అమర్ టైలర్స్…. ఇచ్చట బట్టలు కుట్టబడును… కవిత్వం చెప్పబడును

ఇప్పుడు ఆ చొక్కా లేదు. అమర్ టైలరూ లేరు. నెమలీక వంటి ఆ గురుతులు మాత్రమే మిగిలాయి.

  కూచిమంచి అగ్రహారానికి సరిగ్గా నడిమధ్యలో చెక్కలతో చేసిన ఓ బడ్డీ.

భూమికి మూడున్నర అడుగుల ఎత్తులో నాలుగు వైపులా నాలుగు కర్రల ఊతంతో ఉండేది ఆ బడ్డీ. ఏడడుగుల ఎత్తులో… అంతే వెడల్పులో… పైన తెల్ల బోర్డు మీద రంగురంగుల అక్షరాలతో అమర్ టైలర్స్ అనే పేరు నిత్యం కళకళలాడుతూ ఉండేది.

షాపు అనబడే ఆ బడ్డీ లోపల నాలుగు వైపులా మూడు కుట్టు మిషన్లు. ముందు భాగంలో నాలుగు అడుగుల పొడువుతో ఓ టేబుల్. దాని మీద ఓ దుప్పటి కాని, బొంతలు కాని పరుచుకుని నిద్రపోతూ ఉండేవి. ఆ టేబుల్ కి కుడివైపు ఐమూలగా నాలుగైదు చోట్ల నల్లగా బొగ్గులా మరకలుండేవి. అవి అమర్ టైలర్ బట్టలు కత్తిరిస్తూ.. సగం కాల్చిన సిగరెట్ ని టేబుల్ మీద ఆసరా కోసం పెడితే టేబుల్ కాలిన నల్లటి గురుతులు.

ఆ టేబుల్ దగ్గర ఐదున్నర అడుగుల మనిషి… మహాశివుడు మెడలో నాగుపాము ధరించినట్లుగా తన మెడలో కొలతలు కొలిచే టేపుతో.. నిత్యం నవ్వుతూ నిలుచుని ఉండే వారు. ఆయనే అమర్ టైలర్. ముఖం మీద చిరునవ్వు తప్ప కోపం చూడలేదు ఎవ్వరూ. షాపు పేరే ఆయన పేరు. ఇప్పటికీ అందరూ అమర్ టైలర్ అని పిలుచుకుంటారు. ఆయన పేరు చాలా మందికి తెలియదు. నాకు కూడా.

ఆ అమర్ టైలర్స్ షాపు చాలా మంది యువ కవులు, రచయితలకి ఓ రవీంద్రభారతి. మరో త్యాగరాయ గానసభ. ఉదయం పది గంటలకి ఓపెన్ చేసిన షాపు రాత్రి పది గంటల వరకూ తెరిచే ఉండేది. అప్పడప్పుడే కవిత్వం రాస్తున్న అగ్రహారం కవులు పెమ్మరాజు గోపాలక్రిష్ణ, అప్పారి మురళీక్రిష్ణ, వసీరా, పెమ్మరాజు రాంబాబు, కథలు రాయాలనే ఉత్సాహంలో ఉన్న కూచిమంచి ఉదయ్, అగ్రహారానికి ఆమడ దూరంలో ఉండే కవి ఆసు రాజేంద్ర, కవిత్వం అంటే తెలియదు కాని… అక్కడ ఏదో జరుగుతోందని, మనం అలా చేయాలనే కొత్త ఉత్సాహంలో ఉండే నేను ప్రతినిత్యం అమర్ టైలర్ప్ దగ్గర హాజరయ్యే వాళ్లం.

ఒక వైపు బట్టలు కత్తిరిస్తూ… మరోవైపు యువ కవుల కవిత్వం వింటూ ‘బావుంది. జ్యోతికి పంపు. వాళ్లు వేస్తారు’ అని సలహాలు, సూచనలు చేసేవారు అమర్ టైలర్స్. ఇప్పుడు కవిగా లబ్దప్రతిష్టుడైన వసీరా తన కలం పేరుని ముందుగా అమర్ టైలర్స్ కే చెప్పాడు. వసీరా అసలు పేరు వక్కలంక సీతారామారావు. వాళ్ల నాయనమ్మగారి పేరు. వక్కలంక సీతారావమ్మ గారు. ఆవిడ మెడలో చంద్రహారం అని పిలిచే ఓ గొలుసు ఉండేది. దానికి ఉన్న లాకెట్ మీద ఆవిడ పేరు పొడి అక్షరాలతో వసీరా అని ఉండేది.

అదే కాదు… ఆవిడకి సంబంధించిన అన్ని వస్తువుల మీదా వసీరా అనే పేరు ఉండేది. అది చూసిన వసీరా ఆ పేరుతో రాస్తానని ముందుగా అమర్ టైలర్స్ కే చెప్పాడు. ఆయన ‘భలే ఉంది. సినారెలాగా. అదే పేరుతో రాయి వసీరా’ అని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి అదే పేరుతో రాసాడు వసీరా. దేవుడు లేడని, మనిషి, ప్రకృతే దేవుడంటూ ప్రచారం చేసే నాస్తిక పత్రిక ‘చార్వాక’ క్రమం తప్పకుండా అమర్ టైలర్స్ తెప్పించే వారు. దైవభక్తి విపరీతంగా రాజ్యమేలుతున్న మా ఇళ్లలో చార్వాక పత్రిక మాకు ఓ సంచలనం.

అప్పటికింకా మార్క్స్, మావో, లెనిన్, స్టాలిన్ వంటి పేర్లు, కమ్యూనిస్టులు, నాస్తికులు వంటివి అనుభవంలోకి రాని మేం అవన్నీ అమర్ టైలర్స్ దగ్గరే విన్నాం. ఈ పేర్లు, వాదాలు, ప్రతివాదాలు, కథలు, కవిత్వం, నవల, విమర్శ వంటి కొత్త పదాలను పరిచయం చేసింది అమర్ టైలర్సే. మా యువతరం ఓ ఆవేశంతో ఊగిపోయింది అమర్ టైలర్స్ దగ్గరే. కమ్యూనిస్టు భావజాలానికి చాలా దగ్గరగా ఉండే అమర్ టైలర్స్ కి మరో కోణం కూడా ఉండేది. మేం అక్కడ లేనప్పుడు, లేదూ ఓ పెద్దాయన అక్కడ ఉన్నప్పుడు మేం వెళ్లే వాళ్లం కాదు.

అమర్ టైలర్స్ మాతో ఎలా గడిపే వారో ఆ పెద్దాయన తోటి అలాగే గడిపే వారు. వారిద్దరు చర్చించేకునే వారు. నవ్వుతూ వాదులాడుకునే వారు. ఆయనే 50 సంవత్పరాలు దాటిన పెమ్మరాజు సత్యనారాయణ గారు. ఖద్దరు పంచె, సాధారణ చొక్కా, భుజం మీద తువ్వాలో.. ఉత్తరీయమో… కాళ్లకి అతి సాధారణ హవాయి జోళ్లు. చేతిలో ఓ కాకీ సంచీ. అదీ ఆయన ఆహార్యం. ఆర్.కె.నారాయణ్ కామన్ మ్యాన్ కి నకలన్న మాట.

అమలాపురంలో హోల్ సేల్ దుకాణాలకు సర్టిఫికెట్ లేని చార్టెడ్ అకౌంటెంట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సహా చిదంబరం, చివరకు మనోహ్మన్ సింగ్ వంటి ఆర్ధిక వేత్తలు కూడా ఈయన రాసే లెక్కల ముందు బలాదూర్. ఈయన కుమారుడే కరచాలనం కవి పెమ్మరాజు గోపాలక్రిష్ణ. వాళ్ల రెండో అబ్బాయి పెమ్మరాజు వల్లీ గాడు నా క్లాస్ మేట్. కాంగ్రెస్ వాది, దిగువ మధ్యతరగతి కుటుంబీకుడైన పెమ్మరాజు సత్యనారాయణ గారు అమర్ టైలర్స్ తో ప్రజాస్వామ్యయుతంగా వాదించేవారు.

ఇద్దరి మధ్య మాకు అర్ధం కాని ఓ రాజకీయ యుద్ధం జరిగేది. ఆధునిక భావాలను పుణికి పుచ్చుకుని వాటిని వీలున్నంత వరకూ ప్రచారం చేసే అమర్ టైలర్ పెమ్మరాజు సత్యనారాయణ గారి ప్రాచీనత్వాన్ని, పోతన పద్యాలను ఆయన చెబుతూండగా… చెవి కోసుకునే వారు కాదు కాని చెవి వొగ్గి వినే వారు.

ఆధునిక కవిత్వం అంటే ప్రాణం పెట్టే అమర్ టైలర్ ఎవరైనా కవిత్వం చెబుతామంటే నిద్రాహారాలు కూడా వదులుకునే వారు. తెల్లవారితే పెమ్మరాజు గోపాలక్రిష్ణ పుట్టిన రోజు. ఆయన ప్రియ స్నేహితుడు, కవి, జర్నలిస్టు అప్పారి మురళిక్రిష్ణ మిత్రుడి పుట్టిన రోజుకి తనకు జపాన్ నుంచి బంధువులు పంపించిన ఓ చొక్కా గుడ్డని బహుమతిగా ఇచ్చాడు. అయితే దాన్ని కుట్టించుకోవడానికి సమయం లేదు. తెల్లారితే పుట్టిన రోజు. సమయం రాత్రి తొమ్మిదిన్నర గంటలు.

ఇద్దరు మిత్రులూ కాలేజీ రోడ్డులో అప్పారి గూడెంలో ఉండే అమర్ టైలర్ ఇంటికి సైకిల్ మీద వెళ్లారు. తెల్లారితే కవి పెమ్మరాజు గోపాల క్రిష్ణ పుట్టిన రోజని, చొక్కా కుట్టాలని అమర్ టైలర్ ని అడిగారు. ‘రాత్రి 10 గంటలయ్యింది. ఇప్పుడా’ అనలేదు అమర్ టైలర్. ‘చొక్కా కుడతా. కవిత్వం చదవాలి. మీదైనా… ఎవరిదైనా’ అని కండీషన్ పెట్టారు. మిత్రులు ఓకే అన్నారు.

ముగ్గురూ రెండు సైకిళ్ల మీద కూచిమంచి అగ్రహారంలో ఉన్న అమర్ టైలర్ షాపుకి వచ్చారు. షాపు తెరిచే లోపు అప్పారి మురళీ క్రిష్ణ అమర్ టైలర్ ఎదురు సందు క్రిష్ణారావు వీధిలో ఉన్న వాళ్ల ఇంటికి వెళ్లి తిలక్ అమృతం కురిసిన రాత్రి కవిత్వ సంకలనం తీసుకువచ్చారు. ‘జపాన్ క్లాత్ కదా… తడిపి కుట్టాల్సిన అవసరం లేదు’ అన్నారు అమర్ టైలర్.

చొక్కాకి అవసరమైన గోపాలక్రిష్ణ కొలతలు తీసుకున్నారు. కత్తిరించడం, ఆ తర్వాత కుట్టడం ప్రారంభమైంది. పెమ్మరాజు గోపాలక్రిష్ణ ఒకటి, అప్పారి మురళీ క్రిష్ణ ఇంకోటి చొప్పున దేవరకొండ బాల గంగాధర తిలక్ సంకలనంలో ఒక్కో కవితా చదవడం ప్రారంభించారు. సంకలనం మొత్తం ఇద్దరు కవులూ మూడు గంటల్లో చదివారు.

అమర్ టైలర్ చొక్కా కుట్టేశారు. కూచిమంచి అగ్రహారానికి ప్రారంభంలో ఉండే గడియార స్థంభం ఒంటి గంట అయినట్లుగా చూపించింది. చక్కాగా కరెంట్ ఇస్త్రీ కూడా చేసిన జపాన్ చొక్కాని గోపాలక్రిష్ణ చేతిలో పెట్టారు అమర్ టైలర్. కుట్టుకూలీ ఇవ్వబోతే ‘మంచి కవిత్వం చదివారుగా చాలు. అయినా ఇది నీ పుట్టిన రోజుకి నా బహుమతి’ అని ఓ నవ్వు నవ్వేశారు అమర్ టైలర్.

ఇప్పుడు ఆ చొక్కా లేదు. అమర్ టైలరూ లేరు. నెమలీక వంటి ఆ గురుతులు మాత్రమే మిగిలాయి.

*

ముక్కామల చక్రధర్

18 comments

Leave a Reply to Manohar Kalva Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇది కేరాఫ్ కూచిమంచి అగ్రహారం శీర్షికలో వచ్చిన రెండో జీవన చిత్రణ. బుజ్జిగాడు గడచిన ఘటనలని, జరిగిపోయిన జీవితాల్ని, కనుమరుగైపోయినా మనసులో ముద్రవేసిన వ్యక్తుల్ని, జ్ఞాపకాలని మన ముందు పరుస్తున్నాడు. అవి చదువుకునే అక్షరల్లా కనిపించచ్చు. కాని అక్షరాలకందని అనుభవాలు,అనుభూతులు. వాటిని ఒడిసి పట్టుకుని మన ముందు ఆవిష్కరించే ఒక అద్భుతప్రయత్నం బుజ్జి చేస్తున్నాడు. దాంట్లో సఫలీకృతుడయ్యాడు. నన్ను ఒక్కసారి నా కవిత్వలోకంలోకి, గత స్మృతుల సుగంధపరిమళ ప్రపంచంలోకి పంపించాడు. సాటి కవుల సహకారం ఎలాగూ ఉండేది. కానీ అమర్ టైలర్ ఆదినారాయణ ప్రోత్సహం మరింత ఉత్సాహ పరిచేది. నిజంగా అమర్ అమరుడే. బుజ్జి కలం ద్వారా మరిన్ని మధురస్మృతులు రావాలని మనల్ని స్మృతుల జడివానలో తడపాలని కోరుకుంటున్నా. బుజ్జికి అభినందనలు. ఆశీస్సులు.

  • అమ‌ర్ టైల‌ర్….
    అమ‌ర‌త్వం క‌లిగి ఉన్న‌ది…
    ఆ అమ‌ర్ టైల‌రే లేకుంటే మీకు ఈ క‌విత్వం వచ్చేదా… అని నా అనుమానం… నివృత్తి చేయ‌గ‌ల‌రు…
    ఏదేమైనా గ‌త‌కాల‌పు జ్ఞాప‌కాల‌ను గుర్తు చేస్తూ మీరు రాస్తున్న ఈ కూచిమంచి… బాగుంటున్నాయి… మిత్ర‌మా…..
    ప‌టేల్ మ‌ధుసూద‌న్ రెడ్డి, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, హైద‌రాబాద్ / కామారెడ్డి

  • అమర్ టైలర్స్ …ఒక అద్భుతమైన రచనా చమత్కృతి.. కాలేజీ రోజుల్లో కూచి మంచి అగ్రహారం పరిమళాలు మదిని తాకాయి…ఈ రచనా వ్యాసంగం లో పాత్రలు నాకు పూర్తిగా పరిచయం లేక పోయినా, అందరూ తెలిసిన వారే అనిపించాయి…శ్రీ పెమ్మరాజు గోపాలకృష్ణ గారు కూడా వ్యక్తిగతంగా తెలియడం వల్ల చాలా ఆనందించాను…
    ఈ అగ్రహారం కధలు ఒక అమరావతి కధలు, ఒక పసలపూడి కధలు లాగా కోనసీమ ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను…

    రచయిత ముక్కామల గారి శైలి ముఖ్ మల్ గుడ్డ వలే మెత్తగా హత్తు కొంటోంది..

    ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి…

  • ఒక కెమేరా లా నీ పెన్ను ని పోనిస్తూ… జీవిత సంక్షోభాలమీదా మహదానందాలమీదా మమ్మల్ని నడిపిస్తున్నావ్ …

  • ‘గత కాలము మేలు వచ్చు కాలము. కంటెన్’ అన్నారు కదా…మీ అనుభవాలు అది నిజమనే చెబుతున్నాయి.నిన్నటి ఆవకాయ ఎపిసోడ్ గానీ..నేటి అమర్ టైలర్స్ కథనంగానీ మీ సహచరులకు పాత స్మృతులను గుర్తు చేస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే మీ రచనల ద్వారా నేనే కూచిమంచి అగ్రహారంలో విహరించాను కదా…అభినందనలు.

  • నమస్సులు. శ్రీ పెమ్మరాజు గోపాలకృష్ణ గారు ఎల్.ఐ. సి.DO గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత నన్నయ విశ్వవిద్యాలయం లో ఎం.ఏ.తెలుగు 2 సం. లు తరగతి గదిలో కూర్చుని చదువుకున్న గొప్ప విద్యార్థి.ఫుల్ అటెండెన్స్.సమస్త జ్ఞానాన్ని ఆయనలో దాచుకుని ఇప్పుడే తెలుగు సాహిత్యంలోనికి వచ్చిన విద్యార్థిగా నేర్చుకున్నారు.వారు తరగతి గదిలో ఉన్నారు కాబట్టి నేను మరింత జాగ్రత్తగా పాఠాలు చెప్పేవాణ్ణి.నేనంటే ఆయనకు,ఆయనంటే నాకు విపరీతమైన అభిమానం.మా తెలుగు శాఖ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు.ఈ కథ వారి అమలాపురం విశేషాలను చర్చించటం ఆనందాన్ని కలిగించింది.అమరావతికథగా అనిపించింది.శ్రీ చక్రధర్ గారికి ధన్యవాదాలు.—డా.తలారి వాసు

  • Good morning.

    I am Vamana Murthy Kuchimanchi So.Satchidananda Rao ,ex. Headmaster of ZPHS.Amalapuram. I am very much delighted to have a such great message from my friend Pemmaraju.. Very heart touching story, .My memories suddenly overwhelmed once after reading the article… Any how special thanks to Pemmaraju. G K.(PGK)

  • బుజ్జీ వీటిని కధలు అనేకంటే మధురానుభుాతులు అంటే బాగుంటుంది. ఆనాటి అగిరహారాన్ని కళ్ళకి కట్టినట్లు అనుభుాతి, ఏవరో క్రిందికామెంట్లో చెప్పినట్లు కలం కెమేారా అనే భావనకలిగింది.

    తరవాత ఏ అనుభుాతిని పంచుతావు,ఎవరిని గుర్తుకి తెస్తావు,ఓకసారి గతాన్ని నెమర వేసుకుందాం అని ఛాలా మంది లా నేను ఎదురు చుాస్తుా ఉంటాను…….. వెంకు

  • సార్.వొక మంచి కథ లాంటి నిజమయిన విషయాన్ని పంపించిన మమ్ములను ఆనంద పారవశ్యంలో ముంచెత్తారు.అద్భుతం సార్ మీలాంటి మిత్రులు మమ్ములను మరచి పోకుండా ఇటువంటి kathalaanti నిజ సంఘటనను పంపినందుకు. ధన్యోస్మి.మనోహర్ కాల్వ

  • బాగుంది బుజ్జి ! చాలా బాగా రాశావు!! ఎంత బాగా రాశావంటే ‘అమర్ టైలర్స్’ దృశ్యం మొత్తం ఏమాత్రం సినిమా పరిజ్ఞానము లేని నాలాంటి వారు కూడా visulise చేసుకొని screen play రాయగలిగేంత సులభంగా వుంది. మరీ ముఖ్యంగా కవితలు వింటూ రాత్రికి రాత్రే షర్ట్ కుట్టి మర్నాడు పుట్టినరోజుకు అందించిన సంఘటన చాలా హృద్యంగా వుంది !! అభినందనలు !!

  • సూపర్… అంతే .. మాటల్లేవు పొగడడానికి..

  • మధురాతి మధురం ఈ కథా గమనం.

    అంబాజీపేట సెంటర్ లో చలువాది వారి మేడ మీద 40 ఏళ్ల క్రితం అలరారిన వీణార్ టైలర్ దగ్గర నేనూ అర్జంటు బట్టలు కుట్టించే వాడిని..

    ఏ రోజు కైనా ” నిన్న ” మధురమే కదా…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు