవమని కాదు

అగస్టు 30, 2015 అని.

 

20.08.2013, 20.02.2015, 05.09.2017

మనకెప్పుడూ ఇవన్నీ సజీవమైన తేదీలు

మనలోని విగ్రహాలు కుప్పకూలిపోయిన క్షణాలు

 

అందుకే, నేనెప్పుడూ వాళ్లకి అర్థంకాని వాక్యాన్నే ఎంచుకుంటా

-అంటే, సేఫ్ సైడ్ అనే కాదు

మనవాళ్లు అచ్చుతప్పులు సరిజేయగలరనే సంకేతం కూడా.

*

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్

దేశరాజు

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు