అబద్ధం ఇల్లెజిటిమేట్ పుట్టుక

మాది ఖమ్మం. బాల్యంలో చదువే లోకం. జీవన సంద్రంలోని ఓ పెను విషాద కెరటం నన్ను సంగీత సాహిత్యాల వైపు మరల్చింది. సాహిత్యం లో లీనమయ్యేతనం. అధ్యయనం ఇష్టం. అవే నన్ను ఇలా మీ ముందు ఉంచాయి.  సమాజస్పృహ కలిగిన వ్యాసాలు, కవితలు, కథలు, విశ్లేషణలు పత్రికలలో ప్రచురితమయాయి. 2017 లో ‘కవిసంగమం’ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అయా. కవిసంగమం గ్రూప్ ఓ కవిత్వ పాఠశాల.ఇది నా సాహితీ ప్రయాణం లో రెండో గొప్ప మలుపు. ఒక దినపత్రిక లో  ‘విభిన్న’ సాహిత్య పేజీ సహనిర్వహణ వల్ల విస్తృత రచనా ప్రపంచం పరిచయం అయింది. స్వార్థ రాజకీయ వ్యవస్థలోని లోపాల పట్ల వేదన, స్త్రీలు, పిల్లల సమస్యలు నన్ను కదిలించి అక్షరాల్లో కరిగిస్తాయి.

కోవిడ్-19 నేపథ్యంలో వలస కూలీల కోసం ప్రభుత్వ నిర్లక్ష్యం అందరిని కదిలించింది. ఈ వలసకూలీలు ఓటుబ్యాంకులే కాదు ఈ దేశ పౌరులే అన్న ఆలోచనే “ఇట్లు నేను..” కవితకు పునాది. ఒక నిజం గడప దాటేలోగా ఓ అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. అబద్దాలు పుకార్లుగా,  నిజాల్ని సమాధి చేసే వేదన నుంచి పుట్టిన కవిత “సత్యం వధ”.!!

1
పొగకి నిప్పక్కర్లేదు
అంటుకోవడానికి గాలీ వీచక్కర్లేదు
నాలిక పైన పుట్టే ప్రతీ అబద్ధం
పులి కంటే ముందు తోకతో
పునరుత్థానం!!
2
నోట్లో అమంగళ స్నానమాడి
నిజం కంటే అందంగా ముస్తాబై
సమాజపు పందిరిపై ప్రాకి
అవాస్తవాల జిలుగులతో..
“వల్లెక్కమ్ వందే జగద్గురు”
3
అది
విత్తేలేని మహావృక్షపు పడగనీడ!
అది
చీకటిలో అమాంతం పెరిగే ఛాయ
అది
బీజక్షేత్రాల్లేని ఇల్లెజిటిమేట్ పుట్టుక!
అది
నివురుగప్పని వామన ప్రతిజ్ఞ!
4
నిఖార్సైన నిలకడ కూడా
కానివ్వని బహిర్గతం..
చివరి రోజుల
లెక్కల్ని కూడా కుదర్చని అశక్తత!
ఇప్పుడిక.
నిజానిది నిత్య పోరు!
5
గెలుపు భ్రమల్లో
అనబద్ధానికి వెంటిలేటరే ఆసరా !
వాయుమనో వేగాలతో
అబద్ధం పలికే అక్షరమాల!
సత్యవధ
*

 

ఫణిమాధవి కన్నోజు

22 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజానిది నిత్యపోరు. కవిత బావుంది

  • మంచి పదాలతో సరళంగా సాగిన నేటి సమాజ దాష్టీకం. చాలా చక్కటి అభివ్యక్తి. మీ నుండి మరో మంచి కవిత.. అభినందనలు..

    • మీ స్పందన సంతోషాన్నిచ్చింది. హృదయపూర్వక ధన్యవాదాలు సర్.

  • 2 వ పేరాలో చివరి లైన్ తమిళ సామెత నా?
    అర్థం తెలుప గలరా,

    చిక్కటి కవిత,అభినందనలు

    • ముందుగా మీ స్పందనకు చాలా ధన్యవాదాలు సర్.
      వల్లెక్కమ్ అంటే తెలంగాణ మాండలికం లో అబద్ధం లేదా ఉత్తుత్తి మాట. ఆ పదంతో జత చేసి సెటైరిక్ గా కూర్చిన వాక్యం.

  • నిజానిది నిత్యపోరు..చాలాబావుంది

  • Illegitimate పుట్టుక అనడం సబబు కాదేమో అనిపిస్తుంది మనసుకు. కానీ అబద్దానికున్న అందం, ఆదరణ ”నిజానికి” ఉండవు.
    ప్రస్తుత పరిస్థితిని అపద్ధమంత అందంగా నిజాన్ని అలంకరించి కవిత అల్లారు..గుబాళిన్చింది..కుడోస్ మేడం💐💐💐💐💐

  • ‘చీకటిలో అమాంతం పెరిగే ఛాయ’ చాలా బావుందీ ‘నిజ నిర్ధారణాభివ్యక్తి’! అవును.. చీకటీ, సకల మాలిన్యాలతో కూడిన రొచ్చు వంటివే అబద్ధానికి మంచి పోషకాలు!

    • కవిత ఆత్మను అర్థం చేసుకున్న మీ స్పందనకు చాలా ధన్యవాదాలు సర్.

  • బీజక్షేత్రాల్లేని ఇల్లెజిటిమేట్ పుట్టుక!
    అది
    నివురుగప్పని వామన ప్రతిజ్ఞ!………..
    చాలా బాగా రాసారు. కవిత బాగుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు