నా చిన్నప్పుడు వూర్లోకి రాజా శెట్టి సైకిల్ మీద వచ్చేవాడు. అప్పటికి మా వూర్లో డొక్కు సైకిలు కూడా లేదు. వూర్లో కాకుండా పరిశ్రమలో తయారయిన ఒక యంత్రం మా వూర్లోకి ప్రవేశించడం అదే మొదలనుకుంటాను. అంటే ఎప్పుడో ఒకప్పుడు అదీ ఎన్నికలప్పుడు రాజకీయనాయకులు కార్లలో వచ్చేవారనుకోండి. కాడెద్దులూ, ఎద్దుల బండీ వున్నవాడే మావూర్లో కలిగినోడు. ఇక బొక్కెనా, కపిలమోకు, రెండెకరాల పొలమూ, దానికొక నీళ్ళ బావి వున్నాయా.. వాడు మోతుబరే! ఆ దంపతులకు ఇద్దరో, ఆ పైబడో సంతు వుంటే వాళ్ళకిక రోజూ సంక్రాంతే! మరీ వరసగా రెండు మూడేళ్ళు వర్షం పడకపోతేనే కష్టం గానీ, లేకుంటే నోట్లోకి ముద్ద పోకపోవడం అనేది వుండేది కాదు.
అప్పట్లో వరికోతలయిపోయి బాగా చీకటి పడినదాకా పనిచేసి వడ్ల మూటలు ఎండ్ల బండి కెత్తి ఇంటికి పోవడానికి సిద్దమవుతుంటే, నేను నడవను బండ్లోనే కూచుంటా అని మా అన్న గొడవచేశాడు. సరేలెమ్మని బండ్లో ఆ వడ్లబస్తాల పైన కూచోబెట్టారు. ఎలాగూ నడవకుండా కూచున్నాడు కదా అని, వరి కోసిన అమ్మలక్కలు తమ చేతుల్లోని కోత కొడవళ్ళను అన్న చేతికి అందించారు పట్టుకొమ్మని. బండి చక్రాలు రెండూ కయ్య దాటేటప్పుడు కయ్య గెనాన్ని ఒక్కసారే ఎక్కి దిగాలి. అది రూలు. కానీ పొరబాటయ్యింది. ఒకటి ముందు మరొకటి వెనుకా ఎక్కడంతో… బండి అటూ ఇటూ వూగిపోయింది. బండి వాటు పడలేదు గానీ, బండిమీద ఏ ఆధారమూ లేకుండా బస్తాల మీద కొడవళ్ళు పట్టుకొని కూచున్న మా అన్న కొడవళ్ళతో సహా కింద పడ్డాడు. ఓ పదునైన కొడవలి మోకాలి కింద పడి లోతు గాయమయింది. అదృష్టం. అది ఇంకెక్కడయినా దిగబడివుంటే దక్కేవాడు కాదు.
ఇలాంటి ప్రమాదాలు నిత్య సత్యమే అయినా… నా వూహకు తెలిసినంత వరకూ, యాంత్రీకరణ జరగక ముందు మా వూర్లో అలా ప్రమాదాల బారిన పడిన వాళ్ళు లేనే లేరు. మా వూరి నీళ్ళు మంచివేమో! మా వూర్లో పుట్టిన ఎవరికీ ఎటువంటి వైకల్యమూ లేదు. ఒక్క కుంటామెకు(పేరు తెలియదు), నారాయణన్నకు పోలియో సోకి కాలు దెబ్బతినడం తప్ప!
యంత్రాలు రాక ముందు నాకు గుర్తున్న మరో ప్రమాదం, బాంబులు చుడుతుంటే మందుపేలడం. ఆయన పేరు నాగయ్య అనుకుంటాను, అప్పట్లో నల్లమందు ఎలా సంపాదించేవాడో, దానితో నాటుబాంబులు చుట్టేవాడట. అవేమీ ఫాక్షన్ తగాదాల్లో చంపుకోవడానికి కాదు. చెనక్కాయ చేలల్లో పడి తినిపోయే అడవి పందులను చంపడానికి వుపయోగించేవారు. ఆ బాంబులకు చెనక్కాయ గింజల పిండిని రుద్ది రాత్రి పూట వాటిని పొలాల గట్ల మీద వుంచి వచ్చేవారు. ఇదికూడా చాలా ప్రమాదంతో కూడుకున్నది అయినా వీటివల్ల ఎవరూ చనిపోలేదు. కానీ అవి చుడుతున్నపుడే ఏదో ప్రమాదం జరిగి నాగయ్యకు ఒళ్ళంతా కాలి, ఆసుపత్రి పాలయ్యి, ఆ తర్వాత పోలీసులూ, కోర్టులూ తిరరుగుతూ వుండిపోయాడు. ఆ తర్వాత ఆ బాంబుల జోలికి ఎవరూ వెళ్ళ లేదు.
అలాంటి మా వూరికి యంత్రాలు రావడం మొదలయింది. అవి మార్పును రెండు విధాలా తీసుకు వచ్చాయి. 1980ల్లో మా వూరి మీదుగా కడపనూ, లక్కిరెడ్డిపల్లెనూ, వేంపల్లెనూ కలుపుతూ ఆర్టీసీ వాళ్ళు బస్సు వేశారు. అప్పట్లోనే వూర్లోకి కరెంటూ వచ్చింది. రాయచోటికీ, కడపకూ రాకపోకల సందడి పెరిగింది. ఇదే సందట్లో, ఎప్పుడు ఎలా జరిగిందో జడ వెంకటయ్య పెద్ద కొడుకు ఏదో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చిన్న బిడ్డలకు తండ్రినీ, వయసులో వున్న భార్యకు భర్తనూ దూరం చేశాడు. కానీ ఆ కుటుంబం అప్పటికి వుమ్మడిగానే వుండటం, వాళ్ళు మా కొలతల్లో వున్నవాళ్ళే కావడం వల్ల అలా గడిచిపోయింది.
మా వూరికి మరో ప్రమాదం మరో యంత్రం ద్వారా వచ్చింది. మా వూరి చుట్టుపక్కలంతా బోలెడన్ని రాళ్ళ గుట్టలు, బండలు. మిద్దెలు కట్టుకోవాలంటే వడ్డెరలు, ఆ బండలమీద మంటలు పెట్టి, రంధ్రాలు వేసి, అందులో మందు కూరి కావల్సిన విధంగా బండలను కూసాలుగా, పల్చని బండలుగా చీల్చేవారు. అయితే 1980ల్లో మా వూరికీ, నీలకంఠరావు పేటకీ మధ్య ఓ కంకర మిషను వచ్చింది. పులివెందుల వైపునుండీ ఎవరో రెడ్డి దాన్ని పెట్టారు. దాని పని చుట్టుపక్కల వుండే రాతి గుట్టలనీ, బండలనీ నలిపేసి వివిధ సైజుల్లో కంకర తయారుచేయడం. ఆ కంకర మెషీను దగ్గర పనిచేయడానికి మా వూర్లో వారు క్యూలు కట్టారు. పొలాల్లో పని మానేసి కంకర మెషీను దగ్గర పనిచేయడం నాజూకు అయ్యింది. కుర్రవాళ్ళు ఆ బండరాళ్ళని మోసే ట్రాక్టర్లను మోజుగా నడిపేవారు. వ్యవసాయం చెయ్యడంలో చెయ్యి తిరిగిన వాడుగా పేరున్న చిన్నవెంకటసుబ్బయ్య పెద్ద కొడుకు కూడా ఆ మెషిను దగ్గర పని చేయడానికి వెళ్ళడం మొదలయ్యింది. ఎలా జరిగిందో ఓ దురదృష్ట క్షణాన పెద్ద బండరాయి అతని మీదపడి వెన్ను విరిగిందట. నేను వూరెళ్ళినపుడు చూస్తే అంత యువకుడూ, నులక మంచం మీద చేష్టలుడిగి పడున్నాడు. పరిహారంగా వాళ్ళేమిచ్చారో తెలియదు. అలా మంచం మీదే వుండి వుండి చచ్చిపోయాడు. అతనూ అంతే చిన్న వయసులోనే భార్యనీ, చిన్న చిన్న బిడ్డలనీ దిక్కులేని వాళ్ళను చేసి వెళ్ళాడు.
ఇక తొంబైల్లో వచ్చిన మార్పు గల్ఫ్ దేశాలకు వెళ్ళడం. వర్షపాతం తగ్గి, వ్యవసాయం గిట్టుబాటు కాక వీళ్ళు వెళుతున్నారో, వీళ్ళు వెళ్ళటం చూసి వర్షం రావడం ఆగిపోయిందో గానీ… 70, 80ల్లో వర్షాకాలంలో ఎటూ చూసినా పచ్చగా కనపడే చెనక్కాయ చేలు బీడు పడడం మొదలు పెట్టాయి. యువకులు, యువతులూ ఒకరిని చూసి మరొకరు గల్ఫ్ బాట పట్టారు. అలా గల్ఫ్ వెళ్ళి బలైపోయిన మొదటి వాడు మా యర్రాని ఓబయ్య మామ ఒక్కగానొక్క కొడుకు రమణ. వాడికి పద్నాలుగు, పదిహేనేళ్ళప్పుడు చూసి వుంటానేమొ… ఎప్పుడూ వాళ్ళ అమ్మ కొంగు పట్టుకొని తిరిగేవాడు. వాడు అందరిలోకి చిన్నవాడు కావడం, వాడికి ముందర నలుగురు అక్కలు వుండడం, వాడు అల్లారుముద్దుగా పెరగడానికి కారణం. నేను చూడగా వాడెప్పుడూ పెద్దగా వ్యవసాయపనులూ చేయలేదు. అలాంటోడు గల్ఫ్ వెళ్ళాడు. అక్కడ ఎం పని చేసేవాడో, ఎలా జరిగిందో గానీ, వూరికి మరణవార్త టెలిగ్రాముగా వచ్చింది. వూర్లో ఇంగ్లీషు చదివే వాళ్ళు లేక పొలంలో నీళ్ళు కడుతున్న నన్ను పిలుచుకు వచ్చి చదివించారు దాన్ని. వూరంతా ఒక్కసారి కుదేలయ్యింది. వాడి శవం వూరికి రావడానికి మరో నెల పట్టింది.
మళ్ళీ మొన్న సెప్టంబరు 2017లో వూరికెళితే మరో విషాదం. ఇదీ గల్ఫ్ లోనే. ఈ బిడ్డా వాళ్ళకు ఒక్కగానొక్క కొడుకే. ఆ యర్రాని రమణ అక్క కొడుకే! ఏదో ప్రమాదం అన్నారు. అప్పటికి, ఇప్పటికీ తేడా పెరిగిన కమ్యూనికేషన్. గల్ఫ్‌లో వున్న వూరి వాళ్ళు సమాచారాన్ని వాట్సాపుల్లో క్షణాల మీద చేరవేశారు. వూర్లో అమ్మా, నాన్న గుండెలు పగిలేలా రోదించారు. నేను సెప్టంబరులో వూరు వెళ్ళినపుడు వాళ్ళ రోదన చూడలేక పొయ్యా. ఆ వార్త తెలిసి అప్పటికి వారం అయ్యిందేమో, బిడ్డ శవం ఇంకా వూరు చేరలేదు. ఆమె స్పృహ వున్నంతవరకూ రోదించడం, అంతలోనే స్పృహ కోల్పోవడం! ఇదంతా చూస్తూ ఏమి చేయాలో తెలియని అచేతనత్వంతో ఎక్కడో చూస్తూ తండ్రి!
ఇదిగో ఇప్పుడు ఈ జూన్ నెలలో మరో శరాఘాతం! వీడూ తల్లిదండ్రులకు ఒక్కనాగొక్క కొడుకే! శివ. ఇద్దరు చిన్న బిడ్డలు, భార్య! మూడు రోజులే అయ్యిందట గల్ఫ్ నుండీ వచ్చి. బండిలో వెళుతూ ప్రమాదం బారిన పడ్డాడు. వూరంతా శోక సంద్రం.
యంత్రాలు వచ్చాక వూరు బాగుపడిందో, బలైపోయిందో తెలియకుండా వుంది. అప్పట్లో యింట్లోని అందరూ కష్టపడ్డా అందరూ కలిసి వుండేవారు. కలిసి తినేవారు. కలిసి ఏడ్చేవారు. కలిసే పస్తులూ వుండేవారు. మట్టి గోడలూ, బోద కప్పులూ, ఈతాకు పందిళ్ళే అయినా ఈ విషాదాలు లేవప్పుడు. ఇప్పుడు కాంక్రీటు కప్పులూ, కరెంటు బల్బులూ, టివీలు, సెల్ ఫోన్లూ.. కానీ ఒకరు సముద్రాల కవతల, వారిని నమ్ముకొని, వారిమీదే ప్రాణం పెట్టుకొని జీవించేవారు సముద్రాల కివతల. అభివృద్ది చెందామో లేదో తెలియకుండా వుంది.
మంచి విశ్లేషణ.
ప్రసాద్ గారు – మీ పల్లె నుండీ మీరు అమెరికా వఛ్చి ఈ వ్యాసాన్ని రాసిన విషయాన్ని ఎక్కడా స్పృశించకపోవడం వల్ల సమతౌల్యంలో లోపం కొట్టొచ్చినట్లు కనపడింది. కాళీపట్నం రామారావు గారి “యజ్ఞం” కథలో ఈ అభివృద్ది పల్లెల్లో తెచ్చిన మార్పులని విశదీకరించారు.
వ్యాసంలో స్పృశించిన ఒక అంశం వలస పోవడం. ఇది ఎన్నో వేల ఏళ్ల క్రితమే మొదలయిందని శాస్త్రజ్ఞులు చెబుతారు. అప్పుడు కాలినడకన లేక జంతువుల సాయంతో అది జరిగితే అది ఇవ్వాళ యంత్రాల సహాయంతో మరింత సులువుగా జరుగుతొంది. అంతే తేడా.
అభివృద్దికి కొలమానం చావులే అయితే, పాము కాట్లకు, టైఫాయిడ్, క్షయ, మశూచి, మలేరియా, కలరా లాంటి వ్యాధులకు గురై, మీరన్నట్లు కొడవలి దిగరాని చోట్ల దిగబడి, చిన్న చిన్న పల్లెల్లో మరణించేవాళ్ల గణాంకాలని కూడా పరిగణనలోకి తీసుకోవాలి గదా! అప్పుడు కూడా వ్యాసంలో చూపిన నిర్ణయం మారకపోతే ఒకరకం మరణం ఇంకో రకం మరణానికంటే మంచిదని వర్గీకరించిన ట్లవుతుంది.
యజ్ఞం కథ కూదా ఇదే చెప్పింది లెండి. ఆయన పట్నం లో కూచుని పల్లె కస్టాలు వ్రాసారు. ఈయన ఇంకా ముందుకెళ్ళి అమెరికా లో కూచుని పల్లె కస్టాలు వ్రాస్తున్నారు. తెలుగు కథ గానీ, వ్యాసం గానీ ఈ పాఠశాలకు ఇంకా ముగింపు పలకలేదు . అదే దౌర్భాగ్యం.
మార్పు అనేది సహజం అది నిరంతరం సాగుతూనే ఉంటుంది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఆ మార్పు వల్ల అందరికీ సమంగా మేలు జరగాలనే రూలు కూడా ఎక్కడా లేదు. “యజ్ఞం”లో దీన్ని చక్కగా చూపించారు. ప్రసాదు గారు చెప్పిన కొడవలి ఉదంతం జరగడానికి రాతి యుగంలో ఆస్కారం ఉండేది కాదు. కానీ, అప్పుడు రాతి పనిముట్లవల్ల ప్రమాదం కలిగివుండొచ్చూ.
ఈ మధ్య భారతదేశంలోని అన్ని పల్లెలకీ విద్యుత్తు నందించారని విన్నాను. దాన్ని పాతాళానికి పోవడానికి మొదటిమెట్టుగా భావించేవారు ఉండరనను. (ఉదాహరణకి, ఎవరికయినా ఎలక్ట్రిక్ షాక్ కొడితే, ఇంతకు ముందు ఈ బాధ ఉండేది కాదని ఆ పల్లెల్లోనివాళ్లే అనుకోవడం సహజం.) కానీ, ఆ పల్లెల్లోని వాళ్ల అభిప్రాయం, “దేశానికి స్వాతంత్య్రం వఛ్చిన తరువాత మమ్మల్ని డెబ్బై ఏళ్లబాటు వెనక పడేసి, చీకటిలో ఉంచారు!” అని అయివుంటుందని నా నమ్మకం.
విద్యాసాగర్ గారూ,
నేను ఇప్పుడున్నది అమెరికాలోనైనా పుట్టింది, పెరిగింది ఈ పల్లెలోనే. నాకు తెలిసిన పల్లె గురించే తప్ప తెలియని పల్లె గురించి రాసే సాహసం నేను చేయటం లేదు. నాకు రాదు కూడా.
ఇందులో వున్న దౌర్భాగ్యం ఏమిటో నాకు అర్థం కాలేదు.
శివకుమార్ గారూ,
నేను అమెరికాలో వున్నాను అని వ్యాసంలో చెప్పాల్సిన వసరం రాకపోవడమే గానీ దాయాల్సిన వసరం వుందని అనుకోలేదు.
యాంత్రీకరణ పట్ల నాకేమీ వ్యతిరేకత లేదు. పైగా నిన్నటి కంటే ఈనాడు, ఈనాటి కంటే రేపు బాగా వుంటుందనే నేను నమ్ముతాను. ఈ వ్యాసం కేవలం మా పల్లెలో వచ్చిన మార్పును అక్షరబద్దం చేయడం, అలా చేస్తున్నప్పుడు “ఏది అభివృద్ది” అన్న సంశయం కలగడం, దాన్నే ఈ వ్యాసంలో వ్యక్తీకరించాను.
నేనీవ్యాసాన్ని సారంగకు పంపినప్పుడు దానికి “అబివృద్ది” అన్న టైటిలే పెట్టాను. “..అనే వురితాడు” అన్న అంగీకరానికి రావడానికి నేను సంసిద్దంగా లేను. అలాగని వ్యతిరేకతలోనూ లేను. సంశయం, సందిగ్దం ఇంకా నాలో వున్నాయి.
మీరన్నట్లు మొత్తంగా చూస్తే ఈ అభివృద్ది కంటే ముందటి రోజుల్లోనే మృత్యురేటు ఎక్కువ. ఆయుఃప్రమాణం తక్కువ. కానీ మా వూరి వరకూ చూసుకున్నప్పుడు అప్పటికంటే ప్రజలు ఇప్పుడు ఎక్కువ సంతోషంతో వున్నారా అన్నదే నా అనుమానం.
అన్ని రంగాలలోనూ అభివృద్ది మనిషి సౌకర్యంగా వుండేట్లు చేసింది, ఎక్కువ రోజులు బతికేటట్లు చేసింది, ఎక్కువ మందికి తిండి దొరికేటట్లు చేసింది. కానీ ఎక్కువ సంతోషంగా జీవించేట్లు చేసిందా అన్నది నాకు తేలని ప్రశ్న.
It is very saddening to read about those families whose lives turned upside down in such accidents. కానీ, ఈ వ్యాసం mechanization ని ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నట్టు తోస్తోంది నాకు (యంత్రాల కారణంగా ప్రమాదాలకు గురై చనిపోయిన మీ ఊరిజనాలతో మీకున్న emotional attachment ఇలాంటి inference కు తావిచ్చిందేమో తెలీదు). యంత్రాల వల్ల ప్రమాదాలకు గురై చనిపోయిన వారున్నారు మీరు ఉదహరించినట్టు. అవే యంత్రాల వల్ల రక్షింపబడి నిలబడిన జీవితాలు కూడా ఉన్నాయి కదా!
అభివృద్ది ౼ పెరిగే సౌకర్యాలే అభివృద్ధి అనడం కరెక్ట్ కాదుగానీ ప్రజల జీవనప్రమాణాల్లో మెరుగుదల ఉంటే దాన్ని కచ్చితంగా అభివృద్ధి అనవచ్చు. ఆ లెక్కన, యాంత్రీకరణ కు ముందటి కాలానికి ఇప్పటికి అభివృద్ధి ఉంది (అభివృద్ధిలోని అసమానతలు వేరే అంశమని భావిస్తున్నాను). ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది. తలసరి ఆదాయం పెరిగింది. రవాణా, కమ్యూనికేషన్ రంగాలు వృద్ధి చెందడం వల్ల ఎన్నో ప్రయోజనాలు నెరవేరాయి. యాంత్రీకరణ జరక్కుండా ఇవెలా సాధ్యమో అర్థం కావడం లేదు నాకు. చాలా ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి క్రమంలో మొదట ప్రాథమిక రంగంపై (వ్యవసాయము, అనుబంధ రంగాలు) ఆధారపడడం ఉంటుంది. తరువాత ద్వితీయరంగానికి (పారిశ్రామిక రంగం) ప్రాధాన్యతనివ్వడం అటుపైన తృతీయ రంగానికి (సేవారంగం) తరలడం ఉంటాయి. స్వాతంత్ర్యానంతర భారతదేశం చాలా యేళ్ళు వ్యవసాయాభివృద్ధికే ప్రాధాన్యమిచ్చింది. ఫలితంగా ఆహారాధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలిగాం కూడా. అయితే, తరువాతి దశ అయిన పారిశ్రామికీకరణ సరిగా జరక్కుండానే సేవారంగం పై ఆధారపడడం జరిగింది. వ్యవసాయం పూర్తీగా కుదేలయింది.
నిజానికి, భారతదేశం వ్యవసాయ రంగంలో సరైన యాంత్రీకరణ జరక్కపోవడం దాని వైఫల్యానికి ఒక ప్రధాన కారణంగా చెబుతారు.
యిక్కడ మీరు పేర్కొంటున్న ప్రమాదాలు bad memories గా బాధపెడుతున్నాయి కానీ వాటికి యంత్రాల వినియోగాన్ని కారణం చేయడం కరెక్ట్ కాదేమోననిపిస్తోంది. బహుశా, మనక్కావాలసింది better awareness about usage of machines and strict safety precautions to be applied అనుకుంటాను.
ధన్యవాదాలు.
నవీన్ కుమార్ గారూ,
నేను “mechanization ని ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నట్టు” కనిపిస్తుంటే అది నాతప్పే. కానీ నా వుద్దేశం అది కాదు.
ఈ అభివృద్ది జరగక ముందు దగ్గరగా వున్న కుటుంబాలు ఇప్పుడెలా విడిపొయ్యాయో అన్న ఒక చింతను తెలియజెయ్యడం. ఒక వూరిలో కొన్ని దశాబ్దాల్లో జరిగిన మార్పును (మంచి చెడ్డలను వదిలేసి) నమోదు చెయ్యడం మాత్రమే లక్ష్యం అనుకున్నాను.
యాంత్రీకరణ వలన జీవన ప్రమాణాలు, ఆయుస్షు, నాణ్యత పెరిగినమాట వాస్తవమే.
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.