పదునైన వాక్యాలవి. బహు మెత్తగా దిగుతాయి. రాజ్యాల ఎత్తుగడల్నీ, దోపిడీ విధానాలను ఎండగడుతాయి.
మతవిద్వేషాల మంటల్లో పదునెక్కిన కవితలు అవి. ఖండాలు దాటివెళ్లినా కొత్తపేరుతో, సరికొత్త రూపంలో కనిపించిన వివక్షత, అంతు లేని జాత్యంహంకారధోరణుల్ని ఈ కవి అక్షరాలు ఆవేదనతో ప్రశ్నిస్తాయి.
అనుమానితులుగా మిగిలి ఇంటికి చేరుకోని అనేకమంది యువకుల తరపున తాము చేసిన తప్పేంటని నిలదీస్తాయి.
కొన్నిసార్లు అసలు మనుషుల మధ్య ఏ కాసింతయినా మానవతా విలువలు మిగిలున్నాయేమోనని దివిటీలు పట్టి వెతుకుతాయి.
ప్రపంచంలో ఎక్కడైనా ఆ నాలుగుస్థంభాలు (four pillars) కాస్త మనసు నెమ్మదించే నీడనిస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తాయి.
బతుకుకోసం వలస వెళ్లిన వాక్యాలవి.
బెంగతో ఎప్పుడూ ఇంటివైపే చూస్తుంటాయి, మరపురాని అందమైన బాల్యం కోసం ఎదిగొచ్చేసిన మనం ఎదురుచూసినట్టు. అఫ్సర్ కవిత్వం ఈ క్షణం ఎందుకు కావాలంటే అధికారంతో, అహంకారంతో గొంతు నులిమే పాలకులను నిలదీయడానికి. కులమతజాతి విద్వేషాలతోవిడిపోయిన మనుషులను ‘అలాయ్ బలాయ్’ తో కలపడానికి.
అఫ్సర్ కవితల్లో నిగూఢమైన ప్రేమా వుంటుంది. బంధాల్లో మునిగిపోతూ మనసులు పడే సంఘర్షణా వుంటుంది. మాటలు మిగలనితనాల మౌనమేదో కవితల రూపంలో అలజడిరేపుతుంది.
వాటిలో వాన చినుకులుంటాయి. పాటలుంటాయి. బతుకులో అర్థంకాని అనేక చిక్కుముళ్ల విప్పదీతలుంటాయి.
జీవిత మార్మికతను అర్థం చేసుకున్న సూఫీతత్వాలు అఫ్సర్ కవిత్వంతో అంతర్లీనంగా పెనవేసుకుని వుంటాయి.
👌👌👌💐వాన చినుకు, సముద్రం లోపడి స్వాతి ముత్యం అయినట్టు.. Afsar ji, కవిత్వం,. మీగొంతుక లో మేలిముత్యం గా,మరింత వన్నె తెచ్చు కుంటున్నది.. ఝాన్సీ ji…. వహ్వా